![The flood water level of Krishna river is increasing - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/25/SRISHELAM.jpg.webp?itok=_FOkiVQU)
సాక్షి, అమరావతి/హొళగుంద(కర్నూలు)/శ్రీశైలం ప్రాజెక్ట్: పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో ఎగువన వరద ఉద్ధృతి పెరుగుతోంది. సోమవారం ఆల్మట్టి డ్యామ్‌లోకి 1,14,445 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 64.41 టీఎంసీలకు చేరుకుంది. దాంతో ఆల్మట్టి డ్యామ్ సగం నిండినట్లయింది. మరో 65 టీఎంసీలు చేరితే డ్యామ్ పూర్తిగా నిండిపోతుంది. మహారాష్ట్ర, కర్ణాటకలో సోమవారం విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఆల్మట్టిలోకి మంగళవారం వరద ఉద్ధృతి మరింత పెరగనుంది.
ప్రస్తుతం ఆల్మట్టిలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న జలాలకు.. స్థానికంగా కురిసిన వర్షాలు తోడవుతుండటంతో నారాయణపూర్ డ్యామ్‌లోకి 13,675 క్యూసెక్కులు చేరుతున్నాయి. దాంతో ఆడ్యామ్‌లో నీటి నిల్వ 19.09 టీఎంసీలకు చేరుకుంది. డ్యామ్ నిండాలంటే ఇంకా 18 టీఎంసీలు అవసరం. ఇక జూరాల ప్రాజెక్టులోకి 26,244 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో విద్యుదుత్పత్తి చేస్తూ 33,235 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం డ్యామ్‌లోకి సోమవారం సాయంత్రం 6 గంటలకు 4,045 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 35.47 టీఎంసీలకు చేరుకుంది.
మూసీ ప్రవాహంతో నాగార్జునసాగర్‌కు దిగువన వరద స్థిరంగా కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టులోకి 8,532 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 18.73 టీఎంసీలకు చేరుకుంది. మున్నేరు, వాగులు, వంకల నుంచి ప్రకాశం బ్యారేజ్‌లోకి 10,917 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 7,785 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 3,132 క్యూసెక్కులను అధికారులు సముద్రంలోకి వదిలేస్తున్నారు.
తుంగభద్ర డ్యాంకు భారీగా వరద
కృష్ణా నది ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ప్రవాహం జోరందుకుంది. తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వ 30 టీఎంసీలను దాటింది. సోమవారం ఉదయం 64,023 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. నీటి చేరిక ఇలాగే ఉంటే నెలాఖరు నాటికి డ్యాం నిండి ఎల్‌ఎల్‌సీ కింద వరి సాగుకు అవకాశం కలుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
శివమొగ్గ, ఆగుంబే, వరనాడు, తీర్థనహళ్లి తదితర డ్యాంల ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో వరద నీరు చేరికపై వారు నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం దిగువ కాలువకు తాగునీటి అవసరాలకు బోర్డు అధికారులు ఈ నెల 28 తర్వాత నీటిని విడుదల చేయనున్నారు. తుంగభద్ర డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా సోమవారం ఉదయం 1,602.84 అడుగులకు చేరుకుంది. అలాగే పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30 టీఎంసీల నిల్వ ఉంది.
24ఏఎల్‌ఆర్129: తుంగభద్ర రిజర్వాయర్‌లోకి చేరిన వరద నీరు
24ఎస్‌ఆర్‌ఐ 30ఏ – 812 అడుగులు వద్ద శ్రీశైలం డ్యాం నీటిమట్టం
Comments
Please login to add a commentAdd a comment