![NTA Schedule To Conduct The JEE Mains Exam In May - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/21/JEE-14.jpg.webp?itok=GwxlHd4i)
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ పరీక్షను మేలో నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్ణయించినట్లు తెలిసింది.ఈ దిశగా ఇప్పటికే సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్లు తెలిసింది. నోటిఫికేషన్ వచ్చే వారం విడుదల చేయాలని భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ త్వరలో మొదలవనుంది. వాస్తవానికి ఏప్రిల్‌లోనే పరీక్ష నిర్వహించాలను కున్నా సీబీఎస్‌ఈ టర్మ్–2 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి మొదలవుతుండటంతో అవి పూర్తయ్యాకే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు.
నిబంధనలు సడలించాలని డిమాండ్లు
జేఈఈ మెయిన్స్ నిబంధనలు సడలించాలని అన్ని రాష్ట్రాల విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్ష రాసేందుకు కనీసం ఇంటర్, ప్లస్–2లో 75 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను ఈసారీ సడలించాలని పట్టుబడుతున్నారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఈ నిబంధనకు మినహాయింపు ఇవ్వగా తాజాగా కరోనా వ్యాప్తి తగ్గడంతో ఆ నిబంధనను మళ్లీ అమలు చేయాలని ఎన్‌టీఏ భావిస్తోంది. విద్యార్థులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు.
గత రెండేళ్లుగా పరీక్షలు రాయకుండానే విద్యార్థులు ప్రమోట్ అవుతున్నారు. తెలంగాణలో టెన్త్ పరీక్షలు లేకుండా ఇంటర్‌కు పంపారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు తొలుత నిర్వహించకుండా సెకెండియర్‌కు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత పరీక్షల నిర్వహించినా కేవలం 49 శాతమే ఉత్తీర్ణత సాధించారు. దీంతో అందరినీ కనీస మార్కులతో పాస్ చేశారు. ఇప్పుడు వీళ్ళే జేఈఈ మెయిన్స్ రాయాల్సి ఉంటుంది. దీన్నిబట్టి చాలామందికి 75 మార్కులు ఇంటర్‌లో వచ్చే అవకాశం కన్పించడం లేదు. ఈ కారణంగా ఈ నిబంధన సడలింపు కోరుతున్నారు.
రెండుసార్లు చాలు!
జేఈఈ మెయిన్స్‌ను రెండుసార్లు నిర్వహిస్తే చాలన్న అభిప్రాయంతో అన్ని రాష్ట్రాలు ఏకీభవిస్తున్నాయి. తమిళనాడు, ఢిల్లీ విద్యార్థులు 4 సార్లూ మెయిన్స్ నిర్వహించాలని, ఎందులో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్‌టీఏ మాత్రం ఈ అవకాశం ఇచ్చేందుకు ఇష్టపడట్లేదు. గతేడాది కూడా 4 అవకాశాలు ఇచ్చినా విద్యార్థులు పెద్దగా వినియోగించుకోలేదు. దరఖాస్తు చేసిన వారిలో ఎక్కువ మంది పరీక్షకు హాజరవలేదు. ఆఖరి రెండు దఫాలకు హాజరు బాగా తగ్గిందని ఎన్‌టీఏ అధికారులు చెబుతున్నారు. ఈ దృష్ట్యా పరీక్షను రెండుసార్లే నిర్వహించడంపై ఎన్‌టీఏ దృష్టి పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment