నీటితో కళకళలాడుతున్న శ్రీశైలం ప్రాజెక్ట్
సాక్షి, అమరావతి: గత రెండు రోజులుగా పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉపనదులు ఉప్పొంగడంతో గోదావరి, కృష్ణా, తుంగభద్ర, వంశధార, నాగావళి వరద ఉద్ధృతితో పోటెత్తుతున్నాయి. జీవనదులన్నీ జలకళతో ఉప్పొంగి ప్రవహిస్తుంటే పెన్నా నది మాత్రం వర్షాభావంతో జీవకళ కోల్పోయింది. రాయలసీమ, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో వర్షాలు లేక పెన్నాలో ఇసుక తిన్నెలు తప్ప నీటి జాడ లేదు.
ఆల్మట్టి కళకళ
కర్ణాటకలో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణమ్మ పరవళ్లు తొక్కడంతో బుధవారం ఆల్మట్టిలోకి 95,136 క్యూసెక్కులు రాగా గేట్లు ఎత్తి దిగువకు 1,00,020 క్యూసెక్కులు విడుదల చేశారు. నారాయణపూర్ జలాశయంలోకి 99,160 క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 1,01,011 క్యూసెక్కులు దిగువకు వదిలారు.
శ్రీశైలానికి భారీ వరద
తుంగభద్ర జలాశయంలోకి 1.25 లక్షల క్యూసెక్కులు వరద వస్తుండగా కాలువలకు 10,630 క్యూసెక్కులు, దిగువకు 1.38 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. ఎగువ నుంచి భారీ వరద బుధవారం రాత్రికి శ్రీశైలానికి చేరనుంది. మంగళవారం నుంచి బుధవారం వరకు శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో 21.34 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్‌కు 74,212 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయం బ్యాక్‌వాటర్ నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతికి 1,688 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు 4,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 872.70 అడుగుల్లో 153.1687 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. వరద కనీసం పది రోజులు కొనసాగే అవకాశం ఉండటంతో శ్రీశైలం ఈదఫా నిండే అవకాశం ఉంది.
గోదావరిలో పెరిగిన ప్రవాహం
ప్రాణహిత, శబరి, సీలేరు, ఇంద్రావతి, తాలిపేరులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 39 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 8.6 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 6,37,067 క్యూసెక్కులు రావడంతో డెల్టా కాలువలకు 7,100 క్యూసెక్కులు వదిలారు. మిగతా 6,29,967 క్యూసెక్కులను 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలారు. ప్రస్తుత సీజన్‌లో గోదావరికి ఇప్పటివరకూ వచ్చిన గరిష్ఠ వరద ప్రవాహం ఇదే కావడం గమనార్హం. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి బుధవారం ఉదయం ఆరు గంటల వరకూ 54.42 టీఎంసీల గోదావరి జలాలు కడలిలోకి వదిలారు.
ఉగ్రరూపం దాల్చిన వంశధార
ఒడిశాలో భారీ వర్షాలతో నాగావళిలో వరద ఉద్ధృతి పెరిగింది. తోటపల్లి బ్యారేజీకి 35 వేల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. వంశధారలో ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉండడంతో శ్రీకాకుళం జిల్లాలో పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. గొట్టా బ్యారేజీకి 45 వేల క్యూసెక్కులు వరద రావడంతో కాలువలకు విడుదల చేయగా 43 వేల క్యూసెక్కులను 22 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదులుతున్నారు.
ప్రకాశం బ్యారేజీలోకి కృష్ణమ్మ ఉరకలు
ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో వర్షాలు కొనసాగుతుండటంతో మున్నేరు, వైరా, కట్టలేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పులిచింతలకు దిగువన కృష్ణా నదిలో వరద నిలకడగా కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీకి 28,973 క్యూసెక్కులు రాగా 8,945 క్యూసెక్కులను కాలువలకు విడుదల చేసి 20,028 క్యూసెక్కులను కడలిలోకి వదులుతున్నారు.
పట్టిసీమ వట్టి కోతలే!
రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులకు ఇంచుమించుగా ఒకేసారి వరదలు వస్తాయి. జూలై 3వ వారం నుంచి అక్టోబర్ వరకు రెండు నదులు ఒకేసారి వరదతో పోటెత్తుతాయి. ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలే. అంతకన్నా ఎక్కువ నీళ్లు వస్తే బ్యారేజీ గేట్లు ఎత్తి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేయాల్సిందే. అందువల్లే పట్టిసీమ ఎత్తిపోతల పేరుతో గోదావరి వరద జలాలను పోలవరం కుడి కాలువ మీదుగా ప్రకాశం బ్యారేజీకి తరలించడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేశారు. పట్టిసీమ ఎత్తిపోతలకు బదులుగా పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తే గ్రావిటీపై కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల గోదావరి నీళ్లను మళ్లించవచ్చని సూచించారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇదే అంశాన్ని పలుసార్లు ప్రభుత్వానికి సూచించారు.
ఇప్పటికే ఏడు టీఎంసీలు సముద్రంలోకి..
ఈ ఏడాది ప్రకాశం బ్యారేజీ ద్వారా ఇప్పటికే ఏడు టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలారు. ప్రస్తుతం గోదావరి, కృష్ణా నదులు ఒకేసారి పొంగి పొర్లుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా జలాలను, ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గోదావరి జలాలను సముద్రంలోకి వదులుతున్నారు.
నీరందక కృష్ణా రైతుల ఆందోళన
కృష్ణా నదికి వరద లేనప్పుడు కూడా కృష్ణా డెల్టా అవసరాలను తీర్చడంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం విఫలమైంది. గోదావరి నుంచి పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా పోలవరం కుడి కాల్వలోకి 8,400 క్యూసెక్కులు ఎత్తిపోసినా మార్గమధ్యలో వినియోగం, సరఫరా నష్టాలు పోనూ ప్రకాశం బ్యారేజీకి 6 వేల క్యూసెక్కులకు మించి ఏనాడూ చేరిన దాఖలాలు లేవు. కృష్ణా డెల్టాకు పూర్తి స్థాయిలో నీళ్లు అందించాలంటే రోజుకు కనీసం 11 వేల క్యూసెక్కులు అవసరం. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా తరలించే 6 వేల క్యూసెక్కులు డెల్టాకు ఏ మూలకూ సరిపోవు. దీంతో ఈ ఖరీఫ్‌లోనే నీరందక నాట్ల దశలోనే పంటలు ఎండిపోవడంతో రైతులు రోడ్డెక్కడం తెలిసిందే. ప్రకాశం బ్యారేజీకి కృష్ణా వరద నీరు పోటెత్తుతుండటంతో గత ఐదు రోజులుగా పట్టిసీమ ఎత్తిపోతల పంపులు ఆపివేశారు. దీన్ని బట్టి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, సాగునీటిరంగ నిపుణులు చేస్తున్న వాదన నిజమేనని మరోసారి రుజువైంది.
Comments
Please login to add a commentAdd a comment