సాక్షి, హైదరాబాద్: అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్ కార్పొరేట్ భవనం కూల్చివేతకు జీహెచ్‌ఎంసీ యంత్రాంగం సిద్ధమవుతోంది. అధునాతన యంత్రాలతో కూల్చివేసేందుకు సంబంధిత కాంట్రాక్టు ఏజెన్సీలను ఆహ్వానిస్తూ ఒక్కరోజు గడువుతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి బిడ్ డాక్యుమెంట్ డౌన్‌లోడ్‌కు అవకాశమిచ్చి, బుధవారం 10.30 గంటల వరకు దాఖలుకు గడువునిచ్చింది. గడువు ముగియగానే టెండర్లు ఓపెన్‌చేసి ఏజెన్సీని ఖరారు చేయనున్నారు. అంచనా వ్యయం రూ.41 లక్షలు.
టెండర్ దాఖలుకు ఎంపికైన ఏజెన్సీకి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ (ఎల్‌ఓఏ) ఇచ్చాక నాలుగు గంటల్లో కూల్చివేత ప్రక్రియకు అవసరమైన యంత్ర సామగ్రి తరలింపు పనులు చేపట్టాలని అధికారులు తెలిపారు. కూల్చివేతకు సంబంధించి పోలీసు, రెవెన్యూ అధికారుల నుంచి క్లియరెన్స్ కోరుతున్నామన్నారు. ఆర్‌సీసీ శ్లాబులు, బీమ్స్, కాలమ్స్, మిషనరీ వాల్వ్‌లు, తలుపులు, షట్టర్లు, ర్యాక్స్, కిటికీలు, వెంటలేటిర్లతో పాటు ఇతరత్రా మొత్తం భవనాన్ని కూల్చాలని టెండరు నిబంధనల్లో పేర్కొన్నారు. పోలీసు, ఫైర్, ఈవీడీఎం అధికారుల సమన్వయంతో భవనాన్ని కూల్చనున్నారు.
బాధ్యత కాంట్రాక్టు ఏజెన్సీదే..
కూల్చివేతకు అవసరమైన యంత్ర సామగ్రితో పాటు తగిన సేఫ్టీ ఏర్పాట్ల బాధ్యత కాంట్రాక్టు ఏజెన్సీదే. కూల్చివేత సందర్భంగా ఏదైనా ప్రమాదం జరిగితే కాంట్రాక్టు చట్టాల మేరకు నష్టపరిహారానికి ఏజెన్సీ బాధ్యత వహించాల్సి ఉంటుందని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది. కూల్చివేతలకు సంబంధించి చట్టాలు, నిబంధనల మేరకు వ్యవహరించాలని పేర్కొంది.
పరిసర ప్రజలకు నష్టం వాటిల్లకుండా, దుమ్ము, శబ్దం వల్ల ఇబ్బందులు తలెత్తకుండా బారికేడింగ్‌తో సహా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని తెలిపింది. వీటితోపాటు కూల్చాల్సిన భవనానికి విద్యుత్, వాటర్, శానిటరీ కనెక్షన్లను తొలగించాలని పేర్కొంది. కూల్చివేతలో పాల్గొనే సిబ్బందికి రక్షణ పరికరాల బాధ్యత తదితరమైనవన్నీ ఏజెన్సీదేనని స్పష్టం చేసింది.
వెలువడే డెబ్రిస్‌ను సైతం ఏజెన్సీయే రీసైక్లింగ్ ప్లాంట్‌కు తరలించాల్సి ఉంది. ఈ పని పూర్తిచేసే కాంట్రాక్టు ఏజెన్సీకి చెల్లింపులు మిగతా కాంట్రాక్టర్ల మాదిరిగానే జీహెచ్‌ఎంసీలో నిధుల లభ్యతను బట్టి జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. ప్రాధాన్యతతో ముందస్తుగా చెల్లించలేమని తెలిపారు.
అగ్నిప్రమాదం జరిగాక భవనం పటిష్టతను పరిశీలించిన వరంగల్ ఎన్‌ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణారావు బృందం భవనం పటిష్టత 70 శాతానికి పైగా దెబ్బ తిన్నదని, దీనిని కూల్చివేయాల్సి ఉంటుందని అదేరోజు జీహెచ్‌ఎంసీ అధికారులకు తెలిపారు. కూల్చివేతకు సంబంధిత విభాగాల నుంచి క్లియరెన్స్ రాగానే పనులు చేపట్టేందుకు జీహెచ్‌ఎంఈసీ అధికారులు సిద్ధమవుతున్నారు. కూలి్చవేతల వల్ల దాదాపు 20వేల మెట్రిక్ టన్నుల డెబ్రిస్ వెలువడనుందని అంచనా.
కూల్చివేతల్లోనే గాలింపు
సాక్షి, సిటీబ్యూరో/రాంగోపాల్‌పేట: సికింద్రాబాద్ మినిస్టర్స్ రోడ్‌లోని రాధా ఆర్కేడ్‌లో ఉన్న ‘డెక్కన్ కార్పొరేట్’ అగ్నిప్రమాదంలో అసువులు బాసిన ఆ ఇద్దరి మృతదేహాలకు సంబంధించిన అవశేషాలను భవనం కూల్చివేత, శిథిలాల తొలగింపు సమయంలోనే వెతకాలని పోలీసులు నిర్ణయించారు. ప్రస్తుతం రాధా ఆర్కేడ్ పరిస్థితి, దాని వల్ల చుట్టుపక్కల భవనాలకు ముప్పు తదితరాలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఈ అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే భవనం కూల్చివేత పనులకు జీహెచ్‌ఎంసీ అధికారులు సైతం టెండర్ పిలిచారు.
అగ్నిప్రమాదం జరిగిన రోజు గల్లంతైన ‘డెక్కన్’ ఉద్యోగులు జునైద్, వసీం, జహీర్‌ల్లో శనివారం ఒకరి అవశేషాలు లభించాయి. మిగిలిన ఇద్దరివీ వెలికితీయడం ఎలా అనే అంశంపై పోలీసు విభాగం పెద్ద కసరత్తే చేసింది. ఈ భవనానికి సంబంధించిన సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్, మొదటి, రెండు, మూడో అంతస్తుల శ్లాబ్స్ వెనుక వైపు కూలిపోయాయి. వాటి కిందే అవశేషాలు ఉంటాయని నిర్ధారించారు. పెద్ద పరిమాణంలోని సిమెండ్ దిమ్మెల మాదిరిగా ఉన్న ఈ శిథిలాలను తొలగించడానికి యంత్రాలు వినియోగిస్తే అది ప్రమాద హేతువుగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సాధారణంగా భవనాలు కూలిపోయి ఎవరైనా శిథిలాల్లో గల్లంతైన పరిస్థితుల్లో వారి ఆచూకీ కనిపెట్టడానికి శిక్షణ తీసుకున్న జాగిలాలను వినియోగిస్తారు. వాసన చూడటం ద్వారా అవి గల్లంతైన, శిథిలాల్లో చిక్కుకున్న వారి ఆచూకీ కనిపెట్టేస్తాయి. ‘డెక్కన్’లో జరిగింది అగ్నిప్రమాదం కావడంతో అక్కడ పొగ వాసన మాత్రమే ఉంటుంది. ఈ కారణంగా పోలీసు జాగిలాలు సైతం అవశేషాలను గుర్తించలేవు. కూలడానికి సిద్ధంగా ఉన్న ఆ భవనాన్ని జాగ్రత్తల మధ్య కూల్చివేసే వరకు చట్టుపక్కల ఇళ్లల్లోకి ఎవరినీ అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
గత గురువారం నుంచి ఇళ్లకు దూరంగా ఉన్న వారి నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న అధికారులు రాధా ఆర్కేడ్‌ను ప్రణాళికాబద్ధంగా కూల్చివేయాలని నిర్ణయించారు. ఆ శకలాలను సాంకేతికంగా తొలగించాలని, ఆ సందర్భంలోనే అవశేషాల కోసం గాలించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్‌లో పోలీసు, అగి్నమాపక, జీహెచ్‌ఎంసీ అధికారులతో పాటు డీఆర్‌ఎఫ్, క్లూస్ టీమ్‌లను వినియోగించాలని నిర్ణయించారు.‘డెక్కన్’ భవనం కూలి్చవేయాల్సిందే
Comments
Please login to add a commentAdd a comment