
సాక్షి, అమరావతి: ఐఐటీలు, ఎన్‌ఐటీలు, తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 4వ సెషన్ తొలిరోజు పరీక్ష గురువారం ప్రశాంతంగా ముగిసింది. కంప్యూటరాధారితంగా జరిగే ఈ పరీక్షలు ఆగస్టు 27, 31, సెప్టెంబర్ 2వ తేదీల్లో జరగనున్నాయి. మొత్తం 7.5 లక్షల మంది వీటికి దరఖాస్తు చేసుకోగా ఏపీ నుంచి 70 వేల మంది వరకు ఉన్నారు. మొదటి రోజు ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు గతంలో కంటే కఠినంగా ఉన్నాయని కొందరు అభ్యర్థులు, కోచింగ్ కేంద్రాల నిపుణులు అభిప్రాయపడ్డారు.
రసాయన శాస్త్రం ప్రశ్నలు ఇంతకు ముందుకంటే కొంత సులువుగా ఉన్నాయన్నారు. భౌతిక శాస్త్రం ప్రశ్నలు మధ్యస్థంగా ఉండగా.. గణితం ప్రశ్నలు కష్టంగా ఉన్నాయని తెలిపారు. రసాయన శాస్త్రం ప్రశ్నల్లో.. ఆర్గానిక్, ఫిజికల్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలకు సమాన ప్రాతినిధ్యం ఉందని చెప్పారు. భౌతిక శాస్త్రంలో మోడ్రన్ ఫిజిక్స్‌లో ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటిజమ్, ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఇండక్షన్ వంటి అంశాల ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయన్నారు. ఇంటర్ ఫస్టియర్ కంటే సెకండియర్‌లోని అంశాలపైనే ఎక్కువ ప్రశ్నలు ఇచ్చారని తెలిపారు. మ్యాథ్స్‌లో ఎక్కువ ప్రశ్నలు ఇంటర్ సెకండియర్ నుంచే ఉన్నాయని పేర్కొన్నారు. కాలిక్యులస్ బేస్డ్ ఇంటిగ్రేషన్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ ప్రశ్నలు చాలా కఠినంగా ఇచ్చారని చెప్పారు.