రైతు ఉసురు తీసిన లంచం
పాసుపుస్తకం ఇవ్వడానికి రూ.4 లక్షలు డిమాండ్ చేసిన తహశీల్దార్
ఆత్మహత్య చేసుకుందామని సెల్ టవర్ ఎక్కుతూ
గుండెపోటుతో మృతి చెందిన రైతు మగ్బూల్
నందలూరు (వైఎస్సార్ జిల్లా): రెవెన్యూ అధికారుల ధనదాహానికి మరో రైతు బలయ్యాడు. పట్టాదారు పాసుపుస్తకం కోసం మూడేళ్లు తిప్పుకుని... చివరకు రూ.4 లక్షలు లంచం అడగడంతో... దిక్కుతోచక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని సెల్ టవర్ ఎక్కుతూ గుండెపోటుకు గురై సోమవారం మృతి చెందాడు. దీంతో అధికారుల తీరుపై మృతుడి బంధువులు భగ్గుమన్నారు. ఆర్డీఓను చుట్టుముట్టారు. ఓ దశలో మృతదేహాన్ని తీసుకెళ్లి పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించారు. వైఎస్‌ఆర్ జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లెకు చెందిన సయ్యద్ మగ్బూల్(52) ,అతని సోదరులంతా వేరుపడి వేర్వేరుగా జీవిస్తున్నారు. వారికి ఉమ్మడిగా వేర్వేరు చోట్ల 5.13 ఎకరాల భూమి ఉంది.
అలా తన వాటాపై వచ్చిన భూమి పట్టాదారు పాసుపుస్తకం కోసం మగ్బుల్ మూడేళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో రాజంపేట ఆర్డీఓగా ప్రభాకర్ పిళ్లై, నందలూరు తహశీల్దార్‌గా నరసింహులు ఏడాది క్రితం బాధ్యతలు చేపట్టారు. తన సమస్య తీర్చాలని మగ్బూల్ వారిద్దరినీ ప్రతీ సోమవారం కలిసేవాడు. ఈ నేపథ్యంలో తహశీల్దార్ అతన్ని రూ.4 లక్షలు ఇస్తేనే రికార్డులు సరిచేసి భాగపరిష్కారం చేస్తానని తేల్చి చెప్పారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని మగ్బూల్ సోమవారం ఉదయం 10 గంటలకు అరవపల్లెలోని సెల్‌టవర్ ఎక్కాడు. అలా అక్కడే మృతి చెందాడు.తహశీల్దార్‌ను సస్పెం డ్ చేసేవరకు మృతదేహాన్ని కిందకు దింపనివ్వమని బంధువులు బైఠాయించారు. బదిలీ సమాచారం రావడంతో అధికారులు వారికి నచ్చజెపిప మృతదేహాన్ని కిందకు దింపారు.