confused
-
డెక్కన్ మాల్ రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేత.. బిల్డింగ్ కూల్చివేతపై సందిగ్ధం
రాంగోపాల్‌పేట్: సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్లో అగ్ని ప్రమాదం జరిగిన డెక్కన్ భవనంలో సెర్చ్ ఆపరేషన్ నిలిచిపోయింది. ఈ నెల 19వ తేదీన ఆరు అంతస్తుల ఈ భవనంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం విదితమే. అదే రోజు డెక్కన్ నిట్‌వేర్‌లో పనిచేసే జునైద్, జహీర్, వాసిం భవనంలోకి వెళ్లి కనిపించకుండా పోయారు. మూడు రోజులుగా పాటు ఫైర్, డీఆర్ఎఫ్, పోలీసులు భవనం మొత్తం జల్లెడ పట్టి గాలించారు. ఈ నెల 21వ తేదీన భవనంలోని మొదటి అంతస్తులో ఒకరి మృతదేహం ఆనవాళ్లు మాత్రమే బయటపడ్డాయి. ఆదివారం కూడా అధికారులు గల్లంతైన వారి కోసం భవనం మొత్తం గాలించారు. కానీ ఎవరి ఆచూకీ లభించడలేదు. ► భవనం వెనుక వైపు గ్రౌండ్ నుంచి మూడో అంతస్తు వరకు శ్లాబులు కూలిపోయి శిథిలాలు మొత్తం మొదటి సెల్లార్లో పడ్డాయి. వాటి కిందే మృతదేహాలు ఉంటాయనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద శిథిలాలను కదిలించే పరిస్థితి లేకపోవడంతో ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. జేసీబీ లాంటి యంత్రాలను తీసుకుని వెళ్లే పరిస్థితి కూడా లేదు. దీంతో సోమవారం కూడా అధికారులు భవనం లోపలికి వెళ్లలేదు. ► భవనం లోపల సెర్చ్ ఆపరేషన్ చేసేందుకు ఫైర్, పోలీసు అధికారులు భయపడుతున్నారు. దీంతో ఇప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వేచిచూస్తున్నారు. కానీ గల్లంతైన వారి బంధువులు మాత్రం తమవారి ఆచూకీ తెలిసేంత వరకు భవనం కూలి్చవేయవద్దని అంటున్నారు. దీంతో అధికారులు సందిగ్ధావస్థలో పడ్డారు. ► ఆచూకీ దొరకని జునైద్, వాసీం, జహీర్‌ల బంధువులను సోమవారం రాంగోపాల్‌పేట్ ఇన్స్పెక్టర్ లింగేశ్వర్‌రావు పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. వారి రక్త నమూనాల కోసం వివరాలు సేకరించి వారిని ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. ఎఫ్ఎస్ఎల్లో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి ఇటీవల దొరికిన మృతదేహం ఎవరిది అనే విషయాన్ని నిర్ధారించనున్నారు. చదవండి: స్మిత సబర్వాల్ ఇంట్లోకి చొరబాటు.. ఆనందకుమార్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు -
తికమక పెట్టిన గణితం ‘90’ వస్తే ఐఐటీ సీటు!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విద్యార్థులను ఈసారి గణితం ఎక్కువగా తికమక పెట్టింది. రసాయన శాస్త్రం నుంచి మంచి స్కోర్ చేయవచ్చని, ఫిజిక్స్‌తో మధ్యస్తంగా మార్కులు తెచ్చుకునే వీలుందని విద్యారంగ నిపుణులు తెలిపారు. ప్రశ్నల తీరును పరిశీలిస్తే 85 నుంచి 90 మార్కులు జనరల్‌కు కటాఫ్ ఉంటుందని, ఈడబ్ల్యూఎస్‌కు 68–72, ఓబీసీకి 68–75, ఎస్సీఎస్టీకి 50 మార్కులు కటాఫ్‌గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఖరగ్‌పూర్ ఐఐటీ నేతృత్వంలో ఆదివారం ఉదయం, సాయంత్రం రెండు షిప్టులు, రెండు పేపర్లుగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరిగింది. డైరెక్ట్ ప్రశ్నలతో ఊరట 11, 12 సత్సమానమైన క్లాసుల నుంచే కెమిస్ట్రీలో ఎక్కువ ప్రశ్నలొచ్చాయి. ఎన్సీఈఆర్టీ విధానం ప్రకారం డైరెక్ట్ (ఎలాంటి మెలిక లేకుండా) ప్రశ్నలు రావడం విద్యార్థులకు ఊరట కలిగించింది. భౌతిక రసాయన శాస్త్రంలో టైట్రేషన్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, థర్మోడైనమిక్ ప్రశ్నలు, ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి జంతువులు, బయోమాలిక్యులస్, ఆక్సిజన్ కంటెయినింగ్ కాంపౌండ్స్ నుంచి ప్రశ్నలొచ్చాయి. భౌతికశాస్త్రంలో 11వ తరగతికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి. ఎలక్ట్రిసిటీ, ఆప్టిక్స్, రొటేషన్ అండ్ మోడ్రన్ ఫిజిక్స్ నుంచి మధ్యస్తంగా ప్రశ్నలున్నాయి. మ్యాథమెటిక్స్ విద్యార్థులకు తలనొప్పి తెప్పించిందని గణిత శాస్త్ర అధ్యాపకులు విశ్లేషిస్తున్నారు. కొన్ని తేలికైన ప్రశ్నలే ఇచ్చినా, మేట్రిసిస్, డిటర్మినెంట్స్, ఫంక్షన్స్, కంటిన్యుటీ అండ్ డిఫరెన్ష్యబులిటీ, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్తో పాటు పలు చాప్టర్ల నుంచి ప్రశ్నలిచ్చారు. కొన్ని చాప్టర్ల నుంచి ఇచ్చిన ప్రశ్నలు గందరగోళపరిచేలా ఉన్నాయని విద్యా రంగ నిపుణులు తెలిపారు. -
గందరగోళంగా విద్యార్థుల లెక్కలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల లెక్కలపై గందరగోళం నెలకొంది. ఎంతమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి తగ్గిపోతున్నారో.. ఎంత మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో పెరుగుతున్నారో, ప్రభుత్వ గురుకులాల్లో ఎంతమంది చేరుతున్నారో, ఎంతమంది డ్రాపవుట్ అవుతున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. విద్యాశాఖ వేస్తున్న ఒక లెక్కతో మరో లెక్కకు పొంతన కుదరడం లేదు. 2016–17 విద్యా సంవత్సరంతో 2017–18 విద్యా ఏడాది లెక్కలను పోల్చి తే 1.34 లక్షల మంది విద్యార్థులు ఒక్క జిల్లా పరిషత్, మండల పరిషత్ మేనేజ్మెంట్ పాఠశాలల్లోనే తగ్గిపోయారు. అదే ప్రైవేటులో 85,565 మంది విద్యార్థులు పెరిగారు. అధికారిక లెక్కల ప్రకారం 2017–18లో ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్ పాఠశాలల్లో మొత్తంగా 5.69% విద్యార్థులు డ్రాపవుట్స్ ఉన్నారు. అంటే 1,58,982 మంది విద్యార్థులు బడి మానేసినట్లు విద్యాశాఖ లెక్కలు వేసింది. 2017– 18 విద్యా ఏడాదిలో కొత్తగా ఏర్పాటుచేసిన 470 గురుకులాల్లో 1,50,400 మంది విద్యార్థులు చేరినట్లు సంక్షేమ శాఖలు లెక్కలు వేశాయి. అయితే బడి మానేసిన వారంతా గురుకులాల్లో చేరారా? అదే నిజమైతే ప్రైవేటు పాఠశాలల్లో పెరిగిన 86,565 మంది విద్యార్థులు ఎలా వచ్చారన్నది అర్థంకాని ప్రశ్నగానే మిగిలిపోతోంది. 2016–17లో ప్రభుత్వ స్కూళ్ల లో 6,74,748 మంది విద్యార్థులు ఉంటే ఆ సంఖ్య 2017–18 విద్యా ఏడాదిలో 7,58,132కు పెరిగినట్లు లెక్కలు వేసింది. అంటే 83,384 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగినట్లు తేల్చింది. రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలో చేరిన విద్యార్థుల సంఖ్య, ప్రైవేటు పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య కలిపితే పెరిగిన విద్యార్థుల సంఖ్య 1.70 లక్షలకు చేరుకుంది. అందు లో జెడ్పీ స్కూళ్లలో తగ్గిపోయిన 1.34 లక్షల మందిని తీసేసినా మిగతా 36 వేల మంది విద్యార్థులు ఎక్కడినుంచి వచ్చారన్నది అర్థంకాని పరిస్థితి నెలకొంది. -
చివరి కోరిక
‘‘ఇది విన్నారా? రఘు రావట్లేదంట. యూఎస్ నుంచి ఇందాకే కాల్ చేసి చెప్పాట్ట’’ ఒకింత ఆశ్చర్యంగా ఈ కబురు తెలిపింది నా శ్రీమతి.మోటార్ సైకిల్ పార్క్ చేసి, లోనికి వచ్చి కూర్చుని చెప్పాను‘‘అవునట. నాకూ ఇందాకే తెలిసింది. ఆఫీస్ నుంచి వస్తుంటే దార్లో రంగనాథంగారు కనబడి చెప్పారు’’రఘు రాలేకపోతున్నది ఏదో పెండ్లికో పేరంటానికో కాదు, సాక్షాత్తు తన తల్లి దశదిన కర్మలకి. రఘు అమెరికాలో పనిచేస్తున్నాడు. చాలా బిజీగా ఉండటం వల్ల రాలేకపోతున్నాడు.కుక్కాంటీ అనబడే సరోజ ఆంటీకి రఘు ఒక్కగానొక్క కొడుకు. తన ఆశలన్నీ కొడుకుపైనే పెట్టుకుని ఐఐటీలో చదవించి, వాడి జీవితాన్ని ఒక దారిలో పెట్టిన కుక్కాంటీ అసలు ఊహించి ఉండదు ఇలాంటి పరిణామం. ఆవిడ చనిపోయిన రోజు కూడా రఘు రాలేకపోయాడు. బిజీగా ఉన్నానని అమెరికా నుంచి ఫోన్ చేశాడు.అందర్నీ ఆశ్చర్యంలో ముంచేశాడు. తల మునకలయ్యేంత పనుల్లో ఉన్నానని, సెలవు దొరకదని, అంత్యక్రియలు కాలనీ పెద్దల ఆధ్వర్యంలో కానివ్వండని, దశదిన కర్మల లోపు వచ్చేస్తానని ఖర్చు ఎంతైనా వెనుకాడకుండా పనులు కానివ్వండని అభ్యర్థించేటప్పటికి ఎవరూ కాదనలేకపోయారు. అతని కోణం నుంచి పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నమే చేశారు.రంగనాథంగారు సరోజ ఆంటీకి బాగా దగ్గరి వారు. దూరపు చుట్టరికం కూడా ఉందనుకుంటాను. ఆయన బాధ్యత తీసుకుని, అన్ని పనులూ తన తలపై వేసుకుని వ్యవహారం కానిచ్చారు. కాలనీలోని ప్రతి ఒక్కరూ రంగనాథంగారికి సహకరించారు. సరోజ ఆంటీ అంటే అందరికీ ప్రత్యేక అభిమానం. ఆవిడ రుణం ఈ విధంగా తీర్చుకునే అవకాశం వచ్చిందని అందరూ అనుకున్నారు. తలలో నాలుక అన్నది చాలా చిన్నపదం అవుతుంది ఆవిడ విషయంలో. కాలనీలో అందరినీ తన పిల్లల్లా చూసుకునేది. పెళ్లి, పేరంటం, నామకరణం, పుట్టినరోజు వేడుకలు... ఇలా ఒక్కటేమిటి ఎక్కడ కోలాహలం ఉంటే అక్కడ కుక్కాంటీ ఉంటుందనేది జగమెరిగిన సత్యంగా మారింది.శుభకార్యాలు సరే, ఏ ఇంట్లో విషాదం జరిగినా, ఓదార్చడానికి తానే ముందుండేది. ఆయా ఇండ్లలో ఆ ఇల్లు ఆవిడదేనేమో అన్నట్లుగా తిరిగి అందరినీ ఓదార్చి ఒక పూటో రెండుపూటలో ఉండి వచ్చేది. ఆవిడ ఒక చైతన్యం, ఆవిడ ఒక శక్తి. ఆవిడ ఒక అండ.ఇలా ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఇలా ఆలోచిస్తూ ఉంటే, ఆవిడని నేను మొదటిసారి చూసిన సంఘటన గుర్తొచ్చింది. నా ఆలోచనలు క్రమంగా గతంలోకి పరుగులు తీశాయి.ఈ సంఘటన జరిగి దాదాపు పదిహేనేళ్లు అవుతోంది.‘‘ఇలా చలిగాలిలో తిరక్కూడదు. కడుపునిండా భోంచేసి చక్కగా ఇంట్లో పడుకోవాలి’’ కాసింత కటువుగా అన్నారెవరో.చలికి ఒకరికొకరం దగ్గరగా అతుక్కుని నడుస్తున్నామేమో, ఈ మాట విని చటుక్కుమని దూరంగా జరిగిపోయాం నేనూ మా ఆవిడా.‘‘అయ్యో! మిమ్మల్ని కాదులెండి. ఈ కుక్కల్ని అంటున్నాను’’ ఈ మాటతో మా అయోమయం ఇంకా ఎక్కువైంది.ఆ మాటలు అంటున్నావిడ కాస్త లావుగా ఉంది. ఆవిడ పెద్ద బొట్టు పెట్టుకుని, తెల్లని శరీర ఛాయతో హుందాగా ఉంది. ఆవిడ చేతిలో అన్నం గిన్నె పట్టుకుని, చుట్టూ చేరిన ఐదారు కుక్కలకి అన్నం పెడుతోంది.ఆవిడ ధోరణి మాకు కాస్త విచిత్రంగా అనిపించింది. మనుషులతో మాట్లాడినంత చనువుగా, ఆప్యాయంగా ఉండుండి ఆ కుక్కలతో మాట్లాడుతోంది. వాటి వాలకాన్ని బట్టి చూస్తే అవన్నీ వీధి కుక్కలని తెలిసిపోతోంది. ఒక్కటి కూడా పెంపుడు కుక్కలా లేదు.అవాక్కయి నిలబడి చూస్తుండిపోయా మేమిద్దరం.‘‘గుడికెళ్తున్నారా? వెళ్లిరండి. హారతి టైమవుతుందనుకుంటాను’’ మమ్మల్ని ఉద్దేశించి ఆ రెండు మాటలూ అనేసి తిరిగి కుక్కలకు వడ్డించడంలో నిమగ్నమైపోయింది. ఆవిడని చూడటం అదే మొదటిసారి. ఆవిడ పేరు సరోజ అని తర్వాత తెలిసింది.ఆవిడని ఆ విధిలో అందరూ కుక్కాంటీ అనే పిలుస్తారని తెలిసింది. ఆవిడ అసలు పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసని మాకు క్రమంగా అర్థమైంది.ఆవిడ వెళుతూ ఉంటే, వెనకాలే కనీసం నాలుగైదు కుక్కులు తోకూపుకుంటూ వెళుతూ కనిపిస్తాయి.మామూలుగా మనం పక్కవీ«ధికి వెళితే పరిచయస్తులు ‘హలో.. హాయ్’ అని పలకరించినట్లు ఆ చుట్టుపక్కల వీధుల్లో ఎక్కడికెళ్లినా ఆయా వీధుల్లోని కుక్కలు ‘కుయ్.. కుయ్’మంటూ ఆవిడ దగ్గరగావచ్చి తమ విశ్వాసం ప్రకటిస్తాయి.నగరానికి నేనొచ్చిన కొత్త రోజులవి. విశ్వవిఖ్యాత దిగ్గజంలాంటి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రావడంతో నాకు నేలపై కాళ్లు నిలబడేవి కావు ఆరోజుల్లో. చేతినిండా డబ్బు. కావలసినంత స్వేచ్ఛ.అమ్మానాన్నల ఇష్టానికి అనుగుణంగా నా మరదలినే పెళ్లి చేసుకుని నగరంలో స్థిరపడ్డాను. నగర కాలుష్యానికి దూరంగా, ఆఫీస్ క్యాంపస్‌కి కాస్త దగ్గరగా ఉండేలా చూసుకుని ఎదుగుతున్న ఆ కాలనీలో ఇండిపెండెంట్ ఇల్లు సొంతం చేసుకున్నాను. ఆ ఇంటి నిర్మాణం సందర్భంగా ఒకరోజు సాయంత్రం నిర్మాణ నిర్వహణ పనులు ముగించుకుని సతీసమేతంగా గుడికి వెళుతూ కుక్కాంటీగారిని ఇలా చూడటం తటస్థించింది. ఇంటికి దగ్గర్లోనే ఒక మంచి సాయిబాబా గుడి ఉండటం మాకు చాలా నచ్చింది. వీలైనంత వరకు ప్రతిరోజూ వెళ్లి దర్శనం చేసుకుని వచ్చేవాడిని. నగరాల్లోని కాలనీల్లో ఎవరి జీవితం వారిది అనుకుంటూ కాలం గడిపేయడానికి అలవాటు పడిపోయాం అందరమూ. పక్కింటివాడి పేరు తెలియదు. ఏం చేస్తుంటాడో తెలియదు. ఇదో నాగరికత అనే భ్రమలో బతికేస్తుంటాం.ఇలాంటి భ్రమలకు తెరదించింది సరోజ ఆంటీ. నేను ఇంటి స్థలం తీసుకుని, నిర్మాణం పనులన్నీ ముగించి, కొలీగ్స్‌ని, బాగా దగ్గరి బంధువులను, ఆప్తమిత్రులు కొందరిని ఆహ్వానించుకుని ‘హరి ఓం’ అని గృహప్రవేశం చేసుకుంటున్నాను. ఇంతలో ఉరుములేని పిడుగులా సరోజ ఆంటీ ఊడిపడింది.‘‘ఏం నాయనా! నా సైజు చూసి బాగా మెక్కేస్తానని పిలవలేదా ఏంటి? సరిగా మీ ఇంటి వెనుకే ఉంటాను తండ్రీ. నా పేరు సరోజ. మీ అమ్మగారిలా అనుకో. ఇదిగో నా తరఫు నుంచి ఈ చిన్న కానుక. మీరు, మీ తదనంతరం మీ పిల్లలు, మీ మనవళ్లు, మనవరాళ్లు ఈ ఇంట్లో అనేక శత సంవత్సరాలు హాయిగా అనేకానేక శుభకార్యాలు నిర్వహించుకుంటూ సంతృప్తిగా, సంతోషంగా అషై్టశ్వర్యాలతో తులతూగాలని నా ఆకాంక్ష’’ అంటూ ఆవిడ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లా టకటకా చెప్పదలచిన నాలుగు ముక్కలూ చెప్పేసి, కానుక ఇచ్చేసి, అందరితో పరిచయాలు చేసేసుకుని, బలవంతం చేస్తే కొద్దిగా విందు ఆరగించి, ఎలా వచ్చిందో అలా వేగంగా వెళ్లిపోయింది. మొదటి చూపులోనే ఆవిడ మా వాళ్లందరికీ తెగ నచ్చేసింది. ఆ తర్వాత మా బంధువులంతా నగరానికి ఎప్పుడు వచ్చినా ఆవిడని కలవకుండా వెళ్లేవారు కాదు. మా అక్కయ్యలు, అన్నయ్యలు ఎప్పుడు ఫోన్ చేసి నాతో మాట్లాడినా ఆవిడ గురించి కుశల ప్రశ్నలు అడిగిగాని సంభాషణ ముగించేవారు కాదు. అంతగా మా అందరిపై ప్రభావం చూపగలిగిందావిడ. పిచ్చిదానిలా కనిపించిన ఆవిడ, చాలా త్వరలోనే నా దృష్టిలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోతుందని నాకప్పట్లో తెలియదు. ఆవిడ భర్త ఏదో చిన్న ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఈవిడంత కలుపుగోరు మనిషి కాదాయన. తన పని తాను చేసుకుపోయేవాడు. అందరినీ చిరునవ్వుతో పలకరించేవాడు. ఈవిడ చేసే ఎలాంటి సేవా కార్యక్రమాలకు అడ్డు చెప్పేవాడు కాదాయన. అదే ఆయన చేసే సేవ అని చెప్పవచ్చు. వారికి ఒకే ఒక అబ్బాయి.వాడి పేరు రఘు. మేము ఆ కాలనీలో చేరేటప్పటికి రఘు రెండో తరగతో మూడో తరగతో చదివేవాడు. వాళ్ల ఆశలన్నీ రఘుపైనే. వాడిని బాగా చదివించి అమెరికా పంపించాలనేది ఆవిడ ఆశయంగా ఉండేది. అందరితో అదే మాట చెప్పేది. రఘు కూడా చదువులో మంచి ప్రతిభ చూపేవాడు. ప్రతి పరీక్షలోనూ ఫస్ట్‌గా నిలిచేవాడు.ఇక కుక్కాంటీ విషయానికొస్తే చెప్పుకోవడానికి చాలా విషయాలే ఉన్నాయి.స్వామీ వివేకానంద జన్మదినోత్సవం వస్తోందంటే చాలు, ఈవిడ ఓ హుండీలాంటి డబ్బా ఒకటి పట్టుకుని కాలనీలోని అన్ని ఇళ్లూ తిరిగి చందాలు వసూలు చేసేది. ‘‘మీకు తోచినంత ఇవ్వండి. ఎటువంటి బలవంతం లేదు’’ అనేది. అలా పోగైన డబ్బులన్నీ పట్టుకువెళ్లి మా ఇళ్ల దగ్గర్లో ఉన్న అనాథాశ్రమంలోని పిల్లలకు నోట్ పుస్తకాలు, బ్యాగులు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు కొని ఇచ్చేది. తన పుట్టినరోజని ఒకసారి, వాళ్లాయన పుట్టినరోజని ఒకసారి, వాళ్లబ్బాయి పుట్టినరోజని ఒకసారి ఇలా ఏదో ఒక సందర్భంలో అనాథాశ్రమం పిల్లలకు తన ఇంటి నుంచి తెచ్చిన విందుభోజనం పెట్టేది.తాను చేసే ఇలాంటి ధర్మకార్యాలకు ఎలాంటి ప్రచారమూ ఆశించేది కాదు. ఊరికి దూరంగా ఉన్న కారణంగా అనుకుంటాను మా కాలనీకి బిచ్చగాళ్లు తక్కువగా వచ్చేవారు. అనుకోకుండా వచ్చే ఒకటీ అరా బిచ్చగాళ్లకు చక్కని సరోజా ఆంటీ ఇంట్లో చక్కని భోజనం, వారి ఇంటి కాంపౌండ్‌లోని వేపచెట్టు కింద నవారుమంచంపై చక్కని నిద్ర దక్కేవి.కాలనీలో రోడ్లు పడ్డా ఆవిడకే ఆనందం, బోరుబావులు తవ్వినాఆవిడకే ఆనందం. చిన్నపిల్లలా అక్కడే ఉండి ఆయా కార్మికులని ఉత్సాహపరుస్తూ వాళ్లకు నీళ్లు, చిరుతిండ్లు తానే సప్లై చేసేది. మా ఇంటి దగ్గరి సాయిబాబా గుడికి ప్రతి గురువారం మధ్యాహ్నం పన్నెండింటికి చేరుకునేది. అక్కడ జరిగే అన్నదానంలో ప్రత్యక్షంగా వడ్డన ద్వారా, పరోక్షంగా ఆర్థికసాయం ద్వారా తనవంతు తోడ్పాటు అందించేది. అందరూ తన బంధువులేనేమో అనేంత ఆప్యాయంగా వడ్డించి, ఆకలి తీరిందో లేదో కనుక్కుని మరీ పంపేది. మా కాలనీ అంతా కలిపి వందా నూటయాభై ఇళ్లు ఉండేవి ఆ రోజుల్లో. నెలకోసారి అందర్నీ కలిపేలా చేసి ఏదో ఒక సాంఘిక కార్యక్రమం నిర్వహింపజేసేది ఆవిడ. మొక్కలు నాటడం, ప్లాస్టిక్ చెత్త లేకుండా చూసుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహించేది. ఇప్పుడు మా కాలనీలో మంచి మంచి వృక్షాలు ఉన్నాయంటే అదంతా ఆవిడ చలవే.ఇటీవల ఒక టీవీ చానల్ వాళ్ల సర్వేలో తేలిందేమిటంటే రాష్ట్రం మొత్తం మీద సగటు ఉష్ణోగ్రత కంటే మా కాలనీలో ఐదారు డిగ్రీలు తక్కువే ఉంటుందట. ఇవన్నీ ఒక ఎత్తయితే కాలనీలోని ఆడపిల్లలందరినీ సమీకరించి వారికి వేదికనెక్కి ఉపన్యాసం ఇచ్చే కళని పదును పెట్టుకోమని ప్రోత్సహించేది. మా కాలనీ అమ్మాయిలు చాలామంది ఈవేళ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సునాయాసంగా నెగ్గడానికి కుక్కాంటీ చిన్నప్పుడు తమకు ఇచ్చిన శిక్షణే ఎంతో ఉపయోగపడిందని వారంతా ముక్తకంఠంతో చెబుతారు. ఇలా అందరి జీవితాలపై ప్రభావం చూపిన ఆవిడ తన కొడుకు రఘు విషయంలో సహజంగానే మరింత ప్రేమగా వ్యవహరించిందనడంలో ఎలాంటి సందేహాలకూ తావు లేదు.దురదృష్టవశాత్తు రఘుకి ఆవిడ పూర్తిగా అర్థం కాలేదని చెప్పవచ్చు. అర్థం కాకపోతే పోయే. తల్లిదండ్రుల మీద, సొంత దేశం మీద ద్వేషం పెంచుకోవడమే విషాదం.యోగ్యులను దేవుడు పరీక్షలకు గురిచేస్తాడని అనుకునే వారి నమ్మకాన్ని నిజం చేస్తూ దేవుడు సరోజ ఆంటీకి ఒక పెద్ద పరీక్షే పెట్టాడు.రఘు ఇంకా పదో తరగతికి రాక ముందే ఆవిడని విధి చిన్నచూపు చూసింది. రఘు తండ్రిలేని వాడయ్యాడు. ఆవిడ కనీసం పదో తరగతి కూడా పాస్ కాకపోవడంతో భర్త ఉద్యోగం కూడా రాలేదు. కొంత పరిహారం, నెలనెలా అందే పింఛనుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ కుదుపు ఆమెలోని కరుణకి ఆనకట్ట వేయలేకపోయింది. తిరిగి మామూలుగానే ఆమె సేవా కార్యక్రమాలకి నడుం బిగించింది. చిత్రంగా ఆమె మరింత సమయాన్ని సేవా కార్యక్రమాలకి వెచ్చించడం మొదలుపెట్టింది. బహుశ తన దుఃఖాన్ని ఈ విధంగా మర్చిపోయే ప్రయత్నం చేసేదనుకుంటా. అలాగని కొడుకు బాధ్యతలని, ఇంటి పనులని నిర్లక్ష్యం చేయలేదు. భర్త మరణం తర్వాత రఘు చదువుపై ఎక్కువ సమయాన్ని వెచ్చించేది.వాడు ఇంటర్‌కు వచ్చాక వేకువనే బ్రహ్మీముహూర్తంలో లేచి, నాలుగు నాలుగున్నరకల్లా వాడిని నారాయణగూడలోని ఐఐటీ కోచింగ్ సెంటర్లో దిగబెట్టి రావడంతో ఆవిడ దినచర్య ప్రారంభమయ్యేది. కోచింగ్ సెంటర్‌కీ, జూనియర్ కాలేజీకి, సాయంత్రం మరో కోచింగ్ సెంటర్‌కి తిరగడంతో ఆవిడకి కాలం వేగంగా గడిచినట్లు అనిపించేది. వేళకి రఘుకి టిఫన్లు, భోజనాలు ఏర్పాటు చేయడంలో ఆ జీవి ఎంత అలసిపోయేదో ఆ కర్మసాక్షికి మాత్రమే తెలుసు. రఘు గురించి ఆమె కన్న కలలన్నీ నిజమయ్యాయనే చెప్పవచ్చు. సహజంగా తెలివైన కుర్రాడు కావడం, చక్కని కోచింగ్ లభించడంతో రఘుకి ముంబై ఐఐటీలో మొదటి ప్రయత్నంలోనే కోరుకున్న బ్రాంచీలో సీటు రావడం, అక్కడ కూడా దిగ్విజయంగా కోర్సు పూర్తి చేసుకుని, చూస్తుండగానే చక్కని కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుని అమెరికా వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి.కథ ఇక్కడి వరకే అయితే ‘సుఖాంతం’ అని చెప్పి చేతులు దులిపేసుకునేవాడిని నేను కూడా. అసలు కథ ఇక్కడే మొదలైంది మరి. రఘు ఐఐటీలో చేరిన కొత్తలో ఆవిడ ఇంటింటికీ తిరిగి తన పుత్రుడి గురించిన విశేషాలను చెప్పుకుంటూ ఆనందం పంచుకునేది. క్రమంగా ఆవిడలో ఆ ఉత్సాహం సన్నగిల్లింది. రఘు గురించిన ప్రస్తావన తానై తేవడం మానేసింది. ఎవరైనా అడిగితే ముక్తసరిగా చెప్పి ముగించేది ఆ సంభాషణ.వాడు ఐఐటీలో చేరింది లగాయతు మహా అంటే ఒకట్రెండు సార్లు వచ్చి ఉంటాడు ఇంటికి. ఇక అమెరికాకి వెళ్లిపోయిన తర్వాత ఒక్కసారి కూడా ఇంటి మొహం చూసిన పాపానపోలేదు. వాడి దగ్గర ఉన్న స్టాక్ సమాధానం ‘బిజీగా ఉన్నాను’. ఎప్పుడూ చైతన్యానికి ప్రతీగా ఉండే కుక్కాంటీ డల్‌గా ఉండటం ఎవరూ ఎన్నడూ చూడలేదు. ఈ ప్రపంచంలోని ఆనందం, ఉత్సాహం తాలూకు కేరాఫ్ అడ్రస్సా ఈవిడ అన్నట్లు ఉంటుంది ఆవిడ ప్రవర్తన.అలాంటావిడ వెక్కివెక్కి ఏడ్వడం నేను చూడాల్సి వచ్చింది ఓసారి. అసలేం జరిగిందంటే...ఒకరోజు సాయంత్రం గుడికెళ్తూ అనుకోకుండా వారింటికి వెళ్లాను. ముందు గదిలో లైట్ కూడా వేసుకోకుండా కూర్చుని ఆవిడ వెక్కివెక్కి రోదిస్తోంది. నా మనసు ఎందుకో కీడు శంకించింది.ఆవిడ భర్త పోయినప్పుడు కూడా ఎంతో హుందాగా వ్యవహరించింది. అలాంటావిడ ఇలా ఏడ్వడం నాకు బాగా దుఃఖాన్ని కలిగించింది. ‘‘ఏమైంది ఆంటీ..?’’ నోరు పెగుల్చుకుని అడిగాను.ఆవిడ మౌనంగా ఓ ఎయిర్‌మెయిల్ ఉత్తరం నా చేతిలో పెట్టింది. లైట్ ఆన్ చేసి చదవడం ప్రారంభించాను. అది రఘు నుంచి.నేరుగా ఆవిడకి రాయలేదు. రంగనాథంగారికి రాశాడు.‘‘డియర్ అంకుల్బాగున్నారా? మీరంతా బాగున్నారని ఆశిస్తాను.నాకిక్కడ జీవితం ఆనందంగా గడిచిపోతోంది. అనేకమంది పరిచయమయ్యారు. రోజులు బాగా వేగంగా నడిచిపోతున్నాయి. నేను జీవితంలో ఏం కోల్పోయానో నాకు క్రమంగా అర్థమవుతోంది. నేను కోల్పోయినదంతా తిరిగి పొందే ప్రయత్నం చేస్తున్నాను.నేనేం కోల్పోయానో తెలుసా అంకుల్? జీవితం కోల్పోయాను. అవునంకుల్ నేను బాల్యం కోల్పోయాను. స్కూల్‌డేస్ తాలూకు ఆనందం కోల్పోయాను. కాలేజ్ డేస్ తాలూకు వేగం కోల్పోయాను. బాల్యం అంటే నాకు గుర్తొచ్చే ఒకే ఒక జ్ఞాపకం పుస్తకాలు, పరీక్షలు. స్కూల్ అంటే నాకు గుర్తొచ్చే ఒకే ఒక జ్ఞాపకం పోటీ, ర్యాంకులు, పరుగులు. కాలేజీ లైఫ్ మరీ ఘోరం అంకుల్. ఒక బందిఖానా నయం దానికంటే. పేపర్లలో ప్రకటనల కోసం మమ్మల్ని సమిధలుగా వాడుకున్నారు ఆ జూనియర్ కాలేజీ వాళ్లు. వాళ్ల దృష్టిలో మేం ర్యాంకులు తెచ్చిపెట్టే యంత్రాలం. మాకంటూ కొన్ని మనోభావాలుంటాయని అవి దెబ్బతింటాయని ఏనాడూ ఆలోచించలేదు వారు. హైదరాబాద్ అంటే కోచింగ్ సెంటర్లు గుర్తు వస్తాయి కాని ఎంజాయ్ చేసిన క్షణాలు బుర్ర బద్దలు కొట్టుకున్నా గుర్తురావడం లేదు. ఇక ఐఐటీలో అయితే ఊపిరి తీసుకోవడానికి కాదు కదా, చావడానికి కూడా మాకు టైమ్ ఉండేది కాదు. అలసి సొలసి ఇంటికి వచ్చిన నన్ను ఏనాడూ మా అమ్మ నన్ను ఒక మనసున్న మనిషిగా ట్రీట్ చేయలేదు. ఎంతసేపూ నాకెన్ని మార్కులు వచ్చాయని అడగడం, మంచి మార్కులు వచ్చాయనగానే స్వీట్స్ చేసి పెట్టడం, ఎప్పుడైనా ఒకటీ అరా తక్కువ వచ్చిన సందర్భాల్లో తాను డల్‌గా మారిపోవడం... ఇంతేనా జీవితమంటే అని అనిపించేది. నేను కంటి ముందు కనిపిస్తే చాలు ‘బాగా చదువుకో, అమెరికాలో ఉద్యోగం తెచ్చుకో’ ఈ రెండు మాటలే తప్ప మూడోమాట ఆవిడ నోట్లోంచి వచ్చేది కాదు. ఎక్కడో నాకూ మా అమ్మకీ మధ్యన ఉండాల్సిన సున్నితమైన ఏదో బంధం తెగిపోయినట్లనిపిస్తుంది నాకు. ర్యాంకులు, మార్కులు, పరీక్షలులాంటి టాపిక్స్ తప్ప మా మధ్య మాట్లాడుకోవడానికి ఏ టాపిక్స్ ఉండేవి కావు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత పరిస్థితి మరీ ఘోరం అయ్యిందని చెప్పవచ్చు.నాకెరీర్ని మా అమ్మ ఒక జీవన్మరణ సమస్యగా తీసుకున్నట్లనిపించేది నాకు.సినిమాల్లో చూపించినట్లు ఇంటి వాతావరణం అందంగా ఉండదని నాకు తెలిసిన క్షణం నుంచి నాలో ఒకవిధమైన విరక్తి కలిగింది.అలా అన్చెప్పి నాకు మా అమ్మపై ప్రేమ లేదని కాదు. ఆవిడ బాధపడితే నేను చూడలేను. ఆవిడ ఆనందంగా ఉండాలి. ఆవిడ ఆనందానికి మూలకారణం నా మార్కులే. నా విజయాలే అనే ధోరణి నాకు విపరీతమైన చిరాకు కలిగించేది.సెలవులకు రాకూడదా అని మీరు నాకు పదే పదే ఫోన్ చేయకండి. వీలైతే నేనే వస్తాను. తరచూ వచ్చి అక్కడ గడపడం నా వల్ల కాదు. నా ఇబ్బంది అక్కడికి రావడం కాదు. వచ్చాక ఒక విధమైన నిశ్శబ్ద వాతావరణం ఉంటుంది ఇంట్లో. నాకక్కడ అసలేం తోచదు. నాకు మా అమ్మకి మధ్య ఓవిధమైన నిశ్శబ్దం. ఏం మాట్లాడాలో తనకీ తోచదు, నాకూ తోచదు.ఇంతదూరం వచ్చి నా టైమ్ వేస్ట్ చేసుకుని వృథాగా గడిపి వెళ్లిన భావన కలుగుతుంది. దయచేసి నన్ను రమ్మని పిలవకండి. నేనే వీలు చూసుకుని తప్పకుండా ఒకసారి వచ్చి వెళతాను. అమెరికా రమ్మంటే తను రాదు. ఎన్నోసార్లు అడిగి విసిగిపోయాను. తనకు ఎంత డబ్బు కావాలన్నా పంపిస్తాను. తనని ఆనందంగా ఉండమని చెప్పండి. మీరంతా ఆవిడకి తోడు ఉన్నారన్న భరోసాతో నేనిక్కడ నింపాదిగా ఉండగలుగుతున్నాను. అమ్మని బాగా చూసుకోండి.మీ రఘు.ఆవిడ అక్షరాలని కూడబలుక్కుని చదివి ఉంటుంది ఆ ఉత్తరం.‘‘ఈ కాలనీ వారంతా మీ పిల్లల్లాంటి వారు కాదా ఆంటీ’’ అని చెప్పి ఓదార్చి వచ్చాను. కాని ఆవిడ దుఃఖాన్ని ఆపడం నా వల్ల కాలేదు. నన్ను ఎక్కువసేపు ఉండనివ్వలేదావిడ వారింట్లో. సున్నితంగా నన్ను వెళ్లిపొమ్మని సైగ చేసింది. నేను వచ్చేశాను.ఆ తర్వాత ఆమెలో కొత్త మనిషిని చూశాను. ఇదివరకటి కన్నా ఉత్సాహంగా ప్రవర్తించడం ప్రారంభించింది. ఈ సంఘటన తర్వాత ఆవిడ ఎప్పుడూ రఘు గురించి మేమడిగినా ప్రస్తావించేది కాదు.ఆవిడలో ఒక స్థిరత్వాన్ని గమనించాను ఈ విషయంలో.మృత్యువు ముందు ఎవరైనా తలవంచాల్సిందే. ఎటువంటి అనారోగ్య సమస్యలూ లేకుండా, చివరి నిమిషం వరకు నవ్వుతూ నవ్విస్తూ అందరికీ తలలో నాలుకలా ఉంటూ హాయిగా గడిపేసింది ఆమె తన చివరి రోజులు.తానెన్నుకున్న మార్గం విషయంలో ఆమె ఎన్నడూ రాజీ పడలేదు.దుఃఖమే ఆమె ముందు దుఃఖించింది. అలసటే ఆమె ముందు అలసిపోయింది. ఓటమే ఆమె ముందు ఓడిపోయింది. ఆ విధంగా సరోజ ఆంటీ జీవితం ముగిసిపోయింది.మూడు నెలల తర్వాత ఒక ఆదివారం రంగనాథం గారి నుంచి పిలుపు వస్తే వెళ్లాను వారింటికి.మా కాలనీలో వేసవికాలాల సాయంత్రాలు నాకు చాలా ఇష్టం. ప్రతి ఇంట్లో చిన్న చిన్న తోటలు ఉంటాయేమో, సాంత్వన కలిగిస్తూ పిల్లగాలులు, మామిడాకు వాసనలు, మల్లెల పరిమళాలు. ఒకవిధమైన ఆహ్లాదం ఉంటుంది వీధుల్లో తిరుగుతుంటే గేటు తీసుకుని లోనికి వెళ్లాను.రంగనాథంగారి కంఠం నాకు పరిచయమే. లోపల్నుంచి ఏదో అపరిచిత కంఠం కూడా వినిపిస్తోంది. హాల్లోకి ప్రవేశించాను. రంగనాథం ఎదురుగా కూర్చున్నది ఎవరో కాదు. సరోజ ఆంటీ వాళ్లబ్బాయి రఘు. మంచి రంగు తేలాడు. బాగా ఒళ్లు చేశాడు. ‘‘హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు?’ నన్ను చూసి కుశల ప్రశ్నలు వేశాడు. నేను చిరునవ్వుతో తలపంకించాను. ‘‘ఎందుకంకుల్ ఎంత ఖరీదైనా నేనే కొంటాను ఇంటిని వేరే ఎవరికీ అమ్మవద్దని అంతలా ఒత్తిడి చేస్తున్నాడు ఆ శ్రీరామ్. ఇంతకీ ఎవరంకుల్ ఆయన’’రఘు ప్రశ్నిస్తున్నాడు రంగనాథం అంకుల్ని.రఘు అమెరికా నుంచి ఆన్లైన్లో తమ ఇంటిని వేలానికి పెట్టాడని ఇటీవలే తెలిసింది. ఆ విషయంగా బేరం ఫైనల్ చేసుకోవడానికి వచ్చాడట.‘‘శ్రీరామ్ ఎవరో తెలీదా నీకు?’’ రంగనాథం అంకుల్ ప్రశ్నించారు నెమ్మదిగా.తెలీదన్నట్టు తలూపాడు రఘు.‘‘మీ అమ్మగారి చివరి కోరిక తెలుసా?’’ రంగనాథం అంకుల్ ప్రశ్నించారు నెమ్మదిగా. మళ్లీ తెలీదన్నట్టు తలూపాడు రఘు. ‘‘మీ అమ్మగారి చివరి కోరిక తెలుసా నీకు’’ మరోసారి ప్రశ్నించారు రంగనాథం అంకుల్.రఘు తెల్లమొహం వేశాడు.నేను ఆసక్తిగా వింటుండిపోయాను. హాల్లో ఫ్యాన్ తిరుగుతోంది. ఫ్యాన్ గాలికి క్యాలెండర్ పేజీలు నెమ్మదిగా కదులుతున్నాయి. వాతావరణం చల్లగా ఉంది. కాసేపట్లో ఒక బ్రహ్మాండమైన నిజం బద్దలవుతుందని నాకా క్షణంలో తెలియదు. ఈ నిజాన్ని రంగనాథం అంకుల్ ఇన్నాళ్లూ కాపాడాడంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది.నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు రంగనాథం అంకుల్.‘‘ఆ శ్రీరామ్ ఒక అనాథ. మీ అమ్మగారి సాయంతో ఈవేళ ఒక మంచి స్థితికి చేరుకున్నాడు. మీ ఇంటి దగ్గర అనాథాశ్రమంలో ఒక విద్యార్థి వాడు. వాడికి తెలుసు మీ అమ్మగారి చివరి కోరిక. అందుకే వాడు ఆ ఇంటిని తానే కొనాలని పట్టుదలగా ఉన్నాడు. ఆశ్రమంవారు వాడిని ఇంటర్ వరకు చదివించి, ఆపై చదివించలేమని చేతులెత్తేశారు. అప్పుడు మీ అమ్మగారు పూనుకొని వాణ్ణి ఇంజనీరింగ్ చదివేలా ప్రోత్సహించింది. ఆపై ఎంబీఏ చదివించింది. వాడూ సలక్షణంగా చదువుకుని ఇప్పుడు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. వెళ్లి చూడు. వాడి ప్రతి కంపెనీ పేరూ ‘సరోజా ఇండస్ట్రీస్’ అనే ఉంటుంది. వాడు మీఅమ్మని మరువలేదు. ఆవిడ చివరి కోరికనీమరువలేదు.‘‘ఏంటంకుల్ ఆ చివరి కోరిక’’ అడిగాడు రఘు.‘‘తన తదనంతరం ఇంటిని అనాథాశ్రమంగా మార్చాలన్నది ఆవిడి కోరిక. రఘూ! నీకొక నిజం చెప్పాలి. సరోజ ఆంటీ నీ సొంత తల్లి కాదు. నువ్వొక అనాథవి. పెంటకుప్ప దగ్గర పసిగుడ్డుగా పొత్తిళ్లలో కనిపిస్తే ఆ మహాతల్లి తీసుకువచ్చి నిన్ను పెంచింది. కానీ నీకెన్నడూ ఆ భావన రాకుండా పెంచింది. నీ జీవితం ఆవిడ ఇచ్చిన దానం. ఆ మహాతల్లే కనుక చేరదీయకపోతే నువ్వు ఆ క్షణమే నేలరాలిపోయేవాడివి. నీ జీవితమంతా సుఖంగా ఉండటానికి కాలేజీ వాళ్లు నిన్న పెట్టిన కష్టమే పెద్ద కష్టమని అంటున్నావు. ఆ చదువే లేకుంటే నీ జీవితం ఏమయ్యేదో ఊహించుకో. అమ్మ ఏది చేసినా నీ మంచికే అనే జ్ఞానం నీకు లోపించడం వల్ల నీలో ఈ విపరీత ధోరణి కలుగుతోంది’’ఎంతగా దాచాలనుకుంటున్నా రఘు తన కళ్ల నుంచి ధారగా కారుతున్న కన్నీటిని దాచలేకపోతున్నాడు.‘‘సరోజ అనాథ వసతి గృహం’’ఆ ఇంటిని అమ్మకుండానే తల్లి చివరి కోరిక తీర్చాడు రఘు. ఆ ఇంట్లోనే అనాథ వసతి గృహాన్ని ఏర్పాటు చేశాడు. - రాయపెద్ది వివేకానంద్ -
పాత కొత్తకథ!
అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఒకరోజు రాజుగారు వాళ్లను పిలిచి...‘‘నా కొడకల్లారా... లేచామా? తిన్నామా? పడుకున్నామా? అని కాకుండా... ఏదైనా చేయండ్రా’’ అని అరిచాడు.‘‘ఏం చేయమంటారేంటి?’’ పెద్దకొడుకు ఆవులిస్తూ అడిగాడు.‘‘వేటకెళ్లి చావండి’’ ఆదేశించాడు రాజు తల మీద కిరీటం సవరించుకుంటూ.‘‘నువ్వు తండ్రివేనా? తండ్రి రూపంలో ఉన్న శత్రువువా?’’ గట్టిగా అరిచాడు రెండో కొడుకు.‘‘తినడానికి తప్ప... నువ్వు నోరు తెరవగా చూడడం ఇదే ఫస్ట్‌టైమ్. ఎందుకంతలా ఫీలై పోతున్నావు? వేటకెళ్లమని చెప్పడం తప్పా?’’ రెండో కొడుకుని నిలదీయబోయాడు రాజు.‘‘ఇన్ని న్యూస్‌చానల్స్ వస్తున్నాయి. ఒక్కటైనా చూసి చస్తేగా... ఎంతసేపూ వందిమాగధుల పొగడ్తలు వినడంతోనే మీకు టైమ్ సరిపోతుంది’’ విసుగ్గా అన్నాడు మూడో కొడుకు. ‘‘నేను చెప్పిందానికి, న్యూస్చానల్స్కు ఏమిటోయ్ సంబంధం?’’ అడిగాడు రాజు. ‘‘సల్మానుఖాను కృష్ణజింకల కేసు గురించి తెలిస్తే... మీ నోటి నుంచి వేట అనే మాటే రాదు. ఈ కేసు పుణ్యమా అని సల్మానుఖాను ఎప్పుడు కటకటాల వెనక్కి వెళతాడో తెలియదు. మీ చేతులకు మట్టి అంటకుండా మమ్మల్ని కటకటాల వెనక్కి తొయ్యాలనేదే కదా మీ తొక్కలో ప్లాను’’ తండ్రి కళ్లలోకి సూటిగా చూస్తూ అరిచినంత పనిచేశాడు నాల్గో కొడుకు.‘‘వేటాడడం అనేది రాజుల తరతరాల సంప్రదాయం. సాహసప్రవృత్తికి నిలువెత్తు నిదర్శనం. మీకు వేటాడే దమ్ము లేక... సాకులు వెదుకుతున్నారు. కనీసం చేపలనైనా పట్టి చావండ్రా’’ అంటూ సింహాసనంపై నుంచి లేచి అటెటో వెళ్లిపోయాడు రాజు. ‘‘తియ్యండ్రా గాలాలు... ఇయ్యండ్రా వీళ్లకు’’ సేనాధిపతి గొంతు గట్టిగా వినిపించింది.మరుసటి రోజు పొద్దుటే వాగులనాగారం చెరువుకు వెళ్లారు రాకుమారులు.చెరువులో గాలాలు వేసి గట్టుపై ఉన్న చెట్టు కింద కూర్చొని పేకాడడం మొదలు పెట్టారు.గంటలు గడుస్తున్నా గాలాలకు చేప కాదు కదా చిన్న పీత కూడా పడలేదు.రాకుమారులకు విసుగొచ్చింది.‘‘ఏహే... తొక్కలో ఫిషింగ్. వెళ్దాం పదండి’’ సోదరులకు పిలుపునిచ్చాడు పెద్ద రాకుమారుడు.‘‘ఇలా ఇరిటేట్ అయితే ఎలా సోదరా? ఇక్కడ సమస్య అనేది చేప గురించి కాదు. మన సహనం గురించి. మనకు ఎంత సహనం ఉంది అని పరీక్షించడానికే తండ్రిగారు మనకు ఈ పరీక్ష పెట్టారు. ఈ చిన్న పరీక్షలో కూడా మనం నెగ్గక పోతే ఇంకేమైనా ఉందా?’’ అని హితవు చెప్పాడు చిన్న రాకుమారుడు.ఈలోపు ‘‘అయిదు వరహాలకు కిలో చేపలు...డెడ్ చీప్.... బంపర్ ఆఫర్’’ అని గట్టుకు ఒకవైపున అరుస్తున్నాడు ఒక జాలరి.‘హమ్మయ్య.... సమయానికి తిమింగలంలా వచ్చాడు’ అని జాలరి దగ్గరికి వెళ్లి చెరో చేప కొనుగోలు చేసి అంతఃపురానికి చేరుకున్నారు రాకుమారులు. ‘‘శబ్బాష్... ఇప్పుడనిపించార్రా నా కొడుకులని’’ కొడుకుల వైపు చూస్తూ మెచ్చుకోలుగా అన్నాడు రాజు.‘‘అది సరే... ఇప్పుడు వీటిని ఏం చేయమంటారు?’’ అడిగాడు పెద్ద రాకుమారుడు.‘‘నాయనలారా.... ఈ ఏడు చేపలను ఎండకు ఎండబెట్టండి. ఎండుచేపల పులుసు తినక చాలారోజులవుతుంది’’ అన్నాడు రాజు.‘‘అలాగే తండ్రి’’ అని రాజు చెప్పిన పని చేశారు కుమారులు.ఆరు చేపలు బ్రహ్మాండంగా ఎండాయి. ఏడో చేప మాత్రం... ఎండలేదు సరికదా.... ఎవరినో ఎండగడుతుంది.‘‘ఈ ఎండలకు బండలే పగులుతున్నాయి. చేపా.... చేపా... నువ్వెందుకు ఎండలేదు?’’ అడిగాడు రాజు.‘‘నా ఇష్టం. నా గురించి అడగడానికి నువ్వెవడివి?’’ గొంతు పెద్దది చేసింది చేప.‘‘నేను రాజును’’ గంభీరం ఉట్టి పడే కంఠంతో అన్నాడు రాజు.‘‘ఏ రాజువు? అప్పల్రాజువా? సుబ్బరాజువా? భీమరాజువా? ఏ రాజువి?’’ వెటకారంగా అంది చేప.‘‘ఆ రాజులలో ఏ రాజుని కాదు... ఐయామ్ ఎ కింగ్ యూ నో’’ మీసాలు మెలేస్తూ అన్నాడు రాజు.‘‘నువ్వు కింగ్ అయితే నేను కింగ్ ఫిష్‌ని. ఆషామాషీ చేపను కాదు. లా చదువుకున్నదాన్ని. చేపల హక్కుల సంఘానికి ప్రెసిడెంటుని’’ ఒకింత గర్వంగా అంది చేప.‘‘అయితే ఏంటంటావు ఇప్పుడు? ఎండకు ఎందుకు ఎండలేదో ముందు చెప్పు?’’ కోపంగా అడిగాడు రాజు.‘‘మళ్లీ అదే చెత్త ప్రశ్న వేస్తున్నావు. ఎండకు ఎండడమా! వానకు తడవడమా! అనేది నా చాయిస్. నువ్వెవరివయ్యా ఆర్డర్ వెయ్యడానికి. ఎడారిలో ఇసుక అమ్ముకునే ముఖం నువ్వూనూ’’ గట్టిగానే తిట్టింది చేప. ‘‘ ఏ ధైర్యంతో ఇంతలా ఎగురుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు’’ అయోమయంతో కూడిన ఆవేశంతో అరిచాడు రాజు. ‘‘ఫిష్ప్రొటెక్షన్ యాక్ట్ 2018 గురించి ఎప్పుడైనా విన్నావా? ఖచ్చితంగా విని ఉండవు. ఈ యాక్ట్ ప్రకారం... చేపలను పట్టడం, వాటిని పులుసు చేసుకోవడం, ఎండలో దండానికి వేలాడదీయడం... ఇలాంటి చర్యల ద్వారా చేపల జీవించే హక్కును కాలరాయడం... డబ్ల్యూపీసి 272/384 సెక్షన్ల ప్రకారం శిక్షార్హం. దీనికిగానూ పది సంవత్సరాల జైలుశిక్ష, పదిలక్షల జరిమానా విధించబడుతుంది’’ అని హెచ్చరించింది చేప. గజగజ వణికిపోయాడు రాజు.వన్స్ అపాన్ ఎ టైమ్... పొరుగు రాజ్యం రాజు తమ రాజ్యం మీదికి దండెత్తుకు వచ్చినప్పుడు కూడా ఈ రేంజ్లో వణక లేదు.‘‘ఏం బాసూ.... ఎండకు ఎందుకు ఎండలేదో చెప్పమంటావా?’’ కవ్వింపు చర్యలకు దిగింది చేప.‘‘అక్కర్లేదమ్మా... నువ్వు ఎండితే ఏమిటి? ఎండక పోతే ఏమిటి? బుద్ధి తక్కువై ఏదో వాగాను. నన్ను క్షమించమ్మా’’ అంటూ చేపకు సారీ చెప్పాడు రాజు.ఆ తరువాత...‘‘ఎవరక్కడా’’ అని కేకేశాడు.‘‘చెప్పండయ్యా’’ అంటూ పరుగెత్తుకు వచ్చారు భటులు.‘‘ ఈ చేపమ్మను పల్లకీలో ఎక్కించుకొని, మేళతాళాలతో వాగులనాగారం చెరువులో వదిలి రండి’’ అని ఆదేశించాడు రాజు. ‘‘అలాగేనయ్యా’’ అంటూ భటులు పరుగులు తీశారు. – యాకుబ్ పాషా -
వీఆర్ఏ పదోన్నతుల్లో గందరగోళం
సాక్షి, మహబూబ్‌నగర్ న్యూటౌన్ : గ్రామ రెవెన్యూ సహాయకు(వీఆర్ఏ)లకు వీఆర్వోలకు పదోన్నతులు కల్పించిన సందర్భంగా గందరగోళం నెలకొంది. నిబంధనలకు పక్కన పెట్టి అనర్హులకు పదోన్నతులు కల్పించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరి నియామకాలే అడ్డదారిలో జరిగాయనే ఆరోపణలు ఉండగా.. అలాంటి వారికి ఇప్పుడు పదోన్నతుల్లో అవకాశం కల్పించడంతో పాటు అర్హులకు అన్యాయం జరిగిందనే విమర్శలు వచ్చాయి. దీంతో ఏళ్ల తరబడి పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర విచారణ తర్వాతే పదోన్నతులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మొదటి నుంచి చెబుతున్నా.. ఎంతో కాలంగా సీనియారిటీ జాబితా, పదోన్నతుల జాబితాలను తయారు చేస్తుండగా పలు తప్పులు దొర్లాయని సంఘాలు ఎత్తి చూపుతూనే ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. చివరకు బుధవారం 81 మంది వీఆర్ఏలకు పదోన్నతులు కల్పిస్తూ రూపొందించిన ఫైల్‌ను కలెక్టర్ ఆమోదించగా.. అందులో చాలా మంది అనర్హులు ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. పదోన్నతుల జాబితాలో 16 మంది బ్యాన్ పీరియడ్‌లో ఎంపికైన వారు ఉన్నారని వీఆర్ఎ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పదోన్నతుల సందర్భంగా కలెక్టర్‌ను సైతం కొందరు అధికారులు తప్పుదోవ పట్టించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పదోన్నతుల జాబితాలో పేర్లు ఉన్న వీఆర్ఏల ఎంపిక, అర్హతలు, ఎంపికైన విధానంలో ఏ మాత్రం స్పష్టత లేదని చెబుతున్నారు. చక్రం తిప్పిన రిటైర్ట్ ఉద్యోగి వీఆర్ఏల పదోన్నతుల్లో కలెక్టరేట్లో సంబంధిత విభాగంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిపై పని చేస్తున్న ఓ రిటైర్డు ఉద్యోగి చక్రం తిప్పినట్లు తెలిసింది. జాబితా రూపకల్పనలో అక్రమాలకు పాల్పడటమే కాకుండా అధికారులను తప్పుదోవ పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయనతో పాటు కలెక్టరేట్లో కీలక అధికారికి నమ్మిన వ్యక్తులుగా ఉన్న మరో ఇద్దరు.. పైరవీకారులకు కొమ్ము కాసి కలెక్టరేట్ ప్రతిష్టను దిగజార్చారని వీఆర్ఏ సంఘాల నాయకులు ఆరోపించారు. అప్పట్లో కావలికారులు పూర్వ కాలం నుండి గ్రామాల్లో కావలి కారులుగా చెప్పుకునే వీరు అప్పట్లో గ్రామాల్లో పట్టాదారుతో పాటు పాలేరులంతా వంతుల వారీగా విధులు నిర్వహించేవారు. రాను రాను పట్టాదారు చనిపోయిన స్థానాల్లో వారసత్వంగా వారి కుమారులు, కుమార్తెలు, భార్యకు కావలికారు ఉద్యోగం ఇచ్చేవారు. ఇలా కాకుండా కొందరు చనిపోయిన వారి స్థానంలో అప్పటి తహసీల్దార్లను మచ్చిక చేసుకుని ఇతరులను సైతం నియమించారు. కొందరి వద్ద డబ్బులు తీసుకుని పైరవీకారులు నకిలీ ఎంపిక పత్రాలు ఇవ్వడం కలకలం రేపింది. ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణకు కొద్ది కాలం క్రితం జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఆదేశించారు. బ్యాన్ పీరియడ్‌లో 96 మందికి ఉద్యోగాలు గతంలో ఉన్న కావలికారులతో పాటు జిల్లాలోని ఖాళీల ఆధారంగా 2012లో 434 మందిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ప్రభుత్వం జిల్లాలో నియమించింది. 2014లో మరోసారి 90 మంది వీఆర్ఏలను నేరుగా నియమించారు. ఫిబ్రవరి 1994 నుండి నవంబర్ 2011 వరకు ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఈ మధ్య కాలంలో ఎలాంటి నియామకాలు చేపట్టరాదని సూచించినా అప్పటి తహసీల్దార్లు పని ఒత్తిడిని సాకుగా చెబుతూ ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాల్లో 96 మంది వీఆర్ఏలను నియమించుకున్నారు. ఆ తర్వాత 2016లో అడ్‌హక్ ప్రమోషన్ పేరుతో 30 మందికి పదోన్నతులు కల్పించారు. దీంతో మిగతా వీఆర్ఏలు కూడా ఒత్తిడి తీసుకురాగా కలెక్టరేట్ అధికారులు సీసీఎల్ఏకు నివేదిక పంపారు. అలాగే, బ్యాన్ పీరియడ్‌లో నియమితులైన వీఆర్ఏలు కోర్టులకు సైతం వెళ్లారు. కలెక్టర్‌ను కలసిన వీఆర్ఏలు వీఆర్ఏ సంఘాల నాయకులు, పలువురు వీఆర్ఏలు బుధవారం జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయనకు వివరించగా ఎవరూ నష్టపోకుండా పదోన్నతులు కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు వారు వెల్లడిండారు. 81 మంది వీఆర్ఏలకు పదోన్నతి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న 81 మంది వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ చాంబర్లో పదోన్నతులు పొందిన వీఆర్ఏలకు ఉత్తర్వులు ఆయన అందజేసి విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకట్రావు, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఏఓ ప్రేమ్‌రాజ్, ఆర్డీఓ లక్ష్మీనారాయణ, మెప్మా పీడీ గోపాల్, వీఆర్ఏ సంఘాల నాయకులు గోవిందు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
గందరగోళానికి గురవుతుంటారా?
ఒక నిర్ణయం తీసుకోవటం, ఆ నిర్ణయాన్ని మార్చుకోవటం... తిరిగి ‘‘అరె మొదట అనుకున్నట్లయితేనే బాగుండేదే!’’ అని కన్ఫ్యూజ్ అవ్వటం. ఆలోచనలో పరిణతి, నమ్మకం లేకపోవటం. ఇలాంటి ప్రవర్తననే గందరగోళం అంటాం. దార్శనికత, కోరిక, సామర్థ్యం, అర్థం చేసుకోగలగటం, స్ఫూర్తి ఇవన్నీ కలిస్తేనే మీ ఆలోచనలో స్పష్టత ఏర్పడుతుంది. ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటే లక్ష్యాలను చేరటం కష్టమేమీ కాదు. చదువు, వృత్తి, సాధారణ జీవితం ఇలా ఏ కోణంలోనైనా గందరగోళానికి తావివ్వకూడదు. 1. మీ ఇష్టాలు, సామర్థ్యాలను ఒక పట్టికలో, మీ బలహీనతలను మరొక పట్టికలో రాసుకుంటారు. దీనివల్ల వేటిలో మీరు మెరుగ్గా ఉన్నారో, ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నారోనన్న విషయాన్ని గ్రహిస్తారు. ఎ. అవును బి. కాదు 2. ఒకే ర కంగా కాకుండా, వివిధ రకాలుగా ఆలోచించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. ఎ. అవును బి. కాదు 3. మీలోని క్వాలిటీస్‌ను గుర్తిస్తారు. అవకాశాలను వదులుకోరు. ఉత్సాహాన్ని ఎప్పుడూ ఒకేలా ఉంచుకుంటారు. ఎ. అవును బి. కాదు 4. ఎప్పుడూ విశ్వాసాన్ని కోల్పోరు. నిజాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు. శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉంటారు. భగవంతునిపై విశ్వాసం ఉంటే, మీ నమ్మకానికి భక్తిని జోడిస్తారు. ఎ. అవును బి. కాదు 5. గుడ్డిగా దేనినీ నమ్మరు. మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవో? కాదో? అని భయపడరు. మీపై మీకు నమ్మకం ఉంటుంది. ఎ. అవును బి. కాదు 6. ఒక సమయంలో ఒకదానిమీదే దృష్టిసారిస్తారు. దానిమీదే మీ నైపుణ్యాన్ని చూపిస్తారు. ఎ. అవును బి. కాదు 7. మీ సామర్థ్యాలను ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటుంటారు. మాటలకే పరిమితం కాకుండా మీరు చేయాల్సిన పనిని చేస్తూనే ఉంటారు. ఎ. అవును బి. కాదు 8. స్థిరత్వంతో ఉంటారు. ఏ పనికైనా సగం బలం దీని ద్వారానే లభిస్తుందని మీకు తెలుసు. నిలకడ మనస్తత్వం ద్వారానే మానసిక బలాన్ని పొందవచ్చని నమ్ముతారు. ఎ. అవును బి. కాదు 9. మీరు నేర్చుకోవాలనుకుంటున్న అంశాలను ఆయా నిపుణుల దగ్గర ప్రస్తావిస్తారు. మీ సందేహాలను పుస్తకాలు, ఇతర మార్గాల ద్వారా నివృత్తి చేసుకుంటారు. ఎ. అవును బి. కాదు 10. ఏదైనా పని చేసేటప్పుడు గందరగోళానికి గురవుతుంటే ఆ పనికి కాసేపు విరామం ఇస్తారు. ఆలోచనలు కుదుటపడ్డాక ఆ పనిని ప్రారంభిస్తారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు ఏడు దాటితే మీలో గందరగోళానికి తావుండదు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఒకసారి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ఉంటారు. ఎప్పుడూ పాజిటివ్‌గానే ఆలోచించే సామర్థ్యం మీలో ఉంటుంది. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే మీ ఆలోచనల్లో స్పష్టత ఉండదు. నిలకడలేని మనస్తత్వం వల్ల తరచుగా ఆందోళనకు గురవుతారు. ‘ఎ’ లను సూచనలుగా భావించి ఆలోచనల్లో నిలకడను ఎలా సంపాదించవచ్చో తెలుసుకోండి. -
‘టెట్’ ర్యాంకుల్లో గందరగోళం!
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్ష ర్యాంకుల్లో గందరగోళం నెలకొంది. పేపర్–1, పేపర్–2, పేపర్–3 పరీక్షల్లో మీడియంల వారీగా అత్యధిక మార్కులను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా పేపర్–3 ఇంగ్లిష్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 122 మార్కులే టాప్‌గా ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయాన్ని మంగళవారం పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. కాగా అనంతపురం నగరంలోని తేజ కోచింగ్ సెంటర్ విద్యార్థి అంకే వెంకటేష్ పేపర్–3 ఇంగ్లిష్‌లో 125 మార్కులు సాధించాడు. ప్రభుత్వం మాత్రం ఈ పరీక్షలో 122 మార్కులే అధికమని ప్రకటించిందని, తాను 125 మార్కులు సాధించానని వెంకటేష్ పేర్కొన్నారు. టెట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచీ ప్రతి అంశంలోనూ గందరగోళమేనని అభ్యర్థులు వాపోయారు. చివరకు ఫలితాలు వచ్చిన తర్వాత మార్కుల ప్రకటించడంలోనూ అదే గందరగోళం నెలకొందని అభ్యర్థులు మండిపడుతున్నారు. -
రజనీ ‘బాబా ముద్ర’.. మా లోగో ఒక్కటే
న్యూఢిల్లీ: సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘బాబా ముద్ర’ ఓ స్టార్టప్ కంపెనీకి లోగోగా ఉండటం ఆ కంపెనీకి సమస్యగా మారింది. కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని రజనీకాంత్ ఇటీవల ప్రకటించడం, పార్టీ చిహ్నంగా బాబా ముద్ర ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతుండటం తెలిసిందే. సోషల్ మీడియా యాప్ అయిన వోక్స్‌వెబ్ అనే స్టార్టప్ కంపెనీకి కూడా దాదాపుగా ఇలాంటి లోగోనే ఉంది. దీంతో వోక్స్‌వెబ్ రజనీకాంత్ పార్టీకి అనుకూలంగా ఉంటుందా అని కొందరు తమను అడుగుతున్నారనీ, రజనీతోగానీ ఆయన స్థాపించే పార్టీతోగానీ తమకు ఏ సంబంధం లేదని వోక్స్‌వెబ్ వ్యవస్థాపకుడు యశ్ మిశ్రా చెప్పారు. రజనీ వర్గంలోని సంబంధిత వర్గాలకు తాము ఓ లేఖ కూడా రాసినప్పటికీ ఇంకా తమకు వారి నుంచి ఎలాంటి సమాచారం అందలేదని మిశ్రా వెల్లడించారు. బాబా ముద్రను పార్టీ చిహ్నంగా వాడకుండా ఉండేలా, లేదా కొన్ని మార్పులు చేసుకుని వాడేలా రజనీని కోరతామని ఆయన చెప్పారు. -
సీనియారిటీ జాబితాపై రగడ!
– పీఈటీల కౌన్సెలింగ్ గందరగోళం – ఫైనల్ సీనియారిటీ జాబితా వచ్చిన తర్వాతా అభ్యంతరాలు – సరి చేయకపోవడంతో కౌన్సెలింగ్‌ను అడ్డుకున్న పీఈటీలు – వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన డీఈఓ అనంతపురం ఎడ్యుకేషన్: తొలిరోజు ప్రధానోపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరగడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులకు రెండోరోజు ఆదివారం జరిగిన పీఈటీల కౌన్సెలింగ్ షాక్ ఇచ్చింది. సీనియార్టీ జాబితాపై అధికారులు, పీఈటీల మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో చివరకు రాత్రి 8.30 గంటల సమయంలో కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు డీఈఓ లక్ష్మీనారాయణ ప్రకటించారు. బదిలీకి దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు, వారి బంధువులు ఉదయం 11 గంటల నుంచే సైన్స్ సెంటర్లో ఎదురుచూశారు. వారంతా రాత్రిదాకా పడిగాపులు కాసి ఉసూరుమంటు వెనుదిరిగారు. సీనియార్టీ జాబితాపై రగడ తుద సీనియార్టీ జాబితా ప్రకటించడంలో బాగా జాప్యం జరుగుతోంది. వాస్తవానికి కౌన్సెలింగ్‌కు ఒకరోజు ముందు ప్రకటించాల్సిన ఈ జాబితా కనీసం కౌన్సెలింగ్ ప్రారంభ సమయంలో కూడా ప్రకటించకపోవడం విశేషం. ఫలితంగా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పీఈటీలకు సంబంధించిన తుది సీనియార్టీ జాబితా మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రకటించారు. అయితే చాలావరకు తాత్కాలిక జాబితాలో వచ్చిన తప్పిదాలపై ఆధారాలతో సహా ఆన్లైన్లో కంప్లైట్ చేశారు. వాటిని సరి చేయకుండానే తుది జాబితా వెల్లడించారు. దీంతో పీఈటీలు అభ్యంతరం తెలిపారు. చివరకు సాయంత్రం 6 గంటలకు మరోసారి తుది జాబితా వచ్చింది. ఆ ప్రకారం కౌన్సెలింగ్ ప్రారంభించే సమయంలో మరోసారి గొడవ చోటు చేసుకుంది. రంగయ్య అనే టీచరుకు 32 పాయింట్లు రావాల్సి ఉండగా 45 పాయింట్లు నమోదయ్యాయి. అలాగే గంగరాజు అనే మరో టీచరుకు 33 పాయింట్లు రావాల్సి ఉండగా 36 పాయింట్లు వచ్చాయి. శివమ్మ అనే టీచర్‌కు మొత్తం 30.3843 పాయింట్లు రావాల్సి ఉండగా 31.3843 పాయింట్లు వచ్చాయి. దీంతో వరుస సంఖ్యలో వీరందరూ ముందున్నారు. వాస్తవానికి తమకు అదనంగా పాయింట్లు పడ్డాయని వాటిని తొలిగించాలంటూ రాతపూర్వకంగా ఇచ్చారు. కానీ వాటిని సరిచేయలేదు. తమకన్నా తక్కువ పాయింట్లు ఉన్న వారు ముందు వరుసలో ఉన్నారంటూ పలువురు పీఈటీలు అభ్యంతరం తెలిపారు. కౌన్సెలింగ్ అడ్డుకున్న పీఈటీలు తుదిజాబితాను అనుసరించి డీఈఓ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ప్రారంభించాలని చూడగా...పలువురు పీఈటీలు అడ్డుకున్నారు. అభ్యంతరాలను సరి చేయకుండానే ఎలా కౌన్సెలింగ్ నిర్వహిస్తారంటూ నిలదీశారు. కౌన్సెలింగ్‌ను అడ్డుకుంటే తీవ్ర చర్యలుంటాయని డీఈఓ హెచ్చరించారు. అయినా మాట వినకపోవడంతో చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. సీనియార్టీ జాబితాలో మార్పులు చేస్తేనే కౌన్సెలింగ్ నిర్వహించాలని లేదంటే వాయిదా వేయాలంటూ పట్టుబట్టారు. ఉన్నతాధికారుల దృష్టికి కౌన్సెలింగ్‌ను అడ్డుకున్న వైనంపై డీఈఓ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తుది జాబితాలో జరిగిన తప్పులను సరిదిద్దేందుకు వారు మరో అవకాశం ఇచ్చారు. దీంతో ఆన్లైన్లో అభ్యంతరాలను పంపగా...ఉన్నతాధికారులు వాటిని సరి చేశారు. దీంతో సీనియార్టీ జాబితా మరోమారు మారింది. దీంతో పీఈటీలు ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికే రాత్రి 8 గంటల దాటిపోవడంతో మహిళా టీచర్లు అభ్యంతరం తెలియజేశారు. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లిన డీఈఓ కౌన్సెలింగ్ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత ఎప్పుడు నిర్వహించేదీ ముందుగా తెలియజేస్తామన్నారు. నేడు లాంగ్వెజెస్ టీచర్లకు కౌన్సెలింగ్ సోమవారం ఇంగ్లీష్ మినహా తక్కిన లాంగ్వెజెస్ స్కూల్ అసిస్టెంట్లకు కౌన్సెలింగ్ ఉంటుందని డీఈఓ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. -
సాఫ్ట్‘వేర్’
– వైద్య, ఆరోగ్య శాఖలో బదిలీలపై గందరగోళం – ఇంకా తయారు కాని ‘సాఫ్ట్వేర్’ – ముగిసిన దరఖాస్తు గడువు – బదిలీలుంటాయో..ఉండవోనని ఉద్యోగుల్లో ఆందోళన అనంతపురం మెడికల్ : వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీల వ్యవహారం ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే దరఖాస్తు గడువు ముగిసినా బదిలీల నిర్వహణకు సంబంధించి సాఫ్ట్వేర్ కూడా తయారు కాలేదు. దీంతో అసలు బదిలీలు ఉంటాయో, ఉండవోనన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ అరుణకుమారి ఈ నెల 8న బదిలీల షెడ్యూల్ విడుదల చేశారు. దీని ప్రకారం ఈ నెల 24వ తేదీకల్లా ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. అయితే.. దరఖాస్తుపైనే ఇప్పటివరకు స్పష్టత రాలేదు. సాఫ్ట్వేర్ తయారు కాకపోవడంతో ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. బదిలీలకు అర్హులైన ఉద్యోగులు ఈ నెల 14లోగా దరఖాస్తు చేసుకోవాలని గతంలోనే ఆదేశాలందాయి. పారదర్శకత కోసం తమ దరఖాస్తులను ఆన్లైన్ ఎంప్లాయీస్ ట్రాన్ఫర్ సిస్టం (ఓఈటీఎస్)లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సాఫ్ట్వేర్ సిద్ధం కాకపోవడంతో ఉద్యోగులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ క్రమంలోనే గడువు కూడా ముగిసిపోయింది. జిల్లాలో ఎన్ని ఖాళీలున్నాయి, 20 శాతానికి మించకుండా చేపడితే ఎంత మంది బదిలీ అవుతారో ఈ సాఫ్ట్వేర్ ద్వారానే తెలిసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అసలు బదిలీల దరఖాస్తులే కాదు.. ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. దీనిపై ఎవరికీ స్పష్టత లేకపోవడంతో ఈ ఏడాది బదిలీలు ఉండవన్న ప్రచారం జరుగుతోంది. జిల్లాలో అటెండర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, జూనియర్ అసిస్టెంట్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, సీనియర్ అసిస్టెంట్లు, స్టాఫ్‌నర్సులు, హెల్త్ ఎడ్యుకేటర్లు, ఎంపీహెచ్ఈలు తదితర కేడర్లలో సుమారు 800 మంది బదిలీలకు అర్హత కల్గివున్నట్లు తెలుస్తోంది. సమయం ఇస్తారా? జిల్లాలో ఖాళీలు ఎన్ని ఉన్నాయో ఉద్యోగులకు తెలిసేలా ఆన్లైన్లో ఉంచలేదు. ఈ క్రమంలో ఖాళీల వివరాలే తెలియకపోతే ఉద్యోగులు ఏ ప్రాంతం కోరుకోవాలో స్పష్టతకు రాలేరు. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు మరోసారి సమయం ఇవ్వాలన్న యోచనలో ఉన్నతాధికారులున్నట్లు తెలుస్తోంది. గతంలోలా కాకుండా కేవలం రెండ్రోజులు మాత్రమే దరఖాస్తు గడువు ఇవ్వవచ్చన్న అభిప్రాయం ఆ శాఖ వర్గాల నుంచి విన్పిస్తోంది. క్లియర్ వేకెన్సీ లిస్ట్ అడిగారు : డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్ఓ జిల్లా వ్యాప్తంగా ‘క్లియర్ వేకెన్సీ’ వివరాలు కావాలని ఉన్నతాధికారుల నుంచి ఈ రోజే (గురువారం) ఆదేశాలు వచ్చాయి. సుమారు 15 కేడర్ల వివరాలు తీస్తున్నాం. సాఫ్ట్వేర్ అందుబాటులోకి రాకపోవడంతోనే బదిలీల ప్రక్రియ ప్రారంభం కాలేదు. రెండు, మూడ్రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. అందుకే లిస్ట్ అడుగుతున్నారనుకుంటా. -
తెలంగాణ కాంగ్రెస్‌లో తగవుల హడావిడి
-
పంతాలకు పోయి..
‘అనంత’ నగర పాలక సంస్థ సమావేశం గందరగోళం అనంత మేయర్, ఎమ్మెల్యే వర్గాల మధ్య వాగ్వాదం సమావేశం నుంచి వాకౌట్ చేసిన చౌదరి వర్గం జిల్లా కార్యాలయాలకు స్థల కేటాయింపుపై వైఎస్సార్ సీపీ అభ్యంతరం అనంతపురం న్యూసిటీ : నగర పాలక సంస్థలో ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి వర్గీయుల తీరు మారలేదు. ఎప్పటిలాగే మేయర్ స్వరూపను లక్ష్యంగా చేసుకుని సర్వసభ్య సమావేశాన్ని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతపురం మేయర్ స్వరూప అధ్యక్షతన శనివారం జరిగిన నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి వివిధ కారణాలను చూపుతూ ఎమ్మెల్యే వర్గానికి చెందిన కార్పొరేటర్లు గందరగోళాన్ని సృస్టించారు. ఆఖరుకు నల్లరిబ్బన్లు, ప్లకార్డుల ప్రదర్శన కూడా చేశారు. ప్రతి డివిజన్ కార్పొరేటర్‌కు అవకాశం కల్పిస్తామని, వారి పరిధిలో నెలకొన్న సమస్యలు వివరించాలని ఇందుకు చివరిలో అధికారులు వివరణ ఇస్తారని మేయర్ పేర్కొనడంతో డిప్యూటీ మేయర్ గంపన్న అభ్యంతరం తెలిపారు. సమస్య చెప్పిన వెంటనే సమాధానం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఆయనకు టీడీపీ కార్పొరేటర్లు సరిపూటి రమణ, విజయశ్రీ, బల్లాపల్లవి, సద్దల హేమలత, లక్ష్మిరెడ్డి మద్దతు పలికారు. ఇందుకు మేయర్ అంగీకరించకపోవడంతో సమావేశం నుంచి వాకౌట్ చేశారు. తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కోఆప్సన్ సభ్యురాలు శివబాల వాపోయారు.తన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకోవడం లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. నగర పాలక సంస్థకు చెందిన విలువైన స్థలాన్ని కలెక్టర్ కాంప్లెక్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, బీసీ భవన్, బీసీ బాలికల వసతి గృహం నిర్మించేందుకు కేటాయించడాన్ని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ బాలాంజినేయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాలను హిందూపురం నియోజకవర్గమైన రాప్తాడు ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకోవడం అవివేకమని అన్నారు. ఈ మూడు అంశాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు జానకి, గిరిజమ్మ, గూడూరు మల్లికార్జున, షుకూర్, గంగన హిమబిందు, టీడీపీ కార్పొరేటర్లు సైతం మద్దతు తెలిపారు. ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకోనున్నట్లు మేయర్ తెలిపారు. నడిమివంక వద్ద పట్టుమని పది నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితి ఉందని గంగన హిమబిందు తెలిపారు. భరించలేని కంపుతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నగరంలో పందులు, కుక్కలు స్వైర్యవిహారం చేస్తున్నాయని, చెత్త సేకరణ జరగడం లేదంటూ బోయ గిరిజమ్మ, జానకి, షుకూర్, చింతకుంట సుశీలమ్మ, పక్కీరమ్మ హెచ్చరించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి తాడిపత్రి రోడ్డు మార్గానికి రూ 25.09 కోట్ల ప్రభుత్వ నిధులు మంజూరు కావడం వెనుక ఎమ్మెల్యే కృషి ఉందన్న మేయర్ వాదనను నాల్గో డివిజన్ కార్పొరేటర్ కోగటం శ్రీదేవి త్రోసిపుచ్చారు. ఎమ్మెల్యే కృషి కాదని, ఎంపీ దివాకర్‌రెడ్డి చొరవతోనే నిధులు మంజూరయ్యాని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న భవ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటూ షుకూర్, జానకి డిమాండ్ చేశారు. కార్పొరేటర్లు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని మేయర్ స్వరూప, కమిషనర్ పీవీవీఎస్ మూర్తి పేర్కొన్నారు. అనంతరం అజెండాలోని 24 అంశాల్లో ఒకటి మినహా మిగిలిన వాటిని ఆమోదించారు. -
‘ఇంటర్నల్’ కిరికిరి!
– మీ సేవా కేంద్రాల్లో మార్కుల నమోదు అస్తవ్యస్తం – గడువు ముంచుకొస్తుండడంతో హెచ్ఎంల ఆందోళన – నగరంలోని ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినికి ఎస్ఏ–2 గణితం పరీక్షలో 62 మార్కులు వచ్చాయి. అయితే మీసేవా కేంద్రంలో ఆ విద్యార్థినికి కేవలం ఆరు మార్కులు వచ్చినట్లు ఆన్లైన్లో నమోదు చేశారు. అంటే 56 మార్కుల తేడా. మరో పాఠశాలలో ఏ–1 గ్రేడులో నిలిచే విద్యార్థినికి ఎస్ఏ–2 ఇంగ్లీష్‌లో ‘0’ మార్కులు వచ్చినట్లు ఆన్లైన్లో నమోదు చేశారు. అలాగే మరో అమ్మాయికి హిందీలో 47 మార్కులు వస్తే...ఆన్లైన్లో మాత్రం 37 మార్కులు కనిపిస్తున్నాయి. అలాగే బత్తలపల్లి మండలం నల్లబోయనపల్లి, రామాపురం, కొడవండ్లపల్లి పాఠశాలలకు సంబంధించి ఇప్పటిదాకా అప్లోడ్ చేయలేదు. ఈ ఘటనలు చాలు ఇంటర్నల్ మార్కులు ఆన్లైన్ నమోదు ఎంత అస్తవ్యస్తంగా మారుతోందో తెలుసుకునేందుకు. - అనంతపురం ఎడ్యుకేషన్ పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. అయితే 20 ఇంటర్నల్ మార్కుల కేటాయింపుపై ఇప్పటికీ స్పష్టత లేదు. దీంతో ముఖ్యంగా ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆన్లైన్లో కన్ఫర్మేషన్కు ఈనెల 20తో గడువు ముగుస్తుంది. గడువు ముంచుకొస్తుండడంతో ప్రధానోపాధ్యాయులు టెన్షన్ పడుతున్నారు. అప్పటిదాకా బాగానే ఉంది... నిర్మాణాత్మక మూల్యాంకనం (ఎఫ్ఏ)–1, 2, సంగ్రహణాత్మక మూల్యాంకనం (ఎస్ఏ)–1 జవాబు పత్రాలను అన్ని యాజమాన్యాల (ప్రభుత్వ, ప్రైవేట్) పాఠశాలల ప్రధానోపాధ్యాయులే ఆన్లైన్లో నమోదు చేశారు. ఇక్కడిదాకా బాగానే ఉంది. అయితే పని ఒత్తిడి, ఇతరత్రా పనుల నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎం సంఘాలు ఇందుకోసం ప్రత్యేకంగా కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మార్కుల నమోదును మీసేవా కేంద్రాలకు అప్పగించింది. ఒక్కో విద్యార్థికి రూ.3 చెల్లించేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలో ఎఫ్ఏ–3,4, ఎస్ఏ–1 జవాబు పత్రాలను నేరుగా ఆయా మీసేవా కేంద్రాల్లో అప్పగించారు. వారు ఇష్టానుసారంగా నమోదు చేశారు. మరి కొందరి విద్యార్థుల మార్కులను నేటికీ నమోదు చేయలేదు. ఒక్క విద్యార్థికీ కన్ఫర్మేషన్ ఇవ్వలేని దుస్థితి మార్కుల వివరాలను మీసేవా కేంద్రాల నిర్వాహకులు ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత ఆయా స్కూళ్ల హెచ్ఎంలు వారి యూడైస్ కోడ్ ఆధారంగా ఆన్లైన్లో ఓపెన్ చేసుకుని వారు కన్ఫర్మేషన్ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటిదాకా జిల్లాలో మీసేవా వారు ఆన్లైన్లో పొందుపరిచిన విద్యార్థులకు సంబంధించి ఒక్క విద్యార్థికీ కన్ఫర్మేషన్ చేయలేని పరిస్థితి. దీంతో హెచ్ఎంలు కన్ఫర్మేషన్ చేయకపోవడంతో కుప్పలు తెప్పలుగా పెండింగ్ పడ్డాయి. అయితే ప్రైవేట్ పాఠశాలలకు ఆన్లైన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. వారే స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం ఇవ్వడంతో దాదాపు అన్ని పాఠశాలల్లోనూ ముగింపు దశకు చేరుకుంది. ఎటొచ్చి ప్రభుత్వ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఎట్టకేలకు ఎడిట్ ఆప్షన్ ఇదిలా ఉండగా ఆన్లైన్లో తప్పుల తడకగా నమోదైన వాటిని సరిదిద్దుకునేందుకు హెచ్ఎంలకు అవకాశం ఇచ్చారు. ఎడిట్ ఆప్షన్ ఇవ్వడంతో వారి వారి విద్యార్థుల మార్కుల జాబితాలను దగ్గర పెట్టుకుని సరిదిద్దుతూ కన్ఫర్మేషన్ చేసే పనిలో హెచ్ఎంలు ఉన్నారు. అయితే ప్రభుత్వం విధించిన గడువు (ఈనెల 20)లోగా అందరి పిల్లల వివరాలు నమోదు చేయడం సాధ్యం కాదని హెచ్ఎంలు స్పష్టం చేస్తున్నారు. -
వైద్య ఆరోగ్యశాఖలో విచిత్రం
– మూడు నోటిఫికేషన్లకు మెరిట్ లిస్ట్ విడుదల – నోటీస్ బోర్డుల్లో ఉంచని అధికారులు అనంతపురం మెడికల్ : తాంబూలాలిచ్చేశాం.. తన్నుకు చావండి.. అన్నట్లుంది వైద్య ఆరోగ్యశాఖ అధికారుల తీరు. ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఇచ్చి కొన్ని నెలలైంది. స్క్రూటినీ, ప్రొవిజినల్ లిస్ట్ తయారు చేయడానికి మరికొన్ని నెలలు పట్టింది. తీరా వాటిని విడుదల చేసే క్రమంలో నిబంధనలు ఉల్లంఘించారు. జాబితాలను కేవలం వెబ్‌సైట్‌కే పరిమితం చేసి ‘మీ కష్టం మీరే పడండి’ అన్న ధోరణి అవలంభిస్తున్నారు. జాబితాలను నోటీస్ బోర్డుల్లో ఉంచాల్సి ఉన్నా పట్టించుకోకుండా.. అభ్యంతరాల స్వీకరణకు ఎక్కువ సమయం ఇవ్వకుండా ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో మూడు నోటిఫికేషన్లకు సంబంధించి మెరిట్ జాబితాలు విడుదలైనట్లు శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈనెల 20 నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అయితే వీటిని కేవలం వెబ్‌సైట్‌కే పరిమితం చేసి ప్రదర్శనకు ఉంచకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. రాష్ట్రీయ బాలస్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే)లో భాగంగా మొబైల్ హెల్త్ టీంలో మెడికల్ ఆఫీసర్లు, ఆయుష్ వైద్యులు, ఎంపీహెచ్ఏ (ఫిమేల్), ఫార్మసిస్ట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఫైనల్ జనరల్ మెరిట్ లిస్ట్, ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్‌ను విడుదల చేశారు. అనంతపురం, హిందూపురం, కదిరి ఆస్పత్రుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ కౌన్సిలర్లతో పాటు ఆర్బీఎస్కే కింద డీఈఐసీ (డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్)లో మెడికల్ ఆఫీసర్, మేనేజర్, డెంటిస్ట్ ఫిజియోథెరపిస్ట్, ఆడియో అండ్ స్పీచ్ థెరపిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, ఆప్టోమెట్రిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్‌నర్స్, అర్లీ ఇంటర్వెన్షనిస్ట్ అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రొవిజినల్ జనరల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు తగిన ఆధారాలతో అభ్యంతరాలు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. కాగా మెరిట్ జాబితాలు అప్లోడ్ చేయడానికి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కలెక్టరేట్లోని ఎన్ఐసీకి శనివారం సాయంత్రం వెళ్లారు. జాబితాలు ఎక్కువగా ఉండటంతో అప్లోడ్ ఆలస్యం అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. -
కొందరికి ఓకే.. మరికొందరికి నాట్ ఓకే
ఎకరాకు రూ.28 పరిహారం ఇప్పించేందుకు పెందుర్తి హామీ మెత్తబడిన కొందరు రైతులు ఒప్పంద పత్రాలపై సంతకాలు ఎమ్మెల్యే పెందుర్తి సమక్షంలోనే అగ్రిమెంట్లు భూములిచ్చేది లేదంటున్న చినకొండేపూడి రైతులు పురుషోత్తపట్నం ఎత్తిపోతల భూసేకరణ వ్యవహారం సీతానగరం (రాజానగరం) : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు అంగీకార పత్రాలపై సంతకాలు చేస్తుండగా, మరికొందరు సందిగ్ధంలో ఉన్నారు. ప్రధానంగా చినకొండేపూడి రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. మరోపక్క భూసేకరణ బాధ్యతను అధికార పార్టీకి చెందిన రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తన భుజాలపై వేసుకున్నారు. స్వయంగా ఆయన దగ్గర ఉండి రైతులతో ఒప్పందాలు చేయిస్తున్నారు. మంగళవారం రాత్రి ఆయన పురుషోత్తపట్నం రైతులతో సమావేశమయ్యారు. ప్రభుత్వాన్ని ఒప్పించి, ఎకరానికి రూ.28 లక్షల చొప్పున పరిహారంగా ఇప్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో చాలామంది రైతులు మెత్తబడ్డారు. అయితే ఆ రేటుకు కూడా తమ భూములు ఇవ్వడానికి చినకొండేపూడి రైతులు అంగీకరించడం లేదు. ఎమ్మెల్యే వెంకటేశ్ బుధవారం మధ్యాహ్నం పురుషోత్తపట్నం వచ్చి రాత్రి వరకూ ఉన్నారు. ఆయన సమక్షంలో తహసీల్దార్ చంద్రశేఖరరావు, వీఆర్వోలు రవీంద్ర, వసంత, అఖిల్, మురళీకృష్ణలు భూములు ఇచ్చేలా రైతులతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించారు. పురుషోత్తపట్నం, రామచంద్రపురం రెవెన్యూ గ్రామాల్లో భూములు సేకరించాల్సిన రైతులు 150 మంది ఉండగా, సాయంత్రం 6.30 గంటలకు వారిలో 50 మంది సంతకాలు చేశారు. అలాగే వంగలపూడి రెవెన్యూ గ్రామంలో 4.73 ఎకరాలకు హక్కుదారులైన ఐదుగురు రైతులతో కూడా సంతకాలు చేయించినట్టు సమాచారం. చినకొండేపూడికి చెందిన ఇద్దరు రైతులు కూడా సంతకాలు చేశారు. వారిలో కొందరు రైతులు తమ భూములను కేవలం లీజ్‌కు ఇచ్చేలా మాత్రమే సంతకాలు చేశారు. నేడు రైతుల నిరసన పరిహారం ఎక్కువా, తక్కుగా అనే దానితో సంబంధం లేకుండా, పురుషోత్త పథకం ఎత్తిపోతల పథకానికి భూమలు ఇవ్వడానికి చినకొండేపూడి రైతులు వ్యతిరేకిస్తున్నారు. అంతేగాకుండా ఈ గ్రామ రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వారు పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం వారు నిరసన తెలిపి, వినతిపత్రం అందించారు. -
కొత్త జిల్లాలతో జనాల తికమక
-
పదోన్నతుల్లో పదనిసలు
♦ నిబంధనలకు విరుద్ధంగా సీనియార్టీ జాబితా ♦ ఉపాధ్యాయ సంఘాల నిరసన ♦ కౌన్సెలింగ్‌లో డీఈఓతో వాగ్వాదం ♦ సోషల్, తెలుగు, హెచ్ఎం పోస్టుల భర్తీ అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హులైన వివిధ కేటగిరీ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేందుకు శుక్రవారం రాత్రి డీఈఓ కార్యాలయంలో డీఈఓ అంజయ్య అధ్యక్షతన నిర్వహించిన కౌన్సెలింగ్‌లో గొడవ జరిగింది. ఉపాధ్యా సంఘాలు, డీఈఓ మధ్య వివాదం నెలకొంది. ఈ నెల 17న సీనియార్టీ జాబితాను అధికారికంగా ప్రకటించారు. కౌన్సెలింగ్ ప్రారంభమయ్యే సమయంలో కొందరిని సీనియార్టీ జాబితాలోకి చేర్చారు. సోషల్ సబ్జెక్టుకు సంబంధించి ఏకంగా ఏడుగురిని అప్పటికప్పుడు సీనియార్టీ జాబితాలో చేర్చారు. నిబంధనల ప్రకారం సీనియార్టీ జాబితా వెల్లడించిన రోజు తర్వాత వచ్చే వాటిని పరిగణనలోకి తీసుకోకూడదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. అయినా వారిని చేర్చడం వెనుక ఆంతర్యమేమిటో విద్యాశాఖ అధికారులకే తెలియాలి. 1983 నుంచి 1994 డీఎస్సీల వరకు 157 మంది పదోన్నతులు తీసుకోలేదని గుర్తించారు. వీరందరికీ నోటీసులు కూడా ఇచ్చారు. వీరిలో కొందర్ని మాత్రమే సీనియార్టీ జాబితాలో చేర్చి తక్కిన వారిని చేర్చకపోవడాన్ని ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం, ఆప్టా, ఎస్‌ఎల్‌టీఏ సంఘాల నాయకులు తప్పుబట్టారు. దీనిపై డీఈఓతో వాగ్వాదానికి దిగారు. చివరకు వారు కౌన్సెలింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి వెల్లిపోయారు. రెండుసార్లకు పైగా పదోన్నతులు తిరస్కరించిన ఐదుగురు టీచర్లు గతంలో కోర్టుకు వెళ్లగా అప్పటి డీఈఓ మధుసూదన్‌రావు 154 జీఓ ప్రకారం వారు పదోన్నతులకు అనర్హులని కోర్టులో కౌంటరు దాఖలు చేశారు. ఇదే తరహాలో ఉన్న కొన్ని కేసులు ప్రస్తుత కౌన్సెలింగ్‌తో పరిగణపలోకి ఎలా తీసుకుంటారని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రధానోపాధ్యాయులు (జిల్లా పరిషత్) 6, ఎస్ఏ సోషల్ 9, తెలుగు 3, హిందీ 2, పీడీ 2 పోస్టులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మొత్తం మీద సోషల్ 23, హెచ్ఎం 3, తెలుగు 3, పీడీ 2, ఫిజికల్సైన్స్ పోస్టును భర్తీ చేశారు. -
యూనిఫాంపై అయోమయం !
అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాం పంపిణీపై అయోమయం నెలకొంది. క్లాత్ ఇస్తారా.. కుట్టించి ఇస్తారా అనే విషయంలో సందిగ్ధం నెలకొంది. ప్రతిసారి స్కూళ్లకు క్లాత్ పంపిణీ చేసి అక్కడి నుంచి దర్జీల ద్వారా కుట్టించేవారు. అయితే ఈసారి అప్కో వారే కుట్టు బాధ్యతను తీసుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. రాష్ట్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని ఈ కారణంగానే క్లాత్ సరఫరా పెండింగ్ పడుతూ వస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభమై మూన్నెళ్లు గడిచినా ఇప్పటిదాకా అతీగతీ లేదు. విద్యార్థులకు అవసరమైన యూనిఫాం క్లాత్ కొనుగోలుకు పాఠశాలల వారీగా ఎస్ఎస్ఏ అధికారులు ఇండెంట్ తెప్పించుకుని ప్రభుత్వానికి నివేదిక పంపారు. జిల్లాలోని విద్యార్థుల క్లాత్ కొనుగోలుకు రూ.8,77,45,920 నిధులు అవసరం. ఇందులో రూ. 4,38,72,960 నేరుగా ఎస్పీడీ అధికారులే అప్కోకు అడ్వాన్స్‌గా చెల్లించారు. గతేడాది పంపిణీ చేసిన రంగు దుస్తులే ఈసారీ పంపిణీ చేయాలని ఎస్పీడీ కార్యాలయం నుంచి జిల్లాకు ఉత్తర్వులు అందాయి. రంగు వరకు స్పష్టత ఇచ్చారని అయితే క్లాత్ సరఫరా చేస్తారో, కుట్టించిన దుస్తులు సరఫరా చేస్తారా అనే విషయంలో ఎలాంటి సమాచారం లేదని అటు ఎస్ఎస్ఏ అధికారులు, ఇటు అప్కో అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై ఎస్ఎస్ఏ పీఓ దశరథరామయ్యను సాక్షి వివరణ కోరగా రాష్ట్ర కార్యాలయం నుంచి మాకు ఇప్పటి దాకా తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. క్లాత్ సరఫరా కోసం ఇండెంట్ పంపామని మూడు రోజుల క్రితం రాష్ట్ర అధికారులు కూడా ఆరా తీశారన్నారు. -
ఇదేం గోలయ్యా బాబూ...??
అనంత, చిత్తూరు జిల్లాలకు సాగునీటి సరఫరాకు హడావుడి 600 పైగా వాటర్ ట్యాంకర్లు కావాలంటూ రవాణా శాఖపై ఒత్తిడి గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి 200 ట్యాంకర్లు ఏర్పాటు తలలు పట్టుకుంటోన్న రవాణా శాఖ అధికారులు సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాష్ట్రంలోని రవాణా శాఖ అధికారులు వాటర్ ట్యాంకర్ల వేటలో పడ్డారు. ట్యాంకర్లు ఎక్కడ కనిపించినా వదిలి పెట్టడం లేదు. వాటిని అనంతపురం, చిత్తూరు జిల్లాలకు పంపుతున్నారు. మూడ్రోజుల పాటు సాగునీటి సరఫరా కోసం పురమాయిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా నుంచి 200, నెల్లూరు జిల్లా నుంచి 50 ట్యాంకర్లు అనంత, చిత్తూరు జిల్లాల బాట పట్టాయి. మొత్తం 600 ట్యాంకర్లు అవసరమని ఆదేశాలు జారీ చేసిన ఉన్నతాధికారులకు సమాధానం చెప్పలేక కోస్తా జిల్లాల్లోని ఆర్టీవోలు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఖరీఫ్ సీజనులో అనంతపురం,చిత్తూరు జిల్లాల రైతులు అధిక విస్తీర్ణంలో వేరుశెనగ పంటను సాగు చేస్తున్నారు. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా అనంతలో 6 లక్షలు, చిత్తూరులో 1.20 లక్షల హెక్టార్ల పంట ఎండుముఖం పట్టింది. దీంతో ఈ రెండు జిల్లాల్లోని కరువు నియోజకవర్గాలకు పెద్ద మొత్తంలో రెయిన్‌గన్స్ పంపిణీ చేసిన ప్రభుత్వం వాటి ద్వారా పంటలను కాపాడతామనీ, ఒక్క ఎకరా కూడా ఎండనివ్వబోమని చెబుతోంది. రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు రోజులుగా ఈ రెండు జిల్లాల్లో పర్యటిస్తూ రైతులను పరామర్శిస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది. రెండు జిల్లాల్లోని కరువు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సాగునీరు సరఫరా చేస్తే ఆయా నీటితో వేరుశెనగ పంటను కాపాడవచ్చని సర్కారు అభిప్రాయపడుతోంది. ఇందుకోసం కోస్తా జిల్లాల నుంచి వాటర్ ట్యాంకర్లు తెప్పించి నీళ్లు సరఫరా చేయించాలని సీఎం చంద్రబాబు రవాణా శాఖను ఆదేశించారు. దీంతో ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల రవాణా శాఖ అధికారులు సోమవారం నుంచి నీళ్ల ట్యాంకర్ల వేటలో పడ్డారు. పట్టణాల్లో నీళ్లు సరఫరా చేసే ప్రయివేటు ట్యాంకర్లు, స్కూళ్లు, కాలేజీలు, ఇతరత్రా సంస్థలు, పరిశ్రమలకు చెందిన వాటర్ ట్యాంకర్ల వివరాలను తెప్పించుకుని ఆయా ట్యాంకర్ల యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఒక్కో ట్యాంకర్‌కు రోజువారీ బాడుగ కింద రూ.1200 ఇవ్వడమే కాకుండా లారీలకు డీజిల్ కొట్టించే బాధ్యతను ఇరిగేషన్, ఆర్‌డబ్లు్యఎస్, మైనర్ ఇరిగేషన్, ఉద్యాన వన శాఖలకు అప్పగించారు. బుధవారం సాయంత్రానికి 600 ట్యాంకర్లను సమకూర్చాలని రవాణా శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేయడంతో వివిధ జిల్లాల్లోని ఆర్టీవోలు, ఎంవీఐలు ట్యాంకర్ల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. గురువారం నుంచి నీటి సరఫరా జరగాలన్నది ఆలోచన. అదృష్టం బాగుండి బుధవారం నుంచి రెండు జిల్లాల్లోనూ వర్షాలు పడితే రైతుల పాటు తామూ బతికిపోతామని రవాణా శాఖ అధికారులు అంటున్నారు. రెండు జిల్లాలకూ మంత్రులు ... ఇదిలా ఉండగా అనంతపురం, చిత్తూరు జిల్లాలకు ప్రభుత్వం మంత్రులను ఇన్చార్జులుగా వేసింది. వేరుశెనగ పంట ఎండకుండా సకాలంలో సాగునీటి సరఫరా జరిగేలా పర్యవేక్షించాలని సీఎం సూచించారు. దీంతో చిత్తూరు జిల్లాకు మంత్రులు పల్లె ర ఘునాథరెడ్డి, నారాయణ, బొజ్జల, శిద్ధా రాఘవరావు, కేఈ కృష్ణమూర్తిలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. -
ఇఫ్లూ అడ్మిషన్లలో అయోమయం
► పారదర్శకత లేని ప్రవేశాలు ► నిబంధనలు పాటించని యాజమాన్యం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో 2016–17వ సంవత్సరానికి ప్రవేశాల్లో జరుగుతున్న అవకతవకలు యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. యూజీసీ నిబంధనల ప్రకారం వర్సిటీలో ఎంపికైన విద్యార్థుల జాబితాను ప్రకటించినప్పుడు సీటు సంపాదించిన విద్యార్థితో పాటు 1:8 లెక్కన జనరల్ కేటగిరీలో వెయిటింగ్ లిస్ట్ ప్రకటించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలైతే రాసిన అందరు విద్యార్థుల పేర్లను సీటు సంపాదించిన విద్యార్థి జాబితాతో పాటు వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టాలి. కానీ ఇఫ్లూలో ఇంతవరకు ఏ విభాగంలోనూ వెయిటింగ్ లిస్టే పెట్టిన పాపాన పోలేదు. ఇది యూజీసీ నిబంధనలను తుంగలో తొక్కడమేనని విద్యార్థులు వాపోతున్నారు. దీనికి తోడు ఇఫ్లూలోని మరో తంతు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఓపెన్ కేటగిరీలో వచ్చిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను కూడా జనరల్ కేటగిరీలో కాకుండా రిజర్వుడు జాబితాలో పెడుతున్నారు. ఉదాహరణకు ఎంఏ స్పానిష్ కోసం దరఖాస్తు చేసిన వాడపల్లి వెంకటేశ్వరరావు (హాల్ టికెట్ నంబర్ 2060888) అనే ఎస్సీ విద్యార్థి 53 మార్కులతో జనరల్ వారికన్నా ముందున్నాడు. అయినప్పటికీ ఈ విద్యార్థికి ఓపెన్ కేటగిరీలో కాకుండా, ఎస్సీ కేటగిరీలోనే సీటు ఇచ్చారు. దీనివల్ల మరో ఎస్సీ విద్యార్థి సీటు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా వెయిటింగ్ లిస్ట్ సైతం ప్రకటించకపోవడం మరింత అయోమయానికి దారి తీస్తోంది. -
డిప్లొమా విద్యార్థుల్లో అయోమయం
సీపీ ప్రకటనతో ఆందోళన స్పష్టత ఇవ్వాలని డిమాండ్ వరంగల్ : కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న దేహదారుఢ్య పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన డిప్లొమా విద్యార్థులు అయోమయంలో పడ్డారు. అర్హత పరీక్షలు రాసి పరుగు పందెంల్లో పాల్గొన్న అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన సమయంలో డిప్లొమా చదువుకున్న వారిని అన ర్హులుగా పరిగణించడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. ఇంటర్మీడియెట్‌కు డిప్లొమా విద్యార్హత తత్సమానం కాదని పోలీసు అధికారులు తేల్చి చెబుతున్నారు. అర్హత పరీక్షల కోసం దరఖాస్తు సమయంలో పాలిటెక్నిక్ ఉత్తీర్ణత పేర్కొన్నామని, అప్పుడు పరీక్షలకు అనుమతించి ఇప్పుడు దేహదారుఢ్య పోటీలకు ఎందుకు అనుమతించడం లేదని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన అర్హత పరీక్షలకు తమకు సంబంధం లేదని పోలీసు అధికారులు అంటున్నారు. వేలాది రూపాయాలు కోచింగ్ కోసం వ్యయం చేసి దేహదారుఢ్య, క్రీడాంశాల్లో అర్హత సాధించేందుకు రోజుల తరబడి శ్రమించినా లాభం లేకుండా పోయిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయంపై అధికారుల స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
అయోమయంలో తెలంగాణ టీడీపీ!
► సవాలుగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల వలసలతో పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయిన తెలంగాణ టీడీపీకి త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సవాలుగా మారనున్నాయి. ప్రతిపక్షంగా అధికార పక్షాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ఆ పార్టీ అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలలో ఎర్రబెల్లి దయాకర్‌రావు సహా 10 మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్లో చేరడం, పార్టీ మారిన తామందరినీ టీఆర్ఎస్లో విలీనం చేయాలని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి లేఖ రాయడం వంటి పరిణామాలతో ఆ పార్టీలో ఎటూ పాలుపోని స్థితి నెలకొంది. మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలలోనూ ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పార్టీకి దూరంగా ఉంటుండటంతో టీడీపీ శిబిరం నలుగురు ఎమ్మెల్యేలకు కుంచించుకుపోయింది. స్పీకర్‌కు ఎర్రబెల్లి రాసిన లేఖ నేపథ్యంలో పార్టీ శాసనసభాపక్ష నేతగా రేవంత్‌రెడ్డిని నియమించామని, బీఏసీ సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకూ అవకాశం ఇవ్వాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పీకర్‌కు లేఖ ఇచ్చారు. ప్రస్తుతం ఈ రెండు లేఖలపై స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడం టీడీపీ నేతల్లో గుబులు రేపుతోంది. ఈ పరిస్థితుల్లో పార్టీకి మరో ప్రమాదం పొంచి ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. టీడీపీ నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారితే శాసనసభాపక్ష కార్యాలయం కూడా ఆ పార్టీకి లేకుండా పోతుందని పేర్కొంటున్నారు. అయితే ఎర్రబెల్లి ‘విలీనం’ లేఖపై స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు ఎల్పీ నేతగా రేవంత్‌కు గుర్తింపు ఇచ్చే అంశం తేలదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాగా, అసెంబ్లీ సమావేశాల తేదీలను ఇంకా అధికారికంగా ప్రకటించకున్నా ఈ నెల 10నుంచి సమావేశాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. -
కిం కర్తవ్యం!
♦ తలనొప్పిగా మారిన బౌలర్లు ♦ అయోమయంలో భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మెన్ భారీస్కోర్లు చేసినా ఒక్కటి కూడా గెలవకపోవడం కచ్చితంగా ఏ జట్టునైనా నైరాశ్యంలోకి నెడుతుంది. భారత్ కూడా దీనికి అతీతం కాదు. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాలోనే ఇంతకంటే ప్లాట్ వికెట్లపై ఎదురైన ప్రతి జట్టునూ ఆలౌట్ చేసిన భారత బౌలర్లు... ఈసారి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను ఏ మాత్రం నిలువరించలేకపోతున్నారు. టి20 ప్రపంచకప్‌తో పాటు భవిష్యత్ గురించి ఆలోచిస్తే... ఒక్క ధోనికే కాదు, భారత సెలక్టర్లకు కూడా ఈ సిరీస్‌లో బౌలర్ల ప్రదర్శన ఓ పెద్ద తలనొప్పి. సాక్షి క్రీడావిభాగం ‘మేం అదనంగా మరో 30 పరుగులు చేయడం... లేదా టాస్ గెలిచినా ఆస్ట్రేలియాకు బ్యాటింగ్ ఇచ్చి ఛేజ్ చేయడం. ఈ రెండూ మినహా నా దగ్గర ప్రత్యామ్నాయం లేదు’... వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 300 పైచిలుకు స్కోర్లు చేసి ఓడిపోయిన తర్వాత ధోని నిర్వేదం ఇది. భారత బలహీనతను గమనించిన ఆస్ట్రేలియా మూడో వన్డేలో టాస్ గెలిచినా భారత్‌కు బ్యాటింగ్ ఇచ్చి మరోసారి లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది. బౌలర్ల అనుభవలేమి తమ ఓటమికి ప్రధాన కారణంగా ధోని చెప్పుకొచ్చాడు. కానీ ఉమేశ్, ఇషాంత్ కలిసి 133 వన్డేలు ఆడారు. ఇషాంత్ ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇది నాలుగోసారి. ఇక ఉమేశ్ యాదవ్ మూడు ప్రధాన సిరీస్‌లు ఆడాడు. ఆస్ట్రేలియాలో పేసర్లకు ఎంతో కొంత సహకారం లభించే పిచ్‌లపై ఈ అనుభవం సరిపోదని అనుకోలేం. అశ్విన్ గత ఏడాది కాలంగా భారత జట్టు తరఫున అన్ని దేశాల్లోనూ నిలకడగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ సిరీస్‌లో మూడో వన్డే నాటికి అతను తుది జట్టులో స్థానమే కోల్పోయాడు. అశ్విన్ లాంటి అనుభవజ్ఞుడు ఏ పిచ్‌ల మీద అయినా రాణించాలి. గతంలో కుంబ్లే, హర్భజన్లు ఇవే పిచ్‌ల మీద వికెట్లు తీసిన విషయం మరువ కూడదు. అదే సమయంలో అశ్విన్ కూడా ఇదే ఆస్ట్రేలియాలో ఏడాది క్రితమే స్ట్రయిక్ బౌలర్‌గా వికెట్లు తీసిన సంగతీ మరువలేం. నిజానికి అనుభవలేమి కంటే... క్రమశిక్షణ లేకపోవడం భారత బౌలర్ల ప్రధాన సమస్య. షమీ లేకపోవడం లోటు ఈ సిరీస్ ఆరంభానికి ముందే భారత్‌కు షాక్ తగిలింది. గత ఏడాది ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన షమీ... అప్పటి నుంచి గాయం కారణంగా జట్టుకు అందుబాటులో లేడు. తాజాగా ఈ సిరీస్‌కు ముందు కోలుకుని జట్టులోకి వచ్చాడు. కానీ దురదృష్టవశాత్తు తొలి మ్యాచ్‌కు ముందే ప్రాక్టీస్‌లోనే గాయపడ్డాడు. ధోని చెప్పిన మాటలనే తీసుకుంటే షమీకి కూడా పెద్దగా అనుభవం లేదు. కానీ మంచి వేగంతో బంతుల్లో వైవిధ్యం చూపగల సత్తా ఉంది. ఉమేశ్ కూడా తన వేగంతో ప్రత్యర్థిని భయపెట్టాలి. కానీ లైన్ సరిగా లేక దెబ్బతిన్నాడు. కొత్త బ్యాట్స్‌మెన్ క్రీజులోకి రాగానే కాళ్ల మీదకు రెండు బంతులు వేసి రెండు బౌండరీలు ఇస్తే ఏ కెప్టెన్ కూడా ఏం చేయలేడు. ఫీల్డింగ్ సెట్ చేసిన విధానానికి అనుగుణంగా బంతులు వేయాలనే ప్రాథమిక అంశాన్ని భారత బౌలర్లు ఈ వన్డే సిరీస్‌లో మరచిపోయారు. టి20 ప్రపంచకప్‌లో పరిస్థితి? మరో రెండు నెలల్లో భారత్ స్వదేశంలో టి20 ప్రపంచకప్ ఆడబోతోంది. నిజానికి దీనిని దృష్టిలో ఉంచుకునే జట్టులో పలు మార్పులు చేశారు. యువ క్రికెటర్లను ఎంపిక చేశారు. ఇంకా ఆస్ట్రేలియాలో టి20లు ఆడకపోయినా... అందులో కూడా ఇంతకంటే భిన్నమైన ప్రదర్శనను ఆశించలేం. అయితే స్వదేశంలో భారత బౌలర్లు బాగా రాణిస్తారనేది ఒక అంచనా. అశ్విన్, జడేజా లాంటి స్పిన్నర్లు సొంతగడ్డపై కచ్చితంగా ప్రభావం చూపగలరు. కానీ స్వదేశంలో అక్టోబరులో దక్షిణాఫ్రికాతో జరిగిన టి20ల ఫలితం తలచుకుంటే ఆందోళన పెరగడం ఖాయం. రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ చిత్తుగా ఓడిపోయింది. ధర్మశాలలో 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి కూడా ఓడిపోయారు. భువనేశ్వర్, మోహిత్ శర్మ, అక్షర్, అశ్విన్... ఇలా భారత ప్రధాన బౌలర్లు, ఐపీఎల్లో చెలరేగిపోయే స్టార్స్ అంతా ఆ మ్యాచ్ ఆడారు. కానీ సఫారీలను నిలువరించలేకపోయారు. ప్రస్తుతం టి20 ఫార్మాట్లో అన్ని జట్లలోనూ భయంకరమైన హిట్టర్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత సెలక్టర్లు ఆ మెగా టోర్నీకి జట్టు ఎంపికపై భారీ కసరత్తు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పేసర్లకు సహకరించే వికెట్లపై ప్రభావం చూపలేకపోయిన సీమర్లందరి విషయంలోనూ పునరాలోచన చేయాలేమో..! భవిష్యత్ గురించి ఆలోచన స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఓడిపోవడం, తాజాగా ఆస్ట్రేలియాలో ప్రదర్శన తర్వాత కచ్చితంగా భవిష్యత్‌కు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. బరిందర్ శరణ్ లాంటి యువ బౌలర్‌కు కెరీర్లో ఆడిన తొలి వన్డేలోనే మూడు వికెట్లు రావడం ద్వారా మంచి ఆరంభం లభించింది. కానీ ఆ ఆత్మవిశ్వాసం తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో అతను చూపించలేదు. అయినా వేగంగా బంతులు వేయగల ఇలాంటి క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వడం ద్వారా భవిష్యత్‌కు ఉపయోగపడేలా తయారు చేసుకోవాలి. ఇదే సమయంలో దేశవాళీ క్రికెట్లో ఫ్లాట్ పిచ్‌లపై కూడా రాణిస్తున్న సీమర్లకు మెరుగైన అవకాశాలు ఇవ్వాలి. అంటే భారత్ ‘ఎ’ జట్టుకు వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఏర్పాటు చేసి, రాహుల్ ద్రవిడ్ లాంటి అనుభవజ్ఞుడికి వీరిని సాన బెట్టేందుకు అప్పగించాలి. ఇప్పుడే కోలుకుని భవిష్యత్ గురించి ప్రణాళికలు రచించకపోతే... మనోళ్లు కేవలం ఐపీఎల్ స్టార్స్‌గా మాత్రమే మిగిలిపోతారు. -
ఏపీలో ఇమేజ్ - తెలంగాణలో డ్యామేజ్
-
సందిగ్దంలో తమిళ అమ్మ
-
ఆంధ్రా అధికారుల పరిస్థితి అయోమయం
సాక్షిప్రతినిధి, నల్లగొండ :రాష్ట్రవిభజన తర్వాత ఇది ఒకవిధంగా సంధికాలమే. గత ప్రభుత్వంలో చేపట్టిన ఏ పథకమూ ప్రస్తుతం అమలులో లేదు. అభివృద్ధి, సంక్షేమ పథకాలేవీ అమలు చేయడం లేదు. కొత్త ప్రభుత్వం, కొత్త లక్ష్యాలతో నూతన పథకాలకు రూపకల్పన చేసే అవకాశం ఉండడంతో ఆయా ప్రభుత్వ శాఖల్లో కార్యకలాపాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దీనికి తోడు తెలంగాణేతర ప్రాంతానికి చెందిన అధికారులను సైతం ఇక్కడే ఉంచుతారా, లేక ఆంధ్రప్రదేశ్‌కు పంపుతారా అన్న విషయంలోనూ సందిగ్ధత కొనసాగుతోంది. దీంతో వారూ ఎలాంటి కార్యక్రమాల జోలికి వెళ్లడం లేదు. ‘‘జిల్లాలో దాదాపు నలబైమంది దాకా అధికారులు ఒక కాలు ఇక్కడ, మరో కాలు అక్కడ పెట్టి ఉన్నారు. వారికి ఏమీ పాలుపోవడం లేదు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అర్థం కావడం లేదు. కొత్త పాలసీలేవీ ఇంకా రూపొందలేదు. ఇదే పరిస్థితి మరో నెల రోజుల దాకా కొనసాగే పరిస్థితే కనిపిస్తోంది..’’ అని జిల్లా ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. వీరే... ఆ అధికారులు జిల్లా జాయింట్ కలెక్టర్ హరి జవహర్లాల్ మొదలుకుని డివిజనల్ స్థాయి అధికారుల వరకు, అందుబాటులో ఉన్న సమాచారం మేరకు 33మంది సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారున్నారు. ఇంకా, వీరిలో అదనపు జేసీ ఎస్.వెంక ట్రావు, డీఎంహెచ్ఓ డాక్టర్ ఆమోస్, జిల్లా కోశాధికారి నాగఫణిరాజు, జిల్లా ప్రణాళిక శాఖ డీడీ మోహన్‌రావు, డీఎస్ఓ నాగేశ్వర్రావు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ఎంఎం.వరకుమార్, హౌసింగ్ పీడీ వి.శరత్‌కుమార్, డీపీఆర్వో డి.నాగార్జున, ఐసీడీఎస్ పీడీ వి.ఉమాదేవి, పలు ఇంజినీరింగ్ విభాగంలో పలువురు అధికారులున్నారు. మున్సిపల్ కమిషనర్లతో పాటు పశుసంవర్థక శాఖలో ఏడీలు 13 మంది ఉన్నారు. వీరంతా, డివిజన్ ప్రధాన కేంద్రాల్లో పనిచేస్తున్నారు. మొత్తంగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన అధికారుల్లో అయోమయం ఉంది. ‘ ఇప్పుడంటే ... ఇప్పుడు వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడో ఆప్షన్ ఇచ్చాం. ఏ నిర్ణయమూ రాలేదు..’ అని ఓ జిల్లాస్థాయి అధికారి వ్యాఖ్యానించారు. ఇలా అన్ని కారణాలు కలిసి జిల్లాలో పాలన స్తంభించింది.