లిఫ్ట్‌లో ఇరుక్కుని.. హైదరాబాద్‌లో మరో విషాదం | Lift Accident in Mehdipatnam Full Details | Sakshi
Sakshi News home page

లిఫ్ట్‌లో ఇరుక్కుని.. హైదరాబాద్‌లో మరో విషాదం

Published Thu, Mar 13 2025 7:25 AM | Last Updated on Thu, Mar 13 2025 8:04 AM

Lift Accident in  Mehdipatnam Full Details

హైదరాబాద్‌, సాక్షి: పదిహేను రోజుల వ్యవధిలో.. అదీ ఒకే ప్రాంతంలో మరో పసిప్రాణాన్ని నాసిరకం లిఫ్ట్‌ బలిగొంది(Lift Accident). నాంపల్లిలో లిఫ్ట్‌లో ఇరుక్కుని నరకం అనుభవించి చిన్నారి కన్నుమూసిన ఘటన మరువక ముందే.. అలాంటి ఘటనే మరొకటి మెహదీపట్నంలో చోటు చేసుకుంది. ఆసిఫ్‌నగర్‌ ఠాణా పరిధి సంతోష్‌నగర్‌కాలనీలో నాలుగున్నరేళ్ల చిన్నారి సురేందర్‌(Surendar) లిఫ్ట్‌లో ఇరుక్కుని మరణించడం స్థానికంగా విషాదం నింపింది. 

బుధవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనపై పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. శ్యామ్‌ బహదూర్‌(Shyam Bahadur) నేపాల్‌కు చెందిన వ్యక్తి. ఉపాధి కోసం ఏడు నెలల కిందట నగరానికి వచ్చాడు. తొలుత గుడిమల్కాపూర్‌లో ఓ భవనానికి కాపలాదారుగా పనిచేశాడు. అయితే మూడు నెలల కిందట సంతోష్‌నగర్‌ కాలనీలోని ముజ్తాబా అపార్ట్‌మెంట్‌కి వాచ్‌మెన్‌గా వచ్చాడు. నిర్వాహకులు రూమ్‌ ఇస్తామని చెప్పడంతో నేపాల్‌ నుంచి భార్య, కుమార్తె, కుమారుడిని తీసుకొచ్చాడు. 

ఆరు అంతస్తులున్న భవనంలో హాస్టల్‌ నిర్వహిస్తున్నారు. లిఫ్ట్‌పక్కనే ఉన్న చిన్నగదిలో శ్యామ్‌ బహదూర్‌ కుటుంబం ఉంటోంది. బుధవారం రాత్రి 10 గంటల టైంలో.. సురేందర్‌ ఆడుకుంటూ లిఫ్ట్‌ దగ్గరకు వెళ్లాడు. ఆ టైంలో తలుపుల మధ్యకు వెళ్లగా.. పైన ఎవరో లిఫ్ట్‌ నొక్కారు. తలుపులు మూసుకుపోకముందే లిప్ట్‌ పైకి దూసుకెళ్లింది. దీంతో లిఫ్ట్‌లోనే ఆ పసిప్రాణం నలిగిపోయింది. 

కాసేపటికే సురేందర్‌ ఎక్కడా కనిపించకపోవడంతో శ్యామ్‌ వెతకగా.. లిఫ్ట్‌మధ్యలో ఇరుక్కుని రక్తపుమడుగులో అపస్మారకస్థితిలో కనిపించాడు. తల్లిదండ్రులు రోదిస్తుండగానే.. అపార్ట్‌మెంట్‌ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడిని హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సురేందర్‌ చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఒక్కగానొక్క కొడుకు మరణించాడన్న సమాచారంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement