farmer markets
-
కంది రైతుల.. రంధి!
సాక్షి, హైదరాబాద్ : కంది రైతుకు కష్టాలు వచ్చిపడ్డాయి. మద్దతు ధరకు కందులు విక్రయించాలని భావిం చినా మార్క్‌ఫెడ్ అధికారుల తీరుతో అదిసాధ్యం కావట్లేదు. మార్క్‌ఫెడ్ అధికారులు కొర్రీలు పెడుతూ రైతులను రాచిరంపాన పెడుతున్నారన్న విమర్శలున్నాయి. దళారులను చేరదీసి వారినుంచి అక్రమం గా కందులు కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రైతులకు సహకరించాలని, కంది రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా మార్క్‌ఫెడ్ అధికారు లు మాత్రం సాకులు చెబుతూ రైతు పండిం చిన కందిని కొనుగోలు చేసేందుకు ముందుకు రావట్లేదు. మరోవైపు అమ్మిన కందులకు డబ్బు లివ్వడంలోనూ మార్క్‌ఫెడ్ విఫలమవుతోంది. నాఫెడ్ నుంచి సొమ్ము రాబట్టలేకపోతోంది. ఆన్లైన్లో పేరు లేకుంటే కొనరా? వ్యవసాయ శాఖ గతేడాది ఎవరెవరు ఏ పంటలు పండించారన్న సమాచారం సేకరించింది. ఐతే ఆ లెక్కలు చాలావరకు కాకిలెక్కలా అన్న అనుమానాలు ప్రస్తుత పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. ఆ లెక్కలను ఆన్లైన్లో ఎక్కించారు. కందులు పం డించిన రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చాక, ఆన్లైన్లో వారి పేరుతో కంది పం డించారా లేదా పరిశీలిస్తారు. అయితే పోర్టల్‌లో ఆ రైతు వేరే పంట పండిం చారని ఉంటే, వెంటనే ఆ రైతును వెనక్కి పంపుతున్నారు. పోర్టల్‌లో పత్తి పండించినట్లుందని, కంది లేదని, కాబట్టి కందులు కొనుగోలు చేయబోమని చెప్పేస్తున్నారు. దీంతో రైతులు దళారులకు విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా సగం మంది రైతుల పేర్లు కంది పండించినట్లుగా లేకపోవడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. దీనిపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. అధికారుల జులుం.. మార్కెట్లో దళారులు క్వింటాలుకు రూ.4వేల నుంచి రూ.5 వేల కంటే ఎక్కువకు కొనట్లేరు. అటు మార్క్‌ఫెడ్ తీసుకోక, ఇటు దళారులు తక్కువ ధరకు అడుగుతుండటంతో కంది రైతు కన్నీరు పెడుతున్నాడు. పైగా ‘ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో’అని మార్క్‌ఫెడ్ అధికారులు జులూం ప్రదర్శిస్తున్నారని కొందరు రైతులు వాపోతున్నారు. పలువురు రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకాలు చూపించినా, కంది పంటను సాగుచేసినట్లు అధికారుల ద్వారా ధ్రువీకరణ పత్రాలు తెచ్చినా మార్క్‌ఫెడ్ అధికారులు ససేమిరా అంటున్నారు. ఒకవేళ ఆన్లైన్ పోర్టల్‌లో సంబంధిత రైతు కంది పండించినట్లు పేరున్నా, అతను పండించినంతా కొనట్లేదు. తమకు కేంద్రం నిర్దేశించిన కోటా ప్రకారమే కొంటున్నామని, అంతా కొనలేమంటూ తేల్చేస్తున్నారు. ఆన్లైన్ సమస్యపై పలువురు ఎమ్మెల్యేలు, ఓ మంత్రి స్వయంగా ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. సొమ్ము ఎప్పుడిస్తారో? రాష్ట్రంలో ఈసారి 2.07 లక్షల మెట్రిక్ టన్నుల కంది దిగుబడి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో కేంద్రం 47,500 మెట్రిక్ టన్నులు మాత్రమే మద్దతు ధరకు కొంటామని తేల్చిచెప్పింది. ఇంకా 56 వేల మెట్రిక్ టన్నులు కొనాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుసార్లు విజ్ఞప్తి చేసింది. కానీ ఇప్పటివరకు కేంద్రం నుంచి అనుమతి రాలేదు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్రం కొనుగోలు చేసేది 47,500 మెట్రిక్ టన్నులు మాత్రమే. మిగిలిన దాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా తాము కొంటామని ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇంకా అధికారికంగా నిర్ణయం ప్రకటించలేదు. అయితే మార్క్‌ఫెడ్ ఇప్పటివరకు 44,833 మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేసింది. వాటి విలువ రూ.260.04 కోట్లు. కానీ ఇప్పటివరకు రైతులకు రూ.29.69 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.230.35 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీంతో రైతులు మార్క్‌ఫెడ్‌కు అమ్ముకున్నా సకాలంలో సొమ్ము రాకపోవడంతో దళారులను ఆశ్రయిస్తున్నారు. దళారులు రైతుల నుంచి రూ.4 వేల నుంచి రూ.5 వేల మధ్య కొనుగోలు చేస్తున్నారు. అదే దళారులు అనేకచోట్ల రైతుల నుంచి కొన్న కందులను మార్క్‌ఫెడ్‌కు మద్దతు ధర కింద రూ.5,800కు విక్రయిస్తున్నారు. దీనికి మార్క్‌ఫెడ్‌లో కొందరు అధికారులు కూడా సహకరిస్తున్నారన్న విమర్శలున్నాయి. అందుకోసం కమీషన్ల రూపంలో దళారుల ఉంచి ముడుపులు వస్తున్నాయి. రైతును అడ్డం పెట్టుకొని అటు దళారి, ఇటు కొందరు మార్క్‌ఫెడ్ అధికారులు సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. తిప్పి పంపేశారు: బాజా నాగేశ్వర్రావు, సింగారెడ్డిపాలెం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా మూడు ఎకరాల్లో పత్తి పంటలో అంతర్ పంటగా కంది వేశాను. దాదాపు 13 క్వింటాళ్ల కంది దిగుబడి వచ్చింది. వీటిని విక్రయించేందుకు 15 రోజుల క్రితం మార్కెట్ యార్డులోని కంది కొనుగోలు కేంద్రానికి వెళ్లాను. ఆన్లైన్లో నా పేరు లేదని, తిప్పి పంపారు. ఒకవేళ ఆన్లైన్లో పేరు నమోదైనా రెండున్నర క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో ఏమీ చేయలేక దళారులకు విక్రయించాలని నిర్ణయించుకున్నాను. కొనుగోళ్లు నిలిపివేశారు: బెండే లక్ష్మణ్, వడ్డాడి గ్రామం, తాంసి మండలం, ఆదిలాబాద్ జిల్లా 4 ఎకరాల్లో పత్తి, కంది పంట సాగుచేశాను. కంది పంట 10 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. తాంసి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కోనుగోలు కేంద్రంలో విక్రయిద్దామనుకుంటే రెండు రోజులే కోనుగోలు చేసి నిలిపేశారు. మళ్లీ ఎప్పుడు కోనుగోలు కేంద్రాలను తెరుస్తారో చెప్పట్లేదు. దళారులకు అమ్ముకుందామంటే తక్కువ ధరకు అడుగుతున్నారు. జాబితాలో పేరు లేదని కొనట్లేదు: ఎం.రాంరెడ్డి, రైతు, మల్లారెడ్డిగూడ, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా ఈ ఏడాది 5 ఎకరాల్లో కంది పంట సాగు చేశాను. కందులు అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రానికి వస్తే ఆన్లైన్ జాబితాలో కంది సాగు చేసినట్లు పేరు లేదని అధికారులు చెప్పారు. నీ కందులు ఇక్కడ కొనలేమని అంటున్నారు. నేను కంది సాగు చేస్తే నాపేరు లేకపోవడమేంటి? ఎవరు రాశారని అడిగితే వ్యవసాధికారులు ఇచ్చిన జాబితా మా దగ్గర ఉందంటున్నారు. ఇందులో పేర్లు ఉంటేనే కొనాలని మాకు అదేశాలు ఉన్నాయని చెబుతున్నారు. రైతును ఇబ్బంది పెడితే ఎలా?: కె.క్రిష్ణారెడ్డి, రైతు, చేవెళ్ల గ్రామం, రంగారెడ్డి జిల్లా 10 ఎకరాల్లో కంది పంట సాగు చేశాను. దాదాపు 20 క్వింటాళ్లకు పైగానే దిగుబడి వచ్చింది. కానీ నా పేరు జాబితాలో లేదని కొనలేమని చెబుతున్నారు. నేను వేసిన కంది పంట పొలం చూపిస్తాను.. వచ్చి చూసుకోవాలని చెప్పాను. కంది పంట వేయకపోతే అభ్యంతరం చెప్పాలి కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులను ఇబ్బంది పెడితే ఎలా? రైతుల పేర్లు లేకపోతే ఈ కొనుగోలు కేంద్రం ఎందుకు పెట్టారు.. తీసేయండి. అధికారులకు నాయకులకు రైతుల ఇబ్బందులు కనిపించటం లేదా? ఆన్లైన్ సమస్య వాస్తవమే: చంద్రశేఖర్, మార్క్‌ఫెడ్ ప్రొక్యూర్మెంట్ అధికారి, హైదరాబాద్ ఆన్లైన్లో రైతుల పేర్లు లేకపోవడంతో సమస్య ఉంది. దీన్ని ఎలా పరిష్కరించాలన్న విషయంపై ప్రభుత్వానికి విన్నవించాం. మరోవైపు రైతుల నుంచి రూ.260 కోట్ల విలువైన కందులను కొనుగోలు చేశాం. వారికి ఇప్పటివరకు రూ.29.69 కోట్లు మాత్రమే ఇచ్చాం. ఇంకా నాఫెడ్ నుంచి రావాల్సి ఉంది. కేంద్రం పరిమితి విధించడంతో ఇప్పటికే దాదాపు 10 జిల్లాల్లో వారి కోటా పూర్తయింది. మిగిలినది కొనాలంటే కేంద్రం నుంచి అనుమతి రావాలి. అందుకోసం మరో 56 వేల మెట్రిక్ టన్నులు కొనాలని ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. -
పంట రుణం రూ.1,500 కోట్లు
జిల్లాలోని రైతులకు ఈ ఏడాది రూ.1,500 కోట్ల పంట రుణాలు అందనున్నాయి. బ్యాంకర్లు ఈ మేరకు 2019–20 వ్యవసాయ రుణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఏటా జూన్ మాసంలో లీడ్ బ్యాంకు వ్యవసాయ రుణ ప్రణాళికను రూపొందిస్తుంది. ఇందుకు అనుగుణంగా ఆయా బ్యాంకులు రైతులకు ఖరీఫ్, రబీ రుణాలు పంపిణీ చేస్తాయి. లీడ్ బ్యాంకు అధికారుల సమాచారం మేరకు.. ఈ ఏడాది ఖరీఫ్, రబీలో రుణాల పంపిణీ కోసం లీడ్ బ్యాంకు రూ.1,500 కోట్లతో రుణ ప్రణాళిక రెడీ చేసినట్లు తెలిసింది. కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ అధ్యక్షతన 21న జిల్లా బ్యాంకర్ల సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో వ్యవసాయ రుణ ప్రణాళికను బ్యాంకర్లు ఆమోదించనున్నారు. బ్యాంకర్ల సమావేశం నిర్వహణ కోసం లీడ్ బ్యాంకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవైపు వ్యవసాయ రుణ ప్రణాళిక ప్రతులను రెడీ చేస్తూనే మరోవైపు సమావేశానికి రాష్ట్రస్థాయి, జిల్లాలోని బ్యాంకు అధికారులు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. సాక్షి, వికారాబాద్: వ్యవసాయ రుణ ప్రణాళికను అనుసరించి రైతులకు రూ.1,500 కోట్ల మేర పంట రుణాలు అందజేయనున్నారు. ఖరీఫ్‌లో రూ.900 కోట్ల రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లు ప్లాన్ సిద్ధం చేశారు. ఖరీఫ్‌లో 1.12 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్న రైతులకు రూ.900 కోట్ల పంటరుణాలను బ్యాంకర్లు అందజేయనున్నారు. జిల్లాలో మొత్తం 14 బ్యాంకులు ఉండగా ఖరీఫ్‌లో అత్యధికంగా ఎస్బీఐ రైతులకు రూ.350 కోట్లకుపైగా రుణాలు అందజేయనుంది. ఆంధ్ర బ్యాంకు రూ.190 కోట్లు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు రూ.98 కోట్లు, గ్రామీణ వికాస్ బ్యాంకు రూ.21 కోట్లు, హెచ్‌డీసీసీబీ బ్యాంకు రూ.60 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.52 కోట్లు, కెనరా బ్యాంకు రూ.44 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.31 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.19 కోట్ల రుణాలను రైతులకు అందజేయనున్నాయి. గత ఏడాది రబీలో రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని శుక్రవారం జరిగే బ్యాంకర్ల సమావేశంలో వ్యవసాయశాఖ బ్యాంకర్లను కోరనుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది రబీలో సైతం బ్యాంకర్లు రూ.600 కోట్ల రుణాలను పంపిణీ చేసేందుకు ప్రణాళికను రూపొందించారు. రబీలో సైతం ఎస్బీఐ బ్యాంకు అత్యధికంగా రూ.240 కోట్ల మేర రుణాలు ఇవ్వనుంది. అలాగే ఆంధ్రా బ్యాంకు రూ.120 కోట్లు, బరోడా బ్యాంకు రూ.20 కోట్లు, కెనరా బ్యాంకు రూ.29 కోట్లు, హెచ్డీఎఫ్సీ రూ.35 కోట్లు, హెచ్‌డీసీసీబీ బ్యాంకు రూ.40 కోట్లు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు రూ.65 కోట్లు రుణాలు ఇవ్వనున్నాయి. మిగతా మొత్తాన్ని ఇతర బ్యాంకులు రైతులకు రబీలో రుణంగా అందజేయనున్నాయి. ఇదిలా ఉంటే ప్రతిఏటా వ్యవసాయరుణ ప్రణాళికకు అనుగుణంగా రైతులకు రుణాలు అందజేయటం తో బ్యాంకులు విఫలం అవుతున్నాయి. నిర్దేశిత లక్ష్యంలో కేవలం 50 శాతం మేర మాత్రం రైతులకు రుణాలు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఈ ఏడాది వందశాతం రైతులకు రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధ అవుతోంది. అయితే బ్యాంకర్లు ఏమేరకు ఖరీఫ్, రబీలో రుణాలు ఇస్తారో వేచి చూడాలి. -
కోటి ఆశలతో
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తొలకరి పలకరింపుతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. సమృద్ధిగా పంటలు పండాలని ఆకాంక్షిస్తూ సాగుకు ఉపక్రమిస్తున్నారు. ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు ఇప్పుడిప్పుడే దుక్కులు సిద్ధం చేసుకుంటున్న దృశ్యాలు జిల్లాలో కనిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యవసాయశాఖ ఖరీఫ్ ప్రణాళికను సిద్ధం చేసింది. ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగయ్యే అవకాశముందో అంచనా వేసిన ఆ శాఖ అధికారులు.. దీనికి అనుగుణంగా ఆయా పంటల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచింది. గతేడాది తరహాలోనే ఈ సీజన్లోనూ 1.68 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు కావొచ్చని అధికారులు అంచనా వేశారు. ఇందుకుగాను వాణిజ్య పంటైన పత్తి మినహా ఇతర పంటల విత్తనాలు సుమారు 26 వేల క్వింటాళ్లు అవసరమవుతాయని లెక్కగట్టారు. సబ్సిడీపై విత్తనాలు సిద్ధం పత్తి మినహా ఇతర పంటల విత్తనాలు రైతులకు సబ్సిడీ లభిస్తున్నాయి. పంటను బట్టి విత్తనాలపై సబ్సిడీ ధరలో మార్పులు ఉంటాయి. సోయాబీన్ క్వింటా ధర రూ.6,150 కాగా.. సబ్సిడీపై రూ.2,500 లకే రైతులకు అందజేశారు. అలాగే క్వింటా జీలుగ ధర రూ.5,150, రాయితీపై రూ.3,350కు విక్రయిస్తారు. జొన్న, కొర్రలు, సజ్జలు, అండ్రు కొర్రలు తదితర చిరుధాన్యాలపై 65 శాతం, వేరుశనగ, నువ్వులు, ఆముదంపై 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. సబ్సిడీ విత్తనాలు అధికారుల వద్దకు చేరుకున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్), రైతు సేవా కేంద్రాలు (ఏఆర్ఎస్కే), జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ (డీసీఎంఎస్) తదితర కేంద్రాల నుంచి రైతులు విత్తనాలు తీసుకోవచ్చు. రైతు ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ పత్రాలను సమీప ఏఈఓను సంప్రదించి సబ్సిడీపై విత్తనాలు పొందవచ్చు. ఏఈఓలు ఆన్లైన్లో జనరేట్ చేసిన టోకెన్‌ను రైతులు అందిస్తే సమీపంలోని పీఏసీఎస్, డీసీఎంఎస్, ఏఆర్ఎస్కే కేంద్రాల్లో ఇచ్చి విత్తనాలు కొనుగోలు చేయవచ్చు. పత్తి విత్తనాల ధర ఇలా.. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న డీలర్లు మాత్రమే విత్తనాలు విక్రయించాలి. ఇతరులు అమ్మడానికి వీల్లేదు. ఒకవేళ అలా చేస్తే అది నేరమే. ఈ విషయంలో జిల్లా వ్యవసాయ అధికారులు పకడ్బందీగా వ్యహరిస్తున్నారు. అంతేగాక ఎమ్మార్పీకి మించి విక్రయించకూడదు. వ్యవసాయ శాఖ పత్తి విత్తనాల ధరను నిర్ణయించింది. 450 గ్రాముల తూకం కలిగిన బీజీ–1 విత్తనాలను రూ.635, బీజీ–2 విత్తనాలను రూ.730కు మాత్రమే రైతులకు అమ్మాలి. 15 రోజుల్లో ఎరువులు ఈ సీజన్లో సాగయ్యే పంటలకు సుమారు 1.03 లక్షల టన్నుల వివిధ రకాల రసాయనిక ఎరువులు అవసరం. రైతులు అత్యధికంగా యూరియా వినియోగిస్తున్నారు. వీటిని ఇప్పటికే రైతలకు అందుబాటులో ఉంచారు. -
డబ్బుల కోసం ఎదురుచూపు
రైతుకు పంట వేసినప్పటి నుంచి చేతికి వచ్చే వరకు తిప్పలే. కష్టపడి పండించిన పంటను అమ్మి డబ్బుల కోసం ఎదురుచూడా ల్సిన పరిస్థితి. అప్పులు చేసి రబీలో సాగుచేసిన సోయా, శనగ పం టను కొనుగోలు కేంద్రాలు విక్ర యించారు. నెలలు గడుస్తున్నప్పటికీ నేటికి డబ్బులు రాక అవస్థలు పడుతున్నారు. ఖరీఫ్‌కు రైతులు సన్నద్ధమ వుతున్న తరుణంలో డబ్బులు రాక అవస్థలు పడాల్సిన దుస్థితి. జైనథ్: ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తున్నప్పటికీ కూడా గత ఖరీఫ్‌లో మార్కెట్లో అమ్మిన సోయా, రబీలో అమ్మిన శనగల విత్తనాల డబ్బులు ఇంకా విడుదల కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కరికి లక్షలో సొమ్ము రావాల్సి ఉండగా, నెలలు గడుస్తున్న ఇంకా బ్యాంకు ఖాతాలో జమ కాకపోవడంతో పెట్టుబడి కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. గత సంవత్సరం తీసుకున్న అప్పు పూర్తిగా కట్టలేక, కొత్త అప్పు దొరకక సతమతమతున్నారు. ఇటీవలే సోయా డబ్బుల కోసం ఆదిలాబాద్ పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట రైతులు ధర్నాకు దిగారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో డబ్బుల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆరు నెలలైన అందని సోయా డబ్బులు.. ఈ సంవత్సరం జనవరి 20వరకు సోయా కొనుగోలు చేస్తున్నట్లు హాకా అధికారులు ప్రకటించారు. అయితే మధ్యలో 8వ తేదీన కొనుగోళ్లు నిలిపివేస్తున్న ఆదేశాలు జారీ చేశారు. దీంతో మార్కెట్ కమిటీల్లో కొనుగోళ్లు చేసిన రైతుల వివరాలు ఆన్లైన్ చేయడం వీలుకాలేదు. రైతుల పేర్లు సైట్లో రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ భూమి వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు, లాట్ వివరాలు పూర్తిగా ఆన్లైన్ కాలేదు. అయితే ఈ సమస్య జైనథ్, ఆదిలాబాద్ మార్కెట్లో తలెత్తింది. హాకా ఉన్నత స్థాయి అధికారులు, మండలాల్లో కొనుగోలు చేపట్టిన అధికారుల నడుమ సమన్వయ లోపం, మార్కెట్లో కొన్న గింజలకు సంబంధించి ఏ రోజుకారోజు ఆన్లైన్ చేసేందుకు అవకాశం లేకపోవడంతో రెండు మండలాల్లో 93 మంది రైతులకు సంబంధించిన రూ.50లక్షల డబ్బులు నిలిచిపోయాయి. వీరి వివరాలు ఆన్లైన్ కాకపోవడంతో అసలు డబ్బులు వస్తాయా? వస్తే ఎప్పుడు వస్తాయి? అనేది తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. తమ సమస్య పరిష్కరించాలని అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా.. ధర్నాలు చేస్తున్నా.. ఆరు నెలలుగా సమస్య అపరిష్కృతంగానే ఉండటంతో జిల్లా వ్యాప్తంగా 93మంది రైతుల 50లక్షల రూపాయలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆగిన రూ.70కోట్ల సోయా డబ్బులు.. ఈ సంవత్సరం మార్చి 13 నుంచి ఎప్రిల్ 8వరకు జిల్లా వ్యాప్తంగా మార్క్‌ఫెడ్ జిల్లా వ్యాప్తంగా శనగలు కొనుగొలు చేసింది. మార్చి 13 నుంచి 20 వరకు కొనుగోలు చేసిన రైతుల డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. కాకపోతే మార్చి 21 నుంచి ఏప్రిల్ 8 వరకు శనగలు అమ్మిన రైతుల డబ్బులు ఇంకా వారి ఖాతాల్లో జమ కాలేదు. అధికారులు మాత్రం ప్రభుత్వం నుంచే నిధులు విడుదలకాలేదని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 8వేలకుపైగా రైతులకు రూ.70కోట్ల డబ్బులు ఇంకా విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తుండటంతో రైతులు పెట్టుబడి కోసం డబ్బుల లేక అప్పులు చేస్తున్నారు. సోయా, శనగ డబ్బులు ఇవ్వాలి జనవరిలో అమ్మిన సోయా, మార్చిలో అమ్మిన శనగ రెండింటి డబ్బులు రావాల్సి ఉంది. క్వింటాల్‌కు రూ.3399 చొప్పున 20క్వింటాళ్ల సోయలు, క్వింటాల్‌కు రూ.4620 చొప్పున 60క్వింటాళ్ల శనగలు విక్రయించాను. ఒక్క రూపాయి కూడా రాలేదు. - చిందం మోహన్, రైతు, జైనథ్ పది రోజుల్లో వస్తాయి.. జిల్లా వ్యాప్తంగా 8వేలకు పైగా శనగ రైతులకు రూ.70 కోట్ల డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు ఇంకా విడుదల కాలేదు. శనగ రైతుల డబ్బులు పది రోజుల్లో వస్తాయి. ఉన్నత అధికారులకు సమస్యను విన్నవించాం. ఈ సీజన్ ప్రారంభంలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. - పుల్లయ్య, డీఎం, మార్క్‌ఫెడ్ -
‘వ్యవసాయం’పై బకాయిల బండ!
సాక్షి, అమరావతి : చంద్రబాబు సర్కారు గత ఐదేళ్లుగా అనుసరించిన లోపభూయిష్ట విధానాలవల్ల వివిధ శాఖలు నిధుల కొరతతో అల్లాడుతున్నాయి. ఇందులో వ్యవసాయ శాఖ కూడా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జూన్ ఒకటో తేదీతో ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. ఖరీఫ్ పంటల సాగుకు వీలుగా వ్యవసాయ శాఖ రైతులకు సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేయాలి. ఇలా వ్యవసాయ శాఖ రైతులకు సబ్సిడీ విత్తనాలు అందించాలంటే ఏపీ సీడ్స్, ఆయిల్‌ఫెడ్ లాంటి సంస్థలు విత్తనాలను వ్యవసాయ శాఖకు ఇవ్వాలి. అయితే, దురదృష్టవశాత్తు్త ఈ విత్తన సరఫరా సంస్థలకు ప్రస్తుతం అప్పు కూడా పుట్టని దుస్థితిలో ఉన్నాయి. ఇదంతా గత ఐదేళ్లుగా బాబు సర్కారు సాధించిన ఘనకార్య ఫలితమేనని అధికారులు విమర్శిస్తున్నారు. జూన్ మొదటి వారంలో రుతు పవనాలు రాగానే రైతులు పొలాలను దుక్కి దున్ని సాగు చేస్తారు. వేరుశనగ, కంది, పిల్లి పెసర, జీలుగ తదితర విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీతో రైతులకు సరఫరా చేయాలి. వ్యవసాయ శాఖకు విత్తనాలు ఇచ్చేందుకు విత్తన సరఫరా సంస్థల వద్ద నిధులు లేవు. వ్యవసాయ శాఖ ఇప్పటికే ఆయా సంస్థలకు బకాయి ఉంది. కీలకమైన ఖరీఫ్ సీజన్లో భారీగా విత్తనాలు సరఫరా చేయాల్సిన వ్యవసాయ శాఖ నిధుల లేమితో అల్లాడుతోంది. ఎటూ అధికారంలోకి రాలేమని తెలిసే కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ఇబ్బంది ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు సర్కారు వ్యవసాయ శాఖకు నిధులు విదల్చకుండా కమీషన్లు వచ్చే సాగునీటి పారుదల ప్రాజెక్టులు, ఇతర కాంట్రాక్టర్లకు నిధులు మళ్లించారు. దీంతో వ్యవసాయ శాఖ నిధుల కొరతతో విత్తనాల సేకరణకు కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటోంది. విత్తన సబ్సిడీకి, సరఫరా సంస్థలకు ఉన్న బకాయిలు రూ.370 కోట్లు 2015–16 నుంచి 2018–19 వరకూ రూ.249 కోట్ల విత్తన సబ్సిడీ బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం పెండింగులో పెట్టింది. మరో రూ.120.91 కోట్లు బఫర్ సీడ్ స్టాకింగ్ ఆపరేషన్ లాసెస్ కింద విత్తన సరఫరా సంస్థలకు చెల్లించాల్సి ఉంది. సబ్సిడీ విత్తనాల సరఫరాకు సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.369.91 కోట్లు పైమాటే. రైతులకూ రూ.145 కోట్లు జొన్న, మొక్కజొన్న ఉత్పత్తులను ప్రభుత్వానికి విక్రయించిన 1.57 లక్షల మందికి పైగా రైతులకు ప్రభుత్వం రూ.145.78 కోట్లు చెల్లించాల్సి ఉంది. కరువు కాలంలో అష్టకష్టాలు పడి పండించిన ఉత్పత్తులను సర్కారుకు అమ్మిన పాపానికి వారు డబ్బు కోసం గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు తదితర జిల్లాల రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నారు. వ్యవసాయోత్పత్తుల ధరలు దారుణంగా పడిపోయినప్పుడు కనీస మద్దతు ధరకు రైతుల నుంచి వాటిని కొనుగోలు చేసి మార్కెట్ ధరకు విక్రయించాల్సిన బాధ్యత సర్కారుపై ఉంది. ఇందులో భాగంగానే గత ఆర్థిక సంవత్సరం మొక్కజొన్న, జొన్న రైతుల నుంచి ఉత్పత్తులు సేకరించి వారికి డబ్బు చెల్లించలేదని, రైతులకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని వ్యవసాయ శాఖ అధికారులు వాపోతున్నారు. అంతేకాదు..పౌర సరఫరాల శాఖ రైతుల నుంచి ధాన్యం సేకరించింది. గత ఖరీఫ్‌లో ధాన్యం విక్రయించిన వారికి ఇవ్వాల్సిన సొమ్మును ఇప్పటికీ చెల్లించలేదు. ఈ సొమ్మును కూడా సాగునీటి ప్రాజెక్టుల బిల్లుల చెల్లింపు, ఎన్నికల ముందు ఓట్ల తాయిలాలకు బాబు సర్కారు మళ్లించింది. బిందు, తుంపర సేద్యం, వ్యవసాయ పనిముట్లకు సంబంధించిన సబ్సిడీ బిల్లులు కూడా వేలకోట్లు పెండింగులోనే ఉన్నాయి. ట్రాక్టర్ల కొనుగోలు, పొలాల్లో షెడ్ల నిర్మాణం, చిన్న చిన్న నీటి చెరువుల ఏర్పాటు తదితరాల కోసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లులను కూడా పెండింగులో పెట్టింది. దీనివల్ల కొత్తగా ఈ యూనిట్లు ఎవరికీ మంజూరు కావడంలేదు. అలాగే, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక కింద రూ.103.89 కోట్ల నిధులు, భూ, నీటి సంరక్షణ కింద రూ.1.73 కోట్లు, వర్షాధార ప్రాంతాల అభివృద్ధి పథకం కింద రూ.20.02 కోట్లు, ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన బిల్లులు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో 2016–2019 మార్చి వరకూ పెండింగులో ఉన్నాయి. రూ.2,882.75 కోట్ల పెట్టుబడి రాయితీ ఎగవేత గత ఖరీఫ్‌లో పంట నష్టపోయిన 15.97 లక్షల మంది రైతులకు రూ.1,832 కోట్లు పెట్టుబడి రాయితీని బాబు సర్కారు చెల్లించకుండా ఎగవేసింది. 2014–15 నుంచి ఉన్న బకాయిలను కలిపితే రైతులకు చెల్లించాల్సిన పెట్టుబడి రాయితీ గత ఖరీఫ్ నాటికి రూ. 2102.75 కోట్లు. అలాగే, గత ఏడాది రబీ సీజన్లో ప్రకటించిన 257 కరువు మండలాల్లోని బాధిత రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ.780 కోట్లు ఉంటుందని అంచనా. వెరసి గత ఏడాది రబీ సీజన్ ముగిసే వరకూ బాబు సర్కారు రైతులకు ఇవ్వాల్సిన రూ.2,882.75 కోట్లలో నయాపైసా కూడా విదల్చలేదు. -
‘నిమ్మ’ ధర..ఢమాల్!
నకిరేకల్ : వేసవికాలం నేపథ్యంలో నిమ్మ దిగుబడులు అధికంగా రావడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. నాలుగు రోజుల క్రితం ఒక బస్తా ధర రూ.1200 పలకగా, నాలుగు రోజులనుంచి పడిపోయింది. ప్రస్తుతం బస్తా ధర రూ.600లకు మించి రావడం లేదు. దీంతో నిమ్మ రైతులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 40వేల ఎకరాల్లో నిమ్మ తోటలు సాగువుతున్నాయి. ఏటా 2.50లక్షల టన్నుల దిగుబడులు వస్తాయి. అంటే రూ.300కోట్ల పైనే నిమ్మ వ్యాపారం సాగుతోంది. ఒక్కో నిమ్మకాయ బస్తా 22 కేజీలు ఉంటుంది. ఒక్కో బస్తాలో లావుకాయ అయితే 600 వరకు, చిన్న కాయలైతే 900 వరకు నింపుతారు. గతంలో నిమ్మరైతులు దళారులకు అమ్ముకునేవారు. ఎన్నో ఏళ్లనుంచి రైతులనుంచి వచ్చిన డిమాండ్ మేరకు నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్ ఏర్పాటు చేశారు. దాదాపు రూ.3కోట్లతో నకిరేకల్‌లోని తిప్పర్తిరోడ్డు చిమలగడ్డ సమీపంలో అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా నిమ్మమార్కెట్ నిర్మించారు. ఈ మార్కెట్ ప్రారంభమైన నాటి నుంచి నాలుగు రోజు ల క్రితం వరకు కూడా ఒక నిమ్మ బస్తా ధర రూ. 900నుంచి రూ.1300 ధర పలికింది. ప్రస్తుతం బస్తా ధర 400 నుంచి 600వరకు పడిపోయింది. ప్రధానంగా నిమ్మ దిగుబడులు అధికంగా రావడంతో ధరలు తగ్గుతున్నాయని మార్కెటింగ్ అధికారులు అంటున్నారు. సాయంత్రం 6 గంటలనుంచి మార్కెట్లో కొనుగోళ్లు ఇక్కడ ఈ మార్కెట్లో ప్రతి రోజు సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 11గంటల వరకు నిమ్మ వ్యాపారం సాగుతోంది. హైదరాబాద్, సూర్యపేట, కోదాడ తదితర ప్రాంతాలకు చెందిన నిమ్మ బేరగాళ్ళు ఇక్కడికి వచ్చి పాటలు పాడుతుంటారు. రైతులనుంచి కొనుగోలు చేసిన నిమ్మ దిగుబడులను హైదరాబాద్‌కు, అక్కడినుంచి ఢిల్లీకి తరలిస్తున్నారు. రైతు దగ్గరినుంచి గతంలో మార్కెట్ ప్రారంభం కాకముందు దళారులు 13శాతం కమీషన్ తీసుకునేవారు. ప్రస్తుతం నిమ్మ మార్కెట్ ప్రారంభం చేయడంతో 4శాతం మేర కమీషన్ భారం రైతుపై పడుతోంది. నాలుగు రోజుల నుంచి గత ఏడాది కాలంగా కొనసాగిన ధర పడిపోవడంతో రైతులు కొంత నిరాశ నిసృహలకు లోనవుతున్నారు. బస్తా ధర రూ.900పైనే రావాలి మాది శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామం. నాకు ఆరు ఎకరాల్లో నిమ్మ తోట ఉంది. ఇటీవల గాలి దుమారంతో నిమ్మకాయలు రాలిపోయాయి. పక్షం రోజుల క్రితం ఈ మార్కెట్‌కు వచ్చినప్పుడు ఒక నిమ్మ బస్తా ధర రూ.1000 వరకు వచ్చింది. నాలుగు రోజులనుంచి తగ్గింది. రూ.600కు మించి ధర రావడం లేదు. ఒక్క నిమ్మ బస్తాకు కనీసం రూ.900 పైబడి ధర పలికితే రైతుకు లాభం ఉంటుంది. – తోట వీరయ్య, నిమ్మ రైతు, అంబారిపేట నిమ్మ ధరల్లో నిలకడ ఉండదు నిమ్మ ధరలలో నిలకడ ఉండదు. నిమ్మ మార్కెట్ ప్రారంభించిన నాటినుంచి ఇప్పటి వరకు రైతుకు మంచి మద్దతు ధర లభించింది. నాలుగు రోజులనుంచి ధరలు తగ్గుముఖం పట్టిన విషయం వాస్తవమే. నిమ్మ కాయలు ఎక్కువ దిగుబడి వస్తే ధర తగ్గుముఖం పడతాయి. వేసవి నేపథ్యంలో నిమ్మకు మంచిడిమాండ్ ఉంటుంది. రైతులకు కూడా తగిన ధర వచ్చేలా చర్యలు తీసుకుంటాం. – వెంకన్న, ప్రత్యేక శ్రేణి కార్యదర్శి, నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ -
రైతు కంట కన్నీరు
నల్లగొండ రూరల్ : భూగర్భ జలాలు అడుగంటి.. రైతన్నకు కన్నీరు మిగులుతోంది. 750 అడుగుల లోతు బోర్లు వేసినా.. పాతాళ గంగమ్మ పైకి రాకపోవడంతో.. కంటికి రెప్పలా కాపాడుకున్న పండ్ల తోటలు ఎండిపోతున్నాయి. తోటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలెన్నో చేసి.. ఫలించకపోవడంతో ఎటూ పాలుపోక రైతన్నలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే బత్తాయి సాగులో నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉండేది. నల్లగొండ పరిసర ప్రాంతాల్లో బత్తాయి తోటలు ఎక్కువగా ఉన్నాయి. కాగా నాలుగేళ్లుగా తోటల సంఖ్య తగ్గిపోతోంది. దీనికి ప్రధాన కారణం భూగర్భ జలాలు అడుగంటి.. నీరు లేకపోవడంతో రైతులు తోటలను తొలగిస్తున్నారు. ఈ ఏడాది కూడా వర్షాభావ పరిస్థితులతో బోర్లలోని నీరు ఇంకిపోయి తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. చెట్లమీద నిమ్మకాయ సైజులో ఉన్న బత్తాయి కాయలు ఎండిపోయి రాలుతున్నాయి. బత్తాయితో పాటు దానిమ్మ, మామిడి తోటల పరిస్థితి కూడా అలాగే ఉంది. దిగుబడి మాట దేవుడెరుగు కనీసం తోటలను కాపాడుకునేందుకు రైతులు బోర్లు వేయడం, ట్యాంకర్లద్వారా నీటి అందిస్తూ.. భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడుకున్న బత్తాయితోటలు దిగుబడిని ఇచ్చే సమయంలో ఎండిపోతుండడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. బొగ్గుబట్టీలకు బత్తాయిచెట్లు ఎండిన బత్తాయి చెట్లను రైతులు బొగ్గు వ్యాపారులకు అప్పగిస్తున్నారు. ఎండిన చెట్లకు తమకేమీ డబ్బులు వద్దని.. చెట్లు తొలగించి బొగ్గుబట్టీలకు తీసుకెళ్లండంటూ బొగ్గుబట్టీల వ్యాపారులను రైతులు బతిమిలాడి అప్పగిస్తున్నారు. దీంతో బొగ్గుబట్టీల వ్యాపారులు, రంపాలతో కోసి ట్రాక్టర్ల ద్వారా బత్తాయి మొద్దులను తరలిస్తున్నారు. ఎండిన తోటలకు నష్టపరిహారమేదీ.. ? ఎండిన పండ్ల తోటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడంలేదు. నాణ్యమైన బత్తాయి మొక్కలు నాటాలంటే రవాణాతో కలిపి మొక్క రూ.100 నుంచి 150 వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వం మాత్రం దిగుబడిని ఇచ్చే పండ్ల చెట్లు ఎండిపోతే నష్టపరిహారం ఇవ్వకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రాలో కొబ్బరి, అరటి చెట్లకు నష్టం వాటిల్లితే అక్కడ ప్రభుత్వం రూ.2 వేలు నష్టపరిహారంగా ఇస్తుంది. ఐదో ఏట దిగుబడిని ఇచ్చే ఒక్క బత్తాయి చెట్టు ఎండిపోతే రూ.1200 వరకు నష్టం వాటిల్లుతుంది. 13 ఏండ్ల చెట్టు ఎండిపోతే రూ.2 నుంచి 3 వేల వరకు నష్టం వస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ఎండిన చెట్టుకు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు దిగుబడి నష్టాన్ని శాస్త్రీయంగా గుర్తించి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. 2009లో తీవ్ర నీటి ఎద్దడితో జిల్లాలో బత్తాయి తోటలు భారీ ఎత్తున ఎండిపోయాయి. అప్పట్లో 2లక్షల 50వేల ఎకరాల్లో బత్తాయితోటలు సాగులో ఉండగా.. లక్షన్నర ఎకరాలకు పైగా తోటలు ఎండిపోయాయి. ఎండిన తోటలకు చెట్టుకు రూ.30 చొప్పున నష్టపరిహారాన్ని ఇచ్చారు. పట్టించుకోని ఉద్యానవన శాఖ.. జిల్లాలో ఏటా 80 నుంచి 100 ఎకరాల్లో దిగుబడిని ఇచ్చే పండ్ల తోటలు ఎండిపోయి రూ.కోట్లాది పంట నష్టం వాటిల్లుతోంది. ఉధ్యాన శాఖ ద్వారా ప్రభుత్వం కనీసం నష్టపరిహారం ఇవ్వకపోవడంతో రైతులు సంబంధిత శాఖ అధికారులకు తోటలు ఎండినట్లు దరఖాస్తులు ఇవ్వడం దండగ అని భావిస్తున్నారు. ఎండిన తోటలు తొలగించేందుకు కూలీల ఖర్చు మరో ఆర్థిక భారంగా మారుతుందని భావిస్తున్న రైతులు కొందరు ఎండిన తోటలకు నిప్పంటిస్తున్నారు. జిల్లాలో ఉద్యానవ శాఖ వద్ద ఉన్న లెక్కల ప్రకారం.. బత్తాయి సాగు 4,447 ఎకరాలు, నిమ్మ 16,298, దానిమ్మ 678, మామిడి 2,768, సపోటా 297 ఎకరాల్లో సాగులో ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్నప్పటికీ రికార్డుల్లో తక్కువగానే ఉంది. ఇక్కడ కేవలం డ్రిప్, కొత్త తోటల సాగు ప్రోత్సాహం అందించిన రైతుల వివరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సొంతంగా రైతులు పండ్ల మొక్కలు పెట్టుకున్నవారి వివరాలు ఉండకపోవడంతో సాగు విస్తీర్ణం లెక్కల్లోకి రావడంలేదు. బ్యాంకుల ప్రోత్సాహంతో పెరిగిన సాగు 2009 తర్వాత జిల్లాలో తోటల సాగు విస్తీర్ణం పెరుగతూ వచ్చింది. బ్యాంకులు పండ్లతోటల సాగుకు రుణాలు ఇవ్వడంతో ఎండిన బత్తాయి రైతులంతా పండ్ల తోటల సాగు ద్వారానే భవిష్యత్ భరోసా ఉంటుందని భావించి విస్తారంగా తోటల సాగును చేపట్టారు. జిల్లాలో 2వేల మందికి పైగా బ్యాంకుల్లో పాసుపుస్తకాలను తాకట్టుపెట్టి రుణాలు తెచ్చి బత్తాయి సాగును చేపట్టారు. దిగుబడిని ఇచ్చే సమయానికి మళ్లీ ఇప్పుడు తోటలు ఎండిపోవడంతో బ్యాంకుల్లో తెచ్చిన అప్పును రైతులు తీర్చలేకపోయారు. అప్పులు కట్టాలంటూ బ్యాంకర్లు రైతులకు నోటీసులు ఇవ్వడంతో పాటు కోర్టులో కేసులు కూడా వేశారు. ఇచ్చిన రుణాలు మాఫీ చేయాలని, పండ్లతోటలు ఎండిపోయాయని, ఇటీవల గుర్రంపోడు మండలంలోని పోచంపల్లి గ్రామానికి చెందిన రైతులు సీఎం కేసీఆర్‌కు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేశారు. 6 బోర్లేసినా... చుక్క నీరు రాలేదు... ఈ ఫొటోలోని వ్యక్తి కనగల్ మండలంలోని ఇరుగంటిపల్లి గ్రామానికి చెందిన చిట్టిమల్ల లింగయ్య. ఇతనికి దిగుబడినిచ్చే పదేళ్ల వయస్సున్న బత్తాయి తోట నాలుగు ఎకరాలు ఉంది. కంటికి రెప్పలా కాపాడుకున్న బత్తాయితోట నీటి సమస్య కారణంగా ఎండిపోతుండడంతో ఆరు బోర్లు 200 ఫీట్ల వరకు వేసినా చుక్క నీరు రాలేదు. ఉన్న కొద్ది నీరు సరిపోకపోవడంతో మూడెకరాల బత్తాయితోట ఎండిపోయింది. 36 టన్నుల దిగుబడి వచ్చే కాయలు ఎండిపోవడంతో రూ.14లక్షలు నష్టపోయాడు. ఎండ తీవ్రత, డి–37 ద్వారా కాల్వ నీరు రాకపోవడంతో తోట ఎండిపోయిందని లింగయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. తోట ఎండింది.. ఉపాధి పనులకు వెళ్తున్నా.... ఈ ఫొటోలోని మహిళ కనగల్ మండలంలోని ఇరుగంటిపల్లి గ్రామానికి చెందిన ఎన్నమల్ల ఎల్లమ్మ. ఈమెకు తొమ్మిదేళ్ల వయస్సున్న ఎకరం బత్తాయితోట ఉంది. నీటి సమస్య కారణంగా ఎండిపోయింది. ఏటా 12టన్నుల దిగుబడి పొందేది. గతంలో డీ–37 కాల్వ ద్వారా గ్రామంలో చెరువు నిండేది. ప్రస్తుతం కాల్వలో నీరు రాకపోవడం, ఉన్నబోరు వట్టిపోవడంతో రూ.50వేలు ఖర్చు చేసి రెండు బోర్లు వేసింది. 200 ఫీట్ల లోతు వేసినా చుక్క నీరు రాలేదు. సమీపాన బోరు, నీరున్నా.. రైతులు లేకపోవడంతో చేసేదేమీ లేక ఆశలు వదులుకుంది. ట్యాంకర్ ద్వారా నీరందించాలనుకుంది. కానీ అప్పుల ఊబిలో చిక్కిపోతానని తోటపని మానేసి ఉపాధి హామీ కూలికి వెళ్తోంది. పంట దిగుబడి నష్టం రూ.2.50లక్షల ఆదాయం కోల్పోయింది. ఏడాది క్రితమే భర్త అనారోగ్యంతో మృతిచెందాడు. ఇద్దరు పిల్లలను కూలినాలి పనికి తీసుకెళ్తూ.. జీవనం నెట్టుకొస్తోంది. ఎండిన తోటకు పరిహారం ఇవ్వాలి ఎండిన పండ్లతోటలకు మొక్కల ఖరీదుతో పాటు దిగుబడి నష్టాన్ని అంచావేసి.. ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి. నా తోటలు ఎండిపోకపోవతే.. దానిమ్మ 50టన్నుల దిగుబడితో రూ.20–25లక్షలు, బత్తాయి 150 టన్నుల దిగుబడితో రూ.42 లక్షలు వచ్చేవి. తోట ఎండిపోవడంతో.. ఆ మొత్తం నష్టపోయాను. తోటకు పెట్టుబడి, బోర్ల ఖర్చు మరో రూ.40 వరకు నష్టపోయాను. ప్రభుత్వం నాకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలి. – రైతు అంజిరెడ్డి, దోమలపల్లి పిల్లలతో సమానంగా చెట్లను పెంచాం.. పిల్లలతో సమానంగా బత్తాయి, దానిమ్మ తోటలను పెంచాం. బత్తాయితోటలో వేసిన బోర్లు పడక పోవడంతో రెండు కిలోమీటర్ల దూరం నుంచి బోరు వేసి పైప్‌లైన్ ద్వారా నీళ్లు తెచ్చినా వారం కంటే ఎక్కువ రోజులు నీరు పోయలేదు. అద్దెబోర్లు తీసుకుందామన్నా సమీపంలో ఎక్కడా నీటి వసతి లేక వదిలేశాం. ఇద్దరు కుమార్తెల చదువు, వివాహం, వారి భవిష్యత్ తలుచుకుంటేనే భయాందోళనకరంగా ఉంది. 15 రోజుల పాటు అన్నం ముట్టకుండా.. కుటుంబ సభ్యులమంతా రోదించాం. బంధువులు, స్నేహితులు ఓదార్చినా మానసికంగా కోలుకోలేకపోతున్నాం. – అరుణ, అంజిరెడ్డి భార్య జిల్లా కేంద్ర సమీపంలోని దోమలపల్లి గ్రామానికి చెందిన రైతు నాతాల అంజిరెడ్డి దంపతులు. వీరికి 13ఏళ్ల వయస్సు కలిగిన 15 ఎకరాల బత్తాయితోట, ఐదేళ్ల వయస్సు కలిగిన ఆరెకరాల దానిమ్మతోట ఉంది. బత్తాయితోట నుంచి ఏటా కత్తెర, సీజన్ బత్తాయి దిగుబడి 120–130 టన్నులు లభిస్తుంది. ఆరెకరాల్లో ఉన్న దానిమ్మతోట ద్వారా 50 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ తోటల్లో ఈ ఏడాది పంట ఆశాజనకంగా ఉంది. మరో నెలలో పంట దిగుబడి చేతికందుతుందని ఆశించగా.. తీవ్ర నీటిఎద్దడి ఎదురైంది. తోటను కాపాడుకునేందుకు ఇప్పటి వరకు 21 ఎకరాల్లో 72 బోర్లు వేసినా ఫలితం లేకుండాపోయింది. 2 కిలోమీటర్ల దూరంలో 250 ఫీట్ల లోతు బోరువేసి తోటకు నీరు అందించినా వారం రోజుల్లోనే ఆ బోరు కూడా వట్టిపోయింది. సమీపంలో ఎక్కడా రైతుల బోర్లలో నీరు లేకపోవడంతో ఎలాగైనా దానిమ్మ, బత్తాయితోటలను కాపాడుకోవాలని 750 ఫీట్లలోతు బోర్లు వేసినా చుక్క నీరు పైకి రాలేదు. చేసేదేమీలేక వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. దిగుబడి చేతికందితే.. బత్తాయి మీద రూ.42 లక్షలు, దానిమ్మకు రూ.20–25 లక్షలు చేతికొచ్చేవి.. కాగా ఆయన తోట మీద పెట్టుబడిగా ఎరువులకు రూ.8 లక్షలు, 72 బోర్లకు రూ.25లక్షలు, పశువుల ఎరువుకు రూ.1.80లక్షలు, కూలీల ఖర్చు రూ.6లక్షలు అంతా కలుపుకుని రూ.కోటికిపైగా నష్టపోయాడు. తోట ఎండిపోవడంతో తన ఇద్దరు కూతుళ్ల చదువు, వివాహాలు, కుటుంబం భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.. అంటూ ఆ దంపతులు బోరున విలపిస్తున్నారు. ఇది ఒక్క అంజిరెడ్డి పరిస్థితే కాదు. అనేక మంది రైతులది. -
ఖరీఫ్‌కు సిద్ధం
మహబూబ్‌నగర్ రూరల్: ఖరీఫ్ సాగుకు ఇటు రైతులు, అటు వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. కొన్నిరోజులుగా అధికారులు తలమునకలై కాస్త ఆలస్యంగానైనా ప్రణాళిక తయారు చేశారు. ఒకవైపు రైతు సమగ్ర సమాచార సేకరణ ప్రక్రియ కొనసాగిస్తూనే ఖరీఫ్ కోసం రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉం చేందుకు అంచనాలు వేశారు. జిల్లా వ్యాప్తంగా 15,977 క్వింటాళ్ల మేర విత్తనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆశల సాగుకు జూన్‌లోనే నైరుతీ రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ చెబుతుండడంతో రైతులు పొలం పనులను మొదలెట్టారు. అలాగే అధికారులు 2019 ఖరీఫ్ సాగుపై ప్రణాళిక సిద్ధం చేశారు. రాబోయే ఖరీఫ్ సాగుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలాఉండగా రబీలో సేద్యపరంగా వచ్చిన లాభనష్టాలను పక్కకుపెట్టి రైతన్న మళ్లీ అదృష్ట పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. తొలకరి వర్షాలు ప్రారంభమైన వెంటనే సాగుకు శ్రీకారం చుట్టడానికి రైతులు సరంజామ సిద్ధం చేసుకున్నారు. సిప్పటికే పొలాలను వేసవి దుక్కులు దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలో 1.25 లక్షల హెక్టార్లు జిల్లాలోని 15 మండలాల్లో ఖరీఫ్ సీజన్లో 1.25 లక్షల హెక్టార్లు సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి 17,211 హెక్టార్లు, జొన్నలు 8,500 హెక్టార్లు, మొక్కజొన్న 39,000 హెక్టార్లు, రాగులు 600 హెక్టార్లు, కందులు 12,000 హెక్టార్లు, పత్తి 38,000 హెక్టార్లతో పాటు పలు రకాల చిరు ధాన్యాల పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. దీనికి అనుగుణంగా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వరిసాగు కోసం 10,435 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా వేశారు. వరి, జొన్న, మొక్కజొన్న, కందులు, పెసర, ఆముదం, వేరుశనగ, మినుములు, పత్తి పంటలకు ప్రాధాన్యం ఇస్తూ సాగు కోసం ప్రణాళికలు రూపొందించారు. రైతులకు అవసరమయ్యే సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు విత్తనాలు, ఎరువులు పంపిణీ చేసేందుకు వీలుగా వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ఏడాది కంటే ఈసారి ప్రధానంగా వరి, పత్తి పంటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగు అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఖరీఫ్‌లో పంటల సాగుకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయశాఖ అధికారులు గ్రామాలకు వెళ్లి పంటల వివరాలు, భూమి స్వభావం వివరాలు సేకరిస్తున్నారు. సాగునీటి వసతులు, బోరుబావుల కింద వ్యవసాయ సాగు ఎకరాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. 1,35,322 మెట్రిక్ టన్నుల ఎరువులు ఖరీఫ్ సీజన్‌కు జిల్లాలోని రైతాంగానికి 1,35,322 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. యూరియా 61,342 మెట్రిక్ టన్నులు, డీఏపీ 25,206 మెట్రిక్ టన్నులు, పొటాష్ 7,222 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 38,612 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 2,940 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేశారు. అవసరం మేరకు తెప్పిస్తాం జిల్లాలోని రైతులకు అవసరం మేరకు విత్తనాలను అందించేందుకు చర్యలు తీసుకున్నాం. వారం పది రోజుల్లో అన్ని మండల కేంద్రాలకు విత్తనాలను పంపిస్తాం. ఎరువులు కూడా సాగుకు అవసరమయ్యే మేర కు అందుబాటులో ఉన్నాయి. విత్తనాలు, ఎరువుల విషయమై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేను. – సుచరిత, జిల్లా వ్యవసాయశాఖ,అధికారి -
పశుగ్రాసం లేక పరేషాన్!
తాంసి(బోథ్): ఆరుగాలం రైతులకు వ్యవసాయంలో తోడ్పడే కాడెద్దులకు మేత కరువైంది. ఇంటా, బయట మేత లేక మూగజీవాలు అంబా అంటున్నాయి. కాడెద్దులకు పశుగ్రాసం దొరకకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కబేళాలకు అమ్ముకుంటున్నారు. కొందరు ఆర్థికభారమైన వేలకువేలు పెట్టి గడ్డి కొని పశువులను సాకుతున్నారు. జిల్లాలోని పశుసంపదకు సరిపడా పశుగ్రాసం దొరకడం లేదు. ఉన్న కొద్దిపాటి మేత కూడా ప్రియమైంది. పశువులకు మేత కొనాలంటే రైతులకు తలకు మించిన భారమవుతోంది. వర్షాలు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. పలు గ్రామాల్లో నీటిసౌకర్యం ఉన్న రైతులు గడ్డి, మొక్కజొన్న వంటివి సాగుచేసినా ఈ సంవత్సరం వర్షాలు సరిగా లేక పశువుల మేత కోసం వేసిన పంటలు కూడా ఎండిపోయాయి. దీంతో జిల్లాలో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఏర్పడింది. రైతులకు ఆర్థిక భారమైనా ఒక్కో గడ్డి కట్టను రూ.15 నుంచి రూ.20 పెట్టి మేత కొనుగోలు చేస్తున్నారు. ఇక ట్రాక్టర్ గడ్డి ధర అయితే వేలల్లో ఉంది. దీనికి రవాణా చార్జీలు అదనం. దూర’భారం’ జిల్లాలోని తాంసి, తలమడుగు, భీంపూర్, బోథ్, నేరడిగొండ, ఇచ్చోడతోపాటు తదితర మండలాలకు చెందిన గ్రామాల రైతులు దూరభారమైనా నిర్మల్ జిల్లాతోపాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి వరిగడ్డిని ఒక్కో ట్రాక్టర్ రూ.10 వేలు పెట్టి తీసుకొస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో రబీలో రైతులు 8వేల హెక్టార్లలో జొన్న, మొక్కజొన్నతోపాటు, 4 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. దీంతో జిల్లాలోని పశువులకు సరిపడ మేత లేక గడ్డి ధరలు ఆకాశాన్నంటాయి. సాకలేక సంతకు తరలింపు జిల్లాలో ఏర్పడిన తీవ్ర పశుగ్రాసం కొరతతో రైతులు తమకున్న పశువులను సాకలేక సంతకు తరలించి కబేళాలకు అమ్ముకుంటున్నారు. పెంచుకున్న పశువులకు వేలకువేలు పెట్టి పశుగ్రాసం కొనలేకపోతున్నారు. అయినా పశుసంవర్ధక శాఖ ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదు. రైతులకు సబ్సిడీ ద్వారా గడ్డి విత్తనాలతోపాటు, దాణా వంటివి ముందుగా పంపిణీ చేస్తే ఈ గోస తప్పేది. రైతులకు విత్తనాలు అందజేశాం జిల్లాలో పశుగ్రాసం కొరత లేకుండా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో 10 వేలమెట్రిక్ టన్నుల గడ్డి విత్తనాలను రైతులకు 75 శాతం సబ్సిడీపై అందజేశాం. త్వరలోనే రైతులకు అందించడానికి మరో 10 వేల మెట్రిక్ టన్నుల గడ్డి విత్తనాలకు ఆర్డర్ ఇచ్చాం. ఇవి రాగానే 50 శాతం సబ్సిడీపై రైతులకు అందజేస్తాం. పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు చేపడుతున్నాం. – సురేశ్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి మేత లేక ఎడ్లను అమ్మేశా.. నాకున్న 8 ఎకరాలను రెండు ఎడ్లతో సాగు చేసుకుంటున్నా. వర్షాలు లేక పశువులకు సరిపడా పశుగ్రాసం లేకపోవడంతో వాటిని పస్తులు ఉంచలేక..డబ్బులు పెట్టి గడ్డి కొనలేక ఆదిలాబాద్ సంతలో 15 రోజుల క్రితం రూ.45వేలకు ఎడ్లను అమ్మాల్సి వచ్చింది. – సురేందర్‌రెడ్డి, రైతు తాంసి సబ్సిడీపై పశుగ్రాసం అందించాలి పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉన్నందున ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై పశుగ్రాసాన్ని అందించాలి. జిల్లాలో గడ్డి దొరకకపోవడంతో పక్కన ఉన్న మహారాష్ట్ర నుంచి తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వర్షాకాలం వచ్చేంత వరకు పశుగ్రాసం దొరకని పరిస్థితి నెలకొంది. రైతులకు పశుగ్రాసంతోపాటు దాణా పంపిణీ చేయాలి. – విఠల్, యువరైతు, తాంసి -
సేద్యం.. శూన్యం
ఖరీఫ్ సీజన్లో సగటు వర్షపాతం నమోదైనా..రబీ పంటలకు సాగునీరు అందని దైనస్థితి అన్నదాతలకు ఎదురైంది. కోటి ఆశలతో అప్పులు చేసి పంటలను సాగు చేస్తే మండుతున్న ఎండలతో పంటలు ఎండిపోతుండటంతో ఏమీ చేయని దుస్థితి నెలకొంది. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన రూరల్ జిల్లాలో రైతులు సాగు చేసిన పంటలకు సాగునీరు అందకపోవడంతో బీటలు బారుతున్నాయి. ఈ ఏడు రబీ సీజన్లో సాధారణ సాగు 40,686 హెక్టర్ల విస్తీర్ణం కాగా అన్ని పంటలు కలిపి 37,395 హెక్టార్ల విస్తీర్ణంలో సాగైంది. సాధారణ సాగులో 92శాతమే సాగైనప్పటికీ వర్షాభావ పరిస్థితులతో సాగునీరు అందక 20శాతం పంటలు కూడా చేతికందే పరిస్థితి లేదు. నర్సంపేట: ప్రధానంగా వరి పంట, మొక్కజొన్న పంటలు సాగు చేసిన రైతులకు భారీ స్థాయిలో నష్టం కలుగుతోంది. జిల్లాలో 16,715 హెక్టార్ల విస్తీర్ణంలో వరి పంట సాగు కాగా మొక్కజొన్న 14,853 హెక్టార్ల విస్తీర్ణంలో సాగైంది. నీరు లేక పంట చేతికందే సమయంలో పంటలు ఎండిపోతుండడంతో పశువులకు మేతగా ఉపయోగపడుతుండడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. ఎండల గండం ఎండలు మండుతుండడంతో జలాశయాల్లోని నీరు అడుగంటిపోతుంది. రోజురోజుకు పెరుగుతున్న ఎండల కారణంగా చెరువులతో పాటు జిల్లాలోని ప్రధాన నీటి వనరులైన పాఖాల, మాధన్నపేట, రంగయ్యచెరువు, కోపాకుల చెరువు, చలివాగుల్లో నీరు తగ్గిపోయి బోషిపోతున్నాయి.40 డిగ్రీలు దాటుతున్న ఎండలతో చేతికందాల్సిన పంటలు ఎండిపోతున్నాయి. బోరు బావు కూడా వట్టిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 10.19 మీటర్ల లోతుకు నీరు.. భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలతో భూగర్భజలాలు భారీగా తగ్గిపోయాయి. ఖరీఫ్ సీజన్లో సగటు వర్షపాతం జిల్లాలో నమోదు కావడంతో నీటి వనరుల్లో నీరు ఆశించిన స్థాయిలో నిల్వలేక భూగర్భజలాలపై ప్రభావం పడింది. ఫిబ్రవరి మాసంలో భూగర్భజలాలు 9.41 మీటర్ల లోతుకు పడిపోగా ఏప్రిల్‌లో మండుతున్న ఎండలతో అమాంతం 10.19 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోవడం ప్రమాద ఘటికలకు సూచికగా మారింది. -
రోడ్డెక్కిన రైతన్నలు
ఆర్మూర్ / పెర్కిట్ : రాష్ట్ర ప్రభుత్వమే ఎర్రజొన్నలు, పసుపు పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ ప్రాంత రైతులు మంగళవారం రోడ్డెక్కి నిరసన చేపట్టారు. నాలుగు గంటల పాటు ధర్నాలు, జాతీయ రహదారులపై రాస్తారోకోలు నిర్వహించారు. అయితే రైతుల ధర్నా కారణంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల్లో ఉన్న రైతు నాయకులను సోమవారం అర్ధరాత్రి వారి ఇళ్లలోనే పోలీసులు అరెస్టులు చేశారు. సమీపంలోని ఇతర మండలాల పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో రైతులు మరింత ఆగ్రహానికి లోనై రాస్తారోకోలు చేశారు. కాగా గత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతో వ్యవహరించిన తీరును తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం అనుసరించకుండా ఫ్రెండ్లీ పోలీస్‌గా వ్యహరించాలని ఆదేశాలు జారీ చేయడంతో దీక్ష శాంతి యుతంగా కొనసాగింది. ఆర్మూర్ మండలం మామిడిపల్లి చౌరస్తాలో 63వ నంబర్ జాతీయ రహదారిపైకి ఉదయం నుంచే రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. రైతుల ఉద్యమాన్ని నియంత్రించడానికి పోలీసులు విధిం చిన 144 సెక్షన్‌ను లెక్క చేయకుండా రైతులు గ్రామాల నుంచి కార్లు, మోటార్ సైకిళ్లపై వచ్చారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వ ర్యంలో సుమారు వెయ్యి మందికి పైగా జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ ఎర్రజొన్న పం టకు క్వింటాలుకు రూ. 3,500, పసుపునకు క్విం టాలుకు రూ. 15 వేల గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేసారు. తమ దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు అరెస్టు చేసిన రైతు నాయకులను విడుదల చేయాలన్నా రు. డిమాండ్లు సాధించుకునే వరకు దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. సుమారు నాలుగు గంటల పాటు రైతులు జాతీయ రహదారులపైనే ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అయితే మామిడిపల్లి చౌరస్తాలో రోడ్డుపై వెళ్లే వాహనాలను పోలీ సులు వన్‌వే చేసి దారి మళ్లించారు. ఒక దశలో రైతులు ఆగ్రహానికిలోనై చౌరస్తాలో 63వ నెంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేసారు. దీంతో పోలీసులు ఆ మార్గంలో వచ్చే వాహనాలను ఇతర మార్గాల గుండా మళ్లించి ప్రయాణికులకు అసౌ కర్యం కలగకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో రైతులు రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోతేనే తమ నిరసన తీవ్రత ప్రభుత్వం దృష్టికి వెళ్తుందంటూ ర్యాలీగా మామిడిపల్లి శివారులోని 44వ నెంబర్ జాతీయ రహదారి కూడలికి వచ్చారు. అక్కడ నాలుగు లేన్ల జాతీయ రహదారిపై ఇరువైపుల బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ మార్గం గుం డా వచ్చే వాహనాలను మళ్లించి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్త పడ్డారు. రాజకీయాలకు అతీతంగా సాగిన ఈ ధర్నా, రాస్తారోకోలో రైతుల డిమాండ్లను తెలియజేస్తూ రైతు నాయకులు ఉపన్యసించారు. కాగా ఈనెల 7న ఆర్మూర్ మండలం మామిడిపల్లి చౌరస్తాలో 63వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించిన రైతులు ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి గోవిందు, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి నర్సింగ్‌దాస్, మార్కెటింగ్ ఏడీ రియాజ్‌లకు తమ డిమాండ్లను తెలియజేస్తూ విన తి పత్రాలు సమర్పించారు. ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన కోసం ఐదు రోజులు వేచి చూసిన రైతులు, తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో అధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ధర్నాను కొనసాగిస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. ముందస్తు అరెస్టులు చేసిన రైతు నాయకులను విడుదల చేయాలని సాయంత్రం వరకు ధర్నా నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. తమ డిమాండ్ల సాధనకు ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఆర్మూర్ డివిజన్ పరిధిలో నాలుగు ప్రాంతాల్లో ఏక కాలంలో నిరసన కార్యక్రమాలను కొనసాగించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 16న బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని ముప్కాల్, వేల్పూర్ మండల కేంద్రాలలో, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని జక్రాన్‌పల్లిలో, ఆర్మూ ర్ నియోజకవర్గం పరిధిలోని మామిడిపల్లిలో పెద్ద ఎత్తున్న ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు. అనం తరం ధర్నాను విరమించారు. రాస్తారోకో చేస్తున్న సమయంలో బస్సుప్రయాణికులు తమకు దారి ఇవ్వాల్సిందిగా వాగ్వాదానికి దిగినా పట్టించుకోని రైతులు ఆర్మూర్ వైపు వస్తున్న అంబులెన్స్‌కు మాత్రం దారి ఇచ్చి వెళ్లనిచ్చారు. సంయమనం పాటించిన పోలీసులు.. 2008లో పోలీస్ శాఖ వైఫల్యం కారణంగా ఎర్ర జొన్న రైతుల ఉద్యమం హింసాయుతంగా మా రింది. మంగళవారం ఆర్మూర్‌లో జరిగిన రైతు ఉద్యమంలో అడుగడుగునా పోలీసుల తీరు ప్ర శంసనీయంగా కనిపించింది. ఉదయం నుంచే పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించా రు. సీపీ కార్తికేయ ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ శ్రీధర్‌రెడ్డి, ట్రెయిన్ ఐపీఎస్ గౌస్ ఆలం, ఆర్మూ ర్ ఏసీపీ రాములు, సీఐలు, ఆర్ ఎస్సైలు, సివి ల్ ఎస్సైలు నిజామాబాద్, బోధన్, ఆర్మూర్‌కు చెందిన ఏఆర్, సివిల్ కానిస్టేబుల్ బలగాలతో భారీ బందోబస్తు నిర్వహించారు. 144 సెక్షన్‌ను లెక్క చేయకుండా తరలి వచ్చిన రైతులను ఇ బ్బంది పెట్టకుండా పోలీసులు సంయమనాన్ని పాటించారు. దీక్ష చేస్తున్న రైతులు సహనం కో ల్పోయిన ప్రతిసారి పోలీసులు వారిని బుజ్జగి స్తూ శాంతి యుతంగా దీక్ష చేయడానికి సహకరించారు. పోలీసు బలగాలు లాఠీలను గాని ఆ యుధాలను గాని తీసుకుని రాకుండా ఫ్రెండ్లీ పోలీస్‌లా వ్యవహరించడం పలువురి ప్రశంసల కు కారణమైంది. మరో వైపు 63వ నెంబర్ జాతీ య రహదారి, 44వ నెంబర్ జాతీయ రహదారులపై రైతులు రాస్తారోకో నిర్వహిస్తున్న సమయంలో ట్రాఫిక్ జామ్ జరగకుండా పోలీసులు ట్రాఫిక్‌ను డైవర్ట్ చేయడానికి వ్యవహరించిన తీరును పలువురు అభినందించారు. -
కిసాన్.. ముస్కాన్!
సాక్షి వనపర్తి : కేంద్ర ప్రభుత్వం రైతులకు గుర్తుండిపోయేలా వరమిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం తరహాలోనే సమ్మాన్ నిధి పేరుతో రెండు హెక్టార్లు (5 ఎకరాలు) ఉన్న రైతులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6వేలు అందిస్తామని పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా ఉన్న సన్న, చిన్న కారు రైతులకు ఎంతో మేలు జరగనుంది. రైతులకు మేలుచేసే బడ్జెట్ పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రి పీయుష్ గోయల్ శుక్రవారం ఉదయం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టినవిషయం విధితమే. ఈ బడ్జెట్ ఇన్నాళ్లూ సంక్షోభంలో కొట్టుమిట్టాడిన రైతాంగానికి ఊరటనిచ్చింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం పేరుతో ఎకరానికి రూ.4వేల చొప్పున ఏడాదికి రూ.8వేలు అందిస్తోంది. మరో అడుగు ముందుకేస్తూ ఏడాదికి ఎకరానికి రూ.10 వేలు అందిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ఈ పథకం తరహాలోనే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చివరి బడ్జెట్లో 2 హెక్టార్ల లోపు అంటే 5 ఎకరాల లోపు భూమి ఉన్న సన్న, చిన్న కారు రైతులకు మాత్రమే ఏడాదికి మూడు పర్యాయాలు రెండు ఎకరాల చొప్పున మొత్తం రూ.6 వేలు అందిస్తామని ప్రకటించింది. రైతుబంధు స్ఫూర్తితో.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కేంద్రం దృష్టిని ఆకర్షించింది. ఈ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వారివారి రాష్ట్రాల్లో ఈ తరహా పథకాలను ప్రవేశపెడతామని ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు ఇదే అంశంపై మాట్లాడారు. రైతుబంధు పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం భారీ మెజార్టీతో మరోసారి అధికారంలోకి రావడంలో రైతుబంధు పథకం కీలకంగా మారింది. దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా అధిక శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ రంగం పైనే ఆధారపడ్డారు. కిసాన్‌కు సమ్మాన్ ఎన్నికల ముందు ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు రైతులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేయడం సర్వసాధారణం. అదే తరహాలో కేంద్ర ప్రభుత్వం రైతుల మద్దతు పొందడానికి పార్లమెంట్ ఎన్నికలకు ముందు ‘కిసాన్ సమ్మాన్ నిధి’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. కేవలం 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులందరికీ ఈ పథకం వర్తించనుంది. ఎకరానికి రూ.6 చొప్పున సంవత్సరంలో మూడు పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. ఐదు ఎకరాలున్నవారికే.. భూ రికార్డుల ప్రక్షాళన ప్రకారం జిల్లాలో 1,52,621 మంది రైతులు ఉన్నారు. ఖరీఫ్ సీజన్లో 1,21,839 మంది రైతులకు ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున రూ.125 కోట్ల 16 లక్షలను పంపిణీ చేశారు. అదే రబీ సీజన్లో 1,07,528 మంది రైతులకు రూ.117 కోట్ల 51 లక్షల 66 వేలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇదిలాఉండగా జిల్లాలో ఒక హెక్టారు లోపు భూమి ఉన్న రైతులు 85,944 , రెండు హెక్టార్ల లోపు ఉన్న రైతులు 31,474 మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ పథకానికి 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులే అర్హులుగా ప్రకటించగా నిజానికి జిల్లాలో 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులే అధికంగా ఉన్నారు. 4 హెక్టార్లలోపు భూమి ఉన్న వారు 15,557 మంది, 10 హెక్టార్ల లోపు ఉన్న వారు 4,002 మంది, 10 హెక్టార్ల కంటే అధికంగా ఉన్న వారు 350 మంది ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకంలో భూమి కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి పెట్టుబడి సాయం అందుతోంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో.. జిల్లాలో ఒక హెక్టారు భూమి ఉన్న రైతులు 1,42,416 మంది ఉన్నారు. అలాగే రెండు హెక్టార్ల భూమి ఉన్న రైతులు 67,658 మంది ఉన్నారు. అదేవిధంగా 4 హెక్టార్ల లోపు భూమి ఉన్న రైతుల 33,672 , 4 నుంచి 10 హెక్టార్లలోపు 8563 మంది, 10 హెక్టార్లకు మించి భూమి కలిగి ఉన్న వారు 841 మంది రైతులు ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో... ఒక హెక్టారు 1,80,328, రెండు హెక్టార్లు ఉన్న రైతులు 77,611 మంది, 4 హెక్టార్ల లోపు భూమి ఉన్న రైతులు 38,264, 4 నుంచి 10 హెక్టార్లలోపు 11,618, 10 హెక్టార్లకు పైగా ఉన్న వారు 1263 మంది ఉన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో.. ఈ జిల్లాలో ఒక హెక్టారు ఉన్న రైతులు 76,414 మంది, రెండు హెక్టార్లు ఉన్న రైతులు 39,038 మంది ఉన్నారు. అలాగే నాలుగు హెక్టార్ల లోపున్నవారు 20,267 మంది, 4 నుంచి 10 హెక్టార్లలోపు 6,026, 10 హెక్టార్లకు మించి భూమి కలిగి ఉన్న వారు 620 మంది రైతులు ఉన్నారు. -
మార్కెట్ల కథ కంచికేనా?
విశ్వనగరం దిశగా అడుగులు వేస్తున్న భాగ్యనగరంలో అతిముఖ్యమైన ‘మార్కెట్ల’ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. జనాభా కోటికి చేరువైన గ్రేటర్ నగరంలో అవసరాలకు తగినట్లుగా నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు విక్రయించేందుకు అవసరమైన మార్కెట్లు, రైతుబజార్లు లేవు. వాస్తవంగా నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున రైతుబజార్ ఏర్పాటు చేయాలి. కానీ గ్రేటర్ పరిధిలో కేవలం 11 రైతుబజార్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న జనాభా అవసరాలు తీర్చేందుకు 50కి పైగా మార్కెట్లు అవసరం. అత్యాధునిక రైతుబజార్లు, మార్కెట్లు అందుబాటులో లేనికారణంగా పలు కాలనీలు, బస్తీల జనం దాదాపు ఐదారు కిలోమీటర్లు ప్రయాణించి...మూడు నుంచి నాలుగు గంటల సమయం వెచ్చించి తమకు కావాల్సిన కూరగాయలు, పండ్లు తెచ్చుకొని నిల్వ చేసుకుంటున్నారు. నాలుగేళ్ల క్రితం సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ మోండా మార్కెట్‌ను సందర్శించినప్పుడు నగర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మార్కెట్లు నిర్మిస్తామని చెప్పినా సాధ్యం కాలేదు. సాక్షి సిటీబ్యూరో: చారిత్రక హైదరాబాద్ అధునాతన అభివృద్ధికి కేంద్రంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో ‘డైనమిక్ సిటీ’గా రెండో స్థానం దక్కించుకుంది. వరుసగా మూడో ఏడాది కూడా అగ్రభాగాన నిలిచి నగర కీర్తిని విశ్వవ్యాప్తం చేసింది. నిత్యం ఉపాధికోసం వేలమంది వస్తున్న ఈ సిటీలో జనాభా కోటికి చేరువైంది. అయితే, ఇంత మందికి సరిపడా నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు సమకూర్చేందుకు ఇప్పటికీ సరైన ఏర్పాట్లు లేవు. దశాబ్దాల క్రితం నెలకొల్పిన రైతుబజార్లు తప్ప.. కొత్తగా ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు అంటూ లేవు. సుమారు 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నగరంలో నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున రైతుబజార్ ఏర్పాటు చేయాలి. కానీ గ్రేటర్ పరిధిలో ఉన్నవి కేవలం 11 రైతుబజార్లు మాత్రమే. ప్రస్తుతం ఉన్న జనాభా అవసరాలు తీర్చేందుకు 50కి పైగా మార్కెట్లు అవసరమని నిపుణుల అంచనా. పలు కాలనీలు, బస్తీ జనం దాదాపు ఐదారు కిలోమీటర్లు ప్రయాణించి మూడు నుంచి నాలుగు గంటలు సయం వెచ్చించి రైతు బజార్లల నుంచి తమకు కావాల్సిన కూరగాయలు తెచ్చుకొని నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సరిపడని రైతు బజార్లు లేవు ఆరుగాలం కష్టపడి పండించే రైతుకు గిట్టుబాటు ధర అందాలని, నగర ప్రజలకు తక్కువ ధరలకు ఫ్రెష్ కూరగాయలు అందాలని 1999లో రైతుబజార్లను అందుబాటులోకి తెచ్చారు. ఆనాటి జనాభా గ్రేటర్ జనాభా 40 లక్షలు మాత్రమే. అందుకు అనుగుణంగా ఏర్పాటు చేసిన రైతబజార్లు ప్రస్తుత జనాభాకకు సరిపోవడంలేదు. మార్కెటింగ్ శాఖ కొత్తగా ఏర్పాటు చేయాలన్నా నగరంలో ఖాళీ స్థలాలు దొరకడం లేదు. రెవెన్యూ, జీహెచ్ఎంసీ, నీరుపారుదలశాఖ, హెచ్ఎండీఏ, వక్ఫ్ పరిధిలో ఉన్న అనేక ఖాళీ స్థాలాలు కబ్జాకు గురయ్యాయి. కనీసం ఎకరం స్థలం చూపితే గాని రైతుబజార్ ఏర్పాటు చేయమని మార్కెటింగ్ శాఖ చెబుతోంది. ఈక్రమంలో పలు ప్రాంతాల్లో అంతకంటే తక్కువగా ఉన్న స్థలాలను వాడుకోలేని పరిస్థితి నెలకొంది. అందుబాటులోకి రాని మోడల్ మార్కెట్లు గ్రేటర్లో ప్రతి 10 వేల మంది జనాభాకు ఓ రైతుబజార్ లేదా మాడల్ మార్కెట్ ఉండాలని, అందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు ప్రారంభించింది. కానీ ఇంత వరకు మోడల్ మార్కెట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. రైతుబజార్లుల్లో దళారుల రాజ్యం ప్రస్తుతం నగరంలో ఉన్న రైతు బజార్లలో దళారులు రాజ్యమేలుతున్నారు. రైతులకు నామమాత్రంగా కార్డులు కేటాయించి మార్కెట్లను వ్యాపారులకు కట్టబెట్టారు. పలు సందర్భాల్లో ఉన్న కొద్దిపాటి రైతులకు స్థాలాలు దొరక్క రైతుబజార్ల బయట విక్రయాలు చేస్తున్నారు. నగరంలోని ఒక్కో రైతుబజార్లో సాధారణ రోజుల్లో 200 క్వింటాళ్ల కూరగాయల వ్యాపారం జరుగుతుందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక ఎర్రగడ్డ, కూకట్పల్లి, సరూర్‌నగర్, మెహిదీపట్నం వంటి పెద్ద మార్కెట్లలో 3500 క్వింటాళ్ల కూరగాయలు అమ్మకాలు చేస్తారు. ఒక్కో రైతుబజార్లో రోజుకు రూ.20 లక్షల వరకు వ్యాపారం జరగుతుంది. శని, అదివారాల్లో రూ.50 లక్షల అమ్మకాలు జరుగుతాయిని వ్యాపారుల అంచనా. ఈ మొత్తం విక్రయాలు రైతుల పేరిట అక్కడి వ్యాపారులు సాగిస్తున్నారు. వీరి వ్యాపారానికి ఎక్కడా బిల్లులు ఉండవు.. వాణిజ్య పన్నూ ఉండదు. సీఎం కేసీఆర్ చెప్పిన మాట ఇదీ.. నగరంలో గత పాలకుల హయాంలో ఏర్పాటు చేసిన మార్కెట్లే తప్ప కొత్తవి రాలేదని, దీంతో తక్కువ స్థలంలో ఎక్కువ మంది అమ్మకాలు చేయడం వల్ల అసౌకర్యంగా ఉందని నాలుగేళ్ల క్రితంముఖ్యమంత్రి కేసీఆర్ సికింద్రాబాద్ మోండా మార్కెట్ సందర్శించినప్పుడు పేర్కొన్నారు. ‘పదివేల మంది జనాభాకు ఒక మార్కెట్ ఉండాలి. నగర వ్యాప్తంగా కేవలం 30 మార్కెట్లు (రైతు బజార్లతో కలిపి) మాత్రమే ఉన్నాయి. ఇవి ఏ మూలకూ సరిపోవు. ప్రజల అవసరాల కనుగుణంగా తగినిన్ని మార్కెట్లు నిర్మాస్తాం. మోండా మార్కెట్‌ను అధునీకరిస్తాం’ అని పేర్కొన్నారు. అందుకనుగుణంగా జీఎచ్ఎంసీ అధికారులు పనులకు శ్రీకారం చుట్టారు. తొలిదశలో 200 మోడల్ మార్కెట్లు నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే, ఈ నాలుగేళ్లలో కేవలం 30 మోడల్ మార్కెట్లు నిర్మించినప్పటీకీ వాటిలో దుకాణాల కేటాయింపు జరగలేదు. స్థలం దొరకడం లేదు.. కొత్తగా రైతుబజార్ల ఏర్పాటు ప్రణాళికలు సిద్ధం చేశాం. కానీ, గ్రేటర్ పరిధిలో అనుకూలమైన స్థలాలు లభించడం లేదు. కనీసం ఎకరం స్థలం అయినా అవసరం. నగర ప్రజల కూరగాయల అవసరాలు తీర్చడాకి ‘మన కూరగాయల స్టాల్స్’ను పెంచుతున్నాం. – లక్ష్మీబాయి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ -
మూడుపువ్వులు ఆరుకాయలు
మంచిర్యాలఅగ్రికల్చర్: పత్తి కొనుగోలు వ్యాపారంలో దళారులు రంగప్రవేశం చేసి అక్రమ పద్ధతిలో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. నేరుగా గ్రా మాల్లో రైతుల వద్దకు వెళ్లి పత్తి కొనుగోలు చేస్తున్నారు. తుకాల్లో మోసాలకు పాల్పడుతూ ఇష్టం వచ్చిన రేటుకు కొనుగోలు చేస్తూ రైతులను నష్టపరుస్తున్నారు. జిల్లాలో అధికారులు సాధారణ ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. అక్రమ కొనుగోళ్లపై పర్యావేక్షణ కొరవడడంతో దళారులకు మూడుపువ్వులు ఆరుకాయలుగా మారింది. తూకాల్లో భారీ మోసం అంతర్జాతీయ మార్కెట్లో పత్తి డిమాండ్ పెరుగుతోంది. ఇదే అదనుగా భావించిన కొంత మంది వ్యాపారులు సొమ్ము చేసుకునేందుకు రైతుల వద ్దకు చేరుతున్నారు.క్వింటా పత్తికి ప్రభుత్వ మద్దతు ధర రూ.5450 ధర ఉండగా.. దళారులు అద నంగా రూ.100 నుంచి రూ. 200 చెల్లిస్తూ తూకా ల్లో మాయజలం ప్రదర్శించి రైతులను నష్టపరు స్తున్నారు. క్వింటా పత్తికి 6 నుంచి 10 కిలోల వర కు తూకాల్లో మోసానికి పల్పడుతున్నారు. దీంతో రైతులు క్వింటాళుకు రూ. 500 నుంచి రూ. 600 వరకు నష్టపోతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి మార్కెట్ కమిటీ ఆదాయానికి గండి కొడుతున్నారు. సేస్ రూపకంగా మార్కెట్‌కు రావాల్సిన ఫీజు రాకుండా పోతుంది. గ్రామాల్లో కొనుగోలు చేసిన పత్తిని రాత్రికి రాత్రే బొలేరో, టాటా మ్యాక్స్, డీసీఎం వాహనాల ద్వారా తరలిస్తున్నా రు. పత్తి పంటలు సాగు చేసిన సమయంలో పెట్టు బడులు కోసం ఇచ్చిన అప్పులను తిరిగి తీసుకునేందుకు కొందరు ఈ వ్యాపారం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జిల్లాలో సీసీఐ మందమర్రి, హాజిపూర్, మంచిర్యాల, నస్పూర్ మండలాలకు మంచిర్యాల మార్కెట్‌కమిటీ ద్వారా ముల్కల్లలోని జిన్నింగ్ మిల్లులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి, కాసిపేట, నెన్నెల, భీమిని, తాండూర్, కన్నెపెల్లి మండలాలకు బెల్లంపల్లి మార్కెట్ పరిధిలోని రేపల్లివాడలోని జిన్నింగ్ మిల్లులో, లక్సెట్టిపేట, దండెపల్లి, జన్నారం మండలాల రైతుల సౌకర్యార్థంకోసం లక్సెట్టిపేట మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీముఖి ఇండస్ట్రీస్‌లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి, భీమారం, జైపూర్ మండలాల రైతుల కోసం చెన్నూర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మూడు జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయినా ఈ ఏడాది సీసీఐ ఇప్పటి వరకు ఒక్క క్వింటా పత్తి సైతం కొనుగోలు చేయలేదు. మద్దతు ధర కంటే ఎక్కువగానే ప్రైవేటు వ్యాపారులు చెల్లిస్తుండడంతో రైతులు అటువైపు మొగ్గు చూపుతున్నారు. కొరవడిన పర్యవేక్షణ పత్తి అక్రమ కొనుగోళ్లపై దృష్టి సారించి మార్కెట్ ఆదాయానికి గండి పడకుండా రైతులు నష్టపోకుండా చూడాల్సిన అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. పత్తి కొనుగోలు సీజన్లో మార్కెటింగ్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. కానీ అధికారులంతా ఎన్నికల విధుల్లో ఉండడంతో దళారులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. జిల్లాలో కొనుగోలు చేస్తున్న పత్తిని భైంసా, ఆదిలాబాద్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈప్రాంతంలోని జిన్నింగ్ మిల్లుల్లో ప్రైవేటు వ్యాపారులు ఎక్కువగా ధర చెల్లిస్తుండడంతో కొనుగోలు చేసిన పత్తిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. -
ఎర్రజొన్నకు బదులు మొక్కజొన్న...
మోర్తాడ్(బాల్కొండ): ఎర్రజొన్న సీడ్ పంపిణీకి అధికార యంత్రాంగం ఆంక్షలు విధించిన నేపథ్యంలో రబీ సీజనుకు గాను రైతులు మొక్కజొన్న పంటను సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. మోర్తాడ్, బాల్కొండ, వేల్పూర్, మెండోరా, ముప్కాల్, ఏర్గట్ల, ఆర్మూర్, నందిపేట్, జక్రాన్‌పల్లి మండలాల్లో ప్రతి రబీ సీజనులో ఎర్రజొన్నలను రైతులు సాగు చేస్తారు. దాదాపు 50 వేల ఎకరాల్లో ఎర్రజొన్నలు సాగు అవుతున్నాయి.గతంలో ఎర్రజొన్నలకు క్వింటాలుకు రూ.3వేల నుంచి రూ.4వేల ధర చెల్లించిన వ్యాపారులు కొంత కాలం నుచి ధరను తగ్గించారు. గడచిన సీజనులో ఎర్రజొన్నలకు వ్యాపారులు రూ.1,700 నుంచి రూ.1,800 వరకు ధర చెల్లిస్తామని ప్రకటించారు. దీంతో రైతులు ఆందోళన నిర్వహించగా ప్రభుత్వం ముందుకు వచ్చి మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటాలు ఎర్రజొన్నలను రూ.2,300 ధరకు కొనుగోలు చేసింది. అయితే ఎర్రజొన్నల కొనుగోలు వల్ల ప్రభుత్వ ఖజానాకు భారం ఏర్పడటంతో పాటు కొన్న ఎర్రజొన్నలు గోదాంలలో నిలువ ఉండిపోయాయి. దీంతో మార్క్‌ఫెడ్ సంస్థకు నష్టం వాటిల్లింది. మార్క్‌ఫెడ్ సంస్థ ప్రభుత్వ రంగానికి సంబంధించింది కాగా, ఈసారి ఎర్రజొన్నలను సాగు చేస్తే మళ్లీ ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తారనే ఉద్దేశంతో సీడ్ పంపిణీ విషయంలో అధికార యంత్రాంగం ఆంక్షలు విధించింది. రైతులకు సీడ్ పంపిణీ చేసే వ్యాపారులే ఎర్రజొన్నలను కొనుగోలు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఇందులో భాగంగా బడా సీడ్ వ్యాపారులు, రైతు సమన్వయ సమితి సభ్యులతో జిల్లా ఉన్నతాధికారులు సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాలలో సీడ్ ఇచ్చే వ్యాపారులే రైతులతో ఒప్పందం కుదుర్చుకుని ఎర్రజొన్నలను కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. అలాగే ధర ఒప్పందంను కుదుర్చుకుని రైతులు నష్టపోకుండా వ్యాపారులు చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు తీర్మానించారు. రైతు సమన్వయ సమితి సభ్యులు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి సీడ్ ఇచ్చే వ్యాపారులను గుర్తించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సీడ్ ఇవ్వడానికి ఆసక్తిని చూపిన వ్యాపారులు ధర ఒప్పందం చేసుకోవడంతో పాటు ఎర్రజొన్నలను కొనుగోలు చేసే ఆంశంపై వెనుకడుగు వేశారు. సీడ్ ఇచ్చి ఎర్రజొన్నల కొనుగోలుకు ముందుకు రాని వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో హడలిపోయిన కొందరు వ్యాపారులు ఎర్రజొన్నల సీడ్ ఇవ్వడానికి విముఖత కనబరుస్తున్నారు. కొందరు రైతులు మాత్రం అధికారుల ఆంక్షలు పట్టించుకోకుండా వ్యాపారుల నుంచి సీడ్‌ను కొనుగోలు చేస్తున్నారు. మరి కొందరు రైతులు ఎర్రజొన్నలను సాగు చేసి ఇబ్బంది పడటంకంటే ఆ పంట స్థానంలో మొక్కజొన్న పంటను సాగు చేయడం మేలు అని భావిస్తున్నారు. ఇప్పటికే ఎర్రజొన్నల విత్తనాలను పోయాల్సి ఉండగా రైతులు మొక్కజొన్న సాగు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మక్కలకు క్వింటాలుకు రూ.1,700 మద్దతు ధర ఉండటం వల్ల మొక్కజొన్న సాగుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఎర్రజొన్నల సీడ్ పంపిణీకి ఆంక్షలు అమలు అవుతుండటంతో ఈ పంట సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా రబీ సీజనులోను రైతులు మొక్కజొన్న సాగుకు మొగ్గు చూపుతుండటం గమనార్హం. -
అగచాట్లు
సాక్షి కడప : విత్తనాల కోసం రైతులకు అగచాట్లు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తగా శనగ విత్తన కంపెనీకి వ్యవసాయశాఖ శ్రీకారం చుట్టింది. మొదటిరోజు సర్వర్‌తోపాటు ఆన్లైన్ సమస్యలు ఏర్పటడంతో ఇబ్బందులు తలెత్తాయి. బుడ్డశనగ విత్తన కాయల కోసం రాజుపాలెం, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు ప్రాంతాల్లో రైతులు భారీగా బారులు తీరుతున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలుచోవాల్సి వస్తోందని వాపోతున్నారు. శుక్రవారం పులివెందుల ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో క్యూలైన్లలో నిలుచున్న మహిళలను స్థానిక మహిళా పోలీసులు లాగేశారు. పోలీసుల మాటలతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.ఉన్నతాధికారులు స్పందించి విత్తనాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఊరించిన సద్దిబువ్వ
గద్వాల వ్యవసాయం : పంటలు చేతికొచ్చాయి. గ్రామీణ ప్రాంతాలనుంచి పంట ఉత్పత్తులను విక్రయించడానికి మార్కెట్ యార్డులకు వస్తున్న రైతులు ఆకలితో అలమటిస్తున్నారు. ఉదయం 9గంటలకే యార్డులకు వెళ్లి సాయంత్రం దాకా కాంట పూర్తయ్యే వరకు తిండితిప్పలు లేకుండా ఉంటున్నారు. మార్కెట్ యార్డులకు వచ్చే రైతుల కోసం ప్రభుత్వం ‘సద్దిబువ్వ మూట’ పేరుతో ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. రూ.5కే భోజనాన్ని అందిస్తామని ఏడాదిన్నర క్రితం ప్రకటించింది. కానీ ఆ మాటను మరిచిపోవడంతో నిత్యం అన్నదాతలు పస్తులుండాల్సి వస్తోంది. పొద్దూకులూ మార్కెట్లోనే.. పంట ఉత్పత్తులను విక్రయించేందుకు రైతులు ఉదయం 8గంటల నుంచే యార్డులకు వస్తుంటారు. తీసుకొచ్చిన ధానాన్ని యార్డుల్లో రాశులుగా పోసి పొద్దస్తమానం వాటికి కాపలాగా అక్కడే ఉంటారు. 11 గంటల ప్రాంతంలో వ్యాపారులు ధాన్యాన్ని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటల తర్వాత ధరలు కోడ్ చేస్తారు. 1:30 గంటల తర్వాత టెండర్ ప్రక్రియ ముగిసి అప్పుడు రైతులకు తమ పంట ఉత్పత్తులకు వచ్చిన ధరలు తెలుస్తాయి. ఇక్కడితో పని అయిపోదు. టెండర్ తర్వాత హమాలీలు మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత కాంట వేస్తారు. దాదాపు 3:30 గంటల వరకు ఈ తంతు జరుగుతుంది. కాంట పూర్తయి అక్కడి నుంచి ధాన్యం వెళ్లే వరకు రైతులు అక్కడే ఉంటారు. దాదాపు సాయంత్రం 4గంటల వరకు తిండి తిప్పలు లేకుండా ఉంటారు. కళ్లు కాయలు కాచేలా.. పంట ఉత్పత్తులకు సరైన ధర వస్తుందా.. రాదా అని ఆలోచించుకుంటూ పంటను కాపాడుకుంటూ అక్కడే ఉంటారు. టెండర్ పూర్తయినా కాంట కాదు కాబట్టి ఎవైనా జంతువులు వచ్చి పంటను తినేస్తాయేమోనన్న భయ ఒకపక్క.. ఎవరైన ధాన్యాన్ని తస్కరిస్తారన్న భయం మరోపక్క వారిని కళ్లకు కనుకు లేకుండా చేస్తుంది. కనీసం నీళ్ళు తాగి రావాల్సి వచ్చినా తోటి రైతులకు కొంచెం సేపు చూడమని చెప్పి వెళ్తుంటారు. ఇలా సాయంత్రం వరకు ఆకలి దప్పులకు ఓర్చి పంట ఉత్పత్తులను కాపాడుకుంటూ మార్కెట్లోనే కూర్చుంటారు. ‘మూట’ మాట ఏమైనట్టు? రైతుల అవస్థలు గుర్తించిన ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం ‘సద్దిబువ్వ మూట’ పేరుతో రూ.5కే భోజన పథకాన్ని ప్రకటించింది. అందులో భాగంగా పథకం నిర్వహణ బాధ్యతలను రెండు స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. ప్లేటు భోజనం తయారీ ఖర్చులో రూ.5 సంబంధిత మార్కెట్ కమిటీ తన వాటా కింద చెల్లించాలి. మిగతా ఖర్చులను ఆ స్వచ్ఛంద సంస్థ భరించాల్సి ఉంటుంది. రైతుకు మాత్రం రూ.5కే భోజనం పెట్టాలి. ఏ రోజుకు ఆ రోజు యార్డులకు పంట ఉత్పత్తులను విక్రయించేదుకు వచ్చిన ప్రతి రైతుకు భోజనం అందించాల్సి ఉంటుంది. అయితే ఇంత వరకు ఆ సంస్థలు ఎక్కడా కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. ప్రభుత్వం సద్దిబువ్వ మూటను నీటిమూటగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజనం పెడితే బాగుంటది మార్కెట్ యార్డులకు రైతులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. కొందరు మాత్రమే భోజనం తెచ్చుకుంటారు. తెల్లవారుజామున బయల్దేరిన చాలా మందికి తెచ్చుకోవడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వం ప్రక టించిన విధంగా రూ.5లకే భోజనం అందిస్తే బాగుంటది. ఆదేశాలు రాలేదు సద్దిబువ్వ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటివరకు అమలు చేసేందుకు విదివిధానాలకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాలేదు. వచ్చిన వెంటనే అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. -
మార్కెట్ కార్యదర్శి ఆకస్మిక తనిఖీ
వరంగల్ సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి పొలెపాక నిర్మల గురువారం మిర్చి యార్డును ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యదర్శిని చూడగానే చిల్లర దొంగలు దొంగలించిన మిర్చి బస్తాలను వదిలివేసి పారిపోయారు. అప్పటికి సెక్యూరిటీ గార్డులు అందుబాటులో లేకపోయో సరికి కార్యదర్శినే స్వ యంగా దొంగ బస్తాలను యార్డులోకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న యార్డు ఇంచార్జీలు జన్ను భాస్కర్, బీ.వెంకన్న, సెక్యూరిటీ గార్డులు కార్యదర్శి వద్దకు చేరుకొని తనిఖీలో పాల్గొన్నారు.అనంతరం యార్డు ఏఎస్.వేముల వెంకటేశ్వర్లు దగ్గరుండి కార్యదర్శికి సహకరిస్తూ..చిల్లర దందాగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. సెక్యూరిటీ గార్డులు సరిగా విధులు నిర్వర్తించడం లేదని కార్యదర్శి వారిపై అసహనం వ్యక్తం చేశారు. మరోసారి చిల్లర దొంగలు, వ్యాపారులు మిర్చి దందా చేస్తున్నట్లు తన దృష్టికి వస్తే చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోనని హెచ్చరించారు. బస్తాలు దొరికిన చిల్లర దొంగలు తమ బస్తాలను తీసుకెళ్లడానికి వివిధ రకాలుగా ఫైరవీలు చేసినా కార్యదర్శి ససేమీరా ఒప్పుకోలేదు. తనిఖీలో స్వా« దీనం చేసుకున్న 1.38 క్వింటాళ్ల మిర్చిని యార్డులోనే అమ్మి, మార్కెట్ ఫీజు కింద జమచేశారు. రైతులను ఇబ్బంది పెడితే సహించం.. మార్కెట్‌కు మిర్చి అమ్మకానికి వచ్చిన రైతులను మునీమ్, దానం, దయ పేరుతో మిర్చిని తీసుకోవడానికి ఇబ్బంది పెడితే సహించేదిలేదని మార్కెట్ కార్యదర్శి పి.నిర్మల హమాలీ కార్మికులను హెచ్చరించారు. గురువారం మిర్చి మార్కెట్లో కార్యదర్శి అకస్మిక తనిఖీ నిర్వహించిన సమయంలో కొందరు హమాలీల వద్ద చిల్లర మిర్చి బస్తాలను గుర్తించిన కార్యదర్శి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. హమాలీలు సక్రమంగా డ్యూటీ చేయాలని, లేదంటే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. -
ఉమా.. ఏంటీ డ్రామా!?
ఎంపీలు, ఎమ్మెల్యేలు సూచించే పనులపై ఆరా అభివృద్ధి పనుల గురించి తనకు తెలియాలని హుకుం మండిపడుతున్న ప్రజాప్రతినిధులు సాక్షి, విజయవాడ : జిల్లాపై పట్టు కోసం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకోవడం తరచూ వివాదాస్పదమవుతోంది. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ అధికారులంతా తాను చెప్పినట్లే వినాలని ఉమా చెబుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని అన్ని సమస్యలపై మిగిలిన ఇద్దరు మంత్రులకన్నా ముందుగానే స్పందిస్తూ మీడియాను ఉపయోగించుకుని హడావుడి చేస్తున్నారు. ఉమా వ్యవహారశైలి టీడీ పీ ప్రజాప్రతినిధులకే మింగుడు పడటం లేదు. బార్లు, ఇసుక రీచ్‌లు ఉమా అనుచరులకే..! బార్లు, ఇసుక రీచ్‌ల కేటాయింపు విషయంలో దేవినేని ఉమా కీలకంగా వ్యవహరించారని సమాచారం. తనకు అనుకూలంగా ఉండే వారికే బార్లు దక్కేవిధంగా అధికారులకు పలు సూచ న లు చేసినట్లు తెలిసింది. ఇంద్రకీలాద్రి, రైతుబజార్లు వంటి ఆదాయాలు వచ్చే విభాగాల కార్యకలాపాల గురించి కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ అధికారులకు ఆదేశాలు జారీచేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు మండిపడుతున్నారు. నియోజకవర్గాలపై పట్టు కోసం తహతహ ! జిల్లాలో ఎమ్మెల్యేలు సూచించే పనులను తనకు చెప్పకుండా చేయవద్దంటూ మంత్రి ఉమా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ విషయం పసిగట్టిన నగరానికి సమీపంలో ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే ఒకరు తన సహచర శాసనసభ్యుల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చెప్పిన విధంగా తాము ప్రజల్లోకి వెళ్లినప్పుడు అక్కడ వారు చెప్పిన సమస్యలను పరిష్కరించాలని అధికారులకు చెప్పిన తర్వాత మళ్లీ మంత్రి సమీక్షించడం ఎంతవరకు సమంజసమంటూ కొత్తగా ఎన్నికైన ఆ ఎమ్మెల్యే వాపోతున్నారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ చనిపోవడంతో ఆ నియోజకవర్గంపై ఉమా పూర్తిగా పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉప ఎన్నిక జరిగితే ప్రభాకర్ కుమార్తె రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఉమా మాత్రం తాను సూచించిన వ్యక్తికే టికెటు వచ్చేలా పావులుకదుపుతున్నట్లు సమాచారం. తిరువూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ గెలవడంతో అక్కడ జరిగే అభివృద్ధి పనులన్నీ తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. కేశినేని నానికి చెక్! ఎన్నికలకు ముందు నుంచి ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), మంత్రి దేవినేని ఉమా మధ్య ఆధిపత్యపోరు సాగుతోంది. ఇప్పుడు కేశినేని నానికి చెక్ పెట్టేందుకు దేవినేని ఉమా ప్రయత్నిస్తున్నారు. దుర్గగుడి వద్ద ఫ్లై ఓవర్ నిర్మించడంపై కేశినేని నాని రెండు ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేసుకోగా, ఇటీవల జరిగిన ఇరిగేషన్ అధికారులు సమావేశంలో ఫ్లై ఓవర్ గురించి ప్రణాళికలు సిద్ధం చేయాలని మళ్లీ దేవినేని ఉమా ఆదే శాలు జారీచేశారు. దీంతో అధికారులు కంగుతిన్నారు. ఫ్లై ఓవర్ వంటి కీలక విషయాల్లోనే ఇద్దరు ముఖ్య నేతల మధ్య ఐక్యత లేకపోవడం చర్చనీయాశంగా మారింది. ఉమా వ ర్గీయులకు నామినేటేడ్ పదవులు దక్కుతాయా! ప్రస్తుతం ఉన్న పలు పాలకవర్గాలను రద్దు చేసి కొత్తగా కమిటీలను నియమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఈ దశలో జిల్లాపై దేవినేని ఉమా పట్టు కోసం పాకులాడటం మిగిలిన ప్రజా ప్రతినిధులకు రుచించడం లేదు. ఉమా సూచించిన వ్యక్తులకే కీలక పదవులు దక్కితే, తమను నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటని ముఖ్య నేతలు పేర్కొంటున్నారు. నామినేటెడ్ పదవులు కేటాయించే నాటికి ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు కొందరు ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. ఉమాకు వ్యతిరేకంగా ఒక బలమైన వర్గాన్ని తయారుచేయాలని వారు చర్చించుకుంటున్నారు.