National educational institutions
-
కౌన్సెలింగ్ తర్వాతే క్లాసులు..
సాక్షి, హైదరాబాద్: జాతీయ విద్యాసంస్థల్లో విద్యార్థుల బలవన్మరణాలను కట్టడిచేసేందుకు కేంద్ర విద్యాశాఖ నడుం బిగించింది. జాతీయ ఇంజనీరింగ్, మెడికల్, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల మానసిక ఒత్తిడిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించింది. కాలేజీలు మొదలయ్యే ముందే విద్యార్థులకు విద్యా విధానం, ఎదురయ్యే ఇబ్బందులు, వాటిని అధిగమించడంపై అవగాహన కల్పించాలని భావించింది. ఇందులోభాగంగా కొత్తగా చేరే విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని దేశంలోని అన్ని ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కేంద్రాలు (ఐఐఎస్ఈఆర్), ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్)లను ఆదేశించింది. ఈ సంస్థల్లో 2018 నుంచి 2022 వరకు జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు, వాటి కారణాలపై కేంద్రం అధ్యయనం చేసింది. ఐఐటీల్లో పెరుగుతున్న ఆత్మహత్యలు గత ఐదేళ్లలో ఐఐటీల్లో 32 మంది, ఎన్ఐటీల్లో 21 మంది, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 20 మంది, ఎయిమ్స్ సంస్థల్లో 11 మంది విద్యార్థులు అర్ధంతరంగా తనువు చాలించారు. జాతీయ స్థాయిలో తీవ్ర పోటీని తట్టుకుని సీట్లు తెచ్చుకున్న ఈ విద్యార్థులు మానసిక ఒత్తిడి, అనుకోకుండా డిప్రెషన్లోకి వెళ్లిపోవడం ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. జాతీయ కాలేజీల్లో చేరిన రెండో సంవత్సరం నుంచి వారికి తెలియకుండానే మానసిక ఒత్తిడి మొదలవుతోందని నిపుణులు చెబుతున్నారు. మొదటి ఏడాదిలో మిగిలిపోయే బ్యాక్‌లాగ్స్‌తో ఒక్కసారిగా బెంబేలెత్తిపోతున్నారని, కోర్సు ముగిశాక అనుకున్న రీతిలో జీవితంలో స్థిరపడలేమనే నైరాశ్యం వారిలో గూడుకట్టుకుంటోందని జాతీయ ఇంజనీరింగ్ సంస్థల డైరెక్టర్లు అభిప్రాయపడుతున్నారు. బట్టీ విధానమే కారణమా? ప్రతీ రాష్ట్రంలోనూ ఇంటర్మీడియెట్ వరకు కాలేజీల్లో బట్టీ విధానంలోనే బోధన సాగుతోందని నిపుణులు అంటున్నారు. జాతీయ పోటీ పరీక్షలైన జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ కోసం కోచింగ్ కేంద్రాలు ఒక తరహా బట్టీ పద్ధతిలోనే బోధన చేస్తున్నాయని చెబుతున్నారు. ఇది అసలైన మేధో విధానం కాకపోవడం, ఇంజనీరింగ్‌లో చేరిన తర్వాత ఇదే పద్ధతి ఉండకపోవడం సమస్యకు మూలంగా పేర్కొంటున్నారు. ఆత్మహత్యల నేపథ్యాన్ని పరిశీలిస్తే గణితం, ఫిజిక్స్ ప్రామాణికంగా ఉండే సబ్జెక్టుల్లోనే విద్యార్థులు వెనుకబడుతున్నారు. ఐఐటీలు, ఎన్ఐటీలు పూర్తిగా పరిశోధనాత్మకంగా ఉండాలని జాతీయ విద్యావిధానం చెబుతోంది. మేథ్స్‌లో ఏదైనా సమస్యను విశ్లేషణాత్మకంగా పరిష్కరించే విధానం జాతీయ సాంకేతిక విద్యలో ఇప్పుడు కీలకమైంది. బట్టీ విధానంలో వచ్చిన విద్యార్థులు ఇక్కడే గందరగోళానికి గురవుతున్నారని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. ఏ మాత్రం ధైర్యం కోల్పోతున్నా... ఉమ్మడి సీట్ల కేటాయింపునకు సంబంధించిన ఆరు దశల ‘జోసా’కౌన్సెలింగ్ పూర్తయింది. మరికొద్ది రోజుల్లో ఎన్ఐటీలు, ఐఐటీల్లో క్లాసులు మొదలవుతాయి. అందువల్ల ముందుగా ప్రతీ బ్రాంచీలోని విద్యార్థులను సమైక్య పర్చాలి. వారిలో ఉత్తేజాన్ని, మనోధైర్యాన్ని కల్పించేలా కౌన్సెలింగ్ నిర్వహించాలి. సమస్యలకు పరిష్కారం సాధించే మార్గాలను ముందే వివరించాలి. ప్రతీ విద్యార్థి వ్యక్తిగత నేపథ్యం, వారి కుటుంబ వివరాలు తెలుసుకోవాలి. కొన్ని రోజులు విద్యార్థులను దగ్గర్నుంచి పరిశీలించాలి. ఏమాత్రం ధైర్యం కోల్పోతున్నట్టు గుర్తించినా అతన్ని ప్రత్యేక పద్ధతిలో కౌన్సెలింగ్ చేయాలి. ఈ దిశగా అన్ని కాలేజీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ సూచించింది. కౌన్సెలింగ్ అవసరం : ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుదీ (నిట్ డైరెక్టర్, వరంగల్) విద్యార్థుల ఆత్మహత్యలను సీరియస్‌గా తీసుకోవాలి. మనోనిబ్బరం కోల్పోయిన వారికి ఒకసారి సాదాసీదా కౌన్సెలింగ్ ఇస్తే సరిపోదు. దశలవారీగా కౌన్సెలింగ్ ఇవ్వాలి. అతనిలో వచ్చే మార్పులను గమనించాలి. అవసరమైతే తల్లిదండ్రులనూ పిలిచి వారితో ధైర్యం చెప్పించాలి. ప్రతీ ఎన్‌ఐటీలోనూ కౌన్సెలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆలోచన మంచిదే. ఒత్తిడికి లోనవుతున్నారు: డాక్టర్ ఎన్వీ రమణారావు (నిట్ డైరెక్టర్, రాయ్‌పూర్) జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీటు వచ్చే వరకూ చదవడం వేరు. వచ్చిన తర్వాత చేయాల్సిన కృషి వేరు. ఈ తేడాను గుర్తించలేక విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇలాంటి వారిని గమనించేందుకు ప్రతీ పది మంది విద్యార్థులకు ఒక మెంటార్‌ను నియమించాం. -
జాతీయ విద్యా సంస్థల్లో చదివే బీసీలకూ ఫీజు రీయింబర్స్మెంట్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో చదివే బీసీలకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ (ఆర్టీఎఫ్) పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐఐటీలు, ఐఐఎంలు, సెంట్రల్ యూనివర్సిటీలు వంటి 200కు పైగా ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందిన రాష్ట్ర బీసీ విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులు చెల్లించనుంది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అమలు చేస్తున్న ఈ పథకాన్ని.. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే బీసీలకు కూడా వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. ఏటా సుమారు 10 వేల మందికి.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్లను అందజేస్తోందని.. రాష్ట్రంలో చదువుతున్న వారికి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నామని మంత్రి గంగుల గుర్తు చేశారు. ఇకపై దేశంలోని ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీట్లు పొందిన బీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఫీజు అందించనుందని తెలిపారు. మొత్తంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణేనని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఏటా రాష్ట్రానికి చెందిన దాదాపు 10వేల మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని, ఇందుకోసం ప్రభుత్వంపై ఏటా అదనంగా రూ.150 కోట్ల భారం పడుతుందని గంగుల వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు, రైతు బంధు, ఉచిత కరెంటు తదితర పథకాల్లో బీసీలదే మెజార్టీ వాటా అని పేర్కొన్నారు. బీసీలకు ఆత్మగౌరవ భవనాలు, గ్రామాలు, పట్టణాల్లో కమ్యూనిటీ హాళ్లు, కుల వృత్తిదారుల ఆర్థిక స్వావలంబనకు రూ.లక్ష ఆర్థిక సాయం, ప్రపంచస్థాయి విద్యను అందించేలా 327 గురుకుల విద్యాలయాల ఏర్పాటు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. ఈ నిర్ణయం విప్లవాత్మకం: జూలూరు గౌరీశంకర్ ఎక్కడా లేని విధంగా దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుకునేందుకు బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ హర్షం వ్యక్తం చేశారు. -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చూపిన తెలుగు విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్‌లో సత్తా చూపిన తెలుగు విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షలోనూ అదరగొట్టారు. జాతీయ స్థాయిలో మొదటి, రెండో ర్యాంకులతోపాటు టాప్–10లో ఆరుగురు తెలుగు విద్యార్థులే నిలిచారు. ఇందులో వావిలాల చిద్విలాసరెడ్డి (1వ ర్యాంకు), నాగిరెడ్డి బాలాజీరెడ్డి (9వ ర్యాంకు) తెలంగాణ వారుకాగా.. రమేశ్ సూర్యతేజ (2వ), అడ్డగడ వెంకట శివరామ్ (5వ), బిక్కిని అభినవ్ చౌదరి (7వ), వైపీవీ మనీందర్‌రెడ్డి (10వ ర్యాంకు) ఏపీకి చెందినవారు. ఇక మహిళల్లో జాతీయ టాప్ ర్యాంకర్ (298 మార్కులు)గా ఏపీ విద్యార్థిని నాయకంటి నాగ భవ్యశ్రీ నిలిచింది. ఆమెకు జనరల్ కేటగిరీలో 56వ ర్యాంకు వచ్చింది. టాప్‌లో ఐఐటీ హైదరాబాద్ జోన్.. దేశంలో ఐఐటీలు, ఇతర జాతీయస్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఐఐటీ గౌహతి ఆధ్వర్యంలో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహించగా.. ఆదివారం ఫలితాలను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 1,83,072 మంది పరీక్షలు రాయగా.. 43,773 మంది అర్హత సాధించారు. ఇందులో బాలురు 36,264 మంది, బాలికలు 7,509 మంది ఉన్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు గణనీయ సంఖ్యలో ర్యాంకులు సాధించారు. అడ్వాన్స్డ్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల పరిధి అధికంగా ఉన్న ఐఐటీ హైదరాబాద్ జోన్ టాప్‌లో నిలిచింది. ఈ జోన్ పరిధిలో 10,432 మందికి ర్యాంకులు వచ్చాయి. టాప్–500 ర్యాంకర్లలో 174 మంది ఈ జోన్ (తెలంగాణ, ఏపీతోపాటు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి కలిపి)కు చెందినవారే. నాగర్ కర్నూల్‌కు చెందిన వావిలాల చిద్విలాసరెడ్డి మొత్తం 360 మార్కులకు గాను 341 మార్కులు సా«ధించి జాతీయ స్థాయి టాపర్‌గా నిలిచాడు. గత ఏడాదితో పోల్చితే ఈసారి జేఈఈకి పోటీ ఎక్కువగా ఉందని.. పరీక్ష రాసిన వారి సంఖ్య, అర్హుల సంఖ్య పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. నేటి నుంచే జోసా రిజిరస్టేషన్లు ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన ‘జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా)’కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులు దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 30న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. మొత్తం 6 దశల్లో సీట్ల కేటాయింపు చేపడతారు. ఈ కౌన్సెలింగ్‌లో దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు (23), ఎన్ఐటీ, ఐఐఈఎస్టీ (31), ఐఐఐటీ (26) జీఎఫ్‌ఐటీ (38)లు కలిపి మొత్తం 118 విద్యాసంస్థల్లో సీట్లను కేటాయిస్తారు. గత ఏడాది ఈ సంస్థలన్నింటిలో కలిపి 16,598 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈసారి ఈ సీట్ల సంఖ్య మరింత పెరగనుందని అంచనా వేస్తున్నారు. ఐఐటీలలోని మొత్తం సీట్లలో 20శాతం మేర మహిళలకు సూపర్ న్యూమరరీ కింద కేటాయిస్తారు. – జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించిన వారిలో ఆర్కిటెక్ట్ కేటగిరీ అభ్యర్ధులు ఆర్కిటెక్ట్ ఆప్టిట్యూడ్ టెస్టును రాయాల్సి ఉంటుంది. వారు సోమవారం నుంచే ఏఏటీకి దరఖాస్తు చేయవచ్చు. ఈనెల 21న పరీక్ష నిర్వహించి 24న ఫలితాలు విడుదల చేస్తారు. పేదల విద్య కోసం సాఫ్ట్వేర్ రూపొందిస్తా.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మాది నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం గోదల్ గ్రామం. నాన్న రాజేశ్వర్‌రెడ్డి, అమ్మ నాగలక్ష్మి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. అమ్మానాన్న, సోదరుడి ప్రోత్సాహంతో ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా చదివాను. భవిష్యత్‌లో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించేలా సాఫ్ట్వేర్ రూపొందించడమే లక్ష్యం. – ఫస్ట్ ర్యాంకర్ చిద్విలాసరెడ్డి టాప్ 10 ర్యాంకర్లు వీరే.. 1. వావిలాల చిద్విలాసరెడ్డి (తెలంగాణ) 2. రమేశ్ సూర్యతేజ (ఏపీ) 3. రిషి కర్లా (రూర్కీ ఐఐటీ పరిధి) 4. రాఘవ్ గోయల్ (రూర్కీ ఐఐటీ పరిధి) 5. అడ్డగడ వెంకట శివరామ్ (ఏపీ) 6. ప్రభవ్ ఖండేల్వాల్ (ఢిల్లీ ఐఐటీ పరిధి) 7. బిక్కిని అభినవ్ చౌదరి (ఏపీ) 8. మలయ్ కేడియా (ఢిల్లీ ఐఐటీ పరిధి) 9. నాగిరెడ్డి బాలాజీరెడ్డి (తెలంగాణ) 10. వైపీవీ మనీందర్‌రెడ్డి (ఏపీ) -
‘జోసా’లో సీట్ల జోష్.. ఐఐటీ, ఎన్ఐటీలలో భారీగా పెరిగిన సీట్ల సంఖ్య
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయస్థాయి విద్యాసంస్థలలో సీట్ల సంఖ్య భారీగా పెరగడంతో విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్యావకాశాలు మరింత మెరుగవుతున్నాయి. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలతో పాటు ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే జీఎఫ్టీఐలలో 56,900ల వరకు సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలలో సీట్ల కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన ప్రాథమిక కసరత్తును చేపట్టింది. జూన్ 19 నుంచి ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్ల భర్తీ ప్రక్రియను చేపట్టనుంది. ఐదేళ్లలో 18వేలకు పైగా పెరిగిన సీట్లు గడచిన ఐదేళ్లలో ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీల్లో సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగం విస్తృతంగా అభివృద్ధి చెందుతుండడం, యువతకు ఉపాధి మార్గాలు అత్యధికంగా అందులోనే లభిస్తుండడం వంటి కారణాలతో సాంకేతిక విద్యకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. 2019కు ముందువరకు ఈ సంస్థల్లో సీట్ల సంఖ్య నామమాత్రంగానే ఉండడంతో ఉన్నత ప్రమాణాలుగల సాంకేతిక నిపుణుల అందుబాటూ అంతంతమాత్రంగానే ఉండేది. ఈ విద్యకోసం ఏటా దాదాపు 8లక్షల మంది విద్యార్థులు వివిధ దేశాలకు వెళ్లేవారు. ఇందుకు లక్షలాది రూపాయలను వారు వెచ్చించాల్సి వచ్చేది. దీన్ని నివారించి దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను వారికి అందుబాటులోకి తెచ్చేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. 2024 నాటికి ఐఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల సంఖ్యను పెంచడంతో పాటు సీట్ల సంఖ్యను 50% మేర పెంచేలా చర్యలు తీసుకుంది. అలాగే, 20 ప్రముఖ ఐఐటీ, ఇతర సంస్థలను ఇని స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్సు (ఐఓఈ)లుగా తీర్చిదిద్ది అత్య«దిక నిధులు కేటాయించింది. సంస్థలు, సీట్ల సంఖ్యను పెంచిన కేంద్రం ఇదిలా ఉండగా.. డీపీ సింగ్ ఇచ్చిన నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వం ఐఐటీలు, ఎన్ఐటీలు ఇతర సంస్థలు, సీట్ల సంఖ్యను 2020లో ఒక్కసారిగా పెంచింది. 2019లో దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీల్లో, జీఎఫ్టీఐలలో 38,704 సీట్లు ఉండగా దాన్ని 2020లో ఒకేసారి 50,822కు పెంచింది. వివిధ రాష్ట్రాల్లో కొత్త విద్యాసంస్థల ఏర్పాటుతో పాటు అప్పటికే ఉన్న ఐఐటీ, ఎన్ఐటీల్లో సదుపాయాలను మెరుగుపరచి సీట్ల సంఖ్యను పెంచింది. ఆ తరువాత కూడా ఏటేటా అయా సంస్థల్లో రెండేసి వేల చొప్పున సీట్లను పెంచుకునేలా చేసింది. 2021లో 52,453 సీట్లు, 2022లో 54,477 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2024 నాటికి 50 శాతం మేర సీట్లు పెంచాలన్న లక్ష్యం మేరకు 2023–24లో కూడా సీట్ల సంఖ్య పెరిగి 56,900 వరకు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈసారీ జోసా కటాఫ్ స్కోర్.. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల ప్రక్రియను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) చేపడుతుంది. జేఈఈ మెయిన్, అడ్వాన్సుడ్‌లో అత్యధిక స్కోరుతో మెరిట్ ర్యాంకులు సాధించిన వారికి వీటిల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 2023 ప్రవేశాలకు సంబంధించి జేఈఈ మెయిన్ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, జనవరి, ఏప్రిల్ నెలల్లో పూర్తిచేసి ఇటీవల తుది ర్యాంకులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్సుడ్‌ను నిర్వహించనున్నారు. అడ్వాన్సుడ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తులను మే 7 వరకు స్వీకరిస్తారు. జూన్ 4న జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్ష జరుగుతుంది. ఈ ఫలితాలు జూన్ 18న విడుదలవుతాయి. అనంతరం జూన్ 19 నుంచి జోసా రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ఈసారి కూడా గతంలో మాదిరిగానే ఆరు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయించే అవకాశముందని తెలుస్తోంది. ఇందుకు జోసా కటాఫ్ ర్యాంకులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మహిళలకు 20 శాతం కోటా.. ఇక ఐఐటీల్లో మహిళల చేరికలు నామమాత్రంగా ఉండడంతో వారి సంఖ్యను పెంచేందుకు వీలుగా అన్ని ఐఐటీల్లో 2018–19 నుంచి 20% మేర అదనపు కోటాను పెంచి సూపర్ న్యూమరరీ సీట్లను కేంద్రం ఏర్పాటుచేయించింది. మూడేళ్లపాటు దీన్ని తప్పనిసరిగా అన్ని సంస్థల్లో కేంద్రం కొనసాగించింది. దీంతో 2021 నాటికే ప్రముఖ ఐఐటీల్లో మహిళల చేరికలు 20 శాతానికి పైగా పెరిగాయి. తరువాత మహిళలకు సూపర్ న్యూమరరీ సీట్లపై ఆయా ఐఐటీలే నిర్ణయం తీసుకునేలా చేసింది. -
నేటి నుంచి జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలు గురువారం (నేడు) ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 9.4 లక్షల మంది హాజరయ్యే అవకాశముంది. ఏపీ నుంచి 1.5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దేశంలోని 330 పట్టణాలు, విదేశాల్లోని 15 పట్టణాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏపీలోని 25 పట్టణాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు. ఈ పరీక్షలు గురువారంతో పాటు 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో జరుగుతాయి. ఇంతకు ముందు షెడ్యూల్లో 6 వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నప్పటికీ, అభ్యర్థుల సంఖ్య పెరగడంతో 13, 15 తేదీల్లో కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్ష నిర్వహిస్తోంది. రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు బ్యాచ్‌లుగా పరీక్ష జరుగుతుంది. జేఈఈ మెయిన్ తొలి సెషన్‌కు 8.2 లక్షల మంది హాజరు కాగా, ఈసారి ఈ సంఖ్య పెరుగుతోంది, అభ్యర్ధులు పరీక్ష కేంద్రానికి అడ్మిట్ కార్డు కాపీలతో పాటు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును కూడా తీసుకురావాలని ఎన్టీఏ సూచించింది. -
జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్‌కు 9.4లక్షల మంది
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ అడ్మిట్‌కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం రాత్రి విడుదల చేసింది. www.nta.ac.in లేదా https://jeemain.nta.nic.in/వెబ్సైట్ల నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ సూచించింది. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 9.4 లక్షల మంది హాజరయ్యే అవకాశముందని పేర్కొంది. దేశంలో 330 పట్టణాలు, విదేశాల్లోని 15 పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 25 పట్టణాల్లో ఈ పరీక్షలకు ఎన్టీఏ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 6వ తేదీనుంచి 15వ తేదీవరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇంతకుముందు ఈ పరీక్షల షెడ్యూల్లో 6వ తేదీనుంచి 12వ తేదీవరకు నిర్వహిస్తామని పేర్కొన్నా.. అభ్యర్థుల సంఖ్య పెరగడంతో 13, 15 తేదీల్లో కూడా పరీక్ష నిర్వహించనున్నట్లు అడ్మిట్‌కార్డుల్లో పొందుపరిచింది. ప్రస్తుతం తొలిరోజు పరీక్ష రాసేవారి అడ్మిట్‌కార్డులను ఎన్టీఏ విడుదల చేసింది. తదుపరి రోజులకు సంబంధించి పరీక్షరాసే వారి అడ్మిట్‌కార్డులను వరుసగా ముందు రోజుల్లో ఇవే వెబ్సైట్లలో ఉంచనుంది. పుట్టిన తేదీ, అప్లికేషన్ నంబరు నమోదు చేయడం ద్వారా అభ్యర్థులు అడ్మిట్‌కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చునని ఎన్టీఏ తెలిపింది. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి అడ్మిట్‌కార్డు కాపీలతో పాటు చెల్లుబాటయ్యే ఫొటో గుర్తింపుకార్డు కూడా తీసుకురావాలని సూచించింది. తొలి సెషన్ కన్నా ఎక్కువమంది అభ్యర్థులు జనవరిలో నిర్వహించిన మొదటి సెషన్ పరీక్షకన్నా రెండో సెషన్‌కు ఎక్కువమంది హాజరుకానున్నారని ఎన్టీఏ అడ్మిట్‌కార్డుల నోట్లో తెలిపింది. తొలి సెషన్లో 8.6 లక్షల మంది హాజరుకాగా ఈసారి 9.4 లక్షల మంది పరీక్ష రాయనున్నట్లు పేర్కొంది. జనవరి సెషన్ సమయంలో ఇంటర్ పరీక్షల సన్నద్ధతతో పాటు ప్రాక్టికల్ పరీక్షలు కూడా ఉండడంతో ఈ పరీక్ష రాసిన విద్యార్థుల సంఖ్య తక్కువే. అప్పుడు పరీక్ష రాయని వారితోపాటు రాసినవారు కూడా రెండో సెషన్లో పరీక్ష రాయనున్నారు. ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు ముగియడంతో విద్యార్థులకు జేఈఈ పరీక్షకు వెసులుబాటు కలిగింది. తొలిసెషన్ పరీక్షకు 8,60,064 మంది పేపర్–1కు, 46,465 మంది పేపర్–2కు రిజిస్టరయ్యారు. వీరిలో పేపర్–1కి 8,23,967 (95.80 శాతం) మంది, పేపర్–2కి 95 శాతానికిపైగా హాజరయ్యారు. 2.5 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక జేఈఈ మెయిన్స్ రెండు విడతల పరీక్షలకు సంబందించిన తుది ర్యాంకులతో ఫలితాలు ఈనెలాఖరునాటికి విడుదల కానున్నాయి. రెండు సెషన్లలో సాధించిన మార్కుల్లో ఎక్కువ మార్కులను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటిస్తారు. ఏప్రిల్ 30 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు ప్రక్రియ మొదలు కానున్నందున అంతకు ముందే ఈ ఫలితాలు వెలువడనున్నాయి. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన తొలి 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌లో దరఖాస్తుకు అవకాశమిస్తారు. కటాఫ్ 87 నుంచి 90 మార్కుల వరకు జేఈఈ మెయిన్ నుంచి అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించడానికి కటాఫ్ మార్కులు జనరల్ కేటగిరీలో 87 నుంచి 90 వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కటాఫ్ మార్కులు పెరుగుతాయని భావిస్తున్నారు. గతేడాది జనరల్ కటాఫ్ మార్కులు 88. గత అయిదేళ్ల కటాఫ్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటే ఈ సారి కటాఫ్ ఇంచుమించు 90 వరకు ఉంటుందని తెలుస్తోంది. ఏపీలో 25 సెంటర్లు ఇవే.. అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం, అమరావతి, గూడూరు, మచిలీపట్నం, నంద్యాల, తాడేపల్లిగూడెం. -
జేఈఈ మెయిన్ సిటీ ఇంటిమేషన్ లెటర్లు విడుదల
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ –2023 సెకండ్ సెషన్ పరీక్షలకు సిటీ ఇంటిమేషన్ లెటర్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. విద్యార్థులు ఎన్టీఏ వెబ్సైట్ https:// jee main. nta.nic.in/' నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. మెయిన్ సెకండ్ సెషన్ ఆన్లైన్ పరీక్షలు ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు జరుగుతాయి. దేశవ్యాప్తంగా 290 పట్టణాలతో పాటు విదేశాల్లోని 24 పట్టణాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఏపీలో 25 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఎన్టీఏ ఏర్పాటుచేసింది. విద్యార్థులు ఏ పట్టణంలో పరీక్ష రాయాలో తెలియజేసేలా ఎన్టీఏ ఈ సిటీ ఇంటిమేషన్ లెటర్లను ముందుగా విడుదల చేస్తుంది. విద్యార్థులు ముందుగా ఆయా కేంద్రాలను సందర్శించి, పరీక్షల రోజున ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమయానికి చేరుకోవడానికి వీలుగా ఈ ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు వారి దరఖాస్తు నంబరు, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా సిటీ ఇంటిమేషన్ లెటర్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లెటర్లతో పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశానికి అడ్మిట్ కార్డులు జారీ చేస్తారు. వీటిని కూడా త్వరలోనే ఎన్టీఏ విడుదల చేయనుంది. డౌన్‌లోడ్‌లో సమస్యలు ఏర్పడితే 011–40759000 ఫోన్ నెంబర్లో లేదా "jeemain@nta.ac.in.' ఈమెయిల్ ద్వారా సంప్రదించాలని ఎన్టీఏ సూచించింది. విద్యార్థులు ఎన్టీఏ అధికారక వెబ్సైట్లలో వచ్చే సూచనలను అనుసరించాలని సూచించింది. -
సీట్ల కేటాయింపు 6 రౌండ్లకు పరిమితం
సాక్షి, అమరావతి: ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సీట్ల కేటాయింపు ప్రక్రియను ఈసారి ఆరు రౌండ్లలో పూర్తి చేయాలని జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా)–2022 నిర్ణయించింది. ఈసారి జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి ఆలస్యం కావడంతో సీట్ల కేటాయింపును ఆరు విడతలకే పరిమితం చేసింది. గతంలో ఏడు రౌండ్ల మేర సీట్ల కేటాయింపు చేయడంతోపాటు ప్రత్యేక రౌండ్లను కూడా నిర్వహించింది. 2015, 2016ల్లో నాలుగేసి రౌండ్లలో సీట్ల కేటాయింపును పూర్తి చేయగా 2017, 2018, 2019ల్లో ఏడేసి రౌండ్లలో సీట్ల కేటాయింపు చేశారు. 2020, 2021ల్లో ఆరు రౌండ్లలో ముగించారు. ఈసారి సీట్ల కేటాయింపును త్వరగా పూర్తి చేసి తరగతులు ప్రారంభమయ్యేలా జోసా షెడ్యూల్‌ను రూపొందించింది. 12 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల ఫలితాలను ఈ నెల 11న విడుదల చేయనుండడంతో మరుసటి రోజు అంటే 12 నుంచి సీట్ల కేటాయింపునకు కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ఆ రోజు నుంచి మెరిట్ విద్యార్థులు జోసా కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతోపాటు చాయిస్‌లు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) ఫలితాలు ఈ నెల 17న వెలువడనున్నందున ఆర్కిటెక్చర్ కోర్సు ఔత్సాహికులు ఆ రోజున చాయిస్‌లను నమోదు చేయాలి. ఇలా చాయిస్‌లను నమోదు చేసిన వారికి 18న మాక్ సీట్ కేటాయిస్తారు. ఆ తర్వాత మళ్లీ చాయిస్‌ల నమోదుకు అవకాశమిచ్చి 20న మాక్ సీట్ కేటాయింపు చేస్తారు. తమ ర్యాంకుకు ఏ కోర్సులో, ఏ సంస్థలో సీటు వస్తుందో ఒక అవగాహనకు వచ్చిన విద్యార్థులు చివరగా సెప్టెంబర్ 20న చాయిస్‌లను లాక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 17 వరకు ఆరు రౌండ్లలో సీట్ల కేటాయింపును చేపడతారు. ఇక ఎన్ఐటీలు, తదితర సంస్థల్లో మిగిలి ఉండే సీట్లకు ప్రత్యేక రౌండ్ ద్వారా నిర్వహిస్తారు. ఎన్ని సంస్థలు, ఎన్ని సీట్లు.. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 26 ఐఐఐటీలు, 36 ఇతర సంస్థల్లో విద్యార్థులకు జోసా సీట్లను కేటాయిస్తుంది. కాగా అందరూ సీట్లు ఆశించే 23 ఐఐటీల్లో 16 వేలకుపైగా సీట్లు ఉన్నాయి. మరోవైపు ఐఐటీల్లో అమ్మాయిల చేరికలను 20 శాతం మేర పెంచేందుకు కేంద్రం2018 నుంచి 2020 వరకు వారికి ఆయా సంస్థల్లో సూపర్ న్యూమరరీ కోటాను ప్రకటించింది. 2021 నుంచి ఈ కేటాయింపును ఆయా జాతీయ విద్యా సంస్థలే నిర్ణయానికే వదిలేసింది. -
8 నుంచి జేఈఈ మెయిన్ రెండో విడత దరఖాస్తులు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లు, తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2022–23 తొలిదశ పరీక్షల దరఖాస్తు ప్రక్రియ గురువారంతో ముగిసింది. రెండో దశ పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 8 నుంచి ప్రారంభం కానుంది. మే 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ పరీక్షలకు ముందే తొలిదశ మెయిన్ పరీక్ష జేఈఈ మెయిన్ తొలిదశ పరీక్షలు ఏప్రిల్ 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో ఇవి జరగనున్నాయి. ఏప్రిల్‌లోనే వివిధ బోర్డుల ఇంటర్మీడియెట్/+2 పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్ తొలివిడత పరీక్షలకు విద్యార్థుల హాజరు తక్కువగానే ఉండొచ్చని అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలను మే 6 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా తరగతులు సరిగ్గా జరగకపోవడంతో ఇంటర్ బోర్డు.. సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించింది. అయితే జేఈఈ మెయిన్ సిలబస్‌ను మాత్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) యథాతథంగానే ఉంచింది. దీంతో విద్యార్థులు జేఈఈ మెయిన్ సిలబస్‌ను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి వస్తోంది. ఓవైపు కరోనాతో విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఇంటర్ సిలబస్‌ను పూర్తి చేసి పరీక్షలకు సన్నద్ధం కావడానికే విద్యార్థులకు సమయమంతా సరిపోతోందని అధ్యాపకులు చెబుతున్నారు. జేఈఈ ప్రిపరేషన్‌కు అదనపు సమయం అవసరమవుతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షల కంటే ముందు జరిగే జేఈఈ మెయిన్ తొలివిడత పరీక్షలకు విద్యార్థులు సంసిద్ధం కాలేకపోతున్నారని పేర్కొంటున్నారు. దీంతో తొలివిడత పరీక్షకు నమోదు చేసుకున్నా హాజరు కావడం కష్టమేనని చెబుతున్నారు. ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక నిర్వహించే జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలకు విద్యార్థులు సిద్ధంగా ఉంటారని వివరిస్తున్నారు. మెయిన్ రెండో సెషన్ పరీక్షలు మే 24 నుంచి 29 వరకు జరగనున్నాయి. కాగా, జేఈఈ మెయిన్‌కి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య ఈసారి కూడా భారీగానే ఉండొచ్చని కోచింగ్ సెంటర్ల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా జేఈఈకి దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య 10 లక్షలు దాటుతోంది. -
రసాయనం సులభం.. గణితం కష్టం
సాక్షి, అమరావతి: ఐఐటీలు, ఎన్ఐటీలు, తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 4వ సెషన్ తొలిరోజు పరీక్ష గురువారం ప్రశాంతంగా ముగిసింది. కంప్యూటరాధారితంగా జరిగే ఈ పరీక్షలు ఆగస్టు 27, 31, సెప్టెంబర్ 2వ తేదీల్లో జరగనున్నాయి. మొత్తం 7.5 లక్షల మంది వీటికి దరఖాస్తు చేసుకోగా ఏపీ నుంచి 70 వేల మంది వరకు ఉన్నారు. మొదటి రోజు ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు గతంలో కంటే కఠినంగా ఉన్నాయని కొందరు అభ్యర్థులు, కోచింగ్ కేంద్రాల నిపుణులు అభిప్రాయపడ్డారు. రసాయన శాస్త్రం ప్రశ్నలు ఇంతకు ముందుకంటే కొంత సులువుగా ఉన్నాయన్నారు. భౌతిక శాస్త్రం ప్రశ్నలు మధ్యస్థంగా ఉండగా.. గణితం ప్రశ్నలు కష్టంగా ఉన్నాయని తెలిపారు. రసాయన శాస్త్రం ప్రశ్నల్లో.. ఆర్గానిక్, ఫిజికల్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలకు సమాన ప్రాతినిధ్యం ఉందని చెప్పారు. భౌతిక శాస్త్రంలో మోడ్రన్ ఫిజిక్స్‌లో ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటిజమ్, ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఇండక్షన్ వంటి అంశాల ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయన్నారు. ఇంటర్ ఫస్టియర్ కంటే సెకండియర్లోని అంశాలపైనే ఎక్కువ ప్రశ్నలు ఇచ్చారని తెలిపారు. మ్యాథ్స్‌లో ఎక్కువ ప్రశ్నలు ఇంటర్ సెకండియర్ నుంచే ఉన్నాయని పేర్కొన్నారు. కాలిక్యులస్ బేస్డ్ ఇంటిగ్రేషన్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ ప్రశ్నలు చాలా కఠినంగా ఇచ్చారని చెప్పారు. -
నేటి నుంచి జేఈఈ 4వ విడత
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థలలో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ–మెయిన్) 2021 4వ సెషన్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మే లో జరగాల్సిన ఈ పరీక్షలు కోవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి. కంప్యూటరాధారితంగా జరిగే ఈ పరీక్షలు సెప్టెంబర్ 2 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 7 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. తొలిరోజు పేపర్–2 అయిన బీ.ఆర్క్, బీ.ప్లానింగ్ పరీక్షలు జరగనున్నాయి. బీటెక్ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు ఆ తరువాత వరుసగా నాలుగు రోజుల పాటు ఆగస్టు 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఉదయం, సాయంత్రం రెండు బ్యాచ్‌లుగా జరుగుతాయి. జేఈఈ మెయిన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ సంవత్సరం నుంచి నాలుగు సెషన్లలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగో సెషన్ పూర్తి అయిన తరువాత సెప్టెంబర్ మూడో వారంలో తుది విడత ఫలితాలను అభ్యర్థుల ర్యాంకులతో సహా ఎన్టీఏ ప్రకటించనుంది. -
నేటి నుంచి జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) మెయిన్ రెండో విడత (మార్చి సెషన్) పరీక్షలు నేటి (మంగళవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా 20 కేంద్రాల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18 వరకు మూడ్రోజుల పాటు రోజుకు రెండు సెషన్లలో వీటిని నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు 5 లక్షల మంది వరకు విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో మార్చి సెషన్ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మూడ్రోజులకు కుదించింది. పరీక్షల నిర్వహణలో ప్రతి ఒక్కరూ కరోనా ప్రొటోకాల్ నిబంధనలను పాటించేలా చర్యలు చేపట్టింది. సిబ్బందితో పాటు అభ్యర్థులు విధిగా మాస్కులు ధరించాలి. సిబ్బందికి గ్లౌజ్‌లను ఏర్పాటుచేస్తున్నారు. పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేయిస్తున్నారు. కాగా, పరీక్షలకు హాజరయ్యే వారు తమతోపాటు పారదర్శక బాటిల్లో శానిటైజర్ తెచ్చుకోవడానికి అనుమతిస్తున్నారు. సెల్ఫోన్లు, డిజిటల్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. మొదటి సెషన్ ఉ.9 నుంచి 12 వరకు.. రెండో సెషన్ మ.3 నుంచి సా.6 వరకు జరుగుతుంది. మొదటి సెషన్ అభ్యర్థులు ఉ.7.30 నుంచి 8.30 గంటలలోపు.. రెండో సెషన్ అభ్యర్థులు మ.1.30 నుంచి 2.30 గంటలలోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. అడ్మిట్ కార్డుతోపాటు ఫొటో ఐడెంటీటీ కార్డును తప్పనిరిగా తమతో పాటు తెచ్చుకోవాలి. -
జేఈఈలో తొలివిడతకే ఎక్కువమంది..
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే జేఈఈ (మెయిన్) తొలివిడత పరీక్షకే ఎక్కువమంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మొత్తం నాలుగు విడతల్లో ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలకు తొలివిడతకే 6,61,761 మంది రిజిష్టర్ చేసుకున్నారు. అతి తక్కువగా ఏప్రిల్ సెషన్‌కు 4,98,910 రిజిస్ట్రేషన్లు ఉండగా మార్చి సెషన్‌కు 5,04,540, మే సెషన్‌కు 5,09,972 మంది రిజిష్టర్ అయ్యారు. తొలివిడత సెషన్ పరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం రాత్రి విడుదల చేసింది. ఇక ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా మొదటి విడత పరీక్షలు జరగనున్నాయి. అడ్మిట్ కార్డులు జరభద్రం అభ్యర్థులు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నాక వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని ఎన్టీఏ సూచించింది. అలాగే.. ► ‘జేఈఈమెయిన్.ఎన్టీఏ.ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి. ► అడ్మిట్ కార్డులను అభ్యర్థులు తమ వ్యక్తిగత మెయిల్లో వెంటనే భద్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఎలాంటి డూప్లికేట్లు జారీచేయరు. ► జేఈఈ అడ్మిషన్లు పూర్తయ్యేవరకు వీటిని దాచుకోవలసిన బాధ్యత అభ్యర్థులదే. ► అడ్మిట్‌కార్డులోని వివరాలన్నింటినీ అభ్యర్థులు తాము సమర్పించిన ఆన్లైన్ దరఖాస్తు ఫారంలోని వివరాలతో సరిపోతున్నాయో లేదో సరిచూసుకోవాలి. ► అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్‌లో సమస్యలు ఎదురైతే 0120–6895200 నెంబర్లో ఉ.10 నుంచి సా.5లోపు సంప్రదించవచ్చు. దరఖాస్తులో అసంపూర్ణ సమాచారాన్ని నింపిన వారికి అడ్మిట్‌కార్డు జారీచేయడంలేదని ఎన్టీయే పేర్కొంది. ఈ–మెయిల్ ఐడీ: ‘జేఈఈఎంఏఐఎన్–ఎన్‌టీఏఎట్‌దరేట్‌జీఓవీ.ఐఎన్’లో కూడా సంప్రదించవచ్చు. అభ్యర్థులకు ఎన్టీఏ సూచనలు.. ► పరీక్ష కేంద్రానికి జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు, అందులో ఉన్నలాంటిదే మరో పాస్‌పోర్టు సైజ్ కలర్ ఫొటో తీసుకువెళ్లాలి. దాన్ని అటెండెన్సు షీటులో నిర్దేశిత ప్రాంతంలో అంటించాలి. ► పాన్‌కార్డు, ఆధార్‌కార్డు తదితర ఏదైనా ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డును తీసుకువెళ్లాలి. ► ఎన్టీఏ వెబ్సైట్ నుంచి అండర్‌టేకింగ్ ప్రొఫార్మాను డౌన్లోడ్ చేసుకుని దానిపై సంతకం చేసి పరీక్ష కేంద్రంలో అందించాలి. ► కరోనా నేపథ్యంలో పారదర్శక బాటిళ్లలో శానిటైజర్, మంచినీటిని అనుమతిస్తారు. ► మధుమేహం ఉన్న అభ్యర్థులు తమతో పాటు పరీక్ష కేంద్రంలోకి పండ్లు, సుగర్ టాబ్లెట్లు తీసుకెళ్లొచ్చు. ► పారదర్శకంగా ఉండే బాల్‌పెన్నునే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ► రఫ్‌వర్కు కోసం ఖాళీ పేపర్ షీట్లను పరీక్ష హాలులో అందిస్తారు. ► పరీక్షా హాల్ నుండి బయటకు వెళ్లే ముందు అభ్యర్థులు తమ పేరు, రోల్ నంబర్‌ను షీట్ పైభాగంలో రాసి వాటిని ఇన్విజిలేటర్‌కు అందించాలి. ► పరీక్ష ప్రారంభమైన తర్వాత ఏ అభ్యర్థినీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. అడ్మిట్ కార్డులేని వారినీ అనుమతించరు. నిర్ణీత సమయానికి ముందే చేరుకోవాలి అభ్యర్థులందరూ తప్పనిసరిగా నిర్ణీత సమయానికి 2 గంటలు ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ► పరీక్షలు ఉదయం సెషన్ 9 నుంచి 12వరకు, మధ్యాహ్నం సెషన్ 3 నుంచి 6 వరకు జరుగుతుంది. పరీక్ష కేంద్రాల్లోనికి ఉ.7.30 నుంచి 8.30 వరకు, మ. 2 నుంచి 2.30 వరకు పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు. ► ఉదయం సెషన్లో 8.30 నుంచి 8.50, మ.2.30 నుంచి 2.50 వరకు ఇన్విజిలేటర్లు సూచనలు చేస్తారు. ► అలాగే, ఉ.9 నుంచి.. మ.3 నుంచి పరీక్ష ప్రారంభం అవుతుంది. ► పరీక్షా హాలులోకి ప్రవేశించిన తర్వాత, ఇన్విజిలేటర్లు అభ్యర్థులకు అటెండెన్సు షీట్ అందిస్తారు. అభ్యర్థుల పేర్లతో ఉండే ఈ షీట్లో పేరు ముందు కేటాయించిన స్థలంలో సంతకం చేయాల్సి ఉంటుంది. షీట్లో సంతకం చేయని వారిని పరీక్షకు గైర్హాజరైనట్లుగా పరిగణిస్తారు. పరీక్షహాలులోకి వీటిని అనుమతించరు.. జామిట్రీ బాక్సు, హ్యాండ్‌బాగులు, పర్సులు, పేపర్లు, మొబైల్ ఫోన్, ఇయర్ ఫోన్, మైక్రోఫోన్, పేజర్, కాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు.. డాక్యుపెన్, స్లైడ్ రూలర్, లాగ్ టేబుల్స్, కెమెరా, టేప్ రికార్డర్ వంటి పరికరాలు.. కాలిక్యులేటర్, ఎలక్ట్రానిక్ గడియారాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు సహా ఏ రకమైన ఎలక్ట్రానిక్ వస్తువులనూ అనుమతించరు. ఇంటర్/బోర్డు పరీక్షలకు ఇబ్బంది లేకుండా.. ఇదిలా ఉంటే.. మే 24, 25, 26, 27, 28 తేదీల్లో జరిగే నాలుగో విడత జేఈఈ మెయిన్ పరీక్షలకు ఎన్టీఏ ఇంతకుముందే షెడ్యూల్ ప్రకటించింది. అయితే, సీబీఎస్ఈతో పాటు వివిధ రాష్ట్రాల ఇంటర్మీడియెట్ బోర్డుల పరీక్షలు కూడా అదే సమయంలో ఉండడంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. దీనిపై వచ్చిన విజ్ఞప్తులకు స్పందిస్తూ ఎన్టీఏ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మే 3 నుంచి 12 వరకు ఎన్టీఏ వెబ్‌సైట్‌లోని అభ్యర్థుల అప్లికేషన్ ఫారంలో తమ 12వ తరగతి రోల్ నెంబర్, బోర్డు పేరును నమోదు చేయాలని సూచించింది. మే సెషన్ జేఈఈ పరీక్షల తేదీలైన మే 24, 25, 26, 27, 28 తేదీల్లో ఏ రోజున ఆ అభ్యర్థి బోర్డు పరీక్షకు హాజరుకానున్నారో ఆన్లైన్ దరఖాస్తులో పొందుపరచాలని పేర్కొంది. దీనికి సంబంధించిన సమాచారానికి ఎన్టీఏ వెబ్‌సైట్‌లోని అప్డేట్ సమాచారాన్ని అనుసరించాలని సూచించింది. -
జేఈఈలో నిబంధనల సడలింపు
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)లో అభ్యర్థులకు వెసులుబాటు కల్పిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనలను సడలించింది. ఈ మేరకు మంగళవారం ఎన్టీఏ వెబ్సైట్లో అధికారిక నోట్‌ను పొందుపరిచింది. కరోనా నేపథ్యంలో గత ఏడాది అర్హత విషయంలో మినహాయింపులిచ్చింది. ఈ ఏడాది కూడా వాటిని కొనసాగించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. జేఈఈకి హాజరయ్యే అభ్యర్థులు ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలలో ప్రవేశం పొందాలంటే జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌లో మెరిట్ ఉండడంతో పాటు వారికి ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు సాధించి ఉండడం లేదా టాప్ 20 పర్సంటైల్ వచ్చి ఉండాలన్న నిబంధన ఉంది. అలా ఇంటర్లో 75 శాతం మార్కులు, లేదా టాప్ 20 పర్సంటైల్‌లు ఉండే వారికి మాత్రమే జేఈఈ అడ్వాన్సుకు అనుమతిస్తారు. అందులో మెరిట్ సాధించిన వారికి ఐఐటీ ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కానీ, కరోనావల్ల గత విద్యా సంవత్సరం అనేక రాష్ట్రాలు ఇంటర్ పరీక్షలను నిర్వహించలేకపోయాయి. దీంతో ఆయా బోర్డులు విద్యార్థులను ఆల్‌పాస్‌గా ప్రకటించాయి. అలాగే, కరోనావల్ల ఏర్పడిన ఈ ప్రత్యేక పరిస్థితుల్లో జేఈఈలో కూడా విద్యార్థులకు 75 శాతం మార్కులు సాధించి ఉండాలన్న నిబంధన నుంచి మినహాయింపునిస్తున్నట్లు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరంలో కూడా తమకు ఇంటర్లో 75 శాతం మార్కుల నుంచి మినహాయింపునివ్వాలని దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి వినతులు వస్తుండడంతో కేంద్రం స్పందించింది. అర్హత విషయంలో గత ఏడాది ఇచ్చిన మినహాయింపులను ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎన్టీఏ ప్రత్యేక నోటీసును వెబ్సైట్లో పొందుపరిచింది. దీంతో ఈ విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులు 75శాతం మార్కులతో సంబంధం లేకుండా ఉత్తీర్ణత సాధిస్తే చాలని పేర్కొంది. మెయిన్స్‌కు 20 ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఇదిలా ఉంటే.. జేఈఈ మెయిన్స్ తొలివిడత ఆన్లైన్ పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు 26 వరకు కొనసాగుతాయి. ఈ ప్రవేశ పరీక్షను ఇంగ్లీషు, హిందీతో పాటు 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. ఇందుకు రాష్ట్రంలోని 20 నగరాల్లో ఎన్టీఏ పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది. అవి.. అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం. -
బోధనా సిబ్బంది నియామకాల్లో రిజర్వేషన్ల రద్దు వద్దు
సాక్షి, హైదరాబాద్: జాతీయ విద్యా సంస్థల్లో బోధనా సిబ్బంది నియామకాల్లో రిజర్వేషన్లు ఎత్తేయాలని నిపుణుల కమిటీ సూచించడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలు చేయొద్దని కేంద్ర ప్రభుత్వం నియమించిన 8 మంది నిపుణుల కమిటీ సిఫార్సు చేయడం సరికాదని, వాటిని కేంద్రం తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రధానమంత్రి మోదీకి బీసీ సంక్షేమ సంఘం, బీసీ సంఘాల సమాఖ్య తరఫున ఆయన లేఖ రాశారు. రిజర్వేషన్లు ఎత్తివేయడమంటే దళిత, గిరిజన, బీసీ కులాలను అవమానించినట్లేనని పేర్కొన్నారు. ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం కావడంతో ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంతరాన్ని సరిచేయాల్సిన అవసరం కేంద్రంపై ఉందని గుర్తుచేశారు. -
కోవిడ్ ఇలాగే ఉంటే ఆన్లైన్ రిపోర్టింగ్
సాక్షి, హైదరాబాద్: కరోనా పరిస్థితులు ఇప్ప టిలాగే ఉంటే ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ తదితర జాతీయస్థాయి విద్యా సంస్థల్లో ఆన్లైన్ రిపోర్టింగ్ విధానం అమలు చేయాలని జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) నిర్ణయించింది. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీ య స్థాయి విద్యాసంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాల కోసం ఈనెల 6 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. 5న జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల కాగానే 6 నుంచి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ను జోసా నిర్వహించనుంది. మొదటిదశ కౌన్సెలింగ్‌లో భాగంగా రిజిస్ట్రేషన్లతోపాటు, వెబ్ ఆప్షన్లు, మాక్‌సీట్ అలకేషన్ ప్రక్రియను అక్టోబర్ 15 వరకు నిర్వహించనుంది. 17న మొదటి దశ సీట్ల కేటాయింపును ప్రకటించనుంది. ఇక 17 నుంచి 19వ తేదీ వరకు విద్యార్థులు ఆన్లైన్ లో ఫీజు చెల్లింపు, డాక్యుమెంట్లు అప్లోడ్, రిపోర్టింగ్ ప్రక్రియను చేపట్టనుంది. ఖాళీ సీట్లను బట్టి రెండో దశ సీట్ల కేటాయింపును 21న ప్రకటించనుంది. రెండోదశ సీట్ల కేటాయింపు తరువాతే 22 నుంచి 24 వరకు విత్‌డ్రాయల్‌కు అవకాశం ఉంటుంది. 26న మూ డో దశ కేటాయింపు, 30న నాలుగో దశ కేటాయింపు, నవంబర్ 3న ఐదో దశ సీట్ల కేటాయింపును ప్రకటించనుంది. ఐదో దశ వరకే సీట్ల విత్‌డ్రాయల్‌కు అవకాశం ఉంటుంది. నవంబర్ 7న ఆరో దశ సీట్లను కేటాయించి, ఫిజికల్‌గా కాలేజీల్లో చేరేందుకు నవంబర్ 9 నుంచి 13 వరకు అవకాశం కల్పించింది. కరోనా పరిస్థితులు ఇలాగే ఉంటే ప్రత్యక్షంగా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో రిపోర్టు చేసేలా చర్యలు చేపట్టింది. -
11న జేఈఈ మెయిన్స్ ఫలితాలు
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎస్ఈఆర్ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ తుది ఫలితాలు ఈనెల 11న విడుదలయ్యే అవకాశముంది. కోవిడ్ కారణంగా వాయిదాపడ్డ రెండో విడత జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఈనెల 1 నుంచి 6 వరకు జరిగిన సంగతి తెలిసిందే. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో నిర్వహించిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 8,58,395 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలో 82,748 మంది రిజిస్టర్ చేసుకోగా 52 కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు. – జేఈఈ మెయిన్స్ జవాబుల ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం రాత్రి అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. దీనిపై అభ్యంతరాల దాఖలుకు గురువారం వరకు ఆన్లైన్లో అవకాశం కల్పించారు. ఇందుకోసం ప్రతి ప్రశ్నకు రూ.200 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు డెబిట్, క్రెడిట్, నెట్‌బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. – ప్రశ్నలకు సంబంధించిన జవాబుల కీని ’జేఈఈఎంఏఐఎన్.ఎన్టీఏ.ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్సైట్లో పొందుపర్చారు. – అభ్యర్థులు భవిష్యత్తు అవసరం దృష్ట్యా ప్రశ్నపత్రం, రెస్పాన్స్‌షీట్‌ను భద్రపర్చుకోవాలి. ప్రక్రియ మొదలైంది: రమేష్ పోఖ్రియాల్ జేఈఈ మెయిన్స్ ఫలితాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్పోఖ్రియాల్ సోషల్ మీడియాలో తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వివరించారు. 10వతేదీ వరకు అభ్యంతరాల దాఖలుకు అవకాశం కల్పించిన నేపథ్యంలో 11న ఫలితాలు ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారు. ఫలితాలు వెలువడ్డాక ఇలా... – ఫలితాలు ప్రకటించాక కటాఫ్ మార్కుల ఆధారంగా అర్హత సాధించిన అభ్యర్థులలో మెరిట్లో ముందున్న 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్ పరీక్షలకు అనుమతిస్తారు. వీరికి ఐఐటీల్లో ప్రవేశం కల్పిస్తారు. మిగతావారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ), గవర్నమెంటు ఫండెడ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్(జిఎఫ్‌టిఐ) తదితర సంస్థల్లో ప్రవేశాలకు అర్హులు. – జేఈఈ అడ్వాన్సుకు సంబంధించి నోటిఫికేషన్ ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ పరీక్షను ఈసారి ఢిల్లీ ఐఐటీ ఈనెల 27వ తేదీన నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రోచర్ కూడా విడుదలైంది. గత ర్యాంకులను బట్టి అంచనా.. – జేఈఈ మెయిన్స్ కీ విడుదల కాగానే అభ్యర్థులు తమకు వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులను అంచనా వేసే వీలుంది. గతంలో ఏ ర్యాంకు వరకు సీట్ల కేటాయింపు చేశారో జేఈఈ వెబ్సైట్లోనే ఉన్నందున దీని ఆధారంగా ఒక అంచనాకు రావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. – క్వాలిఫైయింగ్ కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులు ర్యాంకుల జాబితాలో ఉంటారు. వీటిని రాష్ట్ర, ఆల్ ఇండియా ర్యాంకులుగా ఇస్తారు. -
ఏపీ సెట్లకూ కరోనా కష్టాలు
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి రాష్ట్రంలోని ఇంజనీరింగ్ సహా వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలపై కూడా తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, బీఈడీ, బీపీఈడీ తదితర కోర్సులకు నిర్వహించే ఎంసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్‌సెట్ సహా వివిధ సెట్ల పరీక్షలు నిర్ణీత సమయంలో నిర్వహించగలుగుతామా? లేదా అన్న సందేహాలు అధికారులు వ్యక్తపరుస్తున్నారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో పరీక్షల ఏర్పాట్లు నిలిచిపోయాయి. మరోపక్క ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్ 5, 7, 9 తేదీల్లో జరగాల్సి ఉండగా జాతీయ పరీక్షల మండలి (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) వాయిదా వేసింది. తదుపరి షెడ్యూల్‌ను 31వ తేదీ తరువాత విడుదల చేస్తామని ప్రకటించింది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించాల్సి ఉన్న నీట్‌ను కూడా మే 3వ తేదీ నుంచి నెలాఖరు వరకు వాయిదా వేసింది. ఏప్రిల్ 15 తరువాత పరిస్థితులను అంచనా వేశాక షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ముందుకు సాగని కార్యకలాపాలు.. - రాష్ట్రంలో ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్లకు ఉన్నత విద్యామండలి ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదల చేసింది. - ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తు గడువు మార్చి 29 వరకు ఉండగా దాన్ని ఏప్రిల్ 5 వరకు పొడిగించారు. - ఈసెట్, ఐసెట్ గడువును ముందు ఏప్రిల్ 2 వరకు నిర్ణయించగా.. దాన్ని ఏప్రిల్ 9 వరకు పొడిగించారు. - లాక్డౌన్ కారణంగా దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. అందువల్ల గడువు మరోసారి పొడిగించాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. - సెట్ల నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాలు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అత్యవసర కార్యకలాపాలు మినహా మిగతావన్నీ నిలిచిపోయాయి. - ఈ పరీక్షలకు సంబంధించి ఆన్లైన్ సేవలందిస్తున్న టీసీఎస్‌లో కూడా పరిమిత సంఖ్యలో ఉద్యోగులనే అనుమతిస్తుండడంతో హెల్ప్‌లైన్ సెంటర్లపై ప్రభావం పడింది. - ఆయా ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నల రూపకల్పన వంటి ప్రక్రియలు కూడా ప్రస్తుతం మధ్యలో నిలిచిపోయినట్లు మండలి వర్గాలు పేర్కొంటున్నాయి. - జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్స్ వంటి పరీక్షలు కూడా వాయిదా పడిన నేపథ్యంలో ఎంసెట్ తదితర పరీక్షలను కూడా రీ షెడ్యూల్ చేయాల్సి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. - దీనిపై ఆయా ఉమ్మడి ప్రవేశ పరీక్షల కమిటీలు సమావేశమై నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని మండలి ఉన్నతాధికారి ఒకరు వివరించారు. పరీక్షల తేదీలు ఇలా ఉన్నాయి ఎంసెట్ (ఇంజనీరింగ్): ఏప్రిల్ 20 నుంచి 23 వరకు ఎంసెట్ (అగ్రికల్చర్): ఏప్రిల్ 23, 24 ఈసెట్: ఏప్రిల్ 30, ఐసెట్: ఏప్రిల్ 27 పీజీఈసెట్: మే 2, 3, 4 ఎడ్‌సెట్: మే 9, లాసెట్: మే 8 పీఈసెట్: మే 5, 6, 7, 8 -
విద్యాభివృద్ధికి ఉన్నత ప్రణాళిక
సాక్షి, అమరావతి: కేంద్రం అందచేసే నిధులను అందిపుచ్చుకుని ఉన్నత విద్యాభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి 2023–24 వరకు ఉన్నత విద్యాభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించనున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సీఎం జగన్ సూచనల మేరకు ఉన్నత విద్యామండలి సన్నద్ధమైంది. ‘ఎక్విప్’ (ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం) ద్వారా వచ్చే ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రూ.1,72,490 కోట్లతో ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయనుంది. ఇందులో కేంద్రం వాటా రూ.1,34,564 కోట్లు కాగా రాష్ట్రాలు రూ.37,926 కోట్లు భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏపీ తరపున రూ.7,600 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి కేంద్ర నిధులను గరిష్టంగా సాధించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 16 లక్షల మందికి అవకాశం ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల చేరికల శాతాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం 8,000 ‘సమ్రాస్’ (సమ్రాస్ అంటే ఐక్యతా భావనతో బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం నగర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే హాస్టళ్లు అని అర్థం) హాస్టళ్లను వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పాటు చేయనుంది. 16 లక్షల మందికి వీటిల్లో అవకాశం కల్పిస్తుంది. ఒకొక్కరికి ఏడాదికి రూ.30 వేల చొప్పున స్కాలర్షిప్ అందించనుంది. బ్రిడ్జి కోర్సులు, ఆన్లైన్ దూరవిద్య కోర్సులకు సంబంధించి కేంద్రం రూ.600 కోట్లు వెచ్చించనుండడంతో రాష్ట్రంలో 250 ఆన్లైన్ దూరవిద్యా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వృత్తి విద్య కళాశాలల కోసం కేంద్రం రూ.500 కోట్లు ఇవ్వనున్న నేపథ్యంలో రాష్ట్రంలో 20 కాలేజీలను నెలకొల్పాలని నిర్ణయించారు. అత్యుత్తమ బోధనాభ్యసన ప్రక్రియలు బోధనాభ్యసన ప్రక్రియలను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు వచ్చే ఐదేళ్లలో రూ.36,429.5 కోట్లు వెచ్చించాలని కేంద్రం నిర్ణయించింది. పాఠ్య ప్రణాళికల పునర్వ్యవస్థీకరణ, జాతీయ విద్యా సంస్థల మెంటార్షిప్ సమగ్ర మూల్యాంకన విధానాల రూపకల్పన కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి రూ.1,822 కోట్లను రాబట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. సీఎం ఆదేశాలతో కార్యాచరణ ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర నిధులు రాబట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశాం. నైపుణ్యాభివృద్ధి సంస్థల ఏర్పాటు, పరిశోధన కార్యక్రమాలకు ప్రోత్సాహం, ఐటీ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు రూపొందించాం. యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల ద్వారా ఈ కార్యక్రమాలను త్వరలోనే చేపడతాం’ – హేమచంద్రారెడ్డి (ఉన్నత విద్యామండలి చైర్మన్) కీలక ప్రతిపాదనలు ఇవీ - అత్యుత్తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించే విద్యాసంస్థలకు కేంద్రం రూ. 2,500 కోట్లు చొప్పున ఇవ్వనుంది. - ఇన్స్టిట్యూట్స్ ఎమినెన్స్ కింద 15 సంస్థలకు రూ.1,000 కోట్ల చొప్పున ఇవ్వనుండగా రాష్ట్రంలో ఒక యూనివర్సిటీని ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. - గ్లోబల్ ర్యాంకులు సాధించిన 6 ప్రభుత్వ రంగ విద్యాసంస్థలకు రూ.500 కోట్ల చొప్పున కేంద్రం అందించనున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున వర్సిటీలను ప్రతిపాదించనున్నారు. - జాతీయ ర్యాంకులు సాధించిన 15 సంస్థలకు రూ.250 కోట్ల చొప్పున కేంద్రం ఇవ్వనుంది. దీనికోసం కాకినాడ, అనంతపురం జేఎన్టీయూలను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. - ఉద్యోగ, ఉపాధి కార్యక్రమాలకు కేంద్రం రూ.12,390 కోట్లను కేటాయిస్తుండడంతో రూ.329 కోట్లు రాష్ట్రానికి రాబట్టాలని ప్రణాళిక సిద్ధం చేశారు. దీనిద్వారా రాష్ట్రంలోని 500 కాలేజీల్లో నైపుణ్యాభివృద్ధి కోర్సులు, వృత్తివిద్యా సంస్కరణలు, సామర్థ్యాల పెంపు కార్యక్రమాలు అమలు చేయనున్నారు. -
అదనంగా 2,660 సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ ఆదివారం ప్రారంభమైంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19 నుంచి విద్యార్థుల నుంచి చాయిస్ ఫిల్లింగ్‌కు (వెబ్ ఆప్షన్లు) అవకాశం కల్పిస్తామని జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ప్రకటించినా.. ఆదివారం నుంచే ప్రారంభించింది. మొత్తంగా ఏడు దశల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహణకు చర్యలు చేపట్టింది. జూలై 23 వరకు ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించేలా ఆదివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టు చేయాల్సిన రిపోర్టింగ్ కేంద్రాల వివరాలను జోసా వెబ్సైట్ లో ( https://josaa.nic.in) అందుబాటులో ఉంచింది. రిపోర్టింగ్ కేంద్రాల్లో నిర్ణీత తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టె్టన్స్/సీట్ విత్‌డ్రాకు అవకాశం ఉంటుందని వివరించింది. అదనంగా 4,719 సీట్లు.. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో కేంద్రం ఈసారి సీట్లను భారీగా పెంచింది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ (ఈడబ్ల్యూఎస్) కోసం 10 శాతం రిజర్వేషన్లను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం ప్రత్యేకంగా సీట్లను పెంచింది. మరోవైపు ఐఐటీ, ఎన్ఐటీల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సూపర్ న్యూమరీ కోటా కింద ఏటేటా సీట్లను పెంచుతోంది. దీనిలో భాగంగా ఈసారి కూడా 2,059 సీట్లను పెంచింది. మరోవైపు ఈడబ్ల్యూఎస్ కింద 2,660 సీట్లను అదనంగా పెంచింది. ఇలా మొత్తంగా 4,719 సీట్లను ఈసారి అదనంగా పెంచింది. 107 విద్యా సంస్థల్లో 45,244 సీట్లు.. ఐఐటీలతోపాటు ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్‌ఐటీలలో ఈసారి సీట్లు ఎక్కువగా పెరిగాయి. మహిళల సూపర్ న్యూమరీ సీట్లతోపాటు ఈడబ్ల్యూఎస్ కోటా అదనంగా రావడంతో సీట్లు ఎక్కువగా పెరిగాయి. దేశంలోని 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 25 ట్రిపుల్ఐటీ, 28 జీఎఫ్‌టీఐలు మొత్తంగా 107 విద్యా సంస్థల్లో గతేడాది 41 వేల వరకు అందుబాటులో ఉండగా, ఈసారి వాటి సంఖ్య 45,244కి పెరిగింది. ఎన్ఐటీల్లో ఎక్కువగా పెరుగుదల.. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఈసారి ఎన్ఐటీల్లో సీట్లు ఎక్కువగా పెరిగాయి. గతేడాది కంటే ఈసారి 1,384 సీట్లు అదనంగా వచ్చాయి. ఐఐటీల్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో 638 సీట్లు పెరిగాయి. ఎన్ఐటీల్లో 50 శాతం సీట్లు హోంస్టేట్ కోటా కింద ఉన్నందున ఆయా రాష్ట్రాల వారికి ఈడబ్ల్యూఎస్ కోటా పెరిగిన సీట్లతో అధిక ప్రయోజనం చేకూరనుంది. మరోవైపు మహిళల భాగస్వామ్యం కోసం అదనంగా ఇస్తున్న సూపర్ న్యూమరీ సీట్ల సంఖ్య ఐఐటీల్లో ఎక్కువగా పెరిగింది. ఈసారి 1,221 సీట్లు ఐఐటీల్లోనే పెరిగాయి. కౌన్సెలింగ్ షెడ్యూల్.. 21–6–2019: ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూట్ టెస్టు రాసే వారికి చాయిస్ ఫిల్లింగ్ ప్రారంభం 25–6–2019: ఏఏటీ, ఇతరులందరికీ సాయంత్రం 5 గంటలకు చాయిస్ ఫిల్లింగ్ ముగింపు 27–6–2019: ఉదయం 10 గంటలకు మొదటి దశ సీట్ల కేటాయింపు 28–6–2019 నుంచి జూలై 2 వరకు: రిపోర్టింగ్ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్స్, రిపోర్టింగ్ 3–7–2019: ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్ప్లే 3–7–2019: సాయంత్రం 5 గంటలకు రెండో దశ సీట్ల కేటాయింపు 4–7–2019 నుంచి 5–7–2019 వరకు: రిపోర్టింగ్ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్స్/విత్‌డ్రా 6–7–2019: ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్ప్లే 6–7–2019: సాయంత్రం 5 గంటలకు మూడో దశ సీట్ల కేటాయింపు 7–7–2019 నుంచి 8–7–2019 వరకు: రిపోర్టింగ్ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్స్/విత్‌డ్రా 9–7–2019: ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్ప్లే 9–7–2019: సాయంత్రం 5 గంటలకు నాలుగో దశ సీట్ల కేటాయింపు 10–7–2019 నుంచి 11–7–2019 వరకు: ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు రిపోర్టింగ్ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్స్/విత్‌డ్రా 12–7–2019: ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్ప్లే 12–7–2019: సాయంత్రం 5 గంటలకు ఐదో దశ సీట్ల కేటాయింపు 13–7–2019 నుంచి 14–7–2019 వరకు: రిపోర్టింగ్ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్స్/విత్‌డ్రా 15–7–2019: ఉదయం 10గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్ప్లే, అదే రోజు సాయంత్రం 5 గంటలకు 6వ దశ సీట్లు కేటాయింపు 16–7–2019 నుంచి 17–7–2019: రిపోర్టింగ్ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్స్/విత్‌డ్రా (ఐఐటీల్లో సీట్ విత్‌డ్రాకు ఇదే చివరి అవకాశం) 18–7–2019: ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్ప్లే, అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు 7వ దశ (చివరి) సీట్ల కేటాయింపు 19–7–2019: ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు రిపోర్టింగ్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కాలేజీల్లో చేరికలు 19–7–2019 నుంచి 23–7–2019 వరకు: ఎన్ఐటీ ఇతర విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్స్, ప్రవేశాలు. -
ఏపీకి మళ్లీ మొండిచేయి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ తాజా మధ్యంతర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు యథావిధిగా మొండిచేయి చూపింది. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చివరి బడ్జెట్లో కూడా ఏపీకి నిరాశే మిగిల్చింది. కనీసం జాతీయ విద్యా సంస్థలకూ కేటాయింపుల్లేకుండా చేసింది. కేవలం ఏపీ సెంట్రల్ వర్సిటీకి, గిరిజన విశ్వవిద్యాలయానికే నిధులు కేటాయించారు. ఇక చట్టబద్ధమైన హామీల ప్రస్తావనగానీ, ప్రత్యేక హోదా ఊసుగానీ ఈ బడ్జెట్లో లేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ఇవ్వాల్సిన పారిశ్రామిక రాయితీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కలిపి వడ్డీ రాయితీ కింద 2018–19 బడ్జెట్ అంచనాలను రూ.100 కోట్లుగా చూపారు. కానీ సవరించిన అంచనాల్లో సున్నాగా చూపారు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించలేదు. అలాగే 2019–20కి కూడా ఈ పద్దు కింద నిధులు కేటాయించ లేదు. పూర్తిస్థాయి బడ్జెట్లో జాతీయ సంస్థలకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. కొన్ని జాతీయ సంస్థలకు దేశవ్యాప్తంగా ఒకే కేటగిరీలో కలిపి చూపారు. ఏపీ వాటా రూ.36.3 వేల కోట్లు కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా అయిన 4.305 శాతం కింద రూ.36,360.26 కోట్లు రానున్నాయి. ఇందులో కార్పొరేషన్ టాక్స్ రూ.11,775.31 కోట్లు, ఆదాయ పన్ను రూ.9,893.51 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ.11,004.42 కోట్లు, కస్టమ్స్ టాక్స్ రూ.2284.72 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ.1402.62 కోట్లుగా ఉన్నాయి. సంపద పన్నును – 0.32 కోట్లుగా చూపారు. గతేడాది కేంద్ర పన్నుల్లో వాటాగా రూ.32,738.03 కోట్లు ఉండగా ఈ ఏడాది దాదాపు రూ.3,582 కోట్లు అదనంగా రానున్నాయి. -
జాతీయ సంస్థలపై.. తర్జనభర్జన
సాక్షి ప్రతినిధి, తిరుపతి : విభజన నేపథ్యంలో రాష్ట్రంలో 11 జాతీయ విద్యా సంస్థలను ఏర్పాటుచేస్తామని కేంద్రం హామీ ఇచ్చిన విషయం విదితమే. ఆ హామీ మేరకు ఐఐటీ, ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు 2014-15 బడ్జెట్లో కేంద్రం నిధులు కేటాయిం చింది. ఇందులో ఐఐటీని తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఐఐటీతోపాటు ఐఐఎస్ఈఆర్(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్), సెంట్రల్ వర్సిటీలను ఏర్పాటుచేస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ సంస్థల ఏర్పాటుకు వెయ్యి ఎకరాల భూమిని గుర్తించాలని కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు-శ్రీకాళహస్తి మండలాల పరిధిలోనూ.. చంద్రగిరి మండలం రంగంపేట సమీపంలోనూ.. రామచంద్రాపురం మండలంలోనూ అటవీ, ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఆ భూములను రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జిల్లా అధికారయంత్రాంగంతో కలిసి ఇటీవల పరిశీలించారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుపై టీడీపీ నేతల మధ్య రచ్చ మొదలైంది. జాతీ య సంస్థల ఏర్పాటుతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రూ.కోట్లను కొల్లగొట్టడానికి ప్రణాళిక రచించారు. తమ ప్రాంతంలో ఏర్పాటుచేయాలంటే తమ ప్రాంతంలో నెలకొల్పాలని పట్టుబట్టారు. చంద్రగిరి మండలంలో రంగంపేటకు సమీపంలోనే జాతీయ విద్యా సంస్థలు ఏర్పాటుచేయాలంటూ నారావారిపల్లెలో సమావేశమైన టీడీపీ నేతలు తీర్మానం చేసి అధిష్ట్ఠానానికి పంపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ సిద్ధార్థజైన్ తిరుపతి ఆర్డీవో రంగయ్య, శ్రీకాళహస్తి, ఏర్పేడు, తిరుపతి రూరల్, చంద్రగిరి తహశీల్దార్లతో భూములను పరిశీలించి.. సమీక్ష సమావేశం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రగిరి మండలం రంగంపేట వద్ద అటవీభూములు, ప్రైవేటు భూములు ఉన్నాయి. అసైన్డు, డీకేటీ, ప్రభుత్వ భూములు అందుబాటులో లేవు. అటవీ భూములను డీ-నోటిఫై చేయాలంటే కేంద్ర అటవీశాఖ అనుమతి అవసరం. అనుమతి వచ్చాక.. అటవీ భూమి తీసుకున్న మేరకు ప్రభుత్వ భూమిని కేటాయించాలి. ఆ తర్వాత అటవీశాఖకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం అంత సులువుగా తేలేది కాదని రెవెన్యూ వర్గాలు స్పష్టీకరించాయి. ఏర్పేడు-శ్రీకాళహస్తి మండలల పరిధిలో మేర్లపాక, పాగాలి, పంగూరు, చిందేపల్లె, చింతలపాళెం, పల్లాం, ఎంపేడు ప్రాంతాల్లో భారీ ఎత్తున ప్రభుత్వ భూము లు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు గుర్తించాయి. రేణిగుంట విమానాశ్రయం, జాతీయ రహదారులు, తెలుగుగంగ జలాలు అందుబాటులో ఉంటాయని.. ఆ ప్రాంతమే జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుకు అనుకూలమని ప్రాథమిక నివేదికను సర్కారుకు పంపినట్లు సమాచారం. టీడీపీ నేతల ఒత్తిళ్ల కారణంగాఈ ప్రతిపాదనపై ఆమోదముద్ర పడే అవకాశాలు తక్కువనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐఐటీ ఏర్పాటుకు అవసరమైన ప్రాంతాన్ని నెలాఖరులోగా ఎంపిక చేసి, భూముల వివరాలను కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖకు పంపాల్సి ఉంటుంది. జాప్యం చేస్తే.. ఐఐటీ ఏర్పాటు వాయిదా పడే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. -
‘రియల్’ రచ్చ!
టీడీపీలో సరికొత్త రచ్చకు తెరలేచింది. జాతీయ విద్యా సంస్థలు ఏర్పాటుచేస్తామని సాక్షాత్తు సీఎం చంద్రబాబు ప్రకటించడంతో తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో టీడీపీ నేతలు భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారు. ఆ సంస్థలు ఏర్పాటైతే.. వాటి పేరు చెప్పి రియల్ వెంచర్లు వేసి భారీగా సొమ్ముచేసుకోవడానికి ఎత్తు వేశారు. ఇప్పుడు ఆ సంస్థలు తాము కొనుగోలు చేసిన భూముల పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటుచేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో రాష్ట్రంలో 11 జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఏర్పాటుచేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఆ మేరకు ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎయిమ్స్, ఐఐటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం మాత్రమే మంజూరు చేశారు. వాటి ఏర్పాటుకు నిధులు కేటాయించారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తిరుపతి పరిసర ప్రాంతాల్లో సెంట్రల్ యూనివర్సిటీ, ఐఐటీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), ఐఐఎస్ఈఆర్(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్) క్యాంపస్‌లు ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఆ విద్యా సంస్థలు ఏర్పాటుచేస్తే.. భూములకు భారీ ఎత్తున డిమాండ్ పెరిగితే రియల్ వెంచర్లు వేసి సొమ్ము చేసుకోవచ్చని టీడీపీ నేతలు భావించారు. ఇదే అదునుగా ఏర్పేడు-శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గంలో తిరుపతి-మదనపల్లె రోడ్డు, తిరుపతి-చిత్తూరు రోడ్డు పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారు. కేంద్ర బడ్జెట్లో ఐఐటీ, ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మాత్రమే మంజూరు కావడంతో టీడీపీ నేతలకు గొంతులో వెలక్కాయపడ్డట్లయింది. ఐఐటీని తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుచేయాలని ఇటీవల మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాళహస్తి-ఏర్పేడు మండలాల్లోని మేర్లపాక, పాగాలి, పంగూరు, చిందేపల్లి, చింతలపాళెం, పల్లాం, ఎంపేడు ప్రాంతాల్లో భారీ ఎత్తున ప్రభుత్వ భూములు ఉన్నాయని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెబుతున్నారు. రేణిగుంట విమానాశ్రయం, జాతీయ రహదారులు, తెలుగుగంగ జలాలు అందుబాటులో ఉండడం వల్ల ఈ ప్రాంతమే ఐఐటీ ఏర్పాటుకు అనుకూలమని బొజ్జల వాదిస్తున్నారు. బొజ్జల వాదనను మెజార్టీ టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో తిరుపతి-చిత్తూరు, తిరుపతి-మదనపల్లె రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఐఐటీని ఏర్పాటుచేయాలని పట్టుబడుతున్నారు. రేణిగుంట విమానాశ్రయంతోపాటు జాతీయ రహదారులు ఈ ప్రాంతానికి అందుబాటులో ఉంటాయని తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలో గురువారం రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కలెక్టర్ సిద్ధార్థజైన్, జేసీ శ్రీధర్‌తో కలిసి శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లో పర్యటించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మేర్లపాక, పాగాలి, పంగూరు, చిందేపల్లి, చింతలపాళెం, పల్లాం, ఎంపేడు గ్రామాలనూ.. చంద్రగిరి నియోజకవర్గంలోని రంగంపేట గ్రామ పరిసర ప్రాంతాల్లోని భూములను పరిశీలించారు. ఐఐటీ ఏర్పాటుకు 300 ఎకరాలు, ఐఐఎస్ఈఆర్కు 200 ఎకరాలు, సెంట్రల్ వర్సిటీకి 500 ఎకరాలు అవసరం. ప్రస్తుతం ఐఐటీ ఒక్కటే మంజూరైన నేపథ్యంలో ఆ కేంద్రాన్ని తమ ప్రాంతంలోనే ఏర్పాటుచేయాలంటూ టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. బొజ్జల, బొజ్జలను వ్యతిరేకిస్త్తున్న వర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో పంచాయితీ సీఎం వద్దకు వెళ్లినట్లు రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఫలానా ప్రాంతంలోనే ఐఐటీ ఏర్పాటుచేయాలని సూచిస్తే.. ఆ సంస్థ యాజమాన్యం అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ప్రభుత్వం ఎంపిక చేసిన భూములను ఐఐటీ యాజమాన్య ప్రతినిధి బృందం పరిశీలిస్తుంది. విమాన, రోడ్డు సౌకర్యాలు, నీటి లభ్యత, భద్రత మెరుగ్గా ఉన్న ప్రాంతంలోనే ఐఐటీ ఏర్పాటు చేస్తారు. ఐఐటీ ప్రతినిధి బృందం పరిశీలించి.. ఆమోదముద్ర వేసిన ప్రాంతంలోనే ఆ సంస్థను నెలకొల్పుతారన్నది తెలుగుతమ్ముళ్లకు తెలియంది కాదని, ఒత్తిడి తేవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అధికారవర్గాలు తెగేసి చెబుతుండడం గమనార్హం. -
ఏపీకి 11 జాతీయ విద్యాసంస్థలు: గంటా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు 11 జాతీయ విద్యాసంస్థలు రప్పించేందుకు కృషిచేస్తున్నట్టు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకోసం 8 వేల కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. ఈ నెల 25న కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు సీఎం చంద్రబాబుతో పాటు తాము కూడా ఢిల్లీ వెళ్తున్నట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో తగ్గిన మెడికల్ సీట్లను తిరిగి అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తామని, దీనిపై కేంద్రంతో సంప్రదింపులు జరపనున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు.