సాక్షి, హైదరాబాద్/రామ్‌గోపాల్‌పేట: సికింద్రాబాద్ రాధా ఆర్కేడ్‌లోని ‘డెక్కన్ కార్పొరేట్ ’లో జరిగిన అగ్నిప్రమాదంలో గల్లంతైన ఉద్యోగుల అవశేషాలు ఆదివారం సాయంత్రానికి కూడా లభించలేదు. గల్లంతైన జునైద్, వశీం, జహీర్‌ల్లో శనివారం సాయంత్రం ఒకరి అవశేషాలు లభించగా, మరో ఇద్దరివి వెలికితీసే పనిలో పోలీసు, అగి్నమాపక శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. అగ్నిప్రమాదం జరిగిన గురువారం నుంచి వేడి సెగలు కక్కుతున్న ఈ భవనం ఆదివారం నాటికి కాస్త చల్లబడింది.
దీంతో డ్రోన్లకు బదులుగా నేరుగానే గాలింపు చేపట్టారు. అయితే ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో కూలిన శ్లాబుల కింద రెండు మృతదేహాలు (అవశేషాలు) ఉండి ఉంటాయని భావిస్తున్నారు. శ్లాబులు పెద్ద పరిమాణంలో ఉన్న నేపథ్యంలో కూలీలు తీయలేకపోతుండటంతో జేసీబీ వంటివి వాడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఆ యంత్రాలను వినియోగిస్తే శిథిలావస్థలో ఉన్న భవనం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏం చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.
ఆ అంతస్తుల్లో ఆస్తి నష్టం కూడా జరగలేదు..
గాలింపు బృందాలు ఆదివారం భవనంలోని అన్ని అంతస్తులనూ పరిశీలించాయి. సెల్లార్–1, గ్రౌండ్ ఫ్లోర్, మొదటి, రెండు, మూడో అంతస్తుల్లోని సరుకు మాత్రమే అగ్నికి ఆహుతైనట్లు గుర్తించారు. నాలుగో అంతస్తులో ఉన్న సామాను, సంచులతో పాటు ఐదు, ఆరో అంతస్తుల్లోని రహీం ఇంటిలోని ఫర్నీచర్ యథాతధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అక్కడ పొగ, మసి చూరుకుపోవడం తప్పించి ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని పేర్కొంటున్నారు. శనివారం లభించిన అవశేషాలతో పాటు ఆ ముగ్గురు యువకుల బంధువుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
చదవండి: అణచివేతకు గురయ్యే వారిని ప్రేమించాలని చెప్పేవారు
Comments
Please login to add a commentAdd a comment