బెంగళూరు: కర్ణాటకలోని ఓ ఆలయంలో జరిగిన ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దీపావళి పండుగ సందర్భంగా.. చిక్కమగళూరులోని దేవీరమ్మ కొండపై ఉన్న ఆలయానికి భక్తులు పోటెత్తడంతో తోపులాట జరిగింది. వేలాది సంఖ్యలో భక్తులు ఒక్కసారిగా రావడంతో, కొండలపై జారి పడి పలువురికి గాయాలయ్యాయి. మల్లెనహళ్లిలోని దేవీరమ్మ కొండపై ఉన్న గుడి వద్ద గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.
అయితే గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలే ఇందుకు కారణమని అధికారులు పేర్కొన్నారు. సందర్శకుల భద్రత కోసం జిల్లా యంత్రాంగం, పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ.. భారీ వర్షాల కారణంగా కొండలు తడిగా మారాయని వెల్లడించారు. ఆలయం నుంచి తిరిగి వస్తుండగా పడిపోవడంతో దాదాపు 12మంది భక్తులు స్వల్పంగా గాయపడ్డారని, వారందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
కాగా దీపావళి సందర్భంగా ఏడాదిలో కేవలం ఒక్కరోజు మాత్రమే భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించేందుకు అనుమతిస్తారు. ఇది దేవిరమ్మ అనే కొండపై మూడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. బాబాబుడంగిరిలోని మాణిక్యధార, అరిసినగుప్పె మీదుగా భక్తులు ఆలయానికి చేరుకుంటారు. నరక చతుర్దశికి ముందు దేవీరమ్మ అమ్మవారి దర్శనం చేసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment