ఆమె భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ముగ్గురు కూతుళ్లకు పెళ్లిల్లయ్యాయి. ఇక.. అమ్మకు తోడెవరంటూ కుమిలిపోయిన ఆ కొడుకు పెళ్లి చేసుకోకుండా అమ్మ సేవలో తరిస్తూ వచ్చాడు.. తల్లీ కొడుకుల బంధాన్ని చూసి విధికి సైతం కన్ను కుట్టింది. తన ఆలనా పాలనా చూసుకుంటున్న కొడుకు ప్రాణాల్ని గుండె జబ్బు కబళించింది. తల్లికి తల కొరివి పెట్టాల్సిన కొడుకుకు తల్లే తలకొరివి పెట్టాల్సి రావడాన్ని చూసిన ప్రతి ఒక్కరి హృదయం చలించిపోయింది. ఈ సంఘటన మంగళవారం నందలూరులో చోటుచేసుకుంది.
సాక్షి, నందలూరు (వైఎస్సార్ జిల్లా) : నవమాసాలు మోసిన కన్నతల్లే చివరకు తన కుమారుడికి తలకొరివి పెట్టిన సంఘటన నందలూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాగిరెడ్డిపల్లె పంచాయతీలోని స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లా వెనుక వైపున నివాసం ఉన్న గుళ్ల అనసూయమ్మకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెలకు వివాహాలు అయ్యాయి. కుమారుడు గుళ్ల విజయ్‌కుమార్ (మద్రాసు బాబు) (49) తన అక్క, ఇద్దరు చెల్లెళ్లకు వివాహాలు కావడంతో తన తల్లిదండ్రులను చూసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో తాను వివాహం కూడా చేసుకోలేదు.
ప్రేమానురాగాలకు ప్రతీక
నాగిరెడ్డిపల్లె పంచాయతీ పరిధిలో మద్రాసు బాబు అంటే తెలియనివారు లేరు. మంచి గుణాలు, వ్యక్తిత్వం ఉండి, ప్రతిఒక్కరినీ నవ్వుతూ పలకరిస్తాడు. సమస్య ఉందని తన వద్దకు వస్తే చేతనైన సాయం చేస్తూ అందరి మనసులో చోటు సంపాదించుకున్నాడు.
కబళించిన కష్టాలు
తన అక్క, ఇద్దరు చెల్లెళ్లకు వివాహాలు చేసిన అనంతరం తన తండ్రి సూర్యప్రభాకర్ రైల్వే డ్రైవర్‌గా పదవీవిరమణ పొందిన తర్వాత కిడ్నీ వ్యాధితో బాధపడుతుండేవాడు. తండ్రిని ఆస్పత్రిలో చూపిం చేందుకు ఉండే నగదు అంతా ఖర్చుకావడంతో మద్రాసు బాబుకు కష్టాలు ప్రారంభమయ్యాయి.
తల్లి సేవలో తనయుడు
తన తండ్రి మరణించిన తర్వాత తన తల్లి గుళ్ల అనసూయమ్మకు వచ్చే పెన్షన్ నగదుతోనే సంసారాన్ని నెట్టుకొస్తూ తన తల్లి ప్రతి కోరికను నెరవేరుస్తూ వచ్చాడు. తనలో తనే మదనపడుతూ తన స్నేహితులే తన బంధువులుగా అందరి మనసుల్లో మెలుగుతూ తన కష్టాలనుసైతం ఎవరికీ తెలియకుండా తనకు ఉన్నటువంటి గుండె జబ్బుకు చికిత్స చేయించుకునేందుకు నిరాకరిస్తూ ఆ పెన్షన్ నగదుతోనే తన తల్లి బాగోగులను చూసేవాడు.
తనయుడిని దూరం చేసిన మరణం
మద్రాసు బాబు గుండెజబ్బుతో బాధపడుతూ కొన్నాళ్ల క్రితం గుండెకు ఆపరేషన్ చేయించుకున్నాడు. కానీ తన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగినంత సంపాదన లేకపోవడంతో తన తల్లికి వచ్చే పెన్షన్ నగదుతోనే సంసారాన్ని నెట్టుకొచ్చేవాడు. అంతలోనే విధి చిన్నచూపు చూసింది. తన తల్లి అనసూయమ్మకు పెరాలసిస్ వచ్చి కాలు, చెయ్యి పనిచేయలేదు. దీంతో అతనే తల్లికి తానే అన్నీ అయ్యాడు. స్నానం చేయిస్తూ.. బట్టలు కూడా వేసేవాడు. తల్లిసేవలోనే నిమగ్నమైన మద్రాసు బాబును చూసి ఆ దేవుడు ఓర్వలేకపోయాడు. గుండె జబ్బుతో ఉన్న మద్రాసు బాబుకు ఒక్కసారిగా ఊరికి ఆడక మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు.
కాటికి చేరిన మద్రాసు బాబు
మంగళవారం సాయంత్రం అక్కాచెళ్లెల్లు, బంధువులు, స్నేహితుల కన్నీటి వీడ్కోల మధ్య రాజంపేటకు చెందిన మావనతా స్వచ్ఛంద సేవాసంస్థ శాంతిరథంలో మద్రాసు బాబు భౌతికకాయం కాటికి చేరింది.
కన్న కొడుక్కు తలకొరివి పెట్టిన తల్లి
సంప్రదాయబద్ధంగా మద్రాసు బాబు భౌతికకాయాన్ని కాటికి చేర్చి వివాహం కాకపోవడంతో తన సోదరి దహన సంస్కారాల కార్యక్రమాన్ని చేయగా.. తన తల్లి అనసూయమ్మ కుమారుడు మద్రాసుబాబుకు విలపిస్తూ తలకొరివి పెట్టింది. మద్రాసుబాబు తల్లి అనసూయమ్మ తన కుమారుడు తనకు చేసిన సేవలకు ప్రతిఫలంగా అల్లారుముద్దుగా పెంచుకున్న తన బిడ్డకే తలకొరివి పెట్టే పరిస్థితి వచ్చింది. ఏ తల్లీకి రాకూడదని బోరున విలపిస్తున్న దృశ్యాన్ని చూసిన బంధువులు, స్నేహితులు రోదించారు.
Comments
Please login to add a commentAdd a comment