సాక్షి, సిటీబ్యూరో: గత ఏడాది బోయగూడలోని స్క్రాప్ దుకాణం 11 మందిని పొట్టనపెట్టుకుంది... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని రూబీ లాడ్జి ఎనిమిది మంది ఉసురుతీసింది... తాజాగా మినిస్టర్స్ రోడ్‌లోని డెక్కన్ కార్పొరేట్ భవనంలో ముగ్గురు గల్లంతయ్యారు... ఇలా వరుస ప్రమాదాలు జరుగుతున్నా.. అగ్నిమాపక నిబంధనల విషయంలో యాజమాన్యాలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో అర్థమవుతోంది.
ఇలాంటి కమర్షియల్ భవనాలు ఎన్నో ఉన్నాయి. వీటి విషయంలో జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక శాఖ అధికారులు సైతం కళ్లు మూసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇవి చేసిన, చేస్తున్న ఉల్లంఘనల విషయం అటు పాలకులు, ఇటు అధికారులకు పట్టడంలేదు. ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే ఒకటి రెండు రోజులు తనిఖీలు, చర్యల పేరుతో హడావుడి చేస్తారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా భవనాలు, పై అంతస్తులు నిర్మించుకోవడం, ఆ తర్వాత పై స్థాయి లో పైరవీలు చేసి అనుమతులు తీసుకోవడమో, మ్యానేజ్ చేయడమో నగరంలో మామూలైంది.
► జీహెచ్‌ఎంసీ ఎన్ని నిబంధనలు పెట్టినా, చట్టాలు తీసుకువచ్చినా అవన్నీ కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయి. అన్ని శాఖలు మూకుమ్మడిగా అనుమతి నిరాకరించిన అనేక బహుళ అంతస్థు భవనాలు, వాణిజ్య సముదాయాలకు ప్రభుత్వమే వివిధ సందర్భాల్లో అనుమతులు మంజూరు చేసింది. వీటి విషయంలో న్యాయస్థానాలు సైతం పలుమార్లు మొట్టికాయలు వేసినా... పటిష్ట చర్యలు తీసుకోవడానికి మాత్రం వెనుకడుగు వేస్తోంది.
► కోఠిలోని పుష్పాంజలి కాంప్లెక్స్‌లో చోటు చేసుకున్న అగి్నప్రమాదం ఈ విషయంలో అందరి కళ్లూ తెరిపించింది. ఆ తర్వాత జరిగిన మీనా జ్యువెలర్స్ ఉదంతంతో అధికార గణం మరింత అప్రమత్తమయ్యామంటూ ఊదరగొట్టింది. ఇవన్నీ కేవలం ఆరంభ శూరత్వాలుగానే మిగిలిపోయాయి. ముఖ్యంగా నగరంలో ఉన్న అని భవనాలను సందర్శించి ఫైర్ సేఫ్టీ మెజర్స్ పరీక్షిస్తామని, నిబంధనల ప్రకారం లేని వాటి యజమానులను చైతన్య పరుస్తామని, ఆ తరవాత కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు అనేక సందర్భాల్లో ప్రకటించారు.
► ప్రమాద ఘటనలు జరిగిన సందర్భంలో వాడీవేడిగా వెలువడే ఈ ప్రకటనలు ఆ తర్వాత చల్లబడిపోతున్నాయి. రోజుల గడిచే కొద్దీ ఈ విషయాలనే మర్చిపోతున్నారు. గతంలో అధికారులు నిర్వహించిన సర్వేలో ఇలాంటి భవనాలు నగరంలో వేల సంఖ్యలో ఉన్నాయని బయటపడింది. అయినా ఇప్పటికీ వీటిపై తీసుకున్న సరైన చర్యలు లేవు. అందుకే ఎక్కడపడితే అక్కడ అక్రమ భవనాలు వెలుస్తున్నాయి. గురువారం డెక్కన్ కార్పొరేట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంతో పరిస్థితి మరోసారి వేడెక్కింది. ఇకనైనా అధికారులు కాస్త కఠినంగా వ్యవహరించి సరైన చర్యలు తీసుకోకపోతే... అనేక మంది అమాయక ప్రాణాలను బలి కావాల్సిందేనని నగరవాసులు వ్యాఖ్యానిస్తున్నారు.
చదవండి: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. రోజంతా మంటలే!
Comments
Please login to add a commentAdd a comment