రాజరాజ చోళుడి కంటే ముందే ‘సెంగోల్‌’!  | Karnataka Pattadakal Scepter on Virupaksha Temple | Sakshi
Sakshi News home page

రాజరాజ చోళుడి కంటే ముందే ‘సెంగోల్‌’! 

Published Sun, May 28 2023 3:37 AM | Last Updated on Sun, May 28 2023 3:37 AM

Karnataka Pattadakal Scepter on Virupaksha Temple - Sakshi

ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన కర్ణాటకలోని పట్టదకల్‌ దేవాలయ సమీపంలోని విరూపాక్ష ఆలయం మీద ఉన్న నటరాజస్వామి శిల్పం. నంది ధ్వజం రూపంలో రాజదండం చెక్కి ఉండటాన్ని ఈ శిల్పం పక్కన చూడొచ్చు. అధికార మార్పిడికి గుర్తుగా క్రీ.శ.745లో దేవాలయాన్ని నిర్మించారని, రాజదండాన్ని (సెంగోల్‌)  ఉపయోగించారని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌:  సెంగోల్‌.. ధర్మదండం.. రాజదండం..కొన్ని రోజులుగా రాజకీయాలను కుదిపేస్తున్న పదాలివి. అంతకుముందు వాటి ప్రత్యేకతలపై సామాన్యుల్లో ఉన్న అవగాహన అంతంతమాత్రమే. ఇప్పుడు ఎక్కడ చూసినవా వాటి గురించిన చర్చే. కొత్త పార్లమెంటు భవనంలో స్పీకర్‌ చాంబర్‌ వద్ద కేంద్ర ప్రభుత్వం స్వర్ణతాపడం చేసిన వెండి ధర్మదండాన్ని ఉంచబోతున్న సంగతి తెలిసిందే.

రాజరాజ చోళుడి కాలంలో అధికార మార్పిడికి చిహ్నంగా వినియోగించినట్టుగా భావిస్తున్న దండాన్ని, ఆంగ్లేయుల నుంచి భారతదేశానికి అధికార మార్పిడి జరిగే వేళ తిరిగి వినియోగించారు. ఇంతకాలం మ్యూజియంలో ఓ బంగారు చేతికర్ర లాగా ఉండిపోయింది. ప్రస్తుతం నరేంద్రమోదీ ప్రభు­త్వం దానికి సముచిత గౌరవాన్ని కల్పించే పేరిట కొత్త పార్లమెంటు భవనంలో ప్రతిష్టించనుంది. 

రాజరాజ చోళుడి కంటే ముందే.. 
తాజా పరిణామాల నేపథ్యంలో చరిత్ర పరిశోధకుల దృష్టి పడింది. రాజరాజ చోళుడి కంటే కొన్ని వందల ఏళ్ల ముందే నంది చిహ్నంతో కూడిన రాజదండాన్ని అధికారమార్పిడికి వినియోగించారని వారు పేర్కొంటున్నారు. కర్ణాటకలోకి విశ్వవిఖ్యాత పట్టదకల్‌ దేవాలయ సమూహంలోని విరూపాక్ష దేవాలయంపై నటరాజస్వామి శిల్పంలో నంది ధ్వజం రూ­పంలో ఈ రాజదండం చెక్కి ఉందని పురావస్తు పరిశోధకులు సీహెచ్‌ బాబ్జీరావు, ఈమని శివనాగిరెడ్డి­లు పేర్కొంటున్నారు.

ఈ దేవాలయాన్ని బాదా­మీ చాళుక్య చక్రవర్తి రెండో విక్రమాదిత్యుడి భార్య లో­కమహాదేవి నిర్మించారు. అప్పట్లో రెండో విక్రమా­దిత్యుడు పల్లవ నరసింహవర్మను ఓడించి ఆ­య­న ఆధీనంలోని ప్రాంతాన్ని తన పాలనలోకి తీ­సు­కున్న సందర్భంగా జరిగిన అధికార మార్పిడికి గు­ర్తుగా రాణి ఈ ఆలయాన్ని నిర్మించి నటరాజస్వా­మి పక్కనే సెంగోల్‌ను ప్రముఖంగా ప్రదర్శించారు.  

ఇంతకూ నంది ఎందుకు? 
శివాలయాలకు నందీశ్వరుడు అధికారం వహిస్తాడని ఆగమశాస్త్రాల్లో ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే మూలమూర్తిని దర్శించేముందు నంది అనుమతి పొందాలన్న భావన ఉండేదని, అధికారానికి గుర్తుగా నంది రూపాన్ని వాడేవారని, అధికార మార్పిడికి చిహ్నంగా అందించే అధికార దండంపై నంది రూపాన్ని రూపొందించారని చెబుతున్నారు. ఈ సంప్రదాయం చోళుల కాలం కంటే ముందు నుంచే కొనసాగిందని వారు పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement