మధ్య తరగతికి.. మహా ఊరట!
ఇది..ముచ్చటగా 3 కోట్ల మందిపై ప్రధాని వేసిన సమ్మోహనాస్త్రం. ఏడాదికి 5 లక్షల రూపాయల్లోపు ఆదాయాన్ని ఆర్జించేవారు రూపాయి కూడా పన్ను కట్టక్కర్లేదు. వీరేకాదు.. రకరకాల మినహాయింపులు, ఇన్వెస్ట్‌మెంట్లను పరిగణనలోకి తీసుకుంటే రూ. 8–9 లక్షల వార్షికాదాయం ఉన్నవారు కూడా పైసా పన్ను కట్టకుండా తప్పించుకోవచ్చు. కాకపోతే ఏడాదికి దాదాపుగా రూ.10 లక్షలు, ఆపైన ఆర్జించేవారికి మాత్రం ఈ బడ్జెట్‌తో ఒరిగిందేమీ లేదు. అందుకే కావచ్చు.. ఈ ఏడాదికి తాము ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో ఈ వర్గాల గురించీ ఆలోచిస్తామన్నారు గోయల్.
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ ప్రధాని మోదీ మిడిల్ క్లాస్ వేతన జీవుల మనసు గెలిచే ప్రయత్నం చేశారు. పన్ను శ్లాబులను మార్చకుండా వారికి ఉపశమనం కల్పించారు. పన్ను చెల్లించాల్సిన ఆదాయం గనక రూ.5 లక్షలలోపు ఉంటే.. వారెలాంటి పొదుపులూ చేయకపోయినా పూర్తిగా పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఈ మేరకు సెక్షన్ 87ఏ కింద ఇస్తున్న రిబేటును రూ.2,500 నుంచి రూ.12,500కు పెంచుతూ బడ్జెట్లో నిర్ణయం తీసుకున్నారు. గతంలో సెక్షన్ 87ఏ రిబేటు పరిమితి రూ.3.50 లక్షలుండగా దీన్ని రూ.5 లక్షలకు పెంచారు. దీంతో రూ.5 లక్షలలోపు పన్ను ఆదాయం (ట్యాక్సబుల్ ఇన్‌కమ్) ఉన్నవారు ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి గోయల్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. గోయల్ ఈ నిర్ణయాన్ని ప్రకటించాక లోక్‌సభ కొన్ని నిమిషాల సేపు బీజేపీ కార్యవర్గ సమావేశం మాదిరిగా మారిపోయింది. ఎన్‌డీఏ ఎంపీలంతా మోదీ... మోదీ అంటూ సభను మార్మోగించారు.
ఈ రిబేటు పరిమితిని పెంచడం వల్ల 3 కోట్ల మంది ఉద్యోగులకు రూ.18,500 కోట్ల మేర పన్ను భారం తగ్గుతుందని గోయల్ ప్రకటించారు. అంతేకాదు సెక్షన్ 80సీ కింద లభించే రూ.1.5 లక్షల మినహాయింపు, ఇంటి రుణానికి చెల్లించే వడ్డీ, ఆరోగ్య బీమా ప్రీమియం వంటి ఇతర మినహాయింపులను పూర్తిగా వినియోగించుకుంటే రూ.9 లక్షల వార్షికాదాయం ఉన్న వారూ పన్ను కట్టక్కర్లేదు. అయితే ట్యాక్సబుల్ ఇన్‌కమ్ కనక రూ.5 లక్షలకన్నా రూపాయి దాటినా.. వారు మునుపటిలానే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గత నాలుగేళ్లుగా అమలు చేసిన సంస్క రణలు ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు వల్ల ఆదాయం పెరిగిందని, ఈ ప్రయోజనాన్ని తిరిగి వారికి అందించాలని ఉన్నా ఇది మధ్యంతర బడ్జెట్ కావడంతో వేతనజీవుల వరకు మాత్రమే పరిమితమవుతున్నామని గోయల్ స్పష్టం చేశారు.
బేసిక్ లిమిట్‌లో మార్పు లేదు...
బడ్జెట్ ప్రసంగంలో గోయల్ రూ.5 లక్షలలోపు వారికి ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరంలేదని ప్రకటించడంతో అందరూ ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచినట్లు భావించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం... పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవని, కేవలం సెక్షన్ 87 రిబేటు పరిమితిని రూ.3,50,000 నుంచి రూ.5,00,000 మాత్రమే పెంచామని, మును పటి శ్లాబులు యథాతథంగా కొనసాగుతాయని వివరణ ఇచ్చింది. సెక్షన్ 87ఏ పరిమితిని పెంచడం వల్ల పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ.5 లక్షలలోపు గనక ఉంటే... వారికి గరిష్టంగా రూ.12,500 ప్రయోజనం లభిస్తుంది. స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.40వేల నుంచి రూ.50వేలకు పెంచడం వల్ల రూ.2,080 నుంచి రూ.3,120 వరకు ప్రయోజనం లభించనుంది. ఈ రెండింటిని కలిపితే గరిష్టంగా రూ.15,000 వరకు ప్రయోజనం చేకూరనుంది.
రెండో ఇంటికీ ‘క్యాపిటల్’ గెయిన్స్
ఏదైనా ఇంటిని విక్రయించినపుడు వచ్చిన దీర్ఘకాలిక మూలధన పన్ను లాభాలను రెండు ఇళ్లకు వర్తింప చేస్తూ బడ్జెట్‌లో ప్రతిపాదన చేశారు. ప్రస్తుతం ఏదైనా ఒక ఇంటిని విక్రయించినపుడు దానిపై వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను చెల్లించాలి. ఒకవేళ ఈ పన్ను భారాన్ని తప్పించుకోవాలంటే ఈ లాభాలతో మరో ఇంటిని కొనుగోలు చేయవచ్చు. ఇంతకాలం ఇది కేవలం ఒక ఇంటి కొనుగోలుకే వర్తించేది. ఇప్పుడు దీన్ని రెండు ఇళ్లను కొనుగోలు చేయడానికి అనుమతించారు. ఈ విధంగా గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకూ వచ్చే మొత్తానికి దీర్ఘకాలిక మూలధన పన్ను లాభాలు వర్తిస్తాయి. కాకపోతే ఈ ప్రయోజనాన్ని జీవితంలో ఒకసారి మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంది. అదే విధంగా వేతన జీవులు ఉద్యోగార్థం ఒక ఇంటిలో ఉండి మరో ఇల్లు ఖాళీగా ఉంచినా దానిని ఊహాజనిత ఆదాయంగా లెక్కించి పన్ను కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు రెండో ఇంటిని ఊహాజనిత ఆదాయం నుంచి మినహాయించారు.
పెన్షన్‌దారులకు ఊరట
కేవలం వడ్డీనే ఆదాయంగా ఉన్న వారికి మోదీ సర్కార్ పెద్ద ఊరటనిచ్చింది. పోస్టాఫీసులు, బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన వాటిపై వచ్చే వడ్డీ ఆదాయంపై టీడీఎస్ (మూలం వద్ద ఆదాయ పన్ను) పరిమితిని 3 రెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఏడాదిలో వడ్డీ రూపంలో వచ్చే మొత్తం రూ.10,000 దాటితే టీడీఎస్ చెల్లించాల్సి వచ్చేది. ఒకవేళ టీడీఎస్ చెల్లించకూడదనుకుంటే... తమ మొత్తం ఆదాయం పన్ను పరిమితికి లోబడే ఉందని నిర్ధారిస్తూ బ్యాంకుకు డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ పరిమితిని రూ.40,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంటే రూ.40,000 దాటేదాకా ఎలాంటి టీడీఎస్ ఉండదు. డిక్లరేషన్ అవసరం లేదు. అదే విధంగా ఇంటి అద్దెల రూపంలో వసూలు చేసే మొత్తంపై కూడా టీడీఎస్ పరిమితిని పెంచారు. ఇప్పటి వరకు ఇంటద్దెల రూపంలో వచ్చే ఆదాయం ఏడాదికి రూ.1.80 లక్షలు దాటితే (నెలకు రూ.15వేలు) టీడీఎస్ చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.2.40 లక్షలకు (నెలకు రూ.20 వేలకు) పెంచారు.
Comments
Please login to add a commentAdd a comment