Secunderabad fire accident
-
Deccan Mall Fire Mishap: ఇక నేలమట్టమే.. అంచనా వ్యయం రూ. 41 లక్షలు
సాక్షి, హైదరాబాద్: అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్ కార్పొరేట్ భవనం కూల్చివేతకు జీహెచ్ఎంసీ యంత్రాంగం సిద్ధమవుతోంది. అధునాతన యంత్రాలతో కూల్చివేసేందుకు సంబంధిత కాంట్రాక్టు ఏజెన్సీలను ఆహ్వానిస్తూ ఒక్కరోజు గడువుతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి బిడ్ డాక్యుమెంట్ డౌన్‌లోడ్‌కు అవకాశమిచ్చి, బుధవారం 10.30 గంటల వరకు దాఖలుకు గడువునిచ్చింది. గడువు ముగియగానే టెండర్లు ఓపెన్‌చేసి ఏజెన్సీని ఖరారు చేయనున్నారు. అంచనా వ్యయం రూ.41 లక్షలు. టెండర్ దాఖలుకు ఎంపికైన ఏజెన్సీకి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ (ఎల్ఓఏ) ఇచ్చాక నాలుగు గంటల్లో కూల్చివేత ప్రక్రియకు అవసరమైన యంత్ర సామగ్రి తరలింపు పనులు చేపట్టాలని అధికారులు తెలిపారు. కూల్చివేతకు సంబంధించి పోలీసు, రెవెన్యూ అధికారుల నుంచి క్లియరెన్స్ కోరుతున్నామన్నారు. ఆర్సీసీ శ్లాబులు, బీమ్స్, కాలమ్స్, మిషనరీ వాల్వ్‌లు, తలుపులు, షట్టర్లు, ర్యాక్స్, కిటికీలు, వెంటలేటిర్లతో పాటు ఇతరత్రా మొత్తం భవనాన్ని కూల్చాలని టెండరు నిబంధనల్లో పేర్కొన్నారు. పోలీసు, ఫైర్, ఈవీడీఎం అధికారుల సమన్వయంతో భవనాన్ని కూల్చనున్నారు. బాధ్యత కాంట్రాక్టు ఏజెన్సీదే.. కూల్చివేతకు అవసరమైన యంత్ర సామగ్రితో పాటు తగిన సేఫ్టీ ఏర్పాట్ల బాధ్యత కాంట్రాక్టు ఏజెన్సీదే. కూల్చివేత సందర్భంగా ఏదైనా ప్రమాదం జరిగితే కాంట్రాక్టు చట్టాల మేరకు నష్టపరిహారానికి ఏజెన్సీ బాధ్యత వహించాల్సి ఉంటుందని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. కూల్చివేతలకు సంబంధించి చట్టాలు, నిబంధనల మేరకు వ్యవహరించాలని పేర్కొంది. పరిసర ప్రజలకు నష్టం వాటిల్లకుండా, దుమ్ము, శబ్దం వల్ల ఇబ్బందులు తలెత్తకుండా బారికేడింగ్‌తో సహా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని తెలిపింది. వీటితోపాటు కూల్చాల్సిన భవనానికి విద్యుత్, వాటర్, శానిటరీ కనెక్షన్లను తొలగించాలని పేర్కొంది. కూల్చివేతలో పాల్గొనే సిబ్బందికి రక్షణ పరికరాల బాధ్యత తదితరమైనవన్నీ ఏజెన్సీదేనని స్పష్టం చేసింది. వెలువడే డెబ్రిస్‌ను సైతం ఏజెన్సీయే రీసైక్లింగ్ ప్లాంట్‌కు తరలించాల్సి ఉంది. ఈ పని పూర్తిచేసే కాంట్రాక్టు ఏజెన్సీకి చెల్లింపులు మిగతా కాంట్రాక్టర్ల మాదిరిగానే జీహెచ్ఎంసీలో నిధుల లభ్యతను బట్టి జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. ప్రాధాన్యతతో ముందస్తుగా చెల్లించలేమని తెలిపారు. అగ్నిప్రమాదం జరిగాక భవనం పటిష్టతను పరిశీలించిన వరంగల్ ఎన్ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు బృందం భవనం పటిష్టత 70 శాతానికి పైగా దెబ్బ తిన్నదని, దీనిని కూల్చివేయాల్సి ఉంటుందని అదేరోజు జీహెచ్ఎంసీ అధికారులకు తెలిపారు. కూల్చివేతకు సంబంధిత విభాగాల నుంచి క్లియరెన్స్ రాగానే పనులు చేపట్టేందుకు జీహెచ్ఎంఈసీ అధికారులు సిద్ధమవుతున్నారు. కూలి్చవేతల వల్ల దాదాపు 20వేల మెట్రిక్ టన్నుల డెబ్రిస్ వెలువడనుందని అంచనా. కూల్చివేతల్లోనే గాలింపు సాక్షి, సిటీబ్యూరో/రాంగోపాల్‌పేట: సికింద్రాబాద్ మినిస్టర్స్ రోడ్‌లోని రాధా ఆర్కేడ్‌లో ఉన్న ‘డెక్కన్ కార్పొరేట్’ అగ్నిప్రమాదంలో అసువులు బాసిన ఆ ఇద్దరి మృతదేహాలకు సంబంధించిన అవశేషాలను భవనం కూల్చివేత, శిథిలాల తొలగింపు సమయంలోనే వెతకాలని పోలీసులు నిర్ణయించారు. ప్రస్తుతం రాధా ఆర్కేడ్ పరిస్థితి, దాని వల్ల చుట్టుపక్కల భవనాలకు ముప్పు తదితరాలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఈ అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే భవనం కూల్చివేత పనులకు జీహెచ్ఎంసీ అధికారులు సైతం టెండర్ పిలిచారు. అగ్నిప్రమాదం జరిగిన రోజు గల్లంతైన ‘డెక్కన్’ ఉద్యోగులు జునైద్, వసీం, జహీర్‌ల్లో శనివారం ఒకరి అవశేషాలు లభించాయి. మిగిలిన ఇద్దరివీ వెలికితీయడం ఎలా అనే అంశంపై పోలీసు విభాగం పెద్ద కసరత్తే చేసింది. ఈ భవనానికి సంబంధించిన సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్, మొదటి, రెండు, మూడో అంతస్తుల శ్లాబ్స్ వెనుక వైపు కూలిపోయాయి. వాటి కిందే అవశేషాలు ఉంటాయని నిర్ధారించారు. పెద్ద పరిమాణంలోని సిమెండ్ దిమ్మెల మాదిరిగా ఉన్న ఈ శిథిలాలను తొలగించడానికి యంత్రాలు వినియోగిస్తే అది ప్రమాద హేతువుగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా భవనాలు కూలిపోయి ఎవరైనా శిథిలాల్లో గల్లంతైన పరిస్థితుల్లో వారి ఆచూకీ కనిపెట్టడానికి శిక్షణ తీసుకున్న జాగిలాలను వినియోగిస్తారు. వాసన చూడటం ద్వారా అవి గల్లంతైన, శిథిలాల్లో చిక్కుకున్న వారి ఆచూకీ కనిపెట్టేస్తాయి. ‘డెక్కన్’లో జరిగింది అగ్నిప్రమాదం కావడంతో అక్కడ పొగ వాసన మాత్రమే ఉంటుంది. ఈ కారణంగా పోలీసు జాగిలాలు సైతం అవశేషాలను గుర్తించలేవు. కూలడానికి సిద్ధంగా ఉన్న ఆ భవనాన్ని జాగ్రత్తల మధ్య కూల్చివేసే వరకు చట్టుపక్కల ఇళ్లల్లోకి ఎవరినీ అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గత గురువారం నుంచి ఇళ్లకు దూరంగా ఉన్న వారి నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న అధికారులు రాధా ఆర్కేడ్‌ను ప్రణాళికాబద్ధంగా కూల్చివేయాలని నిర్ణయించారు. ఆ శకలాలను సాంకేతికంగా తొలగించాలని, ఆ సందర్భంలోనే అవశేషాల కోసం గాలించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్‌లో పోలీసు, అగి్నమాపక, జీహెచ్ఎంసీ అధికారులతో పాటు డీఆర్ఎఫ్, క్లూస్ టీమ్‌లను వినియోగించాలని నిర్ణయించారు.‘డెక్కన్’ భవనం కూలి్చవేయాల్సిందే -
డెక్కన్ మాల్ రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేత.. బిల్డింగ్ కూల్చివేతపై సందిగ్ధం
రాంగోపాల్‌పేట్: సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్లో అగ్ని ప్రమాదం జరిగిన డెక్కన్ భవనంలో సెర్చ్ ఆపరేషన్ నిలిచిపోయింది. ఈ నెల 19వ తేదీన ఆరు అంతస్తుల ఈ భవనంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం విదితమే. అదే రోజు డెక్కన్ నిట్‌వేర్‌లో పనిచేసే జునైద్, జహీర్, వాసిం భవనంలోకి వెళ్లి కనిపించకుండా పోయారు. మూడు రోజులుగా పాటు ఫైర్, డీఆర్ఎఫ్, పోలీసులు భవనం మొత్తం జల్లెడ పట్టి గాలించారు. ఈ నెల 21వ తేదీన భవనంలోని మొదటి అంతస్తులో ఒకరి మృతదేహం ఆనవాళ్లు మాత్రమే బయటపడ్డాయి. ఆదివారం కూడా అధికారులు గల్లంతైన వారి కోసం భవనం మొత్తం గాలించారు. కానీ ఎవరి ఆచూకీ లభించడలేదు. ► భవనం వెనుక వైపు గ్రౌండ్ నుంచి మూడో అంతస్తు వరకు శ్లాబులు కూలిపోయి శిథిలాలు మొత్తం మొదటి సెల్లార్లో పడ్డాయి. వాటి కిందే మృతదేహాలు ఉంటాయనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద శిథిలాలను కదిలించే పరిస్థితి లేకపోవడంతో ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. జేసీబీ లాంటి యంత్రాలను తీసుకుని వెళ్లే పరిస్థితి కూడా లేదు. దీంతో సోమవారం కూడా అధికారులు భవనం లోపలికి వెళ్లలేదు. ► భవనం లోపల సెర్చ్ ఆపరేషన్ చేసేందుకు ఫైర్, పోలీసు అధికారులు భయపడుతున్నారు. దీంతో ఇప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వేచిచూస్తున్నారు. కానీ గల్లంతైన వారి బంధువులు మాత్రం తమవారి ఆచూకీ తెలిసేంత వరకు భవనం కూలి్చవేయవద్దని అంటున్నారు. దీంతో అధికారులు సందిగ్ధావస్థలో పడ్డారు. ► ఆచూకీ దొరకని జునైద్, వాసీం, జహీర్‌ల బంధువులను సోమవారం రాంగోపాల్‌పేట్ ఇన్స్పెక్టర్ లింగేశ్వర్‌రావు పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. వారి రక్త నమూనాల కోసం వివరాలు సేకరించి వారిని ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. ఎఫ్ఎస్ఎల్లో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి ఇటీవల దొరికిన మృతదేహం ఎవరిది అనే విషయాన్ని నిర్ధారించనున్నారు. చదవండి: స్మిత సబర్వాల్ ఇంట్లోకి చొరబాటు.. ఆనందకుమార్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు -
‘డెక్కన్’లో అగమ్యగోచరం! నాలుగో రోజూ లభించని ఆ ఇద్దరి అవశేషాలు
సాక్షి, హైదరాబాద్/రామ్‌గోపాల్‌పేట: సికింద్రాబాద్ రాధా ఆర్కేడ్లోని ‘డెక్కన్ కార్పొరేట్ ’లో జరిగిన అగ్నిప్రమాదంలో గల్లంతైన ఉద్యోగుల అవశేషాలు ఆదివారం సాయంత్రానికి కూడా లభించలేదు. గల్లంతైన జునైద్, వశీం, జహీర్‌ల్లో శనివారం సాయంత్రం ఒకరి అవశేషాలు లభించగా, మరో ఇద్దరివి వెలికితీసే పనిలో పోలీసు, అగి్నమాపక శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. అగ్నిప్రమాదం జరిగిన గురువారం నుంచి వేడి సెగలు కక్కుతున్న ఈ భవనం ఆదివారం నాటికి కాస్త చల్లబడింది. దీంతో డ్రోన్లకు బదులుగా నేరుగానే గాలింపు చేపట్టారు. అయితే ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో కూలిన శ్లాబుల కింద రెండు మృతదేహాలు (అవశేషాలు) ఉండి ఉంటాయని భావిస్తున్నారు. శ్లాబులు పెద్ద పరిమాణంలో ఉన్న నేపథ్యంలో కూలీలు తీయలేకపోతుండటంతో జేసీబీ వంటివి వాడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఆ యంత్రాలను వినియోగిస్తే శిథిలావస్థలో ఉన్న భవనం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏం చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ అంతస్తుల్లో ఆస్తి నష్టం కూడా జరగలేదు.. గాలింపు బృందాలు ఆదివారం భవనంలోని అన్ని అంతస్తులనూ పరిశీలించాయి. సెల్లార్–1, గ్రౌండ్ ఫ్లోర్, మొదటి, రెండు, మూడో అంతస్తుల్లోని సరుకు మాత్రమే అగ్నికి ఆహుతైనట్లు గుర్తించారు. నాలుగో అంతస్తులో ఉన్న సామాను, సంచులతో పాటు ఐదు, ఆరో అంతస్తుల్లోని రహీం ఇంటిలోని ఫర్నీచర్ యథాతధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అక్కడ పొగ, మసి చూరుకుపోవడం తప్పించి ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని పేర్కొంటున్నారు. శనివారం లభించిన అవశేషాలతో పాటు ఆ ముగ్గురు యువకుల బంధువుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. చదవండి: అణచివేతకు గురయ్యే వారిని ప్రేమించాలని చెప్పేవారు -
Photos: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన డెక్కన్ మాల్
-
సికింద్రాబాద్ డెక్కన్ మాల్ ఘటనలో ముగ్గురు మృతి
-
డెక్కన్ మాల్ అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి.. ఫోన్ సిగ్నల్స్ మాత్రం వారివే!
హైదరాబాద్: సికింద్రాబాద్ డెక్కన్ మాల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. వీరి మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి బూడిద అయినట్లు తెలుస్తోంది. ఎముకలు, టీత్ పరీక్ష ద్వారానే ఈ బాడీస్‌ను గుర్తించే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. గురువారం అగ్నిప్రమాదం సంభవించినప్పుడు లోపల చిక్కుకున్న నలుగురిని సిబ్బంది కాపాడారు. అయితే వసీం, జునైద్, జహీర్ అనే ముగ్గురు మాత్రం షెటర్లు మూసేందుకు మంటల్లోనే లోపలికి వెళ్లారు. నిన్న రాత్రి వరకు వాళ్ల ఆచూకీ తెలియరాలేదు. దీంతో శుక్రవారం ఉదయం మళ్లీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు అగ్నిమాపక సిబ్బంది. ఈ క్రమంలోనే ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే ఇవి వారివేనా కాదా? అని నిర్ధారించాల్సి ఉంది. మరోవైపు ఘటనా స్థలంలోనే గల్లంతైన యువకుల ఫోన్ సిగ్నల్స్ చూపిస్తున్నాయని అధికారులు తెలిపారు. -
డెక్కన్ మాల్ ను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
-
బిల్డింగ్ యజమానిని విచారిస్తున్నాం : ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి
-
డెక్కన్ మాల్ అగ్ని ప్రమాదంపై కేసు.. గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ డెక్కన్ మాల్లో గురువారం జరిగిన అగ్నిప్రమాదంపై కేసు నమోదైంది. కానిస్టేబుల్ బలప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి భవనం యజమాని మహమ్మద్ ఓవైసీ, ఎంఏ రహీంలు కారణమని గుర్తించారు. ఈ ఘటనలో నలుగురిని రెస్క్యూ చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. భవనానికి సెట్ బ్యాక్ లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు మంటల్లో చిక్కుకున్న ముగ్గురు వసీం, జునైద్, జహీర్ కోసం అగ్నిమాపక సిబ్బంది భవనంలోకి వెళ్లారు. బిల్డింగ్ ఓనర్‌ను కూడా లోపలికి తీసుకెళ్లారు. నిన్న అగ్ని ప్రమాద ఘటనలో అస్వస్థతకు గురైన ఫైర్ సిబ్బంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారంతా నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఇంకా అదుపులోకి రాని మంటలు.. డెక్కన్ మాల్లో మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. భవనం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. భవనం దగ్గరికి ఎవరినీ అనుమతించడం లేదు. సెల్లార్లో చిక్కుకున్న వారిపై ఇంకా స్పష్టత రాలేదు. పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భవన యజమానిపై చర్యలకు అధికారులు సిద్దమవుతున్నారు. మంటల్లో కాలిపోయిన భవనాన్ని జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించనున్నారు. చదవండి: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. రోజంతా మంటలే! -
ఎప్పుడు ప్రమాదాలు జరిగినా ఇంతే.. తనిఖీలెక్కడ?
సాక్షి, సిటీబ్యూరో: ఎప్పుడు ప్రమాదాలు జరిగినా ఇకపై ఇలా జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని, మంత్రులు, అధికారులు ప్రకటించడం పరిపాటిగా మారింది. అంతకుమించి ఆ తర్వాత చర్యలుండటం లేవు. భవనాలు కూలినా అంతే. అగ్నిప్రమాదాలు జరిగినా అదే వైఖరి. తాజాగా సికింద్రాబాద్ మినిస్టర్రోడ్లో అగ్నిప్రమాదం జరిగిన భవనాన్ని పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ జనావాసాల మధ్య అనుమతుల్లేకుండా ఏర్పాటు చేసిన గోడౌన్లు, తదితరమైన వాటిపై స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు. గత సంవత్సరం బోయగోడలో స్క్రాప్గోడౌన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మరణించినప్పుడు సైతం ఇలాంటి ప్రకటనలే చేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఏంచేశారో ఎన్ని భవనాలు తనిఖీలు చేశారో, ఎలాంటి చర్యలు తీసుకున్నారో జీహెచ్ఎంసీ ఫైర్‌సేఫ్టీ విభాగం వెల్లడించలేదు. అప్పట్లో హోంమంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ఏమైందో తెలియదు. గోడౌన్లు, షోరూమ్‌లు, హోటళ్లు, హాస్పిటళ్లు, పబ్‌ల దాకా అదే పరిస్థితి వేటికీ నిబంధనల మేరకు సెట్‌బ్యాక్‌లుండవు, ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు అసలే ఉండవు. గత సంవత్సరమే ఖాజాగూడ, తదితర ప్రాంతాల్లోనూ జరిగిన అగ్ని ప్రమాదాలు నగర ప్రజలింకా మరచిపోలేదు. చర్యలేవీ? జీహెచ్ఎంసీ ఫైర్‌సేఫ్టీ విభాగం అగ్నిప్రమాదాలు జరిగితే ఎక్కువ మందికి అపాయం జరిగే బార్లు, పబ్‌ల వంటివాటిపై తొలుత చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. వాటి తర్వాత హోటళ్లు, హాస్పిటళ్లపై చర్యలుంటాయని హెచ్చరించింది. కానీ ఇప్పటి వరకు ఒక్కదానిపైనా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. నగరంలో, చుట్టుపక్కల దాదాపు 20వేలకు పైగా గోడౌన్లే ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కనీసం పదిశాతం భవనాలకు కూడా ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేవు. గతంలో నగరంలోని భవనాలకు సంబంధించి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని భావించిన జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు టౌన్‌ప్లానింగ్, ఫైర్‌సేఫ్టీ, ఆరోగ్యం– పారిశుద్ధ్యం, రెవెన్యూ విభాగాలకు చెందిన అధికారులను బృందాలుగా ఏర్పాటుచేసి, తనిఖీలు నిర్వహించి, ఫైర్‌సేఫ్టీ లేని భవనాలపై చర్యలు తీసుకోవాలనుకున్నారు. కానీ.. ఇప్పటి వరకు అమలు కాలేదు. కనీసం ఫైర్‌సేఫ్టీ విభాగమైనా చర్యలు తీసుకుందా అంటే అదీ లేదు. జీహెచ్ఎంసీలో ఫైర్‌సేఫ్టీతో పాటు ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అధికారాలు ఉన్న విభాగం కూడా.. ఎన్ని అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. చదవండి: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. రోజంతా మంటలే! -
Fire Accident: అగ్గి అంటుకుంటే బుగ్గిపాలు కావాల్సిందేనా?
సాక్షి, హైదరాబాద్: అగ్గి అంటుకుంటే బుగ్గిపాలు కావాల్సిందేనా? ప్రమాద సమయంలో కాపాడేందుకు సరైన అగ్నిమాపక వ్యవస్థ నగరంలో అందుబాటులో లేదా?.. అంటే అవుననే నిరూపిస్తున్నాయి అగ్ని ప్రమాద ఘటనలు. సికింద్రాబాద్ పరిధిలోని ‘డెక్కన్ కార్పొరేట్’ గురువారం చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాద ఘటనలో మంటల తీవ్రత అధికంగా ఉంది. గంటల తరబడి అగ్నిమాపక సిబ్బంది శ్రమించినా మంటలు అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత వీలైనంత తక్కువ సమయంలో ఫైర్ సిబ్బంది స్పందించడం, తగిన పరికరాలతో రంగంలోకి దిగడం అత్యంత ప్రధానమైంది. అలా చేస్తే మంటలను అదుపులోకి తేవడంతోపాటు ప్రమాద తీవ్రత, నష్ట తీవ్రతను తగ్గించవచ్చు. అగ్నిమాపక సిబ్బందికి తగిన సమర్థత ఉంటున్నా.. కొన్నిసార్లు అందుబాటులో సరైన పరికరాలు లేకపోవడంతోనూ వారు ఆశించిన రీతిలో స్పందించలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారుల కాసుల కక్కుర్తి, అగ్నిమాపక శాఖలోని కొందరు లంచావతారుల కారణంగా బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు అలవోకగా లభిస్తున్నాయి. నగరంలో కేవలం రెండంటే రెండు మాత్రమే బ్రాంటో నిచ్చెనలు ఉన్నాయి. బహుళ అంతస్థుల భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు రెస్క్యూ ఆపరేషన్‌లో ఈ నిచ్చెలను అంత్యంత కీలకమైనవి. కింది అంతస్థుల్లో మంటలు, పొగ వ్యాపించినప్పుడు అగ్నిమాపక సిబ్బంది ఈ భారీ నిచ్చెనల ద్వారా పై అంతస్తులకు చేరే వీలుంటుంది. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడి వారిని సురక్షితంగా కిందకు చేర్చడంలోనూ ఈ భారీ నిచ్చెనలు ఉపయోగపడాయి. ప్రస్తుతం ఉన్న రెండు బ్రాంటో నిచ్చెనల్లో ఒకటి సికింద్రాబాద్ పరిధిలో, మరోటి మాదాపూర్ ప్రాంతంలో అందుబాటులో ఉన్నట్టు సమాచారం. మంజూరు మంజూరు చేసినా.. అగ్నిమాపక శాఖకు ప్రస్తుతం ఉన్న బ్రాంటో నిచ్చెనకు అదనంగా మరో 101 మీటర్ల బ్రాంటో స్కై లిఫ్ట్‌నకు ప్రభుత్వం మంజూరు లభించింది. నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. ఈ బ్రాంటో స్కై లిఫ్ట్‌నకు దాదాపు రూ. 25 కోట్ల ఖర్చవుతుందని, ఇంత పెద్ద మొత్తాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. చదవండి: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. రోజంతా మంటలే! -
అగ్ని ప్రమాదాలతో భయపడుతున్న జంటనగరాలు
-
నిబంధనలకు ‘నిప్పు’.. ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలు
సాక్షి, సిటీబ్యూరో: గత ఏడాది బోయగూడలోని స్క్రాప్ దుకాణం 11 మందిని పొట్టనపెట్టుకుంది... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని రూబీ లాడ్జి ఎనిమిది మంది ఉసురుతీసింది... తాజాగా మినిస్టర్స్ రోడ్‌లోని డెక్కన్ కార్పొరేట్ భవనంలో ముగ్గురు గల్లంతయ్యారు... ఇలా వరుస ప్రమాదాలు జరుగుతున్నా.. అగ్నిమాపక నిబంధనల విషయంలో యాజమాన్యాలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో అర్థమవుతోంది. ఇలాంటి కమర్షియల్ భవనాలు ఎన్నో ఉన్నాయి. వీటి విషయంలో జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖ అధికారులు సైతం కళ్లు మూసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇవి చేసిన, చేస్తున్న ఉల్లంఘనల విషయం అటు పాలకులు, ఇటు అధికారులకు పట్టడంలేదు. ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే ఒకటి రెండు రోజులు తనిఖీలు, చర్యల పేరుతో హడావుడి చేస్తారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా భవనాలు, పై అంతస్తులు నిర్మించుకోవడం, ఆ తర్వాత పై స్థాయి లో పైరవీలు చేసి అనుమతులు తీసుకోవడమో, మ్యానేజ్ చేయడమో నగరంలో మామూలైంది. ► జీహెచ్ఎంసీ ఎన్ని నిబంధనలు పెట్టినా, చట్టాలు తీసుకువచ్చినా అవన్నీ కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయి. అన్ని శాఖలు మూకుమ్మడిగా అనుమతి నిరాకరించిన అనేక బహుళ అంతస్థు భవనాలు, వాణిజ్య సముదాయాలకు ప్రభుత్వమే వివిధ సందర్భాల్లో అనుమతులు మంజూరు చేసింది. వీటి విషయంలో న్యాయస్థానాలు సైతం పలుమార్లు మొట్టికాయలు వేసినా... పటిష్ట చర్యలు తీసుకోవడానికి మాత్రం వెనుకడుగు వేస్తోంది. ► కోఠిలోని పుష్పాంజలి కాంప్లెక్స్‌లో చోటు చేసుకున్న అగి్నప్రమాదం ఈ విషయంలో అందరి కళ్లూ తెరిపించింది. ఆ తర్వాత జరిగిన మీనా జ్యువెలర్స్ ఉదంతంతో అధికార గణం మరింత అప్రమత్తమయ్యామంటూ ఊదరగొట్టింది. ఇవన్నీ కేవలం ఆరంభ శూరత్వాలుగానే మిగిలిపోయాయి. ముఖ్యంగా నగరంలో ఉన్న అని భవనాలను సందర్శించి ఫైర్ సేఫ్టీ మెజర్స్ పరీక్షిస్తామని, నిబంధనల ప్రకారం లేని వాటి యజమానులను చైతన్య పరుస్తామని, ఆ తరవాత కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు అనేక సందర్భాల్లో ప్రకటించారు. ► ప్రమాద ఘటనలు జరిగిన సందర్భంలో వాడీవేడిగా వెలువడే ఈ ప్రకటనలు ఆ తర్వాత చల్లబడిపోతున్నాయి. రోజుల గడిచే కొద్దీ ఈ విషయాలనే మర్చిపోతున్నారు. గతంలో అధికారులు నిర్వహించిన సర్వేలో ఇలాంటి భవనాలు నగరంలో వేల సంఖ్యలో ఉన్నాయని బయటపడింది. అయినా ఇప్పటికీ వీటిపై తీసుకున్న సరైన చర్యలు లేవు. అందుకే ఎక్కడపడితే అక్కడ అక్రమ భవనాలు వెలుస్తున్నాయి. గురువారం డెక్కన్ కార్పొరేట్లో జరిగిన అగ్ని ప్రమాదంతో పరిస్థితి మరోసారి వేడెక్కింది. ఇకనైనా అధికారులు కాస్త కఠినంగా వ్యవహరించి సరైన చర్యలు తీసుకోకపోతే... అనేక మంది అమాయక ప్రాణాలను బలి కావాల్సిందేనని నగరవాసులు వ్యాఖ్యానిస్తున్నారు. చదవండి: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. రోజంతా మంటలే! -
‘డెక్కన్’లో ధిక్కరణ.. అడ్డగోలు నిర్మాణాలే అధికం..
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్‌లోని మినిస్టర్స్ రోడ్‌లోని రాధా ఆర్కేడ్ భవనంలో డెక్కన్ కార్పొరేట్ భవనం నిబంధనల ఉల్లంఘనకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. ఇందులో అడుగడునా ఫైర్ సేఫ్టీ మెజర్స్ అతిక్రమించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. భవనం ఏరియా సైతం ఉండాల్సిన విధంగా లేదు. ఈ కారణంగానే గురువారం అగ్ని ప్రమాదంలో మంటల్ని అదుపు చేయడానికి పది గంటలకు పైగా శ్రమించాల్సి వచి్చంది. ముగ్గురు వ్యక్తులు గల్లంతు కావడంతో ఆందోళన కలిగిస్తోంది. ఉల్లంఘనలు ఇలా... ► ఈ భవనం సబ్–సెల్లార్, సెల్లార్, గ్రౌండ్ ప్లస్ సిక్స్ ఫోర్లుగా నిర్మించారు. దీని విస్తీర్ణంలో కనీసం 1/3 వంతు ఖాళీ స్థలం ఉండాల్సి ఉన్నా కనిపించలేదు. ► భవనం చుట్టూ ఫైరింజిన్ తిరిగేలా ఖాళీ స్థలం ఉండాలి. అరకొర స్థలంలో నిర్మించిన ఈ భవనంలో దక్షిణం వైపు ప్రధాన రోడ్డు మినహామిస్తే మిగిలిన మూడు దిక్కులూ కనీసం నడిచే స్థలం కూడా లేదు. ఈ వాణిజ్య భవనం వెనుక, పక్కన నివాస సముదాయాలు ఉన్నాయి. ► ప్రమాదం జరిగితే బయటపడానికి వెలుపల వైపు స్టెయిర్ కేస్ ఉండాలి. వెలుపల మాట అటుంచితే లోపల ఉన్న ఇంటర్నల్ స్టెయిర్ కేస్ కూడా అవసరమైన స్థాయిలో లేదు. ► ఇలాంటి వాణిజ్య భవనాలకు అత్యవసర సమయంలో వెలిగించేందుకు ఎమర్జెన్సీ లైట్లు, ఆటో గ్లో సిస్టమ్ తప్పనిసరి. ‘డెక్కన్’లో వెతికినా ఇవి కనిపించలేదు. అగ్ని ప్రమాదం జరిగితే బయటపడటానికి ప్రత్యేక ఎగ్జిట్ ఉండాలి. ఇది ఎక్కడా కనిపించలేదు. ► మండలార్పేందుకు ఈ భవనంలో ఫైర్ ఎక్స్టింగి్వషర్లు, వాటర్ పైపులు, స్ప్రింక్లర్స్‌తో పాటు వెట్ రైజర్ తప్పనిసరి. ఈ భవనంలో ఇవి ఉన్న దాఖలాలు లేవు. ► విద్యుత్ ఫైర్ అలారం, మాన్యువల్ ఫైర్ అలారం తప్పనిసరి. ఈ రెండూ మచ్చుకైనా కనిపించలేదు. ప్రమాదాన్ని పసిగట్టి హెచ్చరించే ఆటోమేటిక్ వ్యవస్థ ఉండాలి. ఇలాంటింది ఎక్కడా కనిపించలేదని అగి్నమాక శాఖ అధికారులు చెబుతున్నారు. ► అగ్ని ప్రమాదాల్లో మాత్రమే వినియోగించడానికి ఉపకరించే అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ తప్పనిసరి. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ మాత్రమే ఉంది. దీన్ని సాధారణ వాడకానికి వినియోగిస్తున్నారు. ► అగ్ని ప్రమాదాల సందర్భంలో నీటిని సరఫరా చేసేందుకు విద్యుత్, డీజిల్, జాకీ పంప్‌లు ప్రత్యేకంగా ఉండాలి. కానీ.. ‘డెక్కన్’లో ఎంత వెతికినా కనిపించవు. చదవండి: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. రోజంతా మంటలే! -
డెక్కన్ మాల్ లో ఇంకా అదుపులోకి రాని మంటలు
-
Hyderabad Fire Accident: సికింద్రాబాద్‌లో అగ్ని ప్రమాదం (ఫొటోలు)
-
రోజంతా మంటలే! 40 ఫైరింజన్లు.. 200 పైగా నీటి ట్యాంకర్లతో ‘ఫైర్ ఫైటింగ్’
సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్‌పేట్: అది దుకాణాలు, జనావాసాల మధ్య ఉన్న భవనం.. మెల్లగా పొగలు రావడం మొదలైంది.. కాసేపటికే భవనమంతా అగ్నికీలల్లో చిక్కుకుంది. ఉధృతంగా మంటలు, పొగ ధాటికి ఆ చుట్టుపక్కల ప్రాంతం రాత్రి అయిందేమో అన్నట్టుగా మారిపోయింది. ఏం జరుగుతుందోనని చుట్టుపక్కల భవనాలు, దుకాణాల వారు భయాందోళనకు లోనయ్యారు. మరోవైపు సామగ్రిని కాపాడుకునేందుకు భవనంలోకి వెళ్లిన ముగ్గురు ఉద్యోగులు గల్లంతయ్యారు. సికింద్రాబాద్‌లోని మినిస్టర్స్ రోడ్లో ఉన్న రాధా ఆర్కేడ్ భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటన ఇది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు. ఉదయం పొగలతో మొదలై.. రాధా ఆర్కేడ్ భవనంలో 2010 నుంచి టీ–షర్టులు, ట్రాక్స్, టోపీలు తయారుచేసి విక్రయించే డెక్కన్ కార్పొరేట్, డెక్కన్ నైట్ సంస్థలు కొనసాగుతున్నాయి. భవనం సెల్లార్–1లో చెకర్డ్ ఫ్లాగ్ కార్ డెకార్స్ గోదాం, సెల్లార్లో ఆ కార్ డెకార్స్ దుకాణం, డెక్కన్ కార్పొరేట్ వస్త్ర గోదాం ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో డెక్కన్ కార్పొరేట్ వస్త్రాల హోల్‌సేల్ షాపు ఉండగా.. పైన అంతస్తుల్లో డెక్కన్ నైట్ సంస్థ వస్త్రాల తయారీ, నిల్వకు వినియోగిస్తున్నారు. గురువారం ఉదయం సెల్లార్లో స్వల్పంగా పొగలు కనిపించాయి. ఆ సమయంలో అక్కడికి వచ్చిన కార్ డెకార్స్ యజమాని.. తన దుకాణాన్ని పరిశీలించి, బాగానే ఉండటంతో డెక్కన్ సంస్థ వారిని అప్రమత్తం చేశారు. వారు సరిగా పట్టించుకోలేదు. ఉదయం 10.30 గంటల సమయంలో పొగలు దట్టంగా మారాయి. కాసేపటికే సెల్లార్–1, గ్రౌండ్ ఫ్లోర్లకూ విస్తరించాయి. దీనిపై చుట్టుపక్కల వారు అగ్నిమాపకశాఖకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికల్లా సెల్లార్–1 నుంచి మూడో ఫ్లోర్ వరకు మంటలు విస్తరించాయి. అప్పటికే పైన ఐదు, ఆరో అంతస్తుల్లో పనిచేస్తున్న పెయింటర్ మిథిలేశ్ కుమార్, మార్బుల్ వర్కర్లు రూపేష్, బిబాష్, రామ్రాజ్ సింగ్‌లను అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. వద్దన్నా లోపలికి వెళ్లి.. గల్లంతై.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో భవనం వద్దకు వచ్చిన డెక్కన్ సంస్థ ఉద్యోగులు వసీమ్, జహీర్, జునైద్ ముగ్గురు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిస్తున్నా వినకుండా పక్కన ఉన్న ద్వారం తెరుచుకుని గ్రౌండ్ ఫ్లోర్‌లోకి ప్రవేశించారు. అప్పటికే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై అంతస్తులకు మంటలు భారీగా వ్యాపించాయి. లోపలికి వెళ్లిన ముగ్గురు ఉద్యోగుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. వారి కోసం ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని భవనంలోకి ప్రవేశించినా.. మంటలు, వేడి వాయువుల ధాటికి అస్వస్థతకు గురై బయటికి వచ్చారు. అధికారులు వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించా రు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది. ఆ ముగ్గురి కోసం నేడు గాలింపు రాధా ఆర్కేడ్ భవనంలో మంటలు రాత్రి 9.30 గంటలకు అదుపులోకి వచ్చినా ఆ తర్వాత కూడా పొగలు కొనసాగాయి. దానికితోడు మంటల ధాటి కి భవనం బలహీనపడి కూలిపోయే ప్రమాదం ఉండటంతో.. లోపలికి వెళ్లి గల్లంతైన ముగ్గురి కోసం శుక్రవారం ఉదయం గాలింపు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. భవనం సమీపంలోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు పెట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గల్లంతైన ముగ్గురూ గుజరాత్ నుంచి వలస వచ్చిన కార్మికులని గుర్తించారు. వీరిలో వసీమ్, జహీర్ తమ కుటుంబాలతో నల్లగుట్టలో నివసిస్తుండగా.. జునైద్ ఇదే భవనం మూడో అంతస్తులో ఉంటున్నట్టు తెలిసింది. నివాసం కోసం అనుమతి తీసుకుని.. మినిస్టర్స్ రోడ్‌లోని ఈ భవనానికి 2006లో సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు పైన నాలుగు అంతస్తులు నిర్మిస్తామంటూ అనుమతి తీసుకున్నారు. అధికారులు సెల్లార్లో వాహనాల పార్కింగ్‌కు, మిగతా ఫ్లోర్లకు నివాసాల కోసం అనుమతి ఇచ్చారు. కానీ దాని యజమాని సెల్లార్–1, సెల్లార్–2, గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు 4 అంతస్తులు నిర్మించి.. వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తున్నారు. తర్వాత ఐదు, ఆరో అంతస్తుల నిర్మాణమూ చేపట్టారు. పనులు చివరిదశలో ఉన్నాయి. భవన యజమాని 2015లో వచ్చిన బీఆర్ఎస్ (బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్) పథకం కింద కమర్షియల్‌గా వాడుతున్న గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు అక్రమంగా కట్టిన 5, 6 అంతస్తులను క్రమబద్ధీకరించుకున్నారు. డెక్కన్ సంస్థ యజమాని అరెస్టు రాధా ఆర్కేడ్ భవనంలో డెక్కన్ సంస్థను మహ్మద్ ఒవైసీ, ఆయన తండ్రి జావీద్ నిర్వహిస్తున్నారు. పై రెండు అంతస్తులను నల్లగుట్టకు చెందిన ఎంఏ రహీం అనే వ్యక్తి నివసించడం కోసం కట్టిస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు. ప్రమాద ఘటనకు సంబంధించి మహ్మద్ ఒవైసీ, జావీద్లపై రాంగోపాల్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి.. మహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదకర భవనాలపై స్పెషల్ డ్రైవ్: మంత్రి తలసాని హైదరాబాద్ నగరంలో చాలా ఏళ్లుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని.. నిబంధనలు పాటించని, ప్రమాదకర భవనాల విషయంగా స్పెషల్ డ్రైవ్ చేపడతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ప్రమాద స్థలాన్ని సందర్శించి మీడియాతో మాట్లాడారు. అగ్నిమాపక సిబ్బంది, డీఆర్ఎఫ్, పోలీసులు వేగంగా సహాయక చర్యలు చేపట్టారన్నారు. ఘటనపై పూర్తి నివేదిక తెప్పిస్తామని.. నిబంధనలు పాటించని షాపులు, గోదాములపై కఠినచర్యలు తీసుకుంటామని చెప్పారు. కఠినచర్యలు చేపడతాం: మంత్రి మహమూద్ అలీ నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తున్న గోదాములపై కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గోదాములో ఎక్కువగా ప్లాస్టిక్ వస్తువులు, సింథటిక్ వస్త్రాలు ఉండటంతో మంటలు అదుపులోకి రావడం కష్టమైందన్నారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి కఠినచర్యలు తీసుకుంటామన్నారు. 40 ఫైరింజన్లు.. 200కుపైగా ట్యాంకర్లు మొదట ఒకట్రెండు ఫైరింజన్లతో నీరు చల్లడం మొదలుపెట్టిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలు తీవ్రం కావడం, ముగ్గురు ఉద్యోగులు లోనికి వెళ్లడంతో ఉధృతంగా సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఫైరింజన్లను, వాటికి నీటి కోసం జల మండలితోపాటు ప్రైవేటు ట్యాంకర్లను వెంట వెంటనే రప్పించారు. దాదాపు 40 ఫైరింజన్లు, 200కుపైగా ట్యాంకర్లను వినియోగించారు. ఉదయం దాదాపు 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు కూడా సహాయక చర్యలు సాగుతూనే ఉన్నాయి. భవనంలో అంతా వస్త్రాలు, రెగ్జిన్, ప్లాస్టిక్, ఫైబర్ మెటీరియల్ ఉండటంతో మంటలను అదుపులోకి తీసుకురావడం కష్టమైందని అధికారులు చెప్తున్నారు. ప్రమాదం కారణంగా గురువారం ఉదయం నుంచీ మినిస్టర్స్ రోడ్‌ను మూసేశారు. దీనితో చుట్టుపక్కల మార్గాల్లో పొద్దంతా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంతా వస్త్రం, ప్లాస్టిక్ మెటీరియల్ కావడంతో.. రాధా ఆర్కేడ్ భవనంలో ఉన్న డెక్కన్ కార్పొరేట్ సంస్థ మొత్తం వస్త్ర మెటీరియల్‌కు సంబంధించినదే. పైగా రెండు సెల్లార్లలో ఉన్న కార్ డెకార్స్‌కు చెందిన సామగ్రి అంతా ప్లాస్టిక్, ఫైబర్‌తో పాటు బాగా మండిపోయే స్వభావం ఉన్నది కావడంతో.. మంటలు చాలా ఉధృతంగా వచ్చాయి. ఒక సమయంలో దాదాపుగా భవనం ఎత్తున ఎగిసిపడ్డాయి. మంటల ఉధృతి, నల్లటి దట్టమైన పొగల కారణంగా రాధా ఆర్కేడ్ భవనం చుట్టుపక్కల కొంత ప్రాంతం చీకటి కమ్మినట్టుగా అయిపోయింది. మంటలు ఇతర భవనాలకూ విస్తరించే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు.. చుట్టుపక్కల మూడు భవనాల్లోని 21 కుటుంబాలను, ఎనిమిది దుకాణాలను ఖాళీ చేయించారు. రాధా ఆర్కేడ్ భవనంలో పలుగోడలు, పిల్లర్లు పగుళ్లు ఇవ్వడంతో.. అది కూలిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు. -
కోరలు లేని ఫైర్ సర్వీసెస్ యాక్ట్.. హైదరాబాద్‌లోనే ఎక్కువ కేసులు!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్ యజమాని నిర్లక్ష్యం ఎనిమిది మంది ప్రాణాలు బలిగొంది. కేవలం ఈ ఒక్క భవనమే కాదు సరిగ్గా వెతికితే నగరంలోని ప్రతి వీధికి కనీసం మూడు ఇలాంటివి కనిపిస్తుంటాయి. ఇలాంటి నిర్మాణాలు చేపట్టిన యజమానులపై చర్యలు తీసుకోవడానికి అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖకు ఉన్న ఒకే ఒక్క ఆధారం ఏపీ ఫైర్ సర్వీసెస్ యాక్ట్. 1999లో రూపొందించిన ఈ కోరలు లేని చట్టాన్నే ఇప్పటికీ వినియోగిస్తున్నారు. వాణిజ్య భవనాలు, సముదాయాల యజమానులు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడటానికి ఇదీ ఓ కారణమే అన్నది నిపుణుల మాట. సమరీ ట్రయల్‌కు మాత్రమే అవకాశం... ఏదైనా నేరానికి సంబంధించి పోలీసు విభాగం ఐపీసీ కింద కేసు నమోదు చేస్తుంటుంది. నేరం, నేరగాడి తీరుతెన్నుల్ని బట్టి అరెస్టుపై నిర్ణయం తీసుకుంటుంది. ఆపై జైలు, బెయిలు, కోర్టులో కేసు విచారణ తదితరాలు ఉంటాయి. అదే ఫైర్ సర్వీసెస్ యాక్ట్ వద్దకు వచ్చేసరికి ఆ చట్టం, అగ్నిమాపక శాఖకు ఉన్న అధికారాలు వేరు. వీళ్లు ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనలకు సంబంధించి కేసు నమోదు చేసినప్పటికీ నోటీసుల జారీ మినహా అరెస్టుకు ఆస్కారం లేదు. ఈ కేసు కోర్టు వరకు వెళ్లినా సాధారణ కేసుల్లా విచారణ ఉండదు. అదే ఎందరి ప్రాణాలు తీసిన ఉదంతం, ఎంత తీవ్రమైన ఉల్లంఘన అయినప్పటికీ ఇదే పరిస్థితి. ఈ కేసుల విచారణ సివిల్ కోర్టుల్లో సమరీ ట్రయల్ విధానంలో జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారిపై నమోదైన కేసుల మాదిరిగానే ఉంటుంది. గరిష్ట శిక్ష మూడు నెలలు మాత్రమే... ఈ చట్టంలోని అనేక సెక్షన్లు ఉన్నప్పటికీ శిక్షలు మాత్రం చాలా తక్కువ. దాదాపు 90 శాతం ఉల్లంఘనలకు జరిమానా మాత్రమే విధించే ఆస్కారం ఉంది. మిగిలిన వాటిలోనూ గరిష్ట శిక్ష కేవలం 3 నెలలు మాత్రమే. ఈ సెక్షన్లకు సంబంధించిన ఉల్లంఘనల్లోనూ పెనాల్టీ విధించే ఆస్కారం ఉంది. రాష్ట్ర అగ్నిమాపక శాఖ అధికారులు 2014 నుంచి ఇప్పటి వరకు 689 కేసులు నమోదు చేశారు. వీటిలో కనీసం ఒక్క కేసులోనూ ఉల్లంఘనులకు జైలు శిక్ష పడలేదు. 83 కేసులు జరిమానాలతో ముగిసిపోగా... మరో 60 ఆ విభాగమే ఉపసంహరించుకుంది. మిగిలిన వాటిలో 257 కేసులను న్యాయస్థానం రిటర్న్ చేసి మార్పు చేర్పులు సూచించింది. ఇంకో 270 కేసులు ఇప్పటికీ వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించని 665 నిర్మాణాలకు నోటీసులు, తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన మరో 636 మంది యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోనే అత్యధికంగా కేసులు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అగ్నిమాపక శాఖ నమోదు చేసిన కేసుల్లో అత్యధిక హైదరాబాద్‌కు సంబంధించివనే. మొత్తం 689 కేసులకు నగరానికి సంబంధించినవి 325, రంగారెడ్డి 154, వరంగల్ 70, నల్లగొండ 56, ఖమ్మం 36 కేసులు ఉన్నాయి. గతంలో అగ్నిమాపక శాఖకు సొంతంగా ప్రాసిక్యూషన్ సర్వీస్ కూడా ఉండేది కాదు. పంజగుట్టలోని మీన జ్యువెలర్స్‌లో 2006లో జరిగిన అగ్నిప్రమాదం ముగ్గురిని పొట్టన పెట్టుకుంది. ఆ కేసు నుంచి అగ్నిమాపక శాఖ ప్రాసిక్యూషన్ మొదలెట్టింది. అగ్నిమాపక శాఖలో పదవీ విరమణ చేసిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘2000 సంవత్సరం తర్వాత అభివృద్ధి వేగం పుంజుకుంది. దీంతో అనేక భారీ నిర్మాణాలు, భవనాలు వచ్చాయి. వాణిజ్య కార్యకలాపాలూ పెరగడంతో ఉల్లంఘనలు అదే స్థాయిలో జరుగుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఫైర్ సర్వీసెస్ యాక్ట్‌ను మార్చాలి. కఠినమైన నిబంధనలతో పాటు శిక్షలు అమలులోకి తీసుకువస్తేనే అగ్ని ప్రమాదాల్లో అమాయకులు బలికాకుండా ఉంటారు. మీన జ్యువెలర్స్ కేసులో ఆ భవన యాజమాన్యానికి పడిన జరిమానా కేవలం రూ.15 వేలే’ అని అన్నారు. (క్లిక్ చేయండి: హైదరాబాద్ మెట్రో రైలు.. తప్పని తిప్పలు) -
బతుకులు బుగ్గి! అప్పుడు క్రాకర్స్, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికిల్స్..
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలోని దుకాణాలు, కంపెనీలు, సంస్థలు, గోదాముల్లో అగ్ని ప్రమాదాలు కలవరం రేపుతున్నాయి. నాటి కార్తికేయ లాడ్జి, నేటి రూబీ లాడ్జీ ఉదంతాల్లో మాత్రం ఓ సారూప్యత ఉంది. మొదట అగ్ని ప్రమాదం ఈ రెండింటిలోనూ ప్రారంభంకాలేదు. వీటికి కింది అంతస్తుల్లో ఉన్న దుకాణాల్లో మొదలైన అగ్గి లాడ్జీలో బస చేసిన వారి ఉసురు తీసింది. ప్రమాదాలు ఎలా జరిగాయంటే.. ఉస్మాన్‌గంజ్‌లోని ప్రధాన రహదారిపై ఉన్న భవనం గ్రౌండ్ ఫ్లోర్లో శాంతిఫైర్ వర్క్స్ ఉంది. దీని మొదటి అంతస్తులో కెనరా బ్యాంక్ శాఖ ఉండగా... రెండు, మూడు అంతస్తుల్లో కలిపి కార్తికేయ లాడ్జి నడిచేది. ఈ రెండు ఉదంతాల్లోనూ మృతులు బయటి ప్రాంతాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. ఘరానా దొంగ మారుతి నయీం 2002 అక్టోబర్ 23న శాంతి ఫైర్ వర్క్స్‌లో చోరీ చేయడానికి వచ్చాడు. తన కారును అడ్డంగా పెట్టి షట్టర్ పగులకొట్టిన నయీం దుకాణంలోకి ప్రవేశించాడు. అందులో నగదు లభించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురై అక్కడ ఉన్న క్రాకర్స్‌ను నిప్పు పెట్టాడు. అలా మొదలైన మంటలు పై అంతస్తులకు పాకాయి. బ్యాంక్ దగ్ధం కాగా.. కార్తికేయ లాడ్జీలో బస చేసిన వాళ్లు, సిబ్బందితో సహా మొత్తం 12 మంది చనిపోయారు. తాజాగా సోమవారం రాత్రి జరిగిన రూబీ లాడ్జి ఉదంతమూ ఈ కోవకు చెందినదే. దీని సెల్లార్లో ఉన్న ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్‌లో అగ్గి రాజుకుంది. ఈ ధాటికి విడుదలైన మంటలు, పొగ.. పైన ఉన్న లాడ్జీలో బస చేసిన ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్నాయి. మరో 10 మంది క్షతగాత్రులుగా మారారు. (క్లిక్ చేయండి: చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి.. మృత్యువు పిలిచినట్టు..) నగరంలో భారీ అగ్ని ప్రమాదాల్లో మరికొన్ని.. ► 21.10.2006: సోమాజిగూడలోని మీన జ్యువెలర్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో పెయింటింగ్ పని చేయడానికి వచ్చిన వలస కార్మికులు పై అంతస్తులో నిద్రిస్తున్నారు. కింది ఫ్లోర్లో జరిగిన అగ్ని ప్రమాదంతో పెయింట్లు కాలి, విడుదలైన విష వాయువులతో ముగ్గురు చనిపోయారు. ► 24.11.2012: పుప్పాలగూడలోని బాబా నివాస్ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. వాచ్‌మన్‌తో పాటు స్థానికుల అప్రమత్తత కారణంగా దాదాపు మరో పది మంది ప్రాణాలతో బయటపడ్డారు. ► 22.02.2017: అత్తాపూర్‌లోని పిల్లర్ నెం.253 సమీపంలో ఉన్న చిన్నతరహా పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కూలర్ల పరిశ్రమలో మంటలు చెలరేగి ఆరుగురు ఒడిశాకు కార్మికులు చనిపోయారు. ► 23.03.2022: న్యూ బోయగూడ వద్ద శ్రావణ్ ట్రేడర్స్ పేరుతో ఉన్న స్క్రాప్ గోదాంలో సంభవించిన అగ్నిప్రమాదంలో 11 మంది బిహార్ కార్మికులు మృత్యువాత పడ్డారు. (క్లిక్ చేయండి: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం: నిప్పుల్లో నిబంధనలు) -
సికింద్రాబాద్ అగ్నిప్రమాదం: నిప్పుల్లో నిబంధనలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రూబీ ఎలక్ట్రికల్ స్కూటర్స్, రూబీ లాడ్జీలతో కూడిన భవనం నిబంధనల ఉల్లంఘనకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. ఫైర్ సేఫ్టీ మెజర్స్ అతిక్రమించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. భవనం ఏరియా సైతం ఉండాల్సిన విధంగా లేదు. ఈ కారణంగానే సోమవారం రాత్రి చోటు చేసుకున్న అగ్నిప్రమాదం ఎనిమిది మందిని పొట్టనపెట్టుకుంది. ఉల్లంఘనలు ఇలా.. ► భవనం సెల్లార్, గ్రౌండ్ ప్లస్ ఫోర్‌తో పాటు పెంట్ హౌస్‌తో కలిపి మొత్తం ఆరు అంతస్తులు ఉంది. సెల్లార్‌ను నిబంధనలకు విరుద్ధంగా ఈ–బైక్స్ షోరూమ్, సర్వీసింగ్ పాయింట్‌గా మార్చారు. ఈ మొత్తం విస్తీర్ణంలో కనీసం 1/3 వంతు ఖాళీ స్థలం ఉండాలి. ఇది మచ్చుకైనా లేదు. భవనం చుట్టూ ఫైరింజన్ స్వేచ్ఛగా తిరిగేలా ఖాళీ స్థలం ఉండాలి. అరకొర స్థలంలో నిర్మించిన ఈ భవనంలో తూర్పు వైపు రోడ్డు మినహామిస్తే మిగిలిన మూడు దిక్కులూ కనీసం నడిచే స్థలం కూడా లేదు. ► ప్రమాదం జరిగితే బయటపడానికి వెలుపల వైపు స్టెయిర్ కేస్ ఉండాలి. వెలుపల మాట అటుంచితే లోపల ఉన్న ఇంటర్నల్ స్టెయిర్ కేస్ మీటర్ వెడల్పు కూడా లేదు. అత్యవసర సమయంలో వెలిగించేందుకు ఎమర్జెన్సీ లైట్లు, ఆటో గ్లో సిస్టమ్ ఉండాలి. భవనంలో ఎమర్జెన్సీ లైట్లు తగిన సంఖ్యలో లేవు. గ్లో సిస్టమ్ లేనే లేదు. ప్రమాదం జరిగితే అగ్నిమాపక సిబ్బంది కోసం ప్రత్యేక లిఫ్ట్ ఉండాలి. ఇది ఎక్కడా కనిపించలేదు. స్టెయిర్ కేస్ వద్ద ఉన్నది కూడా లాడ్జిలో బస చేసిన వారికీ ఉపయుక్తంగా లేదు. ► మంటలార్పేందుకు ఈ భవనంలో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, వాటర్ పైపులు, స్ప్రింక్లర్స్‌తో పాటు వెట్ రైజర్ తప్పనిసరి. ఇందులో వాటర్ పైపులు, స్ప్రింక్లర్స్ మాత్రం ఉన్నాయి. అవి ఎంత వరకు పని చేశాయన్నది తేలాల్సి ఉంది. విద్యుత్ ఫైర్ అలారం, మాన్యువల్ ఫైర్ అలారం తప్పనిసరి. ఈ రెండూ రూబీ లాడ్జిలో మచ్చుకైనా కనిపించలేదు. ప్రమాదాన్ని పసిగట్టి హెచ్చరించే ఆటోమేటిక్ వ్యవస్థ ఉండాలి. ఇలాంటిది ఎక్కడా కనిపించలేదని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. ► అగ్ని ప్రమాదాల్లో మాత్రమే వినియోగించడానికి ఉపకరించే అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ తప్పనిసరి. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ మాత్రమే ఉంది. దీన్ని సాధారణ వాడకానికి వినియోగిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదాల సందర్భంలో నీటిని సరఫరా చేసేందుకు విద్యుత్, డీజిల్, జాకీ పంప్‌లు ప్రత్యేకంగా ఉండాలి. ఎంత వెతికినా ఇవి ఎక్కడా కనిపించలేదు. నిప్పుల్లో నిబంధనలు అగ్ని మాపక నిబంధనల్లో రూబీ లాడ్జీ యాజమాన్యం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపించింది. ఇలాంటి నిర్లక్ష్యపూరిత నిర్మాణాలు నగరంలో అనేకం ఉన్నాయి. వీటి విషయం అటు పాలకులు, ఇటు అధికారులు ఎవరికీ పట్టడంలేదు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఒకటి రెండు రోజులు హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత కథ షరామామూలే. అనుమతుల్లేని భవనాలు, పై అంతస్తులు నిర్మించుకోవడం, పైస్థాయిలో పైరవీలతో అనుమతులు తీసుకోవడమో, మేనేజ్ చేయడమో నగరంలో సాధారణంగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్ని నిబంధనలు పెట్టినా, చట్టాలు తీసుకువచ్చినా అవన్నీ కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. అన్ని శాఖలు మూకుమ్మడిగా అనుమతి నిరాకరించిన అనేక బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలకు ప్రభుత్వమే వివిధ సందర్భాల్లో అనుమతులు మంజూరు చేసింది. వీటి విషయంలో న్యాయస్థానాలు సైతం పలుమార్లు మొట్టికాయలు వేసినా.. పటిష్ట చర్యలు తీసుకోవడానికి మాత్రం వెనుకడుగు వేస్తోంది. కోఠిలోని పుష్పాంజలి కాంప్లెక్స్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ఈ విషయంలో అందరి కళ్లూ తెరిపించింది. ఆ తర్వాత మీనా జ్యువెలర్స్ ఉదంతంతో అధికార గణం మరింత అప్రమత్తమయ్యామంటూ ఊదరగొట్టింది. ఇవన్నీ కేవలం ఆరంభశూరత్వాలుగానే మిగిలిపోయాయి. ముఖ్యంగా నగరంలో ఉన్న అని భవనాలను సందర్శించి ఫైర్ సేఫ్టీ మెజర్స్ పరీక్షిస్తామని, నిబంధనల ప్రకారం లేని వాటి యజమానులను చైతన్య పరుస్తామని, ఆ తర్వాత కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు అనేక సందర్భాల్లో ప్రకటించారు. కొన్ని రోజులు గడిచాక ఈ విషయాలనే మర్చిపోతున్నారు. గతంలో అధికారులు నిర్వహించిన సర్వేలో ఇలాంటి భవనాలు నగరంలో వేల సంఖ్యలో ఉన్నాయని బయటపడింది. అయినా ఇప్పటికీ వీటిపై తీసుకున్న సరైన చర్యలు లేవు. అందుకే ఎక్కడపడితే అక్కడ అక్రమ భవనాలు వెలుస్తున్నాయి. సోమవారం నాటి రూబీ లాడ్జి అగ్ని ప్రమాదంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఇకనైనా అధికారులు కఠినంగా వ్యవహరించి సరైన చర్యలు తీసుకోకపోతే... అనేక మంది అమాయకుల ప్రాణాలు బలి కావాల్సిందే. (క్లిక్ చేయండి: చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి.. మృత్యువు పిలిచినట్టు..) -
చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి.. మృత్యువు పిలిచినట్టు..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ అగ్ని ప్రమాద మృతులతో గాంధీ మార్చురీ వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. మూడు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వాయుమార్గంతో పాటు ప్రత్యేక అంబులెన్స్‌ల్లో స్వస్థలాలకు తరలించారు. మిగిలిన అయిదు మృతదేహాలకు సంబంధించి ఆయా వ్యక్తుల సంబంధీకుల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించగా, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడీ కృపాల్‌సింగ్‌ల నేతృత్వంలో మూడు వైద్య బృందాలు పోస్టుమార్టం విధులు నిర్వహించారు. విషవాయువుల వేడి పొగతోనే.. బ్యాటరీలకు మంటలు అంటుకుని కెమికల్ టాక్సిన్స్ (విష వాయువులు)తో కూడిన వేడి పొగ పీల్చడం వల్లే ఊపిరి అందక మృతి చెందినట్లు ఫోరెన్సిక్ వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతదేహాల ఊపిరితిత్తులకు అంటుకున్న పొగతో కూడిన విషవాయువు (స్మాగ్) కడుపు, ఇతర అవయవాల నుంచి నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్లు గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. మృత్యువు పిలిచినట్టు.. విజయవాడకు చెందిన అల్లాడి హరీష్‌ను మృత్యువు పిలిచిందని ఆయన స్నేహితుడు శ్రీనివాస్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈక్వటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో పనిచేస్తున్న హరీష్ ట్రైనింగ్ నిమిత్తం నగరానికి వచ్చే ముందే సికింద్రాబాద్ మినర్వా గ్రాండ్ లాడ్జీలో బస చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి ప్రమాదంలో మృతి చెంది కానరాని లోకాలకు వెళ్లిపోయాడని భోరున విలపించారు. మృతునికి భార్య కావ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు పన్నెండు రోజుల క్రితమే జన్మించాడు. మార్చురీలో హరీష్ మృతదేహాన్ని చూసి ఆయన తండ్రి కోటేశ్వరరావు రోదనలు కలచివేశాయి. చెన్నై నుంచి వచ్చి.. మృత్యువాత విధి నిర్వహణలో భాగంగా చెన్నై నుంచి నగరానికి వచ్చి రూబీ లాడ్జీలో బస చేసి అగ్నిప్రమాదంలో మృతి చెందారు ఆచీ మసాల సంస్థ ఉద్యోగులు బాలాజీ, సీతారామన్‌లు. ఆచీ మసాల ఆడిటర్ బాలాజీ, రీజనల్ సేల్స్ మేనేజర్ సీతారామన్‌లు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించి, రాత్రి 8 గంటలకు లాడ్జీకి వచ్చి అగ్ని ప్రమాదంలో అసువులు బాశారని ఆచీ మసాల స్థానిక సేల్స్ మేనేజర్ మహేందర్ కన్నీటి పర్యంతమయ్యారు. బాలాజీ, సీతారామన్‌ల మృత దేహాలను విమానంలో చెన్నైకి తరలించారు. ఢిల్లీకి చెందిన అన్నదమ్ములు... ఢిల్లీకి చెందిన సందీప్ మాలిక్, రాజీవ్ మాలిక్‌లు అన్నదమ్ములు. ఆలివ్ కంపెనీలో శిక్షణ కోసం సిటీకి వచ్చి రూబీ లాడ్జీలో బస చేసి మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న మృతుల బంధువులు నగరానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదం జరగడానికి కొన్ని నిమిషాల ముందే ఆ లాడ్జి మొదటి అంతస్తులోని రూమ్ నుంచి చెక్ఔట్ చేసిన ముగ్గురు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. (క్లిక్ చేయండి: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనకు కారణం అదే) -
Secunderabad Fire Tragedy: బ్యాటరీ పేలుడు వల్లే..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రూబీ ఎలక్ట్రికల్ స్కూటర్స్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదానికి ఈ–స్కూటర్ బ్యాటరీ పేలడమే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదం కారణంగా వెలువడిన దట్టమైన పొగ ప్రభావంతోనే లాడ్జీలో బస చేసిన వాళ్లు చనిపోయినట్లు తేల్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో క్షతగాత్రుడు మంగళవారం మృతిచెందాడు. దీంతో ఈ దుర్ఘటనలో కన్నుమూసిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. అగ్నిప్రమాదం జరిగిన హోటల్, విద్యుత్ ద్విచక్ర వాహనాల షోరూమ్ నిర్వహిస్తున్న రాజేందర్‌సింగ్ బగ్గా, సుమిత్ సింగ్లతోపాటు మరికొందరిపై మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని మంగళవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సెల్లార్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు.. హైదరాబాద్‌లోని కార్ఖానా ప్రాంతానికి చెందిన రాజేంద్రసింగ్ బగ్గా, సుమీత్‌సింగ్ కొన్నేళ్లుగా సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ రోడ్డులో రూబీ ప్రైడ్ లగ్జరీ హోటల్ పేరుతో లాడ్జి నిర్వహిస్తున్నారు. అలాగే రెండేళ్ల క్రితం ఈ–స్కూటర్స్, బైక్స్ వ్యాపారంలోకి దిగారు. ఓ సంస్థకు చెందిన ఈ–స్కూటర్స్ డీలర్షిప్ తీసుకొని షోరూం, సర్వీసింగ్ సెంటర్లను లాడ్జి గ్రౌండ్‌ఫ్లోర్, సెల్లార్లో అక్రమంగా ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్, ఈ–స్కూటర్స్ కార్యాలయం, మొదటి అంతస్తు నుంచి నాలుగో అంతస్తు వరకు మొత్తం 28 గదులు ఉన్నాయి. ఐదో అంతస్తులోని పెంట్ హౌస్‌లో రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. చార్జింగ్ పెట్టిన బ్యాటరీ పేలడంతో... సోమవారం రాత్రి 9:17 గంటలకు సెల్లార్‌లోని ఈ–స్కూటర్స్ సర్వీసింగ్ పాయింట్లో చార్జింగ్ పెట్టి ఉంచిన ఈ–స్కూటర్ బ్యాటరీ పేలడంతో మంటలు అంటుకున్నాయి. ఇవి మిగతా వాహనాలకు, నిల్వఉంచిన టైర్లు, ప్లాస్టిక్, రబ్బర్ వస్తువులకు అంటుకోవడంతో మంటలతోపాటు దట్టమైన పొగ, విషవాయువులు వె లువడ్డాయి. ఆ సమయంలో లాడ్జీలో 25 మంది అతిథులు, 8 మంది ఉద్యోగులు ఉన్నారు. మెట్లమార్గం సెల్లార్ వరకు ఉండటంతో... ఈ భవనాన్ని సరైన వెంటిలేషన్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడం, ఐదో అంతస్తు నుంచి సెల్లార్ వరకు నిర్మించిన మెట్ల మార్గం మీటర్ కంటే తక్కువ వెడల్పుతో ఇరుకుగా ఉండటంతో ప్రమాద సమయంలో అదే చిమ్నీ గొట్టంలాగా మారిపోయింది. సెల్లార్ నుంచి విషవాయువులు, నల్లటి పొగ దీని ద్వారానే లాడ్జి మొత్తం వ్యాపించాయి. గ్రౌండ్ ఫ్లోర్లో స్టెయిర్ కేస్‌కు, రిసెప్షన్‌కు మధ్య తలుపు మూసి ఉండటంతో పొగ బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. పొగను గమనించిన సిబ్బంది బయటకు పరుగులు తీయగా మొదటి, రెండో అంతస్తుల్లో బస చేసిన వారిలో నలుగురు గదుల్లోనే, మరో ముగ్గురు మెట్ల మార్గంలో ప్రాణాలు విడిచారు. మరో 9 మంది అస్వస్థతకు గురయ్యారు. మూడు, నాలుగో అంతస్తుల్లో బస చేసిన కొందరిని స్థానికులు, పోలీసులు.. అగ్నిమాపక అధికారులు కాపాడారు. పెంట్‌హౌస్‌లోని రెస్టారెంట్లో భోజనం చేస్తున్న నలుగురు పక్క భవనం టెర్రస్‌పైకి చేరుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. భవనానికి స్ప్రింక్లింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినా సెల్లార్లో అది పనిచేసిన ఆనవాళ్లు కనిపించలేదు. విషవాయువులు పీల్చడం వల్లే మృతుల సంఖ్య పెరిగిందని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు వివరించారు. మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున పరిహారం సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదానికి బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.3 లక్షల నష్టపరిహారం ప్రకటించారని హోం మంత్రి తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత దట్టమైన పొగ వ్యాపించడంతో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఘటనపై పోలీస్, అగ్నిమాపక శాఖలు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాయని, అన్ని కోణాలలో పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఆదేశించామని హోం మంత్రి వెల్లడించారు. కేంద్రం రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా సాక్షి, న్యూఢిల్లీ: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ప్రధాని కార్యాలయం మంగళవారం ట్వీట్ చేసింది. (క్లిక్ చేయండి: చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి.. మృత్యువు పిలిచినట్టు..) -
రూబీ లాడ్జి విషాదంపై కీలక రిపోర్ట్.. నివేదికలో షాకింగ్ విషయాలు
సాక్షి, హైదరాబాద్: రూబీ లాడ్జి విషాద ఘటనపై ఫైర్ డిపార్ట్మెంట్ నివేదిక విడుదల చేసింది. మూడు పేజీల రిపోర్ట్‌లో కీలక విషయాలను వెల్లడించింది. లీథియం బ్యాటరీల పేలుళ్ల వల్ల దట్టమైన పొగలు వ్యాపించాయని, పొగలు వల్ల భవనంలోకి వెళ్లలేకపోయామని ఫైర్ డిపార్ట్మెంట్ తెలిపింది. భవనానికి సింగిల్ ఎంట్రీ, ఎగ్జిట్ మాత్రమే ఉంది. లిప్ట్ పక్కన మెట్లు ఏర్పాటు చేయకూడదనే నిబంధన ఉన్నా పట్టించుకోలేదని నివేదికలో పేర్కొంది. చదవండి: రూబీ లాడ్జి ప్రమాదం: ఇలాంటి కాంప్లెక్స్లెన్నో? అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసినా అవి పనిచేయలేదు. భవనం మొత్తం కూడా క్లోజ్డ్ సర్క్యూట్లో ఉండిపోయింది. భవనానికి కనీసం కారిడార్ కూడా లేదు. ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేయలేదు. భవన, హోటల్ యజమాని నిర్లక్ష్యంతోనే అగ్ని ప్రమాదం జరిగింది. సెల్లార్లో మొదటిగా అగ్ని ప్రమాదం మొదలైంది.తర్వాత మొదటి అంతస్తు వరకు మంటలు వ్యాపించాయని నివేదికలో ఫైర్ డిపార్ట్మెంట్ పేర్కొంది. -
రూబీ లాడ్జి ప్రమాదం: ఇలాంటి కాంప్లెక్స్లెన్నో?
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని రూబీ లాడ్జిలో జరిగిన అగ్నిప్రమాద ఘటన.. నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని లేవనెత్తుతోంది. ఇప్పటికే ఈ భవనం ఓనర్ రంజిత్ సింగ్ బగ్గాను నార్త్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే.. రూబీ లాడ్జి బిల్డింగ్ అనుమతులపైనే ఇప్పుడు ప్రముఖ చర్చ నడుస్తోంది. తక్కువ స్పేస్‌లో అంత బిల్డింగ్ ఇరుక్కుగా కట్టడం, వాటికి అనుమతులు ఎలా దక్కాయన్న కోణంలోనూ ఘటనస్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యంగా ఫైర్ ఎన్ఓసీ(నో అబ్జక్షన్సర్టిఫికెట్)పై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. రెండు అంతస్తుల వరకే జీహెచ్ఎంసీ నుంచి ఫైర్ ఎన్ఓసీ తీసుకున్న రూబీ లాడ్జి.. మిగిలిన రెండు ఫ్లోర్లకు ఎలాంటి ఫైర్ అనుమతులు తీసుకోలేదన్నది సమాచారం. పైగా ఒకే భవనంలో.. పైన లాడ్జీ, కింద ఈ-బైక్ షోరూం, సెల్లార్లో ఈ-బైక్స్ నిర్వాహణ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందన్న కోణంలోనూ విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. లాడ్జీ సెల్లార్లో గ్యాస్ సిలిండర్లు సైతం నిల్వ చేయడం విస్మయానికి గురి చేస్తోంది. ఇక లాడ్జికి ఒకటే ఎంట్రీ, ఎగ్జిట్ మార్గం కావడంతో అప్పటికే పొగలో చిక్కుకున్న వాళ్లకు ఇబ్బందికరంగా మారిందని అధికారులు గుర్తించారు. జంట నగరాల్లో ఈ తరహా కాంప్లెక్స్‌లు వందల్లో ఉండొచ్చని వాదన బలంగా వినిపిస్తోంది. కమర్షియల్ కాంప్లెక్స్ అయినప్పటికీ అగ్ని ప్రమాద నివారణ చర్యలు లేకపోవడం ఒక ఎత్తైతే.. నిరంతరం తనిఖీలు చేయని అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు చెలరేగుతున్నాయి. భవనం పద్దెనిమిది మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉంటేనే ఫైర్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తుందని ఫైర్ డిజి సంజయ్ జైన్ చెప్పడం మరోవైపు జీహెచ్ఎంసీ, ఫైర్ డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయ లోపం ఉండడం.. పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. వెరసి.. నిర్లక్ష్యం కారణంగానే ఎనిమిది ప్రాణాలు బుగ్గి అయ్యాయన్నది చేదు వాస్తవం. ఇప్పటికైనా అధికారులు మేల్కొని.. ముందు ముందు అనుమతుల విషయంలో కఠినంగా ఉండాలని, ఇప్పటికే ఉన్న ఇలాంటి భవనాలపై దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. ఆ ఇద్దరు ఫోన్లో ఉండగా.. పని నిమిత్తం వచ్చిన ఇద్దరు ఆచి మసాలా ఉద్యోగులు రూబీ ప్రమాదంలో మరణించడం బాధాకరం. కంపెనీలో ఆడిటర్ అయిన సీతారామన్, మార్కెటింగ్ ఉద్యోగి అయిన బాలాజీ.. నిన్న(సోమవారం) రూబీ లాడ్జ్ లో దిగారు. సీతారామన్ వాళ్ల బ్రదర్ తో ఫోన్లో మాట్లాడిన పది నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగింది. ఇక బాలాజీ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులకు కాల్ చేసి హెల్ప్, హెల్ప్ అంటూ కేకలు వేశారు. అయితే.. ఆ పొగలోనే ఆయన ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. ఆందోళనతో కుటుంబ సభ్యులు రూబీ రిసెప్షన్‌కు కాల్ చేయగా.. అప్పటికే ఆయన చనియారు. ఇదీ చదవండి: రూబీ లాడ్జి.. బిడ్డ పుట్టిన ఆనందం ఆవిరి -
రూబీ లాడ్జి ప్రమాదం: అంత ఘోరం ఎలా జరిగింది?
సాక్షి, హైదరాబాద్: ఎనిమిది మంది టూరిస్టుల ప్రాణాలు బలిగొన్న సికింద్రాబాద్ రూబీ అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు ఉన్నతాధికారులు. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఎనిమిది మంది మరణించగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.పెను విషాదం నింపిన ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో.. రూబీ లాడ్జి ఘటనపై గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. లాడ్జి ఓనర్ రంజితసింగ్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. లాడ్జిలో దిగనవాళ్లు.. కాలిన గాయాలతో పాటు ఊపిరాడక మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చారు. గాంధీతో పాటు మరో రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుల ఫోన్ నెంబర్ల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నారు పోలీసులు. ఆర్డీవో ఆద్వర్యంలో గాంధీ ఆస్పత్రిలో మృతదేహాలకు పంచనామా నిర్వహిస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణం? ఇక ప్రమాద సమయంలో కాంప్లెక్స్‌లో 30 మందితో పాటు ఎనిమిది మంది సిబ్బంది ఉన్నట్లు తేలింది. అయితే ప్రమాదానికి ఈ-బైక్ బ్యాటరీ పేలుడే కారణమా? లేదంటే విద్యుత్ షాట్ సర్క్యూటే కారణమా? అనే విషయాలపై ఎమ్మార్వో, రెవెన్యూ అధికారులు ఆరాలు తీస్తున్నారు. సెల్లార్ లో నిబంధనలకు విరుద్ధంగా ఎలక్ట్రిక్ బైక్ సెంటర్ ఉండడం, అలాగే.. లాడ్జి వున్న చోట.. ఎలక్ట్రిక్ బైక్స్ నిర్వాహణకు ఎలా అనుమతి ఇచ్చారని కిందిస్థాయి అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పటికే ఘటనా స్థలంలో క్లూస్ టీం క్లూస్ సేకరించాయి. మరోవైపు కాంప్లెక్స్‌లో అగ్నిమాపక శాఖ నిబంధనలు(ఫైర్ సేఫ్టీ రూల్స్) ఏ మాత్రం లేవని గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో తప్పించుకునేందుకు దారులు లేవని, బిల్డింగ్ మొత్తానికి ఒకే దారి ఉండడం వల్లే ఘోరం జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. మెట్ల మార్గం గుండా కిందకు రాలేక.. దట్టమైన పొగ, మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. సాయంత్రకల్లా ప్రమాదంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: రూబీ లాడ్జి ప్రమాదంపై ఫైర్ అధికారి ఏమన్నారంటే..