సాక్షి, హైదరాబాద్: ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు నీటి ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా ఆల్మట్టికి 1.42లక్షల క్యూసెక్కుల మేర వరద వస్తోంది. మంగళవారం ఉదయానికి 98.67 టీఎంసీల నిల్వలు ఉండగా సాయంత్రానికి 105 టీఎంసీలకు చేరింది. దీంతో దిగువ నారాయణపూర్‌కి 33 వేల క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలలో కురుస్తున్న భారీ వర్షాలతో గడిచిన ఐదు రోజులుగా ఆల్మట్టికి లక్ష క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. దీని కారణంగా కేవలం ఈ ఐదు రోజుల్లోనే 66 టీఎంసీల నీరు ఆల్మట్టికి చేరింది.
మంగళవారం సైతం 1.42లక్షల క్యూసెక్కుల వరద రావటంతో ప్రాజెక్టులో 105 టీఎంసీలకు చేరింది. మరో 15 టీఎంసీలు వస్తే అన్ని గేట్లు ఎత్తేసే అవకాశం ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే దిగువ నారాయణపూర్‌కు పంప్‌హౌజ్ ద్వారా 33వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నారాయణపూర్‌లో ప్రస్తుతం 37.64 టీఎంసీల మట్టానికి గానూ 32.95 టీఎంసీల నీరుంది. అయితే మరింత వరద వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో పూర్తిగా నిండకుండానే గేట్లను బుధవారం రాత్రికి లేక, గురువారం ఉదయం ఎత్తే అవకాశాలున్నాయి. అదే జరిగితే దిగువ జూరాలకు ఒకట్రెండు రోజుల్లో నీటి రాక మొదలవుతుంది. ప్రస్తుతం ఇక తుంగభద్ర ప్రాజెక్టులో 100 టీఎంసీలకు గానూ 31.27 టీఎంసీల నీరు ఉంది.
రేపోమాపో దిగువకు కృష్ణమ్మ
Published Tue, Jul 25 2017 7:23 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 PM
Advertisement