సాక్షి, అమరావతి: కేంద్రం అందచేసే నిధులను అందిపుచ్చుకుని ఉన్నత విద్యాభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి 2023–24 వరకు ఉన్నత విద్యాభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించనున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సీఎం జగన్ సూచనల మేరకు ఉన్నత విద్యామండలి సన్నద్ధమైంది. ‘ఎక్విప్’ (ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం) ద్వారా వచ్చే ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రూ.1,72,490 కోట్లతో ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయనుంది. ఇందులో కేంద్రం వాటా రూ.1,34,564 కోట్లు కాగా రాష్ట్రాలు రూ.37,926 కోట్లు భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏపీ తరపున రూ.7,600 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి కేంద్ర నిధులను గరిష్టంగా సాధించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
16 లక్షల మందికి అవకాశం
ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల చేరికల శాతాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం 8,000 ‘సమ్రాస్’ (సమ్రాస్ అంటే ఐక్యతా భావనతో బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం నగర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే హాస్టళ్లు అని అర్థం) హాస్టళ్లను వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పాటు చేయనుంది. 16 లక్షల మందికి వీటిల్లో అవకాశం కల్పిస్తుంది. ఒకొక్కరికి ఏడాదికి రూ.30 వేల చొప్పున స్కాలర్‌షిప్ అందించనుంది. బ్రిడ్జి కోర్సులు, ఆన్‌లైన్ దూరవిద్య కోర్సులకు సంబంధించి కేంద్రం రూ.600 కోట్లు వెచ్చించనుండడంతో రాష్ట్రంలో 250 ఆన్‌లైన్ దూరవిద్యా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వృత్తి విద్య కళాశాలల కోసం కేంద్రం రూ.500 కోట్లు ఇవ్వనున్న నేపథ్యంలో రాష్ట్రంలో 20 కాలేజీలను నెలకొల్పాలని నిర్ణయించారు.
అత్యుత్తమ బోధనాభ్యసన ప్రక్రియలు
బోధనాభ్యసన ప్రక్రియలను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు వచ్చే ఐదేళ్లలో రూ.36,429.5 కోట్లు వెచ్చించాలని కేంద్రం నిర్ణయించింది. పాఠ్య ప్రణాళికల పునర్వ్యవస్థీకరణ, జాతీయ విద్యా సంస్థల మెంటార్‌షిప్ సమగ్ర మూల్యాంకన విధానాల రూపకల్పన కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి రూ.1,822 కోట్లను
రాబట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
సీఎం ఆదేశాలతో కార్యాచరణ
‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర నిధులు రాబట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశాం. నైపుణ్యాభివృద్ధి సంస్థల ఏర్పాటు, పరిశోధన కార్యక్రమాలకు ప్రోత్సాహం, ఐటీ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు రూపొందించాం. యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల ద్వారా ఈ కార్యక్రమాలను త్వరలోనే చేపడతాం’
– హేమచంద్రారెడ్డి (ఉన్నత విద్యామండలి చైర్మన్)
కీలక ప్రతిపాదనలు ఇవీ
- అత్యుత్తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించే విద్యాసంస్థలకు కేంద్రం రూ. 2,500 కోట్లు చొప్పున ఇవ్వనుంది.
- ఇన్‌స్టిట్యూట్స్ ఎమినెన్స్ కింద 15 సంస్థలకు రూ.1,000 కోట్ల చొప్పున ఇవ్వనుండగా రాష్ట్రంలో ఒక యూనివర్సిటీని ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
- గ్లోబల్ ర్యాంకులు సాధించిన 6 ప్రభుత్వ రంగ విద్యాసంస్థలకు రూ.500 కోట్ల చొప్పున కేంద్రం అందించనున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున వర్సిటీలను ప్రతిపాదించనున్నారు.
- జాతీయ ర్యాంకులు సాధించిన 15 సంస్థలకు రూ.250 కోట్ల చొప్పున కేంద్రం ఇవ్వనుంది. దీనికోసం కాకినాడ, అనంతపురం జేఎన్‌టీయూలను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.
- ఉద్యోగ, ఉపాధి కార్యక్రమాలకు కేంద్రం రూ.12,390 కోట్లను కేటాయిస్తుండడంతో రూ.329 కోట్లు రాష్ట్రానికి రాబట్టాలని ప్రణాళిక సిద్ధం చేశారు. దీనిద్వారా రాష్ట్రంలోని 500 కాలేజీల్లో నైపుణ్యాభివృద్ధి కోర్సులు, వృత్తివిద్యా సంస్కరణలు, సామర్థ్యాల పెంపు కార్యక్రమాలు అమలు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment