
అపస్మారక స్థితిలోకి వెళ్లిన చిన్నారి
పరిస్థితి విషమం.. నిలోఫర్‌లో చికిత్స
నాంపల్లి: ఆరేళ్ల బాలుడు లిఫ్టులో ఇరుక్కుపోయి.. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయిన ఘటన నాంపల్లి పరిధిలోని మాసబ్‌ట్యాంక్ శాంతినగర్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గోడేఖీ ఖబర్ ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ ప్రైవేట్ హెల్త్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు కుమారుడు అరుణవ్ (6) ఉన్నాడు. శాంతినగర్ కాలనీ మఫర్ కంఫర్టెక్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న తన అత్తమ్మ ఆయేషా ఇంటికి తాతయ్యతో కలిసి అరుణవ్ శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో వచ్చాడు. అపార్ట్‌మెంట్ మూడో అంతస్తుకు వెళ్లేందుకు తాతా, మనవడు లగేజీతో లిఫ్టు ముందు నిలబడ్డారు. కిందికి వచ్చిన లిఫ్టు లోపలికి మొదట అరుణవ్ వెళ్లాడు.
బాలుడి తాత కొంత లగేజీని లిఫ్టులో పెట్టాడు. మిగిలిన లగేజీని తెచ్చేందుకు అతడు మళ్లీ లిఫ్టు బయటికి వెళ్లాడు. అంతలోనే అరుణవ్ బటన్ నొక్కాడు. అంతే.. క్షణాల్లో లిఫ్టు కదిలి పైకి వెళ్లింది. లిఫ్టు గ్రిల్స్ తెరిచే ఉండటంతో బయపడ్డ అరుణవ్ లిఫ్టు నుంచి దూకాడు. ఈ క్రమంలో లిఫ్టుకు, స్లాబ్ గోడకు మధ్యలోని సందులో ఇరుక్కుపోయాడు. అప్పటికే లిఫ్టు.. మొదటి ఫ్లోర్ స్లాబ్ వద్దకు చేరుకుని నిలిచిపోయింది. అందులో ఇరుక్కున్న అరుణవ్ గట్టిగా అరిచాడు. అపార్ట్‌మెంట్‌లోని వారంతా అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాంపల్లి ఇన్‌స్పెక్టర్ అప్పలనాయుడు ఫైర్ సిబ్బందికి, హైడ్రా డీఆర్‌ఎఫ్ బలగాలను రప్పించారు.
గ్యాస్ కట్టర్లతో తొలగించి..
ఘటనా స్థలానికి చేరుకున్న బలగాలు గ్యాస్ కట్టర్లు, ఫైర్ విభాగానికి చెందిన పరికరాలతో లిఫ్టు ఫ్రేమ్‌ను కట్ చేశారు. రెండు గంటల పాటు శ్రమించి స్లాబ్ గోడను తొలగించారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ యజ్ఞనారాయణ, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పి.దత్తు తమ బృందాలతో ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. బాలుడిని ప్రాణాలతో బయటికి తీసి చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు.
అపస్మారక స్థితిలో బాలుడు..
నిలోఫర్ ఆస్పత్రి ఐసీయూలో అరుణవ్‌ను వెంటిలేటర్ మీద ఉంచి ఆక్సిజన్, ప్లూయిడ్, గ్లూకోజ్‌ను అందిస్తున్నారు. 24 గంటలు గడిస్తే తప్ప బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమని నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.రవికుమార్ తెలిపారు. బాధిత బాలుడిని స్థానిక ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ పరామర్శించారు.
లిఫ్టు పని తీరుపై అనుమానాలు..
శాంతినగర్ కాలనీలోని మఫర్ కంఫర్టెక్ అపార్ట్‌మెంట్ మొత్తం నాలుగు అంతస్తులు ఉంది. ఈ అపార్ట్‌మెంట్‌ను మఫర్ అనే సంస్థ నిర్మించి గ్రిల్స్‌తో కూడిన లిఫ్టును ఏర్పాటు చేసింది. ఎక్కడైనా గ్రిల్స్ మూస్తేనే లిప్ట్ పైకి కదులుతుంది. కానీ ఇక్కడి లిఫ్టు గ్రిల్స్ వేయకుండానే, కేవలం బటన్ నొక్కగానే పైకి కదిలింది. ఇలా లిఫ్టు పని చేయడంతోనే బాలుడు ఇరుక్కుపోవడానికి కారణమైందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment