బనశంకరి: బెంగళూరులోని రాజ్‌కుమార్ రోడ్డులో ఎలక్ట్రిక్ బైక్ షోరూం అగ్నిప్రమాదం ఘటనలో షోరూం యజమాని పునీత్, మేనేజర్ యువరాజ్‌ని బుధవారం రాజాజీనగర పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో మంటలు వ్యాపించి పెద్దసంఖ్యలో వాహనాలు, షోరూం మొత్తం కాలిపోయాయి. స్కూటర్లలోని బ్యాటరీలు పేలిపోవడంతో మంటలు ఇంకా విజృంభించాయి. మంటలను చూసి ప్రియా అనే ఉద్యోగిని తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది.
చివరకు మంటలు వ్యాపించి ఆమె సజీవ దహనమైంది. మరికొందరు బయటకు పరుగులు తీయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రియ బుధవారమే 27వ పుట్టిన రోజును జరుపుకోవాల్సి ఉంది, అంతలోనే ఘోరం జరిగింది. తన కూతురి భద్రత గురించి షోరూం సిబ్బంది పట్టించుకోలేదని ఆమె తండ్రి ఆర్ముగం విలపించాడు. పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది షోరూంని పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.
ఇష్టపడి కొంటే.. బూడిదైంది
కృష్ణరాజపురం: ఎంతో మురిపెంగా కొన్న ఈవీ స్కూటర్.. అగ్ని ప్రమాదంలో కాలిపోవడంతో ఆ దంపతుల బాధకు అంతులేదు. మంజునాథ్ అనే వ్యక్తి ఇటీవల రూ.70 వేలకు రాజాజీనగరలోని షోరూంలో ఓ బ్యాటరీ స్కూటర్‌ని కొన్నారు. పికప్ లేదని, సర్వీసింగ్ చేసివ్వాలని షోరూంలో వదిలారు. సర్వీసింగ్ చేసి బైక్‌ను సిబ్బంది సిద్ధం చేశారు. అయితే బైక్‌ను తీసుకెళ్లేలోగా మంగళవారం సాయంత్రం షోరూంలో అగ్నిప్రమాదం జరిగి ఆయన స్కూటర్ కూడా మంటల్లో కాలిపోయింది. తమకు షోరూంవారు పరిహారం ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment