JEE Mains
-
భళా.. మనోజ్ఞ
సాక్షి, అమరావతి: జాతీయ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ సెషన్–1 బీఈ/బీటెక్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని గుత్తికొండ సాయి మనోజ్ఞ 100 పర్సంటైల్ స్కోరుతో అదరగొట్టింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం ఈ ఫలితాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 14 మంది విద్యార్థులు 100 స్కోర్ సాధించగా, వారిలో మనోజ్ఞ ఒక్కరే మహిళ కావడం విశేషం. రాజస్థాన్ నుంచి అత్యధికంగా ఐదుగురు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నుంచి ఇద్దరు చొప్పున, గుజరాత్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి ఒక్కొక్కరు 100 స్కోర్ సాధించారు. జనవరిలో ఐదు రోజులు నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్ వన్‌కు 13,11,544 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 12,58,136 (95.93శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 304 పట్టణాల్లోని 618 సెంటర్లలో పరీక్ష నిర్వహించినట్టు ఎన్టీఏ పేర్కొంది. ఇందులో దేశం వెలుపల 15 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపింది. 100 స్కోరు సాధించిన విద్యార్థుల్లో జనరల్ కేటగిరీ నుంచి 12 మంది టాపర్లుగా నిలిస్తే ఇందులో ఏపీకి చెందిన మనోజ్ఞ జనరల్ కేటగిరీతో పాటు మహిళల విభాగంలోనూ టాపర్‌గా నిలిచింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ 99.99 పర్సంటైల్‌తో టాపర్‌గా నిలిచాడు. ఓబీసీ విభాగంలో ఢిల్లీకి చెందిన దక్ష్ (100), ఎస్సీ విభాగంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రేయస్ లోహియా (100), ఎస్టీ విభాగంలో రాజస్థాన్‌కు చెందిన పార్థ్ (99.97), దివ్యాంగుల కోటాలో చత్తీస్‌గఢ్‌కు చెందిన అర్షల్ గుప్తా (99.95) టాపర్లుగా నిలిచారు. మాల్ ప్రాక్టీస్‌కు ప్రయత్నించిన 39 మంది విద్యార్థుల ఫలితాలను నిలిపివేసినట్లు ఎన్టీఏ తెలిపింది. ఏప్రిల్‌లో జరిగే రెండో సెషన్ పరీక్షల తర్వాత ఇప్పుడు విద్యార్థులు సాధించిన ఉత్తమ స్కోరును కూడా పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు విడుదల చేయనుంది. 300 మార్కులకు 295 కైవసం చేసుకున్న మనోజ్ఞ గుంటూరు ఎడ్యుకేషన్: జేఈఈ మెయిన్ సెషన్–1 పరీక్షల్లో గుంటూరుకి చెందిన గుత్తికొండ సాయి మనోజ్ఞ 300 మార్కులకు 295 మార్కులు సాధించి విశేష ప్రతిభ చూపించింది. 100 పర్సంటైల్‌తో అఖిల భారతస్థాయిలో టాపర్‌గా నిలిచింది. మేథమెటిక్స్‌లో 100, కెమిస్ట్రీలో 100, ఫిజిక్స్‌లో 95 మార్కులు సాధించింది. గుత్తికొండ కిషోర్ చౌదరి, పద్మజ కుమార్తె అయిన సాయి మనోజ్ఞ టెన్త్ ఐసీఎస్ఈ సిలబస్‌లో చదివి 600 మార్కులకు గానూ 588 సాధించింది. జూనియర్ ఇంటర్లో 470 మార్కులకు 466 కైవసం చేసుకుంది. తండ్రి కిషోర్ చౌదరి ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తుండగా, తల్లి పద్మజ ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మినిస్ట్రేటర్‌గా పని చేస్తున్నారు. ఏప్రిల్‌లో జరిగే జేఈఈ మెయిన్ రెండో సెషన్‌తో పాటు అడ్వాన్స్‌డ్‌కు మనోజ్ఞ సన్నద్ధమవుతోంది. అడ్వాన్స్‌డ్‌లో సాధించే ర్యాంకు ఆధారంగా ఐఐటీలో ఈసీఈ బ్రాంచ్‌లో చేరాలని భావిస్తోంది. గుంటూరు భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీలో అధ్యాపకులు ఇచ్చిన ప్రణాళికను అనుసరిస్తూ సమయపాలనతో సన్నద్ధం కావడం ద్వారా 100 పర్సంటైల్ సాధించినట్లు మనోజ్ఞ తెలిపింది. తెనాలి వివేక జూనియర్ కాలేజి విద్యార్థి తూనుగుంట్ల వెంకట పవన్‌కుమార్ జేఈఈ మెయిన్ (సెషన్–1)లో 99.37 పర్సెంటైల్‌ను సాధించాడు.100 స్కోర్ సాధించిన విద్యార్థులుఆయుష్ సింఘాల్ (రాజస్థాన్)కుషాగ్ర గుప్తా (కర్ణాటక) దక్ష్ (ఢిల్లీ) హర్ష్ ఝా (ఢిల్లీ) రజిత్ గుప్త (రాజస్థాన్) శ్రేయస్ లోహియా (ఉత్తర ప్రదేశ్) సాక్షం జిందాల్ (రాజస్థాన్) సౌరవ్ (ఉత్తర ప్రదేశ్) విషద్ జైన్ (మహారాష్ట్ర) అర్నవ్ సింగ్ (రాజస్థాన్) శివం వికాస్ తోహిని వాల్ (గుజరాత్) గుత్తికొండ సాయి మనోజ్ఞ (ఆంధ్రప్రదేశ్) ఓం ప్రకాష్ బహేరా (రాజస్థాన్) బని బ్రాతా మజీ (తెలంగాణ) -
ఈసారి ఇద్దరే!
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్)–2025 తొలి సెషన్ పరీక్షలో రాజస్తాన్‌కు చెందిన ఆయూస్ సింఘాల్ జాతీయ స్థాయిలో తొలి స్థానంలో నిలిచాడు. ఈ పరీక్షలో ఈసారి తెలుగు విద్యార్థులు పూర్తిగా వెనుకబడ్డారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో జాతీయ స్థాయిలో తొలి 14 స్థానాల్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మాత్రమే స్థానం సంపాదించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ 12వ స్థానంలో నిలవగా, తెలంగాణకు చెందిన బని బ్రాత మజీకి 14వ స్థానం దక్కింది. గత ఏడాది జేఈఈ మెయిన్‌లో తొలి 14 స్థానాల్లో 5, 6, 7, 8, 12, 13, 14 ర్యాంకులు తెలుగు విద్యార్థులు కైవసం చేసుకున్నారు. జేఈఈ మెయిన్–2025 తొలి సెషన్ పరీక్షలో కర్ణాటకకు చెందిన కుషార్గా గుప్తా ద్వితీయ స్థానం, ఢిల్లీకి చెందిన దక్ష, హరీస్ ఝా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. మొదటి 14 ర్యాంకుల్లో ఎక్కువగా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ విద్యార్థులే ఉన్నారు. ఇద్దరు తెలుగువారికే వంద పర్సంటైల్ఈసారి జేఈఈ మెయిన్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మాత్రమే వంద పర్సంటైల్ సాధించారు. 99 స్కోర్ జాబితాలో తెలుగు పేర్లే లేవు. జనవరి 22 నుంచి 28 వరకు జేఈఈ మెయిన్ –2025 తొలి సెషన్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 13,11,544 మంది రిజిస్టర్ చేసుకోగా, 12,58,136 (95.93 శాతం) మంది పరీక్ష రాశారు. జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ 99 స్కోర్‌తో టాపర్‌గా నిలిచారు. మహిళా విభాగంలో సాయి మనోజ్ఞ గుత్తికొండ టాపర్‌గా నిలిచారు. ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ జరుగుతాయి. రెండు విభాగాలను ప్రామాణికంగా తీసుకుని తుది ర్యాంకులు ప్రకటిస్తారు. -
31 నుంచి ఏప్రిల్ సెషన్ దరఖాస్తులు
సాక్షి, ఎడ్యుకేషన్: జేఈఈ–మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షలకు ఈ నెల 31 (శుక్రవారం) నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. విద్యార్థులు ఫిబ్రవరి 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 8 వరకు ప్రతి రోజు రెండు షిఫ్టులలో నిర్వహిస్తారు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటన విడుదల చేసింది. జనవరి సెషన్ బీటెక్ ప్రవేశ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. వీటికి సంబంధించి రెస్పాన్స్ షీట్, ‘కీ’లను ఫిబ్రవరి 1 లేదా 2వ తేదీన ఎన్టీఏ విడుదల చేసే అవకాశం ఉంది. సులభమైన ప్రశ్నలే.. బుధవారం నిర్వహించిన జేఈఈ మెయిన్ మొదటి షిఫ్ట్ పరీక్ష సులభంగా ఉందని విద్యార్థులు చెప్పారు. ఫిజిక్స్‌లో గడిచిన నాలుగు రోజుల్లో నిర్వహించిన పరీక్షల్లో అడిగిన ప్రశ్నలే ఎక్కువగా అడగడం గమనార్హం. ఈ సబ్జెక్ట్‌లో అధిక శాతం ప్రశ్నలు కాన్సెప్ట్‌లు, ఫార్ములా ఆధారితంగా ఉన్నాయి. ఎక్కువ ప్రశ్నలు ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం సిలబస్ నుంచే వచ్చాయి. మ్యాథమెటిక్స్ ఓ మాదిరి క్లిష్టతతో ఉందని, కెమిస్ట్రీ విభాగం సులభంగా ఉందని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. ఈ విభాగంలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్స్ ప్రశ్నలు సులభంగా ఉన్నాయి. రెండో షిఫ్ట్‌లో ఫిజిక్స్ క్లిష్టంగా న్యుమరికల్ ఆధారిత ప్రశ్నలతో ఉందని, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీలో డైరెక్ట్ ప్రశ్నలు అడిగారని విద్యార్థులు చెప్పారు. మార్కుల మధ్య వ్యత్యాసం జేఈఈ మెయిన్ జనవరి సెషన్ పరీక్షల్లో క్లిష్టత స్థాయిని బట్టి విద్యార్థులు పొందే మార్కుల్లో 35 నుంచి 60 మార్కుల వరకు వ్యత్యాసం ఉండొచ్చు. ఉదాహరణకు 2024లో క్లిష్టంగా ఉన్న పేపర్లో 176 మార్కులు వచ్చిన విద్యార్థికి 99 పర్సంటైల్ రాగా, ఓ మాదిరి క్లిష్టంగా ఉన్న పేపర్లో 224 మార్కులకు 99 పర్సంటైల్ వచ్చింది.దీంతో జనవరి సెషన్లో క్లిష్టమైన పేపర్స్ విషయంలో 170 నుంచి 150 మార్కులతో 99 పర్సంటైల్, ఓ మోస్తరు పేపర్లో 180–195 మార్కులతో 99 పర్సంటైల్ పొందే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు రెస్పాన్స్ షీట్స్, ‘కీ’లను చూసి ఆందోళన చెందవద్దు. మొత్తం పది షిఫ్ట్‌లలో 25, 29 తేదీల్లో షిఫ్ట్–1 పేపర్లు, 28వ తేదీ షిఫ్ట్–2 పేపర్లు కఠినంగా ఉన్నాయి. – ఎం.ఎన్.రావు, జేఈఈ శిక్షణ నిపుణుడు -
కొన్ని అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత
సాక్షి, ఎడ్యుకేషన్: జేఈఈ–మెయిన్ రెండో దఫా పరీక్షలు మంగళవారం మొదలయ్యాయి. రెండు షిఫ్ట్‌లలో పరీక్ష నిర్వహించగా.. మొదటి షిఫ్ట్ ప్రశ్నపత్రం ఓ మాదిరి క్లిష్టతతో ఉందని విద్యార్థులు, సబ్జెక్ట్ నిపుణులు చెప్పారు. గత పరీక్షల మాదిరిగానే.. రెండు షిఫ్ట్‌లలోనూ మ్యాథమెటిక్స్ క్లిష్టత స్థాయి ఓ మాదిరిగా ఉన్నప్పటికీ ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయి. కెమిస్ట్రీలో ప్రశ్నలు సులభంగానే ఉన్నాయి. ఫిజిక్స్ మాత్రం క్లిష్టంగా ఉంది. ఈ నెల 22, 23, 24 తేదీల్లో నిర్వహించిన పరీక్షలతో పోల్చితే మంగళవారం మొదటి షిఫ్ట్ కష్టంగా ఉందని అంటున్నారు. కొన్ని అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు చెబుతున్నారు. ఫిజిక్స్‌లో ఆప్టిక్స్ నుంచి 3 ప్రశ్నలు, ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీల నుంచి రెండు ప్రశ్నల చొప్పున అడిగారు.మ్యాథమెటిక్స్‌లో వెక్టార్స్..3డి, కానిక్స్ నుంచి మూడు ప్రశ్నల చొప్పున మాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, సిరీస్, డీఈఎఫ్ ఇంటిగ్రేషన్ల నుంచి రెండు ప్రశ్నల చొప్పున అడిగారు. కెమిస్ట్రీలో ఇనార్గానిక్ కెమిస్ట్రీ ప్రశ్నలు క్లిష్టంగా ఉండడమే కాకుండా ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే ప్రశ్నలు అడగడంతో బోర్డు పుస్తకాలకే పరిమితమైన విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. పిరియాడిక్ టేబుల్, బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీల నుంచి 3 ప్రశ్నల చొప్పున, అటామిక్ స్ట్రక్చర్, ఫినాల్ – ఈథర్–ఆల్కహాల్, కెమికల్ బాండింగ్‌ల నుంచి రెండు ప్రశ్నల చొప్పున అడిగారు. రెండో షిఫ్ట్‌లో కూడా మ్యాథమెటిక్స్ ఓ మాదిరిగా ఉన్నప్పటికీ.. సుదీర్ఘమైన ప్రశ్నలు, కాలిక్యులేషన్స్ అవసరమైన ప్రశ్నలు అడిగారు. కెమిస్ట్రీ సులభంగా, ఫిజిక్స్‌లో సులభం, ఓ మాదిరి క్లిష్టత గల ప్రశ్నలు ఉన్నాయి. రెండు షిఫ్టుల్లోనూ కొన్ని టాపిక్స్ నుంచే.. మొత్తంగా చూస్తే.. రెండు షిఫ్ట్‌లలోనూ కొన్ని టాపిక్స్ నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఈ క్రమంలో మ్యాథమెటిక్స్‌లో ఏరియాస్, మాట్రిసెస్ అండ్ డిటర్మినేషన్స్, కానిక్స్, వెక్టార్ అండ్ 3డి జామెట్రీ, కానిక్స్, ఇంటెగ్రల్ కాలక్యులస్‌కు ఎక్కువ వెయిటేజీ కనిపించింది. కెమిస్ట్రీలో కోఆర్డినేట్ కాంపౌండ్, అటామిక్ స్ట్రక్చర్, బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, కెమికల్ బాండింగ్ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. ఫిజిక్స్‌లో కరెంట్ ఎలక్ట్రిసిటీ, థర్మో డైనమిక్స్, ఆప్టిక్స్, ఫ్లూయిడ్ డైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అదే విధంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లలో కొన్ని ప్రశ్నలు కాసింత తికమక పెట్టేలా అడ్వాన్స్డ్ పరీక్ష స్థాయిలో ఉన్నాయని జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ నిపుణులు ఎం.ఎన్. రావు తెలిపారు. ఫిజిక్స్‌లో ఫార్ములా బేస్డ్గా డైరెక్ట్ కొశ్చన్స్ లేకపోవడం విద్యార్థులను కొంత ఇబ్బందికి గురి చేసిందని చెప్పారు. కాగా జాతీయ స్థాయిలో బీటెక్‌లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఈ పరీక్షలు బుధవారంతో ముగియనున్నాయి. -
మ్యాథ్స్‌లో కొంత క్లిష్టత ఫిజిక్స్ సులభం
సాక్షి, ఎడ్యుకేషన్: జేఈఈ–మెయిన్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రతిష్టాత్మక ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర టెక్నికల్ ఇన్స్టిట్యూట్లలో బీటెక్ చేసేందుకు, అదే విధంగా ఐఐటీల్లో బీటెక్‌లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు అర్హత పరీక్షగా ఎన్టీఏ ఏటా రెండుసార్లు దీనిని నిర్వహిస్తోంది. మొదటి దఫా పరీక్షకు జాతీయ స్థాయిలో 13.8 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో దాదాపు 2 లక్షల మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉంటారని అంచనా. 23, 24, 28, 29, 30 తేదీల్లో కూడా రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. 300 మార్కులకు పరీక్ష మూడు సబ్జెక్ట్‌లలో 300 మార్కులకు పరీక్ష నిర్వహించారు. మ్యాథమెటిక్స్ నుంచి 25, ఫిజిక్స్ నుంచి 25, కెమిస్ట్రీ నుంచి 25 ప్రశ్నలు చొప్పున మొత్తం 75 ప్రశ్నలతో ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున పరీక్ష నిర్వహించారు. కాగా ప్రశ్నల క్లిష్టత స్థాయి ఓ మోస్తరుగా ఉందని, ఎన్సీఈఆర్టీ పుస్తకాలు, గత ప్రశ్న పత్రాలు సాధన చేసిన వారికి కొంత మేలు కలిగించేదిగా ఉందని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. రెండు సెషన్లలోనూ మ్యాథమెటిక్స్ విభాగం ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నప్పటికీ.. ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండడంతో కొందరు విద్యార్థులకు జవాబులిచ్చేందుకు సమయం సరిపోలేదు. ఫిజిక్స్ విభాగం ప్రశ్నలు సులభంగా, కెమిస్ట్రీలో కొన్ని సులభంగా, కొన్ని ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 50 శాతం ప్రశ్నలు చాలా సులభంగా ఉండడం విద్యార్థులకు ఉపశమనం కలిగించింది. ఈ రెండు విభాగాల ప్రశ్నలకు అభ్యర్థులు 45 నిమిషాల చొప్పున సమయంలో జవాబులు ఇవ్వగలిగారు. అయితే మిగతా గంటన్నర సమయంలో మ్యాథమెటిక్స్‌లో 15 నుంచి 20 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వగలిగినట్లు పలువురు విద్యార్థులు తెలిపారు. ప్రశ్నలు చాలా సుదీర్ఘంగా ఉండడమే ఇందుకు కారణంగా సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే కెమిస్ట్రీ ప్రశ్నలు.తొలిరోజు రెండు సెషన్లలోనూ ప్రశ్నలు జేఈఈ–మెయిన్ గత ప్రశ్నపత్రాల నుంచే ఎక్కువగా అడిగారు. ముఖ్యంగా 2021, 2022 ప్రశ్నలకు సరిపోలే విధంగా చాలా ప్రశ్నలు ఉన్నట్లు నిపుణులు తెలిపారు. ఇక కెమిస్ట్రీలో అధిక శాతం ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే.. డైరెక్ట్ కొశ్చన్స్‌గా అడగడంతో ప్రాక్టీస్ చేసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 35 శాతం, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 35 శాతం, ఇన్–ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 30 శాతం ప్రశ్నలున్నాయి. కెమికల్ బాండింగ్, బయో మాలిక్యూల్స్, మోల్ కాన్సెప్ట్, కాటలిస్ట్సŠ, వేవ్ లెంగ్త్, ఎస్ఎంఆర్, పొటెన్షియల్ మీటర్, కెమికల్ ఈక్వేషన్ ఎనర్జీ, రేడియో యాక్టివ్ డికే, ఆర్గానిక్ కెమిస్ట్రీ (3 ప్రశ్నలు), కో ఆర్డినేట్ కాంపౌండ్, ఆక్సిడేషన్ స్టేట్ల నుంచి ప్రశ్నలు వచ్చాయి. ఫిజిక్స్, మ్యాథ్స్‌లో ఇలా.. ఫిజిక్స్‌లో థర్మోడైనమిక్స్, ప్రొజెక్టైల్ మోషన్, ఎలక్ట్రిక్ సర్క్యూట్, డయోడ్స్, ఈఎం వేవ్స్, మోడ్రన్ ఫిజిక్స్, రే ఆప్టిక్స్, సెమీ కండక్టర్స్, హీట్ ట్రాన్స్ఫర్, ఏసీ సర్క్యూట్, డైమెన్షనల్ ఫార్ములా, ఫోర్స్, మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా ఆఫ్ స్పియర్ నుంచి ప్రశ్నలు అడిగారు. మ్యాథ్స్‌లో స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, సింపుల్ ప్రాబ్లమ్, వెక్టార్, 3డి జామెట్రీ, షార్టెస్ట్ డిస్టెన్స్ ప్రాబ్లమ్, మాట్రిసెస్, డిటర్మినెంట్స్, బయనామియల్ థీమర్, ట్రిగ్నోమెట్రీ, క్వాడ్రాట్రిక్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్స్, సిరీస్, పారాబోలా, ఏరియా ఆఫ్ సర్కిల్, పెర్ముటేషన్, హైపర్ బోలా, డిఫరెన్షియల్ ఈక్వేషన్, సర్కిల్ ఇంటర్సెక్టింగ్ ప్రాబ్లమ్స్ అడిగారు. అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ అంచనా ఇలా.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే.. జనరల్ కేటగిరీలో 91–92 మార్కులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 79–80, ఓబీసీ కేటగిరీలో 77–78, ఎస్సీ కేటగిరీలో 56–58, ఎస్టీ కేటగిరీలో 42–44 మార్కులు కటాఫ్‌గా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. -
జేఈఈ మెయిన్ పరీక్ష కేంద్రాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 22 నుంచి జరిగే జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలకు సంబంధించిన పరీక్ష కేంద్రాల వివరాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం వెల్లడించింది. విద్యార్థులకు ఏ షిఫ్ట్, ఏ కేంద్రంలో, ఎన్ని గంటలకు పరీక్ష ఉంటుందనే వివరాలను వెబ్సైట్లో ఉంచింది. జేఈఈకి ఈ తరహా ముందస్తు సమాచారం ఇవ్వడం ఇదే మొదటిసారి. నోటిఫికేషన్ సమయంలో జేఈఈ పరీక్ష తేదీలను మాత్రమే ప్రకటించింది. తాజాగా పరీక్ష కేంద్రం వివరాలు తెలియజేయడంతో విద్యార్థులు ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేసుకునే వీలు కలిగింది. పరీక్ష కేంద్రం సమాచారం తెలుసుకునేందుకు జేఈఈ మెయిన్–2025 వెబ్సైట్లో లాగిన్ కావాలని శుక్రవారం ఒక ప్రకటనలో సూచించింది. జేఈఈ మెయిన్ తొలి విడతకు సంబంధించి పేపర్–1 పరీక్షలు 22 నుంచి 29 వరకు జరుగుతాయి. బీటెక్‌లో ప్రవేశాలకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 30వ తేదీన పేపర్–2ఎ (బీఆర్క్), పేపర్–2బీ (బీ ప్లానింగ్, బీఆర్క్ మరియు బీ ప్లానింగ్) పరీక్షలు ఉంటాయి. గత రెండేళ్ల మాదిరిగానే ఈసారి ప్రశ్నపత్రాల్లో రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ బీలో ఈసారి 5 ప్రశ్నలు ఇస్తారని ఎన్టీఏ తెలిపింది. గత మూడేళ్ల మాదిరి ఈసారి చాయిస్ ఉండదు. రెండు సెక్షన్లలో కూడా మైనస్ మార్కులు ఉంటాయి. సరైన సమాధానానికి 4 మార్కులు, తప్పుడు సమాధానానికి మైనస్ వన్ మార్కు ఉంటుంది. స్కో ర్ కోసం తొలుత గణితం, ఆ తర్వాత భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం విభాగంలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. -
జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా ఎన్ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ)మెయిన్స్ షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎనీ్టఏ) సోమవారం విడుదల చేసింది. 2025–26 విద్యా సంవత్సరానికి గాను రెండు సెషన్ల (జనవరి, ఏప్రిల్)లో జేఈఈ మెయిన్స్ నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఈ నెల 28 నుంచి నవంబర్ 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది.వచ్చే నెల 22వ తేదీ రాత్రి 11.50 గంటలల్లోగా ఫీజు చెల్లించేందుకు గడువుగా పేర్కొంది. జనవరి మొదటి వారంలో పరీక్ష కేంద్రాలను ప్రకటించనుంది. పరీక్ష తేదీకి మూడు రోజులు ముందుగా ఎన్టీఏ వెబ్సైట్లో అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతామని ఎన్టీఏ తెలిపింది. జనవరి 22 నుంచి 31వరకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు, మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రెండు షిఫ్టుల్లో కంప్యూటర్‌పై పరీక్షను నిర్వహించనున్నట్టు వివరించింది. ఫిబ్రవరి 12న తుది ఫలితాలు వెల్లడించనుంది. జేఈఈ మెయిన్స్‌ను 13 ప్రాంతీయ భాషల్లో చేపట్టనుంది. -
జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు
-
జేఈఈ మెయిన్స్‌లో తెలుగు తేజాలు
సాక్షి, హైదరాబాద్/జహీరాబాద్ టౌన్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన తొలి విడత ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్స్–1)లో తెలుగు విద్యార్థులు ఈ ఏడాది కూడా సత్తా చాటారు. ఫలితాలను ఎన్టీఏ మంగళవారం వెల్లడించింది. తెలంగాణకు చెందిన రిషి శేఖర్ శుక్లా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షేక్ సూరజ్ సహా పదిమంది వంద శాతం స్కోర్‌ను సాధించారు. వీరిలో తెలంగాణ విద్యార్థులు ఏడుగురు, ఏపీకి చెందిన ముగ్గురున్నారు. మొత్తమ్మీద టాప్–23లో పది మంది తెలుగు విద్యార్థులు చోటు దక్కించుకోవడం విశేషం. హరియాణాకు చెందిన ఆరవ్ భట్ దేశంలో టాపర్‌గా నిలిచారు. దేశవ్యాప్తంగా 291 నగరాల్లో 544 కేంద్రాల్లో జేఈఈ మెయిన్స్ పరీక్ష జనవరి 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరిగిన విషయం తెలిసిందే. తొలి విడత మెయిన్స్‌కు 12,21,624 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 11,70,048 మంది పరీక్షకు హాజరయ్యారు. తొలిదశలో కేవలం స్కోరు మాత్రమే ప్రకటించారు. రెండో దశ జేఈఈ మెయిన్స్ పరీక్షను ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. ఆ తరువాత ఫలితాలతో కలిపి రెండింటికి ర్యాంకులను ప్రకటిస్తారు. 300కు 300 మార్కులు జేఈఈ మెయిన్స్ 300 మార్కులకు 300 మార్కులు సాధించిన మొదటి 23 మంది వివరాలను ఎన్టీఏ వెల్లడించింది. 100 శాతం సాధించిన వారిలో తెలంగాణ విద్యార్థులు రిషి శేఖర్ శుక్లా, రోహన్ సాయి పబ్బా, ముత్తవరపు అనూప్, హందేకర్ విదిత్, వెంకట సాయితేజ మాదినేని, శ్రీయషాస్ మోహన్ కల్లూరి, తవ్వా దినేష్ రెడ్డి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి షేక్ సూరజ్, తోట సాయి కార్తీక్, అన్నారెడ్డి వెంకట తనిష్ రెడ్డి ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో తెలంగాణకు చెందిన శ్రీ సూర్యవర్మ దాట్ల, దొరిసాల శ్రీనివాసరెడ్డి 99.99 స్కోర్‌తో టాపర్లుగా నిలిచారు. పీడబ్ల్యూడీ కోటాలో తెలంగాణకు చెందిన చుంచుకల్ల శ్రీచరణ్ 99.98 స్కోర్‌తో టాపర్‌గా నిలిచారు. పురుషుల కేటగిరీలోనూ పదిమంది తెలుగు విద్యార్థులే టాపర్లుగా నిలిచారు. కష్టపడితే అసాధ్యమనేది ఉండదు: హందేకర్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని మల్చెల్మ గ్రామానికి చెందిన హందేకర్ అనిల్‌కుమార్ కుమారుడు హందేకర్ విదిత్ 300 మార్కులకు 300 మార్కులు సాధించాడు. జేఈఈ పరీక్ష కోసం రోజూ 15 గంటలపాటు ప్రణాళికాబద్దంగా చదివినట్లు విదిత్ చెప్పాడు. నమ్మకం, కష్టపడేతత్వం ఉంటే అసాధ్యమనేది ఉండదన్నాడు. -
నేటి నుంచి జేఈఈ మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశపరీక్ష జేఈఈ మెయిన్స్–2024 తొలి విడత దేశవ్యాప్తంగా బుధ వారం నుంచి మొదలవుతుంది. జాతీయ స్థాయిలో ఈ పరీక్షకు 12.3 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే అడ్మిట్ కార్డులు ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని పేర్కొంది. తొలి మూడు రోజులు బీఆర్క్ (పేపర్–1) నిర్వహిస్తారు. తర్వాత రోజుల్లో ఇంజనీరింగ్ విభాగానికి పరీక్ష ఉంటుంది. ఈసారి పరీక్ష కేంద్రాల వివరాలను ముందే వెల్లడించారు. దీంతో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకుంటే బాగుంటుందని ఎన్టీఏ సూచించింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మరో సెషన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష చేపడుతున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రానికి అనుమతించరు. ప్రతి కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశా రు. బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అనుసరిస్తు న్నారు. మధ్యలో బయటకు వెళ్లి వచ్చినా ఇది తప్పనిసరి. విద్యార్థులు ముందే డిజి లాకర్లో రిజి స్టర్ అవ్వాలి. ఈ సందర్భంగా ఎన్టీఏ విద్యార్థుల కోసం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ♦ ఎ–4 సైజ్‌లో అడ్మిట్ కార్డును కలర్లో డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్లో అంటించిన పాస్‌పోర్టు ఫొటో ఒకటి పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు, రేషనల్ కార్డు, ఆధార్, గుర్తింపు పొందిన విద్యాసంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డుతో పరీక్ష కేంద్రానికి వెళ్లాలి. గుర్తింపు కార్డు లేకుంటే కేంద్రంలోకి అనుమతించరు. దివ్యాంగులు విధిగా సంబంధిత అధికారి జారీ చేసిన పత్రాలను వెంట తెచ్చుకోవాలి. వీరికి అదనంగా 20 నిమిషాలు పరీక్ష రాసేందుకు కేటాయిస్తారు. ♦ మీడియం, సబ్జెక్టుతో కూడిన ప్రశ్నపత్రంలో తప్పులుంటే తక్షణమే ఇన్విజిలేటర్ దృష్టికి తేవా లి. బీఆర్క్ పరీక్ష రాసే వారు అవసరమైన జామె ట్రీ బాక్స్, పెన్సిల్స్, ఎరేజర్, కలర్ పెన్సిల్స్, క్రెయాన్స్‌ను సొంతంగా సమకూర్చుకోవాలి. ♦ ఎలాంటి టెక్ట్స్ మెటీరియల్, పెన్సిల్స్‌ను భద్ర పరిచే బాక్సులు, హ్యాండ్‌బ్యాగ్, పర్సు, తెల్ల పేపర్లు అనుమతించరు. సెల్ఫోన్లు, మైక్రో ఫోన్లు, ఇయర్ ఫోన్లు, క్యాలిక్యులేటర్, వాచీలను హాళ్లలోకి తీసుకెళ్లే వీల్లేదు. పరీక్ష గదిలో అవ సరమైన తెల్ల పేపర్‌ను కేంద్రం నిర్వహకులే అందజేస్తారు. దీనిపై అభ్యర్థి రోల్ నంబర్ వేయాలి. పరీక్ష పూర్తయిన తర్వాత దీన్ని చెత్త బుట్టలో పడేయాల్సి ఉంటుంది. డయాబెటిక్ సహా అత్యవసర వైద్యానికి వాడే మందులను వెంట తెచ్చుకొనేందుకు మాత్రం అనుమతి ఉంది. -
జేఈఈ మెయిన్స్‌కు సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్–1 పరీక్ష ఈ నెల 24 నుంచి ప్రారంభంకానుంది. ఫిబ్రవరి 1వ తేదీ వరకూ ఈ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. జేఈఈ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అన్ని ఏర్పాట్లు చేసినట్టు ప్రకటించింది. మొదటి మూడు రోజులు ఆర్కిటెక్చర్ (పేపర్–1) ఉంటుంది. ఈ పరీక్ష రాసే విద్యార్థులకు అడ్మిట్ కార్డులు ఇప్పటికే ఆన్లైన్లో ఉంచినట్టు ఎన్టీఏ తెలిపింది. జేఈఈ ఇంజనీరింగ్ విభాగానికి ఈ నెల 27 నుంచి పరీక్ష ఉంటుంది. ఈ విద్యార్థుల అడ్మిట్ కార్డులు 25 లోగా ఆన్లైన్లో ఉంచే అవకాశముంది. రెండు విభాగాలకు కలిపి దేశవ్యాప్తంగా ఈ ఏడాది 12 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2.4 లక్షల మంది పరీక్ష రాస్తారని సమాచారం. జేఈఈ మెయిన్స్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని, భద్రత కల్పిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. మొదటి షిప్టు ఉదయం 9 నుంచి, రెండో షిప్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉంటుంది. ప్రతీ సెషన్ మూడు గంటల వ్యవధితో ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించబోమని ఎన్టీఏ ప్రకటించింది. ఈసారి భద్రత వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ఫేషి యల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను అమలు చేస్తున్నారు. 11 కేంద్రాల్లో మెయిన్స్ తెలంగాణలో 11 కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వ హించనున్నట్టు ఎన్టీఏ తెలిపింది. హైదరాబా ద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబా ద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌తోపాటు ఏపీలోని 30 కేంద్రాల్లో పరీక్షలు ఉన్నట్టు అధికారులు వివరించారు. పరీక్షలు తెలుగు, ఇంగ్లిష్ సహా మొత్తం 10 భాషల్లో నిర్వహిస్తారు. రెండో దశ పరీక్షలు ఏప్రిల్ లో చేపడతారు. ఈసారి పరీక్ష కోసం సిలబస్ తగ్గించారు. కోవిడ్ సమయంలో కేంద్ర విద్యా సంస్థల్లో టెన్త్ రాసినవారు ప్రస్తుతం జేఈఈ మెయిన్స్ కు హాజరవుతున్నారు. ఆ సమయంలో వీళ్లకు సిలబస్ కుదించారు. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని 25% సిలబస్‌ను మెయిన్స్ నుంచి తొలగించారు. గణితంలో సుదీర్ఘ ప్రశ్నలను తొలగించారు. ఈ కారణంగా మెయిన్స్ రాసే వారి సంఖ్య పెరగుతోంది. నెగెటివ్ మార్కులతో జాగ్రత్త జేఈఈ మెయిన్స్‌లో నెగెటివ్ మార్కుల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నా రు. సమాధానం కచ్చితంగా రాస్తే 4 మార్కులు ఉంటాయి. తప్పుగా టిక్ పెడితే మైనస్–1 అవుతుంది. కాబట్టి తెలియని ప్రశ్నలకు ఊహించి రాసేకన్నా, వదిలేయడమే మంచిదని గణిత శాస్త్ర నిపుణులు ఎంఎన్ రావు తెలిపారు. కన్ఫ్యూజ్ చేసే ప్రశ్నల కోసం ముందే సమయం వృథా చేయకూడదని, వాటి గురించి ఆఖరులో ఆలోచించాలని ఆయన సూచించారు. అనవసర ప్రశ్నలకు తలబాదుకుంటూ కూర్చుంటే ఆ ప్రభావం తెలిసిన ప్రశ్నలపై పడే అవకాశం ఉంటుందని భౌతిక శాస్త్ర నిపుణుడు విక్రమ్ సింగ్ చెప్పారు. ముందుగానే జేఈఈ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకుని, అవసరమైన పత్రాలన్నీ (సెల్ఫ్ డిక్లరేషన్, అండర్ టేకింగ్ ఫాం) దగ్గర ఉంచుకోవాలని ఎన్టీఏ సూచించింది. వాటర్ బాటిల్స్, హ్యాండ్ శానిటైజర్లు, మాసు్కలు, బాల్ పాయింట్ పెన్నులను అనుమతిస్తామని తెలిపింది. -
ఇంకా ‘సెట్’ కాలేదు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి పరీక్షల (సెట్ల)పై ఇంకా కసరత్తు మొదలుకాలేదు. ఎంసెట్ సహా పాలిసెట్, ఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్ పరీక్షల షెడ్యూల్‌పై అయోమయం నెలకొంది. ఏ ప్రవేశపరీక్షను ఏ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించాలి? ఏ పరీక్షకు కన్వీనర్ ఎవరనే సందిగ్ధత కొనసాగుతోంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో నెలకొన్న గందరగోళమే దీనికి కారణమని.. దీంతో ఈసారి ప్రవేశపరీక్షల నిర్వహణ ఆలస్యం కావొచ్చని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే మొదలుకావాల్సి ఉన్నా.. ఏటా జనవరిలో ఎంసెట్ సహా ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. ఆయా పరీక్షలను నిర్వహించే యూనివర్సిటీలను, కన్వీనర్లను ఖరారు చేస్తారు. ఆ వెంటనే ఆయా కన్వీనర్లు, యూనివర్సిటీల ఆధ్వర్యంలో పరీక్షలకు సంబంధించిన కసరత్తు, ఏర్పాట్లు మొదలవుతాయి. కానీ ఈసారి జనవరి మూడోవారం ముగుస్తున్నా.. షెడ్యూల్ విడుదలకు సంబంధించిన ఎలాంటి కసరత్తు మొదలుకాలేదు. ఎంసెట్‌పై కసరత్తు ఏదీ? జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష అయిన జేఈఈ మెయిన్స్‌ను ఈ నెల 24 నుంచి నిర్వహిస్తున్నారు. ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం జూన్ నుంచి జోసా కౌన్సెలింగ్ చేపట్టేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సాధారణంగా జేఈఈ తేదీలకు అనుగుణంగా రాష్ట్ర ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలను ఖరారు చేస్తారు. షెడ్యూల్ ప్రకటన తర్వాత.. ఎంసెట్ జరిగి, ఫలితాలు వచ్చి, కౌన్సెలింగ్ మొదలయ్యే నాటికి విశ్వవిద్యాలయాలు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు చేసి.. అర్హత ఉన్నవాటికి అనుబంధ గుర్తింపు ఇస్తాయి. సాధారణంగా మేలో ఎంసెట్ నిర్వహించి, అదే నెలలో ఫలితాలు వెల్లడిస్తున్నారు. ఈసారి గందరగోళంతో ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలు కూడా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోందని విద్యావేత్తలు చెప్తున్నారు. హడావుడిగా జరిగితే ఇబ్బందులే.. సాధారణంగా ఉమ్మడి ప్రవేశపరీక్షల ప్రక్రియ ఏటా నవంబర్ నుంచే మొదలవుతుంది. వర్సిటీల వీసీలతో ఉన్నత విద్యా మండలి సమావేశం ఏర్పాటు చేసి.. సెట్స్‌కు కన్వీనర్లను ఎంపిక చేయాలి. వారు ప్రశ్నపత్రాల తయారీపై దృష్టి పెడతారు. ప్రశ్నల రూపకల్పనకు సంబంధించి నిపుణులను పిలిపిస్తారు. కంప్యూటర్ బేస్డ్గా దాదాపు పది రకాల ప్రశ్నపత్రాలను రూపొందిస్తారు. ఇందులో కఠినమైనవి, తేలికైనవి అత్యంత గోప్యంగా తయారు చేయాలి. తర్వాత వాటన్నింటినీ కలిపి కంప్యూటర్ సాయంతో ఫైనల్ పేపర్‌ను సిద్ధం చేస్తారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తారు. తర్వాత పరీక్ష కేంద్రాల ఎంపిక, ప్రశ్నపత్రాల సగటు పరిశీలన ఉంటాయి. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, ర్యాంకుల క్రోడీకరణకు ఎక్కువ సమయం పడుతుంది. పలు దఫాలుగా వీసీలు, ప్రొఫెసర్లు సమావేశాలు జరుపుతూ ఉంటే.. ఇవన్నీ సాఫీగా సాగుతాయి. ఈసారి ఇప్పటికీ విద్యా మండలి సమావేశమే జరగలేదు. ఆలస్యంగా ప్రక్రియ మొదలుపెట్టి హడావుడిగా చేస్తే.. ఎక్కడైనా లోపం జరిగితే.. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థుల సన్నద్ధతకూ ఇబ్బంది ఎంసెట్ ఆలస్యం వల్ల విద్యార్థుల సన్నద్ధతకు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు ఇబ్బంది రావొచ్చని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంసెట్ రాసే విద్యార్థుల్లో చాలా వరకు జేఈఈ మెయిన్స్‌కు కూడా సిద్ధమవుతారు. మెయిన్స్ రెండో దశ ఏప్రిల్‌లో జరుగుతుంది. అది పూర్తయ్యాక మేలో ఎంసెట్ రాస్తుంటారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎంసెట్ కోసం ప్రత్యేక కోచింగ్ తీసుకుంటారు. ఎంసెట్ ఆలస్యమైతే ఇబ్బందులు వస్తాయని, కోచింగ్ కేంద్రాల వారు అదనపు ఫీజులు వసూలు చేస్తారని విద్యార్థులు వాపోతున్నారు. ఎన్ఐటీల్లో సీట్ల కౌన్సెలింగ్ నాటికి ఎంసెట్ కౌన్సెలింగ్ మొదలవకపోతే.. కోరుకున్న కాలేజీలో సీట్లు వస్తాయా? రావా? అన్న ఆందోళన కూడా ఉంటుందని పేర్కొంటున్నారు. ఉన్నత విద్యా మండలిలో గందరగోళం! రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశపరీక్షలకు సంబంధించి డిసెంబర్లోనే యూనివర్సిటీల వీసీలతో ఉన్నత విద్యా మండలి అధికారులు సమావేశం కావాలని నిర్ణయించారు. తేదీ కూడా ఖరారు చేశారు. సెట్ కన్వీనర్ల ఎంపికకూ రంగం సిద్ధమైంది. ఈలోగా కొత్త ప్రభుత్వం మండలి చైర్మన్‌తోపాటు, వైస్ చైర్మన్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించడంతో.. వీసీలతో సమావేశం వాయిదా పడింది. అయితే ప్రభుత్వం కొత్తవారిని నియమించలేదు. తొలగిస్తున్నట్టు ప్రకటించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఇంకా అదే స్థానాల్లో కొనసాగుతున్నారు. ఉన్నత విద్యకు సంబంధించి సీఎం సమీక్షల్లో సరైన సమాచారం ఇవ్వడానికి మండలిలో ఎవరూ లేకపోవడంతో.. వారిని కొనసాగిస్తున్నట్టు ఉన్నతాధికారులు చెప్తున్నారు. వీరినే తిరిగి నియమించే అవకాశం ఉందనీ అంటున్నారు. సమావేశాలకు వీసీల విముఖత ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైస్ చైర్మన్లను తొలగించిన నేపథ్యంలో.. అధికారికంగా సమావేశాలు నిర్వహించేందుకు వీలుకావడం లేదని మండలి వర్గాలు చెప్తున్నాయి. దీనికితోడు ఉమ్మడి ప్రవేశపరీక్షలపై చర్చించేందుకు వెళ్లడానికి వర్సిటీల వీసీలూ సుముఖత వ్యక్తం చేయడం లేదని అంటున్నాయి. సెట్స్ కోసం కన్వీనర్లను సూచించాలని మండలి నుంచి లేఖలు వచ్చినా.. యూనివర్సిటీల వీసీలు నిర్లిప్తంగా ఉంటున్నారు. ‘‘ముందు చైర్మన్, వైస్ చైర్మన్లను కొనసాగిస్తారా? కొత్తవారిని తెస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేం సెట్స్ కన్వీనర్ల పేర్లు ఇచ్చినా.. కొత్త చైర్మన్ వస్తే మార్పులు ఉంటాయి..’’ అని ఓ వర్సిటీ వీసీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదరణ పెరుగుతున్నా..! కొన్నేళ్లుగా ఎంసెట్ రాసే వారి సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రస్థాయిలో సీట్లు ఎక్కువగా ఉండటం, ఉపాధి కోసం, విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లడానికి అవకాశం ఉండటంతో చాలా మంది ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. 2018లో 2.20 లక్షల మంది ఎంసెట్ రాస్తే.. 2023 నాటికి ఈ సంఖ్య 3 లక్షలు దాటింది. పరీక్ష రాసేవారి సంఖ్య ఏటా 20శాతం దాకా పెరుగుతోంది. నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశానికి కూడా ఎంసెట్ (మెడికల్ అండ్ అగ్రికల్చర్) తప్పనిసరి చేయడంతోనూ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఎంసెట్‌కు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య ఇదీ.. ఏడాది ఇంజనీరింగ్ అగ్రికల్చర్ 2018 1,47,912 73,078 2019 1,42,218 74,981 2020 1,43,326 78,981 2021 1,64,963 86,641 2022 1,61,552 88,156 2023 1,95,275 1,06,514 త్వరలో నిర్ణయం.. నా కొనసాగింపుపై ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇస్తుందని విశ్వసిస్తున్నాను. ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సకాలంలోనే నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నాం. ఆ దిశగా త్వరలో షెడ్యూల్ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ -
జేఈఈ వైపు విద్యార్థుల చూపు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 24 నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్ష మొదలవనుంది. ఫిబ్రవరి 1 వరకు ఇది కొనసాగుతుంది. పూర్తిగా కంప్యూటర్ ఆధారంగా జరిగే మెయిన్స్‌కు ఈ ఏడాది దరఖాస్తులు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా గత ఏడాది 11.62 లక్షల మంది దరఖాస్తు చేస్తే, ఈ ఏడాది (2024) 12.30 లక్షల మంది దరఖాస్తు చేశారు. 2022లో వచ్చిన దరఖాస్తులు 10.26 లక్షలే కావడం గమనార్హం. 2014 తర్వాత నుంచి మెయిన్స్ రాసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. క్లాసులు సరిగా జరగకపోవడం ఒక కారణమైతే, కోచింగ్ కేంద్రాలు లేకపోవడం మరో కారణం. అయితే, 2022 నుంచి పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. దీంతో మెయిన్స్‌కు పోటీ పెరిగింది. సిలబస్‌లో మార్పులూ కారణమే.. కొన్నేళ్లుగా జేఈఈ మెయిన్స్ అంటే విద్యార్థులు భయపడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మేథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు కష్టంగా ఉంటున్నాయి. గణితంలో ప్రశ్నలు సుదీర్ఘంగా ఉంటున్నాయి. ప్రిన్సిపుల్స్ ఆఫ్ మేథమెటికల్ ఇండక్షన్ అండ్ సింపుల్ అప్లికేషన్స్, మేథమెటికల్ రీజనింగ్, ప్లేన్ అండ్ డిఫరెంట్ ఫామ్స్‌తో మొత్తం 10 చాప్టర్స్‌లో ప్రశ్నలకు జవాబులు రాబట్టడానికి ఎక్కువ సమయం పడుతోంది. దీంతో ఇతర సబ్జెక్టుల్లో ప్రశ్నలకు జవాబులు రాసేందుకు సమయం తక్కువగా ఉండటంతో విద్యార్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. కెమిస్ట్రీ సులభంగా ఉన్నప్పటికీ మేథ్స్ సమయం తినేయడంతో ఇందులో సరిగా ఆన్సర్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని నిపుణులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దృష్టికి తెచ్చారు. దీంతో మేథ్స్‌లో పది చాప్టర్ల నుంచి ఈసారి ప్రశ్నలు ఇవ్వడం లేదు. ఇదే పరిస్థితి ఫిజిక్స్‌లోనూ ఉంది. 12 చాప్టర్ల నుంచి ప్రశ్నలివ్వడం మానేసినట్టు ఎన్టీఏ ప్రకటించింది. జియో స్టేషనరీ శాటిలైట్స్, డాప్లర్ ఎఫెక్ట్‌ఇన్ సౌండ్, కలర్ కోడ్ ఫర్ రెసిస్టర్స్ వంటి చాప్టర్లు ఇందులో ముఖ్యమైనవి. కెమిస్ట్రీలో కష్టంగా ఉన్న 9 చాప్టర్లను మినహాయించారు. పాలిమర్స్, స్టేట్ ఆఫ్ మ్యాటర్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ వంటి కీలకమైన చాప్టర్లున్నాయి. అదీగాక, తెలంగాణ, ఏపీ మినహా చాలా రాష్ట్రాల్లో స్థానిక ఎంసెట్ నిర్వహించడం లేదు. జేఈఈ ర్యాంకు ఆధారంగానే రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు కేటాయిస్తున్నారు. ఈ కారణంగా జేఈఈ రాయడం అనివార్యంగా మారింది. కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఈసారి జేఈఈ మెయిన్స్ నిర్వహణకు ఎన్టీఏ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థుల బయోమెట్రిక్‌ను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. విద్యార్థులు పరీక్ష మధ్యలో వాష్‌రూంకు వెళ్లి, తిరిగి వచ్చినా బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తున్నట్టు వెల్లడించింది. కొన్నేళ్లుగా సాంకేతిక సమస్యలు తలెత్తతున్న కేంద్రాలను గుర్తించి, ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఒకవేళ సాంకేతిక సమస్య వచ్చినా అప్పటికప్పుడు కంప్యూటర్ ఏర్పాటు చేసే యోచనలో అధికారులు ఉన్నారు. -
జేఈఈ మెయిన్స్‌కు దరఖాస్తు గడువు రేపే
సాక్షి, హైదరాబాద్: ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్రప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష(జేఈఈ మెయిన్స్)కు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 30వ తేదీతో ముగుస్తుంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 1వ తేదీన మొదలైంది. జేఈఈ మెయిన్స్ తొలివిడత పరీక్ష దేశవ్యాప్తంగా 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకూ జరుగుతుంది. రెండోవిడత ఏప్రిల్‌లో జరుగుతుంది. ఫిబ్రవరి 12న మెయిన్స్ ఫలితాలు వెల్లడిస్తారు. కోవిడ్‌కాలంలో ఎన్సీఈఆర్టీ, సీబీఎస్ఈ సిలబస్ తగ్గించారు. దీంతో ఈసారి కొన్ని టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఇవ్వడాన్ని మినహాయించినట్టు ఎన్టీఏ ప్రక టించింది. ఇందుకు సంబంధించిన సిలబస్‌నూ విడుదల చేసింది. మ్యాథ్స్‌లో కూడా సుదీర్ఘ జవాబులు రాబట్టే విధానానికి సడలింపు ఇచ్చారు. ఫలితంగా ఈసారి ఎక్కువమంది మెయిన్స్ రాసే వీలుందని అంచనా వేస్తున్నారు. -
లాజిక్ పసిగట్టు.. జేఈఈ ర్యాంక్ కొట్టు!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది విద్యార్థులకు జేఈఈ మెయిన్స్ అత్యంత కీలకమైంది. వచ్చే ఏడాది జనవరి, ఏప్రిల్‌లో ఈ పరీక్ష జరుగుతుంది. ఇందులో అర్హత కోసం ప్రతీ ఒక్కరూ ప్రయత్నిస్తారు. మెయిన్స్‌లో మంచి ర్యాంకు వ చ్చి, అడ్వాన్స్‌డ్‌లో రాకపోయినా ఆనందించే వాళ్లూ ఉంటారు. అయితే, జేఈఈలో విజయం సాధించడానికి కృషితో పాటు కొన్ని లాజికల్ అంశాలు తెలుసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. చాలామందికి ఏ ర్యాంకుతో ఎక్కడ, ఏ బ్రాంచీలో సీటు వస్తుందనే అవగాహన ఉండదు. మెయిన్స్ ర్యాంకుతో జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు లభిస్తాయి. ఈసారి మారిన సిలబస్ కొంత ఒత్తిడిని తగ్గించే వీలుంది. కాబట్టి మెయిన్స్ ర్యాంకుల పట్ల ఉన్న అపోహలు దూరం చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది విద్యార్థులు 10,000 లోపు ర్యాంకు ఉంటేనే ఎన్ఐటీల్లో సీట్లు వస్తాయని భావిస్తారు. దీంతో తుది దశ కౌన్సెలింగ్ వరకూ ఉండకుండా ఎంసెట్‌పై దృష్టి పెడతారు. ర్యాంకర్లు కూడా రాష్ట్ర కాలేజీల్లోని మేనేజ్మెంట్ కోటా సీట్లకు ప్రయత్నిస్తారు. కౌన్సెలింగ్ జిమ్మిక్కు పూర్తిగా అర్థమైతే తప్ప దీని నుంచి బయటపడటం కష్టం. అందుకే మెయిన్స్‌కు వెళ్లే విద్యార్థులు గత కొన్నేళ్ల ర్యాంకులు, సీట్ల వివరాలపై ముందే కొంత కసరత్తు చేయడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. కాలేజీ కూడా లక్ష్యం కావాలి..: మెయిన్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు ముందస్తు సన్నద్ధతను బట్టి ఓ అంచనాకు రావాలి. మూడేళ్ల కటాఫ్‌ను దృష్టిలో ఉంచుకుని ఏ ర్యాంకు వస్తుందో గుర్తించాలి. దీని ఆధారంగానే ఏయే కాలేజీల్లో ఎంత వరకూ సీట్లు వచ్చాయనేది తెలుసుకోవచ్చు. జాతీయ స్థాయిలో ఐఐటీల్లో 16,050 సీట్లు, ఎన్ఐటీల్లో 23,056 సీట్లు, ఐఐఐటీల్లో 5,643 సీట్లు, కేంద్ర ఆర్థిక సహకారంతో నడిచే సంస్థల్లో 5,620... వెరసి 50,369 సీట్లు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నాయి. అడ్వాన్స్‌డ్‌తో భర్తీ చేసే 16,050 ఐఐటీ సీట్లను పక్కనబెడితే మిగిలిన 34,319 సీట్లను జేఈఈ మెయిన్స్ ర్యాంకు ద్వారానే భర్తీ చేస్తారు. కొన్నేళ్లుగా సీట్ల కేటాయింపును పరిశీలిస్తే, వరంగల్ నిట్‌లో సీఎస్ఈకి అబ్బాయిలకు 3,089 ర్యాంకు, అమ్మాయిలకు 3,971 వరకూ సీటు వస్తుంటే, ఏపీలో అబ్బాయిలకు 14,000 ర్యాంకు, అమ్మాయిలకు 28,000 ర్యాంకు వరకు సీటు వస్తోంది. ఒబీసీలకు వరంగల్‌లో గరిష్టంగా 13,000 వరకూ, ఏపీలో 33,000 ర్యాంకు వరకూ సీట్లు వస్తున్నాయి. ఎస్సీ కేటగిరీకి గరిష్టంగా 97,139 వరకూ, ఎస్టీలకు 48,000 ర్యాంకు వరకూ సీట్లు దక్కాయి. సిలబస్ మారడంతో ఈసారి కొంత పోటీ ఉండొచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ర్యాంకు, కాలేజీని టార్గెట్‌గా పెట్టుకోవాలన్నది జేఈఈ అధ్యాపకుల సూచన. బ్రాంచే టార్గెట్ అనుకుంటే... చాలామంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ బ్రాంచీ కోసం ఎదురు చూస్తారు. అందుకే ఓపెన్ కేటగిరీలో ఈ బ్రాంచీ సీట్లకు పోటీ ఉంటుంది. ఒకవేళ బ్రాంచీనే లక్ష్యమైతే ఫలానా కాలేజీలో కావాలనే టార్గెట్ పెట్టుకోకూడదు. కొన్ని ఎన్ఐటీల్లో ఓపెన్ కేటగిరీకి కూడా 40,000 ర్యాంకు వ చ్చినా సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. ఇవేంటో విద్యార్థులు తెలుసుకోవాలి. మెకానికల్ డివిజన్లో ఓపెన్ కేటగిరీలోనే వరంగల్ నిట్‌లో 17,000 వరకూ, ఏపీలో 75,000 వరకూ ర్యాంకులకు సీటొచ్చే వీలుంది. రిజర్వేషన్ విభాగంలో ఏకంగా 2,96,201 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. తిరు చ్చి, సూరత్కల్, క్యాలికట్, నాగపూర్ వంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఐటీల్లో ఓపెన్ కేటగిరీ విద్యార్థులు కూడా జేఈఈ ర్యాంకు గరిష్టంగా 50,000 దాటినా సీటు సంపాదించిన ఉదంతాలున్నాయి. కాబట్టి కోరుకున్న బ్రాంచీ, ఏ కాలేజీలో వస్తుందనే కసరత్తు చేయడం ముఖ్యం. ఈ లాజిక్ తెలిస్తే ప్రిపరేషన్ అందుకు తగ్గట్టుగా ఉండే వీలుందని నిపుణులు అంటున్నారు. -
మార్పుతో మేలు జరిగేనా?
సాక్షి, హైదరాబాద్: ఈసారి జరిగే జేఈఈ మెయిన్స్‌లో గణనీయమైన మార్పులు తెచ్చారు. ఫిజిక్స్, మేథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కొన్ని టాపిక్స్ ఎత్తేశారు. ఈ పరిణామంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జనవరిలో జరిగే జేఈఈ మెయిన్స్‌కు ఇప్పటికే విద్యార్థులు సన్నద్ధమయ్యారు. ఈ దశలో సిలబస్ మార్పులను ఎన్టీఏ ప్రకటించడంతో ఇది రాష్ట్ర విద్యార్థులపై కొంత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే సిలబస్ నుంచి తొలగించిన టాపిక్స్‌కు కూడా విద్యార్థులు ప్రిపేరయ్యారు. ఇప్పుడు వాటిని తప్పించడంతో మిగిలిన టాపిక్స్‌లో పోటీ తీవ్రంగా ఉండే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర సిలబస్‌తో ఇంటర్ చేసే వాళ్లు మరికొంత శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందని... అలాగే వారంతా ఏప్రిల్‌లో జరిగే రెండో దశ మెయిన్స్‌కు హాజరు కావడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగేనా? సిలబస్ తగ్గించడంతో ఈసారి మెయిన్స్ రాసేవారి సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో కటాఫ్ మార్కుల విషయంలోనూ కొన్ని మార్పులు ఉండొచ్చని చెబుతున్నారు. వాస్తవానికి జేఈఈ రాసేవారి సంఖ్య కొన్నేళ్లుగా తగ్గుతోంది. 2014లో దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ రాసినవారి సంఖ్య 12.90 లక్షలుకాగా 2022లో ఈ సంఖ్య 9.05 లక్షలకు తగ్గింది. వాస్తవానికి రాష్ట్రం నుంచి 2014లో జేఈఈ రాసిన వారి సంఖ్య 2 లక్షల వరకూ ఉండగా ప్రస్తుతం 1.30 లక్షలకు పడిపోయింది. అదే సమయంలో రాష్ట్ర ఎంసెట్ రాసేవారి సంఖ్య 2018లో 1.47 లక్షలు ఉండగా 2022లో ఇది 1.61 లక్షలకు పెరిగింది. రాష్ట్ర ఎంసెట్ ద్వారా విద్యార్థులు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందుతారు. జేఈఈ మెయిన్స్ ద్వారా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో, అడ్వాన్స్డ్ ద్వారా ఐఐటీల్లో సీట్లు దక్కించుకుంటారు. సిలబస్ కఠినంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనుసరించే సిలబస్ చదివితే తప్ప మెయిన్స్ గట్టెక్కలేమనే భావన విద్యార్థుల్లో ఎక్కువవుతోంది. దీంతో చాలా మంది రాష్ట్ర స్థాయిలోని ఎంసెట్‌ను ఎంచుకుంటున్నారు. సిలబస్‌లో మార్పులు తేవడంతో ఈసారి జేఈఈ రాసే వారి సంఖ్య కొంతమేర పెరిగే వీలుందని విద్యారంగ నిపుణులు అంటున్నారు. మేథ్స్ ఇక కఠినం కానట్టేనా? కొన్నేళ్లుగా జేఈఈ మెయిన్స్ రాస్తున్న వారు ఎక్కువగా గణితం కష్టంగా ఉందని చెబుతున్నారు. కెమిస్ట్రీ నుంచి ఎక్కువగా స్కోర్ చేస్తున్న అనుభవాలున్నాయి. ఫిజిక్స్ నుంచి వచ్చే ప్రశ్నలు మధ్యస్తంగా ఉంటున్నాయని చెబుతున్నారు. ఇది దక్షిణాది విద్యార్థులకన్నా ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులను కలవరపెడుతోంది. మేథ్స్‌లో దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు పట్టు ఉంటోంది. కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు సరైన శిక్షణ అందుకోలేకపోతున్నారు. జేఈఈలో ఇచ్చే గణితంలో సుదీర్ఘ ప్రశ్నలుంటున్నాయి. దీనివల్ల ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందని చెబుతున్నారు. మేథ్స్‌లో ట్రిగ్నామెట్రిక్ ఈకే్వ షన్స్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్, ప్రిన్సిపుల్ ఆఫ్ మేథమెటికల్ ఇండక్షన్ వంటి టాపిక్స్ వచ్చే అవకాశం లేదని ఎన్టీఏ తెలిపింది. దీనివల్ల తేలికగానే జేఈఈ మెయిన్స్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. -
జేఈఈ మెయిన్స్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. గురువారం ఉదయం నుంచి మొదలైన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 30వ తేదీ వరకూ కొనసాగుతుంది. పరీక్ష కేంద్రాలను జనవరి రెండో వారంలో వెల్లడిస్తామని ఎన్టీఏ తెలిపింది. అభ్యర్థుల హాల్ టికెట్లు పరీక్షకు మూడు రోజుల ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ప్రవేశానికి రెండు దశల ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిలో 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పిస్తారు. అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకును బట్టి ఐఐటీల్లో సీట్లు వస్తాయి. మిగతా జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో జేఈఈ మెయిన్స్ ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. తొలి దశ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకూ ఉంటుంది. రెండో దశ ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. అభ్యర్థులు ఏ సెషన్‌కైనా, లేదా రెండింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష పలితాలను ఫిబ్రవరి 12వ తేదీన వెల్లడిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. తెలుగు సహా మొత్తం 13 భాషల్లో జేఈఈ మెయిన్స్ ఉంటుంది. ప్రతీ సబ్జెక్టులోనూ 10 టాపిక్స్, ఫిజిక్స్‌లో 12 టాపిక్స్ తీసివేత కోవిడ్ సమయంలో ఎన్సీఈఆర్టీ, సీబీఎస్ఈ సిలబస్‌ను కుదించారు. దీంతో కొన్ని టాపిక్స్‌లో బోధన జరగలేదు. ఇది దృష్టిలో ఉంచుకుని జేఈఈ మెయిన్స్ సిలబస్‌లోనూ ఈసారి భారీ మార్పులు చేశారు. మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌ల్లో పది చొప్పున, ఫిజిక్స్‌లో 12 చొప్పున టాపిక్స్‌ను జేఈఈ మెయిన్స్‌లో ఇవ్వకూడదని నిర్ణయించారు. జేఈఈ పరీక్ష కఠినంగా ఉంటోందనే సంకేతాలు రావడంతో ఈసారి పరీక్ష పేపర్ కూర్పులోనూ మార్పులు చేశారు. ముఖ్యంగా గణితంలో సుదీర్ఘ పద్ధతిలో సమాధానాలు రాబట్టే ప్రశ్నల నుంచి కొంత వెసులుబాటు ఇచ్చారు. మాథ్స్‌లో కఠినంగా భావిస్తున్న ట్రిగా్నమెట్రిక్స్ ఈక్వేషన్స్, మేథమెటికల్ రీజనింగ్‌ను తొలగించారు. దీనివల్ల సమాధానాలు రాబట్టేందుకు సమయం కలిసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. -
జేఈఈ మెయిన్స్ తేదీలు ఖరారు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలు, ట్రిపుల్ ఐటీ ల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్ష తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ కాలంలో 4 దఫాలుగా నిర్వహించిన ఈ పరీక్షను 2024– 25లో మాత్రం రెండు విడతలుగానే నిర్వహిస్తున్నట్టు తెలిపింది. తొలి విడతను 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ మధ్య చేపట్టాలని నిర్ణయించింది. రెండో దఫా జేఈఈ మెయిన్స్ ను ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ మధ్య నిర్వహించబోతున్నట్టు వెల్లడించింది. దీంతో పాటే మే 5న నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్–యూజీ), మే 15–31 తేదీల మధ్య కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ), మార్చి 11–28 మధ్య సీయూఈటీ–పీజీ, జూన్ 10–21 మధ్య యూజీసీ–నెట్ పరీక్షలను నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేసింది. ఈ పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారంగానే ఉంటాయని పేర్కొంది. అయితే, సమగ్ర వివరాలతో కూడిన షెడ్యూల్‌ను ఎన్టీఏ విడుదల చేయాల్సి ఉంది. 2021 నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్ష కోవిడ్ కారణంగా ఆలస్యమవుతూ వస్తోంది. గత ఏడాది మాత్రం జనవరి, ఏప్రిల్ నెలల్లోనే నిర్వహించారు. అయితే, తేదీల ఖరారులో మాత్రం ఆలస్యమైంది. ఈ సంవత్సరం కోవిడ్ కన్నా ముందు మాదిరిగానే మూడు నెలల ముందే తేదీలను వెల్లడించారు. మెయిన్స్ దరఖాస్తులు పెరిగేనా? కోవిడ్ తర్వాత దేశవ్యాప్తంగా జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల వైపు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో జేఈఈ మెయిన్స్ రాసే వారి సంఖ్య ప్రతీ సంవత్సరం తగ్గుతోంది. ఈ స్థానంలో రాష్ట్ర ఎంసెట్‌కు దరఖాస్తులు పెరుగుతున్నాయి. 2014లో జేఈఈ మెయిన్స్ రాసినవారి సంఖ్య 12.90 లక్షలుంటే, 2022లో ఈ సంఖ్య 9.05 లక్షలకు తగ్గింది. 2023లో మాత్రం ఈ సంఖ్య 11 లక్షలకు పెరిగింది. కోవిడ్ సమయంలో టెన్త్ పరీక్షలు లేకుండా ఉత్తీర్ణులైన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా దీనికి కారణంగా చెబుతున్నారు. వాస్తవానికి మన రాష్ట్రం నుంచి 2014లో జేఈఈ రాసిన వారి సంఖ్య 2 లక్షల వరకూ ఉంటే, ఇప్పుడు 1.30 లక్షలకు పడిపోయింది. రాష్ట్రంలో ఎంసెట్ రాసేవారి సంఖ్య 2018లో 1.47 లక్షలుంటే, 2022లో ఇది 1.61 లక్షలకు పెరిగింది. కాగా, గత రెండేళ్లుగా రాష్ట్రంలో హాస్టళ్లు పూర్తిస్థాయిలో తెరుచుకోవడం, జేఈఈపై దృష్టి పెడుతున్న వారి సంఖ్య పెరగడంతో ఈ సంవత్సరం కూడా జేఈఈ రాసే వారి సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
జేఈఈ రాకున్నా... ఐఐటీ చదువు
సాధారణంగా దేశంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో చదవాలంటే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు కొట్టాల్సిందే. కానీ ఇక మీదట సాదాసీదా డిగ్రీ విద్యార్థులు కూడా ఐఐటీల్లో కోర్సులు పూర్తి చేయవచ్చు. జాతీయ స్థాయిలో ఈ తరహా కసరత్తు వేగంగా ముందుకెళ్తోంది. కోవిడ్ కాలంలో మొదలైన ఈ ఆలోచన ఇప్పుడు అనేక రూపాల్లో విద్యార్థులకు అందుబాటులోకి వస్తోంది. దేశంలో ఏటా లక్షల మంది ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులు చేస్తున్నారు. జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్న సీట్లు 50 వేల లోపే. అందులోనూ ఐఐటీల్లో ఉన్నవి 16 వేలు మాత్రమే. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండే ఐఐటీల్లో ఏ కోర్సు చేసినా మంచి గుర్తింపు ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్లో అవసరమైన కొన్ని కోర్సులను ఐఐటీల ద్వారా సర్టిఫికేట్ కోర్సులుగా అందించాలని ఐఐటీలు కార్యాచరణ సిద్ధం చేశాయి. – సాక్షి, హైదరాబాద్ కోవిడ్ కాలంలో.. కోవిడ్ సమయంలో విద్యార్థులు ఆన్లైన్ విద్యకు అలవాటు పడ్డారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కోర్సులను డిజైన్ చేసినట్లు ఐఐటీలు చెబుతున్నాయి. విద్యార్థులు కూడా ఈ కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని మద్రాస్ ఐఐటీ ఇటీవల తెలిపింది. ఈ సంస్థ ప్రతినిధులు వివిధ రాష్ట్రాలోని కాలేజీలకు వెళ్లి ఆన్లైన్ కోర్సుల ప్రాధాన్యతను వివరించారు. మిగతా ఐఐటీలు సరికొత్త సర్టిఫికెట్ కోర్సులను తెరపైకి తెచ్చాయి. ఇవీ కోర్సులు.. ఎంటెక్‌లో ఆన్లైన్ కోర్సులకు ఐఐటీ హైదరాబాద్ గతేడాది సమగ్ర ప్రణాళిక రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెరి్నంగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి మార్కెట్ డిమాండ్ కోర్సులను ఈ ఏడాది తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. మరికొన్ని ఐఐటీలు ఈ సంవత్సరం నుంచి మార్కెట్ వర్గాల డిమాండ్‌కు అనుగుణంగా ఎంటెక్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కోర్సులను తీసుకొస్తున్నాయి. 2020లో ఐఐటీ మద్రాస్ బీఎస్సీ డేటా సైన్స్ ప్రారంభించింది. ఇప్పటికే ఈ కోర్సులో 18 వేల మంది చేరినట్లు ఆ సంస్థ తెలిపింది. నాలుగేళ్ల బీఎస్సీ ఎల్రక్టానిక్స్ కోర్సును ఆన్లైన్ ద్వారా అందించేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. ఐఐటీ బాంబే డిజిటల్ మార్కెటింగ్ అండ్ అప్లైడ్ అనలిటిక్స్, డిజైన్ థింకింగ్, మెషీన్ లెరి్నంగ్ అండ్ ఏఐ విత్ పైథాన్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ అందిస్తున్నట్లు ప్రకటించింది. పట్నా ఐఐటీ ఎంటెక్ ఇన్ బిగ్ డేటా అండ్ బ్లాక్‌చైన్, ఎంటెక్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కోర్సులను మరింత ఆధునీకరిస్తూ అందిస్తోంది. అయితే వాటిని ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు అందించాలని నిర్ణయించింది. ఢిల్లీ ఐఐటీ కూడా జాతీయ, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న సర్టిఫికెట్ కోర్సులను అందించనుంది. ఇందులో సేల్స్ అండ్ మార్కెటింగ్, ప్రాజెక్టు మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, డేటా సైన్స్, మెషీన్ లెరి్నంగ్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఇన్ స్టార్టప్ బూట్‌క్యాంప్, న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్, డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ కోర్సులున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సులువు.. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎప్పటికప్పుడూ నైపుణ్యానికి పదును పెట్టాల్సిందే. ఇలాంటి మళ్లీ వారు కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అంతర్జాతీయ ప్రమాణాలున్న ఐఐటీ సంస్థల్లో సర్టిఫికెట్ కోర్సులు చేయవచ్చు. ఐఐటీ ద్వారా సర్టిఫికెట్ కోర్సు చేస్తే మంచి ఫ్యాకల్టీ ద్వారా పాఠాలు వినడమే కాకుండా ఆ సంస్థలు ఇచ్చే సర్టిఫికెట్లకు విలువ ఉంటుంది. మరింత మెరుగైన ఉపాధికి ఆస్కారం ఉండే వీలుంది. ట్రెండ్ మంచిదే... అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఆన్లైన్ కోర్సులు అందిస్తున్నాయి. ఇదే బాటలో ఐఐటీలు మంచి కోర్సులు ఆఫర్ చేయడం మంచిదే. అయితే ఇవి కేవలం సర్టిఫికెట్ల జారీకే పరిమితం కాకూడదు. కోర్సు నేర్చుకొనే విద్యార్థులు నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటేనే అంతర్జాతీయంగా మంచి ఉద్యోగాలు పొందడానికి వీలుంటుంది. –ప్రొ.శ్రీరాం వెంకటేష్ (ఓయూ ఇంజనీరింగ్ విభాగం ప్రిన్సిపల్) -
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
సాక్షి, అమరావతి: ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్–2023 ఆదివారం (నేడు) జరగనుంది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.9 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఐఐటీ గౌహతి నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఇప్పటికే అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్ల కింద పేపర్–1, పేపర్–2 పరీక్షలు జరుగుతాయి. కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్షలో అభ్యర్థులు రెండు పేపర్లను రాయాల్సి ఉంటుంది. ఉదయం సెషన్ ఉ.9 నుంచి మ.12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ పరీక్ష మ.2.30 నుంచి 5.30 వరకు జరుగుతుంది. ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు.. 2021లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 1.6 లక్షల మంది, 2022లో 1.7 లక్షల మంది రిజిస్టర్ కాగా.. ఈసారి మరో 20వేల మందికి పైగా అభ్యర్థుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా మహిళా అభ్యర్థుల సంఖ్య 25 శాతం వరకు పెరిగినట్లు ఐఐటీ గౌహతి విడుదల చేసిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. అత్యధికంగా ఏపీ, తెలంగాణల నుంచి అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ రెండు రాష్ట్రాల నుంచే దాదాపు 50వేల మంది వరకు అభ్యర్థులు ఉండనున్నారు. హైదరాబాద్, విజయవాడ కేంద్రాలుగా అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. జేఈఈ మెయిన్‌కు గతంలో కన్నా ఈసారి అభ్యర్థుల సంఖ్య పెరగడంతో అదే స్థాయిలో అడ్వాన్స్‌డ్‌కు కూడా అభ్యర్థుల సంఖ్య పెరిగినట్లు అంచనా. మెయిన్ 2 సెషన్లలో కలిపి 11,13,325 మంది పరీక్ష రాశారు. ఇందులో కటాఫ్ మార్కులు సాధించిన వారిలో టాప్ 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పించారు. బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులుంటేనే.. ఇక ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకుతో పాటు అభ్యర్థులకు బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు తప్పనిసరిగా సాధించాలన్న నిబంధన ఉండేది. కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు సరిగా నిర్వహించని సమయంలో ఈ నిబంధన నుంచి రెండేళ్లుగా మినహాయింపునిచ్చారు. ఇప్పుడా పరిస్థితులు చక్కబడడంతో ఈసారి బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు సాధించడాన్ని మళ్లీ పునరుద్ధరించారు. అలాగే, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఆన్లైన్ మోడ్ (కంప్యూటర్ బేస్డ్)లో నిర్వహించనున్నారు. ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు రెండు పేపర్ల పరీక్షలూ రాయాల్సి ఉంటుంది. మరోవైపు.. జేఈఈ అడ్వాన్స్డ్–2023 సిలబస్‌లో పలు మార్పులు చేశారు. అభ్యర్థులపై ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా బోర్డు పరీక్షల్లో ఉండే ఎన్సీఈఆర్టీ సిలబస్‌లోని అంశాలను ఎక్కువగా పొందుపరిచారు. జేఈఈ మెయిన్‌లోనూ ఇవే అంశాలు ఉండగా కొంత లోతైన తీరులో అడ్వాన్స్‌డ్‌లో ప్రశ్నల సరళి ఉండనుంది. ఈ విధానంవల్ల విద్యార్థులు అటు బోర్డు పరీక్షలు, ఇటు మెయిన్ పరీక్షలతో పాటు అడ్వాన్స్డ్ పరీక్షలకు ఒకేరకమైన సిలబస్‌ను అధ్యయనం చేయడం ద్వారా ఒత్తిడికి గురవ్వకుండా ఉండేలా ఈ సిలబస్‌లో మార్పులు చేశారు. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఐఐటీ గౌహతి సంస్థ అడ్మిట్ కార్డులలో వివరంగా పొందుపరిచింది. మే 29న అడ్వాన్స్డ్ వెబ్సైట్లో అడ్మిట్ కార్డులను పొందుపరిచింది. ఈనెల 4వరకు వీటిని అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ‘ఒక్క నిమిషం’ నిబంధన అమలు ► అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయానికి ముందుగానే చేరుకోవాలని నిర్వహణ సంస్థ సూచించింది. పరీక్ష కేంద్రంలోకి నిర్దేశించిన సమయం కన్నా ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను అనుమతించరు. ► అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డు, అధికారిక ఫొటో ఐడీ కార్డును విధిగా తీసుకురావాలి. ► అడ్మిట్‌కార్డు జిరాక్సు కాపీని ఇన్విజిలేటర్లకు అందించి ఒరిజినల్ కాపీని తమ వద్దనే భద్రపరచుకోవాలి. ► అభ్యర్థులు అడ్మిట్‌కార్డులో, అటెండెన్స్ షీటులో తమ వేలిముద్రను వేసేముందు వేలుని శుభ్రం చేసుకోవాలి. ► అభ్యర్థులకు తప్పనిసరిగా డ్రెస్‌కోడ్ కూడా అమలుచేయనున్నారు. షూలు ధరించి రాకూడదు. ► అలాగే, పెద్ద బటన్‌లతోని వస్త్రాలను, ఫుల్‌స్లీవ్ వస్త్రాలను, బంగారపు ఆభరణాలను ధరించరాదు. ► బాల్‌పాయింట్ పెన్నును వినియోగించాలి. ► పెన్సిల్, ఎరేజర్లను తెచ్చుకోవచ్చు. అలాగే, సాధారణమైన వాచీని ధరించవచ్చు. ఇతర డిజిటల్ వాచీలు, పరికరాలను అనుమతించబోరు. ► అడ్మిట్‌కార్డులో నమోదు చేసిన పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటివి సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. -
అడ్వాన్స్డ్ ఆషామాషీ కాదు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ ఫలితాల తర్వాత ఇప్పుడు అందరి దృష్టీ అడ్వాన్స్‌డ్‌పై ఉంది. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. ఈ పరీక్ష జూన్ 4వ తేదీన జరగనుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది. అయితే కష్టపడకపోతే అడ్వాన్స్‌డ్‌లో గట్టెక్కడం అంత తేలికైన విషయమేమీ కాదని నిపుణులు అంటున్నారు. మంచి ర్యాంకు సాధిస్తేనే ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఇంజనీరింగ్ చేసే అవకాశం దక్కుతుందని, ఇందుకోసం పూర్తిస్థాయిలో సబ్జెక్టులపై పట్టు సాధించాల్సి ఉంటుందని చెబుతున్నారు. 99 పర్సంటైల్ వచ్చి న వాళ్ళ సంఖ్య ఈసారి వేలల్లో ఉంది కాబట్టి అడ్వాన్స్‌డ్‌లో నెట్టుకురావాలంటే ప్రిపరేషన్ గట్టిగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. గణితంపై దృష్టి పెట్టాల్సిందే జేఈఈ మెయిన్స్‌లో గణితం పేపర్ ప్రతి ఏటా కఠినంగానే ఉంటోంది. అడ్వాన్స్‌డ్‌లో ఇది మరింత కష్టంగా ఉంటోంది. ప్రతి సబ్జెక్టుకూ 120 మార్కులుంటాయి. అయితే గణితంలో 20 మార్కులు సాధించడం గగనమవుతోంది. గత సంవత్సరం అడ్వాన్స్డ్ రాసిన వాళ్ళల్లో ఈ మేరకు సాధించినవారు కేవలం 1,200 మంది మాత్రమే ఉన్నారు. ఇక రసాయన శాస్త్రంలో 20 మార్కులు దాటిన వాళ్ళు 2 వేలు, భౌతిక శాస్త్రంలో 4 వేల మంది ఉన్నారు. అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన 2.5 లక్షల మందిలో ఐఐటీ సీట్లకు కేవలం 55 వేల మందినే ఎంపిక చేస్తారు. అందువల్ల వడపోత కఠినంగానే ఉంటుంది. ఈసారి ఎక్కువమంది జేఈఈ మెయిన్స్ రాయడంతో కటాఫ్ కూడా పెరిగింది. కాబట్టి వడపోతకు వీలుగా అడ్వాన్స్డ్ పేపర్లు కాస్త కఠినంగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బోంబేదే హవా ఐఐటీల్లో బోంబేకే విద్యార్థులు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఇందులో సీటు కోసం పోటీ పడుతుంటారు. తొలి 50 ర్యాంకుల్లో 46 మంది బోంబేలోనే చేరడం గమనార్హం. మొదటి వెయ్యి ర్యాంకుల్లో 246 మంది ఇక్కడ ప్రవేశం పొందారు. గత ఏడాది 3,310 మంది బాలికలకు ఇందులో సీట్లు దక్కాయి. ఇక అత్యధికంగా తిరుపతి ఐఐటీలో 20.7 శాతం మంది సీట్లు పొందారు. అతి తక్కువగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 17.7 మంది సీట్లు పొందారు. విదేశీ విద్యార్థులు 145 మంది అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైతే 66 మంది మాత్రమే ప్రవేశాలు పొందారు. కాగా తొలి వెయ్యి ర్యాంకుల్లో ఢిల్లీలో 210, మద్రాసులో 110, కాన్పూర్‌లో 107, ఖరగ్‌పూర్‌లో 93, గువాహటిలో 66, రూర్కీలో 60, హైదరాబాద్‌లో 40, వారణాసిలో 31, ఇండోర్‌లో ఏడుగురు, రోవర్లో ఒకరు చేరారు. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు తేజాలు
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయస్థాయి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2023 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు విజయఢంకా మోగించారు. ఈ ఫలితాల్లో జాతీయస్థాయిలో మొదటి రెండు ర్యాంకులను మన తెలుగు విద్యార్థులే కైవసం చేసుకున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శనివారం ఉదయం ఈ పరీక్ష తుది ఫలితాలను, స్కోర్లు, ర్యాంకులను విడుదల చేసింది. ఇందులో 100 పర్సంటైల్ సాధించిన వారు 43 మంది ఉండగా అందులో 16 మంది తెలుగు వారే కావడం విశేషం. వీరిలో ఐదుగురు ఆంధ్రప్రదేశ్ వారు కాగా.. మిగిలినవారు తెలంగాణ నుంచి రిజిస్టరై పరీక్ష రాసిన అభ్యర్థులు. టాప్–10 ర్యాంకుల్లో తొలిస్థానాన్ని దక్కించుకున్న శింగరాజు వెంకట కౌండిన్య తెలంగాణ నుంచి రిజిస్టరై పరీక్ష రాసిన ఏపీ విద్యార్థి కాగా.. రెండో స్థానంలోని కాళ్లకూరి సాయినా«థ్ శ్రీమంత్ ఏపీ నుంచే పరీక్ష ర్యాంకు దక్కించుకున్నాడు. 12వ ర్యాంకర్ పునుమల్లి లోహిత్ ఆదిత్యసాయి, 35వ ర్యాంకర్ సి. మిఖిల్, 37వ ర్యాంకు సాధించిన నిమ్మకాయల ధర్మతేజారెడ్డి, 38వ ర్యాంకర్ దుగ్గినేని వెంకట యుగేష్లు ఏపీకి చెందిన విద్యార్థులే. ఇక తెలంగాణకు సంబంధించి అల్లం సుజయ్ (6వ ర్యాంకు), వావిలాల చిద్విలాసరెడ్డి (7వ ర్యాంకు), బిక్కిని అభినవ్ చౌదరి (8వ ర్యాంకు), మాజేటి అభినీత్ (10వ ర్యాంకు), గుత్తికొండ అభిరామ్ (17వ ర్యాంకు), ఎంఎల్ మాధవ్ భరద్వాజ్ (18వ ర్యాంకు), పాలూరి జ్ఞాన కౌశిక్‌రెడ్డి (20వ ర్యాంకు), రామేష్ సూర్యతేజ (21వ ర్యాంకు), నందిపాటి సాయి దుర్గేశ్రెడ్డి (40వ ర్యాంకు), ఈవూరి శ్రీధరరెడ్డి (41వ ర్యాంకు) సాధించారు. వెనుకబడ్డ బాలికలు.. ఈసారి జేఈఈ మెయిన్ టాప్ ర్యాంకుల సాధనలో బాలికలు బాగా వెనుకబడ్డారు. టాప్–10లో ఒక్కరూ లేరు. కర్ణాటకకు చెందిన ఒకేఒక్క అమ్మాయి రిధి కమలేష్‌కుమార్ మహేశ్వరి 100 స్కోరు మార్కులతో 16వ ర్యాంకులో నిలిచింది. బాలికల్లో ఏపీ నుంచి మీసాల ప్రణతి శ్రీజ, రామిరెడ్డి మేఘన, పైడల వింధ్య, సువ్వాడ మౌనిష నాయుడు, వాకా శ్రీవర్షిత టాప్ ర్యాంకుల్లో నిలిచారు. తెలంగాణ నుంచి కుక్కల ఆశ్రితరెడ్డి టాప్ ర్యాంకులో ఉన్నారు. వెయ్యిలోపు ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులే అధికం.. టాప్–10లోనే కాకుండా టాప్–500 ఆపై వెయ్యి ర్యాంకుల్లో కూడా తెలుగు విద్యార్థులే అత్యధిక శాతం మంది ఉన్నారు. ఎన్టీఏ విడుదల చేసిన స్కోరు మార్కులు, తుది ర్యాంకుల ఆ«ధారంగా తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ సంస్థల్లో చదువుతున్న విద్యార్థులే ఎక్కువమంది ఈ ర్యాంకులను కైవసం చేసుకున్నట్లు ఆయా విద్యాసంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. గురుకుల విద్యార్థులకు ర్యాంకులు.. ఇక ఏపీలోని వివిధ గురుకులాల్లో, రెసిడెన్షియల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు మంచి ర్యాంకులే వచ్చాయని ఆయా విభాగాల అధికారులు చెబుతున్నారు. వీరికోసం ప్రభుత్వం ప్రత్యేక కోచింగ్ తరగతులు నిర్వహించడం, తొలినుంచి పోటీ పరీక్షల దృష్టితో వారిని సన్నద్ధం చేయడంతో ర్యాంకులు దక్కాయంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు, ఇతర సంస్థల్లో ఇంటర్మీడియెట్ చదువుతున్న వారిలో 25 మందికి పైగా మంచి ర్యాంకులు సాధించినట్లు ప్రాథమిక గణాంకాల ప్రకారం చెబుతున్నారు. ఈసారి పెరిగిన కటాఫ్ మార్కులు.. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించేందుకు ఎన్టీఏ ప్రకటించిన కటాఫ్ మార్కులు ఈసారి గణనీయంగా పెరిగాయి. 2022లో జనరల్ కటాఫ్ 88.41 కాగా.. ఇప్పుడది 90.77కి చేరింది. ఈడబ్ల్యూఎస్ విభాగంలో కటాఫ్ మార్కులు 63.11 నుంచి 75.62కు.. ఓబీసీ కటాఫ్ 67.00 నుంచి 73.61కి.. ఎస్సీలది 43.08 నుంచి 51.97కి, ఎస్టీలది 26.77 నుంచి 37.23కి పెరగడం గమనార్హం. ఈసారి మెయిన్‌లో ప్రశ్నల సరళి మారడంతో కటాఫ్ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఫలితాలపై చివరి వరకు ఉత్కంఠ.. ఈసారి జేఈఈ మెయిన్ తుది ఫలితాల కోసం విద్యార్థులు గత కొన్నిరోజులుగా చాలా ఉత్కంఠతో ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జేఈఈ మెయిన్ పరీక్షలను ఎన్టీఏ రెండు విడతలుగా నిర్వహించిన సంగతి తెలిసిందే. తొలివిడత పరీక్షలను జనవరి 24 25, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో నిర్వహించింది. రెండో సెషన్‌ను ఏప్రిల్ 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో పూర్తిచేసింది. రెండు విడతల్లోనూ కలిపి మొత్తం 11,62,398 మంది రిజిస్టర్ కాగా 11,13,325 మంది రాశారు. బాలురు 7,74,359 మంది రాయగా బాలికలు 3,38,963 మంది పరీక్ష రాశారు. బీఆర్క్, బీ ప్లానింగ్‌కు సంబంధించిన పేపర్–2 ఫలితాలను తరువాత ప్రకటిస్తామని ఎన్టీఏ పేర్కొంది. నేటినుంచి అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్లు జేఈఈ మెయిన్‌లో టాప్ 2.5 లక్షల మందికి ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జేఈఈ అడ్వాన్సుడ్–2023ని రాసేందుకు అర్హత దక్కుతుంది. వీరు ఆదివారం (నేడు) నుంచి అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను నిర్వహణ సంస్థ అయిన ఐఐటీ గౌహతి ఇప్పటికే ప్రకటించింది. ఈ పరీక్ష జూన్ 4న జరుగుతుంది. -
జేఈఈ మెయిన్ తొలి విడతలో బాలుర హవా
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ తొలివిడత పరీక్షల ఫలితాల్లో బాలురు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 100 స్కోర్ పాయింట్లు సాధించిన 20 మందీ బాలురే కావడం గమనార్హం. 100 స్కోర్ పాయింట్లతో పాటు ఆ తర్వాత అత్యధిక స్కోర్ పాయింట్లు సాధించిన విద్యార్థుల్లో సగం మంది వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పరీక్షలకు హాజరైనవారేనని గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసింది. విద్యార్థుల మార్కుల ఆధారంగా స్కోర్ పాయింట్లతో ఈ ఫలితాలను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి వావిలాల చిద్విలాసరెడ్డి, దుగ్గినేని వెంకట యుగేష్, గుత్తికొండ అభిరామ్, బిక్కిన అభినవ్ చౌదరి, ఎన్కే విశ్వజిత్, అభినీత్ మాజేటిలు 100 స్కోర్ పాయింట్లు సాధించినవారిలో ఉన్నారు. జనరల్‌లో 14 మంది, ఓబీసీల్లో నలుగురు, జనరల్ ఈడబ్ల్యూఎస్‌లో ఒకరు, ఎస్సీల్లో ఒకరు 100 స్కోర్ పాయింట్లు సాధించారు. బాలికల్లో టాప్ తెలుగు అమ్మాయిలే.. కాగా 100 స్కోర్ పాయింట్లు తర్వాత మంచి పాయింట్లు సాధించినవారిలో బాలికలు నిలిచారు. బాలికల విభాగం.. టాప్ టెన్‌లో 99.99 నుంచి 99.97 స్కోర్ పాయింట్లు సాధించిన పది మంది పేర్లను ఎన్టీఏ ప్రకటించింది. వారిలో టాప్‌లో మీసాల ప్రణీతి శ్రీజ, రామిరెడ్డి మేఘన, మేథా భవానీ గిరీష్, సీమల వర్ష, అయ్యాలపు రితిక, పీలా తేజ శ్రీ, వాకా శ్రీవర్షిత, గరిమా కల్రా, గున్‌వీన్ గిల్, వాణి గుప్తా ఉన్నారు. వీరిలో తెలుగు అమ్మాయిలే అధికం కావడం విశేషం. ఇక ఓబీసీ కేటగిరీలో బావురుపూడి రిత్విక్, ఈడబ్ల్యూఎస్‌లో మల్పాని తుషార్, దుంపల ఫణీంద్రనాధరెడ్డి, పెందుర్తి నిశ్చల్ సుభాష్, ఎస్సీ కేటగిరీలో కొమరాపు వివేక్ వర్థన్, ఎస్టీల్లో ధీరావత్ తనూజ్, ఉద్యావత్ సాయి లిఖిత్, దివ్యాంగుల్లో బి.శశాంక్, తుమ్మల తిలోక్‌లున్నారు. రెండో విడత దరఖాస్తులకు మార్చి 7 చివరి తేదీ.. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు తొలి విడత జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించారు. బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పేపర్–1కు 8,60,064 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 8,23,967 (95.80 శాతం) మంది పేపర్–1 రాశారు. అలాగే బీఆర్క్, బీప్లానింగ్ కోర్సులకు ఉద్దేశించిన పేపర్–2కు 46,465 మంది దరఖాస్తు చేశారు. పేపర్–2ను 95 శాతానికి పైగా రాశారు. ఇంగ్లిష్‌తోపాటు హిందీ, తెలుగుతోపాటు పలు ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసుకునే అవకాశం కల్పించారు. కాగా జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు మంగళవారం (ఫిబ్రవరి 7) నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆరంభమైంది. మార్చి 7 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి నాలుగో వారంలో అభ్యర్థుల అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నారు. -
మేథ్స్‌లో తిప్పలు... కెమిస్ట్రీలో స్కోర్..
సాక్షి, హైదరాబాద్ః కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్స్) తొలి రోజు మంగళవారం దేశవ్యాప్తంగా జరిగింది. ఫిబ్రవరి 1వ తేదీ వరకూ జరిగే ఈ పరీక్షలకు దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. తెలంగాణలో 1.5 లక్షల మంది జేఈఈ మెయిన్స్ రాస్తున్నారు. రాష్ట్రంలోని 17 కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతోంది. మంగళవారం ఉదయం, సాయంత్రం జరిగిన పరీక్షలపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కువ భాగం క్రితం సంవత్సరాల్లో ఇచ్చిన ప్రశ్నలు వచ్చినట్టు విద్యార్థులు తెలిపారు. అయితే గణితంలో ఇచ్చిన ప్రశ్నలు కష్టంగానే ఉన్నట్టు చెప్పారు. ఫిజిక్స్ మధ్యస్తంగా ఉందని, కెమిస్ట్రీలో ఎక్కువ స్కోర్ చేసే వీలుందని తెలిపారు. పూర్తిగా ఆన్లైన్ మోడ్‌లో జరిగిన ఈ పరీక్షలో మేథ్స్ కోసం ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చిందన్నారు. రీజనింగ్ ఈజీనే... మేథమెటిక్స్‌లో కొన్ని బేసిక్ ప్రశ్నలకు తేలికగా సమాధానాలు ఇవ్వగలిగారు. అయితే చాలా ప్రశ్న లకు సుదీర్ఘంగా విశ్లేషించక తప్పలేదని చెప్పారు. త్రీడీ, వెక్టర్‌ఆల్‌జీబ్రా, మేథమెటికల్ రీజనింగ్ ప్రశ్న లకు కష్టపడకుండా సమాధానాలు ఇవ్వగలి గారు. ఫిజిక్స్‌లో ఎక్కువ ప్రశ్నలు సెమీ కండక్టర్స్, ఎలక్ట్రో స్టాటిస్టిక్స్, మ్యాగ్నటిజం, మోడ్రన్ ఫిజిక్స్, ఈఎంఐ, ఫిక్షన్ న్యూక్లియర్ ఫిజిక్స్, ఏసీ కరెంట్ నుంచి వచ్చాయి. థియరీ ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచి ఇచ్చారు. కెమిస్ట్రీలో ఎన్సీఈఆర్టీ పుస్తకా లు అనుసరించిన వారికి పేపర్ తేలికగానే ఉన్నట్టు కెమిస్ట్రీ అధ్యాపకులు చెబుతున్నారు. ఆర్గా నిక్, ఇన్ ఆర్గానిక్, కెమికల్ కైనటిక్స్, గ్రాఫ్ బేస్డ్ ప్రశ్నలు, కెమికల్ బాండింగ్ ప్రశ్నలు తేలికగానే సమాధానా లిచ్చే స్థాయిలో ఉన్నాయని అంటున్నారు. -
జేఈఈ మెయిన్స్ హాల్‌టికెట్లు
సాక్షి, హైదరాబాద్: ఈనెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు శని, ఆదివారాల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో పరీక్ష కేంద్రం వివరాలు, సమయం పేర్కొంటారు. పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఎన్టీఏ వెబ్‌సైట్‌కు లాగిన్ అయి అడ్మిట్ కార్డు పొందవచ్చు. జేఈఈ పరీక్షకు తెలంగాణ నుంచి 2 లక్షల మంది హాజరుకానున్నారు. రెండేళ్లుగా కోవిడ్ కారణంగా 21 పట్టణాల్లో పరీక్ష నిర్వహించగా.. ఈసారి వీటిని 17కు తగ్గించారు. జేఈఈ పరీక్ష కేంద్రాల జాబితాను ఎన్టీఏ ఇది వరకే ప్రకటించింది. ఇందులో హయత్‌నగర్, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ ఉన్నాయి. ఈసారి అన్ని విభాగాల్లోనూ నెగెటివ్ మార్కింగ్ ఉంటుందని ఎన్టీఏ స్పష్టం చేసింది. దీంతో పాటు మెయిన్స్ సిలబస్‌లోనూ మార్పు చేశారు. మేథ్స్‌లో ప్రపోర్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ (యాజ్ సొల్యూషన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్)ను పూర్తిగా తొలగించారు. సెట్స్, రిలేషన్స్, స్టాటిస్టిక్స్, త్రీ డైమెన్షన్, జామెట్రీలో లైన్స్ అండ్ ప్లేన్స్‌పై కొంత భాగాన్ని మేథ్స్‌లో కొత్తగా చేర్చారు. ఫిజిక్స్‌లో యంగ్స్ మాడ్యూల్స్ బై సియర్లస్ మెథడ్‌ను తొలగించారు. కెమిస్ట్రీలో న్యూక్లియర్ కెమిస్ట్రీ, ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కెమికల్ ఆఫ్ రెస్పిరేషన్ ఆఫ్ మోనో–ఫంక్షనల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫ్రమ్ బైనరీ మిక్చర్స్ తొలగించారు. వీటితో పలు అంశాలపై సిలబస్‌లో స్పష్టత ఇచ్చారు. -
జేఈఈ అర్హతలో స్వల్ప మార్పులు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ అర్హత నిబంధనల్లో స్వల్ప మార్పులు చేశారు. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. జేఈఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ప్రవేశాలు పొందేప్పుడు ఇంటర్లో 75 శాతం మార్కులు పొంది ఉండాలని ఎన్టీఏ తొలుత పేర్కొంది. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో వివాదం చెలరేగింది. ఆయా రాష్ట్రాల్లో ఇంటర్, 10 ప్లస్‌టులో గరిష్టంగా 60 శాతం పర్సంటైల్ మాత్రమే వస్తోంది. దీంతో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇంటర్, ప్లస్ టులోని సబ్జెక్టుల్లో 75 మార్కులు లేదా టాప్ 20 పర్సంటైల్ ఉన్నవారు జాతీయ సీట్ల కేటాయింపునకు అర్హులని ఎన్టీఏ మార్పు చేసింది. ఎస్సీ, ఎస్టీలు ఇంటర్, ప్లస్‌టులో 65 మార్కులు పొంది ఉంటే సరిపోతుందని నిర్ణయించింది. -
జేఈఈలో ప్రాంతీయ భాషలకు పెరుగుతున్న ఆదరణ
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)లో ప్రాంతీయ భాషల్లో పరీక్షలకు ఆదరణ పెరుగుతోంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఆధ్వర్యంలో జేఈఈని తొలుత ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే నిర్వహించేవారు. 2016లో గుజరాతీ, మరాఠీ, ఉర్దూ భాషల్లో కూడా ప్రారంభించారు. ఆ తరువాతి ఏడాది మరాఠీ, ఉర్దూను ఉపసంహరించారు. 2020లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి జేఈఈ పరీక్ష బాధ్యతలను చేపట్టాక ఇంగ్లిష్, హిందీ, గుజరాతీ భాషల్లో నిర్వహించారు. ఇతర భాషలకు ప్రాధాన్యమివ్వకపోవడంపై విమర్శలు వచ్చాయి. దీంతో పాటు జాతీయ నూతన విద్యా విధానంలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఆ తరువాత నుంచి ఇంగ్లిష్, హిందీతో పాటు 11 ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహిస్తోంది. 2021లో నాలుగు దఫాలుగా నిర్వహించిన జేఈఈ మెయిన్‌కు 9.39 లక్షల మంది దరఖాస్తు చేయగా వారిలో 1,49,621 మంది ప్రాంతీయ భాషలను ఎంచుకున్నారు. బెంగాలీలో 24,841 మంది, గుజరాతీలో 44,094 మంది, హిందీలో 76,459 మంది దరఖాస్తు చేయగా తెలుగులో 371, తమిళం 1264, కన్నడ 234, మలయాళం 398, మరాఠీ 658, ఒడియా 471, పంజాబీ 107, ఉర్దూ 24, అస్సామీ 700 మంది ఉన్నారు. నాలుగు దఫాలకు దరఖాస్తు చేసిన వారి సంఖ్య ఇది. మొత్తం దరఖాస్తుదారుల సంఖ్య (యూనిక్ సంఖ్య)ప్రకారం చూస్తే 70 వేలు. వీరిలో ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసిన వారు 45 వేలు. 2022లో జేఈఈకి మొత్తం 10.26 లక్షల మంది దరఖాస్తు చేయగా వారిలో ప్రాంతీయ భాషల్లో రాసేందుకు దరఖాస్తు చేసిన వారి సంఖ్య 80 వేలకు పైగా ఉంది. వీరిలో 50 వేల మంది వరకు ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాశారు. బెంగాలీ, గుజరాతీ, హిందీ భాషల్లోనే ఎక్కువ మంది పరీక్షకు హాజరయ్యారు. 2022లో తెలుగులో పరీక్ష రాసిన వారి సంఖ్య 1,200 వరకు పెరిగింది. 2023లో ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసే వారి సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. ఆయా భాషల్లో ప్రశ్నపత్రాల్లో సందేహాలు ఉంటే ఆంగ్ల ప్రశ్న పత్రాన్ని ప్రామాణికంగా తీసుకోవలసి ఉంటుంది. (క్లిక్ చేయండి: అనకాపల్లిలో ఎంఎస్ఎంఈ పార్కు) -
జేఈఈ మెయిన్ సిలబస్ ఖరారు
సాక్షి, అమరావతి: దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2023 సిలబస్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం విడుదల చేసింది. దీని ప్రకారం.. మ్యాథమెటిక్స్‌లో 16 టాపిక్‌లు, ఫిజిక్స్ సెక్షన్–ఏలో 20 టాపిక్స్, సెక్షన్–బిలో ప్రయోగ నైపుణ్యాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇక కెమిస్ట్రీలోని ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీల్లో 10 చొప్పున టాపిక్స్ ఉన్నాయి. తెలుగు, ఇంగ్లిష్, హిందీ తదితర మాధ్యమాల్లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించనున్నారు. విద్యార్థులు ఏ భాషలో పరీక్ష రాయాలనుకుంటున్నారో ముందుగానే దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్‌లో భాగంగా బీఈ, బీటెక్‌లో ప్రవేశాలకు పేపర్–1, బీఆర్క్ కోసం పేపర్–2ఏ, బీప్లానింగ్‌కు పేపర్–2బీని నిర్వహిస్తారు. పేపర్–1లో మూడు సెక్షన్ల కింద మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ప్రశ్నలుంటాయి. కంప్యూటర్ ఆధారితంగా పరీక్షలు జరుగుతాయి. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు ఉంటాయి. అలాగే నెగిటివ్ ఆన్సర్‌కు 1 మార్కు కోత ఉంటుంది. పేపర్–1లో మూడు సెక్షన్లలో 300 మార్కులకు 90 బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలుంటాయి. పేపర్–2ఏలో 400 మార్కులకు 82 ప్రశ్నలు ఇస్తారు. పేపర్–2బీలో 400 మార్కులకు 105 ప్రశ్నలుంటాయి. జనవరి, ఏప్రిల్‌లో రెండు సెషన్లుగా పరీక్షలు.. కాగా జేఈఈ మెయిన్ పరీక్షలను జనవరి, ఏప్రిల్‌లలో రెండు సెషన్లుగా నిర్వహించేలా ఎన్టీఏ షెడ్యూల్ విడుదల చేసింది. తొలి సెషన్ జనవరి 24 నుంచి 31 వరకు, రెండో సెషన్ ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనుంది. ఇప్పటికే తొలి సెషన్‌కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే జనవరి సెషన్ పరీక్షల తేదీల్లోనే పలు ఇంటర్మీడియెట్ బోర్డులు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నాయి. ఒకే తేదీల్లో ఈ రెండు పరీక్షలు రావడం వల్ల తమకు నష్టం కలుగుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా జనవరి సెషన్‌కు సన్నద్ధం కావడానికి తక్కువ సమయం ఇచ్చారని, ఈ తేదీలను పొడిగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే కరోనా సమయంలో రద్దు చేసిన ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు తప్పనిసరి అనే నిబంధనను పునరుద్ధరించడం వల్ల కూడా ఎక్కువ మందికి నష్టం వాటిల్లుతుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ నిబంధనను కూడా సడలించాలని కోరుతున్నారు. -
జనవరిలో ఎంసెట్ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించడం... ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో తెలంగాణ ఎంసెట్ నిర్వహణపై ఉన్నత విద్యామండలి కసరత్తు మొదలుపెట్టింది. 2023 జనవరిలో పరీక్షల తేదీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. దీనికోసం మండలి అధికారులు త్వరలో సమావేశం కానున్నారు. సాధ్యమైనంత వరకు ఎంసెట్ పరీక్ష మే రెండు, మూడు వారాల్లో ఉండొచ్చని భావిస్తున్నారు. ఇంటర్ పరీక్షల తర్వాత ఎంసెట్ సన్నద్ధతకు కనీసం 45 రోజుల కాలపరిమితి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇంటర్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. ఈ లెక్కన మేలో ఎంసెట్‌కు అనువైన తేదీలను ఖరారు చేసే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. జేఈఈ మెయిన్స్ పరీక్షలు జనవరి 24 నుంచి 31 వరకు జరుగుతాయి. రెండో విడత ఏప్రిల్ 6 నుంచి 12 వరకు ఉంటుంది. జేఈఈ పూర్తయిన తర్వాత కూడా ఎంసెట్‌కు సన్నద్ధమయ్యేందుకు విద్యార్థులకు సమయం దొరుకుతుంది. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా ఎంసెట్ ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం సకాలంలో విద్యా సంవత్సరం కొనసాగింది. దీంతో జేఈఈ మెయిన్స్ కూడా గతం కన్నా ముందే పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో ఎంసెట్‌ను త్వరగా నిర్వహించి జూన్‌లో ఫలితాలు వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఆగస్టు చివరి నాటికి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగించాలని యోచిస్తున్నారు. ఈసారి కూడా ఇంటర్ మార్కుల వెయిటేజీ లేనట్టేనని అధికారులు సంకేతాలు ఇస్తున్నారు. మేలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంటర్ వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత నెల రోజుల్లో ఫలితాలను ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పరీక్షల్లో ఫెయిలైన వారికి, మార్కులు తక్కువగా వచ్చినవారికి మేలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఫలితాలు ప్రకటించిన రోజే ఆయా పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అడ్వాన్స్డ్ పరీక్షలు రాసే వారు కూడా ఎంసెట్ పరీక్షలు రాసేందుకు అర్హులే. ఏప్రిల్ మొదటి వారంలో టెన్త్ పరీక్షలు ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల కాగా, పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ మొదటివారంలో నిర్వహించే అవకాశాలున్నాయి. ఇంటర్ ప్రధాన పరీక్షలు మార్చిలోనే ముగియనుండగా, ఏప్రిల్ మొదటి వారంలో టెన్త్ పరీక్షలను ప్రారంభించాలని ఎస్సెస్సీబోర్డు అధికారులు భావిస్తున్నారు. 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకే పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించగా, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన జీవోను ప్రభుత్వం జారీచేయాల్సి ఉంది. ఈ జీవో జారీ అయితేనే తుది షెడ్యూల్ ఖరారుచేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. -
ఇంటర్లో 75 శాతం సాధిస్తేనే జేఈఈ మెయిన్‌కు అర్హత
సాక్షి, అమరావతి: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2023లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈసారి పలు మార్పులు చేసింది. కరోనా సమయంలో సడలింపులిచ్చిన అంశాలను పునరుద్ధరించింది. కొన్ని కొత్త సడలింపులను ప్రకటించింది. జేఈఈ మెయిన్‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు సాధించి ఉండటం సహా పలు నిబంధనలను పెట్టింది. సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు నిబంధనల ప్రకారం ఎన్ఐటీ, ఐఐఐటీ, సీఎఫ్‌ఐటీ తదితర సంస్థల్లో ప్రవేశానికి అభ్యర్థులు జేఈఈలో ఆలిండియా ర్యాంకుతో పాటు ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే ఇంటర్మీడియెట్‌లోని ప్రతి సబ్జెక్టులోనూ అభ్యర్థి నిర్ణీత అర్హత మార్కులను సాధించాలి. అందువల్ల మెయిన్‌కు 75 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. మరికొన్ని నిబంధనలు జేఈఈ మెయిన్ తొలి దశ పరీక్షలు జనవరి 24 నుంచి 31 వరకు, రెండో దశ ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. తొలి దశ పరీక్షలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. రెండో దశ రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 7న ప్రారంభమవుతాయి. అభ్యర్ధులు రెండు విడతల పరీక్షలకు వేర్వేరుగా దరఖాస్తు చేయాలి. ఒక సెషన్‌కు ఒక్క దరఖాస్తే సమర్పించాలి. ఒకటికి మించి దరఖాస్తులు ఇస్తే.. ఆ తరువాత ఎప్పుడు దాన్ని గుర్తించినా ఆ అభ్యర్థిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఎన్టీఏ స్పష్టంచేసింది. 2021, 2022 సంవత్సరాల్లో ఇంటర్మీడియెట్, తత్సమాన బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈసారి వయోపరిమితిని విధించకుండా బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణతను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటోంది. అయితే, అడ్మిషన్ల సమయంలో విద్యా సంస్థలు నిర్ణయించే వయోపరిమితి నిబంధనలను అభ్యర్థులు అనుసరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే డ్రాపర్ల (గత ఏడాది మెయిన్‌లో ఫెయిలై, మళ్లీ ఈ ఏడాది రాసే వారు, ఇంటర్మీడియెట్ పూర్తి చేసి కొన్ని సంవత్సరాలు వ్యవధి ఇచ్చి జేఈఈకి దరఖాస్తు చేసేవారు)కు వయోపరిమితిని సడలించి వరుసగా మూడుసార్లు మెయిన్‌కు అవకాశం కల్పించింది. ముందుగానే రిజర్వు తేదీల ప్రకటన రెండు దశల పరీక్షల తేదీల్లో మార్పులు చేయాల్సి వచ్చినా, ఇతర పరీక్షలకు ఆటంకం లేకుండా కొన్ని రిజర్వు తేదీలను కూడా ఎన్టీఏ ఈసారి ముందుగానే ప్రకటించింది. తొలివిడత పరీక్షలకు ఫిబ్రవరి 1, 2, 3 తేదీలను రిజర్వుగా ప్రకటించింది. రెండో విడతకు ఏప్రిల్ 13, 15 తేదీలను రిజర్వు తేదీలుగా పేర్కొంది. తగ్గిన పరీక్ష కేంద్రాలు కరోనా సమయంలో భౌతిక దూరం పాటించడం, ఇతర నిబంధనల కారణంగా మెయిన్ పరీక్షలను ఎక్కువ నగరాల్లో నిర్వహించింది. గత ఏడాది కూడా దేశవ్యాప్తంగా 514 నగరాలు, పట్టణాల్లో నిర్వహించింది. ఈసారి వాటిని 399కు కుదించింది. ఇతర దేశాల్లో పరీక్షల కేంద్రాలు గత ఏడాది 24 కాగా ఈసారి 13కు తగ్గించింది. రిజిస్ట్రేషన్ల ఫీజు పెంపు రిజిస్ట్రేషన్ల ఫీజులను కూడా ఎన్టీఏ పెంచింది. జనరల్ కేటగిరీ అభ్యర్థుల ఫీజు రూ.650 నుంచి రూ.1,000కి పెంచింది. మహిళలకు రూ.800 చేసింది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ఫీజును రూ.325 నుంచి రూ.500కు పెంచింది. ఇతర దేశాల అభ్యర్థుల ఫీజును రూ.3 వేల నుంచి రూ.5 వేలకు, మహిళల ఫీజును రూ.1500 నుంచి రూ.3 వేలకు పెంచింది. అభ్యర్థులు జేఈఈ మెయిన్ ఆన్లైన్ దరఖాస్తులో తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఈమెయిల్, మొబైల్ నంబర్లు తదితర వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలని, లేదంటే రిజిస్ట్రేషన్ పూర్తి కాదని ఎన్టీఏ స్పష్టంచేసింది. ఇదిలా ఉండగా కరోనా పరిస్థితులు సద్దుమణిగినా గతంలోని పరిస్థితుల ప్రభావం ఇంకా ఉన్నందున, ఇంటర్మీడియెట్‌లో 75% మార్కుల నిబంధనను ఈసారి కూడా మినహాయించాలని అభ్యర్థులు కోరుతున్నారు. తొలివిడత సెషన్ పరీక్షలకు వ్యవధి తక్కువగా ఉందని, దీనినీ పునఃపరిశీలన చేయాలని అభ్యర్థిస్తున్నారు. -
JEE Main 2023: వచ్చే నెలలో జేఈఈ మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ సంస్థల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశపరీక్ష (జేఈఈ మెయిన్–2023) నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసింది. రెండు విడతలుగా ఈ పరీక్షలు జరుగుతాయి. తొలి విడత వచ్చే ఏడాది జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో ఉంటుంది. రెండో విడత జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు ఉంటాయి. పరీక్ష ఎప్పటిలాగే ఆన్లైన్ విధానంలో ఉంటుందని, ఇంగ్లిష్, హిందీ, తెలుగు సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తామని ఎన్టీఏ వెల్లడించింది. దరఖాస్తుల స్వీకరణ షురూ.. జేఈఈ మెయిన్ మొదటి విడతకు దరఖాస్తులు గురువారం రాత్రి నుంచే మొదలయ్యాయి. జనవరి 12వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్‌లో జరిగే రెండో విడత పరీక్షలకు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహిస్తారు. అందులో వచ్చే ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులు పూర్తి వివరాల కోసం ఎన్టీఏ వెబ్సైట్ చూడాలని, లేదా 011 40759000/ 011 69227700 నంబర్లకు ఫోన్ చేయవచ్చని ఎన్టీఏ తెలిపింది. రెండు నెలల్లోనే.. 2019 వరకు జేఈఈ మెయిన్స్ జనవరి, ఏప్రిల్ నెలల్లోనే నిర్వహించారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లు నాలుగు విడతలుగా మే, జూలై నెలల్లోనూ నిర్వహించారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. అయితే 2 నెలల్లోనే మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వడం విశేషం. 2022 జేఈఈ మెయిన్స్‌కు 10.26 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 9,05,590 మంది పరీక్ష రాశారు. తొలి విడత షెడ్యూల్ ఇదీ.. దరఖాస్తుల స్వీకరణ: ఈ నెల 16 (గురువారం) నుంచి జనవరి 12 వరకు.. అడ్మిట్ కార్డుల విడుదల: 2023 జనవరి మూడో వారంలో. పరీక్షలు: 2023 జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 -
ఫిబ్రవరిలో జేఈఈ మెయిన్స్!
సాక్షి, హైదరాబాద్: ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జేఈఈ మెయిన్స్ (2023) ఫిబ్రవరిలో నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్ మొదటి వారంలో పరీక్ష షెడ్యూల్‌ను వెలువరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ బోర్డుల అభిప్రాయాలను కోరింది. ఫిబ్రవరిలో నిర్వహణకు సమ్మతమేనా? ఇతర అభ్యంతరాలు ఏవైనా ఉన్నాయా? అనే అంశాలపై వివరణ కోరినట్టు తెలిసింది. దీనిపై కొన్ని రాష్ట్రాలు సానుకూలంగా స్పందించినట్టు ఎన్టీఏ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది సకాలంలోనే తరగతులు 2022కు సంబంధించిన జేఈఈ మెయిన్స్ పరీక్షను మే, జూలై నెలల్లో నిర్వహించారు. ఆ తర్వాత అడ్వాన్స్డ్ కూడా నిర్వహించి ప్రవేశాల ప్రక్రియ ముగించారు. ఈ మొత్తం వ్యవహారం అక్టోబర్‌లో పూర్తయింది. వాస్తవానికి జేఈఈ మెయిన్స్ 2019 వరకు జనవరి నెలలోనే నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో మూడేళ్లుగా ఆలస్యం జరుగుతోంది. అయితే ఈ ఏడాది తరగతులు సకాలంలోనే మొదలవ్వడంతో మెయిన్స్ త్వరగా నిర్వహించాలని ఎన్టీఏ సంకల్పించింది. రెండు విడతలుగానే.. కరోనా సమయంలో నాలుగు విడతలుగా జేఈఈ మెయిన్స్ నిర్వహించారు. ఈసారి 2 విడతలుగానే చేపట్టాలని నిర్ణయించారు. ఫిబ్రవరిలో తొలి విడత ఉంటే, ఏప్రిల్‌లో రెండో విడత ఉండొచ్చన్న సంకేతాలు ఎన్టీఏ వర్గాల నుంచి వస్తున్నాయి. ఏప్రిల్‌లో రాష్ట్రాల పరిధిలోని ఇంటర్ బోర్డులు పరీక్షలు నిర్వహిస్తే మాత్రం ఈ ప్రక్రియను మే నెలలో చేపట్టాలని భావిస్తోంది. జూన్ లేదా జూలైలో అడ్వాన్స్డ్ చేపట్టి, సెప్టెంబర్ నాటికి ప్రవేశాల ప్రక్రియను ముగించాలనే యోచనలో ఉంది. ఇందుకు సంబంధించి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి కూడా 2023–24 సంవత్సరం షెడ్యూల్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మండలి అభిప్రాయాన్ని కూడా ఎన్టీఏ కోరినట్టు తెలిసింది. మరోవైపు పరీక్ష విధానంపైనా ఎన్టీఏ స్పష్టమైన వైఖరి తీసుకున్నట్టు తెలిసింది. పార్ట్–1కు మాత్రమే కరోనా కాలంలో నెగెటివ్ మార్కింగ్ అమలు చేశారు. 360 మార్కులతో 90 ప్రశ్నల విధానాన్నే అనుసరించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఫిబ్రవరి మొదటి వారమేనా? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఫిబ్రవరి రెండో వారంలో ప్లస్ టు పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ సమయంలో జేఈఈ వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గుర య్యే అవకాశం ఉందని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి మొదటి వారంలో తొలి విడత పరీక్ష చేపట్టాలనే యో చనలో ఎన్టీఏ ఉంది. రెండో వారం పరీక్షలపై సీబీఎస్ఈతో పాటు తెలంగాణ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. రెండో వారంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఉండటమే కారణం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మొదటి వారంలో తొలి విడత, ఏప్రిల్ మూడో వారం లేదా మే మొదటి వారంలో జేఈఈ మెయిన్స్ ఉంటే బాగుంటుందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ఎన్టీఏకి సూచించే ఆలోచనలో ఉన్నారు. మొదటి వారమైతే అభ్యంతరం లేదు జేఈఈ మెయిన్స్ తొలి విడత ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహిస్తే ఎలాంటి సమస్య ఉండదు. రెండో విడత పరీక్షల ఖరారులోనూ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షల తేదీలను, విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు ఉన్న అవకాశాలను పరిగణనలోనికి తీసుకోవాలి. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యామండలి చైర్మన్) -
ట్రిపుల్ ఐటీ.. ట్రబుల్ లేకుండా ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్లో చేరిన విద్యార్థుల్లో చాలా మంది జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీటు సాధించడంపై దృష్టిపెడతారు. ఆ లక్ష్యంతోనే చివరి వరకూ జేఈఈపై పట్టుకోసం ప్రయత్నిస్తారు. కొందరు సఫలమవుతారు. సాధారణంగా జేఈఈ మెయిన్స్ ర్యాంకు సాధించిన ప్రతీ ఒక్కరూ ఐఐటీ తర్వాత ఎన్ఐటీల్లో సీట్లు కోరుకుంటారు. ఆ తర్వాత ప్రాధాన్యమిచ్చేది ట్రిపుల్ ఐటీ (ఐఐఐటీ)లకే. వీటిల్లో ఎంత వరకు ర్యాంకువారికి సీటొస్తుంది? ఏ బ్రాంచ్‌కు ఎంత ర్యాంకు వరకు ప్రాధాన్యత ఇవ్వొచ్చనే సందేహాలు చాలా మంది విద్యార్థుల్లో ఉంటున్నాయి. ప్రాథమిక ర్యాంకుల అంచనాను ఎన్టీఏ వెల్లడించకపోవడం కూడా విద్యార్థుల గందరగోళానికి కారణమవుతుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్నేళ్లుగా ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీ ర్యాంకుల కటాఫ్‌లను గమనిస్తే సులువుగా అవగాహన వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎంత వరకు అవకాశం? దేశవ్యాప్తంగా 11 ట్రిపుల్ ఐటీలు జేఈఈ ర్యాంకు ద్వారా సీట్లు కేటాయిస్తున్నాయి. వీటన్నింటిలో కలిపి మొత్తం 6,146 ఇంజనీరింగ్ సీట్లున్నాయి. బాలికలకు ప్రత్యేకంగా కేటాయించే సూపర్ న్యూమరరీ సీట్లు మరో 305 వరకు ఉంటాయి. మొత్తంగా రిజర్వేషన్లను అనుసరించి సీట్లు కేటాయిస్తారు. గత ఏడాది ఓపెన్ కేటగిరీలో బాలురకు 35వేల ర్యాంకు వరకు, బాలికలకు 40వేల ర్యాంకు వరకు సీట్లు దక్కాయి. ఓబీసీ, నాన్ క్రీమీలేయర్ కేటగిరీలో 60వేల ర్యాంకు వరకు సీఎస్సీలో, 65వేల ర్యాంకు వరకు ఈసీఈలో సీట్లు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 2.5లక్షల ర్యాంకు వరకు ట్రిపుల్ ఐటీల్లో సీట్లు లభించాయి. ఆప్షన్ల ఎంపికే కీలకం జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సెప్టెంబర్ 12 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ సమయంలో ఆప్షన్ల ఎంపికే కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. నిట్, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సంస్థల్లో ఏ ర్యాంకు వరకూ సీటు వస్తుందనే అవగాహనతోపాటు ట్రిపుల్ ఐటీల్లో సీటుకు కావాల్సిన ర్యాంకులను తెలుసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఆ ర్యాంకులకు అనుగుణంగా ఆప్షన్లు ఇచ్చుకుంటే.. సులువుగా సీటు పొందే వీలు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. వచ్చిన ర్యాంకుకు తగిన చోట సీటు లభించే ఆప్షన్లను ముందుగా ఎంచుకోవాలని.. లేకుంటే సీటు నష్టపోయే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. తగిన వ్యూహం అవసరం ట్రిపుల్ ఐటీ సీట్లు పొందాలనుకునే వారు ర్యాంకుల ఆధారంగా ఆప్షన్లు ఇవ్వడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. జేఈఈ మెయిన్స్ అర్హులంతా ట్రిపుల్ ఐటీ బరిలో ఉండటం సహజమే. అయితే వచ్చిన ర్యాంకుకు ఎక్కడ సీటు వస్తుందనే అంచనాకు రాగలితే ప్రయోజనకరంగా ఉంటుంది. – ఎంఎన్ రావు, గణిత శాస్త్ర నిపుణుడు -
అడ్వాన్స్‌డ్‌ను అధిగమిస్తున్నారు
సాక్షి, అమరావతి: దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో చదవాలని ప్రతి విద్యార్థి కోరుకుంటాడంటే అతిశయోక్తి కాదు. అయితే వీటిలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్, అడ్వాన్స్డ్ అత్యంత క్లిష్టమైనవి. అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకులు సాధిస్తేనే ఐఐటీల్లో సీట్లు లభిస్తాయి. ర్యాంకులు సాధించడం అటుంచి ఈ పరీక్షల్లో అర్హత మార్కులు సాధించడమే ఒకప్పుడు కష్టంగా ఉండేది. 15 ఏళ్ల క్రితం ఐఐటీలు, ఎన్ఐటీల సంఖ్య తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అంతేకాకుండా వీటికి శిక్షణ ఇచ్చే విద్యా సంస్థలు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉండేవి. నాణ్యమైన మెటీరియల్ కొరత కూడా ఉండేది. అయితే 2008 నుంచి కొత్త ఐఐటీలు, ఎన్ఐటీలు ఏర్పాటయ్యాయి. అంతేకాకుండా శిక్షణా కేంద్రాలూ పెరిగాయి. ఇంటర్నెట్ సౌకర్యం కూడా అందుబాటులోకి రావడంతో ఆన్లైన్ శిక్షణ కూడా అందుబాటులో కొచ్చింది. దీంతో ఐఐటీల్లో సీటు సాధించేవారి సంఖ్య పెరిగింది. 2007లో ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో కేవలం 3 శాతంలోపు మాత్రమే ఉన్న ఉత్తీర్ణుల సంఖ్య తాజాగా 30 శాతం వరకు చేరడం ఇందుకు నిదర్శనం. గతంలో ఐఐటీ–జేఈఈగా, జేఈఈ మెయిన్‌గా, ఏఐఈఈఈగా వేర్వేరు పేర్లతో కొనసాగిన ప్రవేశ పరీక్షలు ప్రస్తుతం జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్గా కొనసాగుతున్నాయి. ప్రవేశానికి రెండంచెల విధానం.. ఎన్ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశానికి 2013 నుంచి జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌లను ప్రవేశపెట్టారు. ఈ పరీక్షల కోసం ప్రస్తుతం 10 లక్షల మందికిపైగా పోటీ పడుతున్నారు. ఏక పరీక్ష విధానం ఉన్నప్పుడు కూడా అభ్యర్థులు లక్షల్లోనే పరీక్ష రాసేవారు. ఐఐటీ ప్రవేశపరీక్షలో క్వాలిఫై అయినవారు 2007లో 2.96 శాతం, 2008లో 2.77 శాతం, 2009లో 2.60, 2010లో 2.87, 2011లో 2.81, 2012లో 5.02 శాతం మంది ఉన్నారు. 2013 నుంచి రెండు విడతల వడపోత విధానం (జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్) అమల్లోకి వచ్చాక మెయిన్ పరీక్ష దాటుకుని అడ్వాన్స్డ్ పరీక్ష దాకా వచ్చే అభ్యర్థుల సంఖ్య తగ్గింది. 2013లో అడ్వాన్స్డ్ పరీక్షకు 1,26,749 మంది దరఖాస్తు చేయగా 1,15,971 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 20,834 మంది (17.96 శాతం) అర్హత మార్కులు సాధించారు. 2014లో 22.70, 2015లో 22.47, 2016లో 24.76, 2017లో 31.99 శాతం, 2018లో 20.61, 2019లో 23.99 శాతం, 2020లో 28.64 శాతం, 2021లో 29.19 శాతం మంది అడ్వాన్స్డ్ పరీక్షలో క్వాలిఫై అయ్యారు. నేడే జేఈఈ అడ్వాన్స్డ్ సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాలు పొందేందుకు ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆదివారం దేశవ్యాప్తంగా జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నేతృత్వంలో జరిగే ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. జూలైలో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షకు దేశవ్యాప్తంగా 8లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2.5 లక్షలమంది అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత సాధించారు. అయితే, కేవలం 1.60 లక్షల మంది అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన పేపర్–1 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించబోమని ఎన్టీఏ పేర్కొంది. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. ఈసారి పేపర్–1, పేపర్–2 కూడా నెగెటివ్ మార్కింగ్ ఉంటుందని ప్రకటించింది. సరైన జవాబు రాస్తే 4 మార్కులు, సమాధానం తప్పయితే ఒక మార్కు మైనస్ అవుతుంది. ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ సంస్థలు, కేంద్ర ప్రభుత్వనిధులతో నడిచే ఇతర సంస్థల్లో దాదాపు 50 వేల వరకు ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. జేఈఈ మెయిన్స్ ర్యాంకు ద్వారా నిట్‌లో, అడ్వాన్స్డ్ ర్యాంకు ద్వారా ఐఐటీల్లో సీట్లు పొందే వీలుంది. -
JEE Mains Results 2022: మనదే హవా
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వంటి జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2022 పేపర్ 1 (బీఈ, బీటెక్) ఫలితాల్లో తెలుగు విద్యార్థులు దుమ్ము లేపేశారు. దేశవ్యాప్తంగా 24 మందికి 100 ఎన్టీఏ స్కోర్ రాగా ఇందులో పది మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులే. ఈ పది మందిలో ఐదుగురు మన రాష్ట్ర విద్యార్థులు ఉండగా, మరో ఐదుగురు తెలంగాణ వారు ఉన్నారు. ఈ మేరకు జేఈఈ మెయిన్ స్కోర్లు, ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. టాప్ 10 ర్యాంకుల్లో రాష్ట్రానికి చెందిన ముగ్గురు చోటు దక్కించుకున్నారు. పెనికలపాటి రవికిషోర్ ఆరో ర్యాంకు, మెండ హిమవంశీ ఏడో ర్యాంకు.. పల్లి జలజాక్షి 9వ ర్యాంకు సాధించారు. వీరు ముగ్గురుతోపాటు ఏపీకే చెందిన పోలిశెట్టి కార్తికేయ, కొయ్యాన సుహాస్ 100 ఎన్టీఏ స్కోర్ సాధించిన వారిలో నిలిచారు. ఇక తెలంగాణ నుంచి రూపేష్ బియానీ, ధీరజ్ కురుకుంద, జాస్తి యశ్వంత్ వీవీఎస్, బుస శివనాగ వెంకట ఆదిత్య, అనికేత్ ఛటోపాధ్యాయ 100 ఎన్టీఏ స్కోర్ సాధించిన వారిలో ఉన్నారు. కాగా జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకును శ్రేణిక్ మోహన్ సకల (మహారాష్ట్ర), రెండో ర్యాంకును నవ్య (రాజస్థాన్) సాధించారు. 100 ఎన్టీఏ స్కోర్ సాధించిన 24 మందిలో ఇద్దరే బాలికలు. మిగతా 22 మంది బాలురే. పెరిగిన జనరల్ కటాఫ్.. కాగా జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించి అడ్వాన్స్డ్ పరీక్షకు ఎంపికయ్యేందుకు జనరల్ విభాగం కటాఫ్ స్కోర్ గతేడాది కంటే పెరిగింది. మరోవైపు ఇతర కేటగిరీల్లో మాత్రం కటాఫ్ స్కోర్ తగ్గింది. జేఈఈ మెయిన్‌లో టాప్‌లో నిలిచిన 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా పరిగణిస్తారు. వీరు మాత్రమే అడ్వాన్స్డ్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఓపెన్ కేటగిరీలో 1,01,250, ఈడబ్ల్యూఎస్ 25,000, ఓబీసీ 67,500, ఎస్సీలు 37,500, ఎస్టీలు 18,750 మందిని ఎంపిక చేస్తారు. ఈ అన్ని కేటగిరీల్లోనూ 0.05 శాతం దివ్యాంగులకు కేటాయిస్తారు. మొదటి సెషన్లోనే అధికం జేఈఈ మెయిన్‌ను 2021లో కరోనా దృష్ట్యా నాలుగుసార్లు నిర్వహించగా ఈసారి మాత్రం రెండు సెషన్లకే పరిమితం చేశారు. జూన్ 24 నుంచి 30 వరకు మొదటి సెషన్, జూలై 25 నుంచి 30 వరకు రెండో సెషన్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా మొత్తం 10,26,799 మంది దరఖాస్తు చేసుకోగా 9,05,590 మంది హాజరయ్యారు. రెండు సెషన్లలోనూ పరీక్ష రాసిన వారు 4,04,256 మంది ఉన్నారు. అత్యధికంగా మొదటి సెషన్లో 8,72,970 మంది దరఖాస్తు చేయగా 7,69,604 మంది హాజరయ్యారు. రెండో సెషన్‌కు 6,22,034 మంది దరఖాస్తు చేయగా 5,40,242 మంది పరీక్ష రాశారు. పరీక్ష రాసిన మొత్తం అభ్యర్థుల్లో 6,48,555 మంది బాలురు కాగా 2,57,031 మంది బాలికలున్నారు. ఐదుగురి ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టినట్లు ఎన్టీఏ పేర్కొంది. కాగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు.ఇక పేపర్–2కు సంబంధించిన బీఆర్క్, బీప్లానింగ్ ఫలితాలను త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపింది. అడ్వాన్స్‌డ్‌కు 11 వరకు దరఖాస్తు గడువు.. కాగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు ప్రక్రియను ఐఐటీ –బాంబే ఆదివారం (ఆగస్టు 7) నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అయితే మెయిన్ ఫలితాలు సోమవారం వెలువడడంతో ఒక రోజు ఆలస్యంగా ఈ ప్రక్రియను చేపట్టింది. ఈ నెల 11 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు గడువు ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఫీజును 12 సాయంత్రం 5 గంటల లోపు చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డులను 23 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష ఆగస్టు 28న జరుగుతుంది. ప్రొవిజినల్ ఆన్సర్ కీ సెప్టెంబర్ 1న ప్రకటిస్తారు. వాటిపై అదే నెల 3, 4 తేదీల్లో అభ్యర్థుల అభిప్రాయాలను తీసుకొని ఫైనల్ కీని, తుది ఫలితాలను సెప్టెంబర్ 11న విడుదల చేస్తారు. బీఆర్క్కి సంబంధించిన ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను 14న నిర్వహించి 17న ఫలితాలు ప్రకటిస్తారు. కాగా బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభమవుతుంది. ఐఐటీ బాంబేలో చేరతా.. మాది గుంటూరు. నాన్న ఆదినారాయణ ప్రైవేటు సంస్థలో లైబ్రేరియన్‌గా పనిచేస్తారు. అమ్మ నందకుమారి స్టాఫ్ నర్సు. ఇంటర్మీడియెట్‌లో 962 మార్కులు సాధించా. జేఈఈ మెయిన్‌లో ఆలిండియా స్థాయిలో ఆరో ర్యాంకు రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ప్రణాళికాబద్ధంగానే చదవడంతోనే ఇంత చక్కటి ర్యాంకు సాధించగలిగా. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎంచుకుంటా. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా. – పెనికలపాటి రవికిషోర్, జేఈఈ మెయిన్, ఆలిండియా 6వ ర్యాంకర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా.. మాది.. శ్రీకాకుళం. నాన్న రవిశంకర్, అమ్మ స్వరాజ్యలక్ష్మి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. ఇంటర్మీడియెట్‌లో 972 మార్కులు సాధించా. జేఈఈ మెయిన్‌లో ఓబీసీ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు, ఓపెన్ కేటగిరీలో 7వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చదువుతా. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నదే నా లక్ష్యం. – ఎం.హిమవంశీ, జేఈఈ మెయిన్, ఆలిండియా ఏడో ర్యాంకర్ నా లక్ష్యం సివిల్స్.. మాది శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం కాకరపల్లి. నాన్న గోవిందరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మ జయలక్ష్మి గృహిణి. వారి ప్రోత్సాహంతోనే నేను రాణిస్తున్నా. ఇంటర్మీడియెట్‌లో 983 మార్కులు సాధించా. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చేశాక సివిల్స్ రాస్తా. సివిల్స్ సాధించడమే నా జీవితాశయం. –పి.జలజాక్షి, జేఈఈ మెయిన్, ఆలిండియా 9వ ర్యాంకర్ విద్యార్థులు సమానమైన స్కోరు సాధిస్తే.. ముందు ఎవరికి ప్రాధాన్యత? కంప్యూటర్ బేస్డ్లో జరిగే జేఈఈ మెయిన్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో రెండు సెక్షన్లలో ప్రశ్నలు ఇస్తారు. ఎ–సెక్షన్లో ఒక్కో సబ్జెక్టులో 20 చొప్పున, బి సెక్షన్లో 10 చొప్పున ప్రశ్నలుంటాయి. ఎ–సెక్షన్‌లోని 20 ప్రశ్నలు బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలు. వీటన్నిటికీ సమాధానాలివ్వాలి. ఇక బి సెక్షన్‌లోని న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నల్లో ఐదింటికి సమాధానాలివ్వాలి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. తప్పుగా సమాధానాలు రాసినవాటికి నెగిటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున మైనస్ చేస్తారు. రోజుకు రెండు బ్యాచుల చొప్పున ఐదారురోజుల పాటు నిర్వహించే ఈ పరీక్షల్లో ఒకరోజు సులభం, మరో రోజు కష్టంగా ప్రశ్నలున్నా నార్మలైజేషన్ ద్వారా దాన్ని సరిసమానంగా ఉండేలా చేసి అభ్యర్థులకు స్కోరును నిర్ణయిస్తారు. ఈ విధానంలో ఏ ఇద్దరు అభ్యర్థులకు సమానమైన స్కోరు ఉన్నా ‘టై బ్రేక్’ విధానాన్ని అనుసరించి ర్యాంకులను ప్రకటిస్తారు. ప్రాధాన్యత క్రమంలో ఇలా ఉంటుంది. ► తొలుత మ్యాథమెటిక్స్‌లో అభ్యర్థులు సాధించిన స్కోరును పరిగణలోకి తీసుకొని అధిక స్కోరు ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు. ► రెండోదిగా ఫిజిక్సు స్కోరు, మూడోదిగా కెమిస్ట్రీ స్కోర్లను పరిగణనలోకి తీసుకుంటారు. ► మూడింటిలోనూ అభ్యర్థులకు సరిసమానమైన స్కోర్ ఉంటే.. పరీక్షలో ఆయా సబ్జెక్టుల్లో తక్కువ తప్పు సమాధానాలిచ్చి.. ఎక్కువ సరైన సమాధానాలిచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ► అందులోనూ సరిసమానమైన స్కోర్ ఉంటే.. మ్యాథ్స్‌లో తక్కువ తప్పు సమాధానాలిచ్చి, ఎక్కువ సరైన సమాధానాలిచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. దీనిలోనూ సమానంగా ఉంటే ఫిజిక్స్‌లో తక్కువ తప్పు సమాధానాలిచ్చి, ఎక్కువ సరైన సమాధానాలిచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. దీనిలోనూ అభ్యర్థులకు సరిసమానమైన స్కోర్లు ఉంటే కెమిస్ట్రీలో తప్పు సమాధానాలు తక్కువ ఇచ్చి, సరైన సమాధానాలు ఎక్కువ ఇచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ► ఒకవేళ ఈ అన్ని సబ్జెక్టులోనూ ఏ ఇద్దరు అభ్యర్థులు సమానంగా నిలిచినా ముందుగా వయసుపరంగా పెద్దవారికి ప్రాధాన్యమిస్తారు. ► అప్పటికీ సమానమైన పరిస్థితి ఏర్పడితే దరఖాస్తు నంబర్‌ను అసెండింగ్ ఆర్డర్లో తీసుకొని ర్యాంకును ప్రకటిస్తారు. -
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) విడుదల చేసింది. జేఈఈ అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.inలో ఫలితాలను అందుబాటులో ఉంచింది. జేఈఈ మెయిన్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తెలుగు విద్యార్థి పి రవిశంకర్ ఆరో ర్యాంక్ సాధించగా.. హిమవంశీకి ఏడో ర్యాంక్, పల్లి జయలక్ష్మికి 9వ ర్యాంక్ వచ్చింది. కాగా ఆదివారం ర్యాంకులను విడుదల చేయకుండా కేవలం ఫైనల్ కీని మాత్రమే రిలీజ్చేసిన ఎన్టీఏ.. తాజాగా ర్యాంకులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. -
జేఈఈ మెయిన్స్ ఫలితాలపై ఉత్కంఠ: ర్యాంకెంత? సీటెక్కడ?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పూర్తయింది. ఇందులో అర్హత సాధిస్తే అడ్వాన్స్‌కు వెళ్తారు. అందులో లభించే ర్యాంకు ఆధారంగానే ఐఐటీ కాలేజీల్లో సీట్లు లభిస్తాయి. ఇలా అడ్వాన్స్ ర్యాంకును బట్టి ఐఐటీల్లో సీటు వస్తే... జేఈఈ మెయిన్స్ ర్యాంకు ఆధారంగా ఎన్ఐటీలు, ఐఐఐటీల్లో ఇంజనీరింగ్ సీట్లు పొందే అవకాశం ఉంది. ఇక్కడే విద్యార్థుల్లో అసలైన టెన్షన్ మొదలవుతుంది. జేఈఈ మెయిన్స్‌లో ఎంత ర్యాంకు వస్తుందో? జేఈఈ అడ్వాన్స్‌కు ఎంపిక కాకుంటే..? ఆ ర్యాంకుతో నిట్లు, ఇతర విద్యాసంస్థల్లో సీటు వస్తుందా? రాదా? అనే ఆలోచనతో సమమతమవుతుంటారు. చాలామందిలో ఉన్న అపోహ ఏమిటంటే... జేఈఈ మెయిన్స్‌లో 10 వేల పైన ర్యాంకు వస్తే ఎన్ఐటీల్లో సీటు కోసం ప్రయత్నించడం వృధా అని. అయితే ఇది ముమ్మాటికీ తొందరపాటు చర్యే అంటున్నారు నిపుణులు. ‘గత కొన్నేళ్ళుగా ఏ సంస్థలో ఏ ర్యాంకు వరకు సీట్లు కేటాయించారు? పోటీ ఎలా ఉంది? అనే దానిపై విద్యార్థులు కొంత కసరత్తు చేయాలి. అలాగే తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకూ వేచి చూడాలి..’అని స్పష్టం చేస్తున్నారు. కాస్త ఎక్కువ ర్యాంకు వచ్చినా సీటు ఈజీయే! ఎన్ఐటీలు అంటే ఐఐటీల తర్వాత దేశంలో పేరెన్నికగన్న విద్యా సంస్థలు. వీటిల్లో ఏ కోర్సు చేసినా జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంటుంది. క్యాంపస్ ప్లేస్మెంట్లలో కంపెనీలు భారీ వేతనాలిచ్చి ఎంపిక చేసుకుంటాయి. కాబట్టి ఫలానా కోర్సే కావాలి.. ఫలానా ఎన్ఐటీలోనే కావాలనే విషయాన్ని విద్యార్థులు పక్కన బెడితే, కాస్త ఎక్కువ ర్యాంకులోనూ సీటు ఈజీగానే సంపాదించే వీలుందని గత కొన్నేళ్ళ కౌన్సెలింగ్ డేటా చెబుతోంది. వరంగల్, తాడేపల్లిగూడెంలలో ఇలా.. గత ఐదేళ్ల సీట్ల కేటాయింపును పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ కేటగిరీలో 75 వేల వరకు, రిజర్వేషన్ కేటగిరీలో 2 లక్షల వరకు ర్యాంకు వచ్చినా వీటిల్లో సీటు గ్యారెంటీ అని తెలుస్తోంది. వరంగల్ నిట్ సీఎస్ఈలో బాలురకు 3,089 ర్యాంకు, బాలికలకు 3,971 ర్యాంకు వరకు సీటు వస్తుంటే, అదే ఏపీ నిట్ (తాడేపల్లిగూడెం)లో బాలురకు 14 వేలు, బాలికలకు 28 వేల వరకు సీటు వస్తోంది. ఓబీసీలకు వరంగల్‌లో గరిష్టంగా 13 వేల వరకు, ఏపీలో 33 వేల ర్యాంకు వరకు సీట్లు వస్తున్నాయి. ఎస్సీ కేటగిరీకైతే గరిష్టంగా 97,139 వరకు, ఎస్టీలకు 48 వేల ర్యాంకు వరకు సీట్లు దక్కాయి. మెకానికల్ బ్రాంచి ఓపెన్ కేటగిరీలోనే వరంగల్ నిట్‌లో 17 వేల వరకు, ఏపీలో 75 వేల వరకు ర్యాంకులకు సీట్లొచ్చాయి. వీటిల్లో అయితే 50 వేల వరకు.. తిరుచ్చి, సూరత్కల్, క్యాలికట్, నాగపూర్ వంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఐటీల్లో ఓపెన్ కేటగిరీ విద్యార్థులు కూడా గరిష్టంగా జేఈఈ ర్యాంకు 50 వేల వరకు వచ్చినా సీటు సంపాదించిన ఉదంతాలున్నాయి. జేఈఈ మెయిన్స్ ద్వారా 34,319 సీట్లు భర్తీ దేశవ్యాప్తంగా ఐఐటీల్లో 16,050 సీట్లు, ఎన్ఐటీల్లో 23,056, ఐఐఐటీల్లో 5,643, కేంద్ర ఆర్థిక సహకారంతో నడిచే సంస్థల్లో 5,620... వెరసి 50,369 సీట్లు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నాయి. అడ్వాన్స్‌తో భర్తీ చేసే ఐఐటీ సీట్లు 16,050 పక్కనబెడితే మిగిలిన 34,319 సీట్లు జేఈఈ మెయిన్స్ ర్యాంకు ద్వారానే భర్తీ చేస్తారు. అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకోవాలి జేఈఈ మెయిన్స్ ర్యాంకులు, నిట్‌లలో సీట్లపై విద్యార్థుల్లో అవగాహన తక్కువ. 10 వేలు దాటి ర్యాంకు వస్తే నీరసపడి పోతున్నారు. కానీ ఏ కాలేజీ అయినా సరే, ఏ బ్రాంచీ అయినా ఫర్వాలేదు అనుకుంటే, ఓపెన్ కేటగిరీలో 40 వేల వరకు, రిజర్వేషన్ అభ్యర్థులకు 2 లక్షల వరకు ర్యాంకు వచ్చినా సీటు వచ్చే అవకాశం ఉందని గత కొన్నేళ్ల కౌన్సెలింగ్ ప్రక్రియను అధ్యయనం చేస్తే తెలు స్తుంది. అందువల్ల తొందరపడి ఇతర ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరవద్దు. – ఎంఎన్ రావు(గణిత శాస్త్ర నిపుణులు) -
జేఈఈ మెయిన్‌కు 6,29,778 మంది
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ సహా జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం నుంచి తుది విడత జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ నిర్వహిస్తోంది. పరీక్ష కేంద్రానికి కనీసం గంట ముందే చేరుకోవాలని ఎన్టీఏ సూచించింది. పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు ఉంటుందని తెలిపింది. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించే అవకాశం లేదని స్పష్టం చేసింది. కోవిడ్ సమయంలో నాలుగు విడతలుగా పరీక్ష నిర్వహించారు. ఈ సంవత్సరం మాత్రం రెండు విడతలుగానే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మొదటి విడత పరీక్షను నిర్వహించిన ఎన్టీఏ అభ్యర్థుల పర్సంటైల్ కూడా ప్రకటించింది. రెండో విడత జరగబోయే పరీక్షకు దేశవ్యాప్తంగా 6,29,778 మంది రిజిస్టర్ చేసుకున్నట్టు ఎన్టీఏ పేర్కొంది. సిలబస్ కుదించకుండా చాయిస్ జేఈఈ మెయిన్స్ పరీక్ష విధానాన్ని ఈ సంవత్సరం పూర్తిగా మార్చారు. గతంలో సెక్షన్–ఏ లోని బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలకు మాత్రమే నెగెటివ్ మార్కులుండేవి. ఈసారి సెక్షన్–బీ లోని న్యూమరికల్ వేల్యూ ప్రశ్నలకు కూడా నెగెటివ్ మార్కులుంటాయని ఎన్టీఏ తెలిపింది. బీఈ, బీటెక్‌తో పాటు బీఆర్క్‌కు సంబంధించిన పేపర్–2ఏ లోని సెక్షన్–బీ లో ప్రతి ప్రశ్నకూ నెగెటివ్ మార్కు ఉంటుంది. కరోనాతో 2021–22లోనూ పలు రాష్ట్రాల ఇంటర్ బోర్డులు సిలబస్‌ను కుదించినా ఎన్టీఏ మాత్రం కుదించలేదు. కాకపోతే కొన్ని మినహాయింపులను ప్రకటించింది. పేపర్–1, పేపర్–2ఏ, 2–బీ విభాగాల్లో పార్టు1లలోని ప్రశ్నల్లో చాయిస్‌ను ఇచ్చింది. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ, తెలుగు, ఉర్దూ సహా పలు ప్రాంతీయ భాషల్లో కూడా ఉంటాయి. ఏపీ, తెలంగాణల్లో ఇంగ్లిష్తో పాటు తెలుగు మాధ్యమ ప్రశ్నపత్రాలు ఇస్తారు. తుది విడత మెయిన్ పరీక్ష ముగిసిన కొద్ది రోజులకే ప్రాథమిక కీ విడుదల చేసేందుకు ఎన్టీఏ సన్నాహాలు చేస్తోంది. ఆ మర్నాడే పూర్తిస్థాయి పర్సంటైల్ వెలువడే వీలుంది. ఆగస్టు రెండో వారంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సంబంధించిన ప్రక్రియ మొదలవ్వనుంది. అదేనెల 28న పరీక్ష నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. టై బ్రేకర్‌లోనూ మార్పులు ఈసారి టై బ్రేకర్ నిబంధనల్లోనూ మార్పులు జరిగాయి. సమానమైన స్కోరు సాధించిన వారి విషయంలో వయసును కూడా ప్రమాణంగా తీసుకోవాలని నిర్ణయించింది. 2021లో ఈ పద్ధతిని రద్దు చేసిన ఎన్టీఏ మళ్లీ అమల్లోకి తెచ్చింది. సమాన మార్కులు వచ్చిన విద్యార్థులుంటే మొదట స్కోర్ల వారీగా వరుసగా గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అనంతరం తప్పుడు సమాధానాల నిష్పత్తిని అవే సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తారు. అప్పటికీ సమాన స్థాయిలో ఉంటే వయసును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అప్పటికీ సాధ్యం కాకుంటే ముందుగా దరఖాస్తు చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. మొదటి విడత రాసినవారికి సులువే తొలి విడత జేఈఈ మెయిన్స్ రాసిన వాళ్లకు ఈ పరీక్ష కొంత తేలికగానే ఉండే వీలుంది. జూన్‌లో జరిగిన పరీక్ష తాలూకూ ప్రశ్నపత్రం ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి. దాదాపు అవే చాప్టర్స్ వచ్చే వీలుంది. మేథ్స్‌లో సుదీర్ఘంగా ప్రశ్నలుంటే కంగారు పడకూడదు. నెగెటివ్ మార్కింగ్‌ను దృష్టిలో పెట్టుకుని జవాబులివ్వాలి. – ఎంఎన్ రావు (గణిత శాస్త్ర బోధకుడు) పాత పేపర్లు తిరగేస్తే మంచిది జూన్‌లో జరిగిన జేఈఈలో ఫిజిక్స్ పేపర్ మధ్యస్తంగానే ఉంది. ఈసారీ ఇంచుమించు ఇదే మాదిరిగా ఉండే వీలుంది. ఇవే చాప్టర్స్‌ను చదువుకుని, పాత పేపర్లు ఒక్కసారి తిరగేస్తే తేలికగా సమాధానం ఇవ్వొచ్చు. తెలియని ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. దీనివల్ల నెగెటివ్ మార్కుల బాధ నుంచి తప్పించుకోవచ్చు. – జీకే రావు (ఫిజిక్స్ బోధకుడు) -
ఆంగ్ల మాధ్యమంపైనే ఆసక్తి.. జేఈఈలో 99 శాతానికి పైగా వారే!
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యావకాశాలను ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో ఆంగ్ల మాధ్యమం వైపే విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. తమ ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసేందుకు ముందుకు రావడం లేదు. ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసే వారు అతి తక్కువ మంది కాగా.. వారిలోనూ మెరిట్ ర్యాంకుల్లో నిలిచేలా స్కోర్ సాధించిన వారు శూన్యం. ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్‌లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. డిమాండ్ల నేపథ్యంలో.. ఉన్నత విద్యావకాశాలను ముఖ్యంగా ఇంజనీరింగ్ తదితర కోర్సులను ఆయా ప్రాంతీయ భాషల్లోనూ విద్యార్థులకు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం 2020–21 నుంచి చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. నూతన జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గతేడాది నుంచి జేఈఈ మెయిన్‌ను ఆంగ్లంతో పాటు 12 ప్రాంతీయ భాషల్లో నిర్వహింపజేస్తోంది. హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లోనూ జేఈఈ మెయిన్ రాసేందుకు విద్యార్థులకు అవకాశమిచ్చింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటుకు ముందు జేఈఈ నిర్వహణ బాధ్యతలు చూసిన సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ).. 2014 వరకు ఆంగ్లం, హిందీ, గుజరాతీ, మరాఠీ, ఉర్దూ మాధ్యమాల్లో జేఈఈని నిర్వహించేది. 2016 తర్వాత ఆంగ్లం, హిందీ, గుజరాతీల్లో జేఈఈని కొనసాగిస్తూ మరాఠీ, ఉర్దూలను తొలగించారు. తమ రాష్ట్రం నుంచి అత్యధిక సంఖ్యలో జేఈఈ పరీక్షలకు విద్యార్థులు హాజరవుతున్నందున బెంగాలీ భాషా మాధ్యమంలో ఈ పరీక్షలను నిర్వహించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేయడంతో.. ప్రాంతీయ భాషా మాధ్యమాల్లో జేఈఈ మెయిన్ నిర్వహణకు బీజం పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తుండటం, తమిళనాడు నుంచి కూడా అంతకు ముందు నుంచే ఆ భాషా మాధ్యమంలో పరీక్ష నిర్వహించాలన్న డిమాండ్ ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనలతో ఎన్టీఏ.. జేఈఈలో ఆంగ్లం, హిందీ, గుజరాతీలతో పాటుగా కొత్తగా మరో 10 ప్రాంతీయ భాషా మాధ్యమాలను ప్రవేశపెట్టింది. ఇదీ చదవండి: Gadapa Gadapaku Mana Prabhutvam: గడప గడపకు మన ప్రభుత్వం.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
ఆన్సర్ చేసినా ఆనవాలే లేదట.. జేఈఈ అభ్యర్థులకు చేదు అనుభవం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్ష మునుపెన్నడూ లేనంతగా సమస్యలు సృష్టిస్తోంది. పరీక్ష రోజు గంటల తరబడి ఆలస్యం కాగా... ఇప్పు డు సమాధానం ఇచ్చిన ప్రశ్నలను కంప్యూటర్ లెక్కలోకి తీసుకోని చేదు అనుభవం అభ్యర్థులు చవిచూస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దేశవ్యాప్తంగా నిర్వ హించిన ఈ పరీక్షలో లోపాలు వస్తే వినే నాథుడే కన్పించడం లేదని విద్యార్థులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎన్టీఏ జేఈఈ ప్రశ్నపత్రం కీ విడు దల చేసింది. అభ్యర్థులు లాగిన్ అయి చూసుకుని కలవరప డుతున్నారు. తాము ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే, తక్కువ ఇచ్చినట్టు చూపిస్తోందని అనేకమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఒక మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్ష రాసిన విద్యార్థుల్లో దాదాపు పది మందికి ఇదే అనుభవం ఎదురైంది. అనుజ్ అనే విద్యార్థి 65 ప్రశ్నలకు కంప్యూటర్లో టిక్ పెడితే, రెస్పాన్స్ షీట్ మాత్రం 30 ప్రశ్నలకు బదులిచ్చినట్లే చూపింది. మరో విద్యార్థిని భవిత్ 51 ప్రశ్నలు పూర్తి చేస్తే, 34 మాత్రమే చేసినట్టు వచ్చిందని తెలిపింది. ముద్ద యశ్వసిని అనే విద్యార్థిని 21 ప్రశ్నలు పూర్తి చేస్తే, రెస్పాన్స్ షీట్ లో అసలేమీ చేయలేదని వచ్చిందని వాపోయింది. దీనిపై ఎన్టీఏకి ఫిర్యాదు చేసినా స్పందించలేదని, పొరపాట్లను సరిచేయకపోతే ప్రతిభావంతులు కూడా కనీస ర్యాంకుకు చేరుకోవడం కష్టమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. -
జేఈఈ మెయిన్స్‌కు ‘సర్వర్’ షాక్
సాక్షి, హైదరాబాద్/సుల్తాన్‌బజార్: జేఈఈ మెయిన్స్ పరీక్ష శుక్రవారం విద్యార్థులకు చుక్కలు చూపింది. ప్రధానంగా హైదరాబాద్‌లోని అబిడ్స్, మూసారాంబాగ్‌లలో ఓ ప్రైవేటు కాలేజీకి చెందిన రెండు కేంద్రాల్లో సాంకేతిక సమస్యలతో పరీక్ష గంటల తరబడి ఆలస్యమైంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆ పరీక్ష కేంద్రాల వద్ద ఆందోళనకు దిగారు. పరీక్ష నిర్వహణలో జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విఫలమైందని మండిపడ్డారు. కొందరు విద్యార్థులు కాలేజీ అద్దాలు పగలగొట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని శాంతింపజేశారు. సర్వర్ మొరాయించడంతో... దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ తొలిదశ పరీక్షను ఈ నెల 23 నుంచి 29 వరకు ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లోని మూసా రాంబాగ్ పరీక్ష కేంద్రంలో శుక్రవారం ఉద యం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కావాల్సి ఉండగా విద్యార్థులు 8 గంటలకే కేంద్రానికి చేరుకున్నారు. అయితే ఆడ్మిట్ కార్డుపై బార్ కోడ్‌ను స్కాన్ చేసే సమయంలో ఎన్టీఏతో అను సంధానమైన సర్వర్ మొరాయించింది. చాలా సేపటి వరకూ అది పనిచేయలేదు. చివరకు కనెక్ట్ అవ్వడంతో విద్యార్థులను పరీక్ష హాలు లోకి పంపారు. అప్పటికే మానసిక ఆందోళనకు గురైన విద్యా ర్థులు పూర్తిస్థాయి లో పరీక్ష రాయలేకపోయి నట్లు తెలిపారు. కంప్యూ టర్ స్క్రీన్‌పై కొన్ని ప్రశ్నలు సైతం సరిగ్గా కని పించలేదని.. ఫలితంగా పదుల సంఖ్యలో మార్కులు కోల్పో యామని పేర్కొ న్నారు. మధ్యాహ్నం 3 గంట ల సెషన్లోనూ ఇదే సమస్య తలెత్తింది. కొంద రు విద్యార్థులు మొత్తం ప్రశ్నలు కన్పించలేదని తెలిపారు. అబిడ్స్‌లోని పరీక్ష కేంద్రంలోనూ ఇదే రకమైన సమస్య ఎదురైంది. ఉదయం 9 గంటలకు జర గాల్సిన పరీక్ష 10:30 గంటలకు మొదలైంది. ఇక మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన పరీక్ష సాంకేతిక కారణాలతో సాయంత్రం 5 గంటల వరకు మొదలుకాక పోవడంతో ఆ కేంద్రంలో పరీక్షను ఎన్టీఏ వాయిదా వేసినట్లు కాలేజీ నిర్వాహకులు ఓ నోట్ విడుదల చేశారు. పరీక్ష తేదీని ఎన్టీఏ త్వరలో ప్రకటిస్తుందన్నారు. గణితం తికమక... ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈజీ రెండేళ్ల జేఈఈ మెయిన్స్ పేపర్‌తో పోలిస్తే ఈసారి తేలికగానే ఉంది. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా ఆన్లైన్ బోధన జరగడం వల్ల కొంత ఇబ్బంది పడే వీలుంది. గణితం 5 నుంచి 10 న్యూమరికల్ ప్రశ్నలు మినహా సమాధానాలు గుర్తించడానికి ఎక్కువ సమయం తీసుకుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీలో ప్రశ్నలు గతంలో వచ్చినవే ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఎన్సీఈ ఆర్టీ సిలబస్ నుంచే ప్రశ్నలు వచ్చాయి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 300 మార్కులకు 78 నుంచి 87 మార్కులు తెచ్చుకుంటే అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్థులు 60 నుంచి 65 మార్కులతో క్వాలిఫై అవుతారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 40–50 మార్కులతో క్వాలిఫై అయ్యే అవకాశం కనిపిస్తోంది. – ఎంఎన్‌రావు, గణిత శాస్త్ర నిపుణుడు తీవ్ర ఆందోళనకు గురయ్యాం దాదాపు 4 గంటలు ఎండలో ఉండాల్సి వచ్చింది. సర్వర్ పనిచేయడం లేదని చెప్పారు. ఆ తర్వాత తర్వాత పరీక్ష రాసినా తీవ్ర ఆందోళన మధ్య సరిగా సమాధానాలు ఇవ్వలేకపోయాం. ఈ పరీక్షను తిరిగి నిర్వహిస్తే బాగుంటుంది. – అతావుల్లా, జేఈఈ పరీక్ష రాసిన విద్యార్థి, టౌలిచౌకి అరోరా కాలేజీ వద్ద ఉద్రిక్తత అబిడ్స్ అరోరా కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఇంకా జరగలేదు. ఇదే విషయంపై సిబ్బందిని ప్రశ్నిస్తే సర్వర్‌డౌన్, టెక్నికల్ ప్రాబ్లమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు కాలేజీ కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ బయట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. దీంతో అబిడ్స్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చదవండి: (అర్ధరాత్రి ఫోన్.. భర్త వార్నింగ్.. గంట తర్వాత చూస్తే..) -
Telangana: జేఈఈ మెయిన్స్ తొలి దశ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా 11 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్స్ తొలి దశ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29వ తేదీ వరకూ ఆన్లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షలకు తెలంగాణ వ్యాప్తంగా 1.90 లక్షల మంది హాజరవనున్నారు. ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విద్యార్థు లకు అడ్మిట్ కార్డులు జారీ చేసింది. కోవిడ్ తర్వాత జరిగే మెయిన్స్ ఈసారి భిన్నంగా ఉంటుం దని ఎన్టీఏ తెలి పింది. రాష్ట్రాల పరిధిలోని వివిధ బోర్డులు ఇంటర్, తత్సమాన స్థాయి పరీక్షల్లో 70% సిలబస్‌ను మాత్రమేబోధించాయి. అయితే జేఈఈలో మాత్రం ఈ నిబంధన వర్తించే అవకాశం లేదు. కాకపోతే ఇది వరకు మాదిరి 90 ప్రశ్నలిచ్చి మొత్తం సమాధా నాలు రాయాలనే నిబంధనలో మార్పు చేశారు. 75 ప్రశ్నలకు సమాధానం ఇస్తే సరిపోతుంది. అంటే జేఈఈ మెయిన్స్ పేపర్ 360 మార్కులకు బదులు 300 మార్కులకే ఉంటుందని సమాచారం విద్యార్థులకు ముఖ్య సూచనలు.. ►జేఈఈ మెయిన్స్ కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పరీక్షకు హాజరయ్యే విద్యా ర్థులు అడ్మిషన్ కార్డుతో పాటు, కోవిడ్ లేదన్న స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఏదైనా ఐడీ(ఆధార్ లాంటిది) తీసుకొని వెళ్లాలి. ►పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, మాస్క్, హ్యాండ్ శానిటై జర్, బాల్ పాయింట్ పెన్ను వెంట తీసుకెళ్లాలి. ►పరీక్ష రెండు షిఫ్టు్టలుగా ఉంటుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకూ ఉంటుంది. రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకూ ఉంటుంది. ►అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ ‘ఒక నిమిషం’ నిబంధన అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. కాబట్టి వీలైనంత వరకూ గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ►ఈసారి సెక్షన్ బీలో కూడా నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుందని ఎన్టీఏ తెలిపింది. -
జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదల
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరిం గ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ తొలి దశ పరీక్ష ఈ నెల 23 నుంచి జరుగుతుంది. ఈ నెల 29 వరకూ జరిగే మొదటి విడత మెయిన్స్‌కు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అడ్మిట్ కార్డులను ఆన్లైన్ ద్వారా జారీ చేసినట్టు ఎన్టీఏ పేర్కొంది. అయితే, శనివారం నుంచే ఇవి డౌన్లోడ్ కావాల్సి ఉన్నా, సైట్ ఓపెన్ కాలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎన్టీఏ మరో ప్రకటన విడుదల చేసింది. అడ్మిట్ కార్డులు తమ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చ ని,అందుకోసం విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ ఆన్లైన్లో ఎంటర్ చేసు కోవాలని తెలిపింది. -
ఒకసారి ఐఐటీ సీటు వదులుకుంటే ఇక నో చాన్స్..!
సాక్షి, అమరావతి: గతంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో వచ్చిన సీటును వదిలేసుకున్నవారికి జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహణ సంస్థ ఐఐటీ బాంబే షాకిచ్చింది. అలాంటివారు ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి అవకాశం లేదని తేల్చిచెప్పింది. దీని ప్రకారం.. గతంలో కౌన్సెలింగ్ ద్వారా కేటాయించిన సీటుకు అంగీకారం తెలిపి.. తర్వాత చేరని విద్యార్థులకు అడ్వాన్స్డ్–2022 పరీక్ష రాసే అవకాశం ఉండదు. అలాగే ఐఐటీల్లో చేరి మధ్యలో మానేసినవారికి కూడా చాన్స్ లేదని పేర్కొంది. అదేవిధంగా జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా)–2021 కౌన్సెలింగ్‌లో కేటాయించిన ఐఐటీ సీటును ఆమోదించి.. ఆ తర్వాత చివరి రౌండ్ కౌన్సెలింగ్‌కు ముందువరకు దాన్ని ఉపసంహరించకుండా కొనసాగి ఉంటే వారికి కూడా అడ్వాన్స్డ్ రాయడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. అలాగే అడ్వాన్స్‌డ్‌లో అర్హత మార్కులు సాధించినవారే ఆర్కిటెక్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ)కి అర్హులని పేర్కొంది. జేఈఈ మెయిన్ పేపర్ 2ఏ, 2బీల్లో అర్హత ఉన్నా అడ్వాన్స్డ్ రాయకుండా నేరుగా ఏఏటీ పరీక్షకు అవకాశం ఉండదని తెలిపింది. అడ్వాన్స్డ్ పరీక్షకు సంబంధించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ ఐఐటీ బాంబే ఈ విషయాలు వెల్లడించింది. జేఈఈ మెయిన్‌కు నమోదు చేసిన కేటగిరీలే కొనసాగింపు విద్యార్థులు తమ రిజర్వేషన్, తదితర కేటగిరీలకు సంబంధించి జేఈఈ మెయిన్‌లో నమోదు చేసిన అంశాలే జేఈఈ అడ్వాన్స్డ్కూ యథాతథంగా కొనసాగుతాయని ఐఐటీ బాంబే తెలిపింది. మెయిన్‌లో తప్పుగా కేటగిరీలను నమోదు చేస్తే వాటిని అడ్వాన్స్‌డ్‌లో సరిచేసుకునేందుకు అవకాశం ఉండదని స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్‌లో జనరల్ కేటగిరీ ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కోటా కింద నమోదు చేసుకున్న విద్యార్థులు ఆ పత్రాలను సమర్పించకపోతే.. జనరల్ కటాఫ్ మార్కులు సాధిస్తేనే అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులని పేర్కొంది. ఇదే నిబంధన ఓబీసీ నాన్ క్రిమీలేయర్ కేటగిరీకి వర్తిస్తుందని తెలిపింది. అలాగే రాష్ట్రాల జాబితాలో ఓబీసీ నాన్ క్రిమీలేయర్ కేటగిరీలో ఉండి.. సెంట్రల్ ఓబీసీ జాబితాలో లేని కేటగిరీల విద్యార్థులు కూడా ఆ కేటగిరీ ప్రయోజనాలు పొందలేరని వెల్లడించింది. రక్షణ సర్వీసుల్లో పనిచేసేవారి పిల్లల రిజర్వేషన్లు కూడా కొన్ని కేటగిరీల వారికే వర్తించనున్నాయి. యుద్ధాల్లో లేదా శాంతిస్థాపన కార్యక్రమాల్లో మరణించిన, వికలాంగులైన, కనిపించకుండాపోయిన వారి సంతానానికి మాత్రమే ఈ కోటా సీట్లు దక్కుతాయి. ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్డ్ కాగా, జేఈఈ అడ్వాన్స్డ్–2022 పరీక్షను ఆగస్టు 28న నిర్వహించనున్నట్లు ఐఐటీ బాంబే ప్రకటించింది. వాస్తవానికి ఇంతకు ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై 4న ఈ పరీక్షను నిర్వహించాల్సి ఉంది. కానీ జేఈఈ మెయిన్ పరీక్షలు జూన్, జూలై నెలల్లోకి వాయిదా పడడంతో అడ్వాన్స్డ్ పరీక్షను కూడా వాయిదా వేయక తప్పలేదు. కాగా జేఈఈ మెయిన్‌లో నిర్ణీత కటాఫ్ మార్కులు సాధించి.. అర్హత పొందిన వారిలో టాప్ 2.5 లక్షల మందికి మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు. వీరికి మాత్రమే అడ్వాన్స్డ్–2022కు అవకాశం.. ► గతేడాది జోసా చివరి రౌండ్ కౌన్సెలింగ్‌కు ముందు ఉపసంహరించుకున్నవారు. ► బీఈ, బీటెక్‌లతోపాటు డ్యుయెల్ డిగ్రీ కోర్సుల్లో సీట్లు పొందేందుకు ఐఐటీలు నిర్వహించే రెసిడెన్షియల్ ప్రిపరేటరీ కోర్సుల్లో చేరిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు. ► గతేడాది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లో సీట్లు వచ్చినవారు. అయితే వీరికి నిర్దేశిత అర్హతలు ఉండాలి. ► గతేడాది సీటు పొందినా దాన్ని ఆమోదించడం, ఫీజు చెల్లించడం, విద్యా సంస్థలో రిపోర్టు చేయనివారు ► 2021 జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకొని రెండు పేపర్లూ రాయనివారు.. జేఈఈ మెయిన్–2022లో అర్హత సాధించినవారు. ► జేఈఈ మెయిన్ బీఈ, బీటెక్ కోర్సులకు సంబంధించిన పేపర్–1ను కాకుండా పేపర్ 2ఏ, 2బీలను రాసినవారు. -
జేఈఈ సన్నద్ధతకు సమయమేదీ?
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ విద్యార్థులు గతంలో ఎన్నడూ లేనంత ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2022–23 నిర్వహణ విషయంలో కేంద్ర విద్యా శాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గందరగోళ చర్యలే ఇందుకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జేఈఈ షెడ్యూల్‌ను ఆరేడు నెలలకు ముందుగానే ప్రకటించాల్సి ఉన్నా తీవ్ర జాప్యం చేశారు. జనవరి లేదా ఫిబ్రవరిలో మొదటి విడత జేఈఈ మెయిన్ నిర్వహించాల్సి ఉంది. అనంతరం ఏప్రిల్ లేదా మేలో రెండో విడత పరీక్షను జరపాల్సి ఉండగా పరీక్ష షెడ్యూల్, తేదీల విషయంలో తీవ్ర అలసత్వం ప్రదర్శించారు. విద్యార్థులకు ఇబ్బందులు.. ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జేఈఈ మెయిన్ మొదటి విడత, మే 24 నుంచి 29 వరకు రెండో విడత నిర్వహించేలా ఎన్టీఏ షెడ్యూల్ ఇచ్చింది. అప్పటికే పలు రాష్ట్రాల ఇంటర్మీడియెట్, హయ్యర్ సెకండరీ బోర్డులు తమ పబ్లిక్ పరీక్షల తేదీలను ప్రకటించాయి. సరిగ్గా అవే తేదీల్లో జేఈఈ పరీక్షలు నిర్వహించేలా ఎన్టీఏ షెడ్యూల్ ఇవ్వడంతో విద్యార్థులు చిక్కుల్లో పడ్డారు. చివరకు ఇంటర్ పరీక్షల తేదీలను కొన్ని బోర్డులు మార్పు చేసుకున్నాయి. అప్పటికే బోర్డుల పరీక్షలతో జేఈఈ తేదీలు క్లాష్ అవుతుండడంతో ఎన్టీఏ మెయిన్ పరీక్ష తేదీలను ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు నిర్వహించేలా మార్పు చేసింది. తమ తొలి షెడ్యూల్‌ను మార్పు చేసిన ఇంటర్ బోర్డులు మళ్లీ తమ పరీక్షల తేదీలను మార్చుకోవలసి వచ్చింది. జేఈఈ మెయిన్ షెడ్యూళ్ల గందరగోళంతో పలు రాష్ట్రాల బోర్డులు/సీబీఎస్ఈ విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. ఓ వైపు ఇంటర్.. మరోవైపు జేఈఈ ఎన్టీఏ అస్తవ్యస్త షెడ్యూళ్లతో విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తూనే జేఈఈ మెయిన్ రాయాల్సిన అగత్యం ఏర్పడింది. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలను జేఈఈ మెయిన్ తొలి విడత ముగిశాక మే 6 నుంచి 24 వరకు నిర్వహించేలా మార్పు చేశారు. దీంతో విద్యార్థులు మెయిన్ తొలి విడత పరీక్షలకు సన్నద్ధమయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఇంటర్ పరీక్షలు ముగిశాక అయినా జేఈఈకి సిద్ధమవుదామనుకుంటే వెనువెంటనే మెయిన్ పరీక్షలు ప్రారంభమవుతుండడంతో ఆ అవకాశం లేకుండా పోయిందని విద్యార్థులు వాపోతున్నారు. ఇంటర్ పరీక్షలకు, జేఈఈకి కనీసం 60–90 రోజుల వ్యవధి అవసరమవుతుందని, కానీ ఇక్కడ ఒక్కరోజు కూడా అవకాశం లేకుండా వెంటనే పరీక్షలకు సిద్ధపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల సన్నద్ధతకు వీలుగా మెయిన్ పరీక్షల తేదీలను మార్పు చేయాలని కోరుతున్నారు. -
8 నుంచి జేఈఈ మెయిన్ రెండో విడత దరఖాస్తులు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లు, తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2022–23 తొలిదశ పరీక్షల దరఖాస్తు ప్రక్రియ గురువారంతో ముగిసింది. రెండో దశ పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 8 నుంచి ప్రారంభం కానుంది. మే 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ పరీక్షలకు ముందే తొలిదశ మెయిన్ పరీక్ష జేఈఈ మెయిన్ తొలిదశ పరీక్షలు ఏప్రిల్ 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో ఇవి జరగనున్నాయి. ఏప్రిల్‌లోనే వివిధ బోర్డుల ఇంటర్మీడియెట్/+2 పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్ తొలివిడత పరీక్షలకు విద్యార్థుల హాజరు తక్కువగానే ఉండొచ్చని అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలను మే 6 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా తరగతులు సరిగ్గా జరగకపోవడంతో ఇంటర్ బోర్డు.. సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించింది. అయితే జేఈఈ మెయిన్ సిలబస్‌ను మాత్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) యథాతథంగానే ఉంచింది. దీంతో విద్యార్థులు జేఈఈ మెయిన్ సిలబస్‌ను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి వస్తోంది. ఓవైపు కరోనాతో విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఇంటర్ సిలబస్‌ను పూర్తి చేసి పరీక్షలకు సన్నద్ధం కావడానికే విద్యార్థులకు సమయమంతా సరిపోతోందని అధ్యాపకులు చెబుతున్నారు. జేఈఈ ప్రిపరేషన్‌కు అదనపు సమయం అవసరమవుతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షల కంటే ముందు జరిగే జేఈఈ మెయిన్ తొలివిడత పరీక్షలకు విద్యార్థులు సంసిద్ధం కాలేకపోతున్నారని పేర్కొంటున్నారు. దీంతో తొలివిడత పరీక్షకు నమోదు చేసుకున్నా హాజరు కావడం కష్టమేనని చెబుతున్నారు. ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక నిర్వహించే జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలకు విద్యార్థులు సిద్ధంగా ఉంటారని వివరిస్తున్నారు. మెయిన్ రెండో సెషన్ పరీక్షలు మే 24 నుంచి 29 వరకు జరగనున్నాయి. కాగా, జేఈఈ మెయిన్‌కి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య ఈసారి కూడా భారీగానే ఉండొచ్చని కోచింగ్ సెంటర్ల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా జేఈఈకి దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య 10 లక్షలు దాటుతోంది. -
‘మెయిన్’కు తగ్గిపోతున్నారు!
సాక్షి, అమరావతి: జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్‌కు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య ఏటా తగ్గుతోంది. విద్యాసంస్థల సంఖ్య, సీట్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఈ పరీక్షలకు నమోదయ్యే విద్యార్థుల సంఖ్య మాత్రం పెరగకపోవడం విశేషం. గత పదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది. లక్ష నుంచి లక్షన్నర వరకు తగ్గుదల 2012లో 12.20 లక్షల మంది, 2014లో 13.56 లక్షల మంది అభ్యర్థులు మెయిన్‌కు నమోదుకాగా 2021లో ఆ సంఖ్య 10.48 లక్షలకు తగ్గిపోయింది. 2018 వరకు మెయిన్స్ పరీక్షను ఏడాదికి ఒకసారే నిర్వహించేవారు. ఈ విధానంవల్ల విద్యార్థులు అటు ఇంటర్ పరీక్షలు, ఆ తర్వాత మెయిన్ పరీక్షలతో తీవ్ర ఒత్తిడికి గురయ్యేవారు. పైగా ఈ సీట్ల సాధన కోసం అభ్యర్థులు లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకోవడంవల్ల ఏడాదిపాటు నష్టపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2019 నుంచి ఏడాదికి రెండుసార్లు నిర్వహించే విధానాన్ని ప్రవేశపెట్టారు. కానీ, 2021లో కరోనావల్ల నాలుగుసార్లు నిర్వహించారు. అయితే.. 2021లో మినహా అంతకు ముందు సంవత్సరాల్లో మెయిన్‌కు నమోదైన విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. 2012లో 12.20 లక్షల మంది నమోదు కాగా.. 2013లో ఆ సంఖ్య 12.82 లక్షలకు పెరిగింది. 2014లో 13,56,805కు చేరింది. ఆ తర్వాత 2015 నుంచి విద్యార్థుల సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తోంది. 2015లో 13.04,495 మందికి తగ్గగా 2016కు వచ్చేసరికి 11,94,938కి.. 2017లో 11,86,454 మందికి పడిపోయింది. కానీ, 2018లో మాత్రం 12.59 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ 2019నుంచి రెండుసార్లు నిర్వహించేలా జేఈఈ విధానాన్ని మార్చినప్పటికీ అభ్యర్థుల సంఖ్య పెరగకపోగా తగ్గడం విశేషం. 2019లో 9,35,741 మంది, 2020లో 9,21,261 మంది, 2021లో 10,48,012 మంది నమోదయ్యారు. సీట్లు పెరిగినా పెరగని అభ్యర్థుల సంఖ్య దేశంలో 2016 నాటికి మొత్తం ఐఐటీలు (23), ఎన్ఐటీలు (31), ఐఐఐటీలు (26), జీఎఫ్‌ఐటీ (18)లలో 28,000 సీట్లు ఉండగా అవి 2021 నాటికి 37,952కు పెరిగాయి. ఐఐటీలలో 2016–17లో 10,572 సీట్లు ఉండగా ప్రస్తుతం 16,053కు చేరాయి. పైగా ఐఐటీల్లో మహిళల సంఖ్యను పెంచేందుకు వారికోసం ఆయా సంస్థల్లో సూపర్ న్యూమరరీ కింద 20 శాతం మేర సీట్లు అదనంగా కేటాయిస్తోంది. హాజరవుతున్న వారూ తగ్గుముఖం మరోవైపు.. మెయిన్‌కు రిజిస్టర్ అవుతున్న వారి సంఖ్యతో పోలిస్తే పరీక్ష రాస్తున్న వారి సంఖ్య మరింత తక్కువగా ఉంటోంది. లక్ష మందికి పైగా హాజరవ్వడంలేదు. ► 2021లో నాలుగు సెషన్లలో జేఈఈ మెయిన్‌ను నిర్వహించగా దేశవ్యాప్తంగా మొత్తం 10,48,012 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 9,39,008 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ► 2020లో 9,21,261 మంది నమోదు చేసుకోగా 8,69,010 మంది హాజరయ్యారు. ► 2019లో 9,35,741 మందికి గాను 8,81,096 మంది రాశారు. ► 2018లో 12.59 లక్షల మంది నమోదు కాగా 10.50 లక్షల మందే పరీక్షకు హాజరయ్యారు. ► 2017లో 11,86,454 మందిలో 10.20 లక్షల మంది.. ► 2016లో 11,94,938కి గాను 11 లక్షల మంది మాత్రమే హాజరయ్యారు. ► ఇక 2015లో 13,04,495 మందికిగాను 12.34 లక్షల మంది రాశారు. జేఈఈకి ప్రత్యేకంగా తర్ఫీదు కావలసి ఉండడం, ఐఐటీలు సహ ఇతర సంస్థలు ఎక్కడో దూరంగా ఉండడం, పైగా ఆయా సంస్థలలో ఫీజులను భరించే స్థోమత లేకపోవడంతో ఎక్కువమంది విద్యార్థులు స్థానికంగా ఉండే ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. -
జేఈఈ మెయిన్ తొలి దశ షెడ్యూల్ మార్పు
సాక్షి, అమరావతి: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2022–23 తొలి దశ పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏప్రిల్ 21కు వాయిదా వేసింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా జరుగుతాయి. తొలుత ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగాలి. అయితే వివిధ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు, జేఈఈ పరీక్షలు ఒకే తేదీల్లో రావడంతో విద్యార్థుల విన్నపాల మేరకు మార్పులు చేస్తున్నట్లు ఎన్టీఏ వివరించింది. మెయిన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు యథాతథంగా కొనసాగుతాయి. పరీక్ష కేంద్రాలకు సంబంధించిన నగరాల ఇంటిమేషన్ ఏప్రిల్ మొదటి వారంలో ఉంటుంది. అడ్మిట్ కార్డులను ఏప్రిల్ రెండోవారం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ వివరించింది. ఇంటర్ పరీక్షలపై తర్జనభర్జన జేఈఈ మెయిన్ తొలి దశ షెడ్యూల్ మార్పు ప్రభావం ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలపై పడుతోంది. ఎన్టీఏ తొలుత మెయిన్ తొలి దశ పరీక్షల కారణంగా ఇంటర్ పరీక్షలను ఇంటర్మీడియట్ బోర్డు వాయిదా వేసింది. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు జరిగే బోర్డు పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు నిర్వహించేలా షెడ్యూల్ మార్చింది. ఇప్పుడు జేఈఈ మెయిన్ తొలి దశ పరీక్షలు ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు వాయిదా వేయడంతో ఇంటర్మీడియట్ పరీక్షలు మళ్లీ గందరగోళంలో పడ్దాయి. జేఈఈ పరీక్షలు జరిగే ఏప్రిల్ 25న ఇంటర్ ఇంగ్లిష్ పేపర్, ఏప్రిల్ 29న మేథమెటిక్స్ పరీక్షలు ఉన్నాయి. రెండు పరీక్షలు ఒకే రోజున వచ్చాయి. దీంతో ఇంటర్ పరీక్షలపై విద్యా శాఖ అధికారులు మంగళవారం సమావేశమవుతున్నారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 28 వరకు నిర్వహించడానికి ఏప్రిల్ 21న ఫిజిక్సు పేపర్ రోజునే జేఈఈ పరీక్ష ఉంది. దీంతో పరీక్షలను వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. ఇంటర్ పరీక్షల తేదీలపై సందిగ్థత ఏర్పడటంతో టెన్త్ పరీక్షలపైనా దాని ప్రభావం పడవచ్చని అధికారులు చెబుతున్నారు. -
జూన్ మొదటి వారంలో ఎంసెట్!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్–2022పై ఉన్నత విద్యా మండలి కసరత్తు మొదలైంది. ఏ తేదీల్లో నిర్వహించాలనే దానిపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. 7వ తేదీన జరిగే సమావేశంలో చర్చ అనంతరం పరీక్ష తేదీలపై ప్రాథమిక అంగీకారానికి వచ్చే అవకాశం ఉందని ఉన్నత విద్యా మండలి వర్గాలు తెలిపాయి. అనంతరం విషయం ప్రభుత్వానికి తెలియజేసి, అనుమతి వచ్చిన తర్వాత షెడ్యూల్ ప్రకటిస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే ప్రకటించింది. ఈ పరీక్షలు మే నెలతో ముగుస్తాయి. మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా మే మొదటి వారంలో పూర్తవుతాయి. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని జూన్ మొదటి వారంలో ఎంసెట్ నిర్వహించే యోచనలో అధికారులున్నారు. నెల రోజుల్లో ఫలితాలు వెల్లడించాలని భావిస్తున్నారు. జేఈఈ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ చేపట్టాలనే యోచనలో ఉన్నారు. తొలి విడతలో ఎంసెట్‌లో సీటు దక్కించుకున్న విద్యార్థులు ఆ తర్వాత ఎన్ఐటీ, ఐఐటీల్లో సీట్లు పొందుతారు. దీంతో రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో కేటాయించిన సీట్లలో ఖాళీలు ఏర్పడతాయి. వీటన్నింటినీ జేఈఈ తుది రౌండ్ కౌన్సెలింగ్ తర్వాతే భర్తీ చేయాలని భావిస్తున్నారు. అభ్యర్థులు పెరిగే అవకాశం ఈసారి ఎంసెట్ రాసే అభ్యర్థుల సంఖ్యపై అధికారులు దృష్టి పెడుతున్నారు. గత రెండేళ్లుగా టెన్త్ పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ ఇంటర్‌కు ప్రమోట్ చేశారు. ఇటీవల ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో కేవలం 49% విద్యార్థులే ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడు వీళ్లంతా ఇంటర్ సెకండియర్‌లో ఉన్నారు. ఏప్రిల్‌లో జరిగే ఇంటర్ సెకండియర్ ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై రకరకాల విశ్లేషణలున్నాయి. అయితే ఈ ఫలితాలతో సంబంధం లేకుండానే ఎంసెట్ రాసే వీలుంది. దీంతో గతం కన్నా ఈసారి ఎంసెట్ రాసే వారి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేసే అంశంపైనా చర్చించనున్నారు. -
మేలో జేఈఈ మెయిన్స్!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ పరీక్షను మేలో నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయించినట్లు తెలిసింది.ఈ దిశగా ఇప్పటికే సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్లు తెలిసింది. నోటిఫికేషన్ వచ్చే వారం విడుదల చేయాలని భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ త్వరలో మొదలవనుంది. వాస్తవానికి ఏప్రిల్‌లోనే పరీక్ష నిర్వహించాలను కున్నా సీబీఎస్ఈ టర్మ్–2 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి మొదలవుతుండటంతో అవి పూర్తయ్యాకే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. నిబంధనలు సడలించాలని డిమాండ్లు జేఈఈ మెయిన్స్ నిబంధనలు సడలించాలని అన్ని రాష్ట్రాల విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్ష రాసేందుకు కనీసం ఇంటర్, ప్లస్–2లో 75 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను ఈసారీ సడలించాలని పట్టుబడుతున్నారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఈ నిబంధనకు మినహాయింపు ఇవ్వగా తాజాగా కరోనా వ్యాప్తి తగ్గడంతో ఆ నిబంధనను మళ్లీ అమలు చేయాలని ఎన్టీఏ భావిస్తోంది. విద్యార్థులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. గత రెండేళ్లుగా పరీక్షలు రాయకుండానే విద్యార్థులు ప్రమోట్ అవుతున్నారు. తెలంగాణలో టెన్త్ పరీక్షలు లేకుండా ఇంటర్‌కు పంపారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు తొలుత నిర్వహించకుండా సెకెండియర్‌కు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత పరీక్షల నిర్వహించినా కేవలం 49 శాతమే ఉత్తీర్ణత సాధించారు. దీంతో అందరినీ కనీస మార్కులతో పాస్ చేశారు. ఇప్పుడు వీళ్ళే జేఈఈ మెయిన్స్ రాయాల్సి ఉంటుంది. దీన్నిబట్టి చాలామందికి 75 మార్కులు ఇంటర్లో వచ్చే అవకాశం కన్పించడం లేదు. ఈ కారణంగా ఈ నిబంధన సడలింపు కోరుతున్నారు. రెండుసార్లు చాలు! జేఈఈ మెయిన్స్‌ను రెండుసార్లు నిర్వహిస్తే చాలన్న అభిప్రాయంతో అన్ని రాష్ట్రాలు ఏకీభవిస్తున్నాయి. తమిళనాడు, ఢిల్లీ విద్యార్థులు 4 సార్లూ మెయిన్స్ నిర్వహించాలని, ఎందులో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఏ మాత్రం ఈ అవకాశం ఇచ్చేందుకు ఇష్టపడట్లేదు. గతేడాది కూడా 4 అవకాశాలు ఇచ్చినా విద్యార్థులు పెద్దగా వినియోగించుకోలేదు. దరఖాస్తు చేసిన వారిలో ఎక్కువ మంది పరీక్షకు హాజరవలేదు. ఆఖరి రెండు దఫాలకు హాజరు బాగా తగ్గిందని ఎన్టీఏ అధికారులు చెబుతున్నారు. ఈ దృష్ట్యా పరీక్షను రెండుసార్లే నిర్వహించడంపై ఎన్టీఏ దృష్టి పెట్టింది. -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కొత్త సిలబస్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ సిలబస్‌ను జాయింట్ అడ్మిషన్ల బోర్డు (జేఏబీ) సరళీకరించింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) సిలబస్‌ను భవిష్యత్ పారిశ్రామిక అవసరాలు, ఇంజనీరింగ్ కోర్సుల్లోని అంశాలను దృష్టిలో ఉంచుకుని నిపుణుల కమిటీ సూచనల మేరకు విద్యార్థులపై సిలబస్ భారం తగ్గించే లక్ష్యంతో ఈ మార్పులు చేశారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల బోర్డులు రూపొందించిన సిలబస్‌ను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్ అంశాల్లో పలు అంశాలను చేర్చారు. సవరించిన సిలబస్ 2023 జేఈఈ అడ్వాన్స్డ్ నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుత ఇంటర్ విద్యార్థులకు ఊరట ఈ మార్పుల వల్ల ప్రస్తుతం ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థులకు ఒకింత ఊరట కలగనుంది. వారు చదువుతున్న సబ్జెక్టులకు సంబంధించిన అంశాలే జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్‌లోనూ ఉండటంతో వారు ప్రత్యేకంగా వేరే అంశాలపై సన్నద్ధం కావాల్సిన అవసరం ఉండదు. ఇంటర్మీడియెట్ సబ్జెక్టులతో పాటే అడ్వాన్స్డ్ అంశాలను కూడా ఒకే సమయంలో వారు నేర్చుకునేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. గతంలో ఇంటర్మీడియెట్‌కు, జేఈఈకి వేర్వేరుగా ప్రిపేర్ అవ్వాల్సి ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యేవారు. ఇపుడు రెండింటికీ కలిపి ఒకే సిలబస్‌ను అధ్యయనం చేస్తే సరిపోతుంది. ఇంతకుముందు జేఈఈ మెయిన్‌లో బోర్డు పరీక్షలలో ఉన్న అంశాలను కవర్ చేసినా, అడ్వాన్స్‌డ్‌లో మాత్రం వాటిని కలపలేదు. వేర్వేరు ఇతర అంశాలను ఉంచగా.. ఇప్పుడు వాటి స్థానంలో బోర్డు అంశాలను, ఇంజనీరింగ్ విద్యలో వచ్చే సంబంధిత అంశాలను సిలబస్‌లో చేర్చారు. దీనివల్ల విద్యార్థుల్లో గందరగోళానికి తావుండదని, వారి అధ్యయనం సాఫీగా సాగుతుందని అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. పోటీ ఇక తీవ్రం జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్‌ను సవరించి బోర్డుల సిలబస్‌లోని అంశాలతో సమానమైన మాదిరిగా మార్పులు చేసినందున ఆ పరీక్షకు పోటీ ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. గతంలో బోర్డుల అంశాలకన్నా భిన్నంగా ఒకింత కఠినమైన రీతిలో జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్ ఉన్నప్పుడు వాటిని అధ్యయనం చేసిన వారు మాత్రమే పరీక్షలను బాగా ఎదుర్కొనగలిగే వారు. కానీ.. ఇప్పుడు బోర్డులతో సమానం చేసినందున ఆ సిలబస్‌ను ప్రిపేర్ అయిన వారిలో ఎక్కువమంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధం కాగలుగుతారని, తద్వారా అత్యధిక మార్కులు సాధించగలవారు మాత్రమే ఎంపికవుతారని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపికయ్యేందుకు పోటీ అత్యధికంగా ఉంటుందని పేర్కొంటున్నారు. వాస్తవానికి ఐఐటీలు సహా ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి సిలబస్‌ను ప్రతి ఐదేళ్లకు ఒకసారి సవరిస్తుంటారు. అలాగే పాఠ్యప్రణాళికను పదేళ్లకోసారి పునర్వ్యవస్థీకరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్‌ను సవరించారు. 11, 12 తరగతులకు (ఇంటర్మీడియెట్) సంబంధించి ఫిజిక్స్, మేథమేటిక్స్, కెమిస్ట్రీ సిలబస్‌ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సవరించింది. ఆ సంవత్సరంలోనే జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్‌ను సమీక్షించి మార్పులను సూచించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (జేఏబీ) ఈ సిలబస్ రివిజన్ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిలో ఏడు ప్రధాన ఐఐటీలు ముంబై, ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్‌పూర్, చెన్నై, గౌహతి, రూర్కీలకు చెందిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్ ఫ్యాకల్టీ సభ్యులను నియమించారు. వీరు అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి సిలబస్ మార్పులపై సిఫార్సులు చేశారు. వారి విభాగాల వారితో పాటు ఇతర ఫ్యాకల్టీల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుని ఈ సిఫార్సులు అందించారు. సబ్జెక్టుల వారీగా మార్పులు ఇలా.. భౌతిక శాస్త్రంలో ఇప్పుడున్న ఏ అంశాన్నీ తొలగించలేదు. కొన్ని అధిక స్కోరింగ్ అంశాలు జోడించారు. ఇవి మునుపటి కంటే సులభంగా ఉండేలా రూపొందించారు. ఎలక్ట్రానిక్ వేవ్స్, సర్ఫేస్ టెన్షన్ వంటివి ఇందులో ఉన్నాయి. కెమిస్ట్రీలో న్యూక్లియర్ కెమిస్ట్రీని తొలగించారు. బయో కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ విభాగాలలో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, పెరియోడిక్టీ ఇన్ ప్రాపర్టీస్, హైడ్రోజన్, ఎఫ్–బ్లాక్ ఎలిమెంట్స్, క్రిస్టిల్ ఫీల్డ్ థియరీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే, బయో మాలిక్యూల్స్ వంటి అంశాలను జోడించారు. మేథమేటిక్స్‌లో హార్మోనిక్ ప్రోగ్రెషన్, ట్రయాంగిల్స్ సొల్యూషన్ అంశాలను తొలగించారు. ఆల్జీబ్రాలో ప్రాథమిక అంశాలు, చతుర్భుజ సమీకరణాలు, సెట్ సిద్ధాంతం, స్టాటిస్టిక్స్, ఎలిమెంటరీ రోఆపరేషన్స్ వంటివి చేర్చారు. మేథ్స్, ఫిజిక్స్‌లో క్లిష్టత స్థాయి తగ్గినట్టే.. సిలబస్ సవరణ వల్ల మేథ్స్, ఫిజిక్స్‌లలో క్లిష్టత స్థాయి గతంలో కన్నా కొంత తగ్గినట్టేనని కోచింగ్ సెంటర్ల అధ్యాపకులంటున్నారు. ఇంటతో సంబంధమున్న అంశాలను, సైద్ధాంతిక అధ్యాయాలను జోడించడం వల్ల రసాయన శాస్త్రం విభాగం కూడా సులభంగా మారొచ్చంటున్నారు. జేఈఈ మెయిన్ కన్నా భిన్నమైన రీతిలో అడ్వాన్స్డ్ ప్రశ్నల స్థాయి ఉంటున్నందున ఆయా అంశాలను లోతుగా చదవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. స్కోరు పెంచుకోవచ్చు జేఈఈ మెయిన్‌ను ఏడాదికి నాలుగుసార్లు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తమ స్కోరును పెంచుకోవడానికి ఈ విధానం వారికి ఆస్కారమిచ్చింది. ఇప్పుడు సిలబస్‌ను కూడా సవరించినందున మంచి స్కోరు సాధించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, తద్వారా అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ మార్కులు కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. సిలబస్‌ను మార్పు చేసినా ప్యాట్రన్ మాత్రం గతంలో మాదిరిగానే ఉండనుంది. ప్రస్తుతం జేఈఈ మెయిన్స్ నుంచి టాప్ స్కోరులో నిలిచిన 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అవకాశం కల్పిస్తున్నారు. మెరిట్లో నిలిచిన వారికి రిజర్వేషన్ల ప్రకారం ఆయా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తున్నారు. దేశంలోని 23 ఐఐటీల్లో 11,326 సీట్లు ఉండగా.. కేంద్ర ప్రభుత్వం గతంలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం సూపర్ న్యూమరరీ సీట్లు కేటాయించడంతో ఆ సంఖ్య 13,376కు పెరిగింది. -
జేఈఈకి ఎన్నికల దెబ్బ!
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) తదితర విద్యా సంస్థలలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2022 పరీక్షకు ఈసారీ ఆటంకాలు తప్పేలా లేవు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జేఈఈ పరీక్షలు ఈ ఏడాది కూడా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెల్లడి కానుండడంతో మెయిన్స్ పరీక్షలు ఆ తరువాతే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో జేఈఈ మెయిన్స్ ఏడాదికి ఒకేసారి నిర్వహించగా 2021 నుంచి 4 దశల్లో చేపడుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షెడ్యూల్ ఇచ్చింది. కరోనా వల్ల ఆ పరీక్షలు అక్టోబర్ నాటికిగాని పూర్తికాలేదు. దీని ప్రభావంతో 2021 డిసెంబర్లో విడుదల కావలసిన 2022 జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ ఇప్పటివరకు రాలేదు. జనవరిలో విడుదల చేసి ఫిబ్రవరి నుంచి 4విడతల్లో పరీక్షలు నిర్వహించవచ్చని అందరూ భావించారు. అయితే.. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో జేఈఈ మొదటి దశ మార్చి ఆఖరులో నిర్వహించే అవకాశముందని భావిస్తున్నారు. ఆ తర్వాత ఏప్రిల్, మే, జూన్లలో మిగిలిన దశలను నిర్వహించి అనంతరం ‘అడ్వాన్స్’ను చేపట్టనున్నారు. ఈసారి అభ్యర్థులు పెరిగే అవకాశం జేఈఈకి అభ్యర్థుల సంఖ్య ఈసారి పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రెండేళ్లుగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిన సంగతి తెలిసిందే. కొన్నిచోట్ల పరీక్షలు అరకొరగా జరగ్గా అనేక రాష్ట్రాల్లో అసలు జరగలేదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా విద్యార్థులందరినీ పాస్ చేశారు. సీబీఎస్ఈ కూడా కరోనా కారణంగా చదువులు దెబ్బతినడంతో మూల్యాంకనాన్ని సరళతరం చేసింది. ఆ సంస్థల్లోనూ 99 శాతం వరకు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితంగా ఈసారి జేఈఈకి విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశముంది. అక్రమాలకు వీల్లేకుండా.. గత ఏడాది జరిగిన పరీక్షల్లో అక్రమాలు జరగడంతో సీబీఐ దర్యాప్తు.. కొందరు కోచింగ్ సెంటర్ల ప్రతినిధుల అరెస్టు.. 20 మంది విద్యార్థుల డిబార్ వంటి ఘటనలు తెలిసిందే. ఈసారి అటువంటి వాటికి తావులేకుండా ఎన్టీఏ పటిష్ట చర్యలు చేపడుతోంది. విద్యార్థులు నాలుగు విడతల్లో ఎన్నిసార్లయినా పరీక్ష రాసుకోవచ్చు. -
నెలాఖరుకు ఏపీఈఏపీ సెట్ కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీఈఏపీ సెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానుంది. షెడ్యూల్‌తో పాటు ఇతర సమగ్ర సమాచారాన్ని ఈ నెల 21న విడుదల చేయనున్నారు. ఏపీఈఏపీ సెట్ అడ్మిషన్ల కమిటీ సమావేశాన్ని సోమవారం ఉన్నత విద్యామండలిలో నిర్వహించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, అడ్మిషన్ల కమిటీ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ ప్రత్యేక కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్, మండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి.సుధీర్‌ప్రేమ్‌కుమార్, సెట్స్ ప్రత్యేకాధికారి డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి తదితర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఏపీఈఏపీ అడ్మిషన్ల కౌన్సెలింగ్ నిర్వహణపై సమావేశంలో చర్చించారు. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాల(జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ.. జోసా) కౌన్సెలింగ్ 6 విడతల్లో జరుగనుండటం, చివరి విడత సీట్ల కేటాయింపు ఆయా సంస్థల్లో చేరికలు ఈ నెల 27 వరకూ కొనసాగనున్న నేపథ్యంలో.. ఆ తర్వాత రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాలను చేపట్టడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఏపీఈఏపీ సెట్లో అగ్రస్థానంలో ఉన్న ర్యాంకర్లు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్లలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఈ నేపథ్యంలో ముందుగా రాష్ట్రంలో ఏపీఈఏపీ సెట్ కౌన్సెలింగ్ నిర్వహించి వారికి సీట్లు కేటాయించి చేరికలు చేపడితే.. జేఈఈలో కూడా మెరిట్లో ఉన్న ఆ విద్యార్థులు ప్రస్తుత జోసా కౌన్సెలింగ్‌లో ఐఐటీ, ఎన్ఐటీ తదితర సంస్థల్లో సీట్లు పొంది అటు వైపు వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఇక్కడి కాలేజీల్లో వారికి కేటాయించిన సీట్లు ఖాళీ అవ్వడం, వాటిని మళ్లీ తదుపరి కౌన్సెలింగ్‌లో కేటాయింపు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పటికే కాలేజీల్లో చేరిన విద్యార్థులకు ఆయా సంస్థలకు ధ్రువపత్రాలిచ్చి, ఫీజులు చెల్లించి ఉంటే.. వాటిని తిరిగి పొందడం సమస్యగా మారుతుంది. జేఈఈ కౌన్సెలింగ్ తర్వాత ఏపీఈఏపీ కౌన్సెలింగ్ నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఈ ఇబ్బందులు తప్పడంతో పాటు.. తదుపరి మెరిట్లో ఉన్న వారికి మేలు జరుగుతుంది. ఇలా అన్ని అంశాలపై ఏపీఈఏపీ సెట్ అడ్మిషన్ల కమిటీ దృష్టి సారించింది. జేఈఈ కౌన్సెలింగ్ అనంతరం నెలాఖరు నుంచి ఏపీఈఏపీ సెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ చేపట్టడం తదితర అంశాలపై లోతుగా చర్చించింది. ఈ నెల 21న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ నేతృత్వంలో మరోసారి సమావేశమై చర్చించి ఏపీఈఏపీ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఖరారు చేసి విడుదల చేస్తారు. కన్వీనర్ కోటాలోకి ప్రైవేట్ వర్సిటీల్లోని 35 శాతం సీట్లు ఇదిలా ఉండగా ప్రైవేటు యూనివర్సిటీలలోని 35 శాతం సీట్లు కూడా ప్రస్తుత ఏపీఈఏపీ సెట్ కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. ఈ యూనివర్సిటీలు తమ కోర్సులకు ఫీజుల ఖరారుకు ప్రతిపాదనలను రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు అందించాయి. ఈ నెలాఖరులోగా కమిషన్ ఫీజులు ఖరారు చేసే అవకాశముందని, వాటిపై ప్రభుత్వం తుది ఉత్తర్వులు విడుదల చేశాక కౌన్సెలింగ్‌లో ఆ సీట్లను కూడా కన్వీనర్ కోటాలో మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం విద్యార్థులకు కేటాయిస్తామని అడ్మిషన్ల కమిటీ అధికారి ఒకరు తెలిపారు. -
‘జేఈఈ పరీక్ష’ అక్రమాలపై సీబీఐ కేసు
సాక్షి, న్యూఢిల్లీ: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ–మెయిన్స్)–2021 పరీక్ష నిర్వహణకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఎఫినిటీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) బుధవారం కేసు నమోదుచేసింది. ఆ సంస్థ డైరెక్టర్లు సిద్దార్థ్ కృష్ణ, విశ్వంభర్ మణి త్రిపాఠి, గోవింద్ వర్షిణి, ముగ్గురు ఉద్యోగులు, అక్రమాల్లో లబ్ది పొందారని భావిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ ప్రకారం.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)ల్లో సీటు కావాలనుకునే అభ్యర్థులు ఒక్కొక్కరి నుంచి రూ.12–15 లక్షలు తీసుకునేలా నిందితులు ఒప్పందం కుదుర్చుకున్నారు. హరియాణాలోని సోనీపట్‌లో ముందే ఎంపిక చేసిన జేఈఈ (మెయిన్స్) ఎగ్జామ్ సెంటర్లోనే పరీక్ష రాస్తున్న విద్యార్థుల క్వశ్చన్ పేపర్లలోని ప్రశ్నలకు రిమోట్ యాక్సెస్ ద్వారా వేరే చోటు నుంచి జవాబులు అందిస్తారు. ఇలా డబ్బులు ముట్టజెప్పే అభ్యర్థులు ఎన్ఐటీల్లో సీటు సాధించేలా పథక రచన చేశారు. ఒప్పందంలో భాగంగా ఆయా అభ్యర్థుల నుంచి పూచీకత్తుగా వారి పది, 12వ తరగతి మార్కుల సర్టిఫికెట్లు, వారి పాస్వర్డ్లు, సీటు దక్కితే తర్వాత నగదుగా మార్చుకునేలా ‘పోస్ట్ డేటెడ్’ చెక్‌లు నిందితులు ముందే తీసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా గురువారం ఆరు రాష్ట్రాల్లో సంస్థకు సంబంధించిన 19 వేర్వేరు ప్రాంతాల్లో తమ అధికారులు సోదాలు నిర్వహించారని సీబీఐ అధికార ప్రతినిధి ఆర్సీ జోషి చెప్పారు. ఢిల్లీ, ఇండోర్, పుణె, బెంగళూరు, జంషెడ్‌పూర్‌లలోనూ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో 25 ల్యాప్‌టాప్‌లు, 7 పర్సనల్ కంప్యూటర్లు, 30 చెక్‌లు, డిగ్రీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నట్లు జోషి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఈఈ(మెయిన్స్) నిర్వహిస్తారు. -
రసాయనం సులభం.. గణితం కష్టం
సాక్షి, అమరావతి: ఐఐటీలు, ఎన్ఐటీలు, తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 4వ సెషన్ తొలిరోజు పరీక్ష గురువారం ప్రశాంతంగా ముగిసింది. కంప్యూటరాధారితంగా జరిగే ఈ పరీక్షలు ఆగస్టు 27, 31, సెప్టెంబర్ 2వ తేదీల్లో జరగనున్నాయి. మొత్తం 7.5 లక్షల మంది వీటికి దరఖాస్తు చేసుకోగా ఏపీ నుంచి 70 వేల మంది వరకు ఉన్నారు. మొదటి రోజు ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు గతంలో కంటే కఠినంగా ఉన్నాయని కొందరు అభ్యర్థులు, కోచింగ్ కేంద్రాల నిపుణులు అభిప్రాయపడ్డారు. రసాయన శాస్త్రం ప్రశ్నలు ఇంతకు ముందుకంటే కొంత సులువుగా ఉన్నాయన్నారు. భౌతిక శాస్త్రం ప్రశ్నలు మధ్యస్థంగా ఉండగా.. గణితం ప్రశ్నలు కష్టంగా ఉన్నాయని తెలిపారు. రసాయన శాస్త్రం ప్రశ్నల్లో.. ఆర్గానిక్, ఫిజికల్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలకు సమాన ప్రాతినిధ్యం ఉందని చెప్పారు. భౌతిక శాస్త్రంలో మోడ్రన్ ఫిజిక్స్‌లో ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటిజమ్, ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఇండక్షన్ వంటి అంశాల ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయన్నారు. ఇంటర్ ఫస్టియర్ కంటే సెకండియర్లోని అంశాలపైనే ఎక్కువ ప్రశ్నలు ఇచ్చారని తెలిపారు. మ్యాథ్స్‌లో ఎక్కువ ప్రశ్నలు ఇంటర్ సెకండియర్ నుంచే ఉన్నాయని పేర్కొన్నారు. కాలిక్యులస్ బేస్డ్ ఇంటిగ్రేషన్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ ప్రశ్నలు చాలా కఠినంగా ఇచ్చారని చెప్పారు. -
JEE Mains: ముగిసిన ఫస్ట్ షిఫ్ట్.. 3 గంటలకు రెండో షిఫ్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఐఐటీ, నిట్ తదితర విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్స్ పరీక్ష మంగళవారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 7,09,519 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం దేశవ్యాప్తంగా 828 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రానికి విద్యార్థులకు గంటన్నర ముందే అనుమతి ఇచ్చారు. రెండు షిఫ్ట్‌ల్లో పరీక్ష నిర్వహిస్తుండగా.. మొదటి షిఫ్ట్ ఉదయం 9-12 గంటల వరకు కాగా.. రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3-6 గంటల వరకు ఉండనుంది. ఈ క్రమంలో మొదటి షిఫ్ట్ పరీక్ష మధ్యాహ్నం 12 గంటలకు ముగిసింది. కరోనా ప్రభావం నేపథ్యంలో పరీక్ష నిర్వహిస్తుండటంతో అభ్యర్థులు ప్రత్యేక గైడ్‌లైన్స్‌తో పాటు డ్రెస్‌కోడ్ పాటించాల్సిందిగా ఆదేశాలు అమల్లో ఉన్నాయి. అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే ఈ పరీక్షకు నిబంధనలన్నీ తప్పక ఫాలో కావాలి. కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలను 660 నుంచి 828కు పెంచింది ఎన్టీఏ. అలాగే గతంలో 232 నగరాల్లో జరిగే ఈ పరీక్షలు ఈసారి 334 సిటీస్‌లో జరగనున్నాయి. అలాగే ఎన్టీఏ.. ప్రత్యేక మార్గదర్శకాలు, నిబంధనలు విధించింది. కరోనా నేపథ్యంలో ప్రత్యేక నిబంధనలు పరీక్షకు వచ్చే అభ్యర్థులంతా మాస్క్‌లు ధరించడం తప్పనిసరి. ఇక పరీక్ష కేంద్రం వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం కాంటాక్ట్‌లెస్‌గా ఉంటుంది. అభ్యర్థులు తప్పకుండా భౌతిక దూరం పాటించాలి. పరీక్ష కేంద్రంలో సీటింగ్ కూడాభౌతిక దూరం నిబంధన ప్రకారమే ఉంటుంది. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు హ్యాండ్ శానిటైజర్ అందిస్తారు. ఒక షిఫ్ట్‌లో వాడిన కంప్యూటర్లను ఆ రోజు మరో షిఫ్ట్‌కు వినియోగించరు. అలాగే కేంద్రాల వద్ద అభ్యర్థులు గుమికూడకుండా రిపోర్టింగ్ కోసం స్లాట్లను కేటాయించారు. దాన్ని బట్టి ఎగ్జామ్ సెంటర్ల వద్దకు వెళ్లాలి -
JEE Mains: మూడవ, నాలుగో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: ఐఐటీ, నిట్ తదితర విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్స్ మూడు, నాలగవ విడతల పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. మూడో విడత పరీక్ష జులై 20 నుంచి 25వరకు.. నాలుగో విడత పరీక్షలు జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మంగళవారం వెల్లడించారు. కరోనా నేపథ్యంలో రిజిస్టర్ చేసుకోని విద్యార్థులు కూడా తాజాగా దరఖాస్తు చేసుకొనేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ రోజు రాత్రి నుంచి జులై 8 రాత్రి వరకు ఎన్టీఏ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్, మేలో నిర్వహించాల్సిన సెషన్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రద్దు చేసిన విషయం తెలిసిందే. దేశంలో జేఈఈ మెయిన్స్‌ను ఏడాదికి నాలుగు సార్లు నిర్వహించాలని గతంలో కేంద్రం నిర్ణయించింది. అయితే, తొలి విడత ఫిబ్రవరిలో, రెండో విడత మార్చిలో నిర్వహించగా.. మూడు, నాలుగవ విడత పరీక్షలు ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాల్సి ఉండింది. అయితే కరోనా కారణంగా ఈ రెండు సెషన్ల పరీక్షలు వాయిదా పడ్డాయి. -
జేఈఈ మెయిన్స్ పరీక్ష వాయిదా
-
జేఈఈ మెయిన్స్ 2021 వాయిదా
న్యూఢిల్లీ: కోవిడ్ దృష్టా కేంద్రం ప్రభుత్వం పలు పరీక్షలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా జేఈఈ మెయిన్స్ వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మంగళవారం ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ కోసం సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా విద్యార్థులకు సూచించారు. కోవిడ్ విజృంభణ వల్ల పరీక్ష వాయిదా వేస్తున్నామన్నారు. ఇప్పటికే నీట్ పరీక్ష వాయిదా వేసిన సంగతి తెలిసిందే. చదవండి: కటాఫ్ ఎక్కువే! -
జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్స్ 2021 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 27, 28, 30 తేదీల్లో జరగాల్సిన జేఈఈ మెయిన్స్ పరీక్షలు కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. జేఈఈ మెయిన్స్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన తదుపరి తేదీలను 15 రోజుల ముందుగా విద్యార్థులకు సమాచారం అందజేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ పరీక్షకు సంబంధించి రెండు సెషన్లు పూర్తయిన విషయం తెలిసిందే. చదవండి: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళను చూడగలమా? -
కటాఫ్ ఎక్కువే!
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యాసంస్థలలో ప్రవేశానికి మార్చిలో నిర్వహించిన రెండవ విడత జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2021 ఫలితాలు ఈనెల చివరి వారంలో వెలువడనున్నాయి. మార్చి 16, 17, 18 తేదీల్లో జరిగిన ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ గడువు సోమవారం మధ్యాహ్నంతో ముగిసింది. ఫిబ్రవరిలో నిర్వహించిన తొలివిడత సెషన్ పరీక్షలకు మాదిరిగానే ఈ రెండో విడతలోనూ ప్రశ్నలు ఒకింత మధ్యస్తంగా, సులభంగా ఉండటంతో కటాఫ్ మార్కులు ఎక్కువగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.రెండో సెషన్లో 200 మార్కుల స్కోరు సాధించిన వారికి 90కి పైగా పర్సంటైల్ దక్కే అవకాశముంటుందని ప్రాథమిక కీ విడుదల అనంతరం ఆయా సబ్జెక్టుల నిపుణులు, కోచింగ్ సెంటర్ల అధ్యాపకులు అంచనా వేస్తున్నారు. ప్రాథమిక కీపై అభ్యంతరాల పరిశీలన పిదప సవరణలతో తుది విడత కీ విడుదల సమయంలో తుది మార్కుల స్కోరు, పర్సంటైల్ ఖరారు అవుతుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం జేఈఈ మెయిన్ కటాఫ్ ఓపెన్ కేటగిరీకి 90 నుంచి 100 పర్సంటైల్ వరకు ఉండవచ్చని, రిజర్వుడ్ కేటగిరీలో 60 నుంచి 70 పర్సంటైల్ మధ్య ఉండే అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు. 200 మార్కులు వచ్చే అభ్యర్థులు 90–100 పర్సంటైల్ సాధించగలుగుతారని చెబుతున్నారు. ఫిజిక్సు, మేథ్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు ఈసారి సులభంగా ఉండటంతో జేఈఈ మెయిన్ 2020 కటాఫ్ కన్నా ఈసారి కటాఫ్ ఎక్కువగానే ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరంలో నాలుగు విడతలుగా జేఈఈ మెయిన్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 27 నుంచి 30 వరకు మూడో విడత, మే 24 నుంచి 28 వరకు నాలుగో విడత మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. అన్ని విడతలు ముగిసిన అనంతరం అభ్యర్థులకు వచ్చిన మార్కుల స్కోరును అనుసరించి కటాఫ్ పర్సంటైల్‌ను ప్రకటించనున్నారు. 2018లో తక్కువ కటాఫ్ జేఈఈ మెయిన్‌లో 2019లోని కటాఫ్‌తో పోలిస్తే 2020 కటాఫ్‌లు స్వల్పంగా పెరిగాయి. అంతకుముందు 2018 జేఈఈ మెయిన్‌లో ప్రశ్నలు కఠినంగా ఉండటంతో కటాఫ్ పర్సంటైల్ తక్కువగా ఉంది. జేఈఈ మెయిన్ 2017లో కటాఫ్ పర్సంటైల్ మళ్లీ అధికంగానే ఖరారైంది. ఆ కటాఫ్ గణాంకాలు పరిశీలిస్తే ఏమేరకు పెరుగుదల, తగ్గుదల ఉందో స్పష్టమవుతుంది. -
రేపట్నుంచి జేఈఈ మెయిన్–2
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, ఐఐఎస్ఈఆర్ తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ రెండో విడత పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. రెండో విడత పరీక్షలకు 5 లక్షల మంది వరకు విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. జేఈఈ మెయిన్‌ను 2021 నుంచి నాలుగు విడతల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో 4 రోజుల చొప్పున మేలో 5 రోజుల పాటు ఈ పరీక్షలను కంప్యూటరాధారితంగా నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గతంలో ప్రకటించింది. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు తొలి విడత పరీక్షలను నిర్వహించింది. ఆ సెషన్‌కు 6.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మార్చి సెషన్‌ను 15 నుంచి 18 వరకు నిర్వహించేందుకు తొలుత షెడ్యూల్ ఇచ్చారు. రెండో విడత పరీక్షలకు రిజిస్టర్ అయిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో మార్చి సెషన్ పరీక్షలను మూడు రోజులకు కుదించారు. 16 నుంచి 18 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఏపీ నుంచి 53 వేల మంది రెండో విడత పరీక్షలకు హాజరుకానున్నారు. రాష్ట్రంలో 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెంలలో పరీక్ష నిర్వహించనున్నారు. కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే.. పరీక్షల నిర్వహణలో కోవిడ్–19 నియమాలను పాటించేలా ఎన్టీఏ చర్యలు చేపట్టింది. సిబ్బందితో పాటు పరీక్షలురాసే వారంతా తప్పనిసరిగా మాసు్కలు ధరించి రావాలి. సిబ్బందికి గ్లౌజ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాలను శానిటైజేషన్ చేయిస్తున్నారు. పరీక్షలకు హాజరయ్యే వారు తమతో పాటు పారదర్శక బాటిళ్లలో ఉండే శానిటైజర్ తెచ్చుకోవడానికి అనుమతిస్తున్నారు. అలాగే పారదర్శక బాటిళ్లతో మంచినీరు, పారదర్శకంగా ఉండే బాల్‌పెన్నులను కూడా అభ్యర్థులు తెచ్చుకోవచ్చు. సెల్ఫోన్లు, డిజిటల్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 12 వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు జరుగుతుంది. అభ్యర్థులు ఉదయం 7.30 నుంచి 8.30 గంటల లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. వారి అడ్మిట్ కార్డుతోపాటు ఫొటో ఐడెంటిటీ కార్డును తెచ్చుకోవాలి. పరీక్షలకు సంబంధించి రఫ్‌వర్కు చేయడానికి అవసరమైన పత్రాలను పరీక్ష కేంద్రాల్లోనే ఇస్తారు. వాటిని తిరిగి పరీక్ష పత్రాలతోపాటు ఇన్విజిలేటర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. -
జేఈఈ కటాఫ్ మార్కులు పెరిగే చాన్స్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించి ఫిబ్రవరిలో నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2021 ప్రాథమిక ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం రాత్రి విడుదల చేసింది. దీనిని అనుసరించి జేఈఈ మెయిన్–2021లో కటాఫ్ మార్కులు గతంలో కన్నా స్వల్పంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 23నుంచి 26వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారితంగా ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. బీఈ, బీ.టెక్, బీ.ఆర్క్, బీ.ప్లానింగ్ కోర్సులకు సంబంధించి నిర్వహించిన ఈ పరీక్షలలో వచ్చిన ప్రశ్నల స్థాయిని అనుసరించి కోచింగ్ సెంటర్లు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చాయి. ప్రాథమిక ‘కీ’ కూడా విడుదల కావడంతో కటాఫ్ మార్కులపై వేర్వేరు అంచనాలలో తలమునకలవుతున్నాయి. అన్ని సెషన్ల పరీక్షలు పూర్తయ్యాకే కటాఫ్‌పై స్పష్టత జేఈఈలో కటాఫ్ మార్కులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఐఐటీ విద్యాసంస్థల్లోకి ప్రవేశానికి ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించేందుకు అవసరమైన కటాఫ్ మార్కులు. జేఈఈ మెయిన్‌లో అభ్యర్థులు సాధించిన స్కోరును అనుసరించి ఈ కటాఫ్‌ను నిర్ణయిస్తారు. రెండోది ఇతర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించి జేఈఈ మెయిన్ స్కోరును అనుసరించి నిర్ణయించే కటాఫ్. ఈ నెల 7వ తేదీలోపు ప్రకటించే తుది ఫలితాలతో జేఈఈ అడ్వాన్స్డ్ కటాఫ్‌ను ఎన్టీఏ ప్రకటిస్తుంది. అయితే, ప్రస్తుతం నాలుగు సెషన్లలో ఫిబ్రవరి సెషన్ పరీక్షలలో అభ్యర్థులు సాధించే స్కోరును అనుసరించి మాత్రమే ఈ కటాఫ్, పర్సంటైల్ అంచనాలు వేస్తున్నా మార్చి, ఏప్రిల్, మే సెషన్ల పరీక్షలు ముగిశాక కానీ తుది కటాఫ్ తేలదు. అంతిమంగా మే సెషన్ ఫలితాల అనంతరమే దీనిపై ఒక స్పష్టత వస్తుందని అధ్యాపకులు పేర్కొంటున్నారు. ప్రతి సెషన్ పరీక్షలకు సంబంధించి తుది ఫలితాలతో పాటే వీటిని విడుదల చేస్తారు. జూన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాల ప్రక్రియను చేపడతారు. ఈ సందర్భంగా అడ్మిషన్ల కటాఫ్‌ను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ ప్రకటిస్తుంది. విద్యాసంస్థల వారీగా ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంకులను అనుసరించి అడ్మిషన్ల కటాఫ్ మార్కులను ప్రవేశాల సమయంలో జోసా విడుదల చేయనుంది. మొత్తం అన్ని సెషన్ల పరీక్షలకు హాజరైన అభ్యర్థులు, అందుబాటులో ఉన్న సీట్లు, పరీక్షల్లో వచ్చే ప్రశ్నల కాఠిన్యత తదితరాలను అనుసరించి తుది కటాఫ్ తేలనుంది. ఫిబ్రవరి సెషన్‌కు 6,61,776 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 6,52,627 మంది పరీక్షలు రాశారు. ప్రాథమిక ‘కీ’ని అనుసరించి కటాఫ్ ఇలా ఈసారి కటాఫ్ గత ఏడాది జేఈఈ మెయిన్ కటాఫ్‌తో పోలిస్తే స్వల్పంగా పెరిగే అవకాçశం ఉందని కార్పొరేట్ విద్యాసంస్థ అధ్యాపకురాలు ఒకరు అభిప్రాయపడ్డారు. జనరల్ కటాఫ్ మార్కులు ఈసారి 90–95 శాతం వరకు ఉండవచ్చన్నారు. రిజర్వుడ్ కేటగిరీల్లో కూడా 60 నుంచి 70 శాతానికి పైగా మార్కుల స్కోరు సాధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 200 వరకు మార్కులు వచ్చే అభ్యర్థి 90–95 పర్సంటైల్ సాధించవచ్చన్నారు. జేఈఈ మెయిన్ వెబ్సైట్లో ప్రాథమిక కీ జేఈఈ మెయిన్–2021 ఫిబ్రవరి సెషన్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని జేఈఈ మెయిన్ వెబ్సైట్లో పొందుపర్చినట్టు ఎన్టీఏ పేర్కొంది. ఆన్సర్ ‘కీ’, ప్రశ్నపత్రాలు, అభ్యర్థుల రెస్పాన్సు షీట్లను కూడా అందులో పొందుపరిచింది. అభ్యర్థులు తమ అభ్యంతరాలను బుధవారం సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్లో పొందుపర్చవచ్చు. ఛాలెంజ్ చేసే ఒక్కొక్క ప్రశ్నకు రూ.200 చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రుసుము చెల్లింపునకు బుధవారం సాయంత్రం 6 గంటల వరకు గడువు విధించారు. దరఖాస్తుల సమర్పణ, ఉపసంహరణకు అవకాశం మార్చి, ఏప్రిల్, మే సెషన్లకు సంబంధించిన జేఈఈ మెయిన్‌కు దరఖాస్తుల సమర్పణ, ఉపసంహరణకు ఎన్టీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సెషన్లకు ఇంతకుముందు దరఖాస్తు చేసిన వారు ఉపసంహరించుకోవడానికి లేదా తమ దరఖాస్తులో ఏమైనా మార్పులుంటే చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. మార్చి సెషన్‌కు కొత్తగా దరఖాస్తు చేసుకోదలచిన వారికి రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 6వ తేదీ వరకు ఇచ్చింది. మార్చి సెషన్‌కు సంబంధించిన పరీక్షలు 15, 16, 17, 18 తేదీల్లో జరుగుతాయి. దరఖాస్తులను ఈ నెల 6వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్లో సమర్పించవచ్చు. రిజిస్టేషన్ ఫీజును 6వ తేదీ రాత్రి 11.50 గంటలలోపు చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్, మే సెషన్లకు సంబంధించి కొత్త దరఖాస్తులు, రిజిస్టేషన్ల ఫీజు గడువును ఆ తరువాత తెలియచేయనున్నట్టు ఎన్టీఏ వివరించింది. -
ప్రారంభమైన జేఈఈ మెయిన్ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీలు), తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే జేఈఈ మెయిన్ తొలివిడత పరీక్షలు మంగళవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 26 వరకు రోజుకు రెండు సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఏటా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలలో నాలుగు సెషన్లలో పరీక్షల నిర్వహణకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) నిర్ణయించిన సంగతి తెలిసిందే. నాలుగు సెషన్లలో ఒక్కటి లేదా నాలుగు దఫాల్లోనూ విద్యార్థులు పరీక్షకు హాజరుకావచ్చు. నాలుగింటిలో ఎందులో ఎక్కువ స్కోర్ సాధిస్తే దాన్నే జేఈఈ ర్యాంకులకు పరిగణనలోకి తీసుకోనున్నారు. నాలుగు దఫాలు కలిపి పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 21.75 లక్షలు కాగా అత్యధికులు ఫిబ్రవరి సెషన్‌కే మొగ్గు చూపారు. మొదటి దశ (ఫిబ్రవరి) 6,61,761, రెండో దశ (మార్చి) 5,04,540, మూడో దశ (ఏప్రిల్) 4,98,910, నాలుగో దశ (మే)కు 5,09,972 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి తొలివిడత పరీక్షకు 87,797 మంది హాజరైనట్లు తెలుస్తోంది. ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష రాసే అవకాశం ఈసారి జేఈఈ మెయిన్‌ను ఆంగ్లం, హిందీతోపాటు మరో 11 ప్రాంతీయ భాషల్లో రాయడానికి ఎన్టీఏ అవకాశం కల్పించింది. తెలుగు, తమిళం, కన్నడం, మళయాలం, మరాఠీ, ఒడియా, పంజాబీ, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీలోనూ పరీక్షలు రాయొచ్చు. అయితే అత్యధిక శాతం మంది ఆంగ్లంలో రాసేందుకు మొగ్గుచూపుతుండడం విశేషం. హిందీ, గుజరాతీ, బెంగాలీ తప్ప తక్కిన ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసేందుకు చాలా తక్కువమంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 371 మంది మాత్రమే తెలుగు మాధ్యమంలో పరీక్ష హాజరైనట్లు తెలుస్తోంది. మొత్తం 13 మాధ్యమాలకు కలిపి 384 ప్రశ్నపత్రాలు ఎన్టీఏ విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. నాలుగు సెషన్లకు కలిపి నాలుగు లక్షలకుపైగా ప్రశ్నల బ్యాంకును సిద్ధం చేశారు. పరీక్ష విధానంలో మార్పు ఈసారి జేఈఈ సిలబస్, పరీక్ష విధానంలో కూడా ఎన్టీఏ మార్పులు చేశారు. పేపర్–1లో మొత్తం 90 ప్రశ్నల్లో 75 ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుంది. మొత్తం ప్రశ్నల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో 30 చొప్పున ప్రశ్నలున్నాయి. ఒక్కోదాన్లో 20 బహుళైచ్ఛిక ప్రశ్నలు, 10 న్యూమరికల్ ప్రశ్నలు ఇచ్చారు. న్యూమరికల్ ప్రశ్నల్లో 5 ప్రశ్నలకు చాయిస్ ఇవ్వగా. 5 ప్రశ్నలకు నెగెటివ్ మార్కులు లేవు. నిపుణులు ఏమంటున్నారంటే.. ఈసారి ఇంటర్ బోర్డు పరీక్షల్లో 30 శాతం సిలబస్‌ను తొలగించినా జేఈఈలో సిలబస్‌ను తగ్గించకుండా 25 శాతం వరకు చాయిస్ ఇవ్వడం విద్యార్థులకు మంచి అవకాశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా నాలుగు సెషన్లలో పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఆందోళన తప్పుతుందని చెబుతున్నారు. ‘2019–20 ప్రశ్నపత్రాలు కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా ఉండి డిఫికల్టీ లెవల్ తగ్గింది. ఈసారి డిఫికల్టీ స్థాయి మరింత తగ్గుతుంది. ఇంటర్మీడియెట్ సిలబస్ పూర్తి అయినందున ఫిబ్రవరిలో జేఈఈ మెయిన్ రాసే విద్యార్థులు 99 పర్సంటైల్ స్కోర్ చేసే అవకాశముంటుంది. గత మూడేళ్ల మెయిన్ పర్సంటైల్ గమనిస్తే ఫిజిక్స్‌లో 70 శాతం మార్కులు స్కోర్ చేస్తే 99 పర్సంటైల్ వచ్చింది. ఈసారి 50 శాతం మార్కులు సాధించినా 99 పర్సంటైల్ రావచ్చని పేర్కొంటున్నారు. నిర్ణీత సమయానికి 2 గంటల ముందే చేరుకోవాలి.. – విద్యార్థులందరూ తప్పనిసరిగా నిర్ణీత సమయానికి 2 గంటలు ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఏన్టీఏ సూచించింది. – పరీక్షలు ఉదయం సెషన్లో 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్లో 3 నుంచి 6 గంటల వరకు జరుగుతాయి. – పారదర్శకంగా ఉండే బాల్‌పెన్నును మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. – రఫ్ వర్క్ కోసం ఖాళీ పేపర్ షీట్లను పరీక్ష హాలులో అందిస్తారు. – పరీక్ష హాల్ నుంచి బయటకు వెళ్లే ముందు విద్యార్థులు తమ పేరు, రోల్ నంబర్‌ను షీట్ పై భాగంలో రాసి ఇన్విజిలేటర్‌కు తప్పనిసరిగా అందించాలి. – మధుమేహం ఉన్న విద్యార్థులు తమతోపాటు పరీక్ష కేంద్రంలోకి పండ్లు, షుగర్ టాబ్లెట్లు తీసుకెళ్లొచ్చు. -
రేపట్నుంచి జేఈఈ మెయిన్.. తొలిసారి తెలుగులో
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్టీఐలలో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ మొదటి సెషన్ పరీక్షలు ఈ నెల 23న ప్రారంభం కానున్నాయి. 2021–22 విద్యా సంవత్సరంలో బీఈ/బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలను నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఈ నెలతోపాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మొత్తంగా నాలుగు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థులు ఏ సెషన్‌లోనైనా పరీక్షలు రాసుకునేలా, అన్నింటిలో ఉత్తమ స్కోర్ ఏది వస్తే దానినే పరిగణనలోకి తీసుకునేలా చర్యలు చేపట్టింది. ఇంగ్లిష్ మాత్రమే కాకుండా మొదటిసారిగా 12 భాషల్లో పరీక్షలను నిర్వహించనుంది. తెలుగులో పరీక్షలు రాసేందుకు 374 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో జేఈఈ మెయిన్ నిర్వహించినప్పుడు 10 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరవగా ఈసారి ఫిబ్రవరి 23, 24, 25, 26 తేదీల్లో జరిగే మొదటి సెషన్లో 6,61,761 మంది పరీక్ష రాయనున్నారు. ఇంకా మూడు సెషన్లలో పరీక్షలు రాసే అవకాశం ఉండటంతో ఫిబ్రవరి సెషన్లో పరీక్షలు రాసే వారి సంఖ్య తగ్గింది. ఇక మార్చి 15, 16, 17, 18 తేదీల్లో రెండో సెషన్ పరీక్షలు, ఏప్రిల్ 27, 28, 29, 30 తేదీల్లో మూడో సెషన్ పరీక్షలు, మే 24, 25, 26, 27, 28 తేదీల్లో నాలుగో సెషన్ పరీక్షలు జరగనున్నాయి. మేలో సీబీఎసీఈ 12వ తరగతి పరీక్షలు ఉన్నందున జేఈఈ మెయిన్ పరీక్ష తేదీల్లోనే ఎవరైనా విద్యార్థులకు 12వ తరగతి పరీక్ష ఉంటే విద్యార్థులు తెలియజేయాలని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఈ నెల 23 నుంచి 26 వరకు జరిగే మొదటి సెషన్ జేఈఈ మెయిన్ పరీక్షలకు హాజరయ్యేందుకు నాలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండగా మూడో స్థానంలో తెలంగాణ ఉంది. ఏపీ విద్యార్థులు 87,797 మంది దరఖాస్తు చేసుకోగా తెలంగాణ నుంచి 73782 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల కోసం తెలంగాణలో 12 కేంద్రాలను, ఏపీలో 20 కేంద్రాలను ఎన్టీఏ ఏర్పాటు చేసింది. తెలంగాణ పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, నిజమాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేటలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. అలాగే ఏపీ పరిధిలో అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెంలో ఏర్పాటు చేశారు. పరీక్ష విధానం ఇలా.. ఈసారి కరోనా కారణంగా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఎన్టీఏ అదనంగా 15 ప్రశ్నలు ఇస్తోంది. మొత్తంగా 90 ప్రశ్నలు ఇవ్వనుండగా అందులో విద్యార్థులు 75 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. బీఈ/బీటెక్ పరీక్షను తీసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి సబ్జెక్టులో సెక్షన్–ఏ, సెక్షన్–బీ ఉంటాయి. సెక్షన్–ఏలో 20 ప్రశ్నలు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉండే వాటన్నింటికీ సమాధానాలు రాయాలి. ప్రతి తప్పుడు సమాధానానికి ఒక మార్కు కోత పడుతుంది. సెక్షన్–బీలో నెగెటివ్ మార్కులు ఉండవు. ప్రతి సబ్జెక్టులో 10 చొప్పున న్యూమరికల్ వ్యాల్యూ జవాబుగా ఉండే ప్రశ్నలు ఇస్తారు. అందులో 5 చొప్పున ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఇదీ పరీక్షల సమయం... ♦ఈ నెల 23, 24, 25, 26 తేదీల్లో రోజూ రెండు షిఫ్ట్‌లలో ఆన్లైన్ పరీక్షలు ♦మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. ♦రెండో షిఫ్ట్ పరీక్ష మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ♦కచ్చితంగా అరగంట ముందే పరీక్ష కేంద్రంలో ఉండాలి. పరీక్ష ప్రారంభ సమయం తరువాత విద్యార్థులను అనుమతించరు. ♦మొదటి షిఫ్ట్ పరీక్షకు విద్యార్థులను ఉదయం 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు పరీక్ష కేంద్రం, హాల్లోకి అనుమతిస్తారు. ♦రెండో షిఫ్ట్ పరీక్షకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:30 గంటల వరకు అనుమతిస్తారు. -
జేఈఈలో నిబంధనల సడలింపు
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)లో అభ్యర్థులకు వెసులుబాటు కల్పిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనలను సడలించింది. ఈ మేరకు మంగళవారం ఎన్టీఏ వెబ్సైట్లో అధికారిక నోట్‌ను పొందుపరిచింది. కరోనా నేపథ్యంలో గత ఏడాది అర్హత విషయంలో మినహాయింపులిచ్చింది. ఈ ఏడాది కూడా వాటిని కొనసాగించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. జేఈఈకి హాజరయ్యే అభ్యర్థులు ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలలో ప్రవేశం పొందాలంటే జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌లో మెరిట్ ఉండడంతో పాటు వారికి ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు సాధించి ఉండడం లేదా టాప్ 20 పర్సంటైల్ వచ్చి ఉండాలన్న నిబంధన ఉంది. అలా ఇంటర్లో 75 శాతం మార్కులు, లేదా టాప్ 20 పర్సంటైల్‌లు ఉండే వారికి మాత్రమే జేఈఈ అడ్వాన్సుకు అనుమతిస్తారు. అందులో మెరిట్ సాధించిన వారికి ఐఐటీ ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కానీ, కరోనావల్ల గత విద్యా సంవత్సరం అనేక రాష్ట్రాలు ఇంటర్ పరీక్షలను నిర్వహించలేకపోయాయి. దీంతో ఆయా బోర్డులు విద్యార్థులను ఆల్‌పాస్‌గా ప్రకటించాయి. అలాగే, కరోనావల్ల ఏర్పడిన ఈ ప్రత్యేక పరిస్థితుల్లో జేఈఈలో కూడా విద్యార్థులకు 75 శాతం మార్కులు సాధించి ఉండాలన్న నిబంధన నుంచి మినహాయింపునిస్తున్నట్లు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరంలో కూడా తమకు ఇంటర్లో 75 శాతం మార్కుల నుంచి మినహాయింపునివ్వాలని దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి వినతులు వస్తుండడంతో కేంద్రం స్పందించింది. అర్హత విషయంలో గత ఏడాది ఇచ్చిన మినహాయింపులను ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎన్టీఏ ప్రత్యేక నోటీసును వెబ్సైట్లో పొందుపరిచింది. దీంతో ఈ విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులు 75శాతం మార్కులతో సంబంధం లేకుండా ఉత్తీర్ణత సాధిస్తే చాలని పేర్కొంది. మెయిన్స్‌కు 20 ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఇదిలా ఉంటే.. జేఈఈ మెయిన్స్ తొలివిడత ఆన్లైన్ పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు 26 వరకు కొనసాగుతాయి. ఈ ప్రవేశ పరీక్షను ఇంగ్లీషు, హిందీతో పాటు 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. ఇందుకు రాష్ట్రంలోని 20 నగరాల్లో ఎన్టీఏ పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది. అవి.. అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం. -
జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్లు 21.75 లక్షలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) తదితర విద్యా సంస్థల్లోకి ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్‌కు ఈ విద్యా సంవత్సరంలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. గడువు ముగిసే సమయానికి 21,75,183 మంది అభ్యర్థులు జేఈఈ మెయిన్స్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఈ విద్యా సంవత్సరంలో జేఈఈలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా జేఈఈ పరీక్షలను 4 దశల్లో నిర్వహించే విధానం వల్ల విద్యార్థులు దీన్నొక అవకాశంగా మల్చుకోవడానికి పెద్ద ఎత్తున ఉత్సాహం చూపించారని తాజా రిజిస్ట్రేషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాలుగేసి రోజుల చొప్పున ఉదయం, సాయంత్రం 2 సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈసారి జేఈఈ మెయిన్స్‌ను ఇంగ్లిష్తో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, గుజరాతీ, ఒడియా, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, ఉర్దూ, అస్సామి భాషల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రాలు ఆ భాషతో పాటు ఆంగ్లంలో కూడా ఉంటాయి. çఇప్పటివరకు 21 లక్షల మంది రిజిస్టర్ అవ్వగా, వారిలో 1,49,597 మంది 10 స్థానిక భాషల్లో పరీక్షలు రాసేందుకు మొదటిసారి ఆప్షన్ ఇచ్చినట్లు ఎన్టీఏ గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో సగం మంది హిందీని ఎంచుకున్నారు. గుజరాతీలో రాసేందుకు 44,094 మంది, బెంగాలీలో రాసేందుకు 24,841 మంది ఆప్షన్లు ఇచ్చారు. అయితే అత్యధికులు ఆంగ్లంలోనే పరీక్ష రాసేందుకు ఆప్షన్ ఇవ్వడం గమనార్హం. మొదటి దశ పరీక్షకు 6.6 లక్షల మంది దరఖాస్తు జేఈఈ మెయిన్స్‌ను నాలుగు దశల్లో నిర్వహించేందుకు నిర్ణయించడంతో అభ్యర్థులు వారికి నచ్చిన దశలో పరీక్ష రాయనున్నారు. తొలిదశ పరీక్షలకు 6,61,761 మంది దరఖాస్తు చేశారు. కొందరు నాలుగు దఫాలు రాయడానికి దరఖాస్తు చేయగా, కొందరు ఒకటి, రెండు దఫాల్లో పరీక్షలు రాసేందుకు వీలుగా దరఖాస్తు చేశారు. -
అవకాశాలున్నాయ్.. ఆందోళన వద్దు
సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా ఐదారు నెలలు విద్యాసంస్థలు తెరుచుకోక ఆన్లైన్ బోధనతో తాపీగా సాగిన ఇంటర్మీడియట్ చదువులు ఇప్పుడు తరగతుల ప్రారంభంతో ఉరుకులు పరుగులు అందుకున్నాయి. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలతోపాటు జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలు, పలు యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల ప్రవేశ పరీక్షల సన్నద్ధతలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. చాలాకాలం తరగతులు లేకుండానే గడిచిపోవడం, మిగతా సమయం తక్కువగా ఉండడంతో ఆయా విద్యాసంస్థలు కూడా త్వరగా సిలబస్ ముగించి రివిజన్ చేయించే సన్నాహాల్లో పడ్డాయి. ఫలితంగా విద్యార్థులు మానసికంగా ఇబ్బందిపడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్ పరీక్షలతోపాటు ఎక్కువమంది విద్యార్థులు జేఈఈ మెయిన్‌కు హాజరవుతుంటారు. ఈసారి జేఈఈపై విద్యార్థులు ఒత్తిడికి గురికావలసిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. 4 సార్లు పరీక్ష నిర్వహణతో ఎంతో వెసులుబాటు ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2021 పరీక్షలను 4 సార్లు నిర్వహిస్తుండడంతో విద్యార్థులకు ఎంతో వెసులుబాటు కలగనుంది. కోవిడ్‌తో పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది నుంచి జేఈఈని ఏటా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు, మార్చి 15 నుంచి 18 వరకు, ఏప్రిల్ 27 నుంచి 30 వరకు, మే 24 నుంచి 28 వరకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. విద్యార్థులు నాలుగుసార్లు రాయవచ్చు. ఎన్నిసార్లు రాసినా ఎక్కువ మార్కులు వచ్చిన దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం కానుంది. 13 భాషల్లో 384 ప్రశ్నపత్రాలు జేఈఈ మెయిన్‌ను ఇంగ్లిష్, హిందీతో పాటు దేశంలోని 11 ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాల, ఉర్దూ, పంజాబీ, ఒడియా, మరాఠి, గుజరాతి, బెంగాలి, అస్సామీ భాషల్లో కూడా ప్రశ్నపత్రాలు ఇవ్వనున్నందున విద్యార్థులకు ఎంతో వెసులుబాటుగా ఉండనుంది. ప్రాంతీయ భాషలో రాసేవారికి ఇంగ్లిష్ ప్రశ్నలు కూడా అందుబాటులో ఉంటాయి. జేఈఈలో బీఈ, బీటెక్‌లకు పేపర్–1, బీఆర్క్‌కు పేపర్–2ఏ, బీ, ప్లానింగ్‌కు పేపర్–2బీగా మూడుపేపర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 384 ప్రశ్నపత్రాలను ఎన్టీఏ విద్యార్థులకు అందుబాటులో ఉంచనుంది. ఇందుకోసం 4 లక్షలకుపైగా ప్రశ్నల బ్యాంకును సిద్ధం చేసింది. ఎన్టీఏ ఈసారి జేఈఈ సిలబస్, పరీక్షల ప్యాటర్న్‌లో కూడా మార్పులు చేసింది. పేపర్–1లో మొత్తం 90 ప్రశ్నల్లో 75 ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుంది. మొత్తం ప్రశ్నల్లో మ్యాథ్స్, ఫిజిక్సు, కెమిస్ట్రీలో 30 చొప్పున ప్రశ్నలుంటాయి. -
‘జేఈఈ మెయిన్’ పేరిట ఫేక్ వెబ్సైట్లు
సాక్షి, అమరావతి: జేఈఈ మెయిన్–2021 పేరిట ఫేక్ వెబ్సైట్లు హల్చల్ చేస్తున్నాయి. ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు వీటి బారినపడి మోసపోతున్నారు. ఫేక్ వెబ్సైట్లను రూపొందించిన కేటుగాళ్లు.. వాటి ద్వారా వివిధ ఫీజుల పేరుతో డబ్బులు కొల్లగొడుతున్నారు. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి పలు ఫిర్యాదులందుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులను అప్రమత్తం చేస్తూ ఎన్టీఏ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. మోసపోయిన విద్యార్థులు ఆయా తప్పుడు వెబ్సైట్ల సమాచారం అందించారని పేర్కొంది. జేఈఈజీయూఐడీఈ.సీవో.ఐఎన్ ద్వారా విద్యార్థుల నుంచి దరఖాస్తు ఫీజు వసూలు చేస్తున్నట్టు ఎన్టీఏ గుర్తించింది. ఈ వెబ్సైట్లో ఈ మెయిల్ అడ్రస్ ‘ఐఎన్ఎఫ్ఓఎట్దరేట్జేఈఈజీయూఐడీఈ.సీవో.ఐఎన్’అని, మొబైల్ నంబర్ 93112 45307 అని పొందుపరిచారని, ఈ నంబర్ ద్వారా ఆయా విద్యార్థులకు ఫోన్లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్టు ఎన్టీఏ తెలిపింది. ఇవే కాకుండా మరికొన్ని ఫేక్ వెబ్సైట్ల ద్వారా కూడా విద్యార్థులను కేటుగాళ్లు మోసగిస్తున్నట్టు పేర్కొంది. ఇటువంటి యూఆర్ఎల్తో ఉండే వెబ్సైట్లు, ఈ–మెయిళ్లు, మొబైల్ నంబర్లతో ఎన్టీఏకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. తప్పుడు వెబ్సైట్లతో విద్యార్థులను మోసగిస్తున్న వారిపై ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది. ఇలాంటి వెబ్సైట్లపై స్థానిక పోలీస్స్టేషన్లలోనూ ఫిర్యాదు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సూచించింది. ఇదే అసలైంది.. ‘జేఈఈఎంఏఐఎన్.ఎన్టీఏ.ఎన్ఐసీ.ఐఎన్’ ద్వారా మాత్రమే ఎన్టీఏ అభ్యర్థుల నుంచి జేఈఈ మెయిన్–2021 ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఎన్టీఏ తెలిపింది. ఇదిలా ఉండగా జేఈఈ మెయిన్–2021 ఫిబ్రవరిలో నిర్వహించనున్న తొలి విడత పరీక్షలకు ఆన్లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 23 వరకు పొడిగిస్తున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. 24వ తేదీ రాత్రి 11.50 గం. వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించొచ్చు. దరఖాస్తుల్లో వివరాల సవరణకు 27 నుంచి 30 వరకు గడువిచ్చింది. అడ్మిట్ కార్డులను వచ్చే నెల రెండో వారంలో అందుబాటులో ఉంచనున్నారు. -
జేఈఈ 2021పైనా కోవిడ్ నీలినీడలు
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)–2021పైనా కోవిడ్ నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరీక్షల నిర్వహణ సకాలంలో ఉంటుందా, ఉండదా.. అన్న సందేహాలు అలముకున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్–19 ప్రభావం కొనసాగుతుండడంతోపాటు రానున్న శీతాకాలంలో ఈ వైరస్ విజృంభిస్తే దాని ప్రభావం జేఈఈ నిర్వహణపై పడుతుందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రక్రియ ఇప్పటికే రెండునెలల ఆలస్యం జేఈఈ మెయిన్స్‌ను ఏటా రెండుసార్లు (జనవరి, ఏప్రిల్ నెలల్లో), జేఈఈ అడ్వాన్స్‌ను ఒకసారి నిర్వహిస్తున్నారు. జనవరిలో నిర్వహించే జేఈఈ మెయిన్స్ ప్రక్రియను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అంతకుముందు సంవత్సరం సెపె్టంబర్ నుంచే ప్రారంభిస్తుంటుంది. కానీ కోవిడ్ కారణంగా 2020 ఏప్రిల్‌లో నిర్వహించాల్సిన పరీక్షలు అయిదునెలలు ఆలస్యమయ్యాయి. దాని ప్రభావం 2021 జనవరి జేఈఈ మెయిన్స్‌పై పడుతోంది. ► షెడ్యూల్ ప్రకారం 2019 జనవరి, ఏప్రిల్ జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. ► కోవిడ్ కారణంగా 2020 జనవరి, ఏప్రిల్ పరీక్షలు షెడ్యూల్ మేరకు నిర్వహించలేకపోయారు. జనవరి పరీక్షలను జనవరి 7–9 తేదీల మధ్య నిర్వహించారు. ఏప్రిల్ పరీక్షలను ఆరునెలల తరువాత సెప్టెంబర్ 1–6 తేదీల మధ్య నిర్వహించారు. జేఈఈ మెయిన్స్ ర్యాంకులను సెప్టెంబర్ 11న ప్రకటించారు. ► జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఆలస్యంతో వాటిలో అర్హత సాధించిన వారికి జేఈఈ అడ్వాన్సు పరీక్షలు సెపె్టంబర్ 27న నిర్వహించారు. అడ్వాన్సు ఫలితాలను అక్టోబర్ 5న ప్రకటించగా అక్టోబర్ 6 నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమై నవంబర్ 9 వరకు కొనసాగింది. ప్రస్తుతం ఎన్ఐటీలు ఇతర సంస్థల్లో మిగిలిన సీట్లకు సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు (సీఎస్ఏబీ) స్పెషల్‌రౌండ్ భర్తీ చేపట్టింది. ఈనెల 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. డిసెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది. ► 2019లో జేఈఈ మెయిన్స్ ర్యాంకులను ఏప్రిల్ 30న ప్రకటించగా అడ్వాన్సు ఫలితాలు జూన్ 14న విడుదల చేశారు. అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ను జూన్ 16 నుంచి జులై 23 వరకు కొనసాగించి అనంతరం తరగతులు ప్రారంభించారు. ► 2021జనవరి జేఈఈ మెయిన్స్‌కు సంబంధించి నోటిఫికేషన్ ఇతర ప్రక్రియలు సెప్టెంబర్‌లో ప్రారంభం కాకపోవడంతో జనవరి పరీక్షలు ఆలస్యం అవుతాయని పలు విద్యాసంస్థల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. జేఈఈ గత షెడ్యూళ్లు ఇలా ఇంటర్మీడియట్ తరగతుల ప్రభావం ఈసారి ఇంటర్మీడియట్ తరగతులు ఆలస్యం కావడంతో వాటి ప్రభావం కూడా 2021 జనవరి జేఈఈ మెయిన్స్‌పై పడుతోంది. ఇంటర్మీడియెట్ తరగతులు దాదాపు అన్ని రాష్ట్రాల్లో జూన్ లేదా జూలై మొదటి వారం నుంచి ప్రారంభమవుతాయి. ఈసారి కోవిడ్ కారణంగా ఇంటర్మీడియెట్ తరగతులు ప్రారంభం కాలేదు. మన రాష్ట్రంలో జూన్‌లో తెరుచుకోవలసిన ఇంటర్ కాలేజీలు నవంబర్ 2న ప్రారంభమయ్యాయి. ఇదే పరిస్థితి అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. తరగతులు ఆలస్యం కావడంతో పరీక్షలు కూడా ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలన్నీ 2021 జనవరి జేఈఈ మెయిన్స్‌పై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటివరకు నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం కూడా దీనికి ఊతమిస్తోంది. బోర్డు పరీక్షలు ఆలస్యమైతే ఇబ్బందే అన్ని రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ సిలబస్, బోర్డుల పరీక్షలు పూర్తయ్యే దాని ప్రకారం జేఈఈ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఉంటుంది. కోవిడ్ ఇలాగే కొనసాగి బోర్డు పరీక్షలు ఆలస్యం అయితే జేఈఈ మెయిన్స్ కూడా కొంచెం ఆలస్యం కావచ్చు. ఈ సంవత్సరం కోవిడ్ మహమ్మారి కారణంగా ఏప్రిల్ పరీక్ష సెప్టెంబర్ వరకు ఆలస్యం అయినందున ఐఐటీ తదితర సంస్థల్లో చేరాలనుకునే విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. – జి.వెంకటేశ్వరరావు, మేథమెటిక్స్ నిపుణుడు, విజయవాడ అధికారిక ప్రకటన వస్తేనే స్పష్టత 2021 జనవరి జేఈఈ మెయిన్స్ ప్రక్రియపై ఎన్టీఏ నుంచి ప్రకటన వస్తేనే ఒక స్పష్టత వస్తుంది. దాని ప్రకారం విద్యార్థులకు బోధనను త్వరితంగా ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. 2021 సంవత్సరం జేఈఈ మెయిన్స్ జనవరి పరీక్ష జరుగుతుందా లేదా అన్న అనుమానాలున్నాయి. జనవరిలో జరగడం కష్టమే. 2020లో ఒక రకమైన ఇబ్బంది ఉంటే 2021లో మరో రకమైన అవస్థలు విద్యార్థులకు తప్పేలా లేవు. బోర్డు పరీక్షల ప్రకారం కూడా జేఈఈ మెయిన్స్ ఆధారపడి ఉంటుంది. – వి.శ్రీనివాసరావు, కెమిస్ట్రీ బోధకుడు, హైదరాబాద్ -
అస్సాంలో జేఈఈ టాపర్ అరెస్టు
గువాహటి: తన బదులు మరొకరితో పరీక్ష రాయించి, అస్సాంలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ)–మెయిన్‌లో టాపర్‌గా నిలిచిన నీల్ నక్షత్ర దాస్‌ను అరెస్టు చేసినట్లు గువాహటి పోలీసులు బుధవారం తెలిపారు. ఈ పరీక్షలో నక్షత్ర దాస్ 99.8 శాతం పర్సంటైల్ సాధించి, అస్సాం రాష్ట్రంలో టాపర్‌గా నిలిచాడు. అతడు మరొకరితో పరీక్ష రాయించినట్లు విచారణలో తేలింది. అంటే కష్టపడి చదవకుండానే, పరీక్షకు హాజరు కాకుండానే టాప్ ర్యాంకు కొట్టేశాడన్నమాట. ఈ విషయంలో నక్షత్ర దాస్‌కు అతడి తండ్రి డాక్టర్ జ్మోతిర్మయి దాస్, పరీక్ష కేంద్రం నిర్వాహకులు హేమేంద్రనాథ్ శర్మ, ప్రాంజల్ కలితా, హీరూలాల్ పాఠక్ సహకరించినట్లు విచారణలో బయటపడింది. తన కుమారుడు నక్షత్రదాస్కు టాప్ ర్యాంకు రావడానికి తండ్రి జ్యోతిర్మయి దాస్ దాదాపు రూ.20 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. -
ప్రాంతీయ భాషల్లోనూ జేఈఈ మెయిన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐఐటీ వంటి ప్రఖ్యాత ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) రాసే అభ్యర్థులకు శుభవార్త. ఈ పరీక్షను ఇకపై మాతృభాషలోనే రాయొచ్చు. కంప్యూటర్ ఆధారిత జేఈఈ (మెయిన్)ను వచ్చే ఏడాది నుంచి పలు ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ చెప్పారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లో భాగంగా మాతృభాష వినియోగాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఎన్ఈపీ విజన్‌ను దృష్టిలో పెట్టుకొని జేఈఈ(మెయిన్) టెస్టును పలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని జాయింట్ అడ్మిషన్ బోర్డు(జేఏబీ) నిర్ణయించిందని పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులు ఎక్కువ స్కోర్ సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు రమేశ్ పోఖ్రియాల్ గురువారం ట్వీట్ చేశారు. జేఈఈ(మెయిన్) ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ భాషల్లో నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష పెట్టాలని పలు రాష్ట్రాల నుంచి చాలాకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. గుజరాతీ భాషలో జేఈఈ(మెయిన్) నిర్వహిస్తూ ఇతర భాషలను విస్మరించడం పట్ల గత ఏడాది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై విద్యా శాఖ వివరణ ఇచ్చింది. గుజరాత్ ప్రభుత్వం కోరడం వల్లే గుజరాతీ భాషలో పరీక్ష నిర్వహిస్తున్నామని, 2021 నుంచి 11 ప్రాంతీయ భాషల్లోనూ జేఈఈ(మెయిన్) ఉంటుందని వెల్లడించింది. జేఈఈ(మెయిన్) ఫలితాల ఆధారంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు కల్పించే రాష్ట్రాల భాషను ఇందులో చేర్చనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మాతృభాషలో ఇంజనీరింగ్ అడ్మిషన్ టెస్టు నిర్వహిస్తున్నారు. అలాంటి భాషల్లో మెయిన్ ఉంటుందని సమాచారం. -
ఐఐటీ, ఎన్ఐటీ అభ్యర్థులకు ఊరట
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన నిబంధనల నుంచి అభ్యర్థులకు ఈసారి కొంత ఊరట లభిస్తోంది. ఈ సంస్థల్లో ప్రవేశాల ప్రక్రియలో పాల్గొనాలంటే జేఈఈ మెయిన్, అడ్వాన్స్ పరీక్షల్లో అర్హత సాధించడంతో పాటు ఇంటర్మీడియెట్‌లో 75 % మార్కులు లేదా జేఈఈలో టాప్ 20 పర్సంటైల్ సాధించాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడు ఈ నిబంధన నుంచి కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. కోవిడ్ నేపథ్యంలో మినహాయింపు ► కోవిడ్–19 నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. విద్యార్థులు కూడా కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ► దీంతో ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తూ.. జేఈఈలో అర్హత సాధించి మెరిట్లో ఉన్న అభ్యర్థులకు ఆయా సంస్థల్లో సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. ► ఐఐటీల్లో సీట్లకు జేఈఈ అడ్వాన్స్‌లో.. ఇతర సంస్థల్లో సీట్లు పొందేందుకు జేఈఈ మెయిన్‌లో మెరిట్ సాధించి ఉండాలి. ► ఈసారి కోవిడ్ కారణంగా అభ్యర్థులు ఆయా సంస్థల్లో చేరేందుకు ఆన్లైన్లో రిపోర్టింగ్ చేయవచ్చు. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు మాత్రం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. వెబ్సైట్లో అడ్మిట్ కార్డులు ► జేఈఈ అడ్వాన్స్ పరీక్ష 27న జరగనున్న నేపథ్యంలో ఐఐటీ న్యూఢిల్లీ సోమవారం నుంచి అడ్మిట్ కార్డులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ► అడ్మిట్ కార్డులో అభ్యర్థి పేరు, రోల్ నంబర్, ఫొటో, సంతకం, పుట్టిన తేదీ, చిరునామా, సామాజిక వర్గం సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. ► ఈ ఏడాది మొత్తం 2.50 లక్షల మంది అర్హత సాధించినా కేవలం 1,60,864 మందే పరీక్షకు హాజరయ్యేందుకు నమోదు చేసుకున్నారు. 222 నగరాల్లోని 1,150 కేంద్రాల్లో... ► ఫలితాలు అక్టోబర్ 5న విడుదలవుతాయి. అక్టోబర్ 6 నుంచి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించనుంది. ► ఈసారి కౌన్సెలింగ్ ప్రక్రియను 7కు బదులు 6 విడతల్లోనే ముగిస్తారు. అభ్యర్థులకు అవగాహన కోసం 2 విడతల మాక్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ► ఐఐటీలతో పాటుగా జేఈఈ అడ్వాన్స్ ర్యాంక్‌తో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బర్హంపూర్, భోపాల్, కోల్‌కతా, మొహాలి, పూనే, తిరువనంతపురం, తిరుపతిలలో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ► తిరువనంతపురంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రాయబరేలీలోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ, విశాఖలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం సంస్థల్లో ప్రవేశాలకూ దరఖాస్తు చేసుకోవచ్చు. -
జేఈఈ అడ్వాన్సుకు తగ్గిన దరఖాస్తులు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో సీట్ల భర్తీకి నిర్వ హించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్సు–2020కు గతంలో కన్నా తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారి నుంచి మెరిట్లో ఉన్న 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్సు రాసేందుకు అవకాశం కల్పించారు. అయితే శుక్రవారం రాత్రి గడువు ముగిసే సమయానికి 64 శాతం మందే అంటే.. 1.60 లక్షల అభ్యర్థులు అడ్వాన్సుకు దరఖాస్తు చేశారు. 2019 జేఈఈ మెయిన్ నుంచి అడ్వాన్సుకు 2.45 లక్షల మందిని అర్హులుగా గుర్తించి అనుమతివ్వగా 1.75 లక్షల మంది దరఖాస్తు చేశారు. జేఈఈ అడ్వాన్సులో మంచి స్కోరు సాధిస్తే ఇష్టమైన ఐఐటీలో చేరేందుకు అవకాశం ఉన్నా కూడా 90 వేల మంది పరీక్షకు దూరంగా ఉండటం విశేషం. ► జేఈఈ మెయిన్ పరీక్షల ఫలితాలను ఈనెల 11వ తేదీన ప్రకటించారు. 12 నుంచి 18 వరకు జేఈఈ అడ్వాన్సుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ► జేఈఈ అడ్వాన్సును ఈసారి ఐఐటీ న్యూఢిల్లీ నిర్వహిస్తోంది. 27వ తేదీన ఉదయం పేపర్1, మధ్యాహ్నం పేపర్2 పరీక్ష ఉంటుంది. ఫలితాలు అక్టోబర్ 5 న ప్రకటిస్తారు. ఆరో తేదీ నుంచి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ప్రవేశాల ప్రక్రియను ప్రారంభిస్తుంది. ప్రవేశాల షెడ్యూల్‌ను జోసా ఇప్పటికే ప్రకటించింది ► కోవిడ్–19 నేపథ్యంలో ఈఏడాది జేఈఈ అడ్వాన్సు పరీక్షను నిర్వహించే నగరాలు, కేంద్రాల సంఖ్యను పెంచారు. గతేడాది 164 నగరాల్లోని 600 కేంద్రాల్లో నిర్వహించగా, ఈసారి 222 నగరాలు, 1,150 సెంటర్లకు పెంచారు. ► ఈసారి జేఈఈ మెయిన్ కటాఫ్ శాతం ఓపెన్ కేటగిరీలో తప్ప తక్కిన అన్ని కేట గిరీల్లో తగ్గింది. అయినా కోవిడ్ పరిస్థితులు, పరీక్ష సన్నద్ధతకు ఆటంకాల నేపథ్యంలో అడ్వాన్స్‌కు దరఖాస్తులు తగ్గాయని విశ్లేషకులు చెబుతున్నారు. జేఈఈ మెయిన్ ర్యాంకుతో ఎన్ఐటీ, ఐఐఐటీల్లో లేదా ఇతర ఎంట్రెన్సు టెస్టుల ద్వారా దగ్గరలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరవచ్చన్న అభిప్రాయంతో అడ్వాన్సుకు దరఖాస్తు చేసి ఉండకపోవచ్చని వివరించారు. ఎన్టీఏ ప్రకటించిన వివరాల ప్రకారం కేటగిరీల వారీగా జేఈఈ మెయిన్–2020 కటాఫ్ ఇలా ఉంది.. ► కామన్ ర్యాంక్ జాబితా (సీఆర్ఎల్): 90.3765335 ► జనరల్–ఈడబ్ల్యూఎస్: 70.2435518 ► ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ): 72.8887969 ► షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ): 50.1760245 ► షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ): 39.0696101 ► పిడబ్ల్యూడి: 0.0618524 -
అక్టోబర్ 6 నుంచి ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ సంస్థల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లో సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) శుక్రవారం అర్ధరాత్రి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసింది. జేఈఈ మెయిన్ రెండో విడత (సెప్టెంబర్) ఫలితాలు అదే రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 21 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డులు ► జేఈఈ మెయిన్‌లో మెరిట్లో నిలిచిన 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. ఈ నెల 27న ఐఐటీ– ఢిల్లీ ఈ పరీక్షను నిర్వహించనుంది. ► అడ్మిట్ కార్డులను ఈ నెల 21 నుంచి 27 వరకు https:// jeeadv.ac.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ► అడ్వాన్స్డ్ పరీక్షను రాష్ట్రంలో అమలాపురం, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుడ్లవల్లేరు, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కంచికచర్ల, కావలి, కర్నూలు, మచిలీపట్నం, మార్కాపూర్, మైలవరం, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమహేంద్రవరం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, తిరువూరు, విజయవాడల్లో నిర్వహిస్తారు. ► ఈ నెల 29న ప్రొవిజినల్ ఆన్సర్ ‘కీ’ని విడుదల చేస్తారు. ► ఫైనల్ ఆన్సర్ ‘కీ’ని అక్టోబర్ 5న https://jeeadv.ac.inలో పెట్టి.. అదే రోజు ర్యాంకుల జాబితాను ప్రకటిస్తారు. ► బీఆర్కిటెక్చర్‌కు అభ్యర్థులు ప్రత్యేకంగా ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రాయాలి. అక్టోబర్ 5, 6 తేదీల్లో ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 8న ఈ పరీక్ష నిర్వహిస్తారు. జోసా ప్రవేశాల షెడ్యూల్ ఇలా.. ఈసారి ఆరు విడతల కౌన్సెలింగ్ ద్వారా 23 ఐఐటీలు, 32 ఎన్ఐటీలు, 26 ఐఐఐటీలు, మరో 30 ఇతర సంస్థలు కలిపి మొత్తం 111 జాతీయ విద్యాసంస్థల్లోని సీట్లను భర్తీ చేస్తారు. మొదట విడత సీట్ల కేటాయింపు కంటే ముందు రెండుసార్లు నమూనా కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తారు. దీనివల్ల అప్పటికే ఆప్షన్లు నమోదు చేసుకున్న వారు ఎక్కడ సీటు వస్తుందో తెలుసుకోవచ్చు. దాన్ని అనుసరించి అభ్యర్థులు తమ ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు. సీట్లు పొందినవారు స్వయంగా వెళ్లి ఆయా విద్యా సంస్థల్లో రిపోర్ట్ చేయనవసరం లేదు. కరోనా దృష్ట్యా ఆన్లైన్లోనే ప్రక్రియంతా పూర్తి చేసేలా మార్పులు చేశారు. ముఖ్య తేదీలు: జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు.. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: సెప్టెంబర్ 12 రిజిస్ట్రేషన్ ముగింపు: సెప్టెంబర్ 17 ఫీజు చెల్లింపు తుది గడువు: సెప్టెంబర్ 18 కౌన్సెలింగ్ షెడ్యూల్ తేదీలు ఇలా.. అక్టోబర్ 5: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు అక్టోబర్ 6 నుంచి: జోసా కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ అక్టోబర్ 16: మొదటి విడత సీట్ల కేటాయింపు అక్టోబర్ 21: రెండో విడత సీట్ల కేటాయింపు అక్టోబర్ 26: మూడో విడత సీట్ల కేటాయింపు అక్టోబర్ 30: 4వ విడత సీట్ల కేటాయింపు నవంబర్ 3: 5వ విడత సీట్ల కేటాయింపు నవంబర్ 7: 6వ విడత సీట్ల కేటాయింపు ఏపీ నుంచి ముగ్గురికి 100 ఎన్టీఏ స్కోర్ కాగా.. జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 100 ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) స్కోర్ సాధించిన వారిలో రాష్ట్రం నుంచి ముగ్గురు చోటు దక్కించుకున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన లండా జితేంద్ర, విశాఖపట్నానికి చెందిన వైఎస్ఎస్ నరసింహనాయుడు, గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన తడవర్తి విష్ణు శ్రీ సాయి శంకర్లు ఈ ఘనత సాధించారు. వీరే కాకుండా 100 స్కోర్ సాధించిన ఆర్.శశాంక్ అనిరుధ్ (కడప), రొంగల అరుణ సిద్ధార్థ్ (తూర్పుగోదావరి) ఏపీకి చెందిన వారే అయినా హైదరాబాద్‌లో పరీక్ష రాయడంతో ఆ రాష్ట్ర కోటాలోకి చేరారు. -
తెలంగాణ ఈసెట్ పరీక్ష ప్రారంభం
-
కొనసాగుతున్న తెలంగాణ ఈసెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈసెట్ నేటి ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 వరకు ముగుస్తుంది. మరొక సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు కొనసాగుతుంది. ఇక కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. విద్యార్థుల భద్రతపై అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా, ఉదయం పరీక్షకు 14,415 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం పరీక్షకు 13,600 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు పరీక్షలు నిర్వహిస్తున్న జేఎన్టీయూ అధికారులు తెలిపారు. తెలంగాణలో 56, ఏపీలో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. మాస్క్, శానిటైజర్ తప్పనిసరి చేశామని, పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరిస్తామని అధికారులు ఇదివరకే స్పష్టం చేశారు. కాగా, కోవిడ్ కారణంగా వాయిదాపడిన ఈసెట్, వైరస్ విజృంభణ అనంతరం నిర్వహిస్తున్న తొలి కామన్ ఎంట్రన్స్ టెస్టు కావడం గమనార్హం. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులకు బీటెక్ సెకండియర్‌లో ప్రవేశాల కోసం ఈసెట్ పరీక్షలు నిర్వహిస్తారు. (చదవండి: అనుమతి లేకున్నా కరోనా టెస్టులు!) రేపు జేఈఈ మెయిన్ దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం మంగళవారం నుంచి సెప్టెంబర్ 6 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. దీనికోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశా రు. ఐఐటీ ఢిల్లీ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్టు (సీబీటీ) విధానంలో ఒక్కరోజులో 85 వేలమంది మెయిన్ పరీక్షలకు హాజరుకానున్నా రు. తెలంగాణ నుంచి 67,319 మంది, దేశవ్యాప్తంగా 8.58 లక్షల మంది పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్‌తోపాటు రంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో పరీక్షా కేంద్రాలున్నాయి. (చదవండి: జేఈఈ, నీట్ పరీక్షలపై సందేహాలెన్నో!?) -
జేఈఈ, నీట్ పరీక్షలపై సందేహాలెన్నో!?
సాక్షి, న్యూఢిల్లీ : ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషణ్ (జేఈఈ), అండర్ గ్రాడ్యువేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)లను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెల్సిందే. ఓ పక్క దేశంలో ప్రాణాంతక కోవిడ్–19 కేసులు విజృంభిస్తోంటే ఈ పరీక్షలు నిర్వహించడం ఏమిటని కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు, పలు విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది విద్యార్థుల ప్రాణాలతో చెలగాడం ఆడడమేనని విమర్శిస్తున్నాయి. విద్యార్థులు తమ విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోరాదనే సదుద్దేశంతోనే పరీక్షల నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్రం వాదిస్తోంది. ఆ వాదనలో నిజం ఎంత ? ఒకరి నుంచి ఒకరికి కరోనా వైరస్ సోకకుండా భౌతిక దూరం పాటించేంత మౌలిక సౌకర్యాలు మన విద్యాలయాల్లో ఉన్నాయా ? తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రవేశ పరీక్షలు నిర్వహించే సామర్థ్యం మన విద్యారంగానికి ఉందా? పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కరోనా వైరస్ నుంచి ముప్పు ఉండదని కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం భరోసా ఇవ్వగలదా?డజన్ల సంఖ్యలో, కొన్ని సార్లు వందకు మించి విద్యార్థులు ఒకే గదిలో కూర్చొని పరీక్షలు రాయడం మనం చూశాం.(చదవండి : నీట్ 2020 అడ్మిట్ కార్డ్ విడుదల) వేల సంఖ్యలో విద్యార్థులు పరీక్షలు రాసినప్పుడే ఈ పరిస్థితులు కనిపిస్తాయి. ఇక నీట్‌కు, జేఈఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే పరీక్ష గదులు లేదా హాళ్లు ఎంతగా కిక్కిర్సి పోతాయో సులభంగానే ఊహించవచ్చు. ఈ రెండు పరీక్షలకు కలిపి దాదాపు 25 లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు. ఇవి ముఖ్యమైన వృత్తిపరమైన ప్రవేశ పరీక్షలు అవడం వల్ల కోవిడ్ లక్షణాలున్న అభ్యర్థులు కూడా పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంది. వారి ద్వారా సహచర విద్యార్థులకు కోవిడ్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారి ద్వారా, వారి తల్లిదండ్రులకు, వారి తల్లిదండ్రులకు సోకే అవకాశాలు ఉంటాయి. అదే జరిగితే సమాజంలో కోవిడ్ కేసులు కోకొల్లలుగా పెరిగే ప్రమాదం ఉంది. ఇలాంటి పరీక్షలకు ఒక్క నిమిషం దాటినా, మూడు నిమిషాలు దాటినా అనుమతించేది లేదంటూ పరీక్షల నిర్వహణాధికారులు తరచు హెచ్చరించడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటప్పుడు ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకుండా ఇప్పుడు ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు ఎలా హాజర కాగలరు? ప్రైవేటు వాహనాలను పట్టుకొని రాగలరా? వాటిలో గుంపులుగా ప్రయాణించడం వల్ల కరోనా సోకే ప్రమాదం ఉండదా? మూడు, నాలుగు వందల మంది హాజరయ్యే పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు భయపడిన కేంద్ర ప్రభుత్వం, తరచుగా పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేస్తూ వస్తోంది. అలాంటిది పాతిక లక్షల మంది హాజరయ్యే పరీక్షలను సురక్షితంగా ఎలా నిర్వహించగలదు ? వలస కార్మికులను దృష్టిలో పెట్టుకోకుండా కేంద్ర ప్రభుత్వం తొందర పడి గత మార్చి 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేసినట్లే అవుతుంది. నాటి తొందరపాటు నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 950 మంది అన్యాయంగా మృత్యువాత పడ్డారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు తొందరపడితే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. -
జేఈఈ, నీట్ పరీక్షలు.. ప్రధానికి లేఖ
న్యూఢిల్లీ: జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణపై ఉద్రిక్త కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న వేళ పరీక్షలు ఎలా పెడతారని కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడవద్దని విపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఇదిలా ఉండగా పరీక్షల నిర్వహణ చేపట్టాలంటూ వివిద కేంద్ర విశ్వవిద్యాలయాలకు చెందిన 150 మంది ప్రొఫెసర్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కరోనా ప్రమాదం ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జేఈఈ మెయిన్, నీట్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని లేఖలో కోరారు. 12వ తరగతి ఉత్తీర్ణులైన లక్షలాది విద్యార్థులు తదుపరి చర్యల కోసం ఎదురుచూస్తున్నారని.. ఎట్టిపరిస్థితుల్లోనూ వారి కలలను చిదిమేయకూడదని లేఖలో పేర్కొన్నారు. కొందరు నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని లేఖలో తెలిపారు. (చదవండి: జేఈఈ, నీట్ వాయిదాకై సుప్రీంకు!) అంతేకాక తగిన జాగ్రత్తలతో షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలని.. జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణను పూర్తిగా సమర్థిస్తున్నామని వారు స్పష్టం చేశారు. ఈ లేఖలో సంతకం చేసిన వారిలో ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఇగ్నో, లక్నో విశ్వవిద్యాలయం, జేఎన్‌యూ, బీహెచ్‌యూ, ఐఐటీ ఢిల్లీకి చెందిన విద్యావేత్తలతో పాటు లండన్ విశ్వవిద్యాలయం, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, హిబ్రూ విశ్వవిద్యాలయం, జెరూసలేం విశ్వవిద్యాలయం, ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న భారతీయ విద్యావేత్తలు కూడా ఉన్నారు. పరీక్షల నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారమే జేఈఈ, నీట్ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపింది. తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి తమపై తీవ్ర ఒత్తిడి ఉన్నదని, వారి కోరిక మేరకు జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ వెల్లడించారు. (చదవండి: జేఈఈ మెయిన్స్‌కు కరోనా ఆంక్షలు) పరీక్షకు సంబంధించి ఇప్పటికే 80 శాతం మంది విద్యార్థులు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. కాగా, సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జేఈఈ, సెప్టెంబర్ 13న నీట్ పరీక్షలను నిర్వహిస్తామని కేంద్రం వెల్లడించింది. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాల పెంపుతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాలను 570 నుంచి 660కి, నీట్ కేంద్రాలను 2546 నుంచి 3843కి పెంచారు. షిఫ్ట్‌ల సంఖ్యను కూడా 8 నుంచి 12 పెంచి.. ఒక్కో షిఫ్ట్‌కు పరీక్ష రాసే వారి సంఖ్యను 1.32 లక్షల నుంచి 85వేలకు తగ్గించారు. కాగా, దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్షకు 8.58 లక్షల మంది విద్యార్థులు, నీట్‌కు 15.97 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. -
జాగ్రత్తల నడుమ జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర విద్యాసంస్థలతో పాటు ఎంబీబీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్టీఏ) ప్రకటించింది. కోవిడ్–19 నేపథ్యంలో విద్యార్థులెవరికీ ఇబ్బందులు తలెత్తకుండా అనేక చర్యలు చేపడుతున్నామని పేర్కొంది. ఈ పరీక్షల నిర్వహణ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తూ సహకారం అందించాలని కోరింది. ఈ మేరకు ఎన్టీఏ తాజాగా ప్రకటన జారీ చేసింది. జేఈఈ మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు, నీట్ (అండర్ గ్రాడ్యుయేట్) పరీక్ష సెప్టెంబర్ 13న నిర్వహించేందుకు ఎన్టీఏ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో అవసరమైన కసరత్తును ఎన్టీఏ చేపట్టింది. భౌతిక దూరం పాటించేలా.. ► జేఈఈ (మెయిన్), నీట్ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే 99 కంటే ఎక్కువ శాతం మంది అభ్యర్థులకు తొలి ప్రిఫరెన్స్ కింద వారు కోరుకున్న పరీక్ష కేంద్రాన్ని ఎన్టీఏ కేటాయించింది. ► పరీక్ష కేంద్రాల సంఖ్యను జేఈఈ మెయిన్స్‌కు 570 నుంచి 660కు, నీట్ కేంద్రాలను 2,546 నుంచి 3,843కు పెంచారు. ► జేఈఈలో షిఫ్ట్‌ల సంఖ్య గతంలో 8 కాగా.. 12కు పెంచారు. అభ్యర్థుల సంఖ్య షిఫ్ట్‌కు అంతకుముందు 1.32 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు 85 వేలకు తగ్గించారు. ► జేఈఈ మెయిన్‌కు 8.58 లక్షల మంది, నీట్‌కు 15.97 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ► భౌతిక దూరం పాటించేందుకు వీలుగా పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచారు. ► జేఈఈ పరీక్ష కేంద్రాల లోపల నిర్ణీత భౌతిక దూరం ఉండేలా అభ్యర్థులకు దూరదూరంగా సీట్లు ఉంటాయి. ► నీట్ పరీక్ష కేంద్రాల్లో ఒక్కో గదిలో గతంలో 24 మంది అభ్యర్థులను అనుమతించగా.. ఇప్పుడు 12కు తగ్గించారు. ► పరీక్ష హాళ్లలో భౌతిక దూరాన్ని పాటించేందుకు అభ్యర్థుల ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు చేపడుతున్నారు. ► పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు నిర్దేశిత నిబంధనలు అనుసరించడంలో అభ్యర్థులు, తల్లిదండ్రులు సహకరించాలని ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది.