సాక్షి, హైదరాబాద్: ‘ఊరోడికి కాటి భయం... పొరుగోడికి నీటి భయం...’ నీరు ఎంత ప్రమాదకరమో చెప్పడానికి ఈ నానుడి చాలు. సోమవారం ఒక్క రోజే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఉదంతాల్లో ఏకంగా ఆరుగురు మృత్యువాత పడ్డారు. వేసవి తాపానికి తోడు ఇతర పరిణామాల నేపథ్యంలో ఆహ్లాదం కోసం అనేక మంది ‘నీటి’ని ఆశ్రయిస్తున్నారు. ఆయా చెరువులు, కుంటలు, కాలువలు తదితరాలపై అవగాహన లేకపోవడం, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఒకరిని రక్షించే క్రమంలో మరొకరు... ఇలా వివిధ కారణాలతో అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ఇలా అశువులు బాస్తున్న వారిలో చిన్నారులు, యువతే ఎక్కువగా ఉంటున్నారు.
కనిపించని అగాథాలు ఎన్నో...
సాధారణంగా చెరువులు, కుంటలు ఓ దశలో ఎండిపోతుంటాయి. ఆ సమీపంలో నివసించే ప్రజలు ఆయా సమయాల్లో వాటిలోని మట్టిని తవ్వి చిన్న చిన్న అవసరాలకు వాడుతుంటారు. ఈ రకంగా ఆయా ప్రాంతాల్లో గోతులు ఏర్పడుతుంటాయి. ఎండిన సమయంలో ఈ గుంతలు కనిపించినా.. నీరు చేరినప్పుడు అవీ నిండిపోతున్నాయి. ఫలితంగా ఎక్కడ గొయ్య ఉందో, ఎక్కడ ఎత్తు ఉందో ఆ ప్రాంతంతో పరిచయం లేని వాళ్లు ఈ విషయాలు గుర్తించడం అసాధ్యం. ఈత రాని వారు నీళ్లల్లో దిగినప్పుడు మొల్లగా నడుచుకుంటూ మెడ లోతు వరకు వెళ్లి స్నానాలు చేస్తుంటారు. ఇలా నడుస్తున్న క్రమంలో హఠాత్తుగా నీటి లోపల ఉన్న గుంటలోకి వెళ్తే... తేరుకునే లోపే మునిగిపోతున్నారు.
వచ్చీరాని ఈతతో ముప్పే...
ఏ మాత్రం ఈతరాని వారి పరిస్థితి ఇలా ఉంటే... వచ్చీరాని ఈతతో చెరువులు, కుంటలు తదితరాల్లోకి దిగేవాళ్లూ మృత్యువాత పడుతున్నారు. ఈతపై పూర్తి పట్టులేకపోవడంతో కొంతసేపు జోష్‌తో చెరువులో కొంత దూరం వెళ్తున్నారు. ఆపై అలసిపోవడంతో వెనక్కు రాలేక నీట మునిగిపోతున్నారు. మరోపక్క తమ బృందంలో ఒకరు మునిగిపోతున్నట్లు గుర్తించిన ఇతరులు వారిని రక్షించడానికి సిద్ధమవుతున్నారు. ఇలా రక్షించే సమయాల్లో సమయస్ఫూర్తి, నైపుణ్యం లేక వీరు కూడా మునిగిపోయి చనిపోతున్నారు.
ఈ జాగ్రత్తలు అవసరం...
►కొత్త ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లో దిగేప్పుడు వాటి వివరాలు స్థానికుల్ని అడిగి తెలుసుకోవాలి.
►స్నానం/ఈత కోసం అంతా ఒకేసారి చెరువుల్లో దిగకూడదు. అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి కొందరైనా గట్టుపై ఉండాలి.
►ఈత రాని, దానిపై పట్టు లేని వాళ్లు నీటిలో దిగేప్పుడు ట్యూబు, గాలితో నింపిన ప్లాస్టిక్ సంచులు... కనీసం ఖాళీ ప్లాస్టిక్ డబ్బాలను తమ వెంట ఉంచుకోవాలి.
►గట్టుపై ఉండే వాళ్లు తాడు, కర్రలు వంటిని సిద్ధంగా ఉంచుకుంటే అత్యవసర పరిస్థితుల్లో ఉపకరిస్తాయి.
►నీటిలో మునిగిపోతున్న వారిని అనాలోచితంగా, ఎలాంటి ఉపకరణాలు లేకుండా రక్షించడానికి ప్రయత్నించడమూ ప్రమాదహేతువే.
►నీళ్లల్లో మునిగిపోతున్న వారిని రక్షించేప్పుడు ముందుగా వారి వద్దకు వెళ్లిన వెంటనే కంగారు పడద్దని, రక్షించే వ్యక్తి కాళ్లు, చేతులు పట్టుకోవద్దని ధైర్యం చెప్పాలి.
►నీటిలో మునిగిపోతున్న వారిని వెనుక నుంచి పట్టుకుని రక్షించే ప్రయత్నం చేయాలి. తాడుతో పాటు ఈతకు ఉపకరించే ఉపకరణాలు అందించడం ఉత్తమం.
►ఇటీవల కాలంలో యువతకు సెల్ఫీ మోజు పెరిగింది. ఎక్కడపడితే అక్కడ ఈ ఫొటోలు దిగుతున్నాయి. అయితే చెరువులు వంటి వాటి వద్ద వీటికి దూరంగా ఉండటం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment