మన దేశం ఆధ్యాత్మికత నెలవు. ఇక్కడ దేవుళ్లకు మాత్రమే కాదు, పాములకు, అభిమాన నటులకు, రాజకీయనాయకులకు గుడి కట్టించి మరీ పూజలు చేస్తుంటారు ప్రజలు. సాధారణంగా అందరం దేవుడికి గుడి కట్టడం, పూజలు చేయడం వంటివి చేస్తాం. కానీ ఆ గ్రామంలో మాత్రం కుక్కలకు గుడికట్టి మరీ పూజలు చేస్తున్నారు. పైగా ఏడాదికి ఒకసారి భారీ ఎత్తున ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఎక్కడా లేని విధంగా ఇక్కడ శునకాలను పూజించడానికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందంటే..
కర్ణాటకలోని చన్నపట్న నగరంలో అగ్రహార వలగెరెహళ్లి అనే చిన్న గ్రామం ఉంది. ఈ నగరం చెక్క బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీనిని 'బొమ్మల పట్టణం' అని పిలుస్తారు. బెంగళూరు నగరానికి దాదాపు 60 కి.మీ దూరంలో ఉన్న ఈ దేవాలయం గురించి చాలా మందికి తెలియదు. ఈ ఆలయాన్ని 2010 సంవత్సరంలో ధనవంతుడైన వ్యాపారి రమేష్ నిర్మించాడు. ఇలా కుక్కల కోసం ఆలయం కట్టడానికి గల కారణం..
ఆలయం వెనుక చరిత్ర..
గ్రామంలో ఎప్పుడూ తిరిగే రెండు శునకాలు ఒక్కసారిగా మాయమయ్యాయి. అయితే ఇవి చనిపోయాయని గ్రామస్థులు అనుకున్నారు. అయితే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కలలో ఓ దేవత కనిపించి గ్రామస్థుల రక్షణ కోసం తప్పిపోయిన కుక్కల కోసం ఓ ఆలయాన్ని నిర్మించాలని తెలిపింది. ఆ గ్రామం కులదేవత కెంపమ్మ. ఆ దేవతే స్వయంగా కలలో కనిపించి గ్రామస్తుల రక్షణ కోసం కనిపించకుండా పోయిన కుక్కల కోసం దేవాలయాన్ని నిర్మించమని చెప్పింది.
దీంతో వెంటనే గ్రామస్తులు ఇలా ఆ రెండు కుక్కలకు ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. అంతేగాదు ఈ ఆలయంలో ప్రతీ ఏడాది భారీ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఆలయంలో తప్పిపోయిన ఆ రెండు కుక్కల విగ్రహాలు ఉంటాయి. ఇవి గ్రామంలోకి ప్రతికూల శక్తి రాకుండా కాపాడతాయని అక్కడి గ్రామస్తులు నమ్మకం. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటం.
(చదవండి: చేపను పోలిన భవనం..ఎక్కడుందంటే..?)
Comments
Please login to add a commentAdd a comment