కాకినాడ జిల్లాలో 9 వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం
తిరుమల, సింహాచలం కంటే పురాతనమైనదిగా ప్రఖ్యాతి
ఆలయంలో కొలువై భక్తుల కోర్కెలు తీరుస్తున్న స్వయంభూ శృంగార వల్లభుడు
రేపటి నుంచి స్వామివారి కల్యాణోత్సవాలు ప్రారంభం
పెద్దాపురం: ఏలేరు నది ఒడ్డున అతి పురాతన కాలంలో స్వయం సిద్ధ క్షేత్రంగా వెలసిన స్వయంభూ శ్రీ భూసమేత శృంగార వల్లభ స్వామి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చదలాడ తొలి తిరుపతిలో వెలసిన స్వామి వారి కల్యాణం శుక్రవారం రాత్రి 8 గంటలకు నిర్వహిస్తారు. సామర్లకోట–ప్రత్తిపాడు రహదారిలో పెద్దాపురం మండలంలోని దివిలి గ్రామానికి ఒకటిన్నర కిలో మీటర్ల దూరంలో ఉంది చదలాడ తొలి తిరుపతి.
విశిష్ట నిర్మాణ శైలితో ఉండే ఈ పుణ్యక్షేత్రం సింహాచలం, తిరుమల తిరుపతి కంటే పురాతనమైనదిగా పేర్కొంటారు. తొలి తిరుపతిగా పేరొందిన ఈ గ్రామంలోని ఆలయం తొమ్మిది వేల సంవత్సరాల క్రితం నాటిదని, ఈ విషయం ‘చాతావళి’ అనే సంస్కృత గ్రంథంలో కూడా ఉందని ఆలయ ప్రధాన పూజారులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు చెప్పారు.
దేశవ్యాప్తంగా మొత్తం 108 తిరుపతిలు ఉండగా వాటిలో ‘తొలి తిరుపతి’దే తొలిస్థానమని పేర్కొంటున్నారు. ఈ ఆలయం మాదిరిగానే పెద్ద తిరుపతి (తిరుమల తిరుపతి)లో కూడా ఏడు ద్వారాలు ఉండడం విశేషం. ఇక ప్రతీ శనివారం ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆలయానికి పాదయాత్రగా వచ్చి ఏడు వారాలు మొక్కు తీర్చుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు.
ఎడమ చేతిలో చక్రం... కుడి చేతిలో శంఖం
ఇక్కడ స్వామి ఇతర పుణ్యక్షేత్రాల్లో విగ్రహాలకు భిన్నంగా ఎడమ చేతిలో చక్రం, కుడి చేతిలో శంఖం ధరించి ఉండటం విశేషం. అలాగే ఇక్కడ స్వామి చేతుల్లో తామర పుష్పం ఉన్నట్లే తిరుమల, సింహాచలం ఆలయాల్లోని విగ్రహాల చేతిలోనూ ఉన్నట్లు చెబుతారు. ఇది మూడు క్షేత్రాల మహాక్షేత్రంగా గణుతికెక్కింది. ప్రధానంగా ఇది స్వయం సిద్ధక్షేత్రం.
నారద మునీంద్రుడు ఇక్కడ లక్ష్మీదేవిని ప్రతిస్టించడంతో దివ్యక్షేత్రమవ్వగా శ్రీకృష్ణ దేవరాయలు గోదాదేవిని ప్రతిస్టించడంతో రాజక్షేత్రంగా మారి మహా క్షేత్రమైంది. భోజ మహారాజు ఈ ఆలయానికి సున్నం వేయించినట్టు, విక్రమాదిత్యుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్, విక్టోరియా మహారాణి ఈ ఆలయ దర్శనానికి వచ్చినట్లు శాసనాధారాల్లో ఉంది.
బొడ్నబావి ప్రత్యేకత..
ఆలయానికి ఆగ్నేయ మూలలో చతురస్రాకారంలో ఉన్న బావిని బొడ్నబావిగా పిలుస్తుంటారు. నేలబావిగా ఉన్న ఈ బావి చుట్టూ రాళ్లు పేర్చి నిరి్మంచడాన్ని పురాతన నిర్మాణానికి ఆనవాలుగా చెబుతారు. కార్తికమాసంలో ఈ బావి నీటిని ఆలయ అర్చకులతో తోడించుకుని స్నానం చేస్తే సంతానం లేనివారికి సంతాన భాగ్యం కలుగుతుందని, కార్తిక పౌర్ణమి నాడు ఆ స్నానం మరింత ప్రాశస్థ్యమని భక్తుల నమ్ముతారు. ఈ బావి నీటిని చుట్టుపక్కల గ్రామాల వారు ఇంటికి తీసుకువెళ్లి మామూలు నీళ్లతో కలుపుకొని స్నానం చేస్తారు.
టీటీడీ సహకారంతో ఆలయ అభివృద్ధి
ఈ ఆలయానికి ఉండే వందలాది ఎకరాల ఆస్తి కాలక్రమంగా అన్యాక్రాంతమై నేటికి 18 ఎకరాలు మాత్రమే మిగిలింది. అయితే జీర్ణావస్థలో ఉన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు పురావస్తు శాఖ చర్యలు చేపట్టింది. టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ఉన్న సమయంలో ఆలయ అభివృద్ధికి రూ. 2 కోట్లు మంజూరు చేశారు. ఇక దాతల సహకారంతో భక్తులకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.
స్వామి వారి కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి
శృంగార వల్లభ స్వామి దివ్య కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. రాత్రి 8 గంటలకు ఉభయ దేవేరులైన క్షీర సాగరనందని లక్ష్మీదేవి, భూదేవిలతో స్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవం ఉంటుంది. 20న గ్రామోత్సవం, 21న సదస్యం, 22న సుదర్శన హోమం, చోర సంవాదం, 23వ తేదీ ఉదయం 8 గంటలకు చక్ర స్నానం, బుక్కా పండగ, సామూహిక కుంకుమ పూజలు, 24వ తేదీన సాయంత్రం 6 గంటలకు స్వామి వారికి శ్రీ పుష్పయాగం ఉంటాయి. – వడ్డి శ్రీనివాస్, కార్యనిర్వహణాధికారి
Comments
Please login to add a commentAdd a comment