గద్వాల మార్కెట్‌యార్డులో ధాన్యాన్ని కాంటా వేస్తున్న హమాలీలు
గద్వాల వ్యవసాయం : పంటలు చేతికొచ్చాయి. గ్రామీణ ప్రాంతాలనుంచి పంట ఉత్పత్తులను విక్రయించడానికి మార్కెట్ యార్డులకు వస్తున్న రైతులు ఆకలితో అలమటిస్తున్నారు. ఉదయం 9గంటలకే యార్డులకు వెళ్లి సాయంత్రం దాకా కాంట పూర్తయ్యే వరకు తిండితిప్పలు లేకుండా ఉంటున్నారు. మార్కెట్ యార్డులకు వచ్చే రైతుల కోసం ప్రభుత్వం ‘సద్దిబువ్వ మూట’ పేరుతో ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. రూ.5కే భోజనాన్ని అందిస్తామని ఏడాదిన్నర క్రితం ప్రకటించింది. కానీ ఆ మాటను మరిచిపోవడంతో నిత్యం అన్నదాతలు పస్తులుండాల్సి వస్తోంది.
పొద్దూకులూ మార్కెట్‌లోనే..
పంట ఉత్పత్తులను విక్రయించేందుకు రైతులు ఉదయం 8గంటల నుంచే యార్డులకు వస్తుంటారు. తీసుకొచ్చిన ధానాన్ని యార్డుల్లో రాశులుగా పోసి పొద్దస్తమానం వాటికి కాపలాగా అక్కడే ఉంటారు. 11 గంటల ప్రాంతంలో వ్యాపారులు ధాన్యాన్ని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటల తర్వాత ధరలు కోడ్ చేస్తారు. 1:30 గంటల తర్వాత టెండర్ ప్రక్రియ ముగిసి అప్పుడు రైతులకు తమ పంట ఉత్పత్తులకు వచ్చిన ధరలు తెలుస్తాయి. ఇక్కడితో పని అయిపోదు. టెండర్ తర్వాత హమాలీలు మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత కాంట వేస్తారు. దాదాపు 3:30 గంటల వరకు ఈ తంతు జరుగుతుంది. కాంట పూర్తయి అక్కడి నుంచి ధాన్యం వెళ్లే వరకు రైతులు అక్కడే ఉంటారు. దాదాపు సాయంత్రం 4గంటల వరకు తిండి తిప్పలు లేకుండా ఉంటారు.
కళ్లు కాయలు కాచేలా..
పంట ఉత్పత్తులకు సరైన ధర వస్తుందా.. రాదా అని ఆలోచించుకుంటూ పంటను కాపాడుకుంటూ అక్కడే ఉంటారు. టెండర్ పూర్తయినా కాంట కాదు కాబట్టి ఎవైనా జంతువులు వచ్చి పంటను తినేస్తాయేమోనన్న భయ ఒకపక్క.. ఎవరైన ధాన్యాన్ని తస్కరిస్తారన్న భయం మరోపక్క వారిని కళ్లకు కనుకు లేకుండా చేస్తుంది. కనీసం నీళ్ళు తాగి రావాల్సి వచ్చినా తోటి రైతులకు కొంచెం సేపు చూడమని చెప్పి వెళ్తుంటారు. ఇలా సాయంత్రం వరకు ఆకలి దప్పులకు ఓర్చి పంట ఉత్పత్తులను కాపాడుకుంటూ మార్కెట్లోనే కూర్చుంటారు.
‘మూట’ మాట ఏమైనట్టు?
రైతుల అవస్థలు గుర్తించిన ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం ‘సద్దిబువ్వ మూట’ పేరుతో రూ.5కే భోజన పథకాన్ని ప్రకటించింది. అందులో భాగంగా పథకం నిర్వహణ బాధ్యతలను రెండు స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. ప్లేటు భోజనం తయారీ ఖర్చులో రూ.5 సంబంధిత మార్కెట్ కమిటీ తన వాటా కింద చెల్లించాలి. మిగతా ఖర్చులను ఆ స్వచ్ఛంద సంస్థ భరించాల్సి ఉంటుంది. రైతుకు మాత్రం రూ.5కే భోజనం పెట్టాలి. ఏ రోజుకు ఆ రోజు యార్డులకు పంట ఉత్పత్తులను విక్రయించేదుకు వచ్చిన ప్రతి రైతుకు భోజనం అందించాల్సి ఉంటుంది. అయితే ఇంత వరకు ఆ సంస్థలు ఎక్కడా కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. ప్రభుత్వం సద్దిబువ్వ మూటను నీటిమూటగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భోజనం పెడితే బాగుంటది
మార్కెట్ యార్డులకు రైతులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. కొందరు మాత్రమే భోజనం తెచ్చుకుంటారు. తెల్లవారుజామున బయల్దేరిన చాలా మందికి తెచ్చుకోవడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వం ప్రక టించిన విధంగా రూ.5లకే భోజనం అందిస్తే బాగుంటది.
ఆదేశాలు రాలేదు
సద్దిబువ్వ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటివరకు అమలు చేసేందుకు విదివిధానాలకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాలేదు. వచ్చిన వెంటనే అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం.
Comments
Please login to add a commentAdd a comment