రాంగోపాల్‌పేట్: సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్‌లో అగ్ని ప్రమాదం జరిగిన డెక్కన్ భవనంలో సెర్చ్ ఆపరేషన్ నిలిచిపోయింది. ఈ నెల 19వ తేదీన ఆరు అంతస్తుల ఈ భవనంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం విదితమే. అదే రోజు డెక్కన్ నిట్‌వేర్‌లో పనిచేసే జునైద్, జహీర్, వాసిం భవనంలోకి వెళ్లి కనిపించకుండా పోయారు. మూడు రోజులుగా పాటు ఫైర్, డీఆర్‌ఎఫ్, పోలీసులు భవనం మొత్తం జల్లెడ పట్టి గాలించారు. ఈ నెల 21వ తేదీన భవనంలోని మొదటి అంతస్తులో ఒకరి మృతదేహం ఆనవాళ్లు మాత్రమే బయటపడ్డాయి. ఆదివారం కూడా అధికారులు గల్లంతైన వారి కోసం భవనం మొత్తం గాలించారు. కానీ ఎవరి ఆచూకీ లభించడలేదు.
► భవనం వెనుక వైపు గ్రౌండ్ నుంచి మూడో అంతస్తు వరకు శ్లాబులు కూలిపోయి శిథిలాలు మొత్తం మొదటి సెల్లార్‌లో పడ్డాయి. వాటి కిందే మృతదేహాలు ఉంటాయనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద శిథిలాలను కదిలించే పరిస్థితి లేకపోవడంతో ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. జేసీబీ లాంటి యంత్రాలను తీసుకుని వెళ్లే పరిస్థితి కూడా లేదు. దీంతో సోమవారం కూడా అధికారులు భవనం లోపలికి వెళ్లలేదు.
► భవనం లోపల సెర్చ్ ఆపరేషన్ చేసేందుకు ఫైర్, పోలీసు అధికారులు భయపడుతున్నారు. దీంతో ఇప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వేచిచూస్తున్నారు. కానీ గల్లంతైన వారి బంధువులు మాత్రం తమవారి ఆచూకీ తెలిసేంత వరకు భవనం కూలి్చవేయవద్దని అంటున్నారు. దీంతో అధికారులు సందిగ్ధావస్థలో పడ్డారు.
► ఆచూకీ దొరకని జునైద్, వాసీం, జహీర్‌ల బంధువులను సోమవారం రాంగోపాల్‌పేట్ ఇన్‌స్పెక్టర్ లింగేశ్వర్‌రావు పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. వారి రక్త నమూనాల కోసం వివరాలు సేకరించి వారిని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌లో డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి ఇటీవల దొరికిన మృతదేహం ఎవరిది అనే విషయాన్ని నిర్ధారించనున్నారు.
చదవండి: స్మిత సబర్వాల్ ఇంట్లోకి చొరబాటు.. ఆనందకుమార్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Comments
Please login to add a commentAdd a comment