సాక్షి వనపర్తి : కేంద్ర ప్రభుత్వం రైతులకు గుర్తుండిపోయేలా వరమిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం తరహాలోనే సమ్మాన్ నిధి పేరుతో రెండు హెక్టార్లు (5 ఎకరాలు) ఉన్న రైతులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6వేలు అందిస్తామని పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా ఉన్న సన్న, చిన్న కారు రైతులకు ఎంతో మేలు జరగనుంది.
రైతులకు మేలుచేసే బడ్జెట్
పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రి పీయుష్ గోయల్ శుక్రవారం ఉదయం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టినవిషయం విధితమే. ఈ బడ్జెట్ ఇన్నాళ్లూ సంక్షోభంలో కొట్టుమిట్టాడిన రైతాంగానికి ఊరటనిచ్చింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం పేరుతో ఎకరానికి రూ.4వేల చొప్పున ఏడాదికి రూ.8వేలు అందిస్తోంది. మరో అడుగు ముందుకేస్తూ ఏడాదికి ఎకరానికి రూ.10 వేలు అందిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ఈ పథకం తరహాలోనే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చివరి బడ్జెట్‌లో 2 హెక్టార్ల లోపు అంటే 5 ఎకరాల లోపు భూమి ఉన్న సన్న, చిన్న కారు రైతులకు మాత్రమే ఏడాదికి మూడు పర్యాయాలు రెండు ఎకరాల చొప్పున మొత్తం రూ.6 వేలు అందిస్తామని ప్రకటించింది.
రైతుబంధు స్ఫూర్తితో..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కేంద్రం దృష్టిని ఆకర్షించింది. ఈ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వారివారి రాష్ట్రాల్లో ఈ తరహా పథకాలను ప్రవేశపెడతామని ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు ఇదే అంశంపై మాట్లాడారు. రైతుబంధు పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం భారీ మెజార్టీతో మరోసారి అధికారంలోకి రావడంలో రైతుబంధు పథకం కీలకంగా మారింది. దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా అధిక శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ రంగం పైనే ఆధారపడ్డారు.
కిసాన్‌కు సమ్మాన్
ఎన్నికల ముందు ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు రైతులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేయడం సర్వసాధారణం. అదే తరహాలో కేంద్ర ప్రభుత్వం రైతుల మద్దతు పొందడానికి పార్లమెంట్ ఎన్నికలకు ముందు ‘కిసాన్ సమ్మాన్ నిధి’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. కేవలం 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులందరికీ ఈ పథకం వర్తించనుంది. ఎకరానికి రూ.6 చొప్పున సంవత్సరంలో మూడు పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది.
ఐదు ఎకరాలున్నవారికే..
భూ రికార్డుల ప్రక్షాళన ప్రకారం జిల్లాలో 1,52,621 మంది రైతులు ఉన్నారు. ఖరీఫ్ సీజన్‌లో 1,21,839 మంది రైతులకు ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున రూ.125 కోట్ల 16 లక్షలను పంపిణీ చేశారు. అదే రబీ సీజన్‌లో 1,07,528 మంది రైతులకు రూ.117 కోట్ల 51 లక్షల 66 వేలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇదిలాఉండగా జిల్లాలో ఒక హెక్టారు లోపు భూమి ఉన్న రైతులు 85,944 , రెండు హెక్టార్ల లోపు ఉన్న రైతులు 31,474 మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ పథకానికి 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులే అర్హులుగా ప్రకటించగా నిజానికి జిల్లాలో 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులే అధికంగా ఉన్నారు. 4 హెక్టార్లలోపు భూమి ఉన్న వారు 15,557 మంది, 10 హెక్టార్ల లోపు ఉన్న వారు 4,002 మంది, 10 హెక్టార్ల కంటే అధికంగా ఉన్న వారు 350 మంది ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకంలో భూమి కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి పెట్టుబడి సాయం అందుతోంది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో..
జిల్లాలో ఒక హెక్టారు భూమి ఉన్న రైతులు 1,42,416 మంది ఉన్నారు. అలాగే రెండు హెక్టార్ల భూమి ఉన్న రైతులు 67,658 మంది ఉన్నారు. అదేవిధంగా 4 హెక్టార్ల లోపు భూమి ఉన్న రైతుల 33,672 , 4 నుంచి 10 హెక్టార్లలోపు 8563 మంది, 10 హెక్టార్లకు మించి భూమి కలిగి ఉన్న వారు 841 మంది రైతులు ఉన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో...
ఒక హెక్టారు 1,80,328, రెండు హెక్టార్లు ఉన్న రైతులు 77,611 మంది, 4 హెక్టార్ల లోపు భూమి ఉన్న రైతులు 38,264, 4 నుంచి 10 హెక్టార్లలోపు 11,618, 10 హెక్టార్లకు పైగా ఉన్న వారు 1263 మంది ఉన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో..
ఈ జిల్లాలో ఒక హెక్టారు ఉన్న రైతులు 76,414 మంది, రెండు హెక్టార్లు ఉన్న రైతులు 39,038 మంది ఉన్నారు. అలాగే నాలుగు హెక్టార్ల లోపున్నవారు 20,267 మంది, 4 నుంచి 10 హెక్టార్లలోపు 6,026, 10 హెక్టార్లకు మించి భూమి కలిగి ఉన్న వారు 620 మంది రైతులు ఉన్నారు.
కిసాన్.. ముస్కాన్
Published Sat, Feb 2 2019 7:50 AM | Last Updated on Sat, Feb 2 2019 7:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment