Union Budget 2019
-
ఎవరి రూటు వారిదే!!
రేపేదేశంలో ఆర్థిక సరళీకరణ మొదలైన తర్వాత కాలంతో పాటు బడ్జెట్ లక్ష్యాలు కూడా మారిపోతున్నాయి. 1990వ దశకం నుంచి ఇప్పటి వరకు చూస్తే అప్పటి ప్రభుత్వ ప్రాధమ్యాలు ఏ విధంగా ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు. 1991 నుంచి బడ్జెట్లను గమనిస్తే.. 90వ దశకంలో ఆర్థిక సంస్కరణలకు పెద్ద పీట వేయగా, ఆ తర్వాత 2000 నుంచి 2010 మధ్య కాలంలో ద్రవ్య స్థిరీకరణకు ప్రాధాన్యమిచ్చారు. ఇక 2010 తర్వాత బడ్జెట్లు సామాజిక కార్యక్రమాలపై ఎక్కువగా ఖర్చు చేసేలా దృష్టిపెట్టాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు పేదల సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టగా, ఎన్డీయే ప్రభుత్వాలు పన్నుల సంస్కరణలకు పెద్దపీట వేశాయి. మన్మోహన్... ఆర్థిక వ్యవస్థకు తలుపులు బార్లా! ♦ 1991– 92 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్సింగ్ వాణిజ్య విధాన సంస్కరణల్లో నూతన దిశను చూపించారు. పరిమాణ పరిమితుల నుంచి ధరల ఆధారిత యంత్రాంగానికి మారే దిశగా అడుగులు వేశారు. విధానాల పరంగా స్వేచ్ఛనివ్వడంతోపాటు, ప్రాధాన్య రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) 51 శాతానికి మన్మోహన్సింగ్ పెంచేశారు. వడ్డీ రేట్ల విధానాన్ని కూడా సరళతరం చేశారు. ఇదిగో... ఇప్పటి నుంచే బడ్జెట్లలో ఆర్థిక రంగ పాత్ర విస్తృతమవుతూ వచ్చింది. మ్యూచువల్ ఫండ్స్ అభివృద్ధికి ప్రోత్సాహం, ప్రైవేటు రంగానికి ద్వారాలు తెరవడం జరిగింది. చిదంబరం... సంస్థాగత నిర్మాణం ♦ 1997–98లో నాటి ఆర్థిక మంత్రి పి.చిదంబరం సంస్థాగత నిర్మాణం, నియంత్రణపరమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమైన నియంత్రణపరమైన కార్యాచరణ ఏర్పాటే లక్ష్యంగా ముందుకెళ్లారు. పలితం... సంస్థాగతంగా మార్పుల్లేకుండా నియంత్రణలతో కూడిన ఆర్థిక వ్యవస్థ కాస్తా క్రమబద్ధీకరణ ఆర్థిక వ్యవస్థగా మారింది. విదేశీ మారక నిర్వహణ చట్టం, నూతన కంపెనీల బిల్లు, నూతన ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లుకు చిదంబరం చోటిచ్చారు. సిన్హా... మౌలికానికి పెద్దపీట ♦ 1998–99లో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన యశ్వంత్ సిన్హా స్వేచ్ఛగానే వ్యవహరించారు. పట్టణాలు, నగరాల్లోని మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా ఆయన చర్యలను చేపట్టారు. అనుమతులు పొందిన హౌసింగ్ ప్రాజెక్టులకు మొదటి ఐదేళ్లపాటు లాభాలపై నూరు శాతం పన్ను మినహాయింపు కల్పించారు. ఆ తర్వాత ఐదేళ్లకూ 30 శాతం రాయితీ కల్పించారు. ♦ 2001–02 బడ్జెట్లో యశ్వంత్‌సిన్హా ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ రెగ్యులేషన్స్‌ను ప్రవేశపెట్టారు. దీని వల్ల భాగస్వామ్య కంపెనీల మధ్య లావాదేవీలు పారదర్శకంగా నిర్వహించడం తప్పనిసరిగా మారింది. పన్ను ఎగవేతల నిరోధం విషయంలో ఈ నియంత్రణ ఎంతో ముఖ్య పాత్ర పోషించిందనే చెప్పుకోవాలి. ప్రణబ్ ముఖర్జీ... సంక్షేమ బాట ♦ ఇక 2005 నాటి బడ్జెట్లో (యూపీఏ–1లో) పి.చిదంబరం పేద ప్రజలే ఫోకస్‌గా ముందుకొచ్చారు. అంతక్రితం ఐదేళ్లలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే పాలన, భారత్ వెలిగిపోతోందంటూ వారు చేసుకున్న ప్రచారం బెడిసి కొట్టి ఓటమిపాలవడంతో, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ సర్కారు సామాన్యులపై దృష్టి పెట్టింది. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాలు అమల్లోకి వచ్చాయి. ఇక యూపీఏ–2లో చివర్లో ఆర్థిక మంత్రిగా పగ్గాలు చేపట్టిన ప్రణబ్ ముఖర్జీ కూడా సంక్షేమనానికే సై అన్నారు. అరుణ్ జైట్లీ... పన్ను సంస్కరణలకు సై ♦ 2014– 2018 మధ్యలో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో అరుణ్ జైట్లీ కీలక సంస్కరణలతోపాటు ఇతర చర్యలూ చేపట్టారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు, డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియాకు నిధులు అందించారు. జీఎస్టీ సంస్కరణను తీసుకొచ్చారు. మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం తగ్గించారు. 2015లో వెల్త్ ట్యాక్స్‌ను (సంపద పన్ను) రద్దు చేసి, రూ.కోటి ఆదాయం దాటిన వారిపై 2% అదనపు సర్‌చార్జ్ తీసుకొచ్చారు. 2017లో రూ.2.5–5 లక్షల మధ్య పన్ను వర్తించే ఆదాయం వారికి పన్ను రేటు 10% నుంచి 5%కి తగ్గించారు. దీంతో పన్ను చెల్లింపుదారులకు రూ.12,500 ఆదా అయింది. -
రైతులందరికీ పిఎం - కిసాన్ పథకం అమలు
-
ఆర్థిక సర్వే-2019 : చాలా ఉత్సాహంగా ఉంది
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ (47) ట్వీట్ చేశారు. ఎన్డీఏ సర్కారు రెండవ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ మొట్టమొదటి ఆర్థిక సర్వే -2019ను ప్రవేశపెట్టనున్నామని మంగళవారం ట్వీట్ చేశారు కాగా కేంద్ర ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్‌కు కూడా తొలి మహిళా ఆర్థికమంత్రిగా కేంద్ర ప్రభుత్వ మొదటి పూర్తిస్థాయి బడ్జెట్‌ను జూన్ 5వ శుక్రవారం ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయిదేళ్ల కనిష్టానికి పడిపోయిన జీడీపీ, 45 కనిష్టానికి పతనమైన నిరుద్యోగం లాంటి దేశీయ ఆర్థిక పరిస్థతులకు తోడు, అంతర్జాతీయ ఆర్ధిక అనిశ్చితి, ముదురు తున్న ట్రేడ్ వార్ అందోళన నడుము సీతారామన్ బడ్జెట్ కీలకంగా మారనుంది. అరవింద్ సుబ్రమణియన్ పదవీకాలం ముగిసిన దాదాపు ఆరు నెలల తరువాత, కృష్ణమూర్తి సుబ్రమణియన్ గత ఏడాది డిసెంబరులో ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులైన సంగతి తెలిసిందే. Looking forward with excitement to table my first - and the new Government's first - Economic Survey in Parliament on Thursday. #EcoSurvey2019 — K V Subramanian (@SubramanianKri) July 2, 2019 -
సొంతింటి కల నెరవేరేలా..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 5న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై వివిధ వర్గాల ప్రజలు తమదైన అంచనాలు, ఆకాంక్షలు నెరవేరాలని కోరుతున్నారు. బడ్జెట్లో ఏయే వర్గాలకు ఊరట ఉంటుందనే అంశంపైనా పలు అంచనాలు వెల్లడవుతున్నాయి. హోం ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులపై ఆదాయ పన్ను నుంచి ఆర్థిక మంత్రి బడ్జెట్లో వెసులుబాటు ఇస్తారని భావిస్తున్నారు. సెక్షన్ 80డీని విస్తరించడం ద్వారా లేదా గృహ, ఆరోగ్య, జీవిత బీమా చెల్లింపులపై ప్రత్యేక సెక్షన్ ద్వారా రిబేట్‌ను వర్తింపచేస్తారని భావిస్తున్నారు. అందుబాటు గృహాలకు బీమా ప్రీమియం చెల్లింపులపై పన్ను రిబేటు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు గృహ బీమా రంగంలో మార్కెట్ వాటా కోసం శ్రమిస్తున్న ఐసీఐసీఐ లాంబార్డ్, న్యూ ఇండియా ఎష్యూరెన్స్, జీఐసీ ఆర్ఈ వంటి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకూ ప్రభుత్వ నిర్ణయం లాభించనుంది. కాగా గృహ బీమా పన్ను నుంచి ఊరట కల్పించాలని ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ప్రీ బడ్జెట్ భేటీల సందర్భంగా బీమా కంపెనీలు కోరాయని చెబుతున్నారు. -
వేతన జీవులకు ఊరట..?
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 5న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై వివిద వర్గాలు పలు అంచనాలతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితి ప్రస్తుత రూ 2.5 లక్షల నుంచి పెంచాలని కేపీఎంజీ ఇండియా నిర్వహించిన ప్రీ బడ్జెట్ సర్వేలో పాల్గొన్నవారిలో అత్యధికులు కోరారు. ఇక రూ 10 కోట్ల పైబడిన వార్షికాదాయం కలిగిన సంపన్నులపై 40 శాతం పన్ను రేటు విధించాలని కూడా పలువురు కోరారు. వివిధ పరిశ్రమలకు చెందిన 226 మందిని ప్రీ బడ్జెట్ సర్వేలో భాగంగా కేపీఎంజీ పలుకరించింది. ఇక వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ 2.5 లక్షల నుంచి పెంచాలని 74 శాతం మంది అభిప్రాయపడగా, రూ 10 కోట్ల పైబడిన ఆదాయం కలిగిన వారిపై 40 శాతం పన్ను రేటు వర్తింపచేయాలని 58 శాతం మంది కోరడం గమనార్హం. మరోవైపు ప్రభుత్వం వెల్త్ ట్యాక్స్ లేదా ఎస్టేట్ సుంకాన్ని తిరిగి ప్రవేశపెట్టవచ్చని 10 శాతం మంది అంచనా వేశారు. ఇక వారసత్వ పన్ను కూడా తిరగతోడతారని 13 శాతం మంది పేర్కొన్నారు. ఇక గృహరుణంపై వడ్డీకి పన్ను డిడక్షన్‌ను ప్రస్తుతం ఉన్న రూ 2 లక్షల నుంచి ప్రభుత్వం పెంచాలని సర్వేలో పాల్గొన్న వారిలో 65 శాతం మంది కోరారు. -
మాజీ ప్రధానితో నిర్మలా భేటీ
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్మలా, మన్మోహన్‌తో సమావేశం కావడం ఇదే తొలిసారి. జూలై 5 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా.. ఈ నేపథ్యంలో గతంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన మన్మోహన్‌తో సమావేశమైనట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సమావేశంలో వీరు ఏ అంశాలు చర్చించారనేదానిపై సమాచారం లేదు. చాలా ఏళ్లపాటు రాజ్యసభ సభ్యునిగా కొనసాగిన మన్మోహన్.. తన పదవీ కాలం ముగియడంతో ఈ సమావేశాలకు దూరంగా ఉండనున్నారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన ఆర్థిక మంత్రిగా సేవలు అందించారు.1991లో కేంద్రం తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణల్లో మన్మోహన్ కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. 1982 నుంచి 1985 మధ్యకాలంలో ఆర్బీఐ గవర్నర్‌గా విధులు నిర్వర్తించిన మన్మోహన్.. 1985 నుంచి 1987 వరకు ప్లానింగ్ కమిషన్‌కు డిప్యూటీ చైర్మన్‌గా కొనసాగారు. -
అందరమూ దానికోసమే వెదుకుతున్నాం..!
సాక్షి, ముంబై : 2019 కేంద్ర బడ్జెట్లో ఆటో పరిశ్రమ ఆశలు, అంచనాలపై పారిశ్రామికవేత్త మహింద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రా ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఆటో మొబైల్స్‌పై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) తగ్గించాలని కోరుకున్నారు. అది దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందని అన్నారు. ఆటో పరిశ్రమ రంగం చిన్న కంపెనీలు, ఉపాధి కల్పనపై పెను ప్రభావం చూపుతుందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే (అమృతాన్నిపంచే) మందర పర్వతం(క్షీరసాగర మథనంలోని పర్వతం) వైపు అందరం చూస్తున్నాం. తానూ పక్షపాతంగానే ఆలోచిస్తున్నప్పటికీ.. జీఎస్టీ తగ్గిస్తే.. ఉద్యోగాల కల్పన, చిన్న పరిశ్రమల వృద్ధిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ముఖ్యంగా ఆటోకార్ ప్రొఫెషనల్ అనే ఆటోమోటివ్ మ్యాగజీన్ ట్వీట్‌కు ఆనంద్ మహీంద్ర స్పందించారు. దేశంలో భారీగా(మూడో వంతు) ఉద్యోగాలు సృష్టించే ఆటోమొబైల్ రంగం మళ్లీ వృద్ధి దిశగా పయనించాలంటే వాహనాలపై జీఎస్టీ తగ్గించాల్సిన అవసరం ఉందన్న ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జాన్ కే పాల్ వ్యాఖ్యలను మ్యాగజైన్ ట్వీట్ చేసింది. అటు పరిశ్రమ బాడీ సియామ్ కూడా వాహనాలపై జీఎస్టీని 28శాతం నుంచి 18శాతానికి తగ్గించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా 18 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఆటోమొబైల్ విక్రయాలు భారీగా పతనమయ్యాయి. మే నెలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 20 శాతానికి పైగా క్షీణించాయి. అంతక్రితం 2001 సెప్టెంబరులో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 21.91శాతం పడిపోయాయి. What we’re all searching for is the ‘Mt. Mandara’ which can start the ‘Manthan’ of the economy & get it spinning faster. I’m biased, of course,but the auto industry is one such ‘Mandara.’ It has a huge multiplier effect on small companies & on employment. Lowering GST would help https://t.co/13SOajY3Lt — anand mahindra (@anandmahindra) June 26, 2019 -
బడ్జెట్లో తీపి కబురు ఉండేనా..?
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 ఆర్ధిక సంవత్సరానికి జులై 5న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మోదీ సర్కార్ తదుపరి ఐదేళ్లకు రోడ్‌మ్యాప్‌లా ఉంటుందని భావిస్తున్నారు. నరేంద్ర మోదీ సారధ్యంలో బీజేపీ ప్రభుత్వానికి ఓటర్లు మరోసారి పట్టం కట్టిన నేపథ్యంలో బడ్జెట్లో ప్రజలకు ఊరట కల్పించే అంశాలు పొందుపరుస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని ప్రస్తుత రూ 2.5 లక్షల నుంచి రూ 5 లక్షలకు పెంచుతారని అంచనాలున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి రూ 5 లక్షల వరకూ పూర్తిగా పన్ను రిబేటును ప్రకటించినా, ఆదాయ పన్ను శ్లాబ్‌ల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఆదాయ పన్ను మినహాయింపుకు వార్షికాదాయ పరిమితి రూ 2.5 లక్షల శ్లాబును అలాగే ఉంచారు. 2014 నుంచి ఈ శ్లాబులో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. రూ 2.5 లక్షల నుంచి రూ 5 లక్షల ఆదాయానికి పన్ను రేటును 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినా రూ 5 లక్షల నుంచి రూ 10 లక్షల లోపు ఆదాయానికి పన్ను రేటును ఏకంగా 20 శాతంగా నిర్ధారించారు. ఇక తాజా బడ్జెట్లో పన్ను శ్లాబ్‌ల్లో హేతుబద్ధత పాటించడంతో పాటు వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ 2.5 లక్షల నుంచి రూ 3 లక్షలకు పెంచవచ్చని భావిస్తున్నారు. అయితే సెక్షన్ 87(ఏ) కింద రూ 5 లక్షల వరకూ వార్షికాదాయంపై పూర్తి పన్ను మినహాయింపును ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించడంతో కనీస వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని రూ 2.5 లక్షల నుంచి పెంచకపోవచ్చని మరో అంచనా వెల్లడవుతోంది. తాజా బడ్జెట్లో బేసిక్ ఇన్‌కం ట్యాక్స్ పరిమితిని రూ 2.5 లక్షలు యథాతథంగా ఉంచితే వేతన జీవులు, పన్నుచెల్లింపుదారులకు తీవ్ర నిరాశ ఎదురవనుంది. -
నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ బోర్డు మంగళవారం సమావేశం కానుంది. హోంమంత్రి అమిత్ షా సహా పార్టీకి చెందిన ఎంపీలందరూ ఈ సమావేశానికి హాజరు కావచ్చని భావిస్తున్నారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ భేటీ జరగనుండటం గమనార్హం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జేపీ నడ్డా ఎన్నికైన అనంతరం పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఇదే తొలిసారి. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో మంగళవారం ఉదయం సమావేశం ప్రారంభంకానుంది. జులై 5న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో ఈ అంశంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక ట్రిపుల్ తలాక్ బిల్లు, పశ్చిమ బెంగాల్లో చెలరేగుతున్న ఎన్నికల అనంతర హింసాకాండ తదితర అంశాలపైనా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. -
రూ 1.20 లక్షల కోట్లతో అభివృద్ధికి రహ‘దారి’
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న బడ్జెట్లో తమకు రూ 1.20 లక్షల కోట్ల నిధులు కేటాయించాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కోరుతోంది. జులై 5న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో తమ మంత్రిత్వ శాఖకు అధిక నిధులు కోరుతూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను స్వయంగా కలిసి అభ్యర్ధించారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 1న పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో కేటాయింపుల కంటే రూ 37,000 కోట్లు అదనంగా రూ 1.20 లక్షల కోట్లు తమ శాఖకు కేటాయించాలని గడ్కరీ కోరుతున్నారు. జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు మౌలిక రంగ ప్రాజెక్టులను ప్రైవేట్ పెట్టుబడులతో నిమిత్తం లేకుండా సత్వరమే పూర్తిచేసేందుకు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ బడ్జెట్లో అధిక నిధులను కోరుతోందని ఆ మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. భారత్ పది లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్ధగా ఎదగాలంటే మౌలిక వసతులను అత్యాధునికంగా నిర్మించాలని మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
బడుగుల్ని పక్కనబెట్టిన బడ్జెట్
నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో (1–2–2019) ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాజిక న్యాయానికి చాలా దూరంగా ఉంది. ఓట్ ఆన్ అకౌంట్‌గా పెట్టవలసిన బడ్జెట్‌ను 2019–20 బడ్జెట్‌గా పెట్టడం రాజ్యాంగ విరుద్ధం. పీయూష్ గోయల్ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లో మొత్తం కేటాయింపులు 27.84 లక్షల కోట్లు. బడ్జెట్లోని కీలకాంశాలు ఇలా వున్నాయి. రైల్వేకు రూ. 64,587 కోట్లు, రక్షణ రంగంకు రూ.3,05,296 కోట్లు, పెన్షన్లు రూ.1,74,300 కోట్లు, ప్రధాన సబ్సిడీలకు రూ.2,96,684 కోట్లు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1,49,981 కోట్లు, వాణిజ్యం, పరిశ్రమలకు రూ.27,600 కోట్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.3,000 కోట్లు, విద్యకు రూ.93,848 కోట్లు, ఇంధన రంగంకు రూ.44,101 కోట్లు, విదేశీ వ్యవహారాలకు రూ.16,062 కోట్లు, ఆర్థికశాఖకు రూ.19,812 కోట్లు, ఆరోగ్య రంగంకు రూ.63,538 కోట్లు, హోంశాఖకు రూ.1,03,927 కోట్లు, ఐటి,టెలికాంకు రూ.21,549 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.1,38,962 కోట్లు, సాంఘిక సంక్షేమాంకు రూ. 49,337 కోట్లు, రవాణా వ్యవస్ధకు రూ.1,56,187 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.48,032 కోట్లు, ఇతర రంగాలకు రూ.75,822 కోట్లు. ఈ పద్దును పరిశీలిస్తే ఇందులో అణగారిన సామాజిక శ్రేణుల ప్రస్తావన లేకుండా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని స్పష్టంగా తెలుస్తోంది. నిజానికి ఏ బడ్జెట్లో అయినా దళితులు, ఆదివాసీలు, స్త్రీలు, ప్రధాన పాత్రలో ఉండాలి. అయితే మోదీ ప్రభుత్వానికి వీళ్ళు ముఖ్యులు కారు. వాళ్ల దృష్టిలో కూడా లేరు. రక్తలేమితో పిల్లల్ని కనలేక వేలాది ఆదివాసీ స్త్రీలు చనిపోతున్నారు. దోమతెరలు లేక లక్షలాది మంది గిరిజనులు చనిపోతున్నారు. వారి ప్రస్తావన మోదీ బడ్జెట్లో లేదు. ఓట్ల కోసం హిందువుల్ని రెచ్చగొట్టాలని గో సంపదను జన్యు పరంగా తీర్చిదిద్దాలని, రాష్ట్రీయ గోకుల్‌మిషన్ కోసం 750 కోట్లు పెంచారు. అంటే ఒక తల్లి బిడ్డను కనలేక రక్తలేమితో మరణిస్తుంటే ఆమె పౌష్టికాహారానికి ఇవ్వాల్సిన ధనాన్ని పక్కనబెట్టి గోరక్షణకు కేటాయింపులు చేశారు. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.29 వేల కోట్లను కేటాయించింది. మొత్తం భారతదేశంలో వితంతువుల సంఖ్య ఎంత? లెక్కలున్నాయా. మీ మద్యపాన విధానాల వల్ల, రహదారుల విధానాల వల్ల ఎందరో త్వరగా మరణిస్తున్నారు. ఎంతో మంది వితంతువులుగా మిగిలిపోతున్నారు. వీరికి పునరావాస కేంద్రాలు ఏవి, వాటి నిర్మాణం ఏది? ప్రధానమంత్రి కిసాన్‌సమ్మాన్ నిధి పేరిట ఎకరాకు 6 వేలు ఇవ్వాలని మోదీ నిర్ణయించారు. కానీ దేశంలో 100కి 80% భూమిని కౌలు రైతులు సాగుచేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది గిరిజనులు, దళితులు ఉన్నారు. మరి వారి సంగతి ఏమిటి. పోడు వ్యవసాయం చేసే గిరి జనులకు పట్టా పుస్తకాలు, పాసు పుస్తకాలు లేవు. భూయజమాన్య హక్కుల ఆధారంగా బ్యాంక్ రుణాలు తీసుకునే రైతులకు కేంద్రం నేరుగా ధనం బదిలీ అవుతుంది. ఇవి లేని దళిత, గిరిజన రైతుల పరిస్ధితి ఏమిటి? అంటే దళితులు రైతులు కాదా! సాగు చేస్తూ భూ హక్కులు లేనివారి సంఖ్య ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే 25 లక్షల పైనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 16 లక్షల మంది ఉన్నారు. ఇందులో పది లక్షల మంది దళితులే ఉన్నారు. కేసీఆర్ తెలంగాణలో దళితులను దెబ్బతీయాలని కేవలం రైతులకు నగదు బ్యాంకుల్లో వేశారు. చంద్రబాబు నీరు, చెట్టు పేరుతో దళితుల భూములు లాక్కుని సొంత కులాలకు ఇచ్చారు. ఇప్పుడు దళితుల భూములు లాక్కుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కౌలు రౌతులు ముందస్తుగా రైతులకు ఎకరాకు 30 వేలు వడ్డీలకు తెచ్చి చెల్లిస్తున్నారు. తుఫాన్లు వస్తే నష్టాన్ని తామే భరిస్తున్నారు. దళితులు వ్యవసాయ కూలీల నుంచి కౌలు రైతులుగా మారే క్రమంలో వారిని అప్పుల్లో ముంచే ప్రయత్నం కేంద్రం రాష్ట్రాలు చేస్తున్నాయి. రైతుకు 6 వేల రూపాయలు మూడు విడతలుగా బ్యాంక్‌లో వేయడం కూడా జరుగుతోంది. ఇదీ రైతు కులాలకు అవమానమే. ప్రభుత్వాన్ని పోషించాల్సిన రైతును భిక్షగాళ్ళగా మార్చుతున్నారు. అడుక్కునే స్వభావాన్ని నేర్పుతున్నారు. బడ్జెట్ పద్దుల్లో ఏపీ విద్యా సంస్ధల పేర్లు ప్రత్యేకంగా చూపినప్పటికీ కేటాయిం పులు మాత్రం చేయలేదు. 2018–19లో కేటాయిం చిన రూ.49 కోట్లను మాత్రం అంచనాల సవరణ సమయానికి రూ.70.40 కోట్లకు పెంచారు. ఈ కేంద్ర బడ్జెట్‌ను చూస్తే తప్పకుండా కేంద్రప్రభుత్వం దళిత, మైనార్టీ, స్త్రీ ద్వేషి అని అర్థం అవుతుంది. ‘హిందూ’ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి ‘గోవు’ను కేంద్రం చేసి మళ్ళీ రాజ్యానికి రావాలని చూస్తున్నారు. ఈ సందర్భంగా లౌకికవాదుల, వామపక్షవాదుల, సామాజిక ఉద్యమకారుల, హేతువాదుల ఐక్యత రాజకీయంగా పటిష్టం కావాల్సిఉంది. వ్యాసకర్త: డా‘‘ కత్తి పద్మారావు, సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ‘ 98497 41695 -
పీఎం–కిసాన్ మొదటి విడతలో కోటి మందికి..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు లబ్ధి చేకూర్చే పీఎం–కిసాన్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24వ తేదీన ప్రారంభించనున్నారు. ప్రధాన్‌మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(పీఎం–కిసాన్)ను ప్రభుత్వం ఇటీవల 2019–20 మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని 24న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6 వేలను మూడు విడతలుగా అందిం చడం కేంద్రం లక్ష్యం కాగా మొదటి విడతలో కోటి మందికి పైగా లబ్ధిదారులకు రూ.2 వేలు చొప్పున అందనున్నాయి. ఈనెల 24వ తేదీ వరకు పీఎం–కిసాన్ పోర్టల్‌లో నమోదైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బు జమ కానుంది. రెండో విడతలో రూ.2 వేలను ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయనుంది. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో 95 శాతం వివరాలు, 9 రాష్ట్రాల్లో 80 శాతం రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు కాగా మిగతా రాష్ట్రాలు కాస్తంత వెనుకబడి ఉన్నాయని అధికారు లు తెలిపారు. మొదటి విడత జాబితాలో తమ పేర్లు నమోదైందీ లేనిదీ చెక్ చేసుకోవాలని రైతులను కోరారు. -
వెనుకబాటుపై బడ్జెట్ పోటు
బీజేపీ ప్రభుత్వ బడ్జెట్ ఉపన్యాసాల్లో కనీసం ఎస్సీ, ఎస్టీ కార్యక్రమాల ప్రస్తావన లేకుండా పోతోంది. ప్రతి సంవత్సరం ప్రకటించే ఎకనామిక్ సర్వే నివేదికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి పట్ల ఒక అంచనా, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఉండేది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది పూర్తిగా తొలగించారు. వీటన్నింటికీ పరాకాష్టగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అగ్రకులాల పేదలను ఆదుకునే పేరుతో తీసుకొచ్చిన పదిశాతం రిజర్వేషన్లు. ఇది కేవలం దళిత, ఆదివాసీ, వెనుకబడిన కులాల వ్యతిరేక బడ్జెట్ అని చెప్పడానికి ఎటువంటి సంకోచం అవసరం లేదు. ‘‘సామాజిక న్యాయం, సామాజిక సామరస్య సూత్రాల ఆధారంగా సమాజంలోని అంతరాలను తొలగించడానికి బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. ఆర్థిక న్యాయం, రాజకీయ సాధికారతతో కూడిన సామాజిక న్యాయం మరింత శక్తివంతమయ్యేందుకు, అస్థిత్వ రాజకీ యాలు, తాత్కాలిక ఉపశమనాలకు బదులుగా సమాజంలోని అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీల సమగ్రాభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరిస్తుంది. విద్య, వైద్యం, ఉపాధి విషయాల్లో సమానావకాశాలను అందించడానికి సమతుల్యతను పాటిస్తాం’’ అని భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల ప్రణాళికలో ఆర్భాటంగాప్రకటించుకుంది. అయితే ఆచరణలో ఐదేళ్ళ మోదీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నదన్నది అక్షర సత్యం. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం బీజేపీ ప్రభుత్వ ఆలోచనలో సైతం లేదన్న వాస్తవాన్ని బలోపేతం చేస్తోంది. గత ఐదేళ్ళుగా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కుల సంగతి అటుంచితే కనీసం వాళ్ళని మనుషులుగా చూడనిపరిస్థితికి అద్దం పడుతోంది. ఐదేళ్ళ బీజేపీ పాలన దేశంలోని దళితుల, ఆదివాసీల బతుకులను శతాబ్దాల అగాధాల్లోకి నెట్టివేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమంలో కేంద్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి మీద దృష్టిపెడుతున్నది. అందుకోసం విశ్వవిద్యాలయాల్లో పరిశోధన సాగించే వారి కోసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజీవ్ గాంధీ ఫెలోషిప్స్ ప్రారంభించింది. ఆ పథకం ఎంతో మంది అణగారిన వర్గాల వారిని పరిశోధన వైపు తీసుకురాగలిగింది. కానీ బీజీపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆ పథకాన్ని పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం చేసింది. బడ్జెట్లో కేటాయింపులే దానికి ప్రత్యక్షనిదర్శనం. బీసీ విద్యార్థుల కోసం ప్రకటించిన జాతీయ స్కాలర్షిప్లు 2012–2013 సంవత్సరంలో 45 కోట్లు ఖర్చు చేస్తే, 2019–20 సంవత్సరానికి 30 కోట్లు కేటాయించడం శోచనీయం. ఇందులో దాగి ఉన్న మరో మోసం ఏమిటంటే, 2018–19 సంవ త్సరం బడ్జెట్లో 110 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. కానీ బడ్జెట్ సవరణలలో అది 30 కోట్లకు కుదించారు. ఇలాంటి నిర్లక్ష్యం కారణంగానే కొన్ని వేల మంది విద్యార్థులు నష్టపోయారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్సీ విద్యార్థులు అధికంగా ఆధారపడే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు చాలా ఘోరంగా కోతకు గురయ్యాయి. 2017–18లో 3414 కోట్లు కేటాయిస్తే, 2019–20 సంవత్సరానికి అది 2926 కోట్లకు పడిపోయింది. ఎస్సీల కోసం ముఖ్యమైన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ కోసం గత రెండేళ్ళుగా కేటాయింపులు లేనేలేవు. ఇక రాష్ట్రాలలో ఆదివాసుల కోసం అమలు చేసే స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ గత రెండేళ్లుగా 1350 కోట్లుగా నిలకడగా కొనసాగుతున్నది. బడ్జెట్ మాత్రం లక్షల కోట్లకు పెరిగిపోతున్నా వీరి అభివృద్ధి కోసం కేటాయిం చాల్సిన నిధులు మాత్రం అంతకంతకూ కనుమరుగైపోతున్నాయి. ఆది వాసీ విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి కేటాయించే నిధు లను చూస్తే ప్రభుత్వ చేతలకీ, మాటలకీ పొంతన లేని విషయం తేటతెల్లం అవుతుంది. 2017– 18లో కోటి రూపాయలు, 2019–20లో రెండు కోట్లు కేటాయించారు. అదేవిధంగా బీసీ విద్యార్థులు విదేశాలకు వెళ్ళే స్కాలర్ షిప్‌ల మొత్తం గణనీయంగా తగ్గించేశారు. 2017–18లో 19 కోట్ల 87 లక్షలుంటే, అది 2018–19, 2019–20లలో 10 కోట్లకు కుదించారు. ఇవి బీజేపీ విధానాల డొల్లతనాన్ని బయటపెట్టే మచ్చుకి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించుకున్న కార్యక్రమం స్వచ్ఛ భారత్. ఈ అక్టోబర్ 2తో ఇది పరిసమాప్తం కాబోతున్నది. స్వచ్ఛభారత్‌లో చెరగని మచ్చ మాన్యువల్ స్కావెంజింగ్. మలమూత్రాలను చేతులతో ఎత్తివేసే అమానవీయ చర్యను నిర్మూలించే ఉద్దేశంతో 15 ఏళ్ళ క్రితమే ఒక చట్టం వచ్చింది. కానీ ఆ చట్టం సమర్థవం తంగా అమలు జరిగిన దాఖలాలు లేవు. ఇప్పటికీ ఈ దారుణమైన పనిలో 58 వేల మంది ఉన్నట్టు ప్రభుత్వమే ప్రకటించింది. కానీ ఈ లెక్కలు కాకి లెక్కలన్న విషయాన్ని సఫాయికర్మచారీ ఆందోళన్ నాయకుడు, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ సాక్ష్యాధారాలతో సహా వివరిస్తున్నారు. మాన్యువల్ స్కావెంజర్స్ సంఖ్య ఒక లక్షకుపైనే ఉంటుం దని బెజవాడ విల్సన్ ప్రకటించారు. అయితే ఈ అత్యంత అమానవీయ పనిలో శతాబ్దాల తరబడి మునిగితేలుతున్న దళితులకు పునరావాసం కల్పించి, వారిని ఆ వృత్తి నుంచి దూరంగా తీసుకురావాలని చట్టం నిర్దేశిస్తున్నది. ప్రతి కార్మికుడికీ ఒకేసారి 40 వేల రూపాయలు ఇచ్చి ఆ పనిని మాన్పించేందుకు సహకరించాలని ప్రభుత్వాలే నిర్ణయించాయి. అయితే ఈ సంవత్సరాంతంలోగా వీరికి పునరావాసం కల్పించాలి. అందుకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 232 కోట్లు అవసరమవుతాయి. సఫాయికర్మచారీ ఆందోళన్ అంచనాను తీసుకుంటే 480 కోట్లు ఖర్చవుతాయి. కానీ, కేంద్రం దీనికి కేవలం 30 కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తే ప్రభుత్వ ద్వంద్వ వైఖరి స్పష్టమౌతుంది. 2017–18లో ఈ కార్యక్రమానికి కేటాయింపులే లేకపోవడం మరో విచిత్రమైన విషయం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న నిర్ణయాల్లో ప్రణాళికా సంఘం రద్దు ఒకటి. దీనివల్ల బడ్జెట్లో మార్పులు జరిగాయి. ప్రణాళిక, ప్రణాళికేతర బడ్జెట్ అనే విధానానికే స్వస్తి పలి కారు. దీంతో ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికోసం రూపొందించిన సబ్‌ప్లాన్ విధానం ప్రమాదంలో పడిపోయింది. అయితే కేంద్రంలో మాత్రం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు ఏవో లెక్కలు చూపిస్తున్నారు. సెంటర్ ఫర్ బడ్జెట్, గవర్నెన్స్ అకౌంటబిలిటీ సంస్థ అధ్యయనం ప్రకారం, ఈ పథకం కేవలం నామమాత్రంగానే కొనసాగుతున్నదని తేలిపోయింది. 1974 నుంచి ట్రైబల్ సబ్ ప్లాన్, 1979–80 నుంచి స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ అమలులో ఉంది, 2006 నుంచి స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్‌ను షెడ్యూల్డ్ కులాల సబ్‌ప్లాన్‌గా మార్చారు. ప్రభుత్వాలు అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషా ప్రకారం వారికి బడ్జెట్లో నిధులు కేటాయించాలనేది సబ్‌ప్లాన్ సారాంశం. ఎస్సీ, ఎస్టీల వాడలు, పల్లెలు, గూడేలు, తండాలు అభి వృద్ధితో పాటు, వ్యక్తిగత అభివృద్ధి కూడా దీని ఉద్దేశం. కానీ కనీసం కాగితాలవరకైనా జనాభా దామాషా ప్రకారం నిధుల కేటాయింపులే లేవు. ఎస్సీల సబ్‌ప్లాన్ 16 శాతం కేటాయించాల్సి ఉండగా, 2017–18లో 8.4 శాతం, 2018–19లో 8.8 శాతం, 2019–20లో 9.3 శాతం మాత్రమే కేటాయించారు. ఇవి ఏవీ కూడా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలు చేయవు. రక్షణ రంగం, శాస్త్రసాంకేతిక రంగాలు, పరిశోధనా విభాగాలు, ఇంకా ఇతర రంగాలు ఏవీ కూడా ఎస్సీల అభివృద్ధికి ప్రత్యక్షంగా, పరోక్షంగా గానీ ఉపయోగపడవు. ట్రైబల్ సబ్‌ప్లాన్ ప్రకారం ఆదివాసులకు 8.6 శాతం కేటాయించాల్సి ఉండగా 2017–18లో 5.6 శాతం, 2018–19లో 5.8 శాతం, 2019–20లో 6.1 శాతం కేటాయింపులు చూపించి చేతులు దులుపుకున్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికోసం గత ప్రభుత్వాలు అనుసరించిన విధా నాలను ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్న దాఖలాలు లేవు. అంతే కాకుండా ఎస్సీ, ఎస్టీల పట్ల ముఖ్యంగా ఎస్సీల పట్ల ఈ ప్రభుత్వం ఒకరకంగా శతృవైఖరినే అవలంబిస్తూ వస్తున్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల బలిదానం నుంచి మొదలుకొని, ఆవు మాంసం తిన్నారనే పేరుతోనో మరో కారణంతోనో దళితుల మీద జరిగిన హత్యాకాండను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రోత్సహిస్తూండటం ప్రజలకు తెలియంది కాదు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ అనుసరిస్తోన్న రాజకీయవిధానం ఇందుకు నిదర్శనం. రాజ్యాంగం అందించిన హక్కుల ద్వారా చదువుకొని, విద్యావంతులవుతున్న దళితుల పట్ల హిందూ సమాజంలోని కులాలకు సహజంగానే కంటగింపుగా ఉంటుంది. రిజర్వేషన్ల వల్ల తమ పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదనే కోపం కూడా ఉంది. దీనిని ఉపయోగించుకొని బీసీలతో సహా హిందూ సమాజంలోని కులాలన్నింటినీ ఏకం చేయడం కోసమే ప్రభుత్వం దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన గత ఎన్నికల్లో ఇది ప్రస్ఫుటంగా కనిపించింది. దానికి ముస్లింల పట్ల ఉన్న వ్యతిరేకతను కూడా ప్రభుత్వం దీనికి జతచేస్తున్నది. దళితులు, ముస్లింలమీద గోసంరక్షణ పేరుతో జరిగిన దాడులు దీనికి నిదర్శనం. ఈ దృక్పథమే బడ్జెట్ కేటాయింపులు, అభివృద్ధి కార్యక్రమాల అమలు మీద ప్రభావం చూపుతున్నది. అందువల్లనే బీజేపీ ప్రభుత్వ బడ్జెట్ ఉపన్యాసాల్లో కనీసం ఎస్సీ, ఎస్టీ కార్యక్రమాల ప్రస్తావనలేకుండా పోతోంది. ప్రతి సంవత్సరం ప్రకటించే ఎకనామిక్ సర్వే నివేదికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి పట్ల ఒక అంచనా, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఉండేది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది పూర్తిగా తొలగించారు. వీటన్నింటికీ పరాకాష్టగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అగ్రకులాల పేదలను ఆదుకునే పేరుతో తీసుకొచ్చిన పదిశాతం రిజర్వేషన్లు. ప్రభుత్వాల దగ్గర నిధులు లేకకాదు. వాళ్ళు అనుకుంటే వేల కోట్లను రాత్రికి రాత్రే తమ కులాల వాళ్ళకు పంపిణీ చేయగలరు. అది వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు. చివరకు బాగా ముడుపులు అందే రక్షణ రంగం కావచ్చు. కానీ దళిత, ఆదివాసీల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని ఈ బడ్జెట్ చాలా స్పష్టంగా బయటపెట్టింది. ఇది కేవలం దళిత, ఆదివాసీ, వెనుకబడిన కులాల వ్యతిరేక బడ్జెట్ అని చెప్పడానికి ఎటువంటి సంకోచం అవసరం లేదు. వ్యాసకర్త : మల్లెపల్లి లక్ష్మయ్య , సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
మితిమీరిన లోటుతో బడ్జెట్‌కు చేటు
అంచనాలలో లెక్కలు తప్పితే మొదటికే మోసం వస్తుంది. ఈ బడ్జెట్లో కొన్ని ప్రజారంజకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి నాలుగేళ్లు చిత్తశుద్ధితో చేసిన కొన్ని కార్యక్రమాలు వెసులుబాటు కల్పించాయి. రాష్ట్ర బడ్జెట్లో ఆదాయాన్ని ఏకంగా 15శాతం పెంచి 19–20 సంవత్సరానికి రెండు లక్షల 25 వేల కోట్లుగా చూపెట్టారు. ఈ స్థాయిలో అమాంతంగా వనరులు ఎట్లా పెరుగుతాయో అర్థం కావటం లేదు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు ఏకంగా ఒక సంవత్సరంలో 10 వేల కోట్లు పెరుగుతున్నట్లుగా చూపెట్టారు. అమలుచేయలేని, చేయాలన్న ఉద్దేశం లేని అనేక కార్యక్రమాలను ప్రకటించడం కేవలం బడ్జెట్‌ను అపహాస్యం చేయడమే అవుతుంది. కేంద్రంలో ఒక బడ్జెట్టు, రాష్ట్రంలో ఒక బడ్జెట్టు ప్రవేశపెట్టారు. ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి రెండు బడ్జెట్లలో ప్రజాకర్షణ పథకాలను, వరాలను పొందుపరిచారు. ఎవరు తాయిలాలు ఇవ్వాలన్నా దానికి తగ్గ వనరులు ఉండాలి. బడ్జెట్ అంటేనే భవిష్యత్తులోని ఆదాయ వ్యయ అంచనా. ఈ అంచనాలలో లెక్కలు తప్పితే మొదటికే మోసం వస్తుంది. ఈ రెండు బడ్జెట్లు ఎలా ఉన్నాయనే అంశాన్ని పరిశీలించే ముందు రెండు, మూడు సాంకేతికమైన విషయాల మీద మౌలికమైన పరిజ్ఞానం అవసరం. ప్రతి బడ్జెట్లో రెవెన్యూ విభాగం, మూలధన విభాగం ఉంటాయి. సాలుసరి పన్నుల రూపంలో ఇతరత్రా వచ్చే ఆదాయాలు రెవెన్యూ ఆదాయంగా చూపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా జీతాలు, పెన్షన్లు లాంటి సాలుసరి ఖర్చులను రెవెన్యూ ఖర్చులుగా చూపెట్టడం జరుగుతుంది. ఈ విభాగంలో ఖర్చుకన్నా ఆదాయం ఎక్కువగా ఉంటే దానిని రెవెన్యూ మిగులు అంటారు. అది చాలా శుభకరమైన పరిణామం. అదే ఖర్చు ఆదాయం కన్నా ఎక్కువగా ఉంటే రెవెన్యూ లోటు అంటారు. ఇది మంచి పరిణామం కాదు. ఎంత ఎక్కువ ఉంటే అంత ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుంది. ఇక మూలధన పట్టికలో వచ్చే నిధులు అప్పుల రూపంలో ఉంటాయి. ఖర్చు ప్రాజెక్టుల మీద ఆదాయాన్నిచ్చే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే స్థిరాస్తుల మీద ఉంటుంది. తీసుకున్న మొత్తం అప్పులను ద్రవ్యలోటు అంటారు. ఈ తీసుకున్న అప్పులో కొంత భాగం రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి ఉపయోగిస్తే అంతవరకు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టడానికి ఉండే నిధులు తక్కువవుతాయి. ఏ దేశంలో రెవెన్యూ లోటు సున్నా ఉండి మొత్తం అప్పులు ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెడతారో ఆ ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా బలోపేతంగా ఉంటుంది. ఇంకొక చిన్న అంశం ప్రాథమిక లోటు. తెచ్చే అప్పులు కనీసం పాత వడ్డీలను కట్టడానికైనా ఉపయోగపడితే ప్రాథమిక లోటు ఉండదు. అప్పుడు భవిష్యత్తులో మరింత అప్పుల భారం వచ్చే అవకాశం ఉండదు. కానీ ప్రాథమిక లోటు ఉండి తెచ్చిన అప్పులు కట్టే వడ్డీల కన్నా ఎక్కువగా ఉంటే భవిష్యత్తులో అప్పుల భారం పెరుగుతున్నట్టు అర్థం. ఇది మంచి పరిణామం కాదు. విచ్చలవిడి బడ్జెట్‌తో మొదటికే మోసం ప్రజాస్వామ్యంలో ప్రజలదే రాజ్యం. బడ్జెట్లు ప్రజారంజకంగాను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగానూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ప్రజారంజకం పేరుతో పైన పేర్కొన్న సూచికలను పూర్తిగా విస్మరించి విచ్చలవిడిగా బడ్జెట్ రూపొందిస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అందుకనే బడ్జెట్లు ఎప్పుడూ వాస్తవికతకు దగ్గ రగా ఉండాలి. ఇక దర్శనీయంగా పెట్టుబడులను, అభివృద్ధిని ఇబ్బడిముబ్బడిగా ప్రోత్సహించే విధంగా ఉండాలి. ఈ ప్రామాణికాలను ఆధా రంగా చేసుకొని కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు పరిశీలిద్దాం. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మూడు ప్రధానమైన ప్రజారంజక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. చిన్న, సన్నకారు రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ద్వారా దేశమంతటా రైతుల ఖాతాల్లో ఆరువేల రూపాయలు జమ చేసే విధంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. అదేవిధంగా అసంఘటిత కార్మికులకు మూడు వేల రూపాయల పెన్షన్ వచ్చే విధంగా మరొక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఐదు లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న వారు ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా మార్పు తీసుకొని వచ్చింది. ఇంకా ఎన్నో ఇతర కార్యక్రమాలు ఉన్నా బడ్జెట్లో బాగా ప్రాధాన్యత సంతరించుకున్న పథకాలు ఈ మూడు. మరి ఇవి ఆచరణ సాధ్యమేనా! బడ్జెట్లోని గణాంకాలు చూస్తే వాస్తవికతకు దగ్గరగా ఆచరణ సాధ్యంగా ఈ మూడింటినీ ప్రవేశపెట్టారని అర్థం అవుతుంది. ఆదాయపు అంచనాలను చాలా వాస్తవికంగా రూపొందిం చారు. జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయంలో పెరుగుదలను 2%గానే తీసు కున్నారు. 17–18, 18–19 సంవత్సరాల మధ్య వచ్చిన రాబడిలో పెరుగుదల 20% ఉంటే 19–20 ఏడాది రాబడిలో పెరుగుదల 14% గానే తీసుకున్నారు. కాబట్టి ఈ ఆదాయాలు రావటంలో ఎటువంటి సమస్యా ఉండకపోవచ్చు. ద్రవ్యలోటు జాతీయాదాయంలో 3.4%గా అంచనా వేశారు. మూడు శాతం కన్నా తక్కువ ఉంటే మంచి పరిణామంగా భావించాల్సి ఉన్న ద్రవ్యలోటు నిర్వహణ పరిమితులలోనే ఉన్నది (ఝ్చn్చజ్ఛ్చb ్ఛ జీఝజ్టీట). రెవెన్యూ లోటు కూడా 1.3% దగ్గర ఉంది. ఇది పూర్తిగా లేకపోయినా ద్రవ్య మిగులు ఉన్నా చాలా మంచి పరిణామం. కానీ 1.3% ప్రమాదకరమైన సంకేతమైతే కాదు. ఏడు లక్షల కోట్లకు ప్రాథమిక లోటు చాలా తక్కువగా 38 వేల కోట్లు ఉన్నది. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే తీసుకున్న అప్పులలో ఎక్కువ శాతం వడ్డీలు చెల్లించడానికి పోతున్నది కాబట్టి అదనంగా అప్పుల భారం పడే అవకాశం చాలా తక్కువ. వాస్తవికతకు దగ్గరగా కేంద్ర బడ్జెట్ ఈ బడ్జెట్లో కొన్ని ప్రజారంజకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి గత నాలుగు సంవత్సరాలు చిత్తశుద్ధితో చేసిన కొన్ని కార్య క్రమాలు వెసులుబాటు కల్పించాయి. ఎన్నాళ్ల నుంచో తెగకుండా సాగు తున్న జీఎస్టీని ఒక కొలిక్కి తెచ్చి ప్రవేశపెట్టడంతో దేశమంతటా ఒకే మార్కెట్ ఏర్పడింది. దీని వల్ల వచ్చే ఆదాయాలు కూడా పెరిగాయి. ఆర్థిక మంత్రి చెప్పినట్టు జీఎస్టీ ప్రవేశ పెట్టిన కొత్తలో నెలకు 89,700 కోట్లు ఉన్న ఆదాయం 97 వేల కోట్లకు పెరిగింది. నోట్ల రద్దుతో అదనంగా చాలామంది ఆదాయపన్ను మదింపుకి వచ్చారు. నిరర్థక ఆస్తులను రాబట్టడంలో ఇన్సాల్వెన్సీ చట్టం చాలా ఉపయోగపడింది. ఇప్పటికే మూడు లక్షల కోట్ల దాకా మొండి బకాయిలు వసూలు అయినట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. దీనితో బ్యాంకింగ్ రంగానికి బడ్జెట్ ద్వారా సహాయం చేయాల్సిన అవసరం తగ్గింది. ఈ మంచి పరిణామాలను ఉపయోగించుకొని కొన్ని వర్గాల ప్రజలకు రాయితీలను ప్రకటిస్తూ వాస్తవికతకు దగ్గరగా ఆచరణకు ఏ విధమైన ఇబ్బంది ఉండని బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను పరిశీలిద్దాం. 2017– 18లో రాష్ట్రానికి వచ్చిన మొత్తం ఆదాయం ఒక లక్షా 91 వేల కోట్లు. 18–19కి ఈ ఆదాయం ఇదే స్థాయిలో ఉంటుందని అంచనా వేసినా, సంవత్సరాంతానికి రెండు శాతం పెరిగి లక్షా 95 వేల కోట్లు అయింది. ఈ ఆదాయాన్ని ఏకంగా 15 శాతం పెంచి 19–20 సంవత్సరానికి రెండు లక్షల 25 వేల కోట్లుగా చూపెట్టారు. ఇంత స్థాయిలో అమాంతంగా వనరులు ఎట్లా పెరుగుతాయో అర్థం కావటం లేదు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు ఏకంగా ఒక సంవత్సరంలో 10 వేల కోట్లు పెరుగుతున్నట్లుగా చూపెట్టారు. కేంద్రం పన్నులలో రాష్ట్రాల వాటా 14వ ఆర్థిక సంఘం పెంచిన తర్వాత కేంద్రం గ్రాంట్లను తగ్గించింది. అటువంటి పరిస్థితుల్లో పదివేల కోట్లు అమాంతంగా అదనంగా వస్తాయని చూపెట్టి అమలుచేయలేని, చేయాలన్న ఉద్దేశం లేని అనేక కార్యక్రమాలను ప్రకటించడం కేవలం బడ్జెట్‌ను అపహాస్యం చేయడమే అవుతుంది. అదేవిధంగా సొంత పన్నుల రాబడిలో కూడా పొంతన లేని పెరుగుదలను చూపెట్టుకు న్నారు. జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత ఒక మద్యం, పెట్రోల్ మీద తప్పితే మిగిలిన వాటిపై అమ్మకం పన్ను పెంచే అధికారం రాష్ట్రాలకు లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇంత అనూహ్యంగా రాబడి ఎక్కడి నుంచి వస్తుందని అంచనా వేశారో అర్థం కాకుండా ఉంది. ఇక అప్పుల విష యానికొస్తే 2017–18 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 86 వేల కోట్ల అప్పు, 2018–19 సంవత్సరంలో 39 వేల కోట్ల రూపాయల అప్పు చేయడం జరిగింది. దీనికి అదనంగా ఈ సంవత్సరం 17 శాతం వృద్ధితో 47 వేల కోట్ల రూపాయల అప్పులకు ప్రతిపాదించారు. రెవెన్యూ లోటు రెండు వేల కోట్ల రూపాయలుగా చూపెట్టినా అంచనా వేసిన రాబడి వాస్తవ విరుద్ధంగా ఉంది కాబట్టి ఇది చాలా పెరిగే అవకాశం ఉంది. 32 వేల కోట్లుగా అంచనా వేసిన ద్రవ్యలోటు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి దారుణం అన్నిటికీ మించి ప్రాథమిక లోటు 14, 570 కోట్లు. అంటే మనం తీసుకునే అప్పు వడ్డీలు కట్టగా కూడా ఇంకా 14,570 కోట్లు అప్పు ఉండి భవిష్యత్తులో ఇంకా రుణ భారం, వడ్డీ భారం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను క్రుంగ తీయబోతున్నాయి. 27 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న కేంద్ర బడ్జెట్లో ప్రాథమిక లోటు 39 వేల కోట్లు ఉంటే రెండు లక్షల 25 వేల కోట్ల బడ్జెట్ ఉన్న మన రాష్ట్రానికి ప్రాథమిక లోటు 14,570 కోట్లు ఉందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజారంజకంగా బడ్జెట్‌ను తయారు చేసుకోవడంలో ఎటువంటి తప్పులేదు. ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించటానికి ఎటువంటి విధి విధానాలు అవలంబిస్తే బాగుంటుందో ఆర్థిక శాస్త్రవేత్తలు కొన్ని సూచికలు స్థిరీకరించారు. వాటికి కొంత అటూఇటుగా కొన్ని సంవత్సరాలు బడ్జెట్‌ను రూపొందించి అమలు చేసే అవకాశం ఉంటుంది. అది ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి హాని చేయదు. కానీ ఆ సూచికలను పూర్తిగా ఉల్లంఘిస్తూ ఆచరణ సాధ్యం కాని వనరులు లేని ఖర్చు మాత్రమే చూపెడుతూ తయారుచేసిన బడ్జెట్ కేవలం భ్రమల భ్రాంతుల బడ్జెట్‌గా మిగిలిపోతుంది. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా. ఎవరి చేతి లోనూ మంత్ర దండాలు లేవు కదా. వ్యాసకర్త : ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ : iyrk45@gmail.com -
వెల్కమ్ బ్యాక్ సర్ : ఎంపీ కవిత
సాక్షి, న్యూఢిల్లీ : క్యాన్సర్ చికిత్స నిమిత్తం న్యూయార్క్ వెళ్లిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భారత్‌కు తిరిగి వచ్చారు. ఈ మేరకు ‘ఇంటికి తిరిగి రావడం సంతోషంగా ఉంది’ అని శనివారం ఆయన ట్వీట్ చేశారు. తొడ భాగంలో అరుదైన క్యాన్సర్ సోకడంతో గత నెల 13న వైద్య పరీక్షల కోసం జైట్లీ అమెరికా వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్నప్పటికీ సోషల్ మీడియాలో చురుగ్గానే ఉంటున్నారు. కాగా ఆయన స్థానంలో తాత్కాలిక ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన పీయూష్ గోయల్.. గత శుక్రవారం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా జైట్లీ అనారోగ్యం పాలవడం ఇదే మొదటిసారి కాదు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జైట్లీ బరువు తగ్గేందుకు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. అంతేకాదు గతేడాది మే 14న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో జైట్లీ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. ఇక జైట్లీ కోలుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ వెల్కమ్ బ్యాక్ సర్!! మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి’ అని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విటర్ వేదికగా ఆకాంక్షించారు. Welcome back sir !! Wish you good health !!! https://t.co/ow0jSPRZmU — Kavitha Kalvakuntla (@RaoKavitha) February 9, 2019 -
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి వీరు అనర్హులు!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం–కిసాన్) విధి విధానాలను కేంద్రం ప్రకటించింది. ఐదెకరాల్లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు రూ.6వేలు సాయంగా అందించేందుకు ఉద్దేశించిన పీఎం–కిసాన్ తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, పని చేస్తున్న/రిటైరైన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రస్తుత/మాజీ.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మునిసిపల్ మేయర్లు, జిల్లా పంచాయతీ అధ్యక్షులు ఈ పథకానికి అర్హులు కారు. గత ఏడాది ఆదాయ పన్ను చెల్లించిన వారిని కూడా అనర్హులుగా ప్రకటించింది. ఐదెకరాల్లోపు భూమి ఉన్నా కూడా.. కుటుంబంలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వృత్తి నిపుణులు (వైద్యులు, ఇంజినీర్లు, లాయర్లు, చార్టెర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టులు)ఉన్నా అర్హులు కారని తెలిపింది. ఈ పథకం కింద కేంద్రం రూ.75వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 31వ తేదీ లోపు మొదటి విడతగా బ్యాంకు ఖాతాల్లో జమచేయనుంది. రెండో విడతకు మాత్రం ఆధార్ కార్డును జత చేయాల్సి ఉంటుంది. -
పాలకుల నిర్లక్ష్యానికి చేనేత బలి
చేనేత రంగం భారత దేశంలోనే అనాది కాలంగా వస్తున్న వృత్తి. అనేక దశాబ్దాలలో ఈ రంగం అనేక మార్పులు చెంది, పరిణతి చెందుతూ తన ఉనికిని కాపాడుకుంటూ, వినియోగదారుల మన్ననలు పొందుతూ, ఇప్పటికి అనైతిక పోటీని ఎదుర్కొంటూ లక్షలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నది. ఒకప్పుడు వెలుగు వెలిగిన ఈ రంగం, 1990 దశాబ్ది చివరకు కష్టాలలో పడింది. ప్రపంచ వాణిజ్య ఏర్పాటు, అందులో భాగంగా సభ్య దేశాలు చేసుకున్న జౌళి, వస్త్రాల ఒప్పందం, తదనంతరం భారత ప్రభుత్వాలు తీసుకున్న విధాన నిర్ణయాలు చేనేత రంగానికి చేటు తీసుకు వచ్చినాయి. ఉపాధి పేరిట ఉపాధిని భక్షించే పాలక నిర్ణయాలు, చేనేత రంగాన్ని దెబ్బ తీసే పరిస్థితిని సృష్టిం చినాయి. రాజకీయ పార్టీలు, నాయకులూ, ఆయా ప్రభుత్వాలు హామీలు ఇస్తూనే, ఇంకొక పక్క అధికారం రాగానే, ఈ రంగాన్ని నిర్వీర్యం చేసే ఆధునిక జౌళి పరిశ్రమకు వత్తాసు పలుకుతూనే ఉన్నాయి. కుల రాజకీయాలు పెరుగుతున్న క్రమంలో, అనేక కులాలకు చెందిన చేనేత కుటుంబాలు ఒక ఓటు బ్యాంకుగా ఆయా రాజకీయ పార్టీలకు కనిపిం చలేదు. చేనేత వృత్తిని నమ్ముకుని, ఆయా రాష్ట్రాలలో గణనీయ సంఖ్యలో ఉన్న ఒకే కులస్తులు కొంత ఒత్తిడి చేయగల్గినా, ఎన్నికల తదనంతరం వారికిచ్చిన హామీలు గాలికి వదిలేసినారు. గత ఇరవై ఏళ్ల కాలంలో, అనేక మంది పద్మశాలీలు, ఇతర వృత్తులకు మళ్లడంతో, ‘చేనేత’ వృత్తికి రాజకీయ ప్రాధాన్యం మరింత తగ్గింది. ఈనాడు, అన్ని రాజకీయ పార్టీలలో చేనేత అనుబంధ విభాగాలు ఉన్నా, అవి ఆశించినంత మేర పార్టీ నిర్ణయాల మీద ప్రభావం చూపెట్టలేకపోతున్నాయి. ప్రధాన, జాతీయ పార్టీలలో చేనేత విభాగాలు ‘కుల’ రాజకీయాలకే పరిమితమయినాయి. గత పదిహేను ఏళ్లలో, కేంద్రంలో ఏ కూటమి అధికారంలో ఉన్నా, చేనేత రంగం ఆశి స్తున్న నిధుల కేటాయింపు పెరగలేదు. చేనేత రంగాన్ని పట్టించుకోలేదు. చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగాయి. 1997లో చేనేత రంగానికి ప్రణాళిక వ్యయం కేవలం రూ. 107 కోట్లే. ఈ రాజకీయ, పాలక నిర్లక్ష్యం ఫలితమే చేనేత కార్మికుల ఆత్మహత్యలు. రాజకీయంగా సాధించలేనిది, ఆత్మహత్యల ద్వారా తమ గోడు ప్రభుత్వానికి, ప్రపంచానికి వినిపించగలిగారు. ఫలితంగా 2012–13లో, చేనేత కేటాయింపు రుణమాఫీ పథకంతో కలిపి రూ.2,960 కోట్లకు పెరిగింది. చేనేత రుణ మాఫీ పథకం అమలు కాలేదు. అప్పులు పెరుగుతున్న తరుణంలో ఆదాయం పెరగక ఇబ్బందులూ పడుతున్న చేనేత కుటుంబాల మీద గోరు చుట్టు మీద రోకటి పోటు లాగ, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల సమస్యలు ఇంకా జటిలం అయినాయి. ఎన్నడూ లేని పన్నులు చేనేత మీద భారం విపరీతంగా పెంచాయి. చేనేత వస్త్రాల కొనుగోలు తగ్గిపోయింది. 2019–20 వోట్–అన్–అకౌంట్ బడ్జెట్లో చేనేతకు కేటాయించింది రూ. 456.80 కోట్లు. 2018–19లో కేటాయించింది రూ. 396.09 కోట్లు. 2017–18లో కేటాయించింది రూ. 604 కోట్లు, ఖర్చు చేసింది రూ. 468.98 కోట్లు. ఎన్నికల సమయంలో కూడా చేనేతకు కావాల్సిన నిధులు ఇవ్వలేదు. జీఎస్టీ మినహాయింపు గురించి బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావన కూడా లేదు. రుణ మాఫీ పథకానికి ఇచ్చిందే తక్కువ. దాన్ని కూడా పూర్తిగా ఖర్చు చేయలేదు. 95 శాతం చేనేత కుటుంబాలకు ఈ పథకం చేరనేలేదు. మళ్లీ రుణ మాఫీ ప్రకటించలేదు. చేనేత రంగంలోని కుటుంబాలు అప్పులతో కుదేలు అవుతున్న పరిస్థితులలో చేనేత రుణ మాఫీ 2019–20 బడ్జెట్లో ప్రకటించి ఉంటే చేనేత కార్మికులు సంతోషించేవారు. చేనేతపై వివక్ష ప్రభుత్వాలు మారినా కొనసాగుతూనే ఉంది. కేటాయింపులు ఎన్ని ఉన్నా, రాజకీయంగా పోరాడి సాధించుకున్నా, అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్ల ఈ పాటి కేటాయిం పులు సరిగ్గా ఖర్చు కాకపోవడం చేనేత రంగాన్ని పీడిస్తున్న పాలనాపరమైన అంశం. 2012–13లో రూ. 2,960 కోట్లు కేటాయిస్తే, రూ.793.28 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఎనిమిది సంవత్సరాల కాలంలో ఖర్చు వివరాలు గమనిస్తే కేటాయింపు కంటే ఖర్చు తక్కువగానే ఉంది. 2014 ఎన్నికలలో చేనేత రంగానికి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కానీ నాయకుడు కానీ ఆశ కలిపించలేదు. తెలుగు రాష్ట్రాలలో (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ) చేనేతలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. రాబోయే ఎన్నికలలో అనేక ప్రాంతాలలో బహుముఖ పోటి ఉన్న తరుణంలో చేనేతల మద్దతు చాలా అవసరం అవుతుంది. చేనేత మద్దతు కోరే నాయకులూ పార్టీలు ఈ రంగానికి మద్దతు ఇచ్చే హామీలు ఇచ్చి విశ్వాసం కలిగిస్తేనే వారికి కావాల్సిన ఓట్లు వస్తాయి. చివరిగా, సమగ్ర చేనేత అభివృద్ధి మా లక్ష్యం అని ప్రకటిస్తే చేనేత కుటుంబాలు సంపూర్ణ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. డి. నరసింహారెడ్డి వ్యాసకర్త ప్రముఖ ఆర్థికరంగ నిపుణులు -
కూ... చుక్‌చుక్ !
మహబూబ్‌నగర్: కేంద్రప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైల్వే కేటాయింపులకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు ఆశాజనకంగానే నిధులు ప్రకటించారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని రెండు ముఖ్యమైన ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించారు. మహబూబ్‌నగర్ – మునీరాబాద్ రైల్వే లైన్, సికింద్రాబాద్ – మహబూబ్‌నగర్ డబ్లింగ్ లైన్లకు ప్రకటించిన నిధులపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈ పనులు ఇప్పటికే కొనసాగుతుండగా.. ఈసారి కేటాయించనున్న నిధులతో పనుల్లో వేగం పెరగనుందని భావిస్తున్నారు. అయితే, ఈసారి బడ్జెట్లో కూడా గద్వాల – మాచర్ల రైల్వే లైన్ ప్రస్తావన లేకపోవడం మాత్రం నిరాశకు గురిచేసిందనే చెప్పాలి. అలాగే, ఆదర్శ రైల్వేస్టేషన్ల ప్రకటన, ఎస్కటేటర్ల ఏర్పాటు, ఆర్వోబీల నిర్మాణంపై ప్రకటన చేయకపోవడం గమనార్హం. మహబూబ్‌నగర్ డబ్లింగ్ దాదాపు రూ.728 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన సికింద్రాబాద్ – మహబూబ్‌నగర్ డబ్లింగ్ లైన్‌కు గత రెండేళ్ల నుంచి మెరుగైన నిధులు కేటాయిస్తున్నారు. గత ఏడాది బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించగా ఈసారి కూడా రూ.200 కోట్లు కేటాయించారు. ఈ రైల్వేలైన్ పనులు జిల్లా పరిధిలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉందానగర్ నుంచి ప్రారంభమైన డబ్లింగ్ రైల్వే పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రస్తుతం పనులు మహబూబ్‌నగర్ – దివిటిపల్లి మధ్య నడుస్తున్నాయి. తాజాగా కేటాయించిన నిధులతో పనుల్లో మరింత వేగం పెరుగుతుందని రైల్వే ప్రయాణీకులు భావిస్తున్నారు. మొత్తంగా ఏడాదిలోపు డబ్లింగ్ లైన్ పనులు పూర్తయ్యే అవకాశముందని చెబుతున్నారు. తగ్గనున్న దూరాభారం సికింద్రాబాద్ – మహబూబ్‌నగర్ డబ్లింగ్ లైన్ పనులు పూర్తయితే జిల్లా ప్రయాణికులకు వెసులుబాటు లభించనుంది. మహబూబ్‌నగర్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సికింద్రాబాద్‌కు ప్యాసింజర్ రైలులోనైతే 3 గంటలు, ఎక్స్ప్రెస్లోనైతే 2.30 గంటల సమయం పడుతోంది. అదే డబ్లింగ్ లైన్ పనులు పూర్తయితే గంట పాటు సమయం ఆదా అయ్యే అవకాశముంది. ఇంకా వాణిజ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నారు. మునీరాబాద్ లైన్ మహబూబ్‌నగర్ – మునీరాబాద్ రైల్వేలైన్‌ను 246 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. ఈ పనులకు 1997 – 98 బడ్జెట్లో ఆమోద ముద్ర లభించింది. రూ.645 కోట్ల వ్యయంతో ఈ రైల్వే పనులు చేపట్టగా తాజా బడ్జెట్లో రూ.275 కోట్లు కేటాయించారు. గత ఏడాది కూడా ఇంతేస్థాయిలో నిధులు కేటాయించడం విశేషం. ప్రస్తుతం ఈ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. జిల్లా పరిధిలో ఇప్పటివరకు 30 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. జిల్లాలోని కృష్ణాతోపాటు కర్నాటక రాష్ట్రం మునీరాబాద్ పరిధిలో పనులు పురోగతిలో ఉన్నాయి. అదే విధంగా జిల్లా రైల్వే పరిధిలోని ఆర్యూబీల నిర్మాణం కూడా పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సర్వేలకే పరిమితం గద్వాల – మాచర్ల రైల్వేలైన్ నిర్మాణం కోసం దా దాపు మూడు దశాబ్దాలుగా అటు ప్రజాప్రతినిధు లు ప్రయత్నాలు చేస్తుండగా.. ఇటు ప్రజలు ఏటే టా ఎదురుచూస్తూనే ఉన్నారు.కానీ ఇప్పటివరకు రైల్వేలైన్ నిర్మాణానికి ఆమోదమే లభించడం లేదు. దీని కోసం మూడు సార్లు సర్వే చేసినా రైల్వేలైన్ నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కాకపోవడం ఈ ప్రాంత ప్రయాణికులను ఆవేదనకు గురిచేస్తోంది. అలాగే, మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌ను ఆదర్శ స్టేషన్‌గా మార్చాలన్న డిమాండ్ కూడా మిగిలిపోయిందనే విమర్శలున్నాయి. అధిక నిధులు కేటాయించడం సంతోషం... ప్రస్తుత బడ్జెట్లో మునీరాబాద్– మహబూబ్‌నగర్ డబ్లింగ్ లైన్‌కు అధిక నిధులు కేటాయించడం సంతోషంగా ఉంది. ఈ నిధులతో లైన్ల నిర్మాణ పనులు మరింత చురుగ్గా జరిగే అవకాశం ఉంది. అలాగే, జిల్లా రైల్వేస్టేషన్లో లిఫ్ట్ ఎస్కలేటర్ ఏర్పాటు, జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట రైల్వే గేట్ వద్ద ఆర్ఓబీ నిర్మాణానికి కూడా నిధులు కేటాయించాలి. – మీర్జా జాకీర్బేగ్, రైల్వే కమ్యూటర్స్ ప్రతినిధి మహబూబ్‌నగర్ – దివిటిపల్లి మధ్య డబ్లింగ్ లైన్ నిర్మాణ పనులు మహబూబ్‌నగర్–మునీరాబాద్ రైల్వేలైన్ -
‘పీఎం–కిసాన్’ లబ్ధిదారుల్ని గుర్తించండి
న్యూఢిల్లీ: పీఎం–కిసాన్ పథకం కింద తొలి విడతలో రూ.2 వేలు పొందే చిన్న, సన్నకారు రైతులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. బడ్జెట్లో ప్రతిపాదించిన ఈ పథకానికి ఇప్పటికే రూ.20 వేల కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా మొత్తం 12 కోట్ల మంది రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారని అంచనా. ఈశాన్య రాష్ట్రాల్లో మినహా ఈ రైతు ప్యాకేజీ అమలులో పెద్దగా ఇబ్బందులేమీ రావని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. సాగుకు పెట్టుబడి సాయంపై వ్యవసాయ శాఖ చాలా రోజులుగా కసరత్తు చేస్తోందని, అదే ఉత్సాహంతో ఈ పథకాన్ని అమలుచేస్తామని తెలిపారు. రూపకల్పన కన్నా అమలుపరచడమే ఇందులో ప్రధానమని, చిన్న, సన్నకారు రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధను తాజా బడ్జెట్ ప్రతిబింబిస్తోందని అన్నారు. లబ్ధిదారుల్ని గుర్తించే ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శులు, వ్యవసాయ కార్యదర్శులకు ఈ నెల 1న లేఖలు పంపారని వెల్లడించారు. లబ్ధిదారుల పేరు, కులం తదితర వివరాల్ని సేకరించి స్థానిక గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులో ఉంచాలని లేఖలో సూచించారు. చాలా రాష్ట్రాల్లో భూ దస్త్రాల డిజిటలీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఫిబ్రవరి ఒకటి నాటికి భూ రికార్డుల్లో పేర్లు నమోదైన యజమానులే పీఎం–కిసాన్ పథకానికి అర్హులని రాజీవ్ కుమార్ తెలిపారు. ఏడాదికి రూ.6 వేలు అంటే చిన్న మొత్తమేమీ కాదని, ఆ డబ్బుతో పేద రైతులు ఎన్నో ఖర్చులు వెళ్లదీసుకోవచ్చని అన్నారు. చిక్కులు తప్పవు: నిపుణులు పథకం అమలులో న్యాయపర చిక్కులు తప్పవని వ్యవసాయ నిపుణుల విశ్లేషణ. యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ పథకానికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయని సీనియర్ న్యాయవాది ఎన్కే పొద్దార్ పేర్కొన్నారు. ఒకే సాగు భూమికి ఒకరి కన్నా ఎక్కువ మంది యజమానులు ఉండి, వారందరికీ రూ.6 వేల చొప్పున సాయం అందితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ పథకం కింద వెచ్చించే కోట్లాది రూపాయలు అనుత్పాదక వినియోగంలోకి వెళ్తాయని ఆర్థిక నిపుణుడు శశికాంత్ సిన్హా అన్నారు. -
ఇది నవభారత బడ్జెట్: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నవభారత నిర్మాణం కోసం ఉద్దేశించినట్లుగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. శనివారం ఇక్కడ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్‌లో తాజా కేంద్ర బడ్జెట్‌పై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. లక్ష్మణ్ మాట్లాడుతూ నోట్లరద్దు, జీఎస్టీ వల్ల కోటిమంది అదనంగా ఐటీ పరిధిలోకి వచ్చారని, ఆదాయపన్ను ద్వారా దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయలు సమకూరాయన్నారు. కోటి 53 లక్షల మంది పేదలకు సొంతింటి కల సాకారం చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు. డబుల్‌బెడ్ రూమ్ పథకం కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ ఎంపీ దత్తాత్రేయ మాట్లాడుతూ రక్షణ రంగానికి మొదటిసారిగా రూ.మూడు లక్షల కోట్ల భారీ కేటాయింపులు జరిగాయన్నారు. ఇది పీపుల్స్ బడ్జెట్ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మునుపెన్నడూలేని విధంగా ఐదేళ్లకోసారి జరిగే సర్వే ఇప్పుడు క్వార్టర్లీగా జరుగుతోందంటూ దాని లాభాలను వివరించారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌ను పీపుల్స్ బడ్జెట్‌గా అభివర్ణించారు. 33 కోట్ల కుటుంబాలకు ఈ బడ్జెట్ లాభదాయకంగా ఉందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ జనాకర్షణ, శాస్త్రీయత రెండూ సమపాళ్లలో ఉన్నాయని, ఇదొక ప్రాక్టికల్ బడ్జెట్ అని ప్రశంసించారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం తదితరులు పాల్గొన్నారు. -
మనమే ఆదర్శం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌తో రాష్ట్రానికి పెద్దగా ఒరిగిందేమీ లేదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయరంగాన్ని సుభిక్షం చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కేంద్రం కాపీ కొట్టిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ పనిని కూడా కేంద్రం సరిగా చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. రైతుబంధు తరహాలోనే కేంద్రం రైతులకు సరిపడా సాయం చేస్తే బాగుండేదని చెప్పారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారులు శనివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులతో బడ్జెట్‌పై ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే దిశగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరగాలని కేసీఆర్ ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధుల కేటాయింపు జరగాలని చెప్పారు. ఈ సందర్భంగా బడ్జెట్ రూపకల్పనపై పలు సూచనలు చేశారు. ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజలకు పలు హామీలు ఇచ్చామని, వాటి అమలుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఈ హామీల అమలు జరిగే విధంగా బడ్జెట్ రూపకల్పన జరగాలన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని.. వీటికి నిధుల కొరత లేకుండా బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, ఆర్ అండ్ బీ ఈఎన్సీలు గణపతి రెడ్డి, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇంకా మెరుగైన పథకం కావాలి ‘రైతుబంధు పథకం చాలా గొప్పది. రైతులకు నేరుగా సాయం చేసేలా మన పథకం ఉంది. మనం ఇచ్చే సాయం మరీ ఎక్కువ కాకున్నా రైతులకు ఊరట కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇదే పథకాన్ని కొత్తగా ప్రవేశపెట్టినట్లు చెబుతోంది. అయితే కేంద్రం ఇచ్చే సాయం తక్కువగా ఉంది. రైతులకు ఈ మొత్తం దేనికీ సరిపోదు. పెట్టుబడి సాయం విషయంలో కేంద్రం ఇప్పటికైనా ఇంకా మెరుగైన పథకం ప్రవేశపెట్టేలా యోచిస్తే బాగుంటుంది. కేంద్రం తరహాలోనే తెలంగాణ బడ్జెట్‌ను రూపొందించాలి. దీనిపై మరోసారి వివరంగా సమీక్షించుకుందాం. 15వ ఆర్థిక సంఘం రాష్ట్ర పర్యటనకు వస్తోంది. మన రాష్ట్రం ఎక్కువ నిధులు పొందేలా సమగ్ర నివేదిక రూపొంచాలి. దీనిపై దృష్టి పెట్టండి. గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా మన ప్రణాళిక ఉండాలి. వచ్చే ఐదేళ్లల్లో అన్ని గ్రామాల్లో మెరుగైన మౌలిక వసతులు ఉండాలి. బడ్జెట్ రూపకల్పనలో ఈ దిశగా చర్యలు తీసుకోవాలి’అని సీఎం అన్నారు. 18న ఆర్థిక సంఘం రాక 15వ ఆర్థిక సంఘం ఈ నెల 18న తెలంగాణకు రానుంది. మూడ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. మొదటి రెండ్రోజులు సీఎం కేసీఆర్‌తో, రాష్ట్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం కానుంది. 20న రాష్ట్రంలో పర్యటించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనుంది. మిషన్ భగీరథ పనులను పరిశీలించనుంది. ఆర్థిక సంఘం పర్యటన ముగిసిన తర్వాతే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం తరహాలోనే రాష్ట్రంలోనూ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. అప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. సాగుకు 25వేల కోట్లు! రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు ఈసారి కూడా గతేడాదిలాగే భారీగా బడ్జెట్ కేటాయింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టుల పనుల్లో ప్రస్తుత పురోగతి, వాటి ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుంటూ రూ.25 వేల కోట్ల బడ్జెట్‌ను సర్దుబాటు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. నీటిపారుదల శాఖ గతంలో పంపిన బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలించిన ఆర్థికశాఖ రూ.25 వేల కోట్లకు సీలింగ్ ఇచ్చింది. సాగునీటి ప్రాజెక్టులకు ఈ ఏడాది జనవరిలో నీటిపారుదల శాఖ రూ.26,700 కోట్లతో ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. చాలా ప్రాజెక్టుల పరిధిలో నెలకొన్న భూసేకరణ, సహాయ పునరావాస, అటవీ, పర్యావరణ సమస్యలు, గతేడాది పనుల పురోగతిని దృష్టిలో పెట్టుకొని ఈ మేర నిధులు అవసరమని తెలిపింది. దీనిపై ప్రాజెక్టుల వారీగా సమీక్ష జరిపిన అనంతరం రూ.25వేల కోట్ల బడ్జెట్‌కే ఆర్ధిక శాఖ సీలింగ్ ఇచ్చింది. ఇందులో రూ.1,316.13 కోట్లు నిర్వహణ పద్దుకై ప్రతిపాదించగా, మిగతా 23,683.87 కోట్లు ప్రగతి పద్దుకై ప్రతిపాదించారు. ప్రగతి పద్దు కింద ప్రతిపాదించిన నిధుల్లో రాష్ట్ర ప్రణాళిక కింద రూ.13,253.77 కోట్లు కేటాయించేలా ప్రతిపాదనలు సిధ్ధం కాగా.. మిగతా రూ.10,430.10కోట్లను ఇప్పటికే ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ద్వారా రుణాల రూపంలో తీసుకోవాలని ప్రతిపాదించారు. ఇక ప్రాజెక్టుల వారీగా చూస్తే అంతా ఊహిస్తున్నట్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు గరిష్టంగా రూ.5,988.10 కోట్లు కేటాయించాలని, సీతారామకు రూ.2,915కోట్లు, పాలమూరు–రంగారెడ్డికి రూ.2,732కోట్లు, మైనర్ ఇరిగేషన్‌కు రూ.1,601కోట్లు కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కాగా, సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్ బిల్లులు, బడ్జెట్ కేటాయింపులపై సీఎం కేసీఆర్ శనివారం బడ్జెట్‌పై సమీక్ష సందర్భంగా అధికారులతో చర్చించారు. వచ్చే బడ్జెట్లో రూ.25వేల కేటాయింపులకు ఓకే చెప్పినట్లుగా తెలిసింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు రుణాల ప్రక్రియను వేగిరం చేయాలని సూచించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. నేడు యాదాద్రికి సీఎం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదివారం యాదాద్రికి వెళ్లనున్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని యాదాద్రి ఆలయంలో జరుగుతున్న ఆలయ విస్తరణ పనులను అధికారులతో కలిసి పరిశీలించనున్నారు. అనంతరం అభి వృద్ధి పనులపై అధికారులతో సమీక్షించనున్నారు. కేసీఆర్ రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి యాదాద్రికి వెళ్తున్నారు. -
సాగు విడిచి సాము!
ఎన్నికలకు మూడు మాసాల ముందు ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్ లేదా ఓట్ ఆన్ అకౌంట్ (అనామతు పద్దు)పట్ల సాధారణంగా ఎవ్వరికీ ఆసక్తి ఉండదు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చే ప్రభుత్వం ప్రాధామ్యాలను బట్టి వార్షిక బడ్జెట్ ఉంటుంది కనుక అంతవరకూ జమాఖర్చుల తబ్శీళ్ళను తెలి యజేసి ఖర్చుకు ఆమోదం తీసుకోవడం ఆనవాయితీ. తాత్కాలిక బడ్జెట్లో తాత్కాలిక అంచనాలే ఉండాలి కానీ ఆర్థిక సంవత్సరం అంతటికీ వర్తించే ప్రతిపాదనలు చేయకూడదన్నది మొన్నటి దాకా ఆర్థికమంత్రులందరూ విధిగా పాటించిన నియమం. కానీ శుక్రవారంనాడు తాత్కాలిక ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ చేసింది రాజ్యాంగ స్పూర్తికి భిన్నమైనది. సంప్రదాయ ఉల్లంఘన. ఎన్డీఏ అధికారంలో కొనసాగితే ఎటువంటి ఆర్థికవిధానాలు అవలంబిస్తుందో సూచించడమే కాకుండా ఎన్నికలలో కొనసాగడానికి అవసరమైన తాయిలాలను ప్రజలకు విచ్చలవిడిగా పంచడానికి తాత్కాలిక బడ్జెట్‌ను ప్రధాని నరేంద్రమోదీ ఆదేశం మేరకు గోయల్ దుర్వినియోగం చేశారు. రాజ్యాంగధర్మానికి విరుద్ధంగా మోదీ సర్కార్ వ్యవహరించినప్పటికీ బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలించి విశ్లేషించడం అనివార్యం. అసంఘటిత రంగంలో పనిచేసిన కార్మికులకు పింఛన్లు ఇవ్వడానికీ, అంగన్వాడీ ఉద్యోగినుల ఆదాయం రెట్టింపు చేయడానికీ, ఆదా యంపన్ను లెక్కింపులో రిబేట్ స్థాయిని అయిదు లక్షల రూపాయలకు పెంచడానికీ, ఈఎస్ఐ వర్తించే ఉద్యోగుల జీతం పరిమితిని 15 నుంచి 21 వేలకు పెంచడానికీ, ఇటువంటివే అనేక ప్రయోజనాలు ఉద్యోగులకూ, ఇతర వర్గాలకూ కలిగించడానికీ చేసిన ప్రతిపాదనల విషయంలో ఎవ్వరికీ ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న వ్యవసాయ కుటుం బానికి ఏటా ఆరు వేల రూపాయల చొప్పున నగదు సహాయం చేసే ‘ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన’ను ఆర్థికమంత్రి ప్రకటించారు. వ్యవసాయ రుణం నేరుగా మాఫ్ చేయడం, రైతుకే నేరుగా నగదు బదిలీ చేసే కార్యక్రమం వంటివి పాలకులు చేస్తున్నారు. కానీ వ్యవసాయరంగాన్ని పట్టిపల్లార్చుతున్న, రైతులను కుంగదీస్తున్న మౌలికమైన సమస్యల పరిష్కారానికి చేయవలసింది చేయలేకపోతున్నారు. ఎన్నికలు సమీపించిన తరుణంలోనే రైతుల గురించి ఆలోచించడం, తాత్కాలిక ఉపశమనం కలిగించే ఉపాయాలను ఆశ్రయిం చడంతో బడుగు రైతుల బతుకులు తెల్లవారిపోతున్నాయి. ఆరువేల రూపా యలు సంవత్సరానికి సన్నకారు రైతుల ఖాతాలలో జమచేయడమే మహో పకారమంటూ మోదీని కీర్తించేవారికి చెప్పేది ఏమీ లేదు. ఏదో గట్టి మేలు చేసినట్టు ‘అబ్కీ బార్ చార్సౌ పార్’ (ఈ దెబ్బతో నాలుగు వందలకు మించి లోక్‌సభ స్థానాలు బీజేపీకి దక్కుతాయి) అంటూ సంబరం చేసుకునేవారికి నమస్కారం. ఏకపక్ష నిర్ణయాలు నిష్ప్రయోజనం నిజంగా వ్యవసాయం గిట్టుబాటు కావాలనీ, ఫలప్రదమైన, లాభదాయకమైన, గౌరవప్రదమైన వ్యాసంగం కావాలనీ కోరుకునేవారు రైతుల గోడు ఆలకించాలి. పాలకులకి తోచిన చర్యలు ఏకపక్షంగా ప్రకటించడం కాకుండా రైతులు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దాదాపు రెండు దశాబ్దాలుగా నేను అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకొని ఒక విన్నపం చేస్తూ వచ్చాను. వ్యవసాయసంక్షోభం పరిష్కారానికి మార్గం కనుక్కోవడం ఒక్కటే ఎజెండాగా పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించాలనీ, పార్లమెంటు సభ్యులూ, మంత్రిమండలి సభ్యులతో పాటు రైతు సంఘాల ప్రతినిధులూ, డాక్టర్ స్వామినాధన్ వంటి వ్యవసాయశాస్త్రజ్ఞులూ, ప్రవీణులూ, రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వేతర సంస్థల సభ్యులూ చర్చలో పాల్గొనాలనీ నా సూచన. ఈ చర్చలో ఇప్పటికే ఈ దిశగా చొరవ ప్రదర్శించిన తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్ ముఖ్యమంత్రులు కూడా పాల్గొనాలి. రెండేళ్ళ కిందటే ‘వైఎస్సార్ రైతు భరోసా’కింద ప్రతి రైతు కుటుంబానికి రూ. 12,500 ల వంతును ఆర్థిక సహాయం అందిస్తామంటూ ప్రకటించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి వంటి నాయకులను సైతం చర్చకు ఆహ్వానించి మాట్లాడించాలి. సంక్షోభానికి పరిష్కారం లభించేవరకూ, అది అందరికీ లేదా మెజారిటీ సభ్యులకు ఆమోదయోగ్యమని నిర్ధారించే వరకూ ఈ ప్రత్యేక సమావేశం ఎన్ని రోజులైనా కొనసాగాలి, శాశ్వత పరిష్కారం సాధించాలి. పార్టీల ప్రయోజనాలకూ, ఎన్నికలలో లాభనష్టాలకూ అతీతంగా వ్యవహరించి సమష్టిగా సమాలోచన జరిపితే కానీ దారి దొరకదు. హరితవిప్లవం తర్వాత ఏదీ పూనిక? ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా 1960లలో హరితవిప్లవ సాధనకోసం విశేషమైన ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత వ్యవసాయరంగంలో అనేక మార్పులు వచ్చాయి. 1950లలో, 60లలో ఆహారధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్థితి నుంచి ఇప్పుడు ఆహారధాన్యాలను ఎగుమతి చేసే స్థాయికి దేశం ఎదిగింది. ఆహారభద్రతపైన దృష్టి పెట్టామే కానీ రైతు సంక్షేమం పట్టిం చుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆహారాధాన్యాల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. ధరలు తగ్గిపోయాయి. అదే సమయంలో వ్యవసాయానికి పెట్టుబడి వ్యయం హెచ్చింది. రైతు కుదేలైనాడు. కుప్పకూలిపోయాడు. ఇంతవరకూ కోలుకోలేదు. ఆహారధాన్యాల కొరత లే నేలేదు. ప్రకృతి సహకరించి, వానలు పడితే పంటలు పుష్కలంగా పండుతున్నాయి. రైతుల జీవన ప్రమాణాలు మాత్రం దిగ జారుతున్నాయి. రైతు తెప్పరిల్లడానికి అనువైన పరిస్థితులు కల్పించడంలో ప్రభుత్వాలు వరుసగా విఫలమైనాయి. అరకొరగా అక్కడక్కడా కొన్ని ప్రయ త్నాలు జరగకపోలేదు. వాజపేయి హయాం (2003)లో చేసిన అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) యాక్ట్‌ను దృష్టిలో పెట్టుకొని అన్ని రాష్ట్రాలలో అదే పద్ధతిలో చట్టాలు చేసుకొని మార్కెటింగ్ వ్యవస్థను బలంగా నిర్మించి ఉంటే, జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలలోని కమిటీలనూ సమన్వయం చేసే వ్యవస్థను ఏర్పాటు చేసి ఉంటే ఆహారధాన్యాలకు గిట్టుబాటు ధర సాధించడానికి తగిన యంత్రాంగం ఉండేది. కేవలం 18 రాష్ట్రాలు మాత్రమే ఏపీఎంసీ చట్టాన్ని పురస్కరించుకొని చట్టాలు చేశాయి. తక్కిన రాష్ట్రాలు పట్టించుకోలేదు. మోదీ సర్కార్ ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన, ప్రధానమంత్రి కృషి సించాయీ యోజనా వంటి పథకాలు అమలు చేస్తున్నది. నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఏర్పాటు చేసింది. కానీ ఆశించిన ప్రయోజనం సిద్ధించడం లేదు. ప్రభుత్వ చర్యలు కొన్ని సందర్భాలలో రైతుకు శాపంగా పరిణమించే ప్రమాదం ఉన్నది. ద్రవ్యోల్బణం హద్దు మీరకుండా చూసే క్రమంలో ఆహారధాన్యాల మద్దతు ధరను తగినంత పెంచకుండా కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించింది. 1995 నుంచి 2016 వరకూ దేశ వ్యాప్తంగా 3,18,528 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలియజేసింది. 2016 నుంచి ఆ బ్యూరో తాజా వివరాలు నమోదు చేయకుండా, వెల్లడించకుండా ప్రభుత్వం కట్టడి చేసింది. ఈ కారణంగా దేశంలో రైతుల బలవన్మరణాల గురించి చర్చ జరగదు. సమస్య పరిష్కరించవలసింది పోయి సమస్య ప్రజల దృష్టికి రాకుండా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? 2022 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుందనీ, అప్పటికల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని సంకల్పించామనీ మోదీ చాలా సందర్భాలలో ప్రకటించారు. మొన్న పీయూష్ గోయల్ కూడా చెప్పారు. ఈ సంకల్పం నెరవేరాలంటే వ్యవ సాయరంగం 2017 నుంచి 2022 వరకూ సంవత్సరానికి 14 శాతం చొప్పున వృద్ధి చెందాలని వ్యవసాయరంగ ప్రవీణుడు అశోక్‌గులాటీ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్–ఐసీఆర్‌ఐఇఆర్–సభ్యుడు) చెప్పారు. పీయూష్ గోయల్ ప్రతిపాదనలో కౌలురైతు ప్రస్తావన లేదు. వ్యవసాయకూలీల ఊసు లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఈ రెండు వర్గాలనూ పట్టించుకోలేదు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వ్యవసాయ కుటుంబానికి లేదా కౌలు రైతు కుటుంబానికి సాలీనా రూ 10,000 నగదు సాయం చేస్తూ ఇల్లు లేని వ్యవసాయ కూలీలకు రూ.12,000 నగదు చెల్లించే ‘కాలియా పథకం’ అమలు చేస్తున్నారు. కౌలు రైతుకు నగదు బదిలీ చేస్తే భూమి యజమానికి అభద్రతాభావం ఏర్పడుతుందనీ, భూమిపైన హక్కు పోతుందనే భయం పీడిస్తుందనీ, అందువల్ల కౌలు రైతులకు ఆసరా ఇచ్చే అవకాశం లేదనీ తెలంగాణ ప్రభుత్వం వివరించింది. కానీ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్‌చంద్ నేతృత్వంలో భూమి కౌలును న్యాయబద్ధం చేయడానికి ఒక నమూనా శాసనాన్ని (మోడల్ ల్యాండ్ లీజింగ్ లా) రూపొందించింది. భూమి యజమానులకు భూమిపైన హక్కు పదిలంగా ఉంటూనే కౌలురైతుకు చట్టబద్ధంగా గుర్తింపు ఇవ్వడానికి ఉద్దేశించిన ఈ నమూనా అమలు చేసినట్లయితే కౌలు రైతుకు వ్యవస్థాగత రుణాలు అందు బాటులోకి వస్తాయి. సమాజంలో గుర్తింపు ఉంటుంది. భూమి సాగు చేసుకునే యజమానులూ, సాగు చేయకుండా కౌలుకు ఇచ్చే యజమానులూ (ఆబ్సెంటీ ల్యాండ్‌లార్డ్స్), కౌలు రైతులూ, వ్యవసాయకూలీలూ అంటూ నాలుగు రకాల వ్యక్తులు భూమిపైన ఆధారపడి ఉంటారు. భూమి యజమానులకు నగదు బదిలీ చేయడం కంటే కౌలు చెల్లిస్తూ, పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసేవారికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందడం న్యాయం. దున్నేవాడికే వెన్నుదన్నుగా ప్రభుత్వాలు నిలవాలి. ఈ ఉద్దేశంతోనే రమేశ్‌చంద్ నమూనా బిల్లును తయారు చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటే ఈ నమూనాను ఆధారం చేసుకొని కౌలు రైతులకు ఉపయోగపడే చట్టం చేసింది. బీజేపీ పాలనలో 19 రాష్ట్రాలు ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్ మినహా తక్కిన రాష్ట్రాలు దీన్ని పట్టించుకోకపోవడం ఆశ్చర్యం. న్యాయభావన పాలకులలో అంతంతమాత్రమే ఉన్నదనడానికి ఇది నిదర్శనం. వ్యవసాయశాఖ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నదో కూడా ఇది స్పష్టం చేస్తున్నది. వ్యవసాయ సంస్కరణల ఆవశ్యకత చిన్నచిన్న కమతాల వల్ల వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదనే అభిప్రాయం బలంగా ఉన్నది. సహకార వ్యవస్థలోకి సన్నకారు రైతులను తీసుకువచ్చే ప్రయత్నం చేయవచ్చు. భూసార కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఆరంభించి, కొన్ని రాష్ట్రాలలో అమలు చేసి ఆనక వదిలేసింది. దాన్ని అన్ని రాష్ట్రాలకూ విస్తరించి ఏ నేల సారం ఏమిటో, ఏ పంట పండుతుందో, ఏ పంట పండిస్తే రైతులకు లాభాలు వస్తాయో వివరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. వ్యవసాయ విస్తరణాధికారులు ఇది వరకూ ఈ పని చేసేవారు. మలేసియాకు చెందిన డాక్టర్ లిమ్సియోజిన్ పాతికేళ్ళుగా చేస్తున్న కృషిని గమనించాలి. అతడు డీఎక్స్ఎన్ అనే కంపెనీని నెలకొల్పి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించుకొని ఆహారపదార్థాలను తయారు చేసి 180 దేశాలలో విక్రయిస్తున్నాడు. ఇటీవలే తెలంగాణలో సిద్ధిపేట వ్యవసాయ క్షేత్రంలో సాగుకూ, వ్యవసాయ ఉత్పత్తులను ఉపయోగించి ఆహారపదార్థాలను తయారు చేసే యంత్రాల స్థాపనకూ ఆయన ఉపక్రమించాడు. మాజీ మంత్రి హరీష్‌రావు చొరవతో ఇది సాధ్యమైంది. తన కంపెనీకి ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అవసరమో లిమ్ చెబుతారు. ఆ ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. వాటిని ఉపయోగించి ఆహారపదార్థాలు తయారు చేసే ప్రాసెసింగ్‌లో అదే రైతు కుటుంబంలోని సభ్యులకు ఉద్యోగావకాశం ఉంటుంది. ఆ విధంగా తయారైన పదార్థాలను విక్రయించడం (మార్కెటింగ్) లోనూ రైతు కుటుంబానికి చెందిన మరో సభ్యుడు లేదా సభ్యురాలు పని చేయవచ్చు. ఇటువంటి వ్యవసాయాధార పరిశ్రమలను ప్రభుత్వాలు ప్రోత్సహించడం ద్వారా రైతు కుటుంబాలకు ఆదాయం సమకూర్చవచ్చు. గ్రామస్థాయిలోనే వ్యవసాయ పరిశ్రమలు నెల కొల్పి కుటీర పరిశ్రమలను ప్రోత్సహించి వ్యవసాయ పేదరికాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్న చైనా నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. పాలకులూ, సమాజం మనస్ఫూర్తిగా పట్టించుకోవలసిన సమస్య ఇది. గట్టిగా ప్రయత్నిస్తే పరిష్కరించడం అసాధ్యం కానేకాదు. సృజనాత్మకంగా ఆలోచించకుండా బడ్జెట్లలో అరకొర ప్రయోజనాలు విదిలించడం వల్ల పాలకులకు ఓట్లు వస్తా యేమో కానీ రైతుల బతుకులు బాగుపడవు. కె. రామచంద్రమూర్తి -
పింఛను పథకం ప్రచారాస్త్రమే!
సాక్షి, న్యూఢిల్లీ : అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల ప్రయోజనం కోసం కేంద్ర మంత్రి పియూష్ గోయల్ గురువారం పార్లమెంట్‌కు సమర్పించిన బడ్జెట్లో కొత్త పింఛను పథకాన్ని ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ పథకం కింద కార్మికులకు 60 ఏళ్ల నుంచి నెలకు మూడువేల రూపాయల చొప్పున పింఛను లభిస్తుంది. అందుకోసం 29 ఏళ్లు నిండిన కార్మికుడు నెలకు వంద రూపాయల చొప్పున, 18 ఏళ్లు నిండిన కార్మికుడయితే నెలకు 55 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని, దీనివల్ల పది కోట్ల మంది కార్మికులు ప్రయోజనం పొందుతారని పియూష్ గోయల్ తెలిపారు. పింఛను కోసం కనీసంగా ఎంతకాలం పాటు కార్మికుడు తనవంతు భాగాన్ని చెల్లిస్తూ పోవాలనే కాల పరిమితి ఈ పథకంలో ఎక్కడా లేకపోవడం ప్రధాన లోపంగా కనిపిస్తోంది. ఇది కొత్త పథకంగా మోదీ ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ 2015, మార్చిలో ప్రవేశ పెట్టిన ‘అటల్ పెన్షన్ యోజన’ పథకానికి మరో రూపమని తెలుస్తోంది. అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ పథకంలో నెలవారి పింఛన్‌ను కనీసంగా వెయ్యి రూపాయలు, గరిష్టంగా ఐదువేల రూపాయలుగా నిర్ణయించారు. పింఛను సొమ్ము ప్రాతిపదికన పింఛను పథకానికి లబ్దిదారుడు నెలవారిగా ఎంత చెల్లిస్తాడో అందులో యాభై శాతాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అలా కార్మికుడి పేరిట వెయ్యి రూపాయలు జమయ్యే వరకు ప్రభుత్వం తన వాటాను చెల్లించాల్సి ఉంటుంది. 2017, ఫిబ్రవరి నెల నాటికి ఈ అటల్ పెన్షన్ పథకం కింద లబ్దిదారులుగా నమోదయినది 42.8 లక్షల మంది కార్మికులు మాత్రమే. వీరిలో 48 శాతం మంది కనిష్ట పింఛను వెయ్యి రూపాయలను ఎంపిక చేసుకున్నట్లు ‘పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ’ తెలియజేసింది. ఈ పథకానికి మోదీ ప్రభుత్వం కూడా పెద్దగా ప్రచారం కల్పించలేదు. ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త పథకంలో అటల్ పథకాన్ని విలీనం చేస్తారా ? లేదా రెండింటిని కొనసాగిస్తారా? అన్న విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. ఈ పథకం కోసం 500 కోట్ల రూపాయలను కార్మికులు తమ వంతు వాటా చెల్లించే పింఛను పథకాలు యూరప్ దేశాల్లో విజయవంతం అయ్యాయిగానీ భారత్ లాంటి ఏ వర్ధమాన దేశాల్లో విజయవంతం కాలేదు. అందుకు కారణం దేశంలో కార్మికులకు చాలీ చాలని జీతాలు లభించడమే. ఎప్పుడో వచ్చే పింఛను కోసం, అసలు అప్పటికి బతికి ఉంటామో, లేదో అన్న సంశయంతో నెలకు వంద రూపాయలను చెల్లించలేని మనస్థత్వం కలిగిన వాళ్లు, ఆర్థిక స్థోమత లేనివాళ్లు భారత కార్మిక రంగంలో ఎక్కువ మంది. నెలకు 15 వేల రూపాయల లోపు జీతం అందుకునే కార్మికులకు మాత్రమే ఈ పింఛను పథకం వర్తించడం ఇక్కడ గమనార్హం. 60 ఏళ్ల వయస్సులో వచ్చే మూడు వేల రూపాయలు నెలవారి పన్ల పొడికి కూడా సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు ఈ పథకం వల్ల పది కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని ఎలా లెక్కలు వేశారో కేంద్రానికే తెలియాలి. అయినా ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన పథకానికి ప్రచారం కావాలిగానీ ప్రయోజనం సంగతి ప్రభుత్వానికి ఎందుకు? -
‘పుండు మీద కారం చల్లుతున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. బడ్జెట్లో తెలంగాణ ప్రయోజనాలను కాపాడంలో టీఆర్ఎస్ ఎంపీలు ఘోరంగా విఫలమైయ్యారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలకు జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కూడా సాధించలేకపోయారని మండిపడ్డారు. మిషన్ భగీరథ పథకానికి నిధులు, రైల్వే కోచ్, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని డిమాండ్ చేయడంలో టీఆర్ఎస్ దారుణంగా విఫలమైందని శ్రవణ్ వ్యాఖ్యానించారు. రైతుల ఓట్లును కొనేందుకు ఆరువేల ఇస్తామని చెప్తూ.. పుండు మీద కారం చల్లుతున్నారని శ్రవణ్ మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీకి టీఆర్ఎస్ పార్టీ కొమ్ము కాస్తోందని ఆయన ఆరోపించారు. ఆ రెండు పార్టీలు కలిసి తెలంగాణ ప్రజల నోళ్లలో మన్ను కొట్టాయని ధ్వజమెత్తారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోలేదని, ఆదాయపన్ను స్లాబులు మార్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని శ్రవణ్ అన్నారు. -
ఇది ‘గరిష్ట ప్రభుత్వం కనిష్ట పాలన’
సాక్షి, న్యూఢిల్లీ : ‘మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెస్ (కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన)’ అన్నది 2014లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇటు నరేంద్ర మోదీ అటు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ప్రధాన నినాదం. అలాగే ‘పేద ప్రజల జీవితాలను మెరగుపర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలకు ప్రత్యక్ష తార్కాణం. మేము అధికారంలోకి వస్తే సాంఘిక సంక్షేమ తాయిలాల జోలికి వెళ్లకుండా కొత్త ఉద్యోగాలను సష్టించడం ద్వారా, ఆర్థిక అవకాశాలను పెంచడం ద్వారా ప్రజల ప్రగతిని సాధిస్తాం’ అదే ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ విస్తతంగా చేసిన ప్రచారం. ‘కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన’ నినాదానికి కట్టుబడి నరేంద్ర మోదీ 2014, మే నెలలో కేవలం 45 మందితో కేంద్ర కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. అంతకుముందు మన్మోహన్ సింగ్ నేతత్వంలోని యూపీఏ ప్రభుత్వం కేబినెట్లో 71 మంది సభ్యులు ఉన్నారు. 2014, నవంబర్‌లో మోదీ తన కేబినెట్‌ను 66 మంది సభ్యులకు విస్తరించారు. ఆ తర్వాత 2016, జూలై నెలలో మోదీ తన కేబినెట్‌ను మరోసారి విస్తరించి 78 మంది సభ్యులకు చేర్చారు. అంటే మన్మోహన్ సింగ్ కేబినెట్ కన్నా ఏడుగురు సభ్యులు ఎక్కువ. ఈ లెక్కన ఆయన కనిష్ట ప్రభుత్వం అనే నినాదం కాలగర్భంలో కలిసి పోయింది. ఇక గరిష్ట పాలన గురించి చెప్పాలంటే ‘పెద్ద నోట్ల రద్దు’ నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నం చేశారు. కొత్త ఉద్యోగాలను సష్టించే మాట దేవుడెరుగు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కారణంగా ప్రైవేటు రంగంలో 86 లక్షల నుంచి కోటి ఉద్యోగాల వరకు ప్రజలు కోల్పోయారని పలు సర్వేలు ఇప్పటికే తేల్చాయి. ‘స్వచ్ భారత్’ లాంటి విస్తృత ప్రచార పథకం ఏమేరకు విజయం సాధించిందో ప్రజలకు తెల్సిందే. సాంఘిక సంక్షేమ కార్యక్రమాల జోలికి వెళ్లనన్న నరేంద్ర మోదీ 2016లో చాలా ఆర్భాటంగా ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ పథకాన్ని ప్రవేశ పెట్టారు. దారిద్య్ర దిగువనున్న పేద మహిళలకు ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి, సబ్సిడీపై సిలిండర్లను సరఫరా చేయడం ఈ పథకం ఉద్దేశం. మొదటిసారి సరఫరా చేసిన సిలిండర్ ఖర్చు కాగానే మెజారిటీ గ్యాస్ కనెక్షన్లన్నీ అటకెక్కాయి. ఖర్చుతో కూడిన గ్యాస్ కనెక్షకన్నా ఉచితంగా దొరికే వంట చెరకును పేద ప్రజలు ఆశ్రయించడం వల్ల ఈ పథకం 20 శాతం కూడా విజయం సాధించలేదు. అతిపెద్ద సాంఘిక సంక్షేమ కార్యక్రమంగా పేరుపొందిన జాతీయ గ్రామీణ పథకాన్ని అమలు చేయడంలో కూడా మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలం అవుతోంది. గతేడాది నవంబర్ 15 నాటి బకాయిలను తెలుగు రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాలకు ఇంతవరకు కేంద్రం విడుదల చేయలేదు. మోదీ ప్రభుత్వం శుక్రవారం నాడు పార్లమెంట్ సమావేశంలో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో కూడా ఎక్కువగా సాంఘిక సంక్షేమ తాయిలాలే ఉన్నాయి. రైతులకు ఏడాదికి ఆరువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం, అసంఘటిత రంగంలో నెలకు 15 వేల రూపాయలకు మించని వేతన జీవులకు నెలకు మూడు వేల రూపాయల పింఛను ఇస్తామనడం, వ్యక్తిగత ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని రెండున్నర లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచడం సంక్షేమ తాయిలాలు కావా? వీటి జోలికి వెల్లకుండా కొత్త ఉద్యోగాలను సష్టిస్తానన్న మోదీ, ఆ దిశగా బడ్జెట్లో ఒక్క చర్య కూడా తీసుకోలేదు. పైగా మూడు నెలల తాత్కాలిక బడ్జెట్ అంటూ పూర్తి బడ్జెట్‌ను సమర్పించడం ఎంతమేరకు సమంజసం. ‘కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన’ పూర్తిగా తిరగబడింది.