నియోజకవర్గం: గద్వాల
మండలాల సంఖ్య: 5 (గద్వాల, మల్దకల్, ధరూర్, గట్టు, కేటీదొడ్డి )
మొత్తం పంచాయితీలు: 130
పెద్ద మండలం: గద్వాల
మొత్తం ఓటర్లు: 91875
పురుషులు: 45321; మహిళలు: 46544
ప్రతిసారి ఎన్నికలు గద్వాలలో హోరాహోరీగా సాగుతాయి. గడచిన మూడు సాధారణ ఎన్నికల్లో ప్రధానంగా అత్తా అల్లుళ్ల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టు సాగింది. కానీ వచ్చే ఎన్నికల్లో కూడ వీరిద్దరు మరోసారి తలబడనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడ సామాజిక వర్గ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని బలమైన బీసీ అభ్యర్దిని బరిలో దింపటానికి సిద్దమవుతుంది. దీంతో ఈసారి ఈ నియోజకవర్గంలో ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. త్రిముఖపోటీ అనివార్యం కానుంది.
కాంగ్రెస్ కంచుకోట.. ఈసారి కూడా బీఆర్‌ఎస్ వచ్చేనా?
సంస్ధానాల పాలన.. జాతీయస్దాయి గుర్తింపు గల చేనేత కార్మికులు.. కృష్ణా తుంగభద్రా నదుల మధ్య గల నడిగడ్డ ప్రాంతంగా పిలువబడే గద్వాల రాజకీయ చైతన్యం గల నియోజకవర్గం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రసవత్తరంగా పోటీ సాగే నియోజకవర్గాల్లో గద్వాల కూడ ఒకటి. మొదటి నుంచి ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే ఏడు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులే విజయం సాధించారు. డీకే కుటుంబ సభ్యులే అక్కడ 8 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. డీకే సమరసింహారెడ్డి, డీకే అరుణ మంత్రులుగా కూడా పనిచేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచారు.
వీరిద్దరు వరుసకు అత్తా-అల్లుళ్లు. గడచిన మూడు ఎన్నికల్లో వీరిద్దరు తలబడితే రెండుసార్లు డీకే అరుణ విజయం సాధించగా కృష్ణమోహన్ రెడ్డి ఒకసారి గెలిచారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో డీకే అరుణ బీజేపీలో చేరారు. 2019లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి అధికార టీఆర్ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆపార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకురాలిగా అరుణకు గుర్తింపు ఉంది. కాంగ్రెస్ వీడిన తర్వాత గద్వాలలో బీజేపీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. జిల్లా సాధనకు ఆమె అప్పట్లో గట్టిపోరాటం చేశారు.
ప్రజాసమస్యలపై, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆమె వెంటనే స్పందిస్తుంది. ప్రధానంగా సీఎం కేసీఆర్‌పై సైతం విధానపరమైన విమర్శలు చేస్తూ పార్టీ అధిష్టానంలో తనదైన ముద్రవేసుకుంది. ప్రస్తుతం ఆమె నియోజకవర్గంలో విసృతంగా పర్యటిస్తూ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసింది. నియోజకవర్గంలో ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు దాదాపు 30 వేల వరకు ఉన్నాయి. ఈ ఓట్లు ఒకవేళ పార్టీపరంగా బీజేపీకి వ్యతిరేకంగా పడితే కొంత ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదు. అయితే కేసీఆర్ పాలనతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆపార్టీని ఓడించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని వచ్చే ఎన్నికల్లో గెలుపు బీజేపీదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు డీకే అరుణ వర్గీయులు.
సిట్టింగ్‌లకే బీఆర్‌ఎస్ సీటు
సిట్టింగ్లకే ఈసారి సీట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించటంతో మరోసారి కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేయటం ఖాయమైంది. కానీ పార్టీలో కుమ్ములాటలు, అంతర్గత విభేదాలు, గ్రూపు తగదాలు ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారాయి. ఆయన అనుచరులే వ్యతిరేకంగా చాపకింది నీరులా పావులు కదుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితకు ఎమ్మెల్యేకు మధ్య విభేదాలు తారాస్దాయికి చేరటంతో ఇటీవలే ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆమె ఇక్కడి నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది.
రెండు రోజుల క్రితం గాంధీ భవన్‌లో గద్వాల నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా ఈసారి గద్వాల నుంచి బలహీన వర్గాల అభ్యర్దిని గెలిపించాలని పిలుపునిచ్చారు. దీంతో ఆమెకు సీటు ఖాయమైందని స్పష్టమవుతుంది. అక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్న నేతలు పెద్దగా ప్రభావితం చేసే వాళ్లు కాకపోవటంతో ఈమెకు మార్గం సుగమమయ్యింది. ఈ నియోజవర్గంలో వాల్మీకి బోయలు, కురువల ఓట్లు అధికంగా ఉండటంతో కురువ సామాజిక వర్గానికి చెందిన సరిత పోటీ చేస్తే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుగా ఉండే గద్వాల నియోజకవర్గంపై ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా ఉంటుందని ఈపార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు తలనొప్పిగా మారాయి. ఎమ్మెల్యే అన్నితానై వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ వారే అరోపిస్తున్నారు. తన అనుచరులకే ఎమ్మెల్యే పెద్దపీట వేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైన బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, బండ్ల రాజశేఖర్‌రెడ్డితో కూడా పొసగటం లేదట.
అందుకే బక్కచంద్రన్నగా పిలిచే చంద్రశేఖర్‌రెడ్డి కూడా జడ్పీచైర్ పర్సన్ సరితతో పాటుగా కాంగ్రెస్‌లో చేరారు. ఇది ఎమ్మెల్యేకు తీవ్రంగా నష్టం కలిగిస్తుందని భావిస్తున్నారు. ఇక ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడ ఎమ్మెల్యేకు ఇబ్బందిగా మారే ప్రమాదం లేకపోలేదు. అయితే ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పథకాలే తమపార్టీని గెలిపిస్తాయని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండంగా ప్రతిపక్ష బీజేపీ,కాంగ్రేస్ పార్టీ నేతలు సైతం ఈసారి తామే విజయం సాధిస్తామనే ధీమాలో ఉన్నారు.మొత్తంగా నడిగడ్డ రాజకీయాలు ఎన్నికలకు నాలుగు నెలల ముందే రంజుగా సాగుతున్నాయి. త్రిముఖ పోటీలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు:
ఈ నియోజకవర్గం ఇటు కృష్ణా, అటు తుంగభద్రా నదుల మధ్య ఉండటంతో ఈ ప్రాంతాన్ని నడిగడ్డగా పిలుస్తారు. గద్వాల కేంద్రంగా సంస్దానాల పాలన సాగింది
నదులు: కృష్ణానది ,జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టు
ఆలయాలు: మల్దకల్ స్వయంభు లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం, జమ్మిచేడు జమ్మలమ్మ ఆలయం,
పర్యాటకం: జూరాల పర్యాటక కేంద్రంగా డ్యాంలో నీటి నిల్వను, గేట్ల ద్వారా పారే నీటి ప్రవాహాన్ని చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వస్తారు. అదేవిధంగా గద్వాల కోటను చూసేందుకు, గద్వాల పట్టు చీరలను కొనేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతారు. తిరుమల వెంకన్నకు ప్రతిఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు ఇక్కడి నుంచి స్వామివారికి జోడుపంచెలు తీసుకెళ్తారు. ఇది వందల ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయం
Comments
Please login to add a commentAdd a comment