సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ తాజా మధ్యంతర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు యథావిధిగా మొండిచేయి చూపింది. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చివరి బడ్జెట్లో కూడా ఏపీకి నిరాశే మిగిల్చింది. కనీసం జాతీయ విద్యా సంస్థలకూ కేటాయింపుల్లేకుండా చేసింది. కేవలం ఏపీ సెంట్రల్ వర్సిటీకి, గిరిజన విశ్వవిద్యాలయానికే నిధులు కేటాయించారు. ఇక చట్టబద్ధమైన హామీల ప్రస్తావనగానీ, ప్రత్యేక హోదా ఊసుగానీ ఈ బడ్జెట్‌లో లేదు.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ఇవ్వాల్సిన పారిశ్రామిక రాయితీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కలిపి వడ్డీ రాయితీ కింద 2018–19 బడ్జెట్ అంచనాలను రూ.100 కోట్లుగా చూపారు. కానీ సవరించిన అంచనాల్లో సున్నాగా చూపారు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించలేదు. అలాగే 2019–20కి కూడా ఈ పద్దు కింద నిధులు కేటాయించ లేదు. పూర్తిస్థాయి బడ్జెట్‌లో జాతీయ సంస్థలకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. కొన్ని జాతీయ సంస్థలకు దేశవ్యాప్తంగా ఒకే కేటగిరీలో కలిపి చూపారు.
ఏపీ వాటా రూ.36.3 వేల కోట్లు
కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా అయిన 4.305 శాతం కింద రూ.36,360.26 కోట్లు రానున్నాయి. ఇందులో కార్పొరేషన్ టాక్స్ రూ.11,775.31 కోట్లు, ఆదాయ పన్ను రూ.9,893.51 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ.11,004.42 కోట్లు, కస్టమ్స్ టాక్స్ రూ.2284.72 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ.1402.62 కోట్లుగా ఉన్నాయి. సంపద పన్నును – 0.32 కోట్లుగా చూపారు. గతేడాది కేంద్ర పన్నుల్లో వాటాగా రూ.32,738.03 కోట్లు ఉండగా ఈ ఏడాది దాదాపు రూ.3,582 కోట్లు అదనంగా రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment