మోదీ సర్కార్‌ ఎలక్షన్‌ సినిమా.. నమో ఓటర్‌ | Highlights Of Union Budget 2019 | Sakshi
Sakshi News home page

మోదీ సర్కార్‌ ఎలక్షన్‌ సినిమా.. నమో ఓటర్‌

Published Sat, Feb 2 2019 3:19 AM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM

Highlights Of Union Budget 2019 - Sakshi

ఇదో విచిత్రమైన కొత్త సంప్రదాయం. బడ్జెట్‌ తేదీలనే కాదు.. తీరునూ మార్చేసింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. నాలుగున్నరేళ్లుగా ప్రవేశపెట్టడానికి ఇష్టపడని డ్రీమ్‌ బడ్జెట్‌ను.. మరో 3 నెలల్లో పదవీకాలం ముగుస్తుందనగా ముందుకు తెచ్చింది. ఎన్నికలే లక్ష్యంగా.. 25 కోట్ల మంది ఓటర్లే లక్ష్యంగా సమ్మోహనాస్త్రాలు సంధించింది. 12 కోట్ల మంది రైతులకు నేరుగా ఖాతాల్లో డబ్బులు వెయ్యటమే కాదు.. 3 కోట్ల మంది మధ్య తరగతి ఉద్యోగుల జేబులనూ నింపుతోంది. మరో 10 కోట్ల మంది అసంఘటిత కార్మికులపై పింఛన్‌ వల విసిరింది. నిజం చెప్పాలంటే... తీవ్రమైన నిరాశా నిస్పృహల్లో ఉన్న రైతాంగానికి ఎంత చేసినా తక్కువే. కాకుంటే ఎన్నికలు ఏప్రిల్‌లో ఉండగా... మార్చిలో ఖాతాల్లోకి డబ్బులు వేస్తామనటమే హర్షించడానికి మనస్కరించని విషయం. మూడు నెలల ఓటాన్‌ అకౌంట్‌ను ప్రవేశపెట్టే సంప్రదాయానికి గండికొట్టేసి... పూర్తి సంవత్సరానికి బడ్జెట్‌ పెట్టడమనేది ప్రజాస్వామ్యబద్ధమని మాత్రం చెప్పలేం. కార్మికుల పింఛను.. పన్ను రాయితీలు అన్నీ హర్షించదగ్గవే. కాకుంటే వీటిని గడిచిన ఐదు బడ్జెట్లలో ఎప్పుడు తెచ్చినా మరింత హర్షం వ్యక్తమయ్యేదేమో! 

2019 సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఓటర్లను ఆకట్టుకునేలా బడ్జెట్‌లో జిమ్మిక్కులు చేసింది. ఇటీవల మూడురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో ఆత్మరక్షణలో పడిన బీజేపీ.. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దేశ జనాభాలో ఎక్కువగా ఉన్న మధ్యతరగతి, రైతులు, అసంఘటిత రంగంలోని కార్మికులను లక్ష్యంగా చేసుకునే వ్యూహాత్మకంగా బడ్జెట్‌ను రూపొందించింది. మూడు నెలల్లో ప్రభుత్వం గడువు ముగుస్తున్నందున.. ఈ కాలపరిమితికే బడ్జెట్‌ ప్రవేశపెట్టాలి. కానీ, దుస్సంప్రదాయానికి తెరదీస్తూ.. ఆర్థిక మంత్రి పీయుష్‌ గోయల్‌ పూర్తిస్థాయి బడ్జెట్‌ను శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఐదు లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న వారికి పూర్తిగా పన్ను రిబేట్‌ ఇవ్వాలని బడ్జెట్‌లో నిర్ణయించారు. దీంతోపాటు చిన్న, సన్నకారు రైతులను ఆకట్టుకునేలా.. ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6వేలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు పదవీ విరమణ తర్వాత ఏటా రూ.3వేల పింఛను ఇచ్చే ప్రతిపాదనలను కూడా బడ్జెట్‌లో పేర్కొన్నారు. 

  • బడ్జెట్‌ మొత్తం- రూ.27,84,200 కోట్లు
  • రెవెన్యూ వసూళ్లు- రూ.19,77,693 కోట్లు
  • మూలధన వసూళ్లు- రూ.8,06,507 కోట్లు
  • మొత్తం వసూళ్లు- రూ.27,84,200 కోట్లు

  • 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు ఏటా ఇచ్చే ఆర్థిక సాయం- రూ.6,000
  • రూ. 5,00,000 ఆదాయం వరకు పన్ను లేదు, శ్లాబులు మార్చకుండా రిబేటు రూపంలో మినహాయింపు
  • 60ఏళ్లు దాటిన అసంఘటిత రంగ కార్మికులకు ప్రతి నెలా రూ. 3,000 పింఛన్‌
  • సెక్షన్‌ 87 రిబేటు రూ.2,500 నుంచి రూ.12,500కు పెంపు
  • రూ.40,000 నుంచి రూ.50,000కు పెరిగిన స్టాండర్డ్‌ డిడక్షన్‌
  • ఇకపై నెలకు రూ.40 వేలు వడ్డీ వచ్చినా టీడీఎస్‌ మినహాయించరు
  • ఇంటద్దెపై టీడీఎస్‌ పరిమితి రూ.1.8 లక్షల నుంచి రూ.2.40 లక్షలకు పెంపు
  • ఉద్యోగులకు రెండో ఇంటిపై అద్దె వస్తే దానికి పన్ను మినహాయింపు
  • రెండో ఇంటికీ వర్తించనున్న దీర్ఘకాలిక మూలధన పన్ను లాభాలు

 బ్రహ్మాస్త్రంగా ఆదాయపు పన్ను! 
ఏటా ఐదులక్షల్లోపు ఆదాయం ఉన్న మూడుకోట్ల మంది వేతనజీవులు, పింఛనర్లు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, చిరు వ్యాపారులను టాక్స్‌ చెల్లించే అవసరం లేకుండా ఆదాయపన్ను పరిమితిని పెంచారు. దీని ద్వారా ప్రతి ఒక్కరికీ రూ.13వేల వరకు లబ్ధిచేకూరనుంది.  ఈ నిర్ణయం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.18,500 కోట్ల ఆదాయం తగ్గుతుంది. స్టాండర్డ్‌ డిడక్షన్‌ను కూడా రూ.40 వేల నుంచి రూ.50వేలకు పెంచడం ద్వారా రూ.2,080 నుంచి రూ.3,588 వరకు మేలు (ఆదాయ స్థాయిల ఆధారంగా) జరగనుంది. బ్యాంకు వడ్డీలపై టీడీఎస్‌ మినహాయింపును రూ.10వేల నుంచి రూ.40వేలకు పెంచడం, గృహ ఆదాయ మినహాయింపును ఒక ఇంటి నుంచి రెండో ఇంటికి కూడా వర్తింపజేయడం, ఇంటి అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని రెండు వేర్వేరు ఆస్తులపై పెట్టుబడి పెట్టడం వంటివి బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయం విషయంలో కీలకంగా చెప్పుకోవాల్సిన అంశాలు.  

సన్నకారు రైతులపై దృష్టి 
దేశవ్యాప్తంగా 5 ఎకరాలకంటే తక్కువ భూములున్న 12కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చే ‘ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఈ రైతుల బ్యాంకు అకౌంట్లలోకి నేరుగా ఏటా రూ.6వేలను (నాలుగు నెలలకోసారి 3 దఫాలుగా రూ.2వేల చొప్పున) జమచేయనున్నట్లు బడ్జెట్‌లో పేర్కొంది. ఇందుకోసం ప్రభుత్వంపై ఏటా రూ.75వేల కోట్ల భారం పడనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకం అమల్లోకి వస్తుందని పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు. ఈ ఏడాది కోసం రూ.20వేల కోట్లను విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వ్యవసాయాదాయ మద్దతు పథకం ద్వారా నిర్దేశిత 3.3% ద్రవ్యవలోటును చేరుకోవడంలో ప్రభుత్వం వెనకబడింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో టార్గెట్‌గా పెట్టుకున్న 3.1% ద్రవ్యలోటును చేరుకోవడం కూడా కష్టంగానే మారనుంది. ప్రకృతి విపత్తుల ద్వారా నష్టపోయే రైతులకు 2% వడ్డీ ప్రభుత్వ సాయంగా అందిచేందుకు కూడా కేంద్రం ముందుకొచ్చింది. 

రూ.3వేల పింఛన్‌తో.. 
అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులపై వరాల జల్లు కురిపించింది. ప్రస్తుతం నెలకు రూ.100 కనీస చెల్లింపు ద్వారా 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3వేల పింఛను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ తాత్కాలిక బడ్జెట్‌ కేవలం ట్రయలర్‌ మాత్రమేనని.. లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశాన్ని సంక్షేమంగా మార్చేందుకు మరిన్ని పథకాలు తమ వద్ద ఉన్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అయితే రోజుకు 17 రూపాయలు ఇవ్వడం ద్వారా రైతులను అవమానించేలా ప్రభుత్వం వ్యవహరించిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఓట్ల కోసమే ఈ బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లుందని మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం విమర్శించారు. 
 
7% పెరిగిన రక్షణ బడ్జెట్‌ 
రక్షణరంగ బడ్జెట్‌ను రూ.3లక్షల కోట్లకు (గతేడాదితో పోలిస్తే 7% పెంపు) పెంచడం, ఎల్పీజీ సబ్సిడీ రూ.2.66 లక్షల కోట్ల నుంచి రూ.2.97 లక్షల కోట్లకు పెంచడం వంటివి కూడా బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.90వేల కోట్ల సేకరణ, ఆర్బీఐతోపాటు వివిధ బ్యాంకుల డివిడెండ్ల ద్వారా రూ.82,900కోట్ల ఆదాయం సమకూరిందని పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. ఆదాయపన్ను పరిమితి రూ.5లక్షలకు పెంచడమే ఈ బడ్జెట్‌ మొత్తానికి హైలైట్‌ అని పేర్కొన్నారు. ‘సంప్రదాయం ప్రకారం పూర్తిస్థాయి బడ్జెట్‌లో పన్నుల మినహాయింపుల గురించి ప్రస్తావించాలి. కానీ మధ్యతరగతి, వేతనజీవులు, పింఛనర్లు, సీనియర్‌ సిటిజన్లలో ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఆశలు, ఆకాంక్షలతో ఎదురుచూస్తున్న వారిని.. పూర్తిస్థాయి బడ్జెట్‌ వరకు వేచి ఉంచకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం’అని గోయల్‌ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో దేశాభివృద్ధికి ఇప్పటికే ఎన్డీయే ప్రభుత్వం పునాదులు వేసిందని.. దేశ ఆర్థిక వ్యవస్థను వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లే లక్ష్యంతో దూసుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.   

ఇది ట్రైలర్‌ మాత్రమే... 
మధ్యంతర బడ్జెట్‌ అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా ఉంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత భారత్‌ పురోభివృద్ధికి ఏయే అంశాలు దోహదం చేస్తాయన్నదానికి ఈ బడ్జెట్‌ ట్రైలర్‌ మాత్రమే. ఈ బడ్జెట్‌తో 12 కోట్లకుపైగా రైతు కుటుంబాలు, అసంఘటిత రంగంలో ఉన్న 30–40 కోట్ల మంది కార్మికులు లబ్ధి పొందుతారు. 
– ప్రధాని నరేంద్ర మోదీ

రోజుకు 17 రూపాయలా.. 
రైతులకు ఏటా రూ.6,000 ఇస్తామని గోయల్‌ ప్రకటించారు. గత ఐదేళ్లలో మీ చేతకానితనంతో రైతుల జీవితాలు నాశనమైపోయాయి. రైతులకు ఏటా రూ.6 వేలు అంటే రోజుకు రూ.16.44 ఇస్తామని చెప్పడం అవమానించడమే. 2 నెలల్లో రఫేల్‌ ఒప్పందం, ఉద్యోగాలు, నోట్ల రద్దులో మోదీపై సర్జికల్‌ స్ట్రైక్‌ జరుగుతుంది. 
 – రాహుల్‌ గాంధీ 


పార్లమెంటు ప్రాంగణంలో బడ్జెట్‌ ప్రతులను తనిఖీ చేస్తున్న భద్రతా సిబ్బంది 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement