అయిజ/నందవరం: ఇరు తెలుగు రాష్ట్రాలకు నాగలదిన్నె బ్రిడ్జి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. బుధవారం నందవరం మండలంలోని నాగలదిన్నె గ్రామ సమీపంలో తుంగభద్ర నదిపై నిర్మించిన బ్రిడ్జిని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హైలెవల్ వంతెన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, జిల్లా జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల వెంకటరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, తెలంగాణ రాష్ట్రం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు రిబ్బన్ కట్ చేసి వంతెనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడుతూ.. 2009లో తుంగభద్ర నది ఉధృతిలో పాత బ్రిడ్జి కొట్టుకుపోయిందన్నారు. 2011లో ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి కొత్త బ్రిడ్జి నిర్మాణం మంజూరు చేయించారన్నారు.
దాదాపు 10 ఏళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందన్నారు. కరోనా విపత్తు, తెలంగాణ వైపు భూ సేకరణ వంటి ఎన్నో అడ్డంకులు వచ్చినా ఆయన పట్టుబట్టి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించారన్నారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర ప్రజలకు బంధుత్వాలు ఉన్నాయని, వారందరికీ ఈ బ్రిడ్జి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాబోయే కాలానికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారన్నారు.
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి మాట్లాడుతూ.. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి రూ.42 కోట్ల అంచనాతో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేశామన్నారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు నిధులు ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయన్నారు. గత తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి భూ సేకరణ సమస్యను పరిష్కరించామన్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కాంట్రాక్టరుకు బకాయిలు చెల్లించి వంతెన నిర్మాణానికి కావాల్సిన నిధులు సైతం మంజూరు చేసి పూర్తి చేయించిందన్నారు. అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం కోసం రెండు రాష్ట్రాల ప్రజలు దశాబ్దకాలంగా ఎదురు చూశారని, ఎట్టకేలకు రెండు రాష్ట్రాల బంధాలకు వంతెన వారధిగా మారిందని హర్షం వ్యక్తం చేశారు.
బ్రిడ్జి ప్రారంభోత్సవంలో కర్నూలు కలెక్టర్ సృజన, సబ్ కలెక్టర్ అభిషేక్‌కుమార్, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నేత ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీకాంతరెడ్డి, నియోజకవర్గ నాయకులు బసిరెడ్డి, భీమిరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నాగరాజు, ఆదోని డివిజన్ ఈఈ కృష్ణారెడ్డి, డీఈ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ నిత్యానందరాజు, ఎంపీడీఓ దశరథ రామయ్య, సీఐ మోహన్‌రెడ్డి, ఎస్‌ఐలు తిమ్మయ్య, తిమ్మారెడ్డి, శరత్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment