ఎన్నికల వేళ అన్ని వర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ప్రధాని నరేంద్రమోదీ పలు వర్గాలకు వరాలు ప్రకటించారు. రైతులకు ఆర్థిక సాయం, ఉద్యోగులకు ఆదాయపు పన్ను పరిమితి పెంపు, అసంఘటిత రంగ కార్మికులకు పింఛన్ వంటివి ఇందులో ముఖ్యమైనవి. బడ్జెట్ ప్రతిపాదనల వల్ల కొన్ని వర్గాలు లబ్ధి పొందుతాయని, మరికొన్ని నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
‘పది’ కోటాకు దక్కని కేటాయింపులు
అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవలే చట్టం తెచ్చిన ప్రభుత్వం.. ఆ మేరకు తాజా బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేయలేదు. పేదల కోటా అమలు చేయాలంటే విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో 25 శాతం సీట్లు పెంచాలి. లాబోరేటరీలు, లైబ్రరీలు అదనంగా కావాలని, టీచర్లు కూడా పెద్ద సంఖ్యలో అవసరమని నిపుణులు అంటున్నారు. బడ్జెట్‌లో ఉన్నత విద్యకు కేటాయించిన నిధులు వీటికి ఏ మాత్రం సరిపోవని స్పష్టం చేశారు. పది శాతం కోటా అమలు చేయాలంటే ఒక్క పంజాబ్ యూనివర్సిటీకే రూ.500 కోట్లు అవసరమని పేర్కొన్నారు. పది శాతం రిజర్వేషన్ వల్ల దేశ వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల సీట్లు పెరుగుతాయని పీయూష్ గోయల్ తన బడ్జెట్ ప్రసంగంలో సూచనప్రాయంగా చెప్పారు. ఉన్నత విద్యకు కేంద్రం బడ్జెట్‌లో రూ. 37,461.01 కోట్లు కేటాయించింది. గత ఏడాది కేటాయించిన 33,512.11 కోట్ల కంటే ఇది సుమారు 4 వేల కోట్లు ఎక్కువ. పది శాతం రిజర్వేషన్ల అమలుకు ఈ పెంపుదల సరిపోదనేది విద్యావేత్తల వాదన. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు 6,604.46 కోట్లు, యూజీసీకి రూ. 4,600 కోట్లు కేటాయించారు. ఇక సాంకేతిక విద్యకు కేటాయింపులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఐఐటీలకు రూ. 6,143.02 కోట్లు కేటాయించారు.
లాభపడేది..
రైతులు
ప్రధానమంత్రి సమ్మాన్ యోజన పేరుతో రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6,000 చొప్పున నేరుగా వారి ఖాతాల్లోకే బదిలీ చేస్తారు. మూడు విడతలుగా ఈ సాయం అందిస్తారు. ఈ పథకంతో దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం కలుగనుంది. ఎన్నికలకు ముందే వీరి ఖాతాల్లో మొదటి విడత రూ.2,000 సాయం జమ కానుంది.
పన్ను చెల్లింపుదారులు
ఆదాయపు పన్ను(ఐటీ) పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారు పన్ను చెల్లించనవసరం లేదు. రూ.6.5 లక్షల వార్షికాదాయం ఉన్నవారు కూడా ప్రావిడెంట్ ఫండ్, ఈక్విటీలలో పెట్టుబడులు పెడితే పన్ను పోటు నుంచి తప్పించుకోవచ్చు. దీనివల్ల 3 కోట్ల మంది ప్రయోజనం పొందుతారని అంచనా.
గ్రామీణ భారతం
పశు సంరక్షణ, మత్స్య రంగాలకు కేటాయింపులు పెంచడం, చిన్న, సన్నకారు వ్యాపారులకు వడ్డీ రాయితీ ఇవ్వడం వల్ల సంబంధిత కంపెనీలు గ్రామాలకు మళ్లే అవకాశం ఉంది. తద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి.
కార్మికులు
అసంఘటిత కార్మికులకు పింఛను పథకం వల్ల వచ్చే ఐదేళ్లలో 10 కోట్ల మంది లాభం పొందుతారని కేంద్రం అంచనా వేస్తోంది. రూ.15,000 లోపు నెలవారీ ఆదాయం గల కార్మికులకు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.3 వేల చొప్పున పింఛను ఇవ్వనున్నట్టు బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది.
రియల్ ఎస్టేట్
గృహ నిర్మాణ రంగానికి ఊతమిచ్చే చర్యలను బడ్జెట్‌లో పొందుపరచడంతో బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ సూచిక పైకెగిరింది. దేశంలో ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు సమకూరుస్తామని పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. ఇంటి అద్దెపై వడ్డీ పరిమితిని కూడా పెంచారు. ఆటోమొబైల్ రంగం కూడా లబ్ధి పొందనుంది. గోయల్ ప్రసంగం చేస్తుండగానే ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ ఇండెక్స్ 5.3 శాతం పెరిగింది.
ప్రధాని మోదీ
బడ్జెట్‌లో ప్రకటించిన రైతు సాయం, పింఛను పథకాలను ప్రధానమంత్రి పేరుతో రూపొందించారు. దీనివల్ల ప్రధాని నరేంద్ర మోదీ పరపతి ఎంతో కొంత పెరిగే అవకాశం ఉంది.
నష్టపోయేది...
బాండ్ హోల్డర్లు
ఈసారి ద్రవ్యలోటు 3.4 శాతం వరకు ఉంటుందని బడ్జెట్‌లో అంచనా వేశారు. దీనివల్ల మన క్రెడిట్ రేటింగ్ తగ్గే అవకాశం ఉంది. పైగా బడ్జెట్‌లో ఆదాయం పెంపునకు కొత్త పథకాలేమీ లేవని ప్రధాని మోదీ చెప్పారు. దీనివల్ల వివిధ రకాల బాండ్లు కొనేవారికి పెద్దగా లాభం ఉండదు.
ప్రతిపక్షాలు
బడ్జెట్‌లో ప్రకటించిన రాయితీలు, ప్రోత్సాహకాలు రైతులు, మధ్య తరగతి వారితోపాటు వ్యాపారులను కూడా ఆకర్షి స్తాయి. వీటి ప్రభావంతో అధికార పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడే వీలుంది. అది ప్రతిపక్షాలకు నష్టదాయకమే.
వ్యవసాయ కూలీలు/కౌలు రైతులు
మోదీ ప్రకటించిన రైతు సాయం భూయజమానులకే తప్ప కౌలు రైతులకు అందదు. దేశంలోని పంటలు సాగుచేస్తున్న వారిలో చాలామందికి సొంత భూమి లేదు. కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు.
రక్షణ రంగం
గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే పెంచారు. ఫలితంగా రక్షణ శాఖ ఆధునికీకరణ కష్టమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment