పది, ఇరవై రోజులకోసారి పవన్ కల్యాణ్‌తో చర్చించాల్సి వస్తోంది
పిఠాపురంలో జీరో చేశారని వర్మ అసహనంగా ఉన్నారు
పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దు
టెలి కాన్ఫరెన్స్‌లో మంత్రి నారాయణ మాట్లాడిన ఆడియో వైరల్
నెల్లూరు టాస్క్‌ఫోర్స్: కొందరు నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఆదేశిస్తేనే ఇకపై ఎవరైనా మాట్లాడాలని స్పష్టం చేశారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎన్డీఏ కూటమిని ఇరకాటంలో పెడుతున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు రాకుండా ఎవరూ స్టేట్‌మెంట్లు ఇవ్వకూడదని హెచ్చరించారు.
ఇక నుంచి ఎవరు మాట్లాడాలో తామే నిర్ణయిస్తామ న్నారు. తాను ప్రస్తుతం కాకినాడ ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్నానని పేర్కొంటూ అక్కడ జనసేన, టీడీపీ మధ్య విభేదాలున్నాయన్నారు. పిఠాపురంలో వర్మ అసహనంగా ఉన్నారన్నారు. తనను నియోజకవర్గంలో జీరో చేశారని బాధపడుతుంటారన్నారు. జనసేన సమావేశాలకు వెళ్లమని, ఇష్టం లేకపోతే వెళ్లకండని ఇప్పటికే తాము చెప్పామన్నారు. తన నియోజకవర్గంలో పద్ధతిగా నడుచుకోకపోతే సహించేదిలేదన్నారు.
నీ నియోజకవర్గంలో పార్టీ నేతలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావని, పార్టీ కేంద్ర కార్యాలయం తనను పిలిచి అడిగిందన్నారు. ప్రతి పది, ఇరవై రోజులకు చిన్న ఇష్యూలు వస్తే పవన్‌కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌తో కలిసి మాట్లాడుకుంటున్నామన్నారు. కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురంలో ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య విభేదాలున్నాయని, వీటిపై చర్చించి సరిచేసుకుంటున్నామని పేర్కొన్నారు. మనోహర్ తనకు ఫోన్ చేసి తాము ఎన్డీఏలో ఉన్నామా, లేమా.. అంటూ అడిగారన్నారు. మీ నియోజకవర్గంలో నాయకులతో మాట్లాడించేది మీరేనా అని అడిగారన్నారు.

తన డిపార్ట్‌మెంట్‌ను డీగ్రేడ్ చేస్తూ అధికారులను ఉద్దేశించి మాట్లాడటంపై అసహనం వ్యక్తం చేశారన్నారు. మీ శాఖలపై మాట్లాడమంటారా? అంటూ తనను అడిగారన్నారు. ఇప్పటి వరకు నుడాను పట్టించుకోలేదని, పట్టించుకుంటే తనకన్నా మొండోడు ఎవరూ ఉండరన్నారు. తనకూ తిట్టడం వచ్చు.. కేకలేయడం వచ్చని, ఇక నుంచి పార్టీ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. టెలి కాన్ఫరెన్స్‌లో నేతలతో మంత్రి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


