రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): ఉవ్వెత్తున ఎగిసిన మంటలు.. దట్టమైన పొగ.. వివిధ పనుల మీద నగరానికి వచ్చి లాడ్జీలో బస చేసినవారు ఉక్కిరిబిక్కిరయ్యారు. మిగతావారు ఎలాగో తప్పించుకునా ఏడుగురు కాలినగాయాలు, పొగతో ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నట్టు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. 13 మంది గాయపడినట్లు సమాచారం కాగా వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘోర దుర్ఘటన సోమవారం రాత్రి సికింద్రాబాద్‌లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.
రాత్రి సేద తీరుతుండగా..: ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. సెయింట్ మేరీస్ రోడ్డులోని మనోహర్ థియేటర్ ఎదురుగా రంజిత్ సింగ్ బగ్గా అనే వ్యక్తి రూబీ ఎలక్ట్రికల్ స్కూటర్స్ పేరుతో బైక్‌ల షోరూమ్ నిర్వహిస్తున్నా రు. ఈ షోరూమ్ సెల్లార్‌లో ఉండగా, ఆపై నాలుగు అంతస్తుల్లో రూబీ డీలక్స్ హోటల్‌ను నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో సెల్లార్‌లోని షోరూమ్ నుంచి మంటలు చెలరేగాయి. ఇందులో ఎలక్ట్రికల్ బైక్‌ల బ్యాటరీలు పేలి భారీ శబ్దాలతో పాటు మంటలు వ్యాపించాయి. నాలుగు అంతస్తుల్లోని లాడ్జీ గదుల్లోకి మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన కొంతమంది హోటల్ గదుల నుంచి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. కొందరు మాత్రం దట్టమైన పొగల కారణంగా బయటకు రాలేక గదుల్లో చిక్కుకుపోయారు.
లాడ్జీలో 23 మంది..: హోటల్‌లో వ్యాపారాల నిమిత్తం ఉత్తర భారత దేశం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు 23 మంది ఉన్నట్లు తేలింది. దట్టమైన పొగలు పైన ఉన్న గదుల్లోకి వ్యాపించడంతో చాలామంది పై నుంచి కిందకు దిగేందుకు వీలులేకుండా పోయింది. ఓ మహిళతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు డ్రైనేజీ పైప్‌ల ద్వారా నాలుగు, మూడో అంతస్తుల నుంచి కిందకు దిగారు. వీళ్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అలాగే దీన్ని ఆనుకుని ఉండే యాత్రి ఇన్ హోటల్ మీదుగా మరికొంత మంది ప్రాణాలతో బయట పడ్డారు. వీరికి సైతం ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో గాలి తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. ఫైర్ సిబ్బంది స్నారికల్ వాహనం ద్వారా కొంత మందిని కిటికీల నుంచి బయటకు రప్పించి రక్షించారు. ఒక మహిళతో పాటు మరో ముగ్గురు గదుల్లో అపస్మారక స్థితిలో పడిఉండగా బయటకు తీసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. కాలిన గాయాలైన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించగా మిగతా వారిని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. మార్కెట్ పోలీసులు, సికింద్రాబాద్ ఫైర్ స్టేషన్ సిబ్బంది, డీఆర్‌ఎఫ్ సిబ్బంది, పెద్దసంఖ్యలో స్థానికులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాధితులు కిటికీల నుంచి హెల్ప్ హెల్ప్ అని అరుస్తుండగా అక్కడికి చేరుకున్న స్థానికులు వారికి నిచ్చెనలు అందించి, పైప్‌ల ద్వారా దిగేలా సహాయం చేశారు. మరికొంత మంది పొగలోనే లోపలికి వెళ్లి గదుల్లో ఉండే వారిని బయటకు తీసుకుని వచ్చారు. అగ్ని ప్రమాద ఘటన తెలియగానే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హోంమంత్రి మహమూద్ అలీ కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు.
అంతా క్షణాల్లోనే: కేశవులు, చెన్నై
చెన్నై నుంచి వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ వచ్చాను. రాత్రి 9 గంటలకు హోటల్‌లో దిగాను. అంతలోపే ప్రమాదం జరిగింది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. స్థానికుల సహాయంతో 4వ అంతస్తు నుంచి పైౖౖపులు పట్టుకుని కిందకు దిగాను.
ఇది మరో జన్మ: ఉమేష్ ఆచార్య, ఒడిశా
ఒడిశా నుంచి ఆఫీస్ పనిమీద హైదరాబాద్ వచ్చాను. 4వ అంతస్తులో ఉన్నాను. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసింది. మెట్ల నుంచి వెళ్లే అవకాశం కనిపించలేదు. వెంటనే ప్రాణాలు కాపాడుకోవాలంటే పైపులు పట్టుకుని దిగాలని «ధైర్యం చేశా. పైపులు పట్టుకుని కిందికి దిగాను. ఇది నాకు మరో జన్మ. పొగ పీల్చుకోవడంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది.
ఇదీ చదవండి: మళ్లీ.. గోదావరి ఉగ్రరూపం
Comments
Please login to add a commentAdd a comment