సాక్షి, అమరావతి: పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో కృష్ణానదిలో వరద ప్రవాహం తగ్గింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 82,055 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటిమట్టం 846.7 అడుగులకు పెరిగింది. నీటినిల్వ 73.23 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగులు. పూర్తినిల్వ 215.81 టీఎంసీలు. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 142 టీఎంసీలు అవసరం. కృష్ణా ప్రధానపాయపై ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు ఇప్పటికే నిండుకుండలుగా మారిన నేపథ్యంలో.. ఇకపై కురిసే వర్షాల వల్ల ఆ డ్యామ్‌లలోకి వచ్చే ప్రవాహాన్ని దిగువకు విడుదల చేయాల్సిందే. ఈ నేపథ్యంలో శ్రీశైలంతోపాటు, నాగార్జునసాగర్ కూడా ఆగస్టులో నిండుతాయని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.
పులిచింతల ప్రాజెక్టులోకి మూసీ నుంచి 11,755 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 32 టీఎంసీలకు చేరింది. ఈ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 13 టీఎంసీలు అవసరం. మున్నేరు, కట్టలేరు, బుడమేరు తదితర వాగులు, వంకల్లో ప్రవాహం తగ్గడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరుతున్న వరద తగ్గింది. ప్రకాశం బ్యారేజ్‌లోకి 48,696 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో గేట్లద్వారా అధికారులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ నీటి సంవత్సరంలో అంటే జూన్ 1 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ప్రకాశం బ్యారేజ్ నుంచి 46.715 టీఎంసీల కృష్ణా మిగులు జలాలు కడలిలో కలిశాయి.
ఇవన్నీ మున్నేరు, కట్టలేరు వరద జలాలే కావడం గమనార్హం. ఇక పశ్చిమ కనుమల్లో వర్షపాత విరామం ఏర్పడటంతో.. కృష్ణా ప్రధానపాయలో ఎగువన వరద మరింత తగ్గింది. ఆల్మట్టిలోకి 1.16 లక్షలు, నారాయణపూర్‌లోకి 60 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో గేట్లను మూసేశారు. ఆ రెండు డ్యామ్‌లలో విద్యుత్‌ను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తూ దిగువకు 55 వేల క్యూసెక్కులను వదిలేస్తున్నారు.
జూరాలలోకి వరద ప్రవాహం 63,563 క్యూసెక్కులకు తగ్గడంతో గేట్లను మూసేసి.. విద్యుదుత్పత్తి చేస్తూ 41,252 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం శ్రీశైలంలోకి వచ్చే ప్రవాహం మరింతగా తగ్గనుంది. ఇక కృష్ణా ప్రధాన ఉపనది అయిన తుంగభద్రలోను వరద తగ్గింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 42,376 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 72.36 టీఎంసీలకు చేరుకుంది. ఈ డ్యామ్ నిండాలంటే ఇంకా 33 టీఎంసీలు అవసరం.
Comments
Please login to add a commentAdd a comment