నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష | JEE Advanced Exam from 04th June | Sakshi
Sakshi News home page

నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష

Published Sun, Jun 4 2023 5:28 AM | Last Updated on Sun, Jun 4 2023 9:24 AM

JEE Advanced Exam from 04th June - Sakshi

సాక్షి, అమరావతి: ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌–2023 ఆదివారం (నేడు) జరగనుంది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.9 లక్షల మంది అభ్య­ర్థులు హాజరుకానున్నారు. ఐఐటీ గౌహతి నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఇప్పటికే అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. ఉదయం, మ­ధ్యా­హ్నం రెండు సెషన్ల కింద పేపర్‌–1, పేపర్‌–2 పరీక్షలు జరుగుతాయి. కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్షలో అభ్యర్థులు రెండు పేపర్లను రాయాల్సి ఉంటుంది. ఉదయం సెషన్‌ ఉ.9 నుంచి మ.12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్‌ పరీక్ష మ.2.30 నుంచి 5.30 వరకు జరుగుతుంది. 

ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు..
2021లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 1.6 లక్షల మంది, 2022లో 1.7 లక్షల మంది రిజిస్టర్‌ కాగా.. ఈసారి మరో 20వేల మందికి పైగా అభ్యర్థుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా మహిళా అభ్యర్థుల సంఖ్య 25 శాతం వరకు పెరిగినట్లు ఐఐటీ గౌహతి విడుదల చేసిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. అత్యధికంగా ఏపీ, తెలంగాణల నుంచి అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.

ఈ రెండు రాష్ట్రాల నుంచే దాదాపు 50వేల మంది వరకు అభ్యర్థులు ఉండనున్నారు. హైదరాబాద్, విజయ­వాడ కేంద్రాలుగా అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. జేఈఈ మెయిన్‌కు గతంలో కన్నా ఈసారి అభ్యర్థుల సంఖ్య పెరగడంతో అదే స్థాయిలో అడ్వాన్స్‌డ్‌కు కూడా అభ్యర్థుల సంఖ్య పెరిగినట్లు అంచనా. మెయిన్‌ 2 సెషన్లలో కలిపి 11,13,325 మంది పరీక్ష రాశారు. ఇందులో కటాఫ్‌ మార్కులు సాధించిన వారిలో టాప్‌ 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పించారు. 

బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులుంటేనే..
ఇక ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే  జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకుతో పాటు అభ్యర్థులకు బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు తప్పని­సరిగా సాధించాలన్న నిబంధన ఉండేది. కరోనా కారణంగా ఇంటర్‌ పరీక్షలు సరిగా నిర్వహించని సమయంలో ఈ నిబంధన నుంచి రెండేళ్లుగా మినహాయింపునిచ్చారు. ఇప్పుడా పరిస్థితులు చక్కబడడంతో ఈసారి బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు సాధించడాన్ని మళ్లీ పునరు­ద్ధరించారు. అలాగే, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఆన్‌లైన్‌ మోడ్‌ (కంప్యూటర్‌ బేస్డ్‌)లో నిర్వహించనున్నారు.

ఉదయం పేపర్‌–1, మధ్యాహ్నం పేపర్‌–2 పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు రెండు పేపర్ల పరీక్షలూ రాయాల్సి ఉంటుంది. మరోవైపు.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2023 సిలబస్‌లో పలు మార్పులు చేశారు. అభ్యర్థులపై ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా బోర్డు పరీక్షల్లో ఉండే ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌లోని అంశాలను ఎక్కువగా పొందుపరిచారు. జేఈఈ మెయిన్‌లోనూ ఇవే అంశాలు ఉండగా కొంత లోతైన తీరులో అడ్వాన్స్‌డ్‌లో ప్రశ్నల సరళి ఉండనుంది.

ఈ విధానంవల్ల విద్యార్థులు అటు బోర్డు పరీక్షలు, ఇటు మెయిన్‌ పరీక్షలతో పాటు అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు ఒకేరకమైన సిలబస్‌ను అధ్యయనం చేయడం ద్వారా ఒత్తిడికి గురవ్వకుండా ఉండేలా ఈ సిలబస్‌లో మార్పులు చేశారు. ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఐఐటీ గౌహతి సంస్థ అడ్మిట్‌ కార్డులలో వివరంగా పొందుపరిచింది. మే 29న అడ్వాన్స్‌డ్‌ వెబ్‌సైట్లో అడ్మిట్‌ కార్డులను పొందుపరిచింది. ఈనెల 4వరకు వీటిని అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

‘ఒక్క నిమిషం’ నిబంధన అమలు
► అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయానికి ముందుగానే చేరుకోవా­లని నిర్వహణ సంస్థ సూచించింది. పరీక్ష కేంద్రంలోకి నిర్దేశించిన సమయం కన్నా ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను అనుమతించరు.
► అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్‌ కార్డు, అధికారిక ఫొటో ఐడీ కార్డును విధిగా తీసుకురావాలి. 
► అడ్మిట్‌కార్డు జిరాక్సు కాపీని ఇన్విజిలేటర్లకు అందించి ఒరిజినల్‌ కాపీని తమ వద్దనే భద్రపరచుకోవాలి.
► అభ్యర్థులు అడ్మిట్‌కార్డులో, అటెండెన్స్‌ షీటులో తమ వేలిముద్రను వేసేముందు వేలుని శుభ్రం చేసుకోవాలి.
► అభ్యర్థులకు తప్పనిసరిగా డ్రెస్‌కోడ్‌ కూడా అమలుచేయనున్నారు. షూలు ధరించి రాకూడదు. 
► అలాగే, పెద్ద బటన్‌లతోని వస్త్రాలను, ఫుల్‌స్లీవ్‌ వస్త్రాలను, బంగారపు ఆభరణాలను ధరించరాదు. 
► బాల్‌పాయింట్‌ పెన్నును వినియోగించాలి.
► పెన్సిల్, ఎరేజర్‌లను తెచ్చుకోవచ్చు. అలాగే, సాధారణమైన వాచీని ధరించవచ్చు. ఇతర డిజిటల్‌ వాచీలు,  పరికరాలను అనుమతించబోరు.
► అడ్మిట్‌కార్డులో నమోదు చేసిన పేరు, పుట్టిన తేదీ, జెండర్‌ వంటివి సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement