
సాక్షి, నాంపల్లి: ప్రమాదవశాత్తు అపార్ట్‌మెంట్ లిఫ్టులో ఇరుక్కుపోయిన అర్ణవ్(6) తాజాగా మృతిచెందాడు. నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ణవ్ మృతిచెందినట్టు శనివారం మధ్యాహ్నం వైద్యులు తెలిపారు. వెంటిలేటర్‌పై చికిత అందించినప్పటికీ బాలుడిని కాపాడుకోలేకపోయారు. అయితే, లిఫ్టు ప్రమాదంలో పొత్తి కడుపు నలిగిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. అలాగే, ఇంటర్నల్ బ్లీడింగ్ అయినట్టు వైద్యులు చెప్పారు. దీంతో, బాలుడు చనిపోయినట్టు స్పష్టం చేశారు.
ప్రమాదం ఇలా జరిగింది..
నాంపల్లి పోలిస్‌స్టేషన్ పరిధిలోని ఆగాపుర గోడేకిఖబర్ ప్రాంతానికి చెందిన అజయ్‌కుమార్ ప్రైవేట్ హెల్త్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆయన కుమారుడు అర్ణవ్(6).. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో తన తాతతో కలిసి రెడ్‌హిల్స్ శాంతినగర్ పార్కు ఎదురుగా ఉన్న మఫర్ కంఫర్ట్ అపార్ట్‌మెంట్ మూడో అంతస్తులో నివసిస్తున్న మేనత్త వద్దకు వెళ్లాడు. తాతా, మనవడు లగేజీతో లిఫ్టు ముందు నిలబడ్డారు. కిందికి వచ్చిన లిఫ్టు లోపలికి మొదట బాలుడు వెళ్లాడు. బాలుడి తాత కొంత లగేజీని లిఫ్టులో పెట్టాడు. మిగిలిన లగేజీని తెచ్చేందుకు అతడు మళ్లీ లిఫ్టు బయటికి వెళ్లాడు.
అంతలోనే అర్ణవ్ బటన్ నొక్కాడు. అంతే.. క్షణాల్లో లిఫ్టు కదిలి పైకి వెళ్లింది. లిఫ్టు గ్రిల్స్ తెరిచే ఉండటంతో బయపడ్డ బాలుడు లిఫ్టు నుంచి దూకాడు. ఈ క్రమంలో లిఫ్టుకు, స్లాబ్ గోడకు మధ్యలోని సందులో ఇరుక్కుపోయాడు. అప్పటికే లిఫ్టు.. మొదటి ఫ్లోర్ స్లాబ్ వద్దకు చేరుకుని నిలిచిపోయింది. అందులో ఇరుక్కున్న అర్ణవ్ గట్టిగా అరిచాడు. అపార్ట్‌మెంట్‌లోని వారంతా అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాంపల్లి ఇన్‌స్పెక్టర్ అప్పలనాయుడు ఫైర్ సిబ్బందికి, హైడ్రా డీఆర్‌ఎఫ్ బలగాలను రప్పించారు.
రెండు గంటల పోరాటం..
మొదట గ్యాస్‌కటర్‌తో లిఫ్టు గ్రిల్స్‌ను తొలగించే ప్రయత్నం చేసినా.. బాలుడి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చివరికి లిఫ్టు గోడలను బద్దలుకొట్టారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి అతికష్టమ్మీద బాలుడిని బయటికి తీశారు. నడుము, కడుపు భాగానికి తీవ్ర గాయాలై.. అపస్మారకస్థితికి చేరిన బాలుడికి 108 వైద్య బృందం ఆక్సిజన్ అందించి.. అనంతరం నిలోఫర్ ఆసుపత్రికి తరలించింది. బాలుడికి ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని, పరిస్థితి విషమంగానే ఉందని నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ తెలిపారు.
లిఫ్టు పని తీరుపై అనుమానాలు..
శాంతినగర్ కాలనీలోని మఫర్ కంఫర్టెక్ అపార్ట్‌మెంట్ మొత్తం నాలుగు అంతస్తులు ఉంది. ఈ అపార్ట్‌మెంట్‌ను మఫర్ అనే సంస్థ నిర్మించి గ్రిల్స్‌తో కూడిన లిఫ్టును ఏర్పాటు చేసింది. ఎక్కడైనా గ్రిల్స్ మూస్తేనే లిప్ట్ పైకి కదులుతుంది. కానీ ఇక్కడి లిఫ్టు గ్రిల్స్ వేయకుండానే, కేవలం బటన్ నొక్కగానే పైకి కదిలింది. ఇలా లిఫ్టు పని చేయడంతోనే బాలుడు ఇరుక్కుపోవడానికి కారణమైందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment