ఆల్మట్టిలోకి 72,286, నారాయణపూర్‌లోకి 68,797 క్యూసెక్కులు
ఖాళీ ప్రదేశాన్ని భర్తీ చేసుకుంటూ వరద దిగువకు విడుదల
సాక్షి, అమరావతి/రాయచూరు రూరల్: పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రధాన పాయలో వరద నిలకడగా కొనసాగుతోంది. గురువారం కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్‌లోకి 72,286 క్యూసెక్కులు చేరుతోంది. దీంతో 14 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 65,580 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 68,797 క్యూసెక్కులు చేరుతుండగా.. దిగువకు 46,329 క్యూసెక్కులు వదులుతున్నారు.
ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుండటంతో జూరాల ప్రాజెక్టులో తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ 25,174 క్యూసెక్కులు దిగువకు వదులుతోంది. ఈ జలాలు శుక్రవారానికి శ్రీశైలానికి చేరుకోనున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ కేంద్రంలో తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తి కొనసాగిస్తోంది. ఇందుకోసం 7,064 క్యూసెక్కులను దిగువకు తరలిస్తుండటంతో శ్రీశైలంలో నీటి నిల్వ 32.37 టీఎంసీలకు తగ్గిపోయింది.
శ్రీశైలం నుంచి తరలిస్తున్న జలాలతో నాగార్జున సాగర్‌లోకి 23,851 క్యూసెక్కులు వస్తున్నాయి. దీంతో సాగర్‌లో నీటి నిల్వ 123.34 టీఎంసీలకు చేరుకుంది. ఇక కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర బేసిన్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద ఉద్ధృతి పెరిగి తుంగభద్ర డ్యామ్‌లోకి 82,491 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఇక్కడ నీటి నిల్వ 46.80 టీఎంసీలకు చేరుకుంది. శుక్రవారం తుంగభద్ర డ్యామ్‌లోకి లక్ష క్యూసెక్కులకు పైగా ప్రవాహం వస్తుందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది.
గోదావరిలో పెరుగుతూ..
పోలవరం వద్దకు 2.30 లక్షల క్యూసెక్కుల వరద
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం: పరీవాహక ప్రాంతం (బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. గురువారం పోలవరం ప్రాజెక్టులోకి 2.30 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా వచ్చిన జలాలను వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 2,31,161 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 8.3 అడుగులకు చేరుకుంది.
గోదావరి డెల్టా కాలువలకు 7,200 క్యూసెక్కులు వదులుతూ మిగతా 2,23,961 క్యూసెక్కులను బ్యారేజ్ 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం శుక్రవారం మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన భద్రాచలంలో నీటిమట్టం గురువారం సాయంత్రం 18.20 అడుగులకు చేరింది.
పాపికొండల విహార యాత్రకు బ్రేక్
బుట్టాయగూడెం: పాపికొండల విహార యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటం, తుఫాన్ హెచ్చరికలు, గోదావరి నదికి వరద తాకిడి పెరగడం వల్ల యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని విహార యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్టు పర్యాటక శాఖ అధికారులు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టు ఎగువన గోదావరి ప్రవాహం భారీగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద గురువారం సాయంత్రానికి 22 అడుగుల వరకు పెరిగినట్టు అధికారులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment