సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విద్యార్థులను ఈసారి గణితం ఎక్కువగా తికమక పెట్టింది. రసాయన శాస్త్రం నుంచి మంచి స్కోర్ చేయవచ్చని, ఫిజిక్స్‌తో మధ్యస్తంగా మార్కులు తెచ్చుకునే వీలుందని విద్యారంగ నిపుణులు తెలిపారు. ప్రశ్నల తీరును పరిశీలిస్తే 85 నుంచి 90 మార్కులు జనరల్‌కు కటాఫ్ ఉంటుందని, ఈడబ్ల్యూఎస్‌కు 68–72, ఓబీసీకి 68–75, ఎస్సీఎస్టీకి 50 మార్కులు కటాఫ్‌గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఖరగ్‌పూర్ ఐఐటీ నేతృత్వంలో ఆదివారం ఉదయం, సాయంత్రం రెండు షిప్టులు, రెండు పేపర్లుగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరిగింది.
డైరెక్ట్ ప్రశ్నలతో ఊరట
11, 12 సత్సమానమైన క్లాసుల నుంచే కెమిస్ట్రీలో ఎక్కువ ప్రశ్నలొచ్చాయి. ఎన్‌సీఈఆర్‌టీ విధానం ప్రకారం డైరెక్ట్ (ఎలాంటి మెలిక లేకుండా) ప్రశ్నలు రావడం విద్యార్థులకు ఊరట కలిగించింది. భౌతిక రసాయన శాస్త్రంలో టైట్రేషన్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, థర్మోడైనమిక్ ప్రశ్నలు, ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి జంతువులు, బయోమాలిక్యులస్, ఆక్సిజన్ కంటెయినింగ్ కాంపౌండ్స్ నుంచి ప్రశ్నలొచ్చాయి.
భౌతికశాస్త్రంలో 11వ తరగతికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి. ఎలక్ట్రిసిటీ, ఆప్టిక్స్, రొటేషన్ అండ్ మోడ్రన్ ఫిజిక్స్ నుంచి మధ్యస్తంగా ప్రశ్నలున్నాయి. మ్యాథమెటిక్స్ విద్యార్థులకు తలనొప్పి తెప్పించిందని గణిత శాస్త్ర అధ్యాపకులు విశ్లేషిస్తున్నారు. కొన్ని తేలికైన ప్రశ్నలే ఇచ్చినా, మేట్రిసిస్, డిటర్మినెంట్స్, ఫంక్షన్స్, కంటిన్యుటీ అండ్ డిఫరెన్‌ష్యబులిటీ, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్‌తో పాటు పలు చాప్టర్ల నుంచి ప్రశ్నలిచ్చారు. కొన్ని చాప్టర్ల నుంచి ఇచ్చిన ప్రశ్నలు గందరగోళపరిచేలా ఉన్నాయని విద్యా రంగ నిపుణులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment