Ruby
-
మిస్ యూనివర్స్ పోటీలో తొలిసారి సౌదీ సుందరి
రియాద్: ఇస్లాం సంప్రదాయవాదానికి చిరునామాగా నిలిచే సౌదీ అరేబియా నుంచి ఒక ముద్దుగుమ్మ మిస్ యూనివర్స్ పోటీలకు సిద్ధమైంది. సౌదీ నుంచి ఇలా ఒక అమ్మాయి అంతర్జాతీయ అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. త్వరలో మలేసియాలో జరగబోయే విశ్వసుందరి పోటీల్లో తాను సౌదీ తరఫున పాల్గొనబోతున్నట్లు 27 ఏళ్ల మోడల్ రూబీ అల్ఖాతానీ సోమవారం ప్రకటించారు. సౌదీలోని రియాద్ నగరం ఈమె స్వస్థలం. ఇప్పటికే పలు అందాల పోటీల్లో పాల్గొన్నారు. కొద్ది వారాల క్రితం మలేసియాలో జరిగిన మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ ఏషియన్లోనూ పాలుపంచుకున్నారు. ప్రపంచ సంస్కృతులపై అవగాహన పెంచుకుంటూనే మా సౌదీ సంప్రదాయాలు, సంస్కృతి, వారసత్వాన్ని విశ్వ వేదికలపై వివరిస్తా’ అని అరబ్ న్యూస్‌తో రూబీ అన్నారు. ఇప్పటికే మిస్ సౌదీ అరేబియా కిరీటాన్ని దక్కించుకున్న ఈమె మిస్ మిడిల్ ఈస్ట్(సౌదీ అరేబియా), మిస్ అరబ్ వరల్డ్ పీస్–2021, మిస్ ఉమెన్(సౌదీ అరేబియా) టైటిళ్లను గెలుపొందారు. ఈమెకు ఇన్‌స్టా గ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈమె మోడల్‌గానే కాదు కంటెట్ క్రియేటర్ గానూ రాణిస్తున్నారు. కఠిన ఆంక్షలతో ఫక్తు సంప్రదాయవాదిగా పేరుమోసిన 38 ఏళ్ల సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఇటీవలి కాలంలో సౌదీని సంస్కరణల బాటలో పయనింపజేస్తున్నారు. మహిళల డ్రైవింగ్‌కు, పురుషుల పార్టీలకు వెళ్లేందుకు, పురుష సంరక్షులు లేకున్నా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించారు. పూర్తి మద్యనిõÙధం అమల్లో ఉండే సౌదీలో తొలిసారిగా దౌత్యకార్యాలయాలుండే ప్రాంతంలో మద్యం అమ్మకాలకు అనుమతి మంజూరు చేశారు. -
Majestic Princess: విలాస నౌకలో 800 మందికి కరోనా
సిడ్నీ: న్యూజిలాండ్ నుంచి వస్తున్న విలాసవంత పర్యాటక నౌక ‘మేజిస్టిక్ ప్రిన్సెస్’లోని 3,300 మంది ప్రయాణికులు, 1,300 మంది సిబ్బందిలో శనివారం మొత్తంగా 800 మందికి కోవిడ్ సోకింది. మెల్బోర్న్కు వెళ్లాల్సిన ఈ నౌక ప్రస్తుతం సిడ్నీలోని సర్క్యులర్ క్వేలో ఆగింది. కోవిడ్ తొలినాళ్లలో ఇదే తరహాలో రూబీ ప్రిన్సెస్ భారీ విలాసవంత పర్యాటక నౌకలో 900 మందికి కోవిడ్సోకి 28 మంది మహమ్మారికి బలయ్యారు. ఆస్ట్రేలియాలో కోవిడ్ కేసులు విజృంభిస్తున్న వేళ మేజిస్టిక్ నౌకలో కోవిడ్ ఉధృతిపై ఆందోళనలు పెరిగాయి. అయితే, ‘ పరీక్షలో పాజిటివ్‌గా తేలిన వారికి కోవిడ్ లక్షణాలు లేవు. కొద్ది మందికి స్వల్ప లక్షణాలు ఉన్నాయి. పరిస్థితి అదుపులోనే ఉంది. వారిని ఐసొలేషన్‌లో ఉంచాం’ అని క్రూయిజ్ ఆపరేటర్ అయిన కార్నివాల్ ఆస్ట్రేలియా అధ్యక్షురాలు మార్గరేట్ ఫిట్జ్‌గెరాల్డ్ చెప్పారు. -
ఆభరణమూ చరిత్ర చెబుతుంది
పొన్నియిన్ సెల్వన్... అది ఒక చరిత్ర పుస్తకం. అది ఒక సాహిత్య సుమం. అది ఒక సామాజిక దృశ్యకావ్యం. వీటన్నింటికీ దర్పణాలు ఈ ఆభరణాలు. ఆభరణం చరిత్రను చెబుతుంది. ఆభరణం కూడా కథను నడిపిస్తుంది. ఆ ఆభరణాలకు రూపమిచ్చిన డిజైనర్... ప్రతీక్ష ప్రశాంత్ పరిచయం ఇది. ప్రతీక్ష ప్రశాంత్... ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఆమె కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. తన క్రియేటివిటీతో తెరకు కళాత్మకతను పొదిగారామె. ఆ సినిమాలో నటీనటులు ధరించిన ఆభరణాలను రూపొందించిన ప్రతీక్ష ప్రశాంత్... సినిమా కోసం తనకు ఏ మాత్రం అవగాహన లేని చోళ రాజుల గురించి తెలుసుకున్నారు. వారి జీవన శైలి, వారికి ఇతర దేశాలతో ఉన్న వర్తక వాణిజ్యాలు, ఆచారవ్యవహారాలు, ధార్మికజీవనం... అన్నింటినీ ఔపోశన పట్టారు ప్రతీక్ష. ఆ అనుభవాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ‘‘మాకు సినిమా ప్రపంచంతో ఏ మాత్రం పరిచయం లేదు. మా ఇంట్లో వాళ్లు మహా బిడియస్థులు. మా పూర్వికులు నిజాం కుటుంబాలకు ఆభరణాలు తయారు చేశారు. హైదరాబాద్ లో ఆరు దశాబ్దాలుగా ఆభరణాల తయారీ, అమ్మకాల వ్యాపారంలో ఉన్నారు. కానీ వాళ్ల ఫొటోలు కూడా ఎక్కడా కనిపించవు. అలాంటిది ఒక్కసారిగా నేను సినిమా కోసం పని చేయడం ఊహించని మలుపు అనే చెప్పాలి. సినిమాకు ఆర్నమెంట్ డిజైనర్‌గా కంటే ముందు నా గురించి చెప్పాలంటే... మాది గుజరాతీ కుటుంబం. నేను పుట్టింది, పెరిగింది మాత్రం ముంబయిలో. మా నాన్నలాగే ఆర్కిటెక్చర్ చేశాను. పెళ్లితో కిషన్‌దాస్ ఆభరణాల తయారీ కుటుంబంలోకి వచ్చాను. నాకు ఉత్తరాది కల్చర్‌తోపాటు హైదరాబాద్ కల్చర్ తో మాత్రమే పరిచయం. అలాంటిది తమిళనాడుకు చెందిన ఒక పీరియాడికల్ మూవీకి పని చేయవలసిందిగా ఆహ్వానం అందడం నిజంగా ఆశ్చర్యమే. ఆ సినిమాకు డ్రెస్ డిజైనర్‌గా పనిచేసిన ‘ఏకా లఖానీ’కి నాకు కామన్ ఫ్రెండ్ సినీ నటి అదితి రావు హైదరీ. ఆమె ఆర్నమెంట్ డిజైనింగ్‌లో నా స్కిల్ గురించి ఏకా లఖానీకి చెప్పడంతో నాకు పిలుపు వచ్చింది. మణిరత్నం గారితో మాట్లాడిన తరవాత నేను చేయాల్సిన బాధ్యత ఎంత కీలకమైనదో అర్థమైంది. కొంచెం ఆందోళన కూడా కలిగింది. ఎందుకంటే నాకు చోళుల గురించి తెలియదు. ఆభరణాలు అర్థం కావడానికి కొన్ని పెయింటింగ్స్ చూపించారు. వాటిని చూసి యథాతథంగా చేయడం నాకు నచ్చలేదు. అందుకే చోళుల గురించి అధ్యయనం చేశాను. విదేశీ మణిమాణిక్యాలు చోళులు ధరించిన ఆభరణాల్లో ఉన్న మాణిక్యాలు మామూలు మాణిక్యాలు కాదు. అవి బర్మా రూబీలు. బర్మాతో చోళులకు ఉన్న వర్తక వాణిజ్యాల గురించి తెలిస్తేనే నేను ఆభరణంలో బర్మా రూబీ వాడగలుగుతాను. టాంజానియా, గోల్కొండతో కూడా మంచి సంబంధాలుండేవి. మరకతాలు, వజ్రాల్లో ఆ మేరకు జాగ్రత్త తీసుకున్నాం. అలాగే చోళులు శివభక్తులు, చేతికి నాగ వంకీలను ధరిస్తారు. తలకు పెద్ద కొప్పు పెట్టి, ఆ కొప్పుకు సూర్యవంక, చంద్రవంక, నాగరం వంటి ఆభరణాలను ధరిస్తారు. ఆభరణాల్లో కమలం వంటి రకరకాల పూలు– లతలు, నెమలి, రామచిలుక వంటి పక్షులు, దేవతల రూపాలు ఇమిడి ఉంటాయి. ముక్కు పుడక నుంచి చేతి వంకీ, ముంజేతి కంకణం, వడ్డాణం, తల ఆభరణాలు... వేటికవి తనవంతుగా కథను చెబుతాయి, కథకు ప్రాణం పోస్తాయి. రంగస్థలం అయితే తల వెనుక వైపు ఆభరణాల మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండక పోవచ్చు. కానీ సినిమాలో ముఖ్యంగా మణిరత్నం మూవీలో కెమెరా పాత్ర చుట్టూ 360 డిగ్రీల్లో తిరుగుతుంది. కాబట్టి ఎక్కడా రాజీ పడడానికి వీల్లేదు. పైగా ఇప్పుడు ప్రేక్షకులు ఒకప్పటిలాగ సినిమా చూసి బాగుందనో, బాగోలేదనో ఒక అభిప్రాయంతో సరిపుచ్చడం లేదు. పాత్ర అలంకరణ నుంచి, సన్నివేశం నేపథ్యం వరకు ప్రతిదీ నిశితంగా గమనిస్తున్నారు, పొరపాటు జరిగితే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఆటపట్టిస్తారు. అలాగే ఒకసారి ఐశ్వర్య ధరించిన ఆభరణాన్ని మరోసారి పారపాటున త్రిషకు అలంకరించామంటే ఇక అంతే. అప్పట్లో కోర్సుల్లేవు ఇక నా ఆర్నమెంట్ డిజైనర్ కెరీర్ విషయానికి వస్తే... నేను ఇందులో ఎటువంటి కోర్సూ చేయలేదు. ఇప్పటిలాగ పాతిక– ముప్పై ఏళ్ల కిందట కోర్సులు లేవు కూడా. మా మామగారికి సహాయంగా స్టోర్‌లోకి అడుగుపెట్టాను. నిపుణులైన మా కారిగర్స్ తమ అనుభవంతో పని నేర్పించారు. ప్రతి పనినీ ఆసక్తితో నేర్చుకున్నాను. ఇప్పటికీ రోజూ మధ్యాహ్నం వరకు నా ఆర్కిటెక్చర్ ఆఫీస్, మధ్యాహ్నం నుంచి ఆర్నమెంట్ స్టోర్ చూసుకుంటూ ఉంటాను. ఈ సినిమాకి పని చేయడం నా జీవితంలో ఒక విశిష్టమైన ఘట్టం’’ అన్నారామె. చారిత్రక దృశ్యమాలిక ఈ సినిమా కోసం మూడేళ్లు పనిచేశాను. నాలుగు వందల మంది డాన్సర్స్‌తో చిత్రీకరించిన విజయగీతం చాలా పెద్దది. సినిమా కోసం 450 ఆభరణాలు బంగారంతో చేశాం. ఐశ్వర్యారాయ్, త్రిష, విక్రమ్, జయం రవి, కార్తి, శోభిత... వంటి ముఖ్యపాత్రలతోపాటు మరికొన్ని ప్రధాన పాత్రలకు బంగారు ఆభరణాలు, చిన్న పాత్రలకు గిల్టు ఆభరణాలు చేశాం. దర్బార్ సన్నివేశాలు, యుద్ధఘట్టాలు, డాన్సులు... సన్నివేశాన్ని బట్టి ఆభరణం మారుతుంది. అలాగే ఒక్కో పాత్ర హెయిర్ స్టయిల్ ఒక్కో రకంగా ఉంటుంది. తలకు అలంకరించే ఆభరణాలు కూడా మారుతాయి. ప్రతి ఆభరణమూ చోళుల కాలాన్ని స్ఫురింపచేయాలి. చోళుల రాజ చిహ్నం పులి. రాజముద్రికల మీద పులి బొమ్మ ఉంటుంది. ఉంగరం మీద కొంత కథ నడుస్తుంది. కాబట్టి ఆ సీన్లో చిన్న డీటెయిల్ కూడా మిస్ కాకుండా పులితోపాటు పామ్ ట్రీ కూడా ఉండేటట్లు దంతంతో ఆభరణాన్ని రూపొందించాం. కల్కి కృష్ణమూర్తి రాసిన ప్రఖ్యాత తమిళ నవలకు, చారిత్రక ఘట్టాలకు దృశ్యరూపం ఇచ్చే ప్రయత్నంలో ఎక్కడా లోపం జరగకూడదనేది మణిరత్నం గారి సంకల్పం. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాననే అనుకుంటున్నాను. – ప్రతీక్ష ప్రశాంత్, ఆర్నమెంట్ డిజైనర్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
కోరలు లేని ఫైర్ సర్వీసెస్ యాక్ట్.. హైదరాబాద్‌లోనే ఎక్కువ కేసులు!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్ యజమాని నిర్లక్ష్యం ఎనిమిది మంది ప్రాణాలు బలిగొంది. కేవలం ఈ ఒక్క భవనమే కాదు సరిగ్గా వెతికితే నగరంలోని ప్రతి వీధికి కనీసం మూడు ఇలాంటివి కనిపిస్తుంటాయి. ఇలాంటి నిర్మాణాలు చేపట్టిన యజమానులపై చర్యలు తీసుకోవడానికి అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖకు ఉన్న ఒకే ఒక్క ఆధారం ఏపీ ఫైర్ సర్వీసెస్ యాక్ట్. 1999లో రూపొందించిన ఈ కోరలు లేని చట్టాన్నే ఇప్పటికీ వినియోగిస్తున్నారు. వాణిజ్య భవనాలు, సముదాయాల యజమానులు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడటానికి ఇదీ ఓ కారణమే అన్నది నిపుణుల మాట. సమరీ ట్రయల్‌కు మాత్రమే అవకాశం... ఏదైనా నేరానికి సంబంధించి పోలీసు విభాగం ఐపీసీ కింద కేసు నమోదు చేస్తుంటుంది. నేరం, నేరగాడి తీరుతెన్నుల్ని బట్టి అరెస్టుపై నిర్ణయం తీసుకుంటుంది. ఆపై జైలు, బెయిలు, కోర్టులో కేసు విచారణ తదితరాలు ఉంటాయి. అదే ఫైర్ సర్వీసెస్ యాక్ట్ వద్దకు వచ్చేసరికి ఆ చట్టం, అగ్నిమాపక శాఖకు ఉన్న అధికారాలు వేరు. వీళ్లు ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనలకు సంబంధించి కేసు నమోదు చేసినప్పటికీ నోటీసుల జారీ మినహా అరెస్టుకు ఆస్కారం లేదు. ఈ కేసు కోర్టు వరకు వెళ్లినా సాధారణ కేసుల్లా విచారణ ఉండదు. అదే ఎందరి ప్రాణాలు తీసిన ఉదంతం, ఎంత తీవ్రమైన ఉల్లంఘన అయినప్పటికీ ఇదే పరిస్థితి. ఈ కేసుల విచారణ సివిల్ కోర్టుల్లో సమరీ ట్రయల్ విధానంలో జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారిపై నమోదైన కేసుల మాదిరిగానే ఉంటుంది. గరిష్ట శిక్ష మూడు నెలలు మాత్రమే... ఈ చట్టంలోని అనేక సెక్షన్లు ఉన్నప్పటికీ శిక్షలు మాత్రం చాలా తక్కువ. దాదాపు 90 శాతం ఉల్లంఘనలకు జరిమానా మాత్రమే విధించే ఆస్కారం ఉంది. మిగిలిన వాటిలోనూ గరిష్ట శిక్ష కేవలం 3 నెలలు మాత్రమే. ఈ సెక్షన్లకు సంబంధించిన ఉల్లంఘనల్లోనూ పెనాల్టీ విధించే ఆస్కారం ఉంది. రాష్ట్ర అగ్నిమాపక శాఖ అధికారులు 2014 నుంచి ఇప్పటి వరకు 689 కేసులు నమోదు చేశారు. వీటిలో కనీసం ఒక్క కేసులోనూ ఉల్లంఘనులకు జైలు శిక్ష పడలేదు. 83 కేసులు జరిమానాలతో ముగిసిపోగా... మరో 60 ఆ విభాగమే ఉపసంహరించుకుంది. మిగిలిన వాటిలో 257 కేసులను న్యాయస్థానం రిటర్న్ చేసి మార్పు చేర్పులు సూచించింది. ఇంకో 270 కేసులు ఇప్పటికీ వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించని 665 నిర్మాణాలకు నోటీసులు, తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన మరో 636 మంది యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోనే అత్యధికంగా కేసులు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అగ్నిమాపక శాఖ నమోదు చేసిన కేసుల్లో అత్యధిక హైదరాబాద్‌కు సంబంధించివనే. మొత్తం 689 కేసులకు నగరానికి సంబంధించినవి 325, రంగారెడ్డి 154, వరంగల్ 70, నల్లగొండ 56, ఖమ్మం 36 కేసులు ఉన్నాయి. గతంలో అగ్నిమాపక శాఖకు సొంతంగా ప్రాసిక్యూషన్ సర్వీస్ కూడా ఉండేది కాదు. పంజగుట్టలోని మీన జ్యువెలర్స్‌లో 2006లో జరిగిన అగ్నిప్రమాదం ముగ్గురిని పొట్టన పెట్టుకుంది. ఆ కేసు నుంచి అగ్నిమాపక శాఖ ప్రాసిక్యూషన్ మొదలెట్టింది. అగ్నిమాపక శాఖలో పదవీ విరమణ చేసిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘2000 సంవత్సరం తర్వాత అభివృద్ధి వేగం పుంజుకుంది. దీంతో అనేక భారీ నిర్మాణాలు, భవనాలు వచ్చాయి. వాణిజ్య కార్యకలాపాలూ పెరగడంతో ఉల్లంఘనలు అదే స్థాయిలో జరుగుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఫైర్ సర్వీసెస్ యాక్ట్‌ను మార్చాలి. కఠినమైన నిబంధనలతో పాటు శిక్షలు అమలులోకి తీసుకువస్తేనే అగ్ని ప్రమాదాల్లో అమాయకులు బలికాకుండా ఉంటారు. మీన జ్యువెలర్స్ కేసులో ఆ భవన యాజమాన్యానికి పడిన జరిమానా కేవలం రూ.15 వేలే’ అని అన్నారు. (క్లిక్ చేయండి: హైదరాబాద్ మెట్రో రైలు.. తప్పని తిప్పలు) -
బతుకులు బుగ్గి! అప్పుడు క్రాకర్స్, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికిల్స్..
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలోని దుకాణాలు, కంపెనీలు, సంస్థలు, గోదాముల్లో అగ్ని ప్రమాదాలు కలవరం రేపుతున్నాయి. నాటి కార్తికేయ లాడ్జి, నేటి రూబీ లాడ్జీ ఉదంతాల్లో మాత్రం ఓ సారూప్యత ఉంది. మొదట అగ్ని ప్రమాదం ఈ రెండింటిలోనూ ప్రారంభంకాలేదు. వీటికి కింది అంతస్తుల్లో ఉన్న దుకాణాల్లో మొదలైన అగ్గి లాడ్జీలో బస చేసిన వారి ఉసురు తీసింది. ప్రమాదాలు ఎలా జరిగాయంటే.. ఉస్మాన్‌గంజ్‌లోని ప్రధాన రహదారిపై ఉన్న భవనం గ్రౌండ్ ఫ్లోర్లో శాంతిఫైర్ వర్క్స్ ఉంది. దీని మొదటి అంతస్తులో కెనరా బ్యాంక్ శాఖ ఉండగా... రెండు, మూడు అంతస్తుల్లో కలిపి కార్తికేయ లాడ్జి నడిచేది. ఈ రెండు ఉదంతాల్లోనూ మృతులు బయటి ప్రాంతాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. ఘరానా దొంగ మారుతి నయీం 2002 అక్టోబర్ 23న శాంతి ఫైర్ వర్క్స్‌లో చోరీ చేయడానికి వచ్చాడు. తన కారును అడ్డంగా పెట్టి షట్టర్ పగులకొట్టిన నయీం దుకాణంలోకి ప్రవేశించాడు. అందులో నగదు లభించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురై అక్కడ ఉన్న క్రాకర్స్‌ను నిప్పు పెట్టాడు. అలా మొదలైన మంటలు పై అంతస్తులకు పాకాయి. బ్యాంక్ దగ్ధం కాగా.. కార్తికేయ లాడ్జీలో బస చేసిన వాళ్లు, సిబ్బందితో సహా మొత్తం 12 మంది చనిపోయారు. తాజాగా సోమవారం రాత్రి జరిగిన రూబీ లాడ్జి ఉదంతమూ ఈ కోవకు చెందినదే. దీని సెల్లార్లో ఉన్న ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్‌లో అగ్గి రాజుకుంది. ఈ ధాటికి విడుదలైన మంటలు, పొగ.. పైన ఉన్న లాడ్జీలో బస చేసిన ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్నాయి. మరో 10 మంది క్షతగాత్రులుగా మారారు. (క్లిక్ చేయండి: చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి.. మృత్యువు పిలిచినట్టు..) నగరంలో భారీ అగ్ని ప్రమాదాల్లో మరికొన్ని.. ► 21.10.2006: సోమాజిగూడలోని మీన జ్యువెలర్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో పెయింటింగ్ పని చేయడానికి వచ్చిన వలస కార్మికులు పై అంతస్తులో నిద్రిస్తున్నారు. కింది ఫ్లోర్లో జరిగిన అగ్ని ప్రమాదంతో పెయింట్లు కాలి, విడుదలైన విష వాయువులతో ముగ్గురు చనిపోయారు. ► 24.11.2012: పుప్పాలగూడలోని బాబా నివాస్ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. వాచ్‌మన్‌తో పాటు స్థానికుల అప్రమత్తత కారణంగా దాదాపు మరో పది మంది ప్రాణాలతో బయటపడ్డారు. ► 22.02.2017: అత్తాపూర్‌లోని పిల్లర్ నెం.253 సమీపంలో ఉన్న చిన్నతరహా పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కూలర్ల పరిశ్రమలో మంటలు చెలరేగి ఆరుగురు ఒడిశాకు కార్మికులు చనిపోయారు. ► 23.03.2022: న్యూ బోయగూడ వద్ద శ్రావణ్ ట్రేడర్స్ పేరుతో ఉన్న స్క్రాప్ గోదాంలో సంభవించిన అగ్నిప్రమాదంలో 11 మంది బిహార్ కార్మికులు మృత్యువాత పడ్డారు. (క్లిక్ చేయండి: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం: నిప్పుల్లో నిబంధనలు) -
సికింద్రాబాద్ అగ్నిప్రమాదం: నిప్పుల్లో నిబంధనలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రూబీ ఎలక్ట్రికల్ స్కూటర్స్, రూబీ లాడ్జీలతో కూడిన భవనం నిబంధనల ఉల్లంఘనకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. ఫైర్ సేఫ్టీ మెజర్స్ అతిక్రమించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. భవనం ఏరియా సైతం ఉండాల్సిన విధంగా లేదు. ఈ కారణంగానే సోమవారం రాత్రి చోటు చేసుకున్న అగ్నిప్రమాదం ఎనిమిది మందిని పొట్టనపెట్టుకుంది. ఉల్లంఘనలు ఇలా.. ► భవనం సెల్లార్, గ్రౌండ్ ప్లస్ ఫోర్‌తో పాటు పెంట్ హౌస్‌తో కలిపి మొత్తం ఆరు అంతస్తులు ఉంది. సెల్లార్‌ను నిబంధనలకు విరుద్ధంగా ఈ–బైక్స్ షోరూమ్, సర్వీసింగ్ పాయింట్‌గా మార్చారు. ఈ మొత్తం విస్తీర్ణంలో కనీసం 1/3 వంతు ఖాళీ స్థలం ఉండాలి. ఇది మచ్చుకైనా లేదు. భవనం చుట్టూ ఫైరింజన్ స్వేచ్ఛగా తిరిగేలా ఖాళీ స్థలం ఉండాలి. అరకొర స్థలంలో నిర్మించిన ఈ భవనంలో తూర్పు వైపు రోడ్డు మినహామిస్తే మిగిలిన మూడు దిక్కులూ కనీసం నడిచే స్థలం కూడా లేదు. ► ప్రమాదం జరిగితే బయటపడానికి వెలుపల వైపు స్టెయిర్ కేస్ ఉండాలి. వెలుపల మాట అటుంచితే లోపల ఉన్న ఇంటర్నల్ స్టెయిర్ కేస్ మీటర్ వెడల్పు కూడా లేదు. అత్యవసర సమయంలో వెలిగించేందుకు ఎమర్జెన్సీ లైట్లు, ఆటో గ్లో సిస్టమ్ ఉండాలి. భవనంలో ఎమర్జెన్సీ లైట్లు తగిన సంఖ్యలో లేవు. గ్లో సిస్టమ్ లేనే లేదు. ప్రమాదం జరిగితే అగ్నిమాపక సిబ్బంది కోసం ప్రత్యేక లిఫ్ట్ ఉండాలి. ఇది ఎక్కడా కనిపించలేదు. స్టెయిర్ కేస్ వద్ద ఉన్నది కూడా లాడ్జిలో బస చేసిన వారికీ ఉపయుక్తంగా లేదు. ► మంటలార్పేందుకు ఈ భవనంలో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, వాటర్ పైపులు, స్ప్రింక్లర్స్‌తో పాటు వెట్ రైజర్ తప్పనిసరి. ఇందులో వాటర్ పైపులు, స్ప్రింక్లర్స్ మాత్రం ఉన్నాయి. అవి ఎంత వరకు పని చేశాయన్నది తేలాల్సి ఉంది. విద్యుత్ ఫైర్ అలారం, మాన్యువల్ ఫైర్ అలారం తప్పనిసరి. ఈ రెండూ రూబీ లాడ్జిలో మచ్చుకైనా కనిపించలేదు. ప్రమాదాన్ని పసిగట్టి హెచ్చరించే ఆటోమేటిక్ వ్యవస్థ ఉండాలి. ఇలాంటిది ఎక్కడా కనిపించలేదని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. ► అగ్ని ప్రమాదాల్లో మాత్రమే వినియోగించడానికి ఉపకరించే అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ తప్పనిసరి. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ మాత్రమే ఉంది. దీన్ని సాధారణ వాడకానికి వినియోగిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదాల సందర్భంలో నీటిని సరఫరా చేసేందుకు విద్యుత్, డీజిల్, జాకీ పంప్‌లు ప్రత్యేకంగా ఉండాలి. ఎంత వెతికినా ఇవి ఎక్కడా కనిపించలేదు. నిప్పుల్లో నిబంధనలు అగ్ని మాపక నిబంధనల్లో రూబీ లాడ్జీ యాజమాన్యం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపించింది. ఇలాంటి నిర్లక్ష్యపూరిత నిర్మాణాలు నగరంలో అనేకం ఉన్నాయి. వీటి విషయం అటు పాలకులు, ఇటు అధికారులు ఎవరికీ పట్టడంలేదు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఒకటి రెండు రోజులు హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత కథ షరామామూలే. అనుమతుల్లేని భవనాలు, పై అంతస్తులు నిర్మించుకోవడం, పైస్థాయిలో పైరవీలతో అనుమతులు తీసుకోవడమో, మేనేజ్ చేయడమో నగరంలో సాధారణంగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్ని నిబంధనలు పెట్టినా, చట్టాలు తీసుకువచ్చినా అవన్నీ కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. అన్ని శాఖలు మూకుమ్మడిగా అనుమతి నిరాకరించిన అనేక బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలకు ప్రభుత్వమే వివిధ సందర్భాల్లో అనుమతులు మంజూరు చేసింది. వీటి విషయంలో న్యాయస్థానాలు సైతం పలుమార్లు మొట్టికాయలు వేసినా.. పటిష్ట చర్యలు తీసుకోవడానికి మాత్రం వెనుకడుగు వేస్తోంది. కోఠిలోని పుష్పాంజలి కాంప్లెక్స్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ఈ విషయంలో అందరి కళ్లూ తెరిపించింది. ఆ తర్వాత మీనా జ్యువెలర్స్ ఉదంతంతో అధికార గణం మరింత అప్రమత్తమయ్యామంటూ ఊదరగొట్టింది. ఇవన్నీ కేవలం ఆరంభశూరత్వాలుగానే మిగిలిపోయాయి. ముఖ్యంగా నగరంలో ఉన్న అని భవనాలను సందర్శించి ఫైర్ సేఫ్టీ మెజర్స్ పరీక్షిస్తామని, నిబంధనల ప్రకారం లేని వాటి యజమానులను చైతన్య పరుస్తామని, ఆ తర్వాత కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు అనేక సందర్భాల్లో ప్రకటించారు. కొన్ని రోజులు గడిచాక ఈ విషయాలనే మర్చిపోతున్నారు. గతంలో అధికారులు నిర్వహించిన సర్వేలో ఇలాంటి భవనాలు నగరంలో వేల సంఖ్యలో ఉన్నాయని బయటపడింది. అయినా ఇప్పటికీ వీటిపై తీసుకున్న సరైన చర్యలు లేవు. అందుకే ఎక్కడపడితే అక్కడ అక్రమ భవనాలు వెలుస్తున్నాయి. సోమవారం నాటి రూబీ లాడ్జి అగ్ని ప్రమాదంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఇకనైనా అధికారులు కఠినంగా వ్యవహరించి సరైన చర్యలు తీసుకోకపోతే... అనేక మంది అమాయకుల ప్రాణాలు బలి కావాల్సిందే. (క్లిక్ చేయండి: చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి.. మృత్యువు పిలిచినట్టు..) -
చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి.. మృత్యువు పిలిచినట్టు..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ అగ్ని ప్రమాద మృతులతో గాంధీ మార్చురీ వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. మూడు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వాయుమార్గంతో పాటు ప్రత్యేక అంబులెన్స్‌ల్లో స్వస్థలాలకు తరలించారు. మిగిలిన అయిదు మృతదేహాలకు సంబంధించి ఆయా వ్యక్తుల సంబంధీకుల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించగా, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడీ కృపాల్‌సింగ్‌ల నేతృత్వంలో మూడు వైద్య బృందాలు పోస్టుమార్టం విధులు నిర్వహించారు. విషవాయువుల వేడి పొగతోనే.. బ్యాటరీలకు మంటలు అంటుకుని కెమికల్ టాక్సిన్స్ (విష వాయువులు)తో కూడిన వేడి పొగ పీల్చడం వల్లే ఊపిరి అందక మృతి చెందినట్లు ఫోరెన్సిక్ వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతదేహాల ఊపిరితిత్తులకు అంటుకున్న పొగతో కూడిన విషవాయువు (స్మాగ్) కడుపు, ఇతర అవయవాల నుంచి నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్లు గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. మృత్యువు పిలిచినట్టు.. విజయవాడకు చెందిన అల్లాడి హరీష్‌ను మృత్యువు పిలిచిందని ఆయన స్నేహితుడు శ్రీనివాస్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈక్వటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో పనిచేస్తున్న హరీష్ ట్రైనింగ్ నిమిత్తం నగరానికి వచ్చే ముందే సికింద్రాబాద్ మినర్వా గ్రాండ్ లాడ్జీలో బస చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి ప్రమాదంలో మృతి చెంది కానరాని లోకాలకు వెళ్లిపోయాడని భోరున విలపించారు. మృతునికి భార్య కావ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు పన్నెండు రోజుల క్రితమే జన్మించాడు. మార్చురీలో హరీష్ మృతదేహాన్ని చూసి ఆయన తండ్రి కోటేశ్వరరావు రోదనలు కలచివేశాయి. చెన్నై నుంచి వచ్చి.. మృత్యువాత విధి నిర్వహణలో భాగంగా చెన్నై నుంచి నగరానికి వచ్చి రూబీ లాడ్జీలో బస చేసి అగ్నిప్రమాదంలో మృతి చెందారు ఆచీ మసాల సంస్థ ఉద్యోగులు బాలాజీ, సీతారామన్‌లు. ఆచీ మసాల ఆడిటర్ బాలాజీ, రీజనల్ సేల్స్ మేనేజర్ సీతారామన్‌లు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించి, రాత్రి 8 గంటలకు లాడ్జీకి వచ్చి అగ్ని ప్రమాదంలో అసువులు బాశారని ఆచీ మసాల స్థానిక సేల్స్ మేనేజర్ మహేందర్ కన్నీటి పర్యంతమయ్యారు. బాలాజీ, సీతారామన్‌ల మృత దేహాలను విమానంలో చెన్నైకి తరలించారు. ఢిల్లీకి చెందిన అన్నదమ్ములు... ఢిల్లీకి చెందిన సందీప్ మాలిక్, రాజీవ్ మాలిక్‌లు అన్నదమ్ములు. ఆలివ్ కంపెనీలో శిక్షణ కోసం సిటీకి వచ్చి రూబీ లాడ్జీలో బస చేసి మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న మృతుల బంధువులు నగరానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదం జరగడానికి కొన్ని నిమిషాల ముందే ఆ లాడ్జి మొదటి అంతస్తులోని రూమ్ నుంచి చెక్ఔట్ చేసిన ముగ్గురు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. (క్లిక్ చేయండి: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనకు కారణం అదే) -
రూబీ కేసులో పోలీసులు దూకుడు.. ఫామ్ హౌస్‌లో నిందితులు అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నలుగురు నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో రంజిత్ సింగ్, సుమిత్ సింగ్‌తోపాటు మేనేజర్, సూపర్వైజర్ ఉన్నారు. కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న తండ్రీకొడుకులు మేడ్చల్ ఫాంహౌస్‌లో తలదాచుకున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి వారిని అరెస్ట్ చేశారు. అంతటా నిర్లక్ష్యమే.. భవన నిర్మాణ లోపాలు, అగ్నిమాపక పరికరాల నిర్వహణలో పొరపాట్లు ఘోర ప్రమాదానికి కారణలయ్యాయి. మంటలు చెలరేగినప్పుడు.. ఫోమ్ సిలిండర్లు ఉపయోగించి సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేసినా అవి పని చేయలేదు. ఇలాంటి బ్యాటరీ ప్రమాదాలు సంభవించినప్పుడు నీటి బదులు.. వాడాల్సిన ఏబీసీ పౌడర్ అందుబాటులో లేదు. ద్వారాలు లేవు.. సెల్లార్‌ను పార్కింగ్‌కోసం కాఉండా కమర్సియల్ కార్యకలాపాలకు వాడారు. అసలు లాడ్జి ఎన్వోసీ కూడా సరిగా లేకపోవడం, అధికారులు స్పందన పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక, ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.3 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. ఇక, అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ప్రధాని కార్యాలయం మంగళవారం ట్వీట్ చేసింది. -
Secunderabad Fire Tragedy: బ్యాటరీ పేలుడు వల్లే..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రూబీ ఎలక్ట్రికల్ స్కూటర్స్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదానికి ఈ–స్కూటర్ బ్యాటరీ పేలడమే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదం కారణంగా వెలువడిన దట్టమైన పొగ ప్రభావంతోనే లాడ్జీలో బస చేసిన వాళ్లు చనిపోయినట్లు తేల్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో క్షతగాత్రుడు మంగళవారం మృతిచెందాడు. దీంతో ఈ దుర్ఘటనలో కన్నుమూసిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. అగ్నిప్రమాదం జరిగిన హోటల్, విద్యుత్ ద్విచక్ర వాహనాల షోరూమ్ నిర్వహిస్తున్న రాజేందర్‌సింగ్ బగ్గా, సుమిత్ సింగ్లతోపాటు మరికొందరిపై మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని మంగళవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సెల్లార్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు.. హైదరాబాద్‌లోని కార్ఖానా ప్రాంతానికి చెందిన రాజేంద్రసింగ్ బగ్గా, సుమీత్‌సింగ్ కొన్నేళ్లుగా సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ రోడ్డులో రూబీ ప్రైడ్ లగ్జరీ హోటల్ పేరుతో లాడ్జి నిర్వహిస్తున్నారు. అలాగే రెండేళ్ల క్రితం ఈ–స్కూటర్స్, బైక్స్ వ్యాపారంలోకి దిగారు. ఓ సంస్థకు చెందిన ఈ–స్కూటర్స్ డీలర్షిప్ తీసుకొని షోరూం, సర్వీసింగ్ సెంటర్లను లాడ్జి గ్రౌండ్‌ఫ్లోర్, సెల్లార్లో అక్రమంగా ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్, ఈ–స్కూటర్స్ కార్యాలయం, మొదటి అంతస్తు నుంచి నాలుగో అంతస్తు వరకు మొత్తం 28 గదులు ఉన్నాయి. ఐదో అంతస్తులోని పెంట్ హౌస్‌లో రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. చార్జింగ్ పెట్టిన బ్యాటరీ పేలడంతో... సోమవారం రాత్రి 9:17 గంటలకు సెల్లార్‌లోని ఈ–స్కూటర్స్ సర్వీసింగ్ పాయింట్లో చార్జింగ్ పెట్టి ఉంచిన ఈ–స్కూటర్ బ్యాటరీ పేలడంతో మంటలు అంటుకున్నాయి. ఇవి మిగతా వాహనాలకు, నిల్వఉంచిన టైర్లు, ప్లాస్టిక్, రబ్బర్ వస్తువులకు అంటుకోవడంతో మంటలతోపాటు దట్టమైన పొగ, విషవాయువులు వె లువడ్డాయి. ఆ సమయంలో లాడ్జీలో 25 మంది అతిథులు, 8 మంది ఉద్యోగులు ఉన్నారు. మెట్లమార్గం సెల్లార్ వరకు ఉండటంతో... ఈ భవనాన్ని సరైన వెంటిలేషన్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడం, ఐదో అంతస్తు నుంచి సెల్లార్ వరకు నిర్మించిన మెట్ల మార్గం మీటర్ కంటే తక్కువ వెడల్పుతో ఇరుకుగా ఉండటంతో ప్రమాద సమయంలో అదే చిమ్నీ గొట్టంలాగా మారిపోయింది. సెల్లార్ నుంచి విషవాయువులు, నల్లటి పొగ దీని ద్వారానే లాడ్జి మొత్తం వ్యాపించాయి. గ్రౌండ్ ఫ్లోర్లో స్టెయిర్ కేస్‌కు, రిసెప్షన్‌కు మధ్య తలుపు మూసి ఉండటంతో పొగ బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. పొగను గమనించిన సిబ్బంది బయటకు పరుగులు తీయగా మొదటి, రెండో అంతస్తుల్లో బస చేసిన వారిలో నలుగురు గదుల్లోనే, మరో ముగ్గురు మెట్ల మార్గంలో ప్రాణాలు విడిచారు. మరో 9 మంది అస్వస్థతకు గురయ్యారు. మూడు, నాలుగో అంతస్తుల్లో బస చేసిన కొందరిని స్థానికులు, పోలీసులు.. అగ్నిమాపక అధికారులు కాపాడారు. పెంట్‌హౌస్‌లోని రెస్టారెంట్లో భోజనం చేస్తున్న నలుగురు పక్క భవనం టెర్రస్‌పైకి చేరుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. భవనానికి స్ప్రింక్లింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినా సెల్లార్లో అది పనిచేసిన ఆనవాళ్లు కనిపించలేదు. విషవాయువులు పీల్చడం వల్లే మృతుల సంఖ్య పెరిగిందని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు వివరించారు. మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున పరిహారం సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదానికి బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.3 లక్షల నష్టపరిహారం ప్రకటించారని హోం మంత్రి తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత దట్టమైన పొగ వ్యాపించడంతో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఘటనపై పోలీస్, అగ్నిమాపక శాఖలు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాయని, అన్ని కోణాలలో పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఆదేశించామని హోం మంత్రి వెల్లడించారు. కేంద్రం రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా సాక్షి, న్యూఢిల్లీ: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ప్రధాని కార్యాలయం మంగళవారం ట్వీట్ చేసింది. (క్లిక్ చేయండి: చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి.. మృత్యువు పిలిచినట్టు..) -
రూబీ లాడ్జి విషాదంపై కీలక రిపోర్ట్.. నివేదికలో షాకింగ్ విషయాలు
సాక్షి, హైదరాబాద్: రూబీ లాడ్జి విషాద ఘటనపై ఫైర్ డిపార్ట్మెంట్ నివేదిక విడుదల చేసింది. మూడు పేజీల రిపోర్ట్‌లో కీలక విషయాలను వెల్లడించింది. లీథియం బ్యాటరీల పేలుళ్ల వల్ల దట్టమైన పొగలు వ్యాపించాయని, పొగలు వల్ల భవనంలోకి వెళ్లలేకపోయామని ఫైర్ డిపార్ట్మెంట్ తెలిపింది. భవనానికి సింగిల్ ఎంట్రీ, ఎగ్జిట్ మాత్రమే ఉంది. లిప్ట్ పక్కన మెట్లు ఏర్పాటు చేయకూడదనే నిబంధన ఉన్నా పట్టించుకోలేదని నివేదికలో పేర్కొంది. చదవండి: రూబీ లాడ్జి ప్రమాదం: ఇలాంటి కాంప్లెక్స్లెన్నో? అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసినా అవి పనిచేయలేదు. భవనం మొత్తం కూడా క్లోజ్డ్ సర్క్యూట్లో ఉండిపోయింది. భవనానికి కనీసం కారిడార్ కూడా లేదు. ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేయలేదు. భవన, హోటల్ యజమాని నిర్లక్ష్యంతోనే అగ్ని ప్రమాదం జరిగింది. సెల్లార్లో మొదటిగా అగ్ని ప్రమాదం మొదలైంది.తర్వాత మొదటి అంతస్తు వరకు మంటలు వ్యాపించాయని నివేదికలో ఫైర్ డిపార్ట్మెంట్ పేర్కొంది. -
రూబీ లాడ్జి ప్రమాదం: ఇలాంటి కాంప్లెక్స్లెన్నో?
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని రూబీ లాడ్జిలో జరిగిన అగ్నిప్రమాద ఘటన.. నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని లేవనెత్తుతోంది. ఇప్పటికే ఈ భవనం ఓనర్ రంజిత్ సింగ్ బగ్గాను నార్త్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే.. రూబీ లాడ్జి బిల్డింగ్ అనుమతులపైనే ఇప్పుడు ప్రముఖ చర్చ నడుస్తోంది. తక్కువ స్పేస్‌లో అంత బిల్డింగ్ ఇరుక్కుగా కట్టడం, వాటికి అనుమతులు ఎలా దక్కాయన్న కోణంలోనూ ఘటనస్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యంగా ఫైర్ ఎన్ఓసీ(నో అబ్జక్షన్సర్టిఫికెట్)పై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. రెండు అంతస్తుల వరకే జీహెచ్ఎంసీ నుంచి ఫైర్ ఎన్ఓసీ తీసుకున్న రూబీ లాడ్జి.. మిగిలిన రెండు ఫ్లోర్లకు ఎలాంటి ఫైర్ అనుమతులు తీసుకోలేదన్నది సమాచారం. పైగా ఒకే భవనంలో.. పైన లాడ్జీ, కింద ఈ-బైక్ షోరూం, సెల్లార్లో ఈ-బైక్స్ నిర్వాహణ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందన్న కోణంలోనూ విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. లాడ్జీ సెల్లార్లో గ్యాస్ సిలిండర్లు సైతం నిల్వ చేయడం విస్మయానికి గురి చేస్తోంది. ఇక లాడ్జికి ఒకటే ఎంట్రీ, ఎగ్జిట్ మార్గం కావడంతో అప్పటికే పొగలో చిక్కుకున్న వాళ్లకు ఇబ్బందికరంగా మారిందని అధికారులు గుర్తించారు. జంట నగరాల్లో ఈ తరహా కాంప్లెక్స్‌లు వందల్లో ఉండొచ్చని వాదన బలంగా వినిపిస్తోంది. కమర్షియల్ కాంప్లెక్స్ అయినప్పటికీ అగ్ని ప్రమాద నివారణ చర్యలు లేకపోవడం ఒక ఎత్తైతే.. నిరంతరం తనిఖీలు చేయని అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు చెలరేగుతున్నాయి. భవనం పద్దెనిమిది మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉంటేనే ఫైర్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తుందని ఫైర్ డిజి సంజయ్ జైన్ చెప్పడం మరోవైపు జీహెచ్ఎంసీ, ఫైర్ డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయ లోపం ఉండడం.. పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. వెరసి.. నిర్లక్ష్యం కారణంగానే ఎనిమిది ప్రాణాలు బుగ్గి అయ్యాయన్నది చేదు వాస్తవం. ఇప్పటికైనా అధికారులు మేల్కొని.. ముందు ముందు అనుమతుల విషయంలో కఠినంగా ఉండాలని, ఇప్పటికే ఉన్న ఇలాంటి భవనాలపై దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. ఆ ఇద్దరు ఫోన్లో ఉండగా.. పని నిమిత్తం వచ్చిన ఇద్దరు ఆచి మసాలా ఉద్యోగులు రూబీ ప్రమాదంలో మరణించడం బాధాకరం. కంపెనీలో ఆడిటర్ అయిన సీతారామన్, మార్కెటింగ్ ఉద్యోగి అయిన బాలాజీ.. నిన్న(సోమవారం) రూబీ లాడ్జ్ లో దిగారు. సీతారామన్ వాళ్ల బ్రదర్ తో ఫోన్లో మాట్లాడిన పది నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగింది. ఇక బాలాజీ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులకు కాల్ చేసి హెల్ప్, హెల్ప్ అంటూ కేకలు వేశారు. అయితే.. ఆ పొగలోనే ఆయన ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. ఆందోళనతో కుటుంబ సభ్యులు రూబీ రిసెప్షన్‌కు కాల్ చేయగా.. అప్పటికే ఆయన చనియారు. ఇదీ చదవండి: రూబీ లాడ్జి.. బిడ్డ పుట్టిన ఆనందం ఆవిరి -
రూబీ లాడ్జి ప్రమాదం: అంత ఘోరం ఎలా జరిగింది?
సాక్షి, హైదరాబాద్: ఎనిమిది మంది టూరిస్టుల ప్రాణాలు బలిగొన్న సికింద్రాబాద్ రూబీ అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు ఉన్నతాధికారులు. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఎనిమిది మంది మరణించగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.పెను విషాదం నింపిన ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో.. రూబీ లాడ్జి ఘటనపై గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. లాడ్జి ఓనర్ రంజితసింగ్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. లాడ్జిలో దిగనవాళ్లు.. కాలిన గాయాలతో పాటు ఊపిరాడక మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చారు. గాంధీతో పాటు మరో రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుల ఫోన్ నెంబర్ల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నారు పోలీసులు. ఆర్డీవో ఆద్వర్యంలో గాంధీ ఆస్పత్రిలో మృతదేహాలకు పంచనామా నిర్వహిస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణం? ఇక ప్రమాద సమయంలో కాంప్లెక్స్‌లో 30 మందితో పాటు ఎనిమిది మంది సిబ్బంది ఉన్నట్లు తేలింది. అయితే ప్రమాదానికి ఈ-బైక్ బ్యాటరీ పేలుడే కారణమా? లేదంటే విద్యుత్ షాట్ సర్క్యూటే కారణమా? అనే విషయాలపై ఎమ్మార్వో, రెవెన్యూ అధికారులు ఆరాలు తీస్తున్నారు. సెల్లార్ లో నిబంధనలకు విరుద్ధంగా ఎలక్ట్రిక్ బైక్ సెంటర్ ఉండడం, అలాగే.. లాడ్జి వున్న చోట.. ఎలక్ట్రిక్ బైక్స్ నిర్వాహణకు ఎలా అనుమతి ఇచ్చారని కిందిస్థాయి అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పటికే ఘటనా స్థలంలో క్లూస్ టీం క్లూస్ సేకరించాయి. మరోవైపు కాంప్లెక్స్‌లో అగ్నిమాపక శాఖ నిబంధనలు(ఫైర్ సేఫ్టీ రూల్స్) ఏ మాత్రం లేవని గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో తప్పించుకునేందుకు దారులు లేవని, బిల్డింగ్ మొత్తానికి ఒకే దారి ఉండడం వల్లే ఘోరం జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. మెట్ల మార్గం గుండా కిందకు రాలేక.. దట్టమైన పొగ, మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. సాయంత్రకల్లా ప్రమాదంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: రూబీ లాడ్జి ప్రమాదంపై ఫైర్ అధికారి ఏమన్నారంటే.. -
సికింద్రాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. పలువురి మృతి
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): ఉవ్వెత్తున ఎగిసిన మంటలు.. దట్టమైన పొగ.. వివిధ పనుల మీద నగరానికి వచ్చి లాడ్జీలో బస చేసినవారు ఉక్కిరిబిక్కిరయ్యారు. మిగతావారు ఎలాగో తప్పించుకునా ఏడుగురు కాలినగాయాలు, పొగతో ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నట్టు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. 13 మంది గాయపడినట్లు సమాచారం కాగా వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘోర దుర్ఘటన సోమవారం రాత్రి సికింద్రాబాద్‌లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రి సేద తీరుతుండగా..: ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. సెయింట్ మేరీస్ రోడ్డులోని మనోహర్ థియేటర్ ఎదురుగా రంజిత్ సింగ్ బగ్గా అనే వ్యక్తి రూబీ ఎలక్ట్రికల్ స్కూటర్స్ పేరుతో బైక్‌ల షోరూమ్ నిర్వహిస్తున్నా రు. ఈ షోరూమ్ సెల్లార్లో ఉండగా, ఆపై నాలుగు అంతస్తుల్లో రూబీ డీలక్స్ హోటల్‌ను నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో సెల్లార్‌లోని షోరూమ్ నుంచి మంటలు చెలరేగాయి. ఇందులో ఎలక్ట్రికల్ బైక్‌ల బ్యాటరీలు పేలి భారీ శబ్దాలతో పాటు మంటలు వ్యాపించాయి. నాలుగు అంతస్తుల్లోని లాడ్జీ గదుల్లోకి మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన కొంతమంది హోటల్ గదుల నుంచి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. కొందరు మాత్రం దట్టమైన పొగల కారణంగా బయటకు రాలేక గదుల్లో చిక్కుకుపోయారు. లాడ్జీలో 23 మంది..: హోటల్లో వ్యాపారాల నిమిత్తం ఉత్తర భారత దేశం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు 23 మంది ఉన్నట్లు తేలింది. దట్టమైన పొగలు పైన ఉన్న గదుల్లోకి వ్యాపించడంతో చాలామంది పై నుంచి కిందకు దిగేందుకు వీలులేకుండా పోయింది. ఓ మహిళతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు డ్రైనేజీ పైప్‌ల ద్వారా నాలుగు, మూడో అంతస్తుల నుంచి కిందకు దిగారు. వీళ్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అలాగే దీన్ని ఆనుకుని ఉండే యాత్రి ఇన్ హోటల్ మీదుగా మరికొంత మంది ప్రాణాలతో బయట పడ్డారు. వీరికి సైతం ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో గాలి తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. ఫైర్ సిబ్బంది స్నారికల్ వాహనం ద్వారా కొంత మందిని కిటికీల నుంచి బయటకు రప్పించి రక్షించారు. ఒక మహిళతో పాటు మరో ముగ్గురు గదుల్లో అపస్మారక స్థితిలో పడిఉండగా బయటకు తీసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. కాలిన గాయాలైన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించగా మిగతా వారిని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. మార్కెట్ పోలీసులు, సికింద్రాబాద్ ఫైర్ స్టేషన్ సిబ్బంది, డీఆర్ఎఫ్ సిబ్బంది, పెద్దసంఖ్యలో స్థానికులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాధితులు కిటికీల నుంచి హెల్ప్ హెల్ప్ అని అరుస్తుండగా అక్కడికి చేరుకున్న స్థానికులు వారికి నిచ్చెనలు అందించి, పైప్‌ల ద్వారా దిగేలా సహాయం చేశారు. మరికొంత మంది పొగలోనే లోపలికి వెళ్లి గదుల్లో ఉండే వారిని బయటకు తీసుకుని వచ్చారు. అగ్ని ప్రమాద ఘటన తెలియగానే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హోంమంత్రి మహమూద్ అలీ కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు. అంతా క్షణాల్లోనే: కేశవులు, చెన్నై చెన్నై నుంచి వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ వచ్చాను. రాత్రి 9 గంటలకు హోటల్లో దిగాను. అంతలోపే ప్రమాదం జరిగింది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. స్థానికుల సహాయంతో 4వ అంతస్తు నుంచి పైౖౖపులు పట్టుకుని కిందకు దిగాను. ఇది మరో జన్మ: ఉమేష్ ఆచార్య, ఒడిశా ఒడిశా నుంచి ఆఫీస్ పనిమీద హైదరాబాద్ వచ్చాను. 4వ అంతస్తులో ఉన్నాను. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసింది. మెట్ల నుంచి వెళ్లే అవకాశం కనిపించలేదు. వెంటనే ప్రాణాలు కాపాడుకోవాలంటే పైపులు పట్టుకుని దిగాలని «ధైర్యం చేశా. పైపులు పట్టుకుని కిందికి దిగాను. ఇది నాకు మరో జన్మ. పొగ పీల్చుకోవడంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. ఇదీ చదవండి: మళ్లీ.. గోదావరి ఉగ్రరూపం -
చూపులు కలవని శుభవేళ
అమ్మాయి కాఫీ ఇచ్చింది. అబ్బాయి కాఫీ తాగాడు. కాఫీ ఇస్తున్నప్పుడు.. అమ్మాయి అబ్బాయిని చూళ్లేదు! కాఫీ తాగుతున్నప్పుడైనా.. అబ్బాయి అమ్మాయిని చూళ్లేదు! ఇంకేం కలుస్తాయి చూపులు! చూపులు కలవలేదు కానీ... కాఫీ కలుపుతున్నప్పుడు అమృత ఘడియలేవో ఉన్నట్లున్నాయి. నలభై ఏళ్లయింది చిరంజీవి, సురేఖల పెళ్లయి. కలవని ఆ కాఫీ చూపులే.. వీళ్ల పెళ్లికి శుభలేఖలు. ► మీ ‘శుభలేఖ రాసుకున్న ఎదలో..’ పాట సూపర్ హిట్. మరి.. రియల్ లైఫ్‌లో శుభలేఖ రాసుకున్న విశేషాల గురించి? చిరంజీవి: నాకు నేనుగా బలి పశువును అయిన రోజు గురించేగా (నవ్వుతూ). ఓ సాయంత్రం నేను చైౖన్నై కోడంబాకం బ్రిడ్జ్ మీద నా కారులో వెళుతుంటే, నా బి.కామ్ క్లాస్మేట్ సత్యనారాయణ కనిపించాడు. ఇక్కడ ఉన్నావేంటి? అని అడిగితే, మా పెదనాన్నగారింటికి వచ్చాను అన్నాడు. నా కారులో దింపేస్తాను రమ్మన్నాను. వాళ్ల పెదనాన్న ఎవరో కాదు... అల్లు రామలింగయ్యగారు. అప్పటికే నేను నటించిన ఓ మూడు సినిమాలు విడుదలయ్యాయి. ‘రామలింగయ్యగారు నీతో పాటు ‘మనవూరి పాండవులు’లో యాక్ట్ చేశారుగా.. ఇంట్లోకి రా’ అన్నాడు. అయితే రామలింగయ్యగారు లేరు. కాఫీ తాగి వెళుదువు గాని అన్నాడు. అదే నేను లాక్ అయిన మొదటి స్టెప్. ► ఎలా లాక్ అయ్యారు? చిరంజీవి: ఆ కాఫీ పెట్టింది సురేఖ. తను నన్ను చూళ్లేదు, నేను తనని చూళ్లేదు (భార్యని చూస్తూ.. ‘ఆ కాఫీలో ఏం వశీకరణ మంత్రం కలిపావు’). ఆ తర్వాత ఆ అబ్బాయి ఎవరు? అని తను అతన్ని అడిగితే ‘మా క్లాస్మేట్. ‘మనవూరి పాండవులు’ లో నటించాడు’ అని చెప్పాడు. ‘వాళ్లు ఏమిట్లట. మనిట్లేనట’ (ఇద్దరూ పెద్దగా నవ్వుతూ) అంది. తర్వాత అల్లు అరవింద్ గారు, ఇతర కుటుంబ సభ్యులు నా గురించి డిస్కషన్ మొదలుపెట్టారు. అల్లు రామలింగయ్యగారికేమో వాళ్లమ్మాయిని ఓ ఐ.ఏ.ఎస్ ఆఫీసర్‌కిచ్చి చెయ్యాలనుండేది. కానీ, ఎందుకు ప్రయత్నం చేయకూడదని అరవింద్‌గారు నా గురించి ఎంక్వయిరీ ప్రారంభించారు. ‘తను ఆంజనేయస్వామి భక్తుడు, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, బాగా చదువుకున్నాడు, చాలా కష్టపడతాడు. అతని చేతిలో మంచి సినిమాలు కూడా ఉన్నాయి’ అని నా గురించి గుడ్ సర్టిఫికెట్ ఇచ్చాడు నా ఫ్రెండ్. నాకు ఇప్పుడు పెళ్లేంటి? అన్నాను నేను. మేకప్‌మేన్ జయకృష్ణ ‘మన వూరి పాండవులు’ నిర్మాత. రామలింగయ్యగారి ఫ్యామిలీకి చాలా దగ్గరివారు. ఆయన రామలింగయ్యగారిని కన్విన్స్ చేశారు. ఓకే అనడానికి ముందు ఓ పదిమంది నిర్మాతలను నా గురించి అడిగి సలహా తీసుకున్నారట రామలింగయ్యగారు. అందరూ నా గురించి మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. దాంతో నన్ను లాగి బుట్టలో పడేశారు. నాది పెళ్లి వయసు కాదని కరాఖండీగా చెప్పాను. కానీ, జయకృష్ణగారు మా నాన్నగారితో ‘అబ్బాయి వేరే ఆకర్షణలకి లోనవుతాడేమో’ అని చెప్పారేమో నాన్న భయపడిపోయి ‘నేను అబ్బాయిని ఒప్పిస్తా’ అన్నారు. పెళ్లి చూపులకు రానన్నాను. బలవంతంగా తీసుకెళ్లారు. ► సురేఖగారూ.. మీ నాన్న చెప్పారని మీరు చిరంజీవిగారిని పెళ్లి చేసుకున్నారా? సురేఖ: ‘మన వూరి పాండవులు’ చూసి ‘ఈ కళ్లబ్బాయి ఎవరో బావున్నాడు’ అనుకున్నాను. కళ్లు పెద్దగా, గుండ్రంగా ఉంటాయి కదా. మా అమ్మ యాక్టర్‌ను చేసుకుంది. నేనూ యాక్టర్‌ను చేసుకుం టే బాగుంటుందనుకున్నా. అందుకే సరే అన్నాను. ► మీ ‘అందరివాడు’ సినిమాలో పెళ్లిచూపుల సీన్ చాలా బావుంటుంది. మీ పెళ్లి చూపుల సీన్? చిరంజీవి: మమ్మల్ని మాట్లాడుకోమని పెద్దవాళ్లందరూ బయటకు వెళ్లారు. తను బీఏ చదువుకుందని తెలిసినా ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని ఏం చదువుకున్నారు? అని అడిగాను. ఆ తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదు. అంతకుముందు నాకు అమ్మాయిలతో పెద్దగా పరిచయాలు కూడా లేవు. సురేఖ పొందిక చూసి ‘ఈ అమ్మాయినే చేసుకోవాలి’ అనుకున్నాను. మా అమ్మకి కూడా తను నచ్చింది. నాన్నగారైతే ‘ఏం కళరా ఆ అమ్మాయిది. పెళ్లి చేసుకో’ అన్నారు. సురేఖ: మామయ్యగారు చనిపోయేంతవరకు నన్నెప్పుడూ పేరు పెట్టి పిలవలేదు. ‘అమ్మా’ అనేవారు. నన్ను ఒక్క మాట కూడా పడనిచ్చేవారు కాదు. అంత బాగా చూసేవారు. ► అవునూ... మీ పెళ్లి చూపులకు, పెళ్లికి ఎంత గ్యాప్ వచ్చింది? సురేఖ: మూడు నెలలు. ► ఆ మూడు నెలల్లో కలుసుకున్నారా? ఫోన్లు మాట్లాడుకోవడం? చిరంజీవి: పెళ్లి కాకముందు మాట్లాడటం, తిరగటం తప్పని మనసులో పడిపోయింది. తనదీ అలాంటి ఫీలింగే. అయితే ఒకసారి మాట్లాడాలనిపించింది. అప్పుడు ల్యాండ్ ఫోన్లే కదా. ఫోన్ చేస్తే తనే తీసింది. ‘హలో.. నేను చిరంజీవి’ అన్నాను. ‘నేను సురేఖనండీ. ఫోన్ ఎవరికివ్వమంటారు’ అంది. అంతే... నాతో కనీసం రెండు మాటలు కూడా మాట్లాడకుండా ఎవరికివ్వమంటారు అందని నా అహం దెబ్బతింది. ‘మీ అన్నయ్య ఉన్నాడా’ అన్నాను. ‘లేరండీ’ అంది. ‘వచ్చాక నేను ఫోన్ చేశానని చెప్పు’ అని పెట్టేశాను. సురేఖ: అప్పుడప్పుడూ అన్నయ్యతో పెళ్లి తేదీ గురించి మాట్లాడేవాళ్లు. అందుకని అన్నయ్యతో మాట్లాడటం కోసమే ఫోన్ చేశారనుకున్నాను. నా గురించి చేశారనుకోలేదు (నవ్వుతూ). ► సరే.. హనీమూన్ విశేషాలు? చిరంజీవి: హనీమూన్ పక్కన పెట్టండి. పెళ్లికే టైమ్ దొరకలేదు. పెళ్లికి ఫిబ్రవరిలో మంచి ముహూర్తాలున్నాయంటే సరే అనుకున్నాం. అప్పుడు ‘తాతయ్య ప్రేమ లీలలు’ అనే సినిమా చేస్తున్నాను. ఆ చిత్రానికి యం.ఎస్ రెడ్డిగారు నిర్మాత. అందులో నూతన్‌ప్రసాద్ కాంబినేషన్లో నా సీన్లు ఉన్నాయి. ‘ఆయన చాలా బిజీ ఆర్టిస్ట్, డేట్స్ దొరకవు.. మీరు మే నెలలో పెళ్లి చేసుకోండి’ అని రెడ్డిగారు అన్నారు. ‘మీరు ఓకే అంటే ఫిబ్రవరిలో, లేదంటే తర్వాత చేసుకుంటాను’ అన్నాను. అరవింద్ ఏమో ‘ఓ మూడు రోజులు ఇవ్వండి’ అని పట్టుబట్టాడు. నా సినిమా టైమ్‌లో మా హీరో పెళ్లి చేసుకున్నాడులే అనుకొని ఏ నిర్మాత అయినా ఆనందంగా ఒప్పుకుంటారు. కానీ, రెడ్డిగారు ఒప్పుకోలేదు. అప్పుడు అల్లు అరవింద్ ‘మీ డేట్లు మళ్లీ మీకు ఇప్పిస్తాను. కాంబినేషన్ గురించి మీకేం భయం లేదు. నేనూ ఇండస్ట్రీలోనే ఉన్నాను కదా. మేం చిరంజీవిని తీసుకెళ్లిపోతున్నాం’ అన్నారు. అలా అనుకున్న ముహూర్తానికే పెళ్లయింది. ► మరి పెళ్లి బట్టల షాపింగ్‌కి టైమ్ దొరికిందా? చిరంజీవి: పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు చొక్కా చిరిగిపోయింది. సురేఖ మార్చుకోమంటే ‘ఏం.. బట్టలు చిరిగితే తాళి కట్టలేనా’ అని, అలాగే కట్టేశాను. అయితే అప్పటికే నాకు ఏడెనిమిది పెళ్లిళ్లు చేసుకున్న అనుభవం ఉంది (ఇద్దరూ పెద్దగా నవ్వుతూ). అంటే సినిమాల్లో.. ► పెళ్లయ్యే నాటికే మీకు వంట వచ్చా? సురేఖ: రాదండీ. ఒకరోజు ఉప్మా చేస్తే ఉండలు, ఉండలుగా వచ్చింది. అప్పుడు ఆయనే ఉప్మా చేయడం నేర్పించారు. ఆయన మేనత్త, అమ్మమ్మ మాతోనే ఉండేవారు. వాళ్లు వండేవారు. ► భర్త మేనత్త, అమ్మమ్మ, అమ్మానాన్న, తమ్ముళ్లు (నాగబాబు, పవన్ కల్యాణ్) ఇంతమందితో ఉండాలంటే ప్రైవసీ ఉండదేమో అనిపించిందా? సురేఖ: మా ఇంట్లో ఎప్పుడూ చుట్టాలుండేవారు. అదే సందడి ఈ ఇంట్లోనూ ఉండేది. లేకపోతే ఒంటరితనం అనిపించేది. ఈయన ఉండేవారు కాదు. అందరూ కలిసి ఉండటంతో నాకు సెక్యూరిటీ ఉండేది. వాళ్లే వంటలు చేసి, నాకు, ఆయనకి, అందరికీ పెట్టేవారు. పిల్లలందరూ ఉండటంతో బావుండేది. చిరంజీవి: సురేఖ తమ్ముడు ఉండేవారు. అతను చనిపోయారు. నా తమ్ముళ్లిద్దరిదీ వాళ్ల తమ్ముడి వయసు. వీళ్ల మీద సురేఖకు ఆ ఎఫెక్షన్ ఉండటానికి కారణం అదే. మనం ఎలా ఉంటే అవతలివాళ్లు మనతో అలా ఉంటారు. సురేఖ అందరితో బాగుంటుంది. సురేఖ: వాళ్లు కూడా చాలా బాగుంటారు. ఏ రిలేషనయినా రెండువైపులా ఉండాలి. ఈయన లేకపోయినా కల్యాణ్ (పవన్ కల్యాణ్) ఎప్పుడూ పిల్లలతో ఉండేవాడు. బాగా సరదాగా ఉండేవాడు. అందుకే కల్యాణ్ పిల్లలతోపాటు పెరిగాడు, పిల్లలు కల్యాణ్‌తో పాటు పెరిగారు అంటాం. కల్యాణ్‌తో పాటు, వీళ్ల చెల్లెలు మాతోపాటు ఉండి చదువుకుంది. ► త్రీ షిఫ్ట్స్ చేస్తూ షూటింగ్స్‌తో చిరంజీవిగారు బిజీగా ఉండేవారట. పెళ్లయిన కొత్తలో ఆ బిజీని ఎలా తీసుకున్నారు? సురేఖ: నాన్నగారిని చూస్తూ పెరిగాను కదా. నైట్ షూటింగ్‌లని ఆయన లేటుగా రావటం అన్నీ తెలుసు. మా పెళ్లయిన కొత్తల్లో ఈయన పొద్దున్నే షూటింగ్‌కి వెళ్లి సాయంత్రం 6 గంటలకు వచ్చేవారు. మళ్లీ ఫ్రెష్ అయి నైట్ షూటింగ్‌కి వెళ్లేవారు. ‘పున్నమినాగు’ షూటింగ్ జరుగుతోంది అప్పుడు. నా లైఫ్ అంతా ఇలానే ఉంటుందని ప్రిపేర్ అయిపోయాను కాబట్టి ఏమీ అనిపించలేదు. ► ప్యారిస్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు మీ పేరు బదులు ‘జయ’ అని జయప్రదగారి పేరుతో మిమ్మల్ని పిలిచారట? సురేఖ: ఓ రోజు కాదు, రోజూ జరిగేది. నెల రోజులు జయప్రదతో షూటింగ్ చేస్తే ఆ నెల రోజులూ జయ, జయ అని పిలిచేవారు. మా పెళ్లయిన కొత్తల్లో అప్పటికి నన్ను సురేఖా అని పిలవడానికి అలవాటుపడలేదు. అందుకని ఒక్కోసారి జయ అని పిలిచేవారు. ‘ఏమండీ.. నేను రేఖ’ అనేదాన్ని. ‘ఓ.. సారీ, సారీ రేఖ’ అనేవారు. చిరంజీవి: సురేఖలో ఉండే ఆ స్పోర్టివ్‌నెస్ పరాకాష్ట అని చెప్పాలి. మరో గమ్మల్తైన విషయం చెబుతా. మా పెళ్లైన రెండు నెలలకి ప్యారిస్ వెళ్లాం. హోటల్లో రూమ్ తీసుకున్నాం. దానికోసం రిసెప్షన్లో ఫామ్స్ అన్నీ కంప్లీట్ చేసి ఇవ్వాలి కదా. అక్కడ అన్నీ ఫిల్ చేస్తూ భార్య అనే చోట ఆగిపోయాను. వెంటనే పేరు గుర్తు రాలేదు (నవ్వులు). ‘సురేఖ’ అని చెప్పి.. ‘అల్లు అని రాసేరు, కొణిదెల అని రాయండి’ అంది. ► మీరు ఎంతోమంది హీరోయిన్లతో నటించారు. వాళ్లతో సురేఖగారు ఎలా ఉంటారు? చిరంజీవి: సురేఖ వెరీ ఫ్రెండ్లీ. సుహాసిని, సుమలత, విజయశాంతి, రాధ, రాధిక.. అందరితో ఓ ఫ్యామిలీలా ఉంటుంది. మొన్న నవంబర్‌లో మా 80స్ క్లబ్ (1980లకు చెందిన నటీనటులు) రీయూనియన్ పార్టీ మా ఇంట్లోనే జరిగింది. అన్నీ తనే ఎరేంజ్ చేసింది. వాళ్లందరూ ‘ఇంత ఎరేంజ్ చేశారు, మీరూ పార్టీలో ఉండండి’ అంటే ‘మీరంతా ఫ్రెండ్స్. ఎంజాయ్ చేయండి’ అంది. సురేఖ: ఎరేంజ్ చేశాం కదా అని ఫ్రెండ్స్ మధ్యలో దూరిపోకూడదు (నవ్వుతూ). ► జనరల్‌గా చిరంజీవిగారి బర్త్‌డే అంటే ఫ్యాన్స్ మరచిపోనివ్వరు. మరి.. మ్యారేజ్ డే, మీ బర్త్‌డేని ఆయన గుర్తుపెట్టుకుంటారా? చిరంజీవి: గుర్తుండేది కాదు, గుర్తు లేకనే ఈ సంవత్సరం ఫైట్ సీక్వెన్స్ కోసం పోలవరం వెళ్లడానికి రెడీ అయ్యాను. ఈ 18న సురేఖ పుట్టినరోజు. 20న మా పెళ్లిరోజు. అది గుర్తు లేక 16 నుండి పోలవరంలో షూటింగ్ ప్లాన్ చేసుకున్నాం. మా అబ్బాయికి (రామ్‌చరణ్) గుర్తుకొచ్చింది. వాళ్లమ్మ దగ్గరికెళ్లి ‘18 నీ పుట్టినరోజు, 20 మీ పెళ్లిరోజు, డాడీ షూటింగ్‌కి ఎలా ఒప్పుకున్నారు?’ అంటే, ‘పోనీలే డాడీకి గుర్తులేదేమో’ అందట. ‘లేదమ్మా, అది మన షూటింగే కదా, వాళ్లతో మాట్లాడి మారుస్తాను’ అని మార్చేశాడు. సురేఖ: మా మ్యారేజ్ డే అయినా, నా బర్త్‌డే అయినా హడావిడి ఏమీ ఉండదు. ► గిఫ్ట్‌లు ఇస్తుంటారా? సురేఖ: రెండేళ్ల క్రితం నా బర్త్‌డేకి వాచ్ ఇచ్చారు. కరెక్ట్‌గా రాత్రి 12 గంటలకు నన్ను నిద్ర లేపి మరీ ఇచ్చారు. ఆ గిఫ్ట్ నాకివ్వటం కోసం ఎంత కష్టపడ్డారో తర్వాత తెలిసి ఆనందపడ్డాను. చిరంజీవి: ఆ బ్రాండ్ వాచ్ ఇక్కడ దొరకలేదు. బెంగళూర్‌లో ఉంది. ఆ కంపెనీవాళ్లను అడిగితే, ‘మీరు మా ప్రివిలేజ్డ్ కస్టమర్’ అని ఫ్లయిట్‌కి వచ్చి ఇచ్చి వెళ్లారు. ► కలిసి షాపింగ్స్‌కి వెళతారా? చిరంజీవి: షాపింగ్ అంటే ఇద్దరికీ ఇష్టం. ఇక్కడ కష్టం కాబట్టి విదేశాలు వెళ్లినప్పుడు బాగా తిరుగుతాం. లండన్ వెళితే ఓ అపార్ట్మెంట్ అద్దెకి తీసుకుని కొన్ని వారాల పాటు అక్కడే ఉంటాం. నాకు, తనకి కుకింగ్ అంటే సరదా. కుక్ చేసుకుని షాపింగ్‌కి వెళ్లిపోతాం. ► పండగలు బాగా చేస్తుంటారని విన్నాం. ప్లానింగ్ అంతా సురేఖ గారిదేనా? చిరంజీవి: నాగబాబు, పవన్‌కల్యాణ్, అల్లు అరవింద్ ఫ్యామిలీ... ఇలా అన్ని క్లోజ్ ఫ్యామిలీలు మొన్న దీపావళి పండగకి కలిశాం. దాదాపు మేమే ఓ వందమంది దాకా ఉంటాం. అందరికీ తనే మెసేజ్ పెడుతుంది. ఆ మెసేజ్‌కే చిన్న పిల్లల దగ్గరనుండి, పెద్దవాళ్లదాకా అందరూ తూచా తప్పకుండా హాజరవుతారు. సంక్రాంతి పండగను మూడు రోజులు చాలా ఘనంగా చేసింది. అప్పుడు పంక్తి భోజనాలు పెట్టి, పెద్ద భోగి మంట ఏర్పాటు చేయించింది. పండగ అనేది వంకే తప్ప, అందరూ కలవాలనుకుంటుంది. అందుకే అందరితోనూ తనకు మంచి బాండింగ్ ఉంటుంది. సురేఖ: ఈయన మొదట్నుంచి వాళ్ల పిల్లలు, వీళ్ల పిల్లలు అని కాదు.. అందరి పిల్లలతో బాగుంటారు. చిన్నప్పుడు అందరి పిల్లలు ఓ పదిహేనుమంది దాకా అయ్యేవారు. అందరినీ షూటింగ్‌లకు తీసుకెళ్లేవారు. మాల్దీవ్స్ వెళ్లినా, స్విస్ వెళ్లినా హాలిడే ఉందంటే చాలు.. అల్లు వెంకటేశ్, బన్నీ, శిరీష్ ఇలా అందరి పిల్లల్ని ఫారిన్ తీసుకెళ్లేవారు. చిరంజీవి: పిల్లలందరికీ వండర్ఫుల్ మెమొరీస్ నాతోనే ఉంటాయి. నేనెన్ని చేసినా దాన్ని ఆర్గనైజ్ చేసి, మేనేజ్ చేసేవాళ్లు కావాలి. అది సురేఖ చేస్తుంది. ► పండగలవీ శ్రద్ధగా చేస్తున్నారంటే పూజలు బాగా చేస్తారా? సురేఖ: మరీ అంత ఎక్కువ కాదు. రోజూ మామూలుగా చేస్తా. స్పెషల్ అకేషన్ అంటే కచ్చితంగా బాగా చేస్తాను. మనం చేస్తుంటేనే పిల్లలు కూడా ఫాలో అవుతారు. మన నెక్ట్స్ జనరేషన్‌కు తెలుస్తుంది. మనం వదిలేస్తే వాళ్లూ వదిలేస్తారు. మా సుస్మిత, శ్రీజ పెళ్లి చేసుకుని వెళ్లిపాయినా ఇక్కడ పూజలు చేసినట్లే అత్తగారింట్లో చేస్తారు. ► మనవళ్లు, మనవరాళ్ల గురించి ? సురేఖ: అదొక లవ్లీ లైఫ్. ఈయనకి అప్పట్లో తీరిక లేక మా పిల్లల ఎదుగుదలను చూడలేదు. ఇప్పుడు చిన్నపిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. అందరికీ ఆయనంటే పిచ్చి ఇష్టం. వాళ్లతో ఆయన ఎన్ని ఆటలు ఆడతారో చెప్పలేం. ► మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయా? చిరంజీవి: ఎందుకు జరగవు? తిట్టుకుంటానే ఉంటాం సురేఖ: అలా జరగబట్టే ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాం. ఎప్పుడూ స్వీట్ స్వీట్‌గా ఉంటే బోర్. ► ఇద్దరిలో ఎవరు సీరియస్? ఎవరు కామెడీ? చిరంజీవి: నేను కామెడీగా ఉండను. అలాగని పెద్ద సీరియస్‌గా కూడా ఉండను. కామెడీ అంటే సురేఖనే ఎక్కువ. ఆమె పంచ్‌లను తట్టుకోవటం చాలా కష్టం. ఒక్కోసారి ఆ పంచ్‌లకు గుక్క తిప్పుకోలేం. ► ఫైనల్లీ.. మళ్లీ జన్మంటూ ఉంటే మీరే కపుల్‌గా ఉండాలనుకుంటున్నారా? చిరంజీవి: నేను ఆ మద్రాస్ కోడంబాకం బ్రిడ్జి మీదకి మాత్రం వెళ్లను (పెద్దగా నవ్వుతూ). ఐయామ్ జస్ట్ కిడింగ్. డెఫ్నెట్లీ మేమే ఉండాలనుకుంటున్నాం. సురేఖ: అంతే... ► మీరు కట్టుకునే చీరలు బాగుంటాయి. మీవారు కాంప్లిమెంట్స్ ఇస్తుంటారా? సురేఖ: థ్యాంక్యూ. నాకు అప్డేటెడ్గా ఉండటం ఇష్టం. దానికి కారణం చిరంజీవిగారే. ఆయనకు ఫ్యాషన్ గురించి, కలర్స్ గురించి చాలా అవగాహన ఉంది. ఇంకో విషయం ఏంటంటే.. ఆయన చీర చూడగానే రేటు చెప్పేస్తారు. అది ఏ చీర అయినా కానివ్వండి.. బట్టల గురించి అంత ఐడియా ఉంది. నేను కట్టే చీరలు బాగుంటాయని అందరూ అంటుంటే బాగానే ఉంటుంది. కానీ అదే విషయాన్ని ఆయన నోటి నుంచి వింటే ఆ ఆనందమే వేరు. అంతేకదా.. మనం శ్రద్ధగా డ్రెస్ చేసుకున్నప్పుడు భర్త నుంచి ఓ చిన్ని కాంప్లిమెంట్ వస్తే ఆ ఫీలింగే స్పెషల్. ఆ విషయంలో ఆయన హండ్రెడ్ పర్సంట్ బెస్ట్. అన్నీ పట్టించుకుంటారు. కాంప్లిమెంట్స్ ఇస్తారు. ► సో.. మీ కళ్లబ్బాయి పక్కా ఫ్యామిలీ మ్యాన్ అన్నమాట? సురేఖ: డౌట్ ఏముంది? హండ్రడ్ పర్సంట్ పక్కా ఫ్యామిలీ మ్యాన్. ► 30 ఏళ్లు నటించి ఓ పదేళ్లు పాలిటిక్స్‌కి దగ్గరగా ఉండటంవల్ల సినిమాలకు దూరమయ్యారు. ఆ గ్యాప్ గురించి? సురేఖ: అప్పుడు పీస్‌ఫుల్‌గా ఉండేవారు కాదు. మాకూ అలానే ఉండేది. ఆయనకి మేకప్ వేసుకోగానే హుషారు వస్తుంది. చిరంజీవి: పనులన్నీ ముగించుకుని ఇంటికొచ్చాక కూడా మరుసటి రోజు ఏం మాట్లాడాలి? అనేదాని చుట్టూనే ఆలోచనలు ఉండేవి. ‘సినిమాలు చేయడం మొదలుపెట్టాక మళ్లీ మిమ్మల్ని మా మనిషిలా చూస్తున్నాం’ అంటున్నారు. సురేఖ: ఇప్పుడు ఫుల్ హుషారు. ఉదయం 9కి వెళ్లాలంటే ముందే రెడీ అయి కూర్చుంటారు. షూటింగ్ ఉంటే.. హీ ఈజ్ ఫుల్ యాక్టివ్. చిరంజీవి: ‘సైరా’ సినిమాకి 4.30కి లేచి వర్కవుట్ చేసుకొని 5.30గంటలకల్లా రెడీ అయ్యి 6 గంటలకు లొకేషన్‌కి వెళ్లి 7 గంటలకల్లా మేకప్‌తో రెడీగా ఉండేవాణ్ణి. ఇప్పుడు కొరటాల శివతో చేస్తున్న సినిమా షూటింగ్ షార్ప్ 7కల్లా స్టార్ట్ చేస్తున్నాం. జనవరి 2న షూటింగ్ స్టార్ట్ చేశాం. అప్పుడే ఓ సాంగ్, మూడు ఫైట్స్ కంప్లీట్ అయ్యాయి. ► మీ పెళ్లప్పటికే చిరంజీవిగారు కెరీర్‌వైజ్‌గా మంచి ఫామ్‌లోకొచ్చారు.. ఆ బిజీని ఎలా తీసుకునేవారు? సురేఖ: ఆయన కనబడటమే అపురూపంగా ఉండేది. ఎప్పుడూ షూటింగ్‌లతో దూరం, దూరంగా ఉండటంతో కళ్లారా ఎప్పుడు చూస్తానా అనిపించేది. చిరంజీవి: నేను ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడే అవకాశాలు మొదలయ్యాయి. ఆల్బమ్ పట్టుకుని అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రాలేదు. అందుకే పెళ్లినాటికే ఫామ్‌లో ఉన్నా. అప్పుడేమో నేను కనబడితే రేఖకి అపురూపం. మనవరాళ్లు వచ్చాక ఎఫెక్షన్ తగ్గింది. పలకరిస్తే ‘ఆ వస్తున్నా’ అంటుంది. వచ్చి చూడదు. అందుకేనేమో లేటు వయసులో చాలామంది సెకండ్ కోసం చూస్తుంటారు (కొంటెగా నవ్వుతూ). అయినా నేనా ధైర్యం చేయలేను. ► చిరంజీవిగారు, చరణ్ కలిసి ఫుల్ లెంగ్త్ సినిమా చేయాలని ఉందా? సురేఖ: ఇద్దరినీ ఓ సినిమాలో చూడాలని ఉంది. ‘ఖైదీ నంబర్–150’లో ‘అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు’ పాట మధ్యలో చరణ్ వచ్చి డ్యాన్స్ చేస్తాడు. వాళ్లిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తుంటే ఈయన్ని చూడాలా, చరణ్‌ని చూడాలా అనుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో ఆ సినిమా చూస్తూ ఒకసారి ఈయన్ని, మళ్లీ ఆ పాట పెట్టుకుని ఒకసారి చరణ్‌ని చూశాను. ► నటుడిగా చిరంజీవిగారు రిస్కీ ఫైట్స్ చేస్తుంటారు. మీకెలా అనిపిస్తుంది? సురేఖ: లొకేషన్లో ఏం చేసేవారో తెలిసేది కాదు కానీ, చేసొచ్చిన తర్వాత చెబుతుంటే ‘బాబోయ్’ అనిపించేది. ఎప్పుడో పొద్దున వెళితే సాయంత్రానికి వచ్చేవారు. అలా కాకుండా ఏ పదకొండింటికో ఆయన ఇంటికి వచ్చేస్తున్నారు అని ఎవరైనా చెబితే మాత్రం, ఏదో దెబ్బతగిలే ఉంటుందనుకునేదాన్ని. అలాగే ఫైట్ సీన్స్ అంటే మధ్యలో లొకేషన్ నుంచి ఫోన్ రాకూడదని కోరుకుంటా. ఫోన్ వస్తే ఆయనకు ఏదైనా దెబ్బ తగలిందని చెబుతారేమోనని భయం. ఇప్పుడు ఫర్వాలేదు కానీ అప్పట్లో ఇంత కంఫర్టబుల్ షూస్ కానీ, సేఫ్టీ ప్రికాషన్స్ కానీ లేవు కదా. ఈయనేమో డూప్ కూడా వద్దంటారు. – డి.జి. భవాని -
బాసర అమ్మవారి కిరీటంలోని వజ్రం గల్లంతు
సాక్షి, బాసర : ప్రసిద్ధిగాంచిన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. ఆలయంలోని అమ్మవారి మూలవిరాట్ విగ్రహం మకుటంలోని ఓ వజ్రం కనిపించకుండా పోయింది. నవరత్నాలతో కూడిన అమ్మవారి కిరీటంలో మరకతం (పచ్చ) గల్లంతయినట్లు గుర్తించిన భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం కాస్తా వివాదాస్పదంగా మారటంతో దేవదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విచారణకు ఆదేశించారు. కెంపు గల్లంతుకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని మంత్రి, దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో విగ్రహాన్ని మరో ప్రాంతానికి తీసుకొచ్చి పూజలు నిర్వహించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలయ అధికారులు... మరోసారి ఇంకో వివాదంలో ఇరుక్కోవడం గమనార్హం. -
గురి
సర్కస్ జనాలతో కిక్కిరిసిపోయింది. ఆ ఊళ్ళో అదే మొదటి ఆట.నింగిలో వేలాడే ఉయ్యాలల మీద నాజూకైన అమ్మాయిలు చేస్తున్న విన్యాసాలు, వారిని అనుకరించబోయి విఫలమై అంత ఎత్తునుంచీ కిందకి వలలో పడిపోతున్న మరగుజ్జు హాస్యగాళ్ళు, వారిని చూస్తూ కేరింతలు కొడుతున్న జనం. ఏమీ మారలేదు. జనాల కేరింతలు తనకి ఇప్పటికీ అదే ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఆ కేరింతలు విని ఎంతకాలం అయ్యిందో! జైల్లో, ఆ నాలుగు గోడల మధ్యన, కేవలం తన ఉఛ్వాసనిశ్వాసలే తప్ప ఈ సందడేది?పరదా పక్కకి జరిపి ఆ జనాలకేసి చూశాడు మణి, అలియాస్ తల్వార్ మణి. అప్పట్లో తన ప్రదర్శన చూడటానికి జనాలు ఎగబడేవాళ్ళు. కేవలం తనవల్లే ఆ సర్కస్ నడిచిందన్నా అతిశయోక్తి కాదేమో! కానీ మునుపటి ఓపిక ఇప్పుడు లేదు. చూపు కూడా మందగించింది. కేవలం చినబాబు అడిగాడనే కాదు, తనMీ ఈ సర్కస్‌తో విడదీయలేని అనుంబంధం ఉంది. తను రూబీని కలిసింది కూడా ఇక్కడే. ఒకటా రెండా పద్నాలుగు సంవత్సరాల అనుబంధం, మరో పద్నాలుగు సంవత్సరాల ఎడబాటు! తన బలమైన కోరికో, లేక దైవేచ్చో మళ్ళీ ఇన్నేళ్ళకి ఇక్కడ అడుగుపెట్టాడు. తాను ఈ స్థితిలో ఉండటానికి కారణం అయిన పెద్దయ్య ఇప్పుడు పక్షవాతం వచ్చి కేవలం కుర్చీకే పరిమితం అయ్యాడని తెలిసినా, చినబాబుని బ్రతిమిలాడి ఆయనముందే మళ్ళీ తన పునరాగమనం జరగాలని, మొదటివరుసలోనే కూర్చొని దగ్గరగా పెద్దయ్య తనని చూడాలని పట్టుబట్టాడు మణి. సరే అనక తప్పలేదు చినబాబుకి. దూరంగా అచేతన స్థితిలో ఉన్న పెద్దయ్య మణిని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. తరువాతి ప్రదర్శన తనదే. సిద్ధమవుతున్నాడు మణి. విసరవలసిన కత్తులు, కంటికి కట్టుకొనే ఆ నల్లగుడ్డ, అన్నింటినీ ఒకసారి తడిమి చూసుకున్నాడు. ఆ కత్తులంటే అతనికి ఎంతో ప్రేమ. వెలుపల నుంచి తన పేరు పిలుస్తున్నారు. ఆ క్షణం రానే వచ్చింది. నోటితో గట్టిగా గాలి తీసి వదిలాడు. పరదా తొలగించుకుంటూ జనాల మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు తల్వార్ మణి. చెయ్యెత్తి అందరికీ అభివాదం చేశాడు. జనాలు లేచి మరీ చప్పట్లు కొట్టారు. అదీ అతని స్థాయి. దేశంలోనే అతనిలా కళ్ళకు గంతలు కట్టుకొని మనిషికి తగలకుండా కత్తులు విసరగలిగేవాడు మరొకడు లేడని అప్పట్లో అన్ని వార్తా పత్రికల్లో ఎన్నో కథనాలు వచ్చాయి. జనాలు స్థిమితపడ్డారు. ఎదురుగా సుమారు ఒక యిరవై అడుగుల దూరంలో గుండ్రపు చెక్కకి ఒక అమ్మాయిని తెచ్చి కట్టేశారు. ఎదురుగా అమ్మాయి. ఆమెకి కొంచెం పక్కగా పెద్దయ్య. అదీ మణికి కనిపిస్తున్న దృశ్యం. ఆ అమ్మాయిని అలా చూస్తూ ఉండిపోయాడు మణి. రూబీ గుర్తొచ్చింది. ఇంతలో పక్కన ఉన్న వ్యక్తి, మణి దగ్గరున్న నల్లటి గుడ్డని తీసి అతని కళ్ళకు గట్టిగా బిగించాడు. నిశ్శబ్దం. అందరూ ఊపిరి బిగపట్టి మరీ చూస్తున్నారు, ఏం జరబోతోందో! ఆ ఆసక్తి వారి ముఖాల్లో స్పష్టంగా కనపడుతోంది. ఆ ఆమ్మాయిని కట్టేసిన గుండ్రపు చెక్కని తిప్పాడు పక్కనున్న వ్యక్తి. మణి కత్తి తీశాడు. తిరుగుతున్న ఆ చట్రంతో పాటు అతని బుర్రలో పాత జ్ఞాపకాలు కూడా గిర్రున తిరుగుతున్నాయి. ఎన్నడూ లేనిది తల్వార్ మణì æచెయ్యి మొదటిసారిగా వణికింది. రూబీ. పేరుకి తగ్గ రూపం. మొదటిసారి తనని చూసినప్పుడే తాను విసిరే కత్తిలా అనిపించింది మణికి. ప్రేమలో పడిపోయాడు. అది ప్రేమో, ఆరాధనో లేక మైకమో తేల్చుకోలేని స్థితి అతనిది. ఆమె కళ్ళను చూస్తూ జీవితాంతం గడిపేయగలననుకున్నాడు. అంతటి కట్టిపడేసే సౌందర్యం ఆమెది. ఇంతలోనే నిరాశ! తాను ప్రేమిస్తే సరిపోతుందా? ఆమె కూడా తిరిగి తనని ప్రేమించద్దూ! ఆశ పడటానికైనా హద్దుండాలని సరిపెట్టుకున్నాడు. తనని ఆమెకి తగ్గ అందగాడిగా ఎందుకు పుట్టించలేదని దేవుణ్ణి నిందించేశాడు కూడా! ‘‘ఇదిగో మణీ! ఈ అమ్మాయి నీతో పనిచేస్తుంది. పేరు రూబీ. నువ్వు రేపటి నుంచి ఈమెతోనే నీ ప్రదర్శనలు చేయాలి’’. ఒక్కసారి సర్కస్ ఫోకస్ లైట్లలాగా వెలిగిపోయింది మణి ముఖం. ఇంకా తాను వరమే కోరలేదు, అప్పుడే దేవత వరమిచ్చేసింది కాబోలు అనుకున్నాడు. చెంపలు వేసుకున్నాడు. తొందరపడి దేవుణ్ణి నిందించేశానే అని బాధపడ్డాడు. ‘‘ఆ అమ్మాయికి ఇదంతా కొత్త. నువ్వే దగ్గరుండి అన్నీ చూసుకోవాలి’’ అంటున్న సర్కస్ ఇంచార్జ్, మణి కంటికి అప్పగింతలు చేస్తున్న మామగారిలాగా కనబడ్డాడు. బయటపడలేని సంబరంతో లోపల ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు మణి. కాలం గడుస్తోంది. రూబీపైన విపరీతమైన ప్రేమని పెంచేసుకున్నాడు మణి. ఎంతగా అంటే, తాను రోజూ విసిరేవి కత్తులు కాదు, తన ప్రేమ రాయబారాన్ని మోసుకు వెళ్ళే బాణాలు అనుకునే వరకూ చేరింది అతని వైఖరి. కానీ అతను విసిరే కత్తుల్లాగే ఆ బాణాలు కూడా ఆమెకి అస్సలు తగల్లేదు. చాలాసార్లు రూబీ మణికి నచ్చజెప్పింది. ఒకరోజు కుండ బద్దలు కొట్టేసింది, తనకి అలాంటి ఉద్దేశం ఏమీ లేదని, లేనిపోని ఆశలు పెట్టుకోవద్దని. మణి ముఖం మీదే చెప్పేసింది. తన ప్రపంచం ఒక్కసారి తల్లకిందులైపోయినట్టు అనిపించింది మణికి. తట్టుకోలేకపోయాడు. అర్ధరాత్రి గడిచింది. రూబీ ఉండే గదివైపు తడబడుతూ అడుగులు వేస్తున్నాడు మణి. చేతిలో కల్లుసీసా. తనని తాను నిగ్రహించుకునే స్థితిలో లేడు. పెద్దగా అరుస్తూ రూబీని నిద్రలేపాడు. ఆ గొడవకి మిగతావాళ్ళు కూడా నిద్రలేచారు. పెద్ద రభసే అయ్యింది. తనని పెళ్ళి చేసుకోకుంటే æచంపేస్తా అంటూ ఊగిపోతూ చేతిలో సీసాని పగలగొట్టి రూబీ మీదకి వెళ్ళబోయాడు మణి. చుట్టూ ఉన్నవాళ్ళు వచ్చి ఆపారు. రూబీ, మణికి దగ్గరగా వెళ్ళి గట్టిగా అతని చెంప పగలగొట్టింది. ఆ ఊపుకి వెళ్ళి పక్కన పడిపోయాడు. అందరూ అక్కడనుంచి వెళ్ళిపోయారు. రూబీ మాత్రం మళ్ళీ మణికి దగ్గరగా వెళ్ళింది. అతడి తల నిమిరింది. ఏదో గిలిగింత కలిగినట్టు ఆ మత్తులోనే నవ్వేసాడు మణి. ఆ స్పర్శ బహుశా అతని మనసుని తాకింది కాబోలు! రూబీ... రూబీ... అంటూ కలవరిస్తున్నాడు. రూబీకి కూడా మణి అంటే ఇష్టమే. కాకపోతే ఈ జీవితం రూబీకి నచ్చలేదు. ఏవో కుటుంబ పరిస్థితుల వల్ల ఇక్కడకి రావల్సి వచ్చిందేకానీ మనస్ఫూర్తిగా ఇష్టపడి మాత్రం కాదు. కానీ మణి పరిస్థితి అది కాదు. ఈ సర్కస్ అతని జీవితం. అతనికి ఇక్కడ మంచి భవిషత్తు కూడా ఉంది. తనవల్ల మణి జీవితం మారిపోవటం, అతను ఇష్టపడ్డ ప్రపంచాన్ని తనకోసం మార్చుకోవటం రెండూ రూబీకి ఇష్టంలేదు. అందుకే అతని ప్రేమకి దూరం అవ్వాలని అనుకుంది. అర్ధరాత్రి దాటింతర్వాత. ఏదో పెనుగులాట. ఏదోఅలజడి. బలవంతంగా మత్తునుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నాడు మణి. తన వల్ల కావటం లేదు. ఐనా ప్రయత్నిస్తున్నాడు. మసకమసగ్గా కళ్ళముందు ఆడుతున్న ఆ దృశ్యాల్లో ఎవరో ఒక అమ్మాయి. ఒక మగమనిషి. ఆ అమ్మాయి అరవటానికి ప్రయత్నిస్తోంది. కానీ ఆ మగ మృగం కిరాతకంగా ఆమెని లోబరచుకోవాలని ప్రయత్నం చేస్తోంది.బలం మొత్తం కూడగట్టుకొని లేచి నిలబడ్డాడు.‘‘ఎవరదీ! ఏయ్ వదులు’’ అంటూ ఆ మనిషి చొక్కా పట్టుకున్నాడు. అంత దగ్గరగా ఆ ముఖాన్ని చూసి ఖంగుతిన్నాడు. ఎదురుగా ఉన్న ఆ మనిషి టపీమని తలపై గట్టిగా రాయితో మోదడంతో అక్కడే స్పృహ కోల్పోయాడు మణి.పొద్దున్నే ఎవరో బూటుకాలితో గట్టిగా తంతుంటే మెలకువ వచ్చింది మణికి. ఎదురుగా ఉన్న రక్తపు మడుగులోంచి సూర్యోదయమయ్యింది అతనికి. ఒక్కసారి మబ్బులు విడిపోయాయి. అది రూబీ శవం. పొత్తికడుపులో పగలగొట్టిన గాజు సీసా గుచ్చుకొని ఉంది.‘‘ఏరా, అమ్మాయి ప్రేమించకపోతే పాడుచేసి ప్రాణాలు తీసేస్తార్రా మీరు...’’ అంటూ తంతున్నాడు కానిస్టేబుల్. మణికి ఏమీ అర్థంకాలేదు. ‘‘వీడిని ఇక్కడనుంచి తీసుకుపోండి సార్! వీడిలాంటి వాళ్ళుంటే మా సర్కస్కే చెడ్డపేరు’’ అంటున్న పెద్దయ్య వైపు కోపంగా చూశాడు మణి. కానీ పెద్దయ్య మాత్రం మణి కళ్ళలోకి చూడలేకపోయాడు. అది ఎందుకో మణికి మాత్రమే తెలుసు. ‘‘నడవరా స్టేషన్‌కి’’ అంటూ మెడ పట్టుకొని తీసుకెళ్ళారు పోలీసులు. అలా వెళుతూ కూడా వెనక్కి తిరిగి మరీ పెద్దయ్యవైపే చూశాడు మణి. ‘‘వెళ్ళొస్తా పెద్దయ్యా’’ అన్నాడు. పెద్దయ్యకి మణి కళ్ళలోకి చూసే ధైర్యం రాలేదు. బహుశా ఇంకెప్పటికీ రాదేమో!జైల్లో ఎవ్వరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు మణి. ఎక్కువగా ఒంటరితనాన్నే ఇష్టపడేవాడు. మధ్యమధ్యలో వెక్కివెక్కి ఏడుస్తూ ఉండేవాడు. ఆ జైల్లో కూడా మణికి అభిమానులు లేకపోలేదు. వారి సహాయంతో ఒక చిన్న గడ్డి బొమ్మని, కొన్ని డమ్మీ చాకులని సమకూర్చుకొని గంటలు తరబడి సాధన చేసేవాడు. ఇదీ క్లుప్తంగా మణి జైలు జీవితం. మణి జైలునుంచి విడుదలయ్యాక ఆ గడ్డిబొమ్మని బయటపారేస్తూ కానిస్టేబుల్ గమనించిన ఒక వింత విషయం ఏంటంటే ఇన్నాళ్ళూ మనిషికి తగలకుండా కత్తులు వేయటంలో నేర్పరి అయిన మణి, ఇప్పుడు మాత్రం ఒకేచోట గురి తప్పకుండా ఆ గడ్డిబొమ్మ గుండెల్లోకే చాకుని విసరగలగటం. చిద్రమైపోయిన హృదయంతో ఉన్న ఆ బొమ్మ, బహుశా రూబీని మరిచిపోలేని మణికి ప్రతిరూపమేమో అనుకున్నాడు.‘మణి... మణి...మణి...’ అంటూ ప్రేక్షకులు కొడుతున్న కేరింతలతో మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చాడు. వణుకుతున్న చేతినుంచి బాణంలాగా దూసుకువెళ్ళింది కత్తి. ఎప్పటిలాగే ఈసారి కూడా అది గురి తప్పలేదు. జైల్లో రూబీనే తలచుకుంటూ, ఆ గడ్డిబొమ్మలో పెద్దయ్యనే చూస్తూ మణి చేసిన సాధన మొత్తానికి ఫలించింది. ప్రేక్షకుల దృష్టిలో అతని గురి తప్పినప్పటికీ, మణì æలక్ష్యం మాత్రం నెరవేరింది. - యేటూరి రోహణ్ -
రబీలో రైతులకు వంద కోట్ల రుణాలు
గంగాధరనెల్లూరు: రబీలో రైతులకు రూ.100 కోట్ల రుణాలు మంజూరు చేస్తామని జిల్లా సహకారబ్యాంకు సీఈవో శంకర్‌బాబు తెలిపారు. స్థానిక సహకార బ్యాంకుబ్రాంచి, సింగిల్‌విండో సొసైటీని బుదవారం ఆయన తనిఖీ చేశారు. సీఈవో మాట్లాడుతూ రైతులకిచ్చిన రుణాలను సకాలంలో వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 76 సహకార సంఘాలు ఉండగా అందులో 39 సంఘాలు లాభాల్లో ఉన్నాయని అందులో గంగాధరనెల్లూరు సింగిల్‌విండో సొసైటీ ఒకటన్నారు. రబీ సీజన్లో మరో రూ.100 కోట్లు లక్ష్యంగా రుణాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి లిల్లీకాధరిన్, బ్యాంకు మేనేజర్ మెహబూబ్‌బాషా, సిఈవో విజయకుమార్ , కార్యదర్శులు పాల్గొన్నారు. -
మూడు అట్టల పుస్తకం
ముగ్గురూ క్లాస్మేట్స్ ముగ్గురిదీ ఒకే ఫైట్ వాళ్లు చదువుకోవాలి. ఊరినీ చదివించాలి పెద్దలు వీల్లేదన్నారు వినలేదు. పరిస్థితులు అనుకూలించలేదు లెక్క చేయలేదు సంకల్పబలంతో ముందుకుసాగారు అసామాన్య పోరాటం జరిపారు విజయం సాధించారు ఒక పుస్తకానికి మూడు అట్టలు ఉండవు. తబుస్సమ్.. తరన్నుమ్.. రుబీనా... ముగ్గురూ చదువు అన్న పుస్తకానికి మూడు అట్టలు. చదువు వద్దంటే చదువుకుని నిలబడ్డారు చదువు చెప్పొద్దంటే చదివించి చూపారు. చదువు వల్ల ఏం ఒరుగుతుందంటే ఊరంతటినీ చదివించారు. అవును. సజోయి అనే పుస్తకానికి మూడు అట్టలు. ఆరాటం.. పోరాటం.. ప్రోత్సాహం. వారణాసి.. దేశ ఆధ్యాత్మిక రాజధాని! ప్రాచీనత, పట్టు వస్త్రాలు.. సుగంధ ద్రవ్యాలకు నిలయం. స్వదేశీ, విదేశీ టూరిస్టులతో నిత్యం కళకళలాడుతూ ఉండే పాతకొత్త కలయికల ఈ పట్టణానికి కొంచెం దూరంలో ఉంది సజోయి గ్రామం! కాశీకి కూతవేటులో ఉన్నా దాని అద్భుత ఛాయలేవీ సజోయి మీద లేవు. చాలా ఊళ్లలాగే ఇదీ ఓ సాధారణ పల్లె. ఎంత సామాన్యమైందంటే.. ఇంటి పనులు చేయడానికి, భర్త వంశాంకురాలను కనిపెంచడానికి మాత్రమే ఆడపిల్లలు పుడతారని.. అంతకుమించి వారికేం ప్రాధాన్యం లేదనే నిశ్చితాభిప్రాయాలతో ఉండేంత! కానీ అలాంటి ముతక ఊరూ ఒక అసామాన్యతకు జన్మనిచ్చింది.. బెనారస్ వెండి జరీలు వెలవెలబోయే వెలుగులతో! ఆ ఆత్మవిశ్వాసం ముందు కాశీ అద్భుతం ఎంత? వారణాసి పంచే ఆధ్మాత్మికతను మించిన జీవనతాత్వికత అది! ఆ అసామాన్య ఆత్మవిశ్వాస జీవన తాత్వికతల పేర్లు... తబస్సుమ్.. తరన్నుమ్.. రుబీనా! ఆ నిజంలోకి వెళితే... ఈ ముగ్గురిదీ ఇంచుమించు ఒకే వయసు. క్లాస్మేట్స్.. స్నేహితులు! ఎదుర్కొన్న సమస్యా ఒక్కటే. ఏర్పర్చుకున్న లక్ష్యం.. పోరాట స్ఫూర్తీ ఒక్కటే! సజోయిలోని పెద్దలకు చదువు మీద పెద్దపట్టింపు లేదు. ప్రాముఖ్యత అసలే తెలియదు. అందుకే ఆ ఊళ్లో అబ్బాయిలకు చదువు పోరుండదు.. అమ్మాయిలకైతే ఆ అవకాశమే ఉండదు. ఇలాంటి నేపథ్యంలోనే పెరిగారు తబస్సుమ్, తరన్నుమ్, రుబీనా. అయితే పెద్దవాళ్ల అభీష్టాలకు వ్యతిరేకంగా... ఆ ఊరి సంప్రదాయానికి విరుద్ధంగా ఇంటర్ వరకూ చదువు కొనసాగించారు. తొమ్మిది తర్వాత ప్రతి యేడూ చదువుకోసం పెద్ద యుద్ధమే చేశారు. తబస్సుమ్, తరన్నుమ్, రుబీనా తల్లిదండ్రులు తమ పిల్లలు తొమ్మిదో తరగతి వచ్చేవరకు వాళ్ల చదువులకు అభ్యంతరం చెప్పలేదు. తొమ్మిదో తరగతి వేసవి సెలవులు ఆ ముగ్గురి మీదా ‘పెద్దరికాన్ని’ మోపి చదువు ఆపించేయాలని చూశాయి. ప్రతి ఆడపిల్ల జీవితంలో అది సహజంగా జరిగే ప్రక్రియనీ.. దానికి, మా చదువుకి లంకె ఎందుకని తల్లిదండ్రులను ప్రశ్నించారు. చిన్న నోట పెద్ద మాట.. పెద్దలు అవాక్కయ్యేలా చేసింది. అంత విజ్ఞతకు విస్మయం చెందినా... చుట్టుపక్కల, చుట్టపక్కాల మాటలకు జడిసి చదువు మాన్పించాలనే నిర్ణయానికే వచ్చారు. అయినా ఆ పిల్లలు పట్టువీడలేదు. తమ చదువుకోసం వాళ్లేమీ డబ్బు పెట్టక్కర్లేదని... ఏదో ఒక పనిచేసుకుంటూ చదువుకుంటామని తండ్రులనూ వేడుకున్నారు. పిల్లల అభ్యర్థనకు తల్లులు కరిగినా తండ్రులు బింకంగానే ఉన్నారు. అయినా ఓటమిని ఒప్పుకోలేదు ఆ ముగ్గురు. ఇంట్లో నిరహారదీక్షకు కూర్చున్నారు. నాలుగు రోజులు సాగాక అయిదోరోజుకి నాన్నల మనసూ కరిగింది. బంధువుల మాటలను లెక్కచేయక ఎట్టకేలకు చదువుకి అనుమతిచ్చారు. అది వాళ్ల మొదటి విజయం. టెన్త్‌లో ఫస్ట్‌క్లాస్ ఆ పిల్లలకు రెండో గెలుపునిచ్చింది. ఇంటర్లో చేరడానికి మళ్లీ పోరాడారు. ఇందులోనూ జయమే. ఇంటర్ కూడా ఫస్ట్ డివిజన్. ఇంటర్ తర్వాత తబస్సుమ్‌కి పై చదువులకు వెళ్లాలని ఉన్నా పెద్దవాళ్లు తమ వల్లకాదని చెప్పారు. తతిమా ఇద్దరు స్నేహితురాళ్లు ‘మనం కనీసం ఇంటర్ వరకైనా చదివాం.. మన ఊళ్లో చాలామంది ఆడపిల్లలు ఓనమాలక్కూడా నోచుకోలేదు. కాబట్టి ముగ్గురం ఊళ్లోని ఆడపిల్లలకు చదువు చెప్దాం’ అనే ప్రతిపాదన చేశారు. ముగ్గురికీ ఆ ఆలోచన నచ్చింది. ఆ తెల్లవారి నుంచే ఇంటింటికి వెళ్లి ‘చదువు చెప్తాం రండి’ అంటూ పిలిచారు. ఆడపిల్లల కోసం మాత్రమే అని చెప్తే పంపరని మగపిల్లలను పంపించమని తల్లిదండ్రులను కోరారు. ఆరేళ్లలోపు మగపిల్లలు రావడం మొదలుపెట్టారు. ‘హ్యూమన్ వెల్ఫేర్ అసోసియేషన్’ అనే స్థానిక స్వచ్ఛంద సంస్థ సహాయంతో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ మగపిల్లల్ని ఈ బడిలో వదలడానికి వెంట ఆడపిల్లలూ వస్తున్నారు. వీళ్లు ఊహించిందీ అదే. పాచిక పారింది. వాళ్లనూ బడిలో కూర్చోబెట్టసాగారు. తమ్ముళ్లతోపాటు ఈ అక్కలకూ అక్షరాలు దిద్దించసాగారు. అయితే ఈ సంబరం ఎంతోకాలం సాగలేదు. ఇంట్లో పని వదిలేసి బడిలోనే ఆడపిల్లలు కాలక్షేపం చేయడంతో మగపిల్లలను బడి మాన్పించారు తల్లిదండ్రులు. దాంతో అమ్మాయిలూ రావడం బంద్ అయింది. ఊహించని పరిణామానికి షాక్ అయ్యారు ముగ్గురూ. టైలరింగ్‌తో.. ఈసారి కొత్త ఆలోచనతో అడుగువేశారు. అసోసియేషన్ ఆర్థిక సహాయంతో మూడు కుట్టు మెషీన్లను కొని టైలరింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టారు. ఆ సంస్థ కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.. ‘ఆడపిల్లలకు కుట్టు మిషన్ నేర్పిస్తాం పంపించండ’ంటూ. పరిచయమున్న ఎన్జీవో కార్యకర్తలే రావడంతో తల్లిదండ్రులూ కాదనలేదు. ఆ ముగ్గురు ఎదురుచూసిందీ దాని కోసమే. రోజుకి మూడు గంటలు క్లాస్ అయితే ఒక గంట హెచ్‌డబ్ల్యూఏ వాళ్ల టైలరింగ్ క్లాస్, తర్వాత రెండు గంటలు ఈ పిల్లలు ఆ పిల్లలకు చెప్పే చదువు. అయితే ఇదీ ఎంతోకాలం సాగలేదు. టైలరింగ్ పేరుతో చదువు నేర్పించి అమ్మాయిలను పాడు చేస్తున్నారంటూ పెద్దవాళ్లు వీళ్లతో గొడవకు దిగారు. ‘టైలరింగ్లోని కొలతలు తెలియాలంటే చదువు కావాలి.. అంకెలు రావాలి. అవి నేర్చుకోకుండా టైలరింగ్ ఎట్లా వస్తుంది?’ అంటూ ఎదురు ప్రశ్నించారు. అయితే వాళ్లు ఒప్పుకోకపోగా.. ఈ ముగ్గురి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి.. ‘మీ పిల్లలు చెడిపోయింది కాక మా ఆడపిల్లలనూ చెడగొడ్తున్నారు’అని దుమ్మెత్తిపోశారు. ఇంట్లోంచి కాలు బయటపెడితే ఊర్లోని మగపిల్లలూ గేలిచేసేవారు. ఆ అవమానం తట్టుకోలేని ఆ ముగ్గురి తల్లిదండ్రులు వీళ్లను ఇల్లు దాటకుండా కట్టడి చేశారు. పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు. ఇంత కష్టమూ మొదటికి వచ్చిందే అని తలపట్టుకున్నారు తబస్సుమ్, తరన్నుమ్, రుబీనా! అపజయాన్ని అంగీకరించలేదు. కనీసం పదిమంది ఆడపిల్లలనైనా అక్షరాస్యులను చేయందే ఈ ఊరు వదిలివెళ్లేది లేదని.. ప్రతిజ్ఞ చేశారు. అన్నట్టుగానే.. తిరిగి సున్నా దగ్గర ప్రారంభమైంది వీళ్ల పోరు. చదువుకోవడం కోసం ఎంత బతిమాలుకున్నారో... చదువు చెప్పడం కోసం అంతకన్నా ఎక్కువే బతిమాలాల్సి వచ్చింది. మళ్లీ నిరసన, నిరహారదీక్షలతో ఒప్పించుకోగలిగారు. అయితే ఓ షరతుతో... ‘ఈసారి గనుక మీ మీద ఎలాంటి కంప్లయింట్ వచ్చినా నిఖాకు సిద్ధం కావల్సిందే’ నని. మరి ఇప్పుడు... సజోయ్లోని 99 శాతం ఆడపిల్లలకు ఇప్పుడు చదవడం, రాయడం వచ్చు. పదుల సంఖ్యలో పొరుగూరికి వెళ్లి డిగ్రీ చదువుతున్నారు. కూతుళ్లు చదువుతుంటే ప్రేరణపొంది వాళ్ల తల్లులూ పలకా, బలపంతో ఈ ముగ్గురి దగ్గరకు వచ్చారు. దాంతో ఈ స్నేహితుల ఆనందానికి అంతులేదు. వాళ్ల కోసం రాత్రి బడిని తెరిచారు. ఇప్పుడా రాత్రి బడిలో ‘పెద్ద పిల్లల’ సంఖ్య 270. ‘ఇదంతా ఆషామాషీగా సాగిన వ్యవహారం కాదు. ఒకానొక టైమ్‌లో చదువు చెప్పడానికి ఊళ్లో ఎవరూ జాగా ఇవ్వకపోతే మా పెరట్లో చెత్త వేసే ప్రదేశాన్ని శుభ్రం చేసి అక్కడ బడి పెట్టాం. మా ఈ సుదీర్ఘ ప్రయత్నంలో, పోరులో మా తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకపోతే ఈ విజయాన్ని సాధించలేకపోయేవాళ్లం’ అంటారు ఎంతో వినయంగా ఈ త్రీ మస్కటీర్స్. 35 మందితో మొదలై... మూడోప్రయత్నం నేరుగానే ఉంది. ఇంటింటికీ వెళ్లి ఆడపిల్లల చదువు గురించి, చదువుకుంటే వాళ్ల భవిష్యత్తే కాదు ఇంటి భవిష్యత్తు ఎంత బాగుంటుందో కథలుగా చెప్పారు. రాత్రిపూట చిన్నచిన్న నాటకాలుగా వేసి చూపించారు. మెల్లగా ఆలోచించడం మొదలుపెట్టారు పెద్దలు. చివరకు ఒప్పుకోక తప్పలేదు. అలా ముందు 35 మందితో ఈ ముగ్గురు పెట్టిన బడిలో ప్రేయర్ బెల్ మోగింది. యేడాది తర్వాత ఈ స్కూల్ స్ట్రెన్త్ 170. ఇలా ఓ వైపు ఊళ్లో పిల్లలకు చదువు చెప్తూనే మరోవైపు ప్రైవేట్‌గా డిగ్రీ పూర్తి చేశారు. ఇదంతా 2007 నాటి సంగతి. -
స్లమ్ టూ బాంద్రా!
రుబీనా అలీ బాలీవుడ్ స్టార్ల అడ్డాగా ఉన్న బాంద్రా సిటీలోకి మరో బుల్లి తార అడుగుపెట్టబోతోంది. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎన్నో సినిమాలు తీయలేదు... కేవలం ఒకే చిత్రంలో నటించి ప్రతిష్టాత్మక అవార్డును అందుకుంది. ఆ చిన్నారే... ఇప్పటి 16 ఏళ్ల రుబీనా అలీ. ఎనిమిది ఆస్కార్లను కైవసం చేసుకొన్న ‘స్లమ్ డాగ్ మిల్లీనియర్’ లో హీరోయిన్ ఫ్రీదా పింటో చిన్ననాటి పాత్రను పోషించి బాలనటిగా పరిచయమైన రుబీనా ఓ పేదింటి అమ్మాయి. ఆమె ఉండే ఇల్లు... ముంబై గరీబ్ నగర్ స్లమ్‌లోని ఓ పూరి గుడిసెలో. అయితే ఎనిమిది నెలల క్రితం స్లమ్‌లో అగ్నిప్రమాదం జరిగి ఆమె ఇల్లు పూర్తిగా కాలిపోయింది. అలాగే ఆ మంటల్లో ఆమె అందుకున్న జాతీయ, అంతర్జాతీయ సత్కారాల జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు కూడా కాలి బూడిదయ్యాయి! అప్పుడు రుబీనా స్కూల్ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తోంది. తర్వాత వేరే దారి లేక ఆమె కుటుంబం బాంద్రా సిటీలో ఓ చిన్న ఇంట్లో అద్దెకు దిగింది. అయితే వచ్చే దీపావళి లేదా బక్రీద్ లోపు రుబీనా తన సొంత ఫ్లాట్‌లోకి అడుగుపెట్టనుంది! అదీ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ప్రీతి జింటా, సంజయ్‌దత్, దిలీప్‌కుమార్ లాంటి దిగ్గజాలు ఉండే బాంద్రా సిటీలో. అక్కడ రాజకీయ నాయకులు, సినీ స్టార్స్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్ లాంటి వారి నివాసాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలోకి ఈ పేద అమ్మాయి వెళ్లడం ఎలా అనుకుంటున్నారా? అదే అదృష్టం అంటే! స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్ర దర్శకుడు డానీ బోయెల్ ఈ మధ్య ‘జైహో’ పేరుతో ట్రస్ట్ ప్రారంభించి రుబీనాకు ఓ ఇల్లు కొనివ్వాలని నిర్ణయించాడు. అందుకు ఆ ట్రస్ట్ సభ్యులు ఆమె తల్లిదండ్రులతో కలసి మంచి ఇంటి కోసం వెతికారు. చివరికి బాంద్రా వెస్ట్ ప్రాంతంలో ఓ సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ పట్టుకున్నారు. వీలైనంత త్వరగా దానిని రుబీనాకు అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అన్నట్టు.. దాని ధర ఎంతనుకుంటున్నారు? అక్షరాల రూ.45 లక్షలు! ‘‘నాకు అమ్మానాన్నలతో పాటు ఇద్దరు సిస్టర్స్, ఒక బ్రదర్ ఉన్నారు. ఇప్పుడు మేమందరం కొత్త ఇంట్లో వెళ్తున్నామంటే ఎంతో ఆనందంగా ఉంది. ఒక సొంత ఇల్లు కట్టుకొని, అందులో నాకంటూ ఓ బెడ్రూం ఉండాలని ఆశ పడేదాన్ని. ఇప్పుడు నా కల బోయెల్ సర్ వల్ల నిజమవుతోంది. ప్రస్తుతం నటనకన్నా చదువుకే నా ప్రాధాన్యం. నా కాలేజ్ స్టడీస్ కూడా అయిపోయాక అప్పుడు ఫుల్ టైమ్ నటిని కావాలని నా ఆలోచన’’ అని ఆనందంగా చెప్పుకొచ్చింది రుబీనా. ఇక రుబీనా ‘లార్డ్ ఒవెన్స్ లేడి’ అనే మరో అంతర్జాతీయ చిత్రంలో నటించనుంది. దాన్ని ఇండియా, బ్రిటన్ దేశాల్లో చిత్రీకరించనున్నారు. -
కూతురిపై తండ్రి అఘాయిత్యం
సిగ్గుచేటు! గర్భం దాల్చిన బాలిక ఇంట్లోనే పురుడు పోసి రక్తపు మడుగులోనే బంధించిన కామాంధుడు అధికారుల జోక్యంతో బాధితురాలికి విముక్తి ఆస్పత్రిలో కోలుకుంటున్న తల్లీబిడ్డ మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడూ మానవత్వం ఉన్నవాడు... యాడ ఉన్నాడో కాని కంటికి కానరాడు! అన్న కవి మాటలు అక్షర సత్యాలయ్యాయి. మానవత్వం మరిచిన కిరాతక తండ్రి తన పదహారేళ్ల కుమార్తెపై నిరంతర అత్యాచారం సాగించాడు. ఈ విషయాన్ని బయట పెట్టకుండా ఆమెను గదిలో నిర్బంధించాడు. చివరకు బాలిక గర్భం దాల్చింది. నెలలు నిండాయి. ఆస్పత్రికి తీసుకెళితే గుట్టురట్టు అయితే తన ఉనికికే ప్రమాదమని భావించి మానవత్వాన్ని మంటగలిపాడు. పురిటినొప్పులతో బాధపడుతున్న బాలికకు తానే పురుడు పోశాడు. తర్వాత ఏమి చేయాలో అర్థం కాక నెత్తుటి మడుగులో నిర్ధాక్షిణ్యంగా వదిలి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసిన ఆ కామాంధుడు చివరకు ఊచలు లెక్కిస్తున్నాడు. శివమొగ్గ : కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ తండ్రి తన 16ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కర్ణాటక శివమొగ్గ పోలీసుల సమాచారం మేరకు... కార్కలకు చెందిన కెంప(45)కి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతని ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో కొన్ని సంవత్సరాల క్రితమే ఇద్దరు బిడ్డలను తీసుకుని భార్య విడిపోయింది. ఓ కుమార్తెతో పాటు కెంప శివమొగ్గ తాలూకాలోని కాచినకొప్ప సమీపంలో ఉన్న మండఘట్ట గ్రామ శివారులో నివాసం ఉంటున్నాడు. అక్కడే గొర్రెల పెంపక కేంద్రంలో కూలీగా చేరాడు. ఇంటిలో ఒంటరిగా ఉంటున్న కుమార్తె(16)పై కొన్ని సంవత్సరాలుగా కెంప అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని బయట పెడితే హతమారుస్తానని బెదిరించడంతో పాటు ఆమెను ఇంటిలో బంధించాడు. తన జరుగుతున్న దౌర్జన్యాన్ని ఆమె కన్నీట మధ్యనే దాచుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె గర్భం దాల్చిటంతో నెలలు నిండాయి. శనివారం సాయంత్రం పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళితే గుట్టురట్టు అవుతుందని భావించిన కెంప ఆఖరుకు ఇంటిలోనే కుమార్తెకు పురుడు పోశాడు. తర్వాత ఏమి చేయాలో అర్థంకాక రక్తం మడుగులోనే తల్లీబిడ్డను వదిలేశాడు. జనావాసాలకు దూరంగా వీరుంటున్న ఇల్లు ఉండడంతో ఈ విషయం ఎవరికీ తెలియలేదు. కాగా బుధవారం ఉదయం అటుగా కూలీ పనులకు వెళ్లిన మహిళలకు బాలిక ఏడుపు వినిపించడంతో వెళ్లి చూశారు. నెత్తుటి మడుగులో అత్యంత దయనీయంగా పడి ఉన్న తల్లీబిడ్డను చూసి వెంటనే గ్రామస్తుల సాయంతో పోలీసులకు తెలిపారు. ఘటనాస్థలికి కోటె పోలీస్ స్టేషన్ సీఐ దీపక్ హెగ్డే, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ అనితాకుమారి చేరుకుని పరిశీలించారు. బాధితురాలి నుంచి విషయం తెలుసుకుని అక్కడే ఉన్న కెంపను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాధితురాలని చిన్నారితో సహా శివమొగ్గలోని మెగ్గాన్ ఆస్పత్రికి ఆఘమేఘాలపై తరలించారు. సమాచారం అందుకున్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాలిక కోలుకున్న తర్వాత శిశు సంక్షేమ శాఖ కేంద్రానికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో తల్లీబిడ్డ కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. -
అంతులేని వ్యథ
పాతబస్తీ.. హైదరాబాద్ షాన్కెంత ప్రసిద్ధో.. గరీబీకీ అంతే పరిచయం! ఆ పేదరికం.. అనుభవించేవాళ్లనందరినీ కష్టపెడుతున్నా బలికోరుతున్నది మాత్రం ఆడపిల్లలనే! ఎప్పుడో జరిగిన అమీనా నిఖానే కాదు ఇప్పటికీ ఆగని ఆ పెళ్లిళ్లు, బాలికావధువులే అందుకు ఉదాహరణ.. ఇప్పుడు చదవబోయే రుబీనా (పేరు మార్చాం) కథ కూడా అలాంటిదే.. ..:: సరస్వతి రమ జావేద్ఖాన్ (పేరు మార్చాం), రజియా (పేరు మార్చాం)లకు ముగ్గురు ఆడపిల్లలు. వాళ్లలో పెద్దమ్మాయే రుబీనా. జావేద్ఖాన్ భార్య రజియాని బాగా హింసించేవాడు. అది తట్టుకోలేక రజియా ఇంట్లోంచి వెళ్లిపోయింది. అప్పుడు రుబీనాకు మూడేళ్లు. రజియా వెళ్లిపోవడంతో ముగ్గురు పిల్లల్ని తన తల్లిదగ్గర వదిలాడు జావేద్ఖాన్. ఓ నాలుగేళ్లు నానమ్మ దగ్గరున్నారు పిల్లలు. తర్వాత.. రుబీనా నానమ్మకు గల్ఫ్‌లో పనిదొరకడంతో ఆ దేశానికి టేకాఫ్ అయింది. పిల్లలు తల్లి గూటికి చేరారు. అప్పటికే రజియా ఇంకో పెళ్లిచేసుకుంది. ఇటు జావేద్ఖాన్ తాగుడికి బానిసయ్యాడు, డ్రగ్స్‌కీ అలవాటు పడ్డాడు. రుబీనా సవతి తండ్రి ఈ పిల్లల్ని శ్రద్ధగా చూసేవాడుకాదు. బాగా కొట్టేవాడు. స్కూల్‌కి పంపకుండా దగ్గర్లో కార్ఖానాల్లో పనికి పంపేవాడు. అదంతా రజియాకు మళ్లీ హింసలా తయారైంది. పదమూడేళ్లు వచ్చేసరికి.. ముగ్గురు పిల్లల్నీ తీసుకొని ఇల్లు వదిలింది రజియా. పాతబస్తీలోనే ఓ ఇల్లు తీసుకొని ఉండసాగింది. ఓ ఏడాది గడిచాక నెమ్మదిగా రుబీనాకు పెళ్లిచేసేస్తే తన బాధ్యత కొంత తీరుతుందనుకొని ఆ పిల్లకు సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. ఈలోపే సవతి తండ్రి మళ్లీ వీళ్లను చేరాడు. దాంతో ముగ్గురు పిల్లల్ని తన తల్లి దగ్గర పెట్టింది రజియా. అయితే అమ్మమ్మ పద్నాలుగేళ్ల రుబీనాకు 55 ఏళ్ల అరబ్ షేక్‌తో పెళ్లి జరిపించింది. రుబీనా అసలు తండ్రితోపాటు, సవతి తండ్రీ వచ్చి ఆమె అమ్మమ్మతో గొడవ పెట్టుకున్నారు. అంతా అయిపోయాక ఎంత గొడవపడితే ఏం లాభం? మళ్లీ ఇంటికి.. ఈ వ్యవహారం సద్దుమణిగాక రజియా మిగిలిన ఇద్దరు పిల్లల్ని సముదాయించి, వాళ్లను తీసుకొని రెండో భర్తతో వెళ్లిపోయింది. ఓ రెండు నెలలు గడిచాయి. అరబ్‌షేక్ వెళ్లిపోయాడు. రుబీనా తల్లిదగ్గరికి వచ్చేసింది. ఓ వారానికి రుబీనా గర్భవతి అని తేలింది. అరబ్షేక్కి ఫోన్‌చేసి విషయాన్ని చెవినవేశారు. ‘అయితే నాకేంటి? నాకెందుకు ఫోన్ చేస్తున్నారు? చేయొద్దు’ అంటూ నోటికొచ్చినట్టు తిట్టి ఫోన్‌పెట్టేశాడు. ఆరు నెలల వరకు డబ్బులు పంపించి ఆపై ఆపేశాడు. అంతేకాదు రుబీనాను అనుమానిస్తూ ఆమెకు వివాహేతర సంబంధం ఉందంటూ నిందవేశాడు. రుబీనా ఆడపిల్లను కన్నది. బిడ్డ పుట్టిందని మళ్లీ అరబ్షేక్కి ఫోన్ చేసినా అక్కడి నుంచి ఎలాంటి పలుకూ లేదు. మధ్యవర్తుల ద్వారా చెప్పించినా స్పందనలేదు. ఇంట్లో భయంకరమైన పేదరికం. ముగ్గురు పిల్లలకు తోడు చంటిది. పాలబొట్టూ కరువైంది ఆ పసిదానికి. రెండో తప్పు.. ఈ పేదరికం నుంచి బయటపడటానికి రజియా తన రెండో కూతురికీ అరబ్షేక్ని వె దికింది. అక్క జీవితాన్ని కళ్లారా చూసిన ఈ చెల్లి తనకూ అదే గతి పడుతుందని గ్రహించి ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే రుబీనా తన కూతురు, మూడో చెల్లెలితో తండ్రి దగ్గరికి వచ్చేసింది. కొన్నాళ్లు బాగానే చూసుకున్నాడు. తర్వాత రోడ్డుమీదకి తెచ్చాడు. మళ్లీ తల్లి ఇల్లే గతి అయింది వాళ్లకు. ఈసారి సవతి తండ్రి రుబీనాకు ఆఫ్రికన్ వరుడిని వెదికాడు. ప్రమాదం పసిగట్టిన రుబీనా బిడ్డను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. తర్వాత నిస్సహాయులైన మహిళలకు ఆసరగా నిలుస్తున్న ‘షాహీన్’ సంస్థను చేరుకుంది. అక్కడే టైలరింగ్ నేర్చుకుంటూ తన బిడ్డకు మంచి జీవితాన్నివ్వాలని ఆశపడుతోంది. ఆమె కూతురికిప్పుడు నాలుగేళ్లు. రుబీనా ఎంచుకున్న దార్లో ఆమెను నడవనిద్దాం.. అలసిపోయినప్పుడు అండగా నిలబడదాం.. ఆ పసిబిడ్డను కాపాడుకుందాం! -
గులాబీ.. లాభాల జిలేబీ!
మండలంలోని హైతాబాద్, మద్దూరు, సోలిపేట్, సర్దార్‌నగర్, పెద్దవేడు, రేగడిదోస్వాడ, అప్పరెడ్డిగూడ, మల్లారెడ్డిగూడ తదితర గ్రామాల రైతులు పూల సాగుపై మక్కువ చూపిస్తున్నారు. గులాబీ రకాలైన రుబీ, టైగర్, సెంట్, ముత్తు తదితర రకాలతోపాటు ఫైవ్‌స్టార్ రకం గులాబీని అధికంగా సాగు చేస్తున్నారు. ఆయా గ్రామాల రైతులు తక్కువ పెట్టుబడితో.. అధికారుల సూచనలు పాటిస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. గులాబీ తోటలు సాగు చేయడానికి ప్రభుత్వం రాయితీలను సైతం అందిస్తోంది. బెంగళూర్‌లోని హొసూరు పట్టణంలోని నర్సరీల్లో ఒక్కో మొక్క రూ.15 నుంచి రూ.20 వరకు లభిస్తుంది. వీటిని తెచ్చి రైతులు పూల సాగు చేస్తున్నారు. అందుబాటులో మార్కెట్ సదుపాయం హైదరాబాద్ గుడిమల్కాపూర్ పూల మార్కెట్ రైతులకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం కిలో పూలు రూ.50 ధర పలుకుతున్నాయి. వేసవిలో, పెళ్లిళ్లు, పూజలు, పండగలు తదితర సీజన్లలో రూ.150 నుంచి 200 వరకు కిలో పూలు విక్రయిస్తారు. ఏడాది పొడవునా పూలు పూయడంతో ధర హెచ్చు తగ్గులైనా ఎకరానికి ఖర్చులు పోను రూ.50 వేలకుపైనే లాభాలు వచ్చే అవకాశం ఉంది. సాగు ఇలా.. అన్ని పంటల మాదిరిగానే గులాబీ పంటకు కూడా దుక్కి కలియ దున్నాలి. మొక్కల మధ్య మూడు అడుగులు, సాగుకు మధ్య ఆరు అడుగులు ఉండేలా రెండు అడుగుల లోతు గుంతలు తీసుకోవాలి. గుంతలు తీసిన మట్టిలో సేంద్రియ ఎరువు, గుళికలు, ట్రైకోడర్మవిరిడితో కలిపి సగం వరకు పూడ్చాలి. మొక్కలకున్న పాలిథిన్ కవర్లు తీసివేసి నాటాలి. మామిడి, జామ తదితర పండ్ల తోటల్లోనూ అంతర పంటలుగా గులాబీ సాగుచేయవచ్చు. ఎకరానికి 2500 నుంచి 3 వేల మొక్కలు నాటవచ్చు. నెలరోజుల అనంతరం మొగ్గలు వచ్చే సమయంలో రసాయనిక ఎరువులు డీఏపీ, క్యాల్షియం పొటాష్ కూడా వేయాలి. నెలరోజుల నుంచి మొగ్గలు తొడిగి పూలు పూస్తూనే ఉంటాయి. చీడపీడల బెడద పెద్దగా ఉండదు. మచ్చతెగులు, పచ్చ పురుగు నివారణకు మోనోక్రోటోఫాస్ లేదా క్లోరోపైరిఫాస్ మందును లీటర్ నీటికి 30 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. మొక్కలు పెరిగేంతవరకు తోట సేద్యం, యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చేస్తూనే ఉండాలి. పూలు పూయడం ప్రారంభమయ్యాక రోజు విడిచి రోజు పూలను తెంపుకోవచ్చు.