సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్‌లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. జాతీయ స్థాయిలో టాప్–10 ర్యాంకుల్లో 5 ర్యాంకులు సాధించి భేష్ అనిపించుకున్నారు. 360 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో.. 350 మార్కులతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భోగి సూరజ్ కృష్ణ మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నారు. అవే 350 మార్కులతో ఏపీకి చెందిన కేవీఆర్ హేమంత్ కుమార్ రెండో ర్యాంకు, తెలంగాణకు చెందిన గట్టు మైత్రేయ 5వ ర్యాంకు సాధించారు. ఏపీకి చెందిన దాకారాపు భరత్ 345 మార్కులతో 8వ ర్యాంకు, తెలంగాణకు చెందిన గోసుల వినాయక శ్రీవర్ధన్ 341 మార్కులతో 10వ ర్యాంకు సాధించారు. 340 మార్కులతో తెలంగాణ విద్యార్థి జాతోతు శివతరుణ్ 14వ ర్యాంకు, ఏపీకి చెందిన పిన్నంరెడ్డి లోకేశ్‌రెడ్డి 15వ ర్యాంకు పొందారు. ఇవే కాకుండా టాప్–100 లోపు 35 ర్యాంకులను తెలుగు విద్యార్థులే సాధించినట్టు విద్యాసంస్థలు వెల్లడించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంటకు చెందిన కొత్తపల్లి దిలీప్ 24వ ర్యాంకు, రంగారెడ్డి జిల్లా మంచాలకు చెందిన అనిరెడ్డి అరవింద్‌రెడ్డి 308 మార్కులతో 157వ ర్యాంకు సాధించారు.
ఫలితాలు విడుదల చేసిన సీబీఎస్‌ఈ
ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యాసంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాలకు.. ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులను ఎంపిక చేసేందుకు జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించారు. ఈనెల 8న ఆఫ్‌లైన్‌లో, 15, 16 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) సోమవారం సాయంత్రం విడుదల చేసింది. 10,74,319 మంది పరీక్షలకు హాజరుకాగా.. తెలంగాణ, ఏపీల నుంచి 75 వేల మంది చొప్పున హాజరయినట్టు అంచనా.
అడ్వాన్స్‌డ్‌కు 2,31,024 మంది ఎంపిక
ఐఐటీల్లో ప్రవేశాల కోసం మే 20న నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ముందుగా ప్రకటించిన ప్రకారం 2.24 లక్షల మంది విద్యార్థులను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే దానికి అదనంగా 7,024 మంది కలిపి 2,31,024 మందిని ఎంపిక చేశారు. వివిధ కేటగిరీల్లో సమాన ర్యాంకులు రావడంతో ఈ మేరకు అదనంగా అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసినట్టు తెలిసింది.
21 మంది బీసీ గురుకుల విద్యార్థులకు ర్యాంకులు
జేఈఈ మెయిన్‌లో 21 మంది బీసీ గురుకుల విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు ఓ ప్రకటనలో తెలిపారు. అందులో 9 మంది బాలికలు, 12 మంది బాలురు ఉన్నారని చెప్పారు.
ఓబీసీలో గరిష్ట మార్కులు 73
ఓపెన్ కేటగిరీలో గరిష్ట మార్కులు 350కాగా.. అడ్వాన్స్‌డ్‌కు కనీస అర్హత మార్కులను (కటాఫ్‌గా) 74గా నిర్ణయించారు. ఓపెన్ కేటగిరీ అనంతరం ఓబీసీ నాన్ క్రీమీలేయర్, ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల కేటగిరీల్లో గరిష్ట అర్హత మార్కులు 73గా తేలాయి. ఇక ఓబీసీ నాన్ క్రీమీలేయర్‌లో కటాఫ్ 45గా, ఎస్సీల్లో 29గా, ఎస్టీల్లో 24గా, వికలాంగుల్లో 35గా పరిగణనలోకి తీసుకున్నారు.
మే 2 నుంచి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు
జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులు అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం మే 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా ఐఐటీ కాన్పూర్ ఏర్పాట్లు చేసింది. ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు మే 8వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది. మే 14 నుంచి 20వ తేదీ వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 20న పరీక్ష జరుగుతుంది. ఫలితాలను జూన్ 10న ప్రకటించేలా షెడ్యూల్ రూపొందించారు.
ఏటేటా తగ్గిపోతున్న కటాఫ్
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హులుగా పరిగణనలోకి తీసుకునే విద్యార్థుల కటాఫ్ మార్కులు ఏటేటా తగ్గిపోతున్నాయి. ప్రశ్నపత్రం కఠినంగా ఉంటుండటంతోనే కటాఫ్ తగ్గిపోతోందని విద్యా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. 2014లో జనరల్ కటాఫ్ 115 మార్కులుగా ఉండగా.. అది ఇప్పుడు 74 మార్కులకు తగ్గింది. ఓబీసీలో 74 నుంచి 45 మార్కులకు, ఎస్సీలో 53 నుంచి 29 మార్కులకు, ఎస్టీలో 47 నుంచి 24 మార్కులకు కటాఫ్ తగ్గిపోయింది. ఇక ఈసారి టాప్ మార్కులు కూడా తగ్గిపోయాయి. 360 మార్కులకు నిర్వహించిన పరీక్షలో గతేడాది 354 టాప్ మార్కులురాగా.. ఈసారి టాప్ మార్కులు 350 మాత్రమే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment