JEE advanced exam
-
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
సాక్షి, అమరావతి: ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్–2023 ఆదివారం (నేడు) జరగనుంది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.9 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఐఐటీ గౌహతి నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఇప్పటికే అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్ల కింద పేపర్–1, పేపర్–2 పరీక్షలు జరుగుతాయి. కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్షలో అభ్యర్థులు రెండు పేపర్లను రాయాల్సి ఉంటుంది. ఉదయం సెషన్ ఉ.9 నుంచి మ.12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ పరీక్ష మ.2.30 నుంచి 5.30 వరకు జరుగుతుంది. ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు.. 2021లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 1.6 లక్షల మంది, 2022లో 1.7 లక్షల మంది రిజిస్టర్ కాగా.. ఈసారి మరో 20వేల మందికి పైగా అభ్యర్థుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా మహిళా అభ్యర్థుల సంఖ్య 25 శాతం వరకు పెరిగినట్లు ఐఐటీ గౌహతి విడుదల చేసిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. అత్యధికంగా ఏపీ, తెలంగాణల నుంచి అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ రెండు రాష్ట్రాల నుంచే దాదాపు 50వేల మంది వరకు అభ్యర్థులు ఉండనున్నారు. హైదరాబాద్, విజయవాడ కేంద్రాలుగా అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. జేఈఈ మెయిన్‌కు గతంలో కన్నా ఈసారి అభ్యర్థుల సంఖ్య పెరగడంతో అదే స్థాయిలో అడ్వాన్స్‌డ్‌కు కూడా అభ్యర్థుల సంఖ్య పెరిగినట్లు అంచనా. మెయిన్ 2 సెషన్లలో కలిపి 11,13,325 మంది పరీక్ష రాశారు. ఇందులో కటాఫ్ మార్కులు సాధించిన వారిలో టాప్ 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పించారు. బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులుంటేనే.. ఇక ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకుతో పాటు అభ్యర్థులకు బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు తప్పనిసరిగా సాధించాలన్న నిబంధన ఉండేది. కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు సరిగా నిర్వహించని సమయంలో ఈ నిబంధన నుంచి రెండేళ్లుగా మినహాయింపునిచ్చారు. ఇప్పుడా పరిస్థితులు చక్కబడడంతో ఈసారి బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు సాధించడాన్ని మళ్లీ పునరుద్ధరించారు. అలాగే, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఆన్లైన్ మోడ్ (కంప్యూటర్ బేస్డ్)లో నిర్వహించనున్నారు. ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు రెండు పేపర్ల పరీక్షలూ రాయాల్సి ఉంటుంది. మరోవైపు.. జేఈఈ అడ్వాన్స్డ్–2023 సిలబస్‌లో పలు మార్పులు చేశారు. అభ్యర్థులపై ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా బోర్డు పరీక్షల్లో ఉండే ఎన్సీఈఆర్టీ సిలబస్‌లోని అంశాలను ఎక్కువగా పొందుపరిచారు. జేఈఈ మెయిన్‌లోనూ ఇవే అంశాలు ఉండగా కొంత లోతైన తీరులో అడ్వాన్స్‌డ్‌లో ప్రశ్నల సరళి ఉండనుంది. ఈ విధానంవల్ల విద్యార్థులు అటు బోర్డు పరీక్షలు, ఇటు మెయిన్ పరీక్షలతో పాటు అడ్వాన్స్డ్ పరీక్షలకు ఒకేరకమైన సిలబస్‌ను అధ్యయనం చేయడం ద్వారా ఒత్తిడికి గురవ్వకుండా ఉండేలా ఈ సిలబస్‌లో మార్పులు చేశారు. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఐఐటీ గౌహతి సంస్థ అడ్మిట్ కార్డులలో వివరంగా పొందుపరిచింది. మే 29న అడ్వాన్స్డ్ వెబ్సైట్లో అడ్మిట్ కార్డులను పొందుపరిచింది. ఈనెల 4వరకు వీటిని అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ‘ఒక్క నిమిషం’ నిబంధన అమలు ► అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయానికి ముందుగానే చేరుకోవాలని నిర్వహణ సంస్థ సూచించింది. పరీక్ష కేంద్రంలోకి నిర్దేశించిన సమయం కన్నా ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను అనుమతించరు. ► అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డు, అధికారిక ఫొటో ఐడీ కార్డును విధిగా తీసుకురావాలి. ► అడ్మిట్‌కార్డు జిరాక్సు కాపీని ఇన్విజిలేటర్లకు అందించి ఒరిజినల్ కాపీని తమ వద్దనే భద్రపరచుకోవాలి. ► అభ్యర్థులు అడ్మిట్‌కార్డులో, అటెండెన్స్ షీటులో తమ వేలిముద్రను వేసేముందు వేలుని శుభ్రం చేసుకోవాలి. ► అభ్యర్థులకు తప్పనిసరిగా డ్రెస్‌కోడ్ కూడా అమలుచేయనున్నారు. షూలు ధరించి రాకూడదు. ► అలాగే, పెద్ద బటన్‌లతోని వస్త్రాలను, ఫుల్‌స్లీవ్ వస్త్రాలను, బంగారపు ఆభరణాలను ధరించరాదు. ► బాల్‌పాయింట్ పెన్నును వినియోగించాలి. ► పెన్సిల్, ఎరేజర్లను తెచ్చుకోవచ్చు. అలాగే, సాధారణమైన వాచీని ధరించవచ్చు. ఇతర డిజిటల్ వాచీలు, పరికరాలను అనుమతించబోరు. ► అడ్మిట్‌కార్డులో నమోదు చేసిన పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటివి సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. -
జూన్ 4న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
సాక్షి, అమరావతి: ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్స్డ్–2023ను జూన్ 4న నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు పేపర్–2 పరీక్ష జరగనుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ 2023 ఏప్రిల్ 30 నుంచి మే 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఫీజు చెల్లింపును మే 5వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు పూర్తిచేయాలి. అభ్యర్థులు https://jeeadv.ac.in పోర్టల్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. విదేశీ అభ్యర్థులు https:// jeeadv.ac.in/foreign. html ద్వారా రిజిస్ట్రేషన్‌ను చేసుకోవాలి. అడ్మిట్ కార్డులను మే 29 నుంచి జూన్ 4 వరకు అందుబాటులో ఉంచుతారు. పరీక్షలు కంప్యూటరాధారితంగా నిర్వహిస్తారు. సంబంధిత పోర్టల్‌లో మాక్ టెస్టులనూ అందుబాటులో ఉంచుతారు. జూన్ 11న ప్రొవిజనల్ ఆన్సర్ కీని అందుబాటులో ఉంచి, 11, 12 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఫైనల్ కీ, రిజల్స్‌ను జూన్ 18న ప్రకటిస్తారు. ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) గౌహతి సంస్థ నిర్వహించనుంది. ఈ మేరకు ఐఐటీ గౌహతి గురువారం షెడ్యూల్‌ను, సవివర బ్రోచర్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు రెండు పేపర్లకూ హాజరవడం తప్పనిసరని పేర్కొంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులను (అన్ని కేటగిరీలకు సంబంధించిన వారిని) ఈ పరీక్షలకు అనుమతిస్తారు. పరీక్షలు రాసేందుకు వరుసగా రెండేళ్లు మాత్రమే అనుమతిస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్, తత్సమాన పరీక్షల్లో అభ్యర్థులు ఉత్తీర్ణులై ఉండాలి. 2021, అంతకు ముందు ఇంటర్ పరీక్షలు రాసిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్సుడ్–2023కి దరఖాస్తు చేసేందుకు అవకాశం లేదు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బర్హంపూర్, భోపాల్, కోల్‌కతా, పూణే, తిరువనంతపురం, తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)లు, తిరువనంతపురం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్టీ), రాయ్‌బరేలీలోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ(ఆర్‌జీఐపీటీ), విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(ఐఐపీఈ) తదితర సంస్థలు కూడా ఈ సారి జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నాయి. ఏపీలో పరీక్ష నిర్వహించే నగరాలు, పట్టణాలివే.. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అమలాపురం, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుడ్లవల్లేరు, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మార్కాపురం, మైలవరం, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ. -
JEE Advanced Result 2021: అడ్వాన్స్‌డ్‌లో అదరగొట్టారు
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు అదరగొట్టారు. ఈ పరీక్ష ఫలితాలను శుక్రవారం నిర్వహణ సంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్ విడుదల చేసింది. ఇందులో జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. దేశవ్యాప్తంగా టాప్–10లో ర్యాంక్‌ల్లో మూడు మనోళ్లు కైవసం చేసుకున్నారు. రామస్వామి సంతోష్‌రెడ్డి.. 4వ ర్యాంక్, పోలు లక్ష్మీసాయి లోకేష్‌రెడ్డి.. 5వ ర్యాంక్, మొదుళ్ల హృషికేష్‌రెడ్డి 10వ ర్యాంక్ దక్కించుకున్నారు. వీరితో పాటు సవరం దివాకర్ సాయి 11వ ర్యాంక్, ఆనంద్ నరసింహన్ 17వ ర్యాంకు సాధించారు. రిజర్వ్ కేటగిరీల్లో నలుగురు విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. వీరిలో రామస్వామి సంతోష్‌రెడ్డి(ఈడబ్ల్యూఎస్), నందిగామ నిఖిల్(ఎస్సీ), బిజిలి ప్రచోతన్ వర్మ(ఎస్టీ), గొర్లె కృష్ణచైతన్య(ఓబీసీ–పీడబ్ల్యూడీ) ఉన్నారు. జోన్లవారీగా ర్యాంక్‌లు చూస్తే... టాప్–100లో ఐఐటీ బాంబే (28), ఐఐటీ ఢిల్లీ (28), ఐఐటీ హైదరాబాద్ (27), ఐఐటీ కాన్పూర్ (3), ఐఐటీ ఖరగ్‌పూర్ (1), ఐఐటీ రూర్కీ (13) ఉన్నాయి. ఈసారి జేఈఈ ర్యాంక్‌ల్లో విద్యార్థినుల వెనుకబాటు కనిపించింది. జాతీయస్థాయిలో టాప్–100లో ఒక్కరు మాత్రమే చోటు దక్కించుకున్నారు. ఐఐటీ ఢిల్లీ జోన్ పరిధిలోని కావ్య చోప్రా 98వ ర్యాంకు సాధించి మహిళల్లో టాపర్‌గా నిలిచింది. తెలుగు విద్యార్థినుల్లో ఐఐటీ హైదరాబాద్ జోన్ పరిధిలో పల్లె భావన 107వ ర్యాంక్‌తో అగ్రస్థానం దక్కించుకుంది. 41,862 మంది అర్హత... జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దేశవ్యాప్తంగా 1,51,193 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా... 1,41,699 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 41,862 మంది అర్హత మార్కులు సాధించారు. అర్హత మార్కులు సాధించిన వారిలో 6,452 మంది విద్యార్థినులున్నారు. ఆలిండియా టాప్ ర్యాంక్ సాధించిన మృదుల్ అగర్వాల్‌కు 360 మార్కులకుగాను 348 మార్కు లు వచ్చాయి. ఇక, మహిళల్లో టాప్‌లో నిలిచిన కావ్య చోప్రాకు 286 మార్కులు లభిం చాయి. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 20 వేల మంది విద్యార్థులు అడ్వాన్స్డ్ రా శారు. వీరిలో సుమారు 7 వేల మంది అర్హత మార్కులు సాధించినట్లు తెలుస్తోంది. టాప్ 500 ర్యాంక్‌ల్లో మనోళ్లు... ఐఐటీ హైదరాబాద్ పరిధిలో టాప్ 500 ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులు 135 మం ది ఉన్నారు. దేశవ్యాప్తంగా ఏడు జోన్లు ఉం డగా.. అందులో అత్యధికంగా ఐఐటీ బాం బే పరిధిలో 137 మంది ర్యాంక్‌లు సాధించారు. ఆ తర్వాత ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులు అధికంగా ఉన్నారు. ఐఐటీ ఢిల్లీ–108, ఐఐటీ గౌహతి–9, ఐఐటీ కాన్పూర్–24, ఐఐటీ ఖరగ్‌పూర్–38, ఐఐటీ రూర్కీ–49 ర్యాంక్‌లు సాధించాయి. 27న తొలి విడత సీట్లు... జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు, ర్యాంక్‌లు వెలువడటంతో ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) రిజిస్ట్రేషన్ల ప్రక్రియను శనివారం నుంచి ప్రారంభించింది. ఈ నెల 22న మాక్ సీట్ అలకేషన్–1 చేస్తారు. 24న మాక్ సీట్ అలకేషన్–2 ఉంటుంది. 25న విద్యార్థులు మళ్లీ తమ ఆప్షన్ల చాయిస్‌ను ఇవ్వాలి. 27న తొలి విడత సీట్లు కేటాయిస్తారు. కంప్యూటర్ ఇంజనీర్‌ను అవుతా మాది ఒంగోలు. నాకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 331 మార్కులు వచ్చాయి. ప్రతివారం పరీక్ష రాయడం, అందులో జరిగే పొరపాట్లు సరిదిద్దుకోవడం, ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకోవడం, సమయపాలన పాటించడమే నా విజయానికి ప్రధాన కారణాలు. రోజుకి ఎనిమిది గంటలు చదివాను. ఏపీఈసెట్‌లో 23వ ర్యాంకు వచ్చింది. కంప్యూటర్ ఇంజనీర్ కావడమే నా లక్ష్యం. – పోలు లక్ష్మీసాయి లోకేష్‌రెడ్డి ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చేస్తా.. మాది వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు. విజయవాడలో ఇంటర్ చదవా. ఇంటర్ పరీక్షలు, జేఈఈ అడ్వాన్స్డ్ కోసం రోజుకు 14 గంటలు శ్రమించా. అమ్మ శ్రీదేవి ఎస్బీఐలో మేనేజర్. నాన్న జగదీశ్వర్‌రెడ్డి వ్యాపారం చేస్తున్నారు. ఏపీఈసెట్‌లో 25వ ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్‌లో 99 పర్సంటైల్ సాధించాను. ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చేస్తా. చదువు పూర్తయ్యాక వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి పది మందికి ఉపాధి కల్పిస్తా. – మొదుళ్ల హృషికేష్‌రెడ్డి తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. సంస్థాన్ నారాయణపురం: జేఈ ఈ అడ్వాన్స్‌డ్‌లో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారిగూడెం గ్రామానికి చెందిన పల్లె భావన బాలికల విభాగంలో ఆలిండియా రెండో ర్యాం క్, దక్షిణ భారత్‌లో మొదటి ర్యాంక్ సాధించింది. మెయిన్స్‌లో 4 ర్యాంక్ దక్కించుకుంది. భావన మాట్లాడుతూ.. అ«ధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అడ్వాన్స్డ్ లో అత్యుత్తమ ర్యాంక్ సాధించానని పేర్కొంది. సాఫ్ట్వేర్ కంపెనీ పెడతా.. కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన నందిగామ నిఖిల్ జాతీయస్థాయిలో ఎస్సీ కేటగిరీ లో మొదటిర్యాంక్ సాధించాడు. 360 మార్కులకుగాను 283 మా ర్కులు సాధించాడు. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలన్నదే తన ఆశయమని నిఖిల్ తెలిపాడు. మిర్యాలగూడ విద్యార్థికి 19వ ర్యాంక్ మిర్యాలగూడ అర్బన్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కుర్ర శ్రీనివాస్ జాతీయస్థాయిలో 19వ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను కేఎల్ఎన్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ కిరణ్‌కుమార్, డైరెక్టర్లు అభినందించారు. -
తికమక పెట్టిన గణితం ‘90’ వస్తే ఐఐటీ సీటు!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విద్యార్థులను ఈసారి గణితం ఎక్కువగా తికమక పెట్టింది. రసాయన శాస్త్రం నుంచి మంచి స్కోర్ చేయవచ్చని, ఫిజిక్స్‌తో మధ్యస్తంగా మార్కులు తెచ్చుకునే వీలుందని విద్యారంగ నిపుణులు తెలిపారు. ప్రశ్నల తీరును పరిశీలిస్తే 85 నుంచి 90 మార్కులు జనరల్‌కు కటాఫ్ ఉంటుందని, ఈడబ్ల్యూఎస్‌కు 68–72, ఓబీసీకి 68–75, ఎస్సీఎస్టీకి 50 మార్కులు కటాఫ్‌గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఖరగ్‌పూర్ ఐఐటీ నేతృత్వంలో ఆదివారం ఉదయం, సాయంత్రం రెండు షిప్టులు, రెండు పేపర్లుగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరిగింది. డైరెక్ట్ ప్రశ్నలతో ఊరట 11, 12 సత్సమానమైన క్లాసుల నుంచే కెమిస్ట్రీలో ఎక్కువ ప్రశ్నలొచ్చాయి. ఎన్సీఈఆర్టీ విధానం ప్రకారం డైరెక్ట్ (ఎలాంటి మెలిక లేకుండా) ప్రశ్నలు రావడం విద్యార్థులకు ఊరట కలిగించింది. భౌతిక రసాయన శాస్త్రంలో టైట్రేషన్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, థర్మోడైనమిక్ ప్రశ్నలు, ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి జంతువులు, బయోమాలిక్యులస్, ఆక్సిజన్ కంటెయినింగ్ కాంపౌండ్స్ నుంచి ప్రశ్నలొచ్చాయి. భౌతికశాస్త్రంలో 11వ తరగతికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి. ఎలక్ట్రిసిటీ, ఆప్టిక్స్, రొటేషన్ అండ్ మోడ్రన్ ఫిజిక్స్ నుంచి మధ్యస్తంగా ప్రశ్నలున్నాయి. మ్యాథమెటిక్స్ విద్యార్థులకు తలనొప్పి తెప్పించిందని గణిత శాస్త్ర అధ్యాపకులు విశ్లేషిస్తున్నారు. కొన్ని తేలికైన ప్రశ్నలే ఇచ్చినా, మేట్రిసిస్, డిటర్మినెంట్స్, ఫంక్షన్స్, కంటిన్యుటీ అండ్ డిఫరెన్ష్యబులిటీ, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్తో పాటు పలు చాప్టర్ల నుంచి ప్రశ్నలిచ్చారు. కొన్ని చాప్టర్ల నుంచి ఇచ్చిన ప్రశ్నలు గందరగోళపరిచేలా ఉన్నాయని విద్యా రంగ నిపుణులు తెలిపారు. -
అక్టోబర్ 16 నుంచి జేఈఈ అడ్మిషన్ల కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీలు)లతో పాటు ప్రభుత్వ ఆర్థిక సాయం పొందుతున్న సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా–2021) ఇంతకు ముందే అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు వెలువడ్డాక అడ్మిషన్ల ప్రక్రియను జోసా ప్రారంభించనుంది. జేఈఈ మెయిన్ తుది విడత ఫలితాల విడుదలలో తీవ్ర జాప్యం చోటు చేసుకున్న నేపథ్యంలో అడ్వాన్స్డ్ పరీక్షల ప్రక్రియ కొంత ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 11కి ముందే జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలవుతాయని భావించారు. ఈ మేరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సెప్టెంబర్ 12 నుంచి 19 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టాలని ఆ పరీక్ష నిర్వహణ సంస్థ.. ఐఐటీ ఖరగ్‌పూర్ ముందు నోటిఫికేషన్ ఇచ్చింది. జేఈఈ మెయిన్ ఫలితాలు ఆలస్యం కావడంతో ఈ నెల 13కి రిజిస్ట్రేషన్ ప్రక్రియను వాయిదా వేసింది. మెయిన్ ఫలితాలు 14న విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చివరి తేదీని సెప్టెంబర్ 21 (నేడు) వరకు ఐఐటీ ఖరగ్‌పూర్ పొడిగించింది. అడ్వాన్స్‌డ్‌కు 2.50 లక్షల మంది.. జేఈఈ మెయిన్‌లో నిర్దేశిత కటాఫ్‌తో మెరిట్లో ఉన్న 2.50 లక్షల మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి అక్టోబర్ 3న పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లలో ఈ పరీక్ష జరగనుంది. అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను అక్టోబర్ 5 సాయంత్రం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ప్రాథమిక ‘కీ’ని అక్టోబర్ 10న విడుదల చేయనున్నారు. దీనిపై 10, 11 తేదీల్లో అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అక్టోబర్ 15న అడ్వాన్స్డ్ పరీక్ష తుది ఫలితాలను విడుదల చేస్తారు. 16 నుంచి అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 26 ఐఐఐటీలు, 29 గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ (జీఐఎఫ్‌టీ)ల్లోని సీట్లను మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఆయా అభ్యర్థులకు కేటాయించనుంది. మెయిన్ పరీక్ష స్కామ్‌లో 20 మంది విద్యార్థులపై వేటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) 2021 నుంచి జేఈఈ మెయిన్‌ను నాలుగు దశల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆన్లైన్లో నిర్వహించిన ఈ పరీక్షలకు 9,39,008 మంది దరఖాస్తు చేశారు. చివరిదైన నాలుగో సెషన్లో 7 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. నాలుగు సెషన్లలో విద్యార్థులు దేనిలో ఎక్కువ స్కోర్ సాధిస్తే దాన్నే తుది ఫలితంగా ఎన్టీఏ పరిగణించింది. అయితే చివరి సెషన్లో కొందరి స్కోర్ తొలి సెషన్ స్కోర్ కంటే అమాంతం పెరిగిపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. హరియాణాలోని సోనిపట్‌లో ఒక కేంద్రంలో పరీక్షలు రాసిన వారికి ఇలా అత్యధిక మార్కులు వచ్చాయి. అంతకు ముందు 38, 40కి మించి స్కోర్ రానివారు ఏకంగా 95 నుంచి 99 పాయింట్ల స్కోర్ సాధించారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో సీబీఐ విచారణ చేపట్టి ఒక ప్రైవేటు విద్యాసంస్థకు చెందిన ఆరుగురిని ఇప్పటికే అరెస్టు చేసింది. అంతేకాకుండా ఈ స్కామ్‌లో ఉన్న 20 మంది విద్యార్థుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచింది. దీంతోపాటు రానున్న మూడేళ్లు ఈ పరీక్షలు రాయడానికి వీల్లేకుండా వారిని డిబార్ చేసింది. -
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ ప్రాథమిక ‘కీ’
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2020 పరీక్ష ప్రాథమిక ‘కీ’ మంగళవారం వెలువడనుంది. ఆదివారం నిర్వహించిన పేపర్–1, పేపర్–2 ప్రశ్నపత్రాల కాపీలను పరీక్ష నిర్వహణ సంస్థ.. ఐఐటీ– ఢిల్లీ సోమవారం వెబ్సైట్లో పొందుపరిచింది. కీ విడుదల చేశాక విద్యార్థుల నుంచి ఈ నెల 30 సాయంత్రం వరకు అభ్యంతరాలను స్వీకరించనుంది. అనంతరం అక్టోబర్ 5న తుది ‘కీ’ని, ర్యాంకుల జాబితాను విడుదల చేయనుంది. జేఈఈ అడ్వాన్స్డ్ అధికారిక వెబ్సైట్ నుంచి ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్–2020కు 2.5 లక్షల మంది అర్హత సాధించగా 1.60 లక్షల మంది మాత్రమే పరీక్షకు నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ► వీరిలో 96 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పేపర్–1కు 1.51 లక్షలు, పేపర్ 2కు 1.50 లక్షల మంది హాజరయ్యారు. ► అక్టోబర్ 6 నుంచి జాయింట్ సీట్ అలొకేషన్ అ«థారిటీ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నవంబర్ 9 వరకు మొత్తం 6 విడతల కౌన్సెలింగ్ ద్వారా మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. అభ్యర్థులు ఒకే రకమైన మార్కులతో సమానంగా ఉంటే నెగెటివ్ సమాధానాలివ్వని, ఎక్కువ పాజిటివ్ మార్కులున్న అభ్యర్థులకు మెరుగైన ర్యాంక్ ఇస్తారు.అందులోనూ సరిసమానంగా అభ్యర్థులుంటే వారిలో గణితంలో ఎక్కువ స్కోరు ఉన్నవారికి అధిక ర్యాంకు కేటాయిస్తారు. ► ఆ తర్వాత భౌతికశాస్త్రం మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అప్పటికీ సమాన స్థాయిలోఅభ్యర్థులుంటే నిబంధనల మేరకు ర్యాంకులిస్తారు. -
ఫిజిక్స్ కఠినంగా.. మ్యాథ్స్ మధ్యస్తంగా..
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 15 కేంద్రాల్లో దాదాపు 15 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో భౌతిక శాస్త్రం ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని, సుదీర్ఘ సమాధానాలు కలిగిన ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయని విద్యార్థులతో పాటు సబ్జెక్టు నిపుణులు ఉమాశంకర్, ఎంఎన్ రావు వెల్లడించారు. ఇక మ్యాథమెటిక్స్‌లో ఎక్కువ ప్రశ్నలు మధ్యస్తంగా ఉండగా, కొన్ని ప్రశ్నలు మాత్రం కఠినంగా ఉన్నాయని, కెమిస్ట్రీలో మాత్రం సులభమైన ప్రశ్నలు వచ్చినట్లు తెలిపారు. ఉదయం జరిగిన పేపర్–1 పరీక్షలో ఒకే జవాబు కలిగిన ప్రశ్నలు 6, ఒకటి కంటే ఎక్కువ జవాబులు కలిగిన ప్రశ్నలు 6 వచ్చాయని, పూర్ణ సంఖ్య జవాబుగా కలిగిన ప్రశ్నలు మరో 4 ఉన్నట్లు వెల్లడించారు. మధ్యాహ్నం జరిగిన పేపర్–2 పరీక్షలోనూ ప్రశ్నల సరళి అలాగే ఉందన్నారు. పేపర్–1తో పోల్చితే పేపర్–2లో ఫిజిక్స్ ప్రశ్నలు చాలా కఠినంగా ఉన్నట్లు వివరించారు. గతేడాది కంటే ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ చాలా కఠినంగా ఉందని పేర్కొన్నారు. ఓపెన్ కేటగిరీలో కటాఫ్ మార్కులు 35 శాతం, ఓబీసీలో 28–30 శాతం, ఎస్సీ, ఎస్టీల్లో 12–15 శాతం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రెండు పేపర్లలో కలిపి 396 మార్కులకు గాను తెలుగు విద్యార్థులకు 360 మార్కులకు పైగా రావచ్చని నిపుణులు చెబుతున్నారు. 5వ తేదీన ఫలితాలు.. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను వచ్చే నెల 5న ఐఐటీ ఢిల్లీ విడుదల చేయనుంది. ఆ తర్వాతి రోజు నుంచే (6వ తేదీ) ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాల కోసం జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) ఉమ్మడి కౌన్సెలింగ్‌ను నిర్వహించనుంది. ఇందుకోసం షెడ్యూల్‌ను కూడా జారీ చేసింది. 6వ తేదీ నుంచి మొదటి విడత ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లను ప్రారంభించి 16వ తేదీన సీట్లను కేటాయించనుంది. అనంతరం మరో ఐదు దశల కౌన్సెలింగ్ నిర్వహించి, నవంబర్ 7వ తేదీతో సీట్ల కేటాయింపును పూర్తి చేయనుంది. నవంబర్ 9వ తేదీ నాటికి కరోనా పరిస్థితి అదుపులోకి రాకపోతే విద్యార్థులు ఆన్లైన్లోనే రిపోర్టింగ్ చేసేలా చర్యలు చేపట్టింది. మరోవైపు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్‌లో ప్రవేశాల కోసం వచ్చే నెల 8వ తేదీన ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టును (ఏఏటీ) నిర్వహించి, 11వ తేదీన వాటి ఫలితాలను ప్రకటించనుంది. -
కొంచెం 'సులభం'.. కొంచెం 'కష్టం'
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) తదితర విద్యాసంస్థల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఢిల్లీ ఐఐటీ ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2020 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో 30 ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాసేందుకు సుమారు 2.50 లక్షల మంది అర్హత సాధించినా.. 1,60,864 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) విధానంలో ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 నిర్వహించారు. అభ్యర్థులు, ఆయా సబ్జెక్టుల అధ్యాపకుల విశ్లేషణ ప్రకారం కెమిస్ట్రీ కొంత సులభంగా ఉండగా ఫిజిక్స్, మేథమేటిక్స్ ప్రశ్నలు దీర్ఘత్వంతో కఠినంగా ఉన్నాయి. ఈ పేపర్లకు సంబంధించిన అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను ఈనెల 29న జేఈఈ అడ్వాన్సు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. నెలాఖరున ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణ అనంతరం అక్టోబర్ 5న తుది కీ, ర్యాంకులతో సహా తుది ఫలితాలను ప్రకటిస్తారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) సీట్ల కేటాయింపునకు కౌన్సెలింగ్‌ను చేపడుతుంది. విభిన్న రీతుల్లో ప్రశ్నలు.. ► ఫిజిక్స్, మేథ్స్, కెమిస్ట్రీలలో వివిధ విభాగాల్లో విభిన్నమైన రీతుల్లో ప్రశ్నలున్నాయి. ఫిజిక్స్ ప్రశ్నలను దీర్ఘంగా.. భిన్నమైన రీతిలో సంధించారు. ► మేథమేటిక్స్ ప్రశ్నలను పరిష్కరించడానికి అభ్యర్థులకు ఎక్కువ సమయం పట్టిందని.. కెమిస్ట్రీ సమతుల్యంగా, ఒకింత సులభంగా ఉందని కోచింగ్ నిపుణుడొకరు అభిప్రాయపడ్డారు. ► కెమిస్ట్రీ విభాగంలోని ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ ప్యాట్రన్‌ను అనుసరించి ఇచ్చినట్టుందన్నారు. ► అభ్యర్థులకు ఆయా సబ్జెక్టులలోని వ్యక్తిగత ఆసక్తులను బట్టి కొందరికి కెమిస్ట్రీ కష్టం గాను, ఫిజిక్స్ వంటివి సులభంగాను ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారని గుంటూరుకు చెందిన అధ్యాపకుడొకరు చెప్పారు. ► బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలు కొంత సులభంగా ఉన్నాయన్నారు. ► ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌లో ఒక్కో దానిలో 18 చొప్పున మొత్తం 54 ప్రశ్నలు ఇచ్చారు. ► కెమిస్ట్రీలో భౌతిక రసాయన శాస్త్రం ప్రశ్నలు కొంచెం ఎక్కువ ఉన్నాయి. ► మొత్తం మీద పేపర్–1 గత ప్రశ్నాపత్రంతో పోలిస్తే చాలా కష్టంగా ఉందని పేర్కొన్నారు. అక్టోబర్ 5న ఫలితాలు ► ఫలితాలు అక్టోబర్ 5న వెల్లడవుతాయి. తరువాత రోజు నుంచి జోసా కౌన్సెలింగ్ ద్వారా సీట్ల కేటాయింపు చేస్తుంది. ► ఈసారి 7కు బదులు ఆరు విడతల కౌన్సెలింగ్ ఉంటుంది. కౌన్సెలింగ్‌కు ముందు అభ్యర్థుల అవగాహన కోసం రెండు మాక్ కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తారు. ► ప్రాథమిక ఆన్సర్ కీలను త్వరలోనే ప్రకటించి అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. ► అధికారిక బులెటిన్ ప్రకార, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను ఈ నెల 29న అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. సెప్టెంబర్ 30న సాయంత్రం 5 గంటల వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. -
వి‘జేఈఈ’భవ!
సాక్షి, హైదరాబాద్ : ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఈనెల 20న నిర్వహించేందుకు ఐఐటీ కాన్పూర్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్–2 పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు రెండు పేపర్లు తప్పనిసరిగా రాయాలని పేర్కొంది. అభ్యర్థులు ఉదయం 7:30 గంటలకే పరీక్ష హాల్లోకి చేరుకోవాలని సూచించింది. నిర్ణీత సమయం తర్వా త నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు 2,31,024 మందికి అర్హత కల్పిస్తే.. 1,64,822 మందే పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ నుంచి దాదాపు 18 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు అంచనా. ఈ పరీక్షల కోసం రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్‌లలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఇవి తీసుకెళ్లవద్దు.. బ్రాస్లెట్, ఇయర్ రింగ్స్, నోస్ పిన్, చైన్, నెక్లెస్ వంటి ఆభరణాలు, హెయిర్‌పిన్, హెయిర్ బ్యాండ్ వంటివి ధరించకూడదు. పర్సులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, హ్యాండ్ బ్యాగులు, వాచీలు, క్యాలికులేటర్, అద్దాలు, సెల్ఫోన్లు తీసుకెళ్లకూడదు. విద్యార్థులు పాటించాల్సినవి.. విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్ జిరాక్స్, ఫొటో, ఏదైనా గుర్తింపు కార్డు (ఆధార్, కాలేజీ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు, పాన్‌కార్డు) వెంట తెచ్చుకోవాలి. ఉదయం 7:30 నుంచే పరీక్షా కేంద్రంలో రిపోర్టు చేయాలి. పరీక్షా కేంద్రం లోపలికి వెళ్లాక బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్/వెరిఫికేషన్ చేయించుకోవాలి. వెరిఫికేషన్ తర్వాత 7:45 గంటలకు పేపర్–1 పరీక్షకు, మధ్యాహ్నం 12:45 గంటలకు పేపర్–2 పరీక్ష కోసం విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. తొలుత కంప్యూటర్ స్క్రీన్‌పై పేరు, ఫొటో, రోల్‌నంబర్ కనిపిస్తుంది. అభ్యర్థులు లాగిన్ అయ్యాక ముందుగా సూచనలు చదువుకోవాలి జోన్ల వారీగా అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే విద్యార్థులు జోన్ విద్యార్థుల సంఖ్య ఐఐటీ బాంబే 28,813 ఐఐటీ ఢిల్లీ 31,884 ఐఐటీ గౌహతి 11,907 ఐఐటీ కాన్పూర్ 20,428 ఐఐటీ ఖరగ్‌పూర్ 19,145 ఐఐటీ మద్రాసు 38,231 ఐఐటీ రూర్కీ 14,414 మొత్తం 1,64,822 -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత నిబంధనలు
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకు వచ్చే ఏడాది మే 20న నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఉండాల్సిన ప్రధాన అర్హతల వివరాలను ఐఐటీ కాన్పూర్ శనివారం అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులకు ప్రధానం గా 5 అంశాల్లో అర్హతలు ఉండాలని వెల్లడించింది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన 2.24 లక్షల మందిలో ఒకరిగా ఉండాలని పేర్కొంది. విద్యార్థులు 1993 అక్టోబర్ 1న, లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలని, ఎస్సీ ఎస్టీ, వికలాంగులకు ఐదేళ్ల సడలింపు ఉందని, వారు 1998 అక్టోబర్ 1న, లేదా ఆ తర్వాత పుట్టినవారై ఉండాలని పేర్కొంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను వరుసగా 2సార్లే రాయాలని పేర్కొంది. 2017 లో లేదా 2018లో ఇంటర్ పరీక్షలను మొదటిసారిగా రాసిన వారే అర్హులు. గతంలో ఐఐటీల్లో చేరిన వారు, రిపోర్టింగ్ కేంద్రాలకు వెళ్లి సీటు యాక్సెప్టెన్సీ ఇచ్చిన వారు, ఐఐటీల్లో చేరి తర్వాత సీటు రద్దు చేసుకున్న వారు 2018లో పరీక్షకు అనర్హులని వివరించింది. అభ్యర్థులు ఇంటర్లో 75% మార్కులు (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 65%) సాధించి ఉండాలని తెలిపింది. కేటగిరీల వారీగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు పరిగణనలోకి తీసుకునే అభ్యర్థుల సంఖ్యనూ వెల్లడించింది. -
రాష్ట్రంలో 3 కేంద్రాల్లో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
- పరీక్ష రిజిస్ట్రేషన్ ఫీజుల పెంపు - ఈసారి ఆలస్య రుసుముతోనూ చెల్లించే అవకాశం సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫీజులు పెరిగాయి. ఐఐటీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం మేరకు పెంచిన ఫీజులు, ఇతర వివరాలతో కూడిన ఇన్ఫర్మేషన్ బ్రోచర్‌ను ముంబై ఐఐటీ శుక్రవారం వెబ్సైట్ jeeadv.ac.in అందుబాటులో ఉంచింది. జనరల్ అభ్యర్థులకు ఫీజును రూ.2,000 నుంచి రూ.2,400కు... మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.1,000 నుంచి రూ.1,200కు పెంచింది. అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్ 28 నుంచి మే 2 వరకు చేపడతామని పేర్కొంది. ఇంతకుముందు నిర్ణీత గడువు తర్వాత రిజిస్ట్రేషన్‌కు అవకాశమే లేకపోగా... ఈసారి ఆలస్య రుసుముతో మరో 2 రోజులు రిజిస్ట్రేషన్‌కు వెసులుబాటు కల్పించింది. రూ.500 రుసుముతో మే 3 ఉదయం 10 నుంచి 4వ తేదీ సాయంత్రం 5 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పరీక్షను మే 21న రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ కేంద్రాల్లో.. ఏపీలోని నెల్లూరు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం కేంద్రాల్లో నిర్వహిస్తామని తెలిపింది. విదేశాల్లోనూ పరీక్షా కేంద్రాలు ఈసారి కొత్తగా సార్క్ దేశాల్లోనూ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ముంబై ఐఐటీ వెల్లడించింది. అక్కడ 135 డాలర్లు ఫీజుగా చెల్లించాలని.. ఆలస్యమైతే అదనంగా 80 డాలర్లు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వివరించింది. సార్క్ దేశాలు మినహా ఇతర దేశాల్లోని విద్యార్థులు 270 డాలర్లు ఫీజు చెల్లించాలని (గతంలో ఒక్క దుబాయ్ కేంద్రమే ఉండేది. అక్కడి వారు 220 డాలర్లు చెల్లించాలి).. నిర్ణీత గడువు దాటితే అదనంగా 80 డాలర్లు ఆలస్య రుసుము చెల్లించాలని తెలిపింది. ఎన్నారైలకు ప్రతి బ్రాంచీలో 10% సీట్లను కేటాయిస్తామని పేర్కొంది. అంధులు, డిస్లెక్సియా తో బాధపడే వారు సహాయకులను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. దీనికై వారు జోనల్ ఐఐటీలో ఉండే జేఈఈ అడ్వాన్స్డ్ చైర్మన్‌కు రాతపూర్వకంగా విజ్ఞప్తి చేయాలని సూచించింది. వారికి పరీక్ష నిర్ణీత సమయం కంటే అదనంగా మరో గంట సమయం ఇస్తారని తెలిపింది. ఓబీసీ నాన్ క్రిమీలేయర్ విద్యార్థులు 2017 ఏప్రిల్ 1 తర్వాత జారీ చేసిన ఓబీసీ నాన్ క్రిమీలేయర్ సర్టిఫికెట్లను అందజేస్తేనే ఆ కేటగిరీ రిజర్వేషన్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. -
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ కీ విడుదల
సాక్షి, హైదరాబాద్: గత నెల 22న జరిగిన జాయింట్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్స్డ్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని ఆదివారం విడుదల చేయనున్నట్లు ఐఐటీ గువాహటి ప్రకటించింది. ప్రాథమిక్ ‘కీ’ పై అభ్యంతరాలను జేఈఈ అడ్వాన్స్డ్ వెబ్సైట్ ద్వారా ఈ నెల 7వరకు స్వీకరిస్తారు. జూన్ 12న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో ఫలితాలను ప్రకటించనున్నారు. -
ఓ వైపు చికిత్స... మరో వైపు పరీక్ష
జేఈఈ అడ్వాన్స్డ్ రాసిన విద్యార్థిని.. భీమారం: వరంగల్ నగర పరిధి ఎర్రగట్టు గుట్టలోని కిట్స్ కళాశాలలో ఆదివారం ఓ విద్యార్థిని చికిత్స పొందుతూనే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసింది. కరీంనగర్ జిల్లా రాయకల్ మండలం చల్లకొండ గ్రామానికి చెందిన నన్నం మౌనిక ఆదివారం ఉదయం పరీక్ష రాయడానికి తండ్రి రాజేందర్‌తో కలిసి కిట్స్ కళాశాలకు వచ్చింది. అప్పటికే ఆమె కడుపునొప్పితో బాధపడుతోంది. పరీక్ష కేంద్రంలోకి రాగానే కడుపునొప్పి తీవ్రం కావడంతో హెల్త్ సూపర్వైజర్ నీలకంఠం ప్రథమ చికిత్స చేసి, గ్లూకోస్ ఎక్కించారు. ఉదయం 9 గంటల వరకు ప్రథమ చికిత్స జరిగింది. పరీక్ష ప్రారంభం కాగానే ఆమెను హాల్లోకి అనుమతించారు. గంట తర్వాత ఆమె అస్వస్థతకు గురికావడంతో నీలకంఠం మళ్లీ హాల్లోకి వెళ్లి ఆమెను పరీక్షించగా.. నొప్పి భరిస్తూనే పరీక్ష రాసి, ముగిశాక ఆస్పత్రికి వెళ్లింది. -
చుక్కలు చూపిన జేఈఈ అడ్వాన్స్డ్
- మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రశ్నలు కఠినం - కాస్త సులువుగా కెమిస్ట్రీ ప్రశ్నలు - 35 % కటాఫ్.. తగ్గించే అవకాశం సాక్షి, హైదరాబాద్: జాయింట్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్స్డ్ పరీక్షలో ప్రశ్నలు అభ్యర్థులకు చుక్కలు చూపించాయి. పేపర్ 1, 2ల్లోనూ మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రశ్నలు చాలా కఠినంగా వచ్చాయని అభ్యర్థులు చెబుతున్నారు. కెమిస్ట్రీలో ప్రశ్నలు కొంతమేర సులువుగా ఉన్నాయంటున్నారు. గతేడాది రెం డు పేపర్లు కలిపి మొత్తం 506 మార్కులకు ప్రశ్నలివ్వగా, ఈ ఏడాది 372 మార్కులకు ప్రశ్నలిచ్చారు. మొత్తం మార్కుల్లో 35 శాతం మార్కులొస్తే ర్యాంకులు ఇస్తామని పరీక్ష నిర్వహించిన ఐఐటీ గువాహటి ఇప్పటికే ప్రకటించింది. గతేడాది కూడా కటాఫ్ మా ర్కులను 35 శాతంగా ప్రకటించినా చివరి నిమిషంలో 25 శాతానికి తగ్గించారు. ఈ ఏడాది కూడా కటాఫ్ మార్కులను తగ్గించి ర్యాంకులిచ్చే అవకాశం ఉదని ఐఐటీ-జేఈఈ ఫోరం కన్వీనర్ లలిత్ కుమార్ తెలిపారు. 50 శాతం మార్కులు సాధిస్తే మంచి ఐఐటీలో మంచి బ్రాంచ్‌లో సీటు వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. నెగెటివ్ మార్కులపై ఈ ఏడాది సంపూర్ణమైన అవగాహనతో పరీక్ష రాసినందున ఆలిండియా టాప్ ర్యాంకుల్లో మూడు నుంచి నాలుగు ర్యాంకులు రాష్ర్ట విద్యార్థులకే దక్కే అవకాశం ఉందని పేర్కొన్నారు. రెండు పేపర్లలోనూ కాంప్రహెన్సివ్, సింగిల్ ఆప్షన్ ప్రశ్నలు తేలిగ్గా ఉన్నాయని, మల్టిపుల్ ఆప్షన్లు, ఇంటీజర్ టైప్ ప్రశ్నలు అభ్యర్థులను బాగా ఇబ్బందికి గురిచేశాయని ఫిట్జీ-ఐఐటీ అకాడమీ ప్రిన్సిపల్ నాగ రవి తెలిపారు. కొన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలంటే సుదీర్ఘమైన లెక్కలు చేయాలని, కాలిక్యులేటర్లు లేకుండా సమాధానం చేయ డం చాలా కష్టమని పేర్కొన్నారు. సింగిల్ ఆప్షన్ టైప్ ప్రశ్నల్లో ఒకట్రెండు ప్రశ్నలకు సరైన సమాధానం లేదన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రం లో మహబూబ్‌నగర్, హైదరాబాద్, వరంగల్ ప్రధాన కేంద్రాలుగా జరిగిన ఈ పరీక్షకు 95 శాతం హాజరు నమోదైనట్లు సమాచారం. కాగా, దేశవ్యాప్తంగా సుమారు రెండు లక్షల మంది అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించగా ఆదివారం నాటి పరీక్షకు 19, 820 మంది ఆన్లైన్లో, 1,78,408 మంది ఆఫ్‌లైన్‌లో రాశారు. -
ఐఐటీల్లో కటాఫ్ ర్యాంకులు
♦ వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన గువాహటి ఐఐటీ ♦ ఐఐటీల్లో ప్రవేశానికి 22న అడ్వాన్స్డ్ పరీక్ష సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 22న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహించేందుకు గువాహటి ఐఐటీ చర్యలు చేపట్టింది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన టాప్-2లక్షల మందిలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాదాపు 25 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది. అభ్యర్థుల కోసం ఐఐటీ గువాహటి ప్రత్యేక చర్యలు చేపట్టింది. 2015-16 విద్యా సంవత్సరంలో ఏయే ఐఐటీల్లో ఏయే కేటగిరీల్లో ఎంత ర్యాంకు వారికి సీట్లు లభించాయన్న వివరాలను జేఈఈ అడ్వాన్స్డ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. రిజర్వేషన్, కేటగిరీల వారీగా వివరాలను అందులో పొందుపరిచింది. వాటి ఆధారంగా ఎంత ర్యాంకు వస్తే సీటు లభిస్తుందన్న అంచనా వేసుకునేందుకు ఈ వివరాలు తోడ్పడతాయి. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఓపెన్ కోటాలో (కామన్ ర్యాంకు లిస్టు) 35 శాతం, ఓబీసీ నాన్ క్రీమీలేయర్‌లో 31.5 శాతం, ఎస్సీల్లో 17.5 శాతం, ఎస్టీల్లో 17.5 శాతం, ఓపెన్ వికలాంగుల్లో, బీసీ నాన్ క్రీమీలేయర్ వికలాంగుల్లో, ఎస్సీ, ఎస్టీ వికలాంగుల్లో 17.5 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు ర్యాంకులను ప్రకటిస్తామని వెల్లడించింది. -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో బయోమెట్రిక్
ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదు సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఈనెల 22న నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష సమయంలో విద్యార్థులందరి బయోమెట్రిక్ డాటాను సేకరించేందుకు ఐఐటీ గౌహతి నిర్ణయించింది. ఈనెల 22న ఉదయం 9 గంటలకు ప్రారంభం అయ్యే పేపరు-1 పరీక్షకు హాజరయ్యే వారు ఉదయం 7:30 గంటలకే పరీక్ష హాల్లో రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. ఇక మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అయ్యే పరీక్షకు హాజరయ్యే వారు మధ్యాహ్నం ఒంటిగంటకు పరీక్ష హాల్లో రిపోర్టు చేయాలని వెల్లడించింది. పరీక్ష నిర్ణీత సమయానికి మించి ఆలస్యం అయితే పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వాచీలను కూడా పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని పేర్కొంది. ఫుల్ షర్ట్, కోట్స్ వేసుకొని వస్తే అనుమతించరని వెల్లడించింది. ఆఫ్ షర్టులు, కుర్తాలు, టీషర్ట్స్ మాత్రమే అనుమతిస్తారని వివరించింది. సాధారణ చెప్పులు మాత్రమే వేసుకురావాలని పేర్కొంది. క్యాల్కులేటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆర్నమెంట్స్ అనుమతించరని తెలిపింది. తమ వెబ్సైట్నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునేలా లింకును అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. -
టాప్ 20 పర్సంటైల్ ఎలా?
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు ‘విభజన’ గందరగోళం రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా నిర్ధారిస్తారా? కలిపే నిర్ణయిస్తారా? వేర్వేరుగా నిర్ణయిస్తే విద్యార్థులకు ప్రయోజనమంటున్న నిపుణులు స్పష్టత ఇవ్వాల్సింది సీబీఎస్ఈయే సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనతో గందరగోళంలో చిక్కుకుపోయిన అంశాల్లో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహణ కూడా చేరుతోంది. ఈ పరీక్షకు అర్హత కోసం ఇంటర్ మార్కుల ఆధారంగా పొందాల్సిన టాప్-20 పర్సంటైల్‌ను ఒకే రాష్ట్రంగా పరిగణించి నిర్ధారిస్తారా?.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వేర్వేరుగా నిర్ణయిస్తారా? అన్న అంశం చిక్కుముడిగా మారింది. దీంతో విద్యార్థులు ఆందోళనలో మునిగిపోయారు. ఐఐటీలు, ఎన్ఐటీలు వంటి ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి సంస్థలో ప్రవేశాల కోసం జేఈఈ పరీక్షను నిర్వహిస్తారు. రెండు దశల్లో సాగే ఈ పరీక్షలో.. మొదటి దశలో విద్యార్థులు మెయిన్స్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. అనంతరం నిర్వహించే అడ్వాన్స్డ్ పరీక్షకు.. మెయిన్స్ ఉత్తీర్ణతతో పాటు, ఆ రాష్ట్రంలో టాప్-20 పర్సంటైల్‌లో ఉన్న విద్యార్థులు మాత్రమే అర్హులు. అది కూడా మొత్తంగా 1,50,000 మందిని మాత్రమే అడ్వాన్స్డ్ పరీక్షకు ఎంపిక చేస్తారు. ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్స్ పరీక్ష జరుగనుంది. విద్యార్థులు ఇందులో అర్హత సాధించడంతోపాటు ఇంటర్ మార్కుల ఆధారంగా టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలి. వారిని మే 25న జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అనుమతిస్తారు. ఈ పరీక్ష ఫలితాలు జూన్ 19న వెల్లడికానున్నాయి. ఆ తరువాతే విద్యా సంస్థల్లో ప్రవేశాలు చేపడతారు. రాష్ట్ర విభజనకు జూన్ 2ను ‘అపాయింటెడ్ డే’గా కేంద్రం ప్రకటించింది. ఈ లెక్కన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు, ప్రవేశాల ప్రక్రియ నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేర్వేరు రాష్ట్రాలుగా ఉంటాయి. ప్రస్తుత ఇంటర్‌బోర్డు పరిధిలో పరీక్షలు రాసే మొత్తం విద్యార్థులను పరిగణనలోకి తీసుకొని పర్సం టైల్ నిర్ణయిస్తారా? వేర్వేరు రాష్ట్రాలుగా పరిగణనలోకి తీసుకొని చేస్తారా? అనేదానిలో స్పష్టత లేదు. దీనిపై ఇంటర్ బోర్డు కార్యదర్శిని వివరణ కోరగా.. తాము ఫలితాల సీడీని మాత్రమే ఆయా విభాగాలకు అందజేస్తామని.. పర్సంటైల్ ఎలా నిర్ణయిస్తారనేది వారిష్టమేనని చెప్పారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు. 2 రాష్ట్రాలకు వేర్వేరుగా పర్సంటైల్ నిర్ణయిస్తేనే ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం ఉంటుం దని విద్యావేత్తలు, నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కలిపి పర్సంటైల్ నిర్ణయిస్తే.. కొంత మంది విద్యార్థులకు నష్టం తప్పకపోవచ్చని చెబుతున్నారు. ఈ అంశంలో సీబీఎస్ఈ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అలాగే ఇంటర్ బోర్డు విభజన విషయంలోనూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని వివరించారు.