ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఈనెల 22న నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష సమయంలో విద్యార్థులందరి బయోమెట్రిక్ డాటాను సేకరించేందుకు ఐఐటీ గౌహతి నిర్ణయించింది.
ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదు
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఈనెల 22న నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష సమయంలో విద్యార్థులందరి బయోమెట్రిక్ డాటాను సేకరించేందుకు ఐఐటీ గౌహతి నిర్ణయించింది. ఈనెల 22న ఉదయం 9 గంటలకు ప్రారంభం అయ్యే పేపరు-1 పరీక్షకు హాజరయ్యే వారు ఉదయం 7:30 గంటలకే పరీక్ష హాల్లో రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. ఇక మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అయ్యే పరీక్షకు హాజరయ్యే వారు మధ్యాహ్నం ఒంటిగంటకు పరీక్ష హాల్లో రిపోర్టు చేయాలని వెల్లడించింది.
పరీక్ష నిర్ణీత సమయానికి మించి ఆలస్యం అయితే పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వాచీలను కూడా పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని పేర్కొంది. ఫుల్ షర్ట్, కోట్స్ వేసుకొని వస్తే అనుమతించరని వెల్లడించింది. ఆఫ్ షర్టులు, కుర్తాలు, టీషర్ట్స్ మాత్రమే అనుమతిస్తారని వివరించింది. సాధారణ చెప్పులు మాత్రమే వేసుకురావాలని పేర్కొంది. క్యాల్కులేటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆర్నమెంట్స్ అనుమతించరని తెలిపింది. తమ వెబ్‌సైట్‌నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేలా లింకును అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.