మళ్లీ పోటెత్తుతున్న కృష్ణా, గోదావరి వరదలు | Godavari River Water is in the High level with the sub-rivers | Sakshi
Sakshi News home page

మళ్లీ పోటెత్తుతున్న కృష్ణా, గోదావరి వరదలు

Published Mon, Sep 9 2019 4:26 AM | Last Updated on Mon, Sep 9 2019 3:14 PM

Godavari River Water is in the High level with the sub-rivers - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్‌: ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో రాష్ట్రంలో నదులన్నీ మళ్లీ ఉగ్రరూపం దాల్చాయి. ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు ఉప్పొంగడంతో గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం సోమవారం ఉదయం 50.1 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద 11.10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరింది. ప్రవాహానికి కాఫర్‌ డ్యామ్‌ అడ్డంకిగా మారడంతో నీటి మట్టం 28.12 మీటర్లకు చేరింది. దాంతో వరద దేవీపట్నం మండలాన్ని చుట్టుముట్టింది.

ఇక ప్రకాశం బ్యారేజీ నుంచి 30,463 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. దీంతో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నేడు (సోమవారం) ధవళేశ్వరం బ్యారేజీలోకి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక విభాగాలతో సహాయక చర్యలు చేపట్టింది. 

కృష్ణమ్మ పరవళ్లు..
కృష్ణాలో వరద ప్రవాహం మరింతగా పెరిగింది. ఆల్మట్టి నుంచి రెండు లక్షలు, నారాయణపూర్‌ నుంచి 2.18 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు.  జూరాల ప్రాజెక్టులోకి 1.73 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.72 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయంలోకి 99 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.15 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. 

తుంగభద్ర నది నుంచి సుంకేశుల బ్యారేజీలోకి 97,945 క్యూసెక్కులు వస్తుండగా.. 95,128 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2.98 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 98 వేల క్యూసెక్కులు కిందకి విడుదల చేస్తున్నారు.  పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతల, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నాగార్జునసాగర్‌కు నీరు చేరుతోంది.

నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాలువ గేట్లు ఎత్తి  49 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 30,896 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టు నుంచి 37,142 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం వరకూ పులిచింతల ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వ 45.77 టీఎంసీలను నిల్వ చేశారు. అయితే ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులో కొంత ఖాళీ చేసి 45.62 టీఎంసీలు నిల్వ ఉంచి.. పైనుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. 

ప్రకాశం బ్యారేజీలోకి 37,654 క్యూసెక్కులు చేరుతుండటంతో 16 వేల క్యూసెక్కులను డెల్టాకు విడుదల చేసి.. మిగిలిన 12 వేల క్యూసెక్కులను పది గేట్లు తెరిచి దిగువకు విడుదల చేశారు. ఆదివారం రాత్రికి ప్రకాశం బ్యారేజీలోకి 50 వేల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉండటంతో.. అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న నదీ తీర ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.

ఉప్పొంగుతున్న వంశధార, నాగావళి
ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు వంశధార  నది పోటెత్తింది. గొట్టా బ్యారేజీలోకి 50,981 క్యూసెక్కులు చేరుతుండగా.. 55,148 క్యూసెక్కులను 22 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదులుతున్నారు. నాగావళి పరవళ్లు తొక్కుతుండటంతో తోటపల్లి బ్యారేజీ నుంచి ఐదు వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. గత నెల రోజులుగా తోటపల్లి బ్యారేజీ గేట్లు ఎత్తి ఉంచడం విశేషం.

జల దిగ్బంధంలో లంక గ్రామాలు..
గోదావరి ఉధృతిలో తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 82 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద గోదావరి దేవీపట్నం మండలంలోని 36 గ్రామాలను ముంచెత్తింది. వరద కారణంగా విలీన మండలాల్లోని 30 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కడలి వైపు పరుగులు తీస్తున్న గోదావరి కోనసీమ లంక గ్రామాలను కూడా ముంచెత్తుతోంది. గోదావరి పాయలైన గౌతమి, వైనతేయ, వశిష్ట పొంగి ప్రవహిస్తున్నాయి. 

దీంతో కోనసీమలోని 16 లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కోటిపల్లి మధ్య గౌతమీ గోదావరిలో వరద ఉధృతి మరీ ఎక్కువగా ఉండడంతో ఆ నదీపాయపై జరుగుతున్న రైల్వే వంతెన నిర్మాణ పనులు నిలిపివేశారు. వరద ఉధృతికి పోలవరం శివారు పాత పోలవరం వద్ద నెక్లెస్‌బండ్‌ కోతకు గురై నదిలోకి జారిపోతోంది. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని వేలేరుపాడు మండలంలో ఆదివారం సాయంత్రానికి 36 గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ముంపు గ్రామాల నుంచి ప్రజలను, పశువులను సురక్షిత ప్రాంతా లకు తరలిస్తున్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement