ప్రస్తుతం డ్యామ్ ఎత్తు 519 మీటర్లు
మరో ఐదు మీటర్ల పెంపునకు సిద్ధం
కర్ణాటక సీఎం సిద్దరామయ్య వెల్లడి
రూ.లక్ష కోట్లతో భారీ విస్తరణ ప్రణాళిక
రాయచూరు రూరల్: కర్ణాటకలోని విజయపుర (బీజాపుర) జిల్లాలో కృష్ణా నదిపై ఉన్న భారీ జలాశయం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్వయంగా ప్రకటించారు. ఆల్మట్టి డ్యామ్ ప్రస్తుత ఎత్తు 519 మీటర్లు కాగా, దానిని 524.256 మీటర్ల ఎత్తుకు పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఇందుకోసం రూ.లక్ష కోట్లతో భారీ విస్తరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈ విషయమై సోమవారం బెళగావిలో రైతు సంఘాల నాయకులు, ఉత్తర కర్ణాటక ప్రజాప్రతినిధులతో సీఎం సిద్దరామయ్య సమావేశమై ప్రత్యేకంగా చర్చించారు.
కాగా, అప్పర్ కృష్ణా మూడో దశ పథకం కింద, బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు లోబడి ఆల్మట్టి ఎత్తు పెంపు ఉంటుందని అధికారులు చెప్పడం గమనార్హం. డ్యామ్ ఎత్తు పెంపు వల్ల తమకు దక్కే 173 టీఎంసీల కృష్ణా జలాల్లో 130 టీఎంసీల వాడకానికి వెసులుబాటు లభిస్తుందని తెలిపారు.
13.10లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల లభించే ఆ నీటిలో కలబుర్గి, రాయచూరు, కొప్పళ్, విజయపుర, యాదగిరి, బాగల్‌కోట, గదగ్ జిల్లాల్లోని 13.10 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. అలాగే డ్యామ్ ఎత్తు పెంపు వల్ల నీటి మట్టం పెరిగి పెద్ద సంఖ్యలో గ్రామాలు నీట మునుగుతాయి. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ కింద పరిహారానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment