జేఈఈలో తెలుగు విద్యార్థుల వెనుకంజ
గత ఏడాది టాప్ 14లో ఏడుగురు తెలుగువారు
ఈ సంవత్సరం మొదటి సెషన్‌లో ఇద్దరికే చోటు
12వ స్థానంలో సాయి మనోజ్ఞ, బని బ్రాత మజీకి 14వ స్థానం
తొలి సెషన్ ఫలితాలు వెల్లడించిన ఎన్‌టీఏ
రాజస్తాన్ విద్యార్థి ఆయూష్‌కు నేషనల్ మొదటి ర్యాంకు
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్)–2025 తొలి సెషన్ పరీక్షలో రాజస్తాన్‌కు చెందిన ఆయూస్ సింఘాల్ జాతీయ స్థాయిలో తొలి స్థానంలో నిలిచాడు. ఈ పరీక్షలో ఈసారి తెలుగు విద్యార్థులు పూర్తిగా వెనుకబడ్డారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో జాతీయ స్థాయిలో తొలి 14 స్థానాల్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మాత్రమే స్థానం సంపాదించారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ 12వ స్థానంలో నిలవగా, తెలంగాణకు చెందిన బని బ్రాత మజీకి 14వ స్థానం దక్కింది. గత ఏడాది జేఈఈ మెయిన్‌లో తొలి 14 స్థానాల్లో 5, 6, 7, 8, 12, 13, 14 ర్యాంకులు తెలుగు విద్యార్థులు కైవసం చేసుకున్నారు.
జేఈఈ మెయిన్–2025 తొలి సెషన్ పరీక్షలో కర్ణాటకకు చెందిన కుషార్గా గుప్తా ద్వితీయ స్థానం, ఢిల్లీకి చెందిన దక్ష, హరీస్ ఝా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. మొదటి 14 ర్యాంకుల్లో ఎక్కువగా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ విద్యార్థులే ఉన్నారు.
ఇద్దరు తెలుగువారికే వంద పర్సంటైల్
ఈసారి జేఈఈ మెయిన్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మాత్రమే వంద పర్సంటైల్ సాధించారు. 99 స్కోర్ జాబితాలో తెలుగు పేర్లే లేవు. జనవరి 22 నుంచి 28 వరకు జేఈఈ మెయిన్ –2025 తొలి సెషన్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ పరీక్షకు 13,11,544 మంది రిజిస్టర్ చేసుకోగా, 12,58,136 (95.93 శాతం) మంది పరీక్ష రాశారు. జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ 99 స్కోర్‌తో టాపర్‌గా నిలిచారు. మహిళా విభాగంలో సాయి మనోజ్ఞ గుత్తికొండ టాపర్‌గా నిలిచారు. ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ జరుగుతాయి. రెండు విభాగాలను ప్రామాణికంగా తీసుకుని తుది ర్యాంకులు ప్రకటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment