
భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ వీక్షణకు
నగర వ్యాప్తంగా భారీ స్క్రీన్స్, స్పెషల్ ట్రీట్స్..
సాక్షి, హైదరాబాద్: హాలిడే బద్ధకం ఎగిరిపోనుంది. రోజంతా కళ్లార్పనివ్వని ఉద్వేగం దరి చేరనుంది. నగర వాసులకు ఈ సన్‌డే.. అసలు సిసలు హాట్ హాట్ విందును వడ్డించనుంది. ఆదివారం జరగనున్న భారత్, పాకిస్తాన్ క్రికెట్ పోరును వీక్షించేందుకు ఎవరి స్థాయిలో వారు ఏర్పాట్లు చేసుకున్నారు.
సిద్ధమైన వేదికలు...
పాక్– ఇండియా క్రికెట్ మ్యాచ్ అంటే ఎక్కడ లేని సందడి. పైగా ఆదివారం సెలవు రోజు కూడా కావడంతో క్రికెట్ ఫీవర్ రెండింతలైంది. దీంతో యువత, చిన్నా, పెద్దా, క్రికెట్ అభిమానులందరి వారాంతపు రొటీన్ మారిపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగే డేఅండ్ నైట్ మ్యాచ్‌ను మిస్ కాకూడదు అదొకటే ప్లాన్. మధ్యాహ్నం 2 గంటలకే పనులన్నీ పూర్తి చేసుకుని టీవీల ముందు కూర్చోవడం మాత్రమే లక్ష్యం.
రివెంజ్ తీరేనా?
గత 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఎదురైన పరాభవాన్ని ఈసారి టీం ఇండియా తిప్పికొడుతుందనే నమ్మకం ధీమా నగర వాసుల్లో కనిపిస్తోంది. రెండు జట్లూ శాయశక్తులా పోరాడతాయి కాబట్టి.. ఉత్కంఠభరిత మ్యాచ్ తప్పదని నమ్ముతున్న సిటిజనులు ఆ థ్రిల్‌ని తనివితీరా ఆస్వాదించాలనుకుంటున్నారు.
అలాంటి వారి కోసం రెస్టారెంట్, హోటల్స్, పబ్స్, క్లబ్స్, ఓపెన్ థియేటర్స్, ఇతర ప్రదేశాల్లో స్క్రీన్స్ ఏర్పాటు చేసి స్పెషల్ మెనూలు సిద్ధం చేశారు. ఫ్రెండ్స్‌తో కొందరు, ఫ్యామిలీస్‌తో కలిసి కొందరు.. ఎవరికివారు తమకు అనువైన వేదికలను వెతికే పనిలో నిమగ్నమయ్యారు.. ఏదేమైనా.. అందరి నోటా ఒకటే మాట ‘జయహో ఇండియా’.
Comments
Please login to add a commentAdd a comment