Tunga Bhadra
-
నాగలదిన్నె బ్రిడ్జి ప్రారంభం.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో ఉపయోగకరం
అయిజ/నందవరం: ఇరు తెలుగు రాష్ట్రాలకు నాగలదిన్నె బ్రిడ్జి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. బుధవారం నందవరం మండలంలోని నాగలదిన్నె గ్రామ సమీపంలో తుంగభద్ర నదిపై నిర్మించిన బ్రిడ్జిని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హైలెవల్ వంతెన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, జిల్లా జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల వెంకటరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, తెలంగాణ రాష్ట్రం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు రిబ్బన్ కట్ చేసి వంతెనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడుతూ.. 2009లో తుంగభద్ర నది ఉధృతిలో పాత బ్రిడ్జి కొట్టుకుపోయిందన్నారు. 2011లో ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి కొత్త బ్రిడ్జి నిర్మాణం మంజూరు చేయించారన్నారు. దాదాపు 10 ఏళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందన్నారు. కరోనా విపత్తు, తెలంగాణ వైపు భూ సేకరణ వంటి ఎన్నో అడ్డంకులు వచ్చినా ఆయన పట్టుబట్టి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించారన్నారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర ప్రజలకు బంధుత్వాలు ఉన్నాయని, వారందరికీ ఈ బ్రిడ్జి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాబోయే కాలానికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారన్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి మాట్లాడుతూ.. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి రూ.42 కోట్ల అంచనాతో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేశామన్నారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు నిధులు ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయన్నారు. గత తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి భూ సేకరణ సమస్యను పరిష్కరించామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాంట్రాక్టరుకు బకాయిలు చెల్లించి వంతెన నిర్మాణానికి కావాల్సిన నిధులు సైతం మంజూరు చేసి పూర్తి చేయించిందన్నారు. అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం కోసం రెండు రాష్ట్రాల ప్రజలు దశాబ్దకాలంగా ఎదురు చూశారని, ఎట్టకేలకు రెండు రాష్ట్రాల బంధాలకు వంతెన వారధిగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. బ్రిడ్జి ప్రారంభోత్సవంలో కర్నూలు కలెక్టర్ సృజన, సబ్ కలెక్టర్ అభిషేక్‌కుమార్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ నేత ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీకాంతరెడ్డి, నియోజకవర్గ నాయకులు బసిరెడ్డి, భీమిరెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ నాగరాజు, ఆదోని డివిజన్ ఈఈ కృష్ణారెడ్డి, డీఈ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ నిత్యానందరాజు, ఎంపీడీఓ దశరథ రామయ్య, సీఐ మోహన్‌రెడ్డి, ఎస్ఐలు తిమ్మయ్య, తిమ్మారెడ్డి, శరత్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
20న తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం
సాక్షి, అమరావతి: తుంగభద్ర పుష్కర ప్రారంభ ముహూర్తం ఖరారైంది. 20వ తేదీ మధ్యాహ్నం 1.21 గంటలకు పుష్కరాల ప్రారంభ ముహుర్తంగా దేవదాయ శాఖ నిర్ణయించింది. దేవదాయ శాఖ అర్చక ట్రైనింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల విశాఖపట్నంలో దైవజ్ఞ సమ్మేళనంలో పంచాంగకర్తలు నిర్ధారించిన ఈ ముహూర్త వివరాలను అధికారిక అనుమతి కోసం దేవదాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ మధ్య 12 రోజుల పాటు పుష్కరాలు కొనసాగుతాయి. గతంలో 2008లో తుంగభద్ర పుష్కరాలు జరిగాయి. 23 పుష్కర ఘాట్లు సిద్ధం ► తుంగభద్ర పుష్కరాల కోసం కర్నూలు జిల్లాలో 23 పుష్కర ఘాట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. కోవిడ్–19 నేపథ్యంలో కేంద్రప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వైద్య, ఆరోగ్య శాఖ ఈసారి నదీ స్నానాలకు బదులుగా భక్తులు జల్లు సాన్నాలు చేయాలని సూచించింది. ఆ మేరకు ఘాట్ల వద్ద అధికార యంత్రాంగం స్ప్రింకర్లను ఏర్పాటు చేస్తోంది. ► పుష్కరాల సందర్భంగా పితృ దేవతలకు పిండ ప్రదానం చేసేందుకు మొత్తం 443 మంది పురోహితులను ఎంపిక చేసి, వారికి గుర్తింపు కార్డులను అందజేసింది. ► పిండ ప్రదానం, తదితర కార్యక్రమాలకు రేట్లను దేవదాయ శాఖ నిర్ధారించి, ఆ వివరాలను వీటి కోసం కేటాయించిన షెడ్ల వద్ద ప్రదర్శించనుంది. ► పుష్కర ఘాట్లకు సమీపంలోని ఆలయాల్లో దర్శనాలకు ఇబ్బంది లేకుండా అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన దాదాపు 300 మందికి పైగా దేవదాయ శాఖ సిబ్బందిని ప్రత్యేకంగా విధుల్లో నియమించారు. దేవదాయ శాఖ కార్యక్రమాలపై ప్రత్యేక కమిషనర్ అర్జునరావు ఆయా జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పలు సూచనలు చేశారు. 20న పుష్కరాల్లో పాల్గొననున్న సీఎం జగన్ తుంగభద్ర పుష్కరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు తుంగభద్ర పుష్కరాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 20వ తేదీన కర్నూలు జిల్లాలోని సంకల్బాగ్ పుష్కర ఘాట్ వద్ద శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు. ఈ మేరకు సీఎం పర్యటన వివరాలను ముఖ్యమంత్రి అదనపు పీఎస్ కె.నాగేశ్వరరెడ్డి ప్రభుత్వ అధికారులకు సర్క్యులేట్ చేశారు. -
మళ్లీ పోటెత్తుతున్న కృష్ణా, గోదావరి వరదలు
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో రాష్ట్రంలో నదులన్నీ మళ్లీ ఉగ్రరూపం దాల్చాయి. ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు ఉప్పొంగడంతో గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం సోమవారం ఉదయం 50.1 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద 11.10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరింది. ప్రవాహానికి కాఫర్ డ్యామ్ అడ్డంకిగా మారడంతో నీటి మట్టం 28.12 మీటర్లకు చేరింది. దాంతో వరద దేవీపట్నం మండలాన్ని చుట్టుముట్టింది. ఇక ప్రకాశం బ్యారేజీ నుంచి 30,463 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. దీంతో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నేడు (సోమవారం) ధవళేశ్వరం బ్యారేజీలోకి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక విభాగాలతో సహాయక చర్యలు చేపట్టింది. కృష్ణమ్మ పరవళ్లు.. కృష్ణాలో వరద ప్రవాహం మరింతగా పెరిగింది. ఆల్మట్టి నుంచి రెండు లక్షలు, నారాయణపూర్ నుంచి 2.18 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 1.73 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.72 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయంలోకి 99 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.15 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నది నుంచి సుంకేశుల బ్యారేజీలోకి 97,945 క్యూసెక్కులు వస్తుండగా.. 95,128 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2.98 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 98 వేల క్యూసెక్కులు కిందకి విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతల, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నాగార్జునసాగర్‌కు నీరు చేరుతోంది. నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువ గేట్లు ఎత్తి 49 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 30,896 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టు నుంచి 37,142 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం వరకూ పులిచింతల ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వ 45.77 టీఎంసీలను నిల్వ చేశారు. అయితే ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులో కొంత ఖాళీ చేసి 45.62 టీఎంసీలు నిల్వ ఉంచి.. పైనుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 37,654 క్యూసెక్కులు చేరుతుండటంతో 16 వేల క్యూసెక్కులను డెల్టాకు విడుదల చేసి.. మిగిలిన 12 వేల క్యూసెక్కులను పది గేట్లు తెరిచి దిగువకు విడుదల చేశారు. ఆదివారం రాత్రికి ప్రకాశం బ్యారేజీలోకి 50 వేల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉండటంతో.. అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న నదీ తీర ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఉప్పొంగుతున్న వంశధార, నాగావళి ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు వంశధార నది పోటెత్తింది. గొట్టా బ్యారేజీలోకి 50,981 క్యూసెక్కులు చేరుతుండగా.. 55,148 క్యూసెక్కులను 22 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదులుతున్నారు. నాగావళి పరవళ్లు తొక్కుతుండటంతో తోటపల్లి బ్యారేజీ నుంచి ఐదు వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. గత నెల రోజులుగా తోటపల్లి బ్యారేజీ గేట్లు ఎత్తి ఉంచడం విశేషం. జల దిగ్బంధంలో లంక గ్రామాలు.. గోదావరి ఉధృతిలో తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 82 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద గోదావరి దేవీపట్నం మండలంలోని 36 గ్రామాలను ముంచెత్తింది. వరద కారణంగా విలీన మండలాల్లోని 30 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కడలి వైపు పరుగులు తీస్తున్న గోదావరి కోనసీమ లంక గ్రామాలను కూడా ముంచెత్తుతోంది. గోదావరి పాయలైన గౌతమి, వైనతేయ, వశిష్ట పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కోనసీమలోని 16 లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కోటిపల్లి మధ్య గౌతమీ గోదావరిలో వరద ఉధృతి మరీ ఎక్కువగా ఉండడంతో ఆ నదీపాయపై జరుగుతున్న రైల్వే వంతెన నిర్మాణ పనులు నిలిపివేశారు. వరద ఉధృతికి పోలవరం శివారు పాత పోలవరం వద్ద నెక్లెస్‌బండ్ కోతకు గురై నదిలోకి జారిపోతోంది. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని వేలేరుపాడు మండలంలో ఆదివారం సాయంత్రానికి 36 గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ముంపు గ్రామాల నుంచి ప్రజలను, పశువులను సురక్షిత ప్రాంతా లకు తరలిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పోటెత్తిన ప్రవాహాలు
సాక్షి, అమరావతి: గత రెండు రోజులుగా పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉపనదులు ఉప్పొంగడంతో గోదావరి, కృష్ణా, తుంగభద్ర, వంశధార, నాగావళి వరద ఉద్ధృతితో పోటెత్తుతున్నాయి. జీవనదులన్నీ జలకళతో ఉప్పొంగి ప్రవహిస్తుంటే పెన్నా నది మాత్రం వర్షాభావంతో జీవకళ కోల్పోయింది. రాయలసీమ, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో వర్షాలు లేక పెన్నాలో ఇసుక తిన్నెలు తప్ప నీటి జాడ లేదు. ఆల్మట్టి కళకళ కర్ణాటకలో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణమ్మ పరవళ్లు తొక్కడంతో బుధవారం ఆల్మట్టిలోకి 95,136 క్యూసెక్కులు రాగా గేట్లు ఎత్తి దిగువకు 1,00,020 క్యూసెక్కులు విడుదల చేశారు. నారాయణపూర్ జలాశయంలోకి 99,160 క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 1,01,011 క్యూసెక్కులు దిగువకు వదిలారు. శ్రీశైలానికి భారీ వరద తుంగభద్ర జలాశయంలోకి 1.25 లక్షల క్యూసెక్కులు వరద వస్తుండగా కాలువలకు 10,630 క్యూసెక్కులు, దిగువకు 1.38 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. ఎగువ నుంచి భారీ వరద బుధవారం రాత్రికి శ్రీశైలానికి చేరనుంది. మంగళవారం నుంచి బుధవారం వరకు శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో 21.34 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్‌కు 74,212 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయం బ్యాక్‌వాటర్ నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతికి 1,688 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు 4,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 872.70 అడుగుల్లో 153.1687 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. వరద కనీసం పది రోజులు కొనసాగే అవకాశం ఉండటంతో శ్రీశైలం ఈదఫా నిండే అవకాశం ఉంది. గోదావరిలో పెరిగిన ప్రవాహం ప్రాణహిత, శబరి, సీలేరు, ఇంద్రావతి, తాలిపేరులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 39 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 8.6 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 6,37,067 క్యూసెక్కులు రావడంతో డెల్టా కాలువలకు 7,100 క్యూసెక్కులు వదిలారు. మిగతా 6,29,967 క్యూసెక్కులను 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలారు. ప్రస్తుత సీజన్లో గోదావరికి ఇప్పటివరకూ వచ్చిన గరిష్ఠ వరద ప్రవాహం ఇదే కావడం గమనార్హం. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి బుధవారం ఉదయం ఆరు గంటల వరకూ 54.42 టీఎంసీల గోదావరి జలాలు కడలిలోకి వదిలారు. ఉగ్రరూపం దాల్చిన వంశధార ఒడిశాలో భారీ వర్షాలతో నాగావళిలో వరద ఉద్ధృతి పెరిగింది. తోటపల్లి బ్యారేజీకి 35 వేల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. వంశధారలో ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉండడంతో శ్రీకాకుళం జిల్లాలో పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. గొట్టా బ్యారేజీకి 45 వేల క్యూసెక్కులు వరద రావడంతో కాలువలకు విడుదల చేయగా 43 వేల క్యూసెక్కులను 22 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి కృష్ణమ్మ ఉరకలు ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో వర్షాలు కొనసాగుతుండటంతో మున్నేరు, వైరా, కట్టలేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పులిచింతలకు దిగువన కృష్ణా నదిలో వరద నిలకడగా కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీకి 28,973 క్యూసెక్కులు రాగా 8,945 క్యూసెక్కులను కాలువలకు విడుదల చేసి 20,028 క్యూసెక్కులను కడలిలోకి వదులుతున్నారు. పట్టిసీమ వట్టి కోతలే! రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులకు ఇంచుమించుగా ఒకేసారి వరదలు వస్తాయి. జూలై 3వ వారం నుంచి అక్టోబర్ వరకు రెండు నదులు ఒకేసారి వరదతో పోటెత్తుతాయి. ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలే. అంతకన్నా ఎక్కువ నీళ్లు వస్తే బ్యారేజీ గేట్లు ఎత్తి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేయాల్సిందే. అందువల్లే పట్టిసీమ ఎత్తిపోతల పేరుతో గోదావరి వరద జలాలను పోలవరం కుడి కాలువ మీదుగా ప్రకాశం బ్యారేజీకి తరలించడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేశారు. పట్టిసీమ ఎత్తిపోతలకు బదులుగా పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తే గ్రావిటీపై కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల గోదావరి నీళ్లను మళ్లించవచ్చని సూచించారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే అంశాన్ని పలుసార్లు ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటికే ఏడు టీఎంసీలు సముద్రంలోకి.. ఈ ఏడాది ప్రకాశం బ్యారేజీ ద్వారా ఇప్పటికే ఏడు టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలారు. ప్రస్తుతం గోదావరి, కృష్ణా నదులు ఒకేసారి పొంగి పొర్లుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా జలాలను, ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గోదావరి జలాలను సముద్రంలోకి వదులుతున్నారు. నీరందక కృష్ణా రైతుల ఆందోళన కృష్ణా నదికి వరద లేనప్పుడు కూడా కృష్ణా డెల్టా అవసరాలను తీర్చడంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం విఫలమైంది. గోదావరి నుంచి పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా పోలవరం కుడి కాల్వలోకి 8,400 క్యూసెక్కులు ఎత్తిపోసినా మార్గమధ్యలో వినియోగం, సరఫరా నష్టాలు పోనూ ప్రకాశం బ్యారేజీకి 6 వేల క్యూసెక్కులకు మించి ఏనాడూ చేరిన దాఖలాలు లేవు. కృష్ణా డెల్టాకు పూర్తి స్థాయిలో నీళ్లు అందించాలంటే రోజుకు కనీసం 11 వేల క్యూసెక్కులు అవసరం. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా తరలించే 6 వేల క్యూసెక్కులు డెల్టాకు ఏ మూలకూ సరిపోవు. దీంతో ఈ ఖరీఫ్‌లోనే నీరందక నాట్ల దశలోనే పంటలు ఎండిపోవడంతో రైతులు రోడ్డెక్కడం తెలిసిందే. ప్రకాశం బ్యారేజీకి కృష్ణా వరద నీరు పోటెత్తుతుండటంతో గత ఐదు రోజులుగా పట్టిసీమ ఎత్తిపోతల పంపులు ఆపివేశారు. దీన్ని బట్టి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, సాగునీటిరంగ నిపుణులు చేస్తున్న వాదన నిజమేనని మరోసారి రుజువైంది. -
తుంగభద్రకు పెరుగుతున్న ఉధృతి
సాక్షి, హైదరాబాద్ : ఎగువ కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఉప నదులు, వాగుల నుంచి ప్రవాహాలు వస్తుండటంతో భారీగా నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం ప్రాజెక్టులోకి 48 వేల క్యూసెక్కుల నీరు రాగా, శనివారం అది మరో 4 వేలకు పెరిగింది. శనివారం 52,136 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో నమోదైంది. శుక్రవారం ప్రాజెక్టులో నీటి నిల్వ 11.91 టీఎంసీలు ఉండగా శనివారానికి 16.38 టీఎంసీలకు చేరింది. ఒక్క రోజులోనే సుమారు 5 టీఎంసీల నీరు ప్రాజెక్టుకు చేరింది. వాటర్ ఇయర్ మొదలయ్యాక తొలిసారి ఆల్మట్టిలోకి శనివారం నుంచి ప్రవాహాలు మొదలయ్యాయి. ఆల్మట్టిలోకి 2,153 క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలకు గానూ 22.61 టీఎంసీలకు చేరింది. ఇక నారాయణపూర్‌లోకి ప్రవాహాలు తగ్గాయి. మూడ్రోజులుగా ప్రాజెక్టుకు 2,500 క్యూసెక్కుల ప్రవాహాలు రాగా శనివారం అది 900 క్యూసెక్కులకు తగ్గింది. జూరాల, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు సైతం నీటి ప్రవాహాలు తగ్గాయి. -
శ్రీశైలానికి భారీగా వరద నీరు
ఎగువన వర్షపాతం నమోదు కావడంతో.. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ పరీవాహకప్రాంతాలైన జూరాల, తుంగభద్రల నుంచి శ్రీశైల జలాశయానికి సోమవారం వరద ప్రవాహం మొదలైంది. జూరాల నుంచి 6వేల క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 4,479 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి హంద్రీనీవా సుజల స్రవంతికి 1,350 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. రెండు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పాదనను నిలిపివేసిన విషయం తెల్సిందే. జలాశయ పరిసర ప్రాంతాలలో 1.20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం జలాశయంలో 62.94 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 840.70 అడుగులకు చేరుకుంది. -
తుంగభద్ర తీర వాసులకు వరద ముప్పు
10 గేట్ల ద్వారా దిగువకు 22 వేల క్యూసెక్కుల నీరు విడుదల హొస్పేట : తుంగభద్ర జలాశయం ఎగువన వర్షాలు భారీగా కురుస్తుండటంతో డ్యాంలోకి లక్ష క్యూసెక్కులకు పైగా వరదనీరు శుక్రవారం రాత్రికి వచ్చి చేరనుండటంతో శుక్రవారం సాయంత్రం డ్యాంకు సంబంధించిన 10 క్రస్ట్‌గేట్ల ద్వారా దిగువకు 22 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు విడుదల చేశారు. అదే విధంగా శనివారం ఏ సమయంలోనైనా 22 క్రస్ట్ గేట్లను పెకైత్తి లక్ష పైచిలుకు క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఏ సమయంలోనైనా డ్యాం నుంచి భారీగా నీటిని విడుదల చేసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర బోర్డు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 10 తుంగభద్ర గేట్ల ఎత్తివేత తుంగభద్ర డ్యాం పూర్తిగా నిండటంతో శుక్రవారం ఉదయం తుంగభద్ర బోర్డు అధికారులు డ్యాం వద్ద విశేష పూజలు చేసి 10 క్రస్ట్ గేట్లను పెకైత్తి దిగువకు నీరు విడుదల చేశారు. డ్యాంకు చెందిన మొత్తం 33 క్లస్టర్ గేట్లలో ఉదయం 3 గేట్లను ఒక్కొక్క గేటును 9 అంగుళాల మేర పెకైత్తి మొత్తం 4,300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రానికి మొత్తం 10 గేట్లు 2 అడుగుల మేర పెకైత్తి 22 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ సందర్భంగా తుంగభద్ర మండలి కార్యదర్శి జీ.రంగారెడ్డి, ఈఈ ఇంగళల్లి, డ్యాం జేఈ వీరేష్, గార్డెన్ సూపరింటెండెంట్ విశ్వనాథ్, డ్యాం ఇన్చార్జ్ అధికారి పార్థసారథి, మునిరాబాద్ ఇరిగేషన్ ఈఈ భోజానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
తుంగభద్రకు జలకళ
సాక్షి, బళ్లారి : తుంగభద్రమ్మ వడివడిగా కదలివస్తోంది. నై చీలిన భూమిని తన స్పర్శతో తడుపుతూ పరుగుపరుగున వచ్చేస్తోంది. నది ఎగువన ఉన్న ఆగుంబె, శృంగేరి, మోరాళు, తీర్థహళ్లి, శివమొగ్గ, భద్రావతి తదితర ప్రాంతాల్లో భారీగా వర్షాలు ఊపందుకోవడంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి నీటి జలాశయమైన తుంగభద్ర డ్యాంలోకి ఇన్‌ఫ్లో పెరుగుతోంది. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభమైన తర్వాత బుధవారం మొదటిసారిగా ఒకేసారి 25 వేల క్యూసెక్కులకు పైగా వరదనీరు డ్యాంలోకి చేరింది. దీంతో మూడు టీఎంసీల మేర నీటి నిల్వ పెరిగింది. ప్రస్తుతం డ్యాంలో 17 టీఎంసీలు నిల్వ ఉంది. ఇదే ప్రవాహం మూడు రోజులు కొనసాగే అవకాశం ఉందని తుంగభద్ర బోర్డు అధికారి వెల్లడించారు. -
తుంగ-భద్ర
గ్రంథం చెక్క తుంగభద్ర ఒక్క నది కాదు. తుంగ, భద్ర విడివిడిగా కొంత దూరం ప్రవహించి ఒక్కటై పోయాయి. తుంగడు యాదవ బాలుడు. గోవులను, గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడు. వయసు ఇరవై వుండవచ్చు. యౌవనం అతనిలో తొణికిసలాడింది. తుంగడు మురళి వాయించేవాడు. గోవులూ, గొర్రెలు, చెట్లు, చేమలు తలలూపుతూ తన్మయత్వంతో వినేవి. ఆ ప్రాంతాన్ని ఒక కన్నడ రాజు పాలిస్తున్నాడు. అతని కూతురు పేరు భద్ర. అందాల రాశి. తుంగడు మోగించే మురళి విన్నది భద్ర. గోపాలకృష్ణుడి వద్దకు రాధ వెళ్లినట్లు భద్ర తుంగడి వద్దకు వెళ్లిపోయింది. ఇది కొన్నాళ్లు సాగింది. రాజుకు తెలిసింది. ఇద్దరినీ అడవిలో కదంబవృక్షం కింద పట్టుకున్నారు. ‘‘మమ్మల్ని యెవ్వరూ విడదీయలేరు’’ అంది భద్ర. తుంగణ్ణి చితక్కొట్టించాడు రాజు. అతని రక్తాన్ని తిలకంగా ధరించింది భద్ర. ఇద్దర్నీ విడదీశారు రాజభటులు. భద్ర కరిగి నీరై, నదియై ప్రవహించింది. తుంగడు కరిగి నీరై, నదియై ప్రవహించాడు. అలా విడివిడిగా ప్రవహిస్తూ వెళ్ళిపోయారు. రాజు గుండె పగలి చచ్చాడు. రాణి గుండె పగిలి చచ్చింది. మైళ్లు, బీళ్ళు, రాళ్ళు, బోళ్ళు, గుళ్ళు దాటి వెళ్లి ఒకచోట తుంగ+భద్ర కలుసుకొని తుంగభద్ర అయింది. వారు ప్రేయసీప్రియులు, భార్యాభర్తలు. కనుక ఇక సముద్ర సంగమం సాధ్యపడే విషయం కాదు. అందుకే తల్లిలాంటి కృష్ణవేణమ్మ వొడిలో చేరిపోయారు. -దాశరథి కృష్ణమాచార్య ‘యాత్రాస్మృతి’ నుంచి. -
దిగువ కాలువకు నీటి సరఫరా నిలిపివేత
రైతులతో ప్రభుత్వమే కాదు.. అధికారులూ ఆడుకుంటున్నారు. ప్రకృతి విపత్తులను పక్కనపెడితే.. చేతనైన సాయం చేసే విషయంలోనూ మీనమేషాలు లెక్కిస్తున్నారు. పచ్చని పైర్లు కళ్లెదుటే ఎండుతుంటే రైతుల గుండె తరుక్కుపోతోంది. ఈ పరిస్థితుల్లో విడుదల చేసిన నీరు.. పొలాలకు చేరకుండానే నిలిపేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా దిగువ కాలువకు సోమవారం మధ్యాహ్నం నుంచి సాగునీటి విడుదలను నిలిపేశారు. కర్నూలు రూరల్, న్యూస్‌లైన్: అధికారుల మాటలు నీటి మూటలవుతున్నాయి. సాగునీటి విషయంలో ఆశలు రేకెత్తించడం.. అంతలోనే ఉసూరుమనిపించడం పరిపాటిగా మారింది. ఈ ఏడాది రబీ పంటలకు దిగువ కాలువ కింద 50వేల ఎకరాలకు.. కేసీ కింద 30వేల ఎకరాల ఆయకట్టుకు వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు నీరిస్తామని గత నెల 26న నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో తీర్మానించారు. అందులో భాగంగా ఈ నెల మొదటి వారంలో ఇరిగేషన్ అధికారులు టీబీ డ్యాంను సందర్శించి రబీకి నిరంతరాయంగా సాగునీరు విడుదల చేస్తామని భరోసానిచ్చారు. అలాంటిది పది రోజులు కాక మునుపే దిగువ కాలువకు నీరు నిలిపేయడం రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది. తుంగభద్ర దిగువ కాలువపై 16 మండలాలు, 192 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. ఖరీఫ్ సీజన్లో 43,519 ఎకరాలు, రబీలో 1,07,615 ఎకరాలు సాగవ్వాల్సి ఉంది. ఇందుకోసం టీబీ డ్యాం నుంచి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 24 టీఎంసీల నీరు సరఫరా చేయాలని నిర్ణయించారు. అయితే పూడిక సాకుతో ఏటా నీటి వాటా తగ్గిస్తున్నారు. ఈ ఏడాది 16.32 టీఎంసీల నీటి వాటా కేటాయించగా.. ఖరీఫ్ పంటలకు 9.5 టీఎంసీల నీరు వినియోగించారు. మిగిలిన 6.82 టీఎంసీల నీరు రబీలో 50వేల ఎకరాలకు అందిస్తామని గత నెలలో నిర్వహించిన ఐఏబీ సమావేశంలో తీర్మానించారు. కాగా ఈ కోటాలో 3 టీఎంసీలు తాగునీటికి వినియోగించనున్నారు. ఎగువ ప్రాంతాంలోని కర్ణాటక రైతులు రబీ పంటలకు నారు మళ్లు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జలచౌర్యం జరుగుతుందనే సాకుతో సోమవారం టీబీ డ్యాం నుంచి దిగువ కాలువకు నీటి విడుదలను నిలిపేశారు. అక్కడి రైతులను అడ్డుకోలేక.. జిల్లాలో దిగువ కాలువకు నీరు అవసరం లేదని అధికారులు అడ్డంగా వాదించడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదోని డివిజన్లోని హాలహర్వి, హొళగుంద, ఆలూరు, కౌతాళం, ఆదోని ప్రాంతాల్లో దాదాపు 30వేల ఎకరాల్లో మిరప, పత్తి పంటలు సాగులో ఉన్నాయి. ప్రస్తుతం మొగ్గ, పిందె దశలోని పంటలకు రానున్న 15 రోజులు ఎంతో కీలకం. ఈ సమయంలో నీరు నిలుపుదల చేస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా రబీలో వరి సాగుకు సిద్ధం చేస్తున్న నారుమళ్లు ఎండిపోతాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సిద్ధమైన నారుతో నాట్లు వేసేందుకు సిద్ధమవుతుండగా నీళ్లు అందివ్వకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీబీ బోర్డు అధికారులపై కర్ణాటక నేతల ఒత్తిళ్లు అధికంగా ఉంటాయని.. అలాంటిది వారి చెప్పినట్లు జిల్లా అధికారులు నడుచుకోవడంలో అర్థం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీ ఆయకట్టు సాగు ప్రశ్నార్థకం కేసీ కాలువ పరిధిలోని 30వేల ఎకరాల ఆయకట్టుకు రబీలో సాగునీరు ఇస్తామని ఐఏబీలో తీర్మానించారు. నీటి విడుదల అనుమతి కోరుతూ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీరు సోమవారం ప్రభుత్వానికి రెండోసారి లేఖ పంపారు. మొదటి లేఖ పంపి నెల రోజులు గడుస్తున్నా స్పందించని పరిస్థితుల్లో నీటి విడుదల అనుమానమేనని ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు. టీబీ డ్యాంలో కేటాయించిన 10 టీఎంసీల్లో కేవలం 6.986 టీఎంసీలే ఈ ఏడాది వాటాగా నిర్ణయించారు. ఇందులో 2 టీఎంసీలు కర్నూలు నగర ప్రజల తాగు నీటి అవసరాలకు వినియోగించనున్నారు. ఖరీఫ్‌కు సంబంధించి చుక్క నీరు వాడలేదు. ఈ పరిస్థితుల్లో ఎగువనున్న ఆర్డీయస్ ద్వారా కర్ణాటక రైతులు నీటిని ఆ ప్రాంతానికి తరలించుకుంటే దిగువకు నీరు పాడం కష్టమేనని తెలుస్తోంది. 0 నుంచి 120 కి.మీ వరకు ఉన్న కాలువకు కృష్ణ జలాలను తరలించి పూర్తి స్థాయిలో నీటిని అందించేందుకు రూ.120 కోట్లతో చేపట్టిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులు ఓ ప్రజాప్రతినిధి స్వార్థంతో నిలిచిపోయాయి. ఈ పథకం నుంచి 5 టీఎంసీల నీరు కేసీలోకి ఎత్తిపోసుకుని కోతను పూడ్చుకునే అవకాశం ఉంది. అందువల్ల అధికార పార్టీ నేతలు ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పనులు త్వరితగతిన పూర్తయ్యేందుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే నీటి సరఫరా నిలిపివేత తుంగభద్ర దిగువ కాలువకు ప్రభుత్వ ఆదేశాలతోనే సాగునీటిని నిలిపేశాం. ఐఏబీ సమావేశంలో తీర్మినించిన మేరకు నీరు ఇచ్చేందుకు వీలుపడటం లేదు. హాలహర్వి, హొళగుందా, కౌతాళం మండలాల్లో మిరప, పత్తి పంటలకు నష్టం కలగకూడదనే ఒక తడికి నీరిచ్చాం. మరో 15 రోజులు నీరు అందకపోయినా పంటలకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నాం. అయితే రబీలో వరికి నీరిస్తామని చెప్పలేదు.. ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని సూచించాం. వరికి నీరందకపోయినా.. నారు మళ్లు ఎండిపోయినా మాకు సంబంధం లేదు. కొన్ని తీర్మానాలు పరిస్థితులకు అనుగుణంగా మారుతుంటాయి. - ఆర్.నాగేశ్వర్ రావు, నీటిపారుదల శాఖ పర్యవేక్షక ఇంజనీరు -
అభివృద్ధితో రాజకీయాలు ముడిపెట్టరాదు
= కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే రాయచూరు రూరల్, న్యూస్‌లైన్ : ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలే తప్ప రాజకీయాలతో ముడిపెట్టరాదని, తన 43 ఏళ్ల రాజకీయ జీవితంలో అభివృద్ధి కోసమే కృషి చేశానని కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే అన్నారు. ఆయన శనివారం రాయచూరు తాలూకాలోని మటమారి గ్రామం వద్ద మటమారి-మంత్రాలయం మధ్య రైల్వే లైను డబ్లింగ్, తుంగభద్ర వంతెన పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన గావించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రైల్వే శాఖలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రైల్వే శాఖలో అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదన్నారు. రైల్వే బోగీలు, ఇంజన్లు ఉత్పాదన పరిశ్రమను యాదగిరిలో జర్మనీ సహాయంతో స్థాపించి, ఎల్హెచ్పీని ఏర్పాటు చేస్తామన్నారు. నూతన రైల్వే మార్గాల నిర్మాణానికి భూ స్వాధీన ప్రక్రియలో రైతులు ముందుకు రాకపోవడంపై ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవిషయంలో ఎమ్మెల్యేలు సహకరిస్తే రైల్వే మార్గాల అభివృద్ధికి వీలుంటుందన్నారు. పంచవర్ష ప్రణాళికలో రాష్ట్రానికి కేంద్రం రూ. 26 వేల కోట్ల నిధులు కేటాయించిందని, రాష్ట్ర వాటాగా రూ.13 వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. 6 నెలల్లో ప్యాసింజర్ రైళ్లకు 15 శాతం ఆదాయం పెరిగిందన్నారు. ఈ ఏడాది నీటి పారుదల పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5500 కోట్లు కేటాయించగా, రూ. 4 వేల కోట్లు అప్పర్‌భద్ర ప్రాజెక్ట్‌కు విడుదల చేశామన్నారు.